కరనాగభూతం కథలు – 11 పసిడి వెలుగులు

0
2

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడికోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! మనిషి సుఖసంతోషాలకి భోగభాగ్యాలు చాలవు. మనసుకి ఉల్లాసం కలిగించే లలితకళలూ అవసరం. అందుకు ఉత్తమ కళాకారుల్ని సన్మానాలతో ప్రోత్సహించాలి. ఐతే అదంత సులభం కాదు. ఈ విషయంలో చిత్కళుడనే రాజు అనుభవం తెలుసుకోతగ్గది. ఇప్పుడు నీకా కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.

ఉత్కళదేశానికి కొత్తగా రాజైన చిత్కళుడికి విలాసాలంటే చిరాకు. లలితకళలు విలాసాల్ని ప్రోత్సహించి, పౌరుల్లో సోమరితనాన్ని పెంచుతాయని అతడి ఉద్దేశం. ముందు వాటిని నిషేధించాలని అనుకున్నాడు. కానీ అప్పటికే దేశంలో ఎందరో కళాకారులున్నారు. కొలువులో ఆస్థాన విద్వాంసులు, కళాకారులు ఉన్నారు. అంతవరకూ ఎంతో గౌరవమర్యాదలు పొందుతున్న వారిని పొమ్మనడం సబబు కాదు. నోటితో చెప్పలేనిది చేత్తో చెప్పాలనుకుని అతడొక కొత్త శాసనం చేశాడు.

ఆ ప్రకారం రాజ్యంలోని పౌరులందరూ పేదా, గొప్పా తేడా లేకుండా – మొక్కలు నాటడం, కాలువలు తవ్వడం, రాచబాటలు నిర్మించడం, ఉన్న సదుపాయాల్ని మెరుగుపర్చడం – వగైరాలకు రోజుకో గంట శ్రమదానం చెయ్యాలి. రాజు కూడా అందుకు మినహాయింపు కాదు.

చిత్కళుడు రోజూ ఏదో సమయంలో రాజధానీనగరం మధ్యలోని ఉద్యానవనాల్లో తోటపని చేస్తూనో, ఇరుకుబాటలపై రాళ్లేరుతూనో, మురుగుకాల్వలు శుభ్రం చేస్తూనో – కాసేపు పౌరులకు కనిపించేవాడు. దాంతో అతడి శాసనం అక్షరాలా అమలయింది. దాంతో పౌరుల ఆరోగ్యం మెరుగైంది. దేశం పాడిపంటలతో సుభిక్షమై, సిరిసంపదలతో వైభవోపేతమై, చతురంగబలాలతో శత్రుదుర్భేధ్యమైంది.

తమ పనులకి శ్రమదానం కూడా తోడయ్యేసరికి పౌరులకి లలితకళల్ని ఆస్వాదించే తీరుబడేదీ! రాచకొలువుతో సహా దేశంలో ఎక్కడా కళాకారుల్ని పట్టించుకోవడం లేదు. వారు ఒకొక్కరుగా దేశం వదిలి. ఇతర ప్రాంతాలకు వలసపోయారు. చిత్కళుడి కోరిక నెరవేరింది.

మూడేళ్లలోనే ఎంతో ప్రగతిని సాధించినా చిత్కళుడికింకా తృప్తి కలగలేదు. ఒకరోజు తన మంత్రుల్ని సమావేశపర్చి, దేశపరిస్థితి ఇంకా మెరుగుపడ్డానికి మంచి సూచనలు చెప్పమన్నాడు. అప్పుడు వారిలో వృద్ధమంత్రి, “ప్రభూ! ప్రజాపాలనకు ఎన్నో విభిన్న సిద్ధాంతాలు ఉన్నాయి. అన్నింట్లోనూ కొంత మంచి, కొంత చెడు ఉంటుంది. మీరనుసరిస్తున్న సిద్ధాంతంలో మంచిచెడ్డల్ని మీరే తెలుసుకోవాలని నా సూచన. ఎందుకంటే దేశమిప్పుడు పూర్వంకంటే సంపన్నమైనా పౌరుల్లో మునుపటి ఉత్సాహం లేదు. కొలువులో ఉన్నవారి పరిస్థితీ అదే. చివరికి, మీలో కూడా మునుపటి హుషారు లేదు” అన్నాడు.

ఇలాంటి సూచన ఊహించని చిత్కళుడు ఖంగు తిన్నాడు. కానీ ఆలోచించగా అతడికి వృద్ధమంత్రి మాటల్లో నిజముందనిపించి, “కొత్త శాసనంలో మంచి నాకు స్పష్టంగా తెలుస్తోంది. చెడేమిటో, మీకు తెలిస్తే చెప్పండి” అన్నాడు.

మంత్రి వెంటనే, “నాకూ తెలియదు. కానీ ఒకప్పుడు విదేహ దేశానికి ఇలాంటి సమస్యే వస్తే లలితాదిత్యమహర్షి పరిష్కారం చెప్పినట్లు విన్నాను. ఆయన ఆశ్రమం ఈశ్వరారణ్యంలో ఉంది” అన్నాడు.

చిత్కళుడు వెంటనే తగిన పరివారంతో బయల్దేరి ఈశ్వరారణ్యానికి వెళ్లి లలితాదిత్యుణ్ణి కలుసుకున్నాడు. ఆయన చిత్కళుడి సమస్య విని, “మనిషికి డబ్బు, ఆరోగ్యంతోపాటు మనసుకి ఉల్లాసం కలిగించే లలితకళలూ కావాలి. ఒకప్పుడు విదేహదేశంలో లలితకళలకు ఆదరణ లేక కళాకారులంతా దేశం విడిచి వెళ్లిపోతే, ఆ దేశం నీరసించి పోయింది” అంటూ ఆ వివరాలు చెప్పాడు.

విదేహరాజు తనవద్దకు రాగానే ఆయన అతడికి, “పౌరులు తప్పనిసరిగా వారానికొక్కసారైనా కళాస్వాదన చెయ్యాలని కొత్త శాసనం చెయ్యి. తరచుగా కళాకారుల్లో విశిష్టుల్ని గుర్తించి సన్మానించు. అందుకుగానూ నేను నీకొక స్వర్ణాసనాన్నిస్తాను. సన్మానితుల్ని దానిపై కూర్చోబెట్టి ఊరేగించు. అందువల్ల కళాకారుల్లో ఉత్సాహం పెరిగి, వారి ప్రదర్శనలు మరింత ప్రతిభావంతమై, పౌరుల్లో ఉత్సాహం నింపుతాయి” అన్నాడు. అప్పుడు విదేహరాజు – కళాకారుల్లో విశిష్టుల్ని గుర్తించే సామర్థ్యం తనకూ, తన కొలువులోనివారికీ లేదని వాపోయాడు. లలితాదిత్యుడు రాజుకి వివిధ లలితకళల్లో నిష్ణాతులైన ఐదుగురు ఆశ్రమవాసుల్ని రాజుతో పంపాడు.

ఈ వివరాలు చెప్పి, “అలా విదేహదేశం సమస్య తీరింది. నీ సమస్యకూ అదే పరిష్కారం. అదృష్టవశాత్తూ నీకివ్వడానికి నావద్ద మరో స్వర్ణాసనముంది” అంటూ బంగారు ఛాయతో తళతళలాడుతున్న ఓ ఆసనాన్ని చిత్కళుడికి చూపించాడు.

చిత్కళుడా ఆసనం తీసుకుని తిరుగుప్రయాణమయ్యాడు. ఐతే కళాకారుల్లో విశిష్టుల్ని గుర్తించడానికి లలితాదిత్యుడి సహాయం అవసరమని అతడికి తోచలేదు. అడగలేదు కదా అని మహర్షి కూడా ఊరుకున్నాడు.

చిత్కళుడు రాజ్యం చేరుకున్నాక మహర్షి చెప్పినట్లే కొత్త శాసనం చేశాడు. దాంతో దేశదేశాలనుంచి కళాకారులు ఉత్కళకు వచ్చి తమ ప్రదర్శనలతో జనాల్ని మెప్పించసాగారు. క్రమంగా అటు పౌరుల్లోనూ, ఇటు రాజులోనూ కూడా నూతనోత్సాహం పుట్టింది.

