కరనాగభూతం కథలు – 12 దేవుడికి పరీక్ష

0
2

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడి కోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! కొందరు దేవుణ్ణి నమ్ముతారు. కొందరు సిద్ధాంతాల్ని నమ్ముతారు. మూర్ఖంగా నమ్మితే దేవుడూ, సిద్ధాంతాలూ ఒకటేనని ఆలోచనాపరులు అంటారు. నువ్వు నీ సిద్ధాంతాల్ని ఎలా నమ్ముతున్నావో తెలియదు కానీ, పూర్వం మురళి అనేవాడు నమ్మకానికి దేవుడికే పరీక్ష పెట్టిన కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.

జగత్పురంలో ప్రవర్ధనుడనే వ్యాపారస్థుడున్నాడు. అందరు వ్యాపారస్థులకి లాగే ఆయనకీ దైవభక్తి ఎక్కువ. తన పిల్లలు కూడా తనకి లాగే ఉండాలనుకునేవాడు. పెద్దకొడుకు రఘు విషయంలో ఆ ఆశ నెరవేరింది కానీ, చిన్నకొడుకు మురళికి మాత్రం చిన్నప్పట్నించీ కూడా దేవుడంటే భక్తి లేకపోవడం ఆయనకు బాధగా ఉండేది.

దైవభక్తి పుట్టించడానికి ప్రవర్ధనుడు మురళికి ఓసారి ప్రహ్లాదుడి కథ చెప్పి, “చూసేవా, తండ్రి హిరణ్యకశిపుడు వద్దన్నా వినకుండా రోజూ విష్ణుభజన చేశాడు ప్రహ్లాదుడు. తండ్రి అష్టకష్టాలూ పెడితే, విష్ణువతణ్ణి రక్షించాడు. చివరికి నరసింహావతారం ఎత్తి, హిరణ్యకశిపుణ్ణి చంపేశాడు” అన్నాడు. దానికి మురళి, “ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్యకశిపుడు. కొడుకు తండ్రి మాట వినాలికదా! వింటే తండ్రి అతణ్ణేం చేసేవాడు కాదు. అప్పుడతణ్ణి రక్షించడానికి విష్ణువు రావాల్సిన అవసరమే ఉండేది కాదు. ఐనా ప్రహ్లాదుడు మాత్రం అంత చిన్నతనంలో వేరే పని లేకుండా, విష్ణువుని ప్రార్థిస్తూ కూర్చుంటే ఎవరికి ప్రయోజనం? అందుకు బదులు నలుగురికీ పనికొచ్చే పని ఇంకేమైనా చెయ్యమని ఆ విష్ణువే అతడికి చెప్పొచ్చుగా! అలా చెప్పని ఆ విష్ణువుని దేవుడని ఎలా అనుకోవాలి” అన్నాడు.

ఏమనాలో తెలియక అప్పటికి ఊరుకున్నాడు ప్రవర్ధనుడు. ఆ తర్వాత ఓ మిత్రుడింట్లో లోకేశ్వరవ్రతం జరుగుతుంటే సకుటుంబంగా వెళ్లాడాయన. పూజ చేసినాయన, చివర్లో వ్రతకథ చదివాడు. ఆ ప్రకారం లోకేశ్వరుడు – వ్రతం చేసినవారికి భోగభాగ్యాలిచ్చాడు. వ్రతం చెయ్యనివార్ని కష్టాల పాలు చేశాడు. ఇంటికెళ్లేక తండ్రి మురళిని వ్రతకథ విన్నావా అనడిగాడు. దానికి మురళి, “విన్నాను. లోకేశ్వరుడు కష్టపడి పనిచేసేవాళ్లకి ఏమీ ఉపకారం చెయ్యలేదు. తనకి వ్రతం చేసినవారికే సంపదలిచ్చాడు. అలాగే ఆయనవల్ల బాధలు పడ్డవాళ్లూ చెడ్డవాళ్లు కాదు. వాళ్లు చేసిన ఒకేఒక తప్పు లోకేశ్వరవ్రతం చెయ్యకపోవడం. అలాంటి లోకేశ్వరుడివల్ల సమాజానికి ఏ ప్రయోజనమూ ఉండదు” అంటే ఖంగు తిన్నాడాయన.

