కరనాగభూతం కథలు – 13 రాజాధికారి నోటిదురుసు

0
2

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడికోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! శాసనాలతో కొత్త సిద్ధాంతాల్ని పౌరులమీద రుద్దడంవల్ల సత్ఫలితం ఉంటుందనుకోను. ఎందుకంటే మొండివాడు రాజుకంటే బలవంతుడు. వెనుకటికి సహదేవుడనే రాజు, ఓ మొండివాణ్ణి మార్చలేక, తన పద్ధతుల్నే మార్చుకున్నాడు. ఇప్పుడా కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.

సింహగిరి రాజు సహదేవుడు సమర్థుడు. ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉంది. అక్కడ దొంగతనాలు, హత్యలు వంటి నేరాలు ఇంచుమించు లేవనే చెప్పొచ్చు. ఐనా చెరసాలలు ఖాళీగా లేవు. కారణం సహదేవుడు క్రమశిక్షణకు ప్రాధాన్యమిచ్చి చేసిన నియమాలు.. వాటి ప్రకారం – పౌరులు కోపంలోనూ అసభ్యంగా మాట్లాడరాదు. ఎదుటివారి మనసుకి కష్టం కలిగించేలా ప్రవర్తించరాదు. బహిరంగ ప్రదేశాల్లో అల్లరి చెయ్యరాదు. ఇవన్నీ నేరాలు. కారణం ఏమైనా సరే, ఆ నేరాలు ఋజువైతే చాలు, అలాంటివారికోసం చెరసాలలో ప్రత్యేక విభాగాలుంటాయి. అక్కడ వారికి కఠిన శిక్షణతో, సత్ప్రవర్తన పాఠాలు నేర్పుతారు. వారిలో మార్పొచ్చేకనే విడుదల చేస్తారు.

కొందరికి దుష్ప్రవర్తన సాగుబడివల్ల వస్తుంది. అలాంటివారు చెరసాల ప్రత్యేక విభాగంలో పొందిన శిక్షణతో తొందరగానే మారతారు. కానీ కొందరికి దుష్ప్రవర్తన పుట్టుకతోనే వస్తుంది. వాళ్లని మార్చడం అంత తేలిక కాదు. చెరసాలల్లో ప్రత్యేక విభాగ శిక్షకులవద్ద అలాంటివారిని కూడా మార్చే ఉపాయాలున్నాయి. ఎటొచ్చీ అందుకు ఒకోసారి ఏళ్లకు ఏళ్లు పడుతుంది.

చిత్రమేంటంటే – ఆ దేశంలో ప్రత్యేక చెరసాల విభాగాలనుంచి విడుదలైనవారికి, ఇతర పౌరులకంటే గౌరవం ఎక్కువ. చిన్నపిల్లలు సత్ప్రవర్తనకు వారిని ఆదర్శంగా తీసుకుంటారు. వ్యాపారస్థులు, ధనవంతులు, భూస్వాములు – వారికి ఉద్యోగాలివ్వడానికి ఎగబడతారు. అలా విడుదలైనవారిలో యువతీయువకులుంటే – వారికి పిల్లల్నిచ్చి పెళ్లి చెయ్యడానికి తలిదండ్రులు తహతహలాడతారు. ఇది కాక ఎక్కువ గౌరవం పొందడంకోసం – కావాలని నేరం చేసి చెరసాల పాలైనవారూ అక్కడ కొందరున్నారు.

ఆ దేశంలో శిక్షాస్మృతికి స్వపరభేదాలు, పేద-గొప్ప తేడాలు లేవు. తప్పు చేసింది రాజాధికారైనా, ఆఖరికి రాజే ఐనా న్యాయాధికారి ముందు తలొంచుకుని, విధించిన శిక్ష అనుభవించాల్సిందే. ఎంత గొప్పవారైనా నోటికొచ్చినట్లు మాట్లాడ్డానికి భయపడతారక్కడ.

అలాంటి వాటన్నింటికీ మినహాయింపుగా ఆ దేశానికి కొత్తగా వచ్చాడు రమణప్ప. అతడు సహదేవుడి భార్య తారామతికి దూరపు బంధువు కావడంవల్ల అంతా అతణ్ణి రాణిబంధు అని కూడా అంటారు.

రమణప్ప తండ్రి విరూప దేశంలో పౌరులకు సైనికశిక్షణ ఇస్తూ పొట్ట పోషించుకుంటున్న రాజపుత్రుడు. రాజుతో దూరపు బంధుత్వం ఉన్నందున అప్పుడప్పుడు చుట్టపుచూపుగా రాజాంతఃపురానికి సకుటుంబంగా వచ్చి వెడుతుంటాడు. తారామతికి ఐదేళ్ల వయసప్పుడు, ఆమె అంతఃపుర కొలనులో పడిపోతే రక్షించాడు పదేళ్ల రమణప్ప. అప్పట్నించీ రాజుకీ, తారామతికీ అతడంటే ప్రత్యేక అభిమానం ఏర్పడింది. అదే రమణప్పకి వరమూ, రాజ కుటుంబానికి శాపమూ అయింది.

చిన్నప్పట్నించీ రమణప్ప ఇక్కడాఅక్కడా అని లేదు. ఎక్కడైనా అల్లరి చేస్తాడు. పెద్దాచిన్నా అని లేదు. నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా వాణ్ణి అదుపు చెయ్యలేక, పెద్దయ్యేక వాడే మారతాడులే అని ఊరుకున్నారు. వాడిప్పుడు పెద్దవాడయ్యాడు. ఇంకా అలాగే ఉన్నాడు. పెళ్లి చేస్తే బాగుపడతాడనుకుంటే, వాడికి పిల్లనిచ్చేవారు లేరు. చివరికి వారు తమ గోడు రాజుకి చెప్పుకుని, కొడుకులో మంచిమార్పు వచ్చేలా చేసి – జీవితంలో స్థిరపడేలా చూడమని కోరారు. రాజు సరేనన్నాడు.

రాజుగారి అంతఃపురానికి వచ్చినప్పుడూ – రమణప్ప అల్లరి, మాటలు అలాగే ఉండేవి. అందుకని వాడి గురించి రాజుకీ కొంత తెలుసు. కానీ కూతురి ప్రాణాలు కాపాడేడన్న కృతజ్ఞతతో అంతగా పట్టించుకోలేదదాయన. తారామతికి పెళ్లై సింహగిరికి కాపురానికెళ్లిపోయేక, రమణప్ప రాకపోకలు కూడా తగ్గాయి. ఇప్పుడు వాడి తండ్రి కోరడంతో, రమణప్ప బాధ్యతని తన మంత్రులకి అప్పగించాడు రాజు.

రమణప్పకి రాజుగారి మంత్రులతో పడలేదు. సైన్యాధిపతి, కోశాధికారి, రాజగురువు వగైరాలు ఎవ్వరితోనూ పడలేదు. ప్రతిఒక్కరూ వాణ్ణి భరించలేమన్నారు. అప్పుడు రాజు వాళ్లందర్నీ సమావేశపర్చి, ఎలాగో అలా రమణప్పను బాగుచేసే ఉపాయం ఆలోచించమని కోరాడు. అప్పుడు సేనాధిపతి, “దండం దశగుణభవేత్ అంటారు. వాణ్ణి మార్చాలంటే కఠిన శిక్షలతో భయపెట్టాలి” అన్నాడు. దానికి రాజు సరేనని, “మీరేంచేసినా వాడు మారడం ముఖ్యం. ఐతే ప్రాణాపాయం లేకుండా చూడండి. వాడు నాకు ఆత్మీయుడు” అన్నాడు.

సైన్యాధిపతి వాణ్ణి కొరడాతో కొట్టించాడు. విషసర్పాల్ని వాడి వంటిమీద పాకించాడు. నేలమీద కట్టిపడేసి, ఏనుగు పాదాన్ని వాడిమీదకు ఎత్తించాడు. ఎత్తైన కొండ అంచున నిలబెట్టి తోసెయ్యబోయాడు. ఆయన అలాంటి ప్రయత్నాలు చేస్తున్నంతసేపూ, బాధ భరిస్తూ కూడా, నోటికొచ్చినట్లు తిట్టడమే తప్ప ఏమాత్రం భయపడలేదు రమణప్ప. విసిగిపోయిన సైన్యాధిపతి రాజుని కలుసుకుని, “హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి వేసిన శిక్షలన్నీ వేశాను. ప్రహ్లాదుడు విష్ణుభక్తిని వదలనట్లుగా, వీడు మొండితనాన్ని వదలడు. పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదంటారే, అది వీడి విషయంలో నిజం” అన్నాడు నిస్సహాయంగా.

రాజుకి ఏంచెయ్యాలో పాలుపోలేదు. ఆ సమయంలో పుట్టింటికి వచ్చిన తారామతి విషయం తెలుసుకుని, “మీరు విచారించకండి నాన్నా! రమణప్పను నాతో తీసుకెడతాను. అక్కడ ప్రత్యేక చెరసాలలో కొన్నాళ్లుంటే తను తప్పక మారతాడు” అంది. అలా రమణప్ప సింహగిరి కోట అంతఃపురంలో రాణిబంధుగా ప్రవేశించాడు. తారామతి భర్తకి వాడి గురించి అన్నీ చెప్పి, “రమణప్ప నాకు ప్రాణదాత. వాణ్ణి సంస్కరించడం నా బాధ్యత. చెరసాలలో వేసి వాడికి సత్ప్రవర్తన అలవడే ఏర్పాటు చెయ్యండి” అంది. పరిస్థితిని అర్థం చేసుకున్న సహదేవుడు సరేనని, “రమణప్ప విషయంలో తొందర కూడదు. ముందు వాణ్ణి నేరం చెయ్యనీ. అప్పుడు చూద్దాం” అన్నాడు.

రమణప్ప నేరం చెయ్యడం ఎంతసేపు? వచ్చిన రోజే వాడు తనకోసం నియమించిన పరిచారకుణ్ణి నోటికొచ్చినట్లు తిట్టాడు. ఎవరైనా తిట్టినా సరే, ప్రతీకారంగా తిట్టడం కూడా ఆ దేశంలో నేరం. అందుకని ఆ సేవకుడు కిక్కురుమనలేదు కానీ రాణికి చెప్పుకున్నాడు. రాణి రాజుకి చెబుతుందనీ, రాజు రమణప్పని చెరసాలలో వేస్తాడనీ ఆ సేవకుడు ఆశించాడు కానీ అలా జరుగలేదు.

“రమణప్ప నాకు ఆత్మీయుడు. మనవాళ్ల క్రమశిక్షణని పరీక్షించడానికి వాణ్ణి నేనిక్కడికి రప్పించాను. ఆ బాధ్యతను నిర్వహించడానికే వాడు నోటికి పని చెబుతున్నాడు. కాబట్టి అది నేరం కాదు. ఐనా నోటిదురుసుకే తప్ప, ఎవర్నీ శిక్షించడానికి వాడికి అనుమతి, అధికారం లేవు” అని సహదేవుడు అంతఃపురంలో ప్రచారం చేయించాడు. దాంతో రమణప్పకి అక్కడ ఎదురే లేదు. కొద్దిరోజుల్లోనే అంతఃపురంలో వాళ్లంతా వాడి అసభ్యపదజాలానికి గురయ్యారు. చివరికి తారామతి, “రమణప్ప రెచ్చిపోతున్నాడు. పరీక్షంటూ ఇంకా ఎన్నాళ్లీ ఉపేక్ష? పరీక్షలో నెగ్గిన మనవాళ్లని మెచ్చుకోండి. రమణప్పని చెరసాలకు పంపండి” అందో రోజు భర్తతో. “నిన్నూ నన్నూ ఏమనడు కదా! అలాగే కొన్నాళ్లకి అందరి విషయంలోనూ మారొచ్చు. కాబట్టి వాణ్ణి ఇక్కణ్ణించి తప్పించి, గిరికోన గ్రామానికి రాజాధికారిగా పంపిస్తాను. వాడు నేను నియమించిన పరీక్షాధికారి అని ఇక్కడిలాగే అక్కడా ప్రచారం చేయిస్తాను” అని రాణికి చెప్పి, వాణ్ణి గిరికోనకు పంపాడు.

అక్కడా రమణప్పలో ఏ మార్పూ లేదు. ఒక రాజాధికారి బహిరంగంగా అంత అసభ్యంగా మాట్లాడ్డమూ, రాజు సