[box type=’note’ fontsize=’16’] ప్రకృతి కథలలో భాగంగా కప్పల గురించి, కప్పల జీవిత చక్రం గురించి, అంతరించిపోతున్న కప్పల జాతుల గురించి, మానవాళికి అవి చేసే మేలు గురించి విజ్ఞానం కలబోసి బాలలకు కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]
వానా కాలం వచ్చింది. గత వారంగా ఊరంతా వాన జల్లులతో తడిసి ముద్దవుతున్నది.
ఎప్పటిలా ఉదయాన్నే లేచి తయారై అమ్మమ్మ అంబికతో తోటలోకి వెళ్లిన పరి, ఆర్యన్ మొక్కల్లో తిరుగుతూ పూజకి పూలు కోస్తున్నారు.
ఇంతలో పరి “అమ్మమ్మా! త్వరగా రా! కప్పలు! కప్పలు!” అని పిలిచింది.
“అబ్బబ్బా! ఏమి పట్నం పిల్లలో? కప్పల్ని చూసి అదురుకుంటున్నారు” అనుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చింది.
“ఎక్కడ?”
“ఇదిగో! ఇక్కడ!”
మల్లె చెట్టు మొదట్లో ఉన్న గుంటలో కొన్ని చిన్న పెద్ద కప్పలు తిరుగుతూ కనిపించాయి.
“అవునే! ఎన్ని కప్పలో!” అని అంబికా ఆశ్చర్యంగా మొహంపెట్టింది.
“ఇన్ని కప్పలు ఎప్పుడూ చూడలేదు” అన్నాడు ఆర్యన్.
“అమ్మమ్మా! కప్పలు కరుస్తాయా? నేను చూడకుండా వాటి దగ్గరగా వెళ్ళాను” అంది పరి.
“లేదు. అవి మనని ఏమి చెయ్యవు. కానీ మనుషులమే వాటిని హింసిస్తాము.”
“అమ్మమ్మా కప్ప వల్ల మనకే లాభం?” అన్నాడు ఆర్యన్
“చాలా లాభం. అరే! వాన మొదలయ్యింది. లోపలికి పదండి. పూజ చేసుకున్నాక కప్ప గురించి చెబుతాను” అని పిల్లల్ని లోపలికి తీసుకెళ్లింది. కొద్దిసేపటి తరువాత వరండాలో ఉయ్యాల బల్ల ఊగుతున్న ఆర్యన్, పరి దగ్గరకు వచ్చింది. కప్ప కబుర్లు వినటానికి సిద్ధమయ్యారు.
“కప్పలు మనకంటే ముందుగా పుట్టాయి.”
“అమ్మమ్మా! ఆ కప్పలు చాలా ఓల్డ్ ముసలివా?” అంది పరి అమాయకంగా
“కాదు రా! బంగారు! కప్ప జాతి మనుషులకంటే ముందు పుట్టింది. వేల సంవత్సరాలనుండి ఉన్నాయి. ఆర్యన్! నీకు కప్ప జీవిత చక్రం అంటే లైఫ్ సైకిల్ తెలుసా?”
“తెలుసు అమ్మమ్మా. ఎగ్, లార్వా, చిరుకప్ప, కప్ప” అన్నాడు ఆర్యన్.
“కప్పలు మురికి, నిల్వ ఉన్న నీటిలోని క్రిమి కీటకాలను తిని బ్రతుకుతాయి”
“అయితే?”
“అయితే! మురుగు నీళ్లలో పెట్టిన దోమ గుడ్లను తిని మనకు మలేరియా, డెంగ్యూ, నైల్ వైరస్ లాంటి రోగాలు రాకుండా చేస్తాయి.”
“అవునా?”
“అంతేకాదు చిరుకప్పలు పాచిపట్టిన మనం తాగే నీటి వనరుల్ని రోగాలు రాకుండా ఉండేలా పాచిని తిని శుభ్రంగా ఉంచుతాయి. కప్పల జీవిత చక్రంలో అన్ని దశలలో అవి కూడా ఇతర జీవులకు ఆహారంగా పనికివస్తాయి.”
“ఎలా? ఎవరికి?” అన్నది పరి
“నీటిలో ఉండే చేపలు, పాములు, ఇంకా పక్షులు, తూనీగలు, కోతులు లాంటి వాటికి ఆహారంగా ఉన్నాయి.”
“ఇంకా?”