ఇక విశిష్ట కళాకారుల్ని సన్మానించాల్సి ఉంది. చిత్కళుడందుకు రాణిని సంప్రదించాడు. దానికామె, “కళాకారుల విశిష్టతను గుర్తించడం కష్టమేం కాదు. నా ఇష్టసఖి కుముద ఉందికదా – అంతఃపురంలో ఎవరు కూనిరాగాలు తీసినా, ఎవరి పాట బాగుందో ఇట్టే చెప్పేస్తుంది. సంగీతంలో విశిష్టుల్ని గుర్తించడానికి దాన్ని నియమిద్దాం” అంది. అలాగే శిల్పకళ, కవిత్వం, చిత్రలేఖనం, నాట్యంలో విశిష్టుల్ని నిర్ణయించడానికి- మంత్రి, సేనాధిపతి, కోశాధికారి, కొత్వాలు తమకు తెలిసినవార్ల పేర్లు సూచించారు.

చిత్కళుడికి ఎంతో సంతోషమైంది. అలా తొలి సన్మానానికి నారాయణుడనే సంగీత విద్వాంసుడు ఎంపికయ్యాడు. స్వర్ణాసనంపై ఊరేగుతుంటే, ఆయన ముఖం పసిడివెలుగుతో మెరిసిపోయింది. ఆ తర్వాత కూడా ఆ వెలుగు ఆయన ముఖానికి శాశ్వతమైంది. ఎక్కడికెళ్లినా ఆయన ముఖంలో పసిడివెలుగు చూసి, జనం ఆయన్ని రాజసన్మానం పొందినవాడుగా గుర్తించి గౌరవించేవారు.

తర్వాత విశ్వనాథుడనే శిల్పి, మహంకాళి అనే కవయిత్రి, రవికాంతుడనే చిత్రకారుడు, శిరోత్తమ అనే నాట్యకత్తె – సన్మానార్హులయ్యారు. స్వర్ణాసనంపై ఊరేగేక – వారి ముఖాలకూ పసిడి వెలుగులు శాశ్వతమయ్యాయి. జనం వారిని పసిడి వెలుగులు అని ముచ్చటగా పిలుస్తూ ఎంతగానో గౌరవించేవారు. అలా రెండేళ్లు గడిచేసరికి దేశంలో పసిడి వెలుగుల సంఖ్య పాతిక దాటింది.

ఈ సన్మానాల వల్ల చిత్కళుడికి కళాపోషకుడని ప్రఖ్యాతి వచ్చింది. తనకంత పేరు తెచ్చిపెట్టిన స్వర్ణాసనాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి చక్రుడు అనేవాణ్ణి నియోగించాడు. అప్పగించిన పని భక్తి శ్రద్ధలతో చేస్తున్న చక్రుడో విషయం గమనించాడు. సన్మానం సన్మానానికీ ఆ ఆసనం మెరుపు కొంచెం తగ్గుతోంది. సన్మానితుల సంఖ్య ఇరవై దాటేసరికి ఆ మెరుపు మరింత తగ్గింది. శుభ్రపర్చడంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మెరుపు క్రమంగా తగ్గిపోతున్నదే తప్ప పెరగడం లేదు. అప్పుడు చక్రుడా విషయం రాజుకి చెప్పాడు.

ఆసనాన్ని అప్పుడప్పుడు మాత్రమే చూస్తుండే రాజుకి మెరుపులో తేడా అంతగా తెలియక మొదట్లో పట్టించుకోలేదు. ఐతే సన్మానితుల సంఖ్య పాతిక దాటేసరికి అతడికీ మార్పు తెలిసింది. సంఖ్య ముప్పై దాటేసరికి స్వర్ణాసనం కగ్గిపోయిన ఇత్తడిలా మారిపోయింది.

అలాంటి ఆసనాన్ని ఊరేగింపుకి ఉపయోగించలేక, సన్మానాల్ని తాత్కాలికంగా వాయిదా వేశాడు రాజు. మహర్షి ఇచ్చింది స్వర్ణాసనం కాదనీ, బంగారం పూసిన ఇత్తడి ఆసనమనీ గ్రహించిన అతడు, వెంటనే ఈశ్వరారణ్యానికి వెళ్లి లలితాదిత్యుణ్ణి కలిసి, “తమరు ఆజ్ఞాపిస్తే బంగారు ఆసనాన్ని నేనే చేయించేవాణ్ణిగా! పూతపూసిన ఇత్తడి ఆసన్నాన్నిచ్చి స్వర్ణాసనమని చెప్పారెందుకు?” అన్నాడు.

లలితాదిత్యుడు నవ్వి, “అది మామూలు ఆసనం కాదు. ఎందరో ఉత్తమ కళాకారులకు ఆసనమై పొందిన తేజస్సు దానిది. తనపై కూర్చున్నవారికి తన తేజస్సునిచ్చి వారి ముఖాల్ని పసిడి వెలుగులతో నింపే దివ్యాసనమది! అందువల్ల ఆ మేరకు ఆసనం తేజస్సు తగ్గుతోంది. ఆ తేజస్సు మళ్లీ పెరగడానికి నేను నా ఆశ్రమంనుంచి నిత్యానందుడనే సంగీతవిద్వాంసుణ్ణి పంపుతాను. అతణ్ణి స్వర్ణాసనంపై కూర్చోపెట్టి ఊరేగించి సన్మానించు. నీ సమస్య పరిష్కారమౌతుంది” అన్నాడు.

చిత్కళుడు, నిత్యానందుణ్ణి వెంటబెట్టుకుని రాజ్యానికి తిరిగివెళ్లాడు. నిత్యానందుడు ఆసనంపై కూర్చోవడమేమిటి, అది తిరిగి ఎప్పటిలా తళతళ మెరిసిపోసాగింది. ఆశ్చర్యమేమంటే ఆసనంపై కూర్చున్నప్పుడు కానీ, ఆసనం దిగేక కానీ నిత్యానందుడి ముఖంలో పసిడి వెలుగులు లేవు. అతడు ఎప్పటి నిత్యానందుడిలాగే ఉన్నాడు.

ఇది జరిగేక చిత్కళుడు విశిష్టకళాకారుల్ని గుర్తించడానికి లలితాదిత్యుడి సాయం కోరాడు. ఆ తర్వాతనుంచి రాజసన్మానం పొందిన కళాకారుల ముఖాల్లో పసిడి వెలుగు కనిపించడం ఆగిపోయింది.

కొండచిలువ ఈ కథ చెప్పి, “స్వర్ణాసనాన్ని తేజస్సుతో నింపగల్గిన నిత్యానందుడు, ఆసనం నుంచి తేజస్సునెందుకు పొందలేదు? ఐనా విశిష్ట కళాకారుల ముఖాల్లో పసిడి వెలుగులు నింపే సన్మానం గొప్పది కదా! మరి చిత్కళుడా పద్ధతికి స్వస్తి చెప్పి, ఆసనానికి మాత్రమే తేజస్సునిచ్చే కొత్త పద్ధతిని ఎందుకు అనుసరించాడు? తెలిస్తే నా ఈ సందేహాలకి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “సన్మానితులు రెండు రకాలు. సన్మానం వల్ల గుర్తింపు పొంది తమ విలువ పెరిగినవారు మొదటి రకం. వారివల్ల సన్మానం విలువ క్రమంగా తగ్గిపోతుంది. తమకు గుర్తింపునిచ్చిన సన్మానానికి విలువ పెంచేవారు రెండవ రకం. వీరివల్ల సన్మానానికే తప్ప, సన్మానం వల్ల వీరికేం ప్రయోజనం లేదు. జనం కూడా వీరి ప్రతిభని మాత్రమే గుర్తించడం వల్ల, వీరికి ముఖంలో పసిడి వెలుగుల అవసరం లేదు. చిత్కళుడు ఆదిలో మొదటి రకం కళాకారుల్ని ఎన్నుకుని సన్మానితుల విలువను పెంచాడు. తర్వాత తన సన్మానం విలువ పెంచుకుందుకు – రెండవరకం కళాకారుల్ని ఎన్నుకోవాలనుకుని, అందుకు తన సామర్థ్యం చాలదని గ్రహించి, లలితాదిత్యుడి సాయం కోరాడు” అన్నాడు.

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 12వ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here