ఆయన మురళి తత్వం గురించి అదేపనిగా దిగులు పడుతుంటే, “వాడికింకా చిన్నతనం. ఎదుగుతున్నకొద్దీ మారతాడు” అని చెప్పి భార్య కొంత ఊరటపర్చింది. కానీ ఇరవయ్యేళ్లొచ్చినా మురళిలో ఏ మార్పూ లేదు.

ఇది పని కాదని ఒకరోజు ప్రవర్ధనుడు మురళిని పిలిచి, “నాకు వయసు మీదపడుతోంది. ఒక్కణ్ణీ వ్యాపారాలు చూసుకోలేను. నాకిక పిల్లల సాయం కావాలి. ఐతే వ్యాపారంలో లాభనష్టాలకు – స్వయంకృషి, సామర్థ్యం, తెలివి చాలవు. అదృష్టం కూడా కలిసిరావాలి. అందుకు దేవుడి కరుణ కావాలి. తరతరాలుగా మనింట్లో అంతా దైవభక్తులు. మనం పచ్చగా ఉండడానికి అదే కారణం. కాబట్టి వ్యాపార బాధ్యతలు తీసుకునేవాళ్లకి దైవభక్తి ఉండితీరాలి. అది రఘుకుంది కానీ నీకు లేదు. ఆలోచించుకో” అని చివరి అస్త్రాన్ని ప్రయోగించాడు.

వ్యాపారంలో వాటాకోసం, కొడుకు తప్పక మారతాడని ప్రవర్ధనుడి ఆలోచన. కానీ మురళి, “ఒక విధంగా వ్యాపారమూ ప్రజాసేవే. కానీ నాకు వ్యాపారంమీద ఆసక్తిలేదు. నా పొట్ట నేను పోషించుకూంటూనే సమాజాన్ని సేవించుకునే వేరే మార్గంకోసం ఆలోచిస్తున్నాను” అని ఆయన్ని మళ్లీ ఖంగు తినిపించాడు.

తర్వాత ప్రవర్ధనుడి మిత్రుడొకడు, “మీవాడికి భక్తిపరురాలైన పిల్లతో పెళ్లి చెయ్యి. నీకోసం మారనివాడు పెళ్లాంకోసం మారొచ్చు” అంటే ప్రవర్థనుడా సలహా పాటించాడు. ఐతే మురళిలో మార్పులేదు సరికదా, పెళ్లైన ఆర్నెల్లకే వాడి భార్యలో కూడా దైవభక్తి నశించింది.

ఇలాఉండగా ఓరోజున ప్రవర్ధనుడింటికి మాతంగుడనే పండితుడు వచ్చాడు. ఆయన గొప్ప శివభక్తుడు కూడా. ప్రవర్ధనుడాయనకు మురళి గురించి తన గోడు వినిపించాడు. మాతంగుడు మురళితో ఏకాంతంలో కాసేపు మాట్లాడి పంపేశాక ప్రవర్ధనుణ్ణి పిలిచి, “నీ కొడుకు మురళి ఉత్తముడు. వాడి ఆలోచనలు ఉన్నతం. మన పురాణకథలూ, వ్రతకథలూ గొప్పవే. కానీ – ప్రాచుర్యంకోసం కొందరు వాటిని స్వార్థపరుల్నీ, మూర్ఖుల్నీ ఆకర్షించేలా మార్చేశారు. వాటికి మురళి చెప్పిన అభ్యంతరాలు న్యాయమైనవే. ఐనా కూడా నువ్వు కావాలంటే వాణ్ణి నేను మార్చగలను. కానీ వాణ్ణలాగే ఉండనిస్తేనే ప్రపంచానికి ఎక్కువ ప్రయోజనం. ఆలోచించుకో” అన్నాడు.

ఐతే మురళిలో మార్పు చూడాలన్న కోరిక ప్రవర్ధనుడిలో బలంగా ఉంది. అందువల్ల కొడుకుని మార్చమని ప్రాధేయపడితే, మాతంగుడు సరేనని ఏంచెయ్యాలో ప్రవర్ధనుడికి చెప్పాడు. ఆ ప్రకారం మర్నాడుదయమే ఆయన పెద్దగా అరిచి, ఏదో తెలియని పిచ్చి భాష మాట్లాడ్దం మొదలెట్టాడు. అప్పుడు మాతంగుడు ప్రవర్ధనుడి కుటుంబసభ్యులందర్నీ సమావేశపర్చి, “ఈయన్ని జడభూతం ఆవహించింది. అది మాట్లాడే జడభాష నాకొక్కడికే అర్థమౌతుంది. అది ఉన్నంతకాలం శరీరానికి చెప్పలేనంత బాధ. దీన్ని వదిలించాలంటే మీలో ఈయన్ని ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించినవారు ముందుకొస్తే, నేనొక మందార పుష్పాన్నిస్తాను. వారా పుష్పాన్ని ఒడిలో ఉంచుకుని రోజంతా పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ కటిక ఉపవాసం చెయ్యాలి. రాత్రికి ఊళ్లోని రామలింగేశ్వరుడి గుడికెళ్లి, స్వామిని దర్శించి ఆ మందార పుష్పాన్ని స్వామికి చూపించి తెచ్చి ప్రవర్ధనుడికి చూపాలి. అప్పుడు జడభూతం ఆయన్ని వదిలివెళ్లిపోతుంది. ఎటొచ్చీ స్వామి దర్శనం అయ్యేవరకూ ఉపవాసభంగం చెయ్యకూడదు” అని చెప్పాడు.

రోజంతా కటిక ఉపవాసం అనగానే అక్కడున్నవాళ్లంతా మొహమొహాలు చూసుకుంటూ ఉండిపోయారు. మురళి ఒక్కడే ముందుకొచ్చి మాతంగుడిచ్చిన మందారపుష్పం తీసుకున్నాడు. రోజంతా కటిక ఉపవాసముండి, పంచాక్షరీమంత్ర జపం చేసి గుడికి వెళ్లాడు.

ఆ ఊరి రామలింగేశ్వరుడు జగత్ప్రసిధ్ధి చెందిన దేవుడు. ఆయన దర్శనానికి ప్రపంచం నలుమూలలనుంచీ వచ్చిన భక్తులు వరుసలు కట్టి నిలబడతారు. మధ్యమధ్య జరిగే నిత్యార్చన సమయాన్ని మినహాయించి, మిగతా సమయమంతా భక్తుల దర్శనం కోసం గుడిని తెరిచే ఉంచుతారు. ఐనా ఒకోసారి స్వామి దర్శనానికి రోజంతా ఎదురు చూడాలి.

ఆ రోజు మురళి వెళ్లేసరికి గుడివద్ద రద్దీ చాలా ఎక్కువగా ఉంది. రాత్రంతా నిద్ర లేకుండా వరుసలో నిలబడి ఉన్నా దైవదర్శనం కాలేదు. ఐతే మురళిలో ఆకలి, నిద్రల గురించిన బాధ లేదు. తండ్రికి శరీరబాధనుంచి విముక్తి కలిగించడానికి ఆలస్యమౌతున్నదే అనే వాడి బాధ. మర్నాడుదయం ఇక దర్శనం కాసేపటిలో కానున్నదనగా, దైవదర్శనానికి రాజు కొలువులో పనిచేసే అధికారి ఒకడు వచ్చాడు. అంతే! గుడి నిర్వాహకులు మిగతా భక్తులందర్నీ ఆపి, ఆ అధికారికి దర్శనం కల్పించారు. ఆయన మూలంగా మురళికి దైవదర్శనానికి మరో రెండు గంటలు ఆలస్యమైంది. వాడు స్వామిని దర్శించుకుని పుష్పాన్ని స్వామికి చూపి, “ఈ పుష్పంవల్ల నా తండ్రికి నయమైతే సరిపోదు. నీవు నాకు రాజు కొలువులో అధికారి పదవి వచ్చేలా చేస్తే, నిన్ను నమ్మి మళ్లీ వచ్చి నీ దర్శనం చేసుకుంటాను” అని మ్రొక్కుకున్నాడు.

అంతా మాతంగుడి ఏర్పాటేకదా! మురళి తెచ్చిన మందారపుష్పాన్ని చూస్తూనే ప్రవర్ధనుడు పెద్దగా అరిచి, మళ్లీ మామూలు మనిషి ఐపొయాడు. అప్పుడు మురళి, తను దేవుడికి మ్రొక్కుకున్న విషయాన్ని మాతంగుడికి చెప్పి, “ఇప్పుడు రాజు కొలువులో అధికారి పదవి వస్తే కనుక, నేను దేవుణ్ణి నమ్మక తప్పదేమో!” అన్నాడు.