“ఊఁ! ఇంకా? ఆఁ! కప్పలని వైద్యరంగంలో పరిశోధనలకు ఉపయోగిస్తారు. అంతేకాదు కప్ప మనుషుల ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యానికి సూచిక. ఇండెక్స్. కప్పలు లేవంటే మనకి నీటి కాలుష్యం వల్ల కలిగే అనేక రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ. కప్పలని ఆహారంగా తినే ప్రాణులకి తిండి దొరకదు. అందువల్ల ఆ జీవుల ప్రాణాలకు ముప్పు.”
“పాపం!” అంది పరి గడ్డం క్రింద చేతులుంచుకుని.
“పిల్లలు మీకు తెలుసా? 1980 నాటికి ప్రపంచంలో దాదాపు 200 రకాల కప్పలు అంతరించిపోయాయి. అంటే పూర్తిగా చనిపోయాయి. ఈ 35 సంవత్సరాలలో ఇంకా కొన్ని చనిపోయుండచ్చు.”
“అన్నివందల రకాలా? ఎలా చనిపోయాయి? ఎవరు చంపారు?” అన్నాడు ఆర్యన్.
“మనమే!”
“మనమా? ఎలా? ఎందుకు?”
“మనమే. మనం చేసే పనుల వల్ల అడవులు తగ్గాయి. దాని వల్ల వానలు తగ్గాయి. అందువల్ల నీటి నిల్వలు తగ్గి కప్పలు ఉండే అవకాశం తగ్గింది.”
“కప్పలకు నీళ్లు అవసరమా?”
“అవసరం. కప్పలు నీటిలో, నేల మీదా ఉండగలవు. అవి నీటిని, తడిని వెతుక్కుని బ్రతుకుతాయి. ఎండలు వాటికి శత్రువు. నీళ్లు నిల్వ లేకపోతే, తగ్గితే గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచలేవు. అవి లేకపోతే నేను చెప్పినట్లు అనర్ధాలే.”
“కప్పలు నీళ్లు ఉంటే బతికేస్తాయా?”
“ఒకప్పుడు అలా ఉండేది. ఇప్పుడు మన నీటి వనరులన్నీ అంటే నదులు, చెరువులు, కుంటలు అన్ని రసాయనాలతో పాడైపోయాయి. అందువల్ల నీటిని శుభ్రపరిచే చిరుకప్ప బ్రతకలేకపోతున్నది. మరి అది లేదంటే కప్ప లేనట్లే. మీకు తెలుసా? ఫిజియోలజీ, మెడిసిన్ లో దాదాపు 10% నోబుల్ బహుమతి గ్రహీతలు కప్పలపై ప్రయోగాలు చేసారుట. ఆరోగ్యమైన కప్ప ఆరోగ్యమైన పర్యావరణానికి చిహ్నంట. అలాంటి ముఖ్యమైన కప్పని మన పర్యావరణ తప్పుల వల్ల చంపేస్తున్నాము.”
“అంటే మనం చెడ్డవాళ్లమా అమ్మమ్మా?” అంది పరి.
“కాదమ్మా!స్వార్ధపరులం. మనం బాగుంటే చాలానే గుణం మనది. అందుకోసం మనకి మంచి చేసిన చంపెయ్యగలం. ప్రకృతిలో ఉన్న అన్నింటిని చంపగలిగిన శక్తి, బుద్ధి ఉన్నది మనిషికే” అంది అమ్మమ్మ బాధగా.
“అమ్మమ్మా! కప్పలని కాపాడలేమా?”
“తప్పకుండా! అందరం కలిసి ఒక బృందంగా క్లబ్‌లా ఏర్పడి ‘సేవ్ ఫ్రాగ్’ అని కప్ప చేసే మంచి మనం చేసే తప్పులు చెప్పి నీటిలో రసాయనాలను తగ్గిస్తే కప్ప ఇంకొన్ని తరాలు బ్రతుకుతుంది.”
“అవునా?”
“అమ్మమ్మా! మేము ఊరు వెళ్ళాక ఒక నేచర్ క్లబ్ పెట్టి చాలామందిని చేర్చుకుని అందరికి చెబుతాము” అన్నారు పిల్లలు.
“గుడ్ ఐడియా! కావాలంటే ఈసారి నేను వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్‌కి ఇంకా ఏమి చేయాలో చెబుతా” అంది అమ్మమ్మ అంబికా ఉత్సహంగా.