మాతంగుడు నవ్వి, “నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, తండ్రికోసం ఎంత కష్టమైనా పడ్డానికి సిద్ధమని ఋజువు చేసుకున్నావు. అందుకాయన ఎంతో సంతోషంగా ఉన్నాడు. నువ్వు వ్యాపారంలో తోడుగా ఉంటే ఇంకా సంతోషిస్తాడు. కాబట్టి నీకు రాజు కొలువు అవసరం లేదు. ఐనా నీకా పదవి కావాలంటే – మానవ ప్రయత్నంగా రాజు కొలువుకి వెళ్లి అడుగు. మ్రొక్కుకున్నావు కాబట్టి దైవకృపతో నీకా పదవి లభిస్తుంది. పదవి వచ్చిన వారం లోగా మొక్కు తీర్చుకో. ఆలస్యం చేశావో నీ మొహంమీద కుంకుడుకాయంత నల్లటి మచ్చ ఏర్పడుతుంది. మొక్కు తీర్చాకనే అది పోతుంది” అన్నాడు.

తర్వాత మురళి రాజు కొలువుకి వెడితే, అతడికి అధికారి పదవి లభించింది. ఆ వెంటనే అతడు అధికారి హోదాలో తన ఊరి గుడికి వెళ్లాడు. ఆలయ నిర్వాహకులతణ్ణి ఎంతో గౌరవించి, క్షణాలమీద ప్రత్యేకదర్శనం చేయించారు. ఐతే వారం తిరిగేసరికి ఆశ్చర్యంగా అతడి మొహంమీద కుంకుడుకాయంత నల్లటి మచ్చ ఏర్పడింది. అలాగెందుకయిందా అని కాసేపాలోచించేక, మురళి ఈసారి రహస్యంగా మళ్లీ స్వామిని దర్శించుకున్నాడు. అంతే! అతడి మొహంమీద మచ్చ మాయమైంది. అప్పట్నించీ అతడు దేవుణ్ణి నమ్మడం కూడా మొదలెట్టాడు.

కొండచిలువ ఈ కథ చెప్పి, “మురళి తన తండ్రి ఆరోగ్యంకోసం గుడికెళ్లి పుత్రధర్మాన్ని పాటించడంవరకూ బాగుంది. కానీ తనకు పదవికోసం దేవుడికెందుకు మ్రొక్కుకున్నాడు? తర్వాత ఆ మ్రొక్కు తీర్చినా అతడి మొహంమీద మచ్చ ఎందుకొచ్చింది? దాంతో దేవుడిపై నమ్మకం పోవడానికి బదులు, మురళి మళ్లీ గుడికెళ్లి స్వామిని దర్శించుకున్నాడెందుకు? అప్పుడు మచ్చ పోయిందెందుకు? ఇన్ని జరిగేక దేవుణ్ణి నమ్మాలా, కూడదా అన్న సందిగ్ధం అలాగే ఉండాలి. కానీ మురళి దేవుణ్ణి నమ్మడం మొదలెట్టాడెందుకు? తెలిస్తే నా ఈ సందేహాలకి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “మురళి ఆలోచనాపరుడు. అందుకే మామూలు కథలు విని దేవుణ్ణి నమ్మలేదు. తనలో దైవభక్తి పుట్టించడానికి, తండ్రికి జడభూతం పట్టడం, మాతంగుడు ఆడిస్తున్న నాటకమన్న అనుమానమూ అతడికుంది. అందుకే రాజాధికారి పదవి కోరుతూ దేవుడికి మరో పరీక్ష పెట్టాడు. అందరికీలా అది స్వార్థపూరితమైన కథ కాదు. ప్రజల్ని సేవించుకోవాల్సిన అధికారి, దర్శనానికి గంటల తరబడి నిలబడి ఎదురుచూస్తున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టి, తను క్షణాలమీద దర్శనం చేసుకుంటే, దేవుడి మెప్పు లభిస్తుందా అన్నది తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే తనకి రాజాధికారి పదవి లభిస్తే, వెళ్లి ఆ హోదాలోనే మ్రొక్కు తీర్చుకున్నాడు. ఐనా మొహంమీద మచ్చ ఏర్పడింది. ఎందుకంటే మ్రొక్కు తీర్చుకున్నది మురళి కాదు. రాజాధికారి. అది గ్రహించిన మురళి రాజాధికారిలా కాక, మురళిలాగే వెళ్లి దైవదర్శనం చేసుకున్నాడు. దాంతో మొహంమీద మచ్చ పోగానే అతడికి దేవుడంటే నమ్మకంతోపాటు గౌరవం కూడా పుట్టింది” అన్నాడు.

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 13వ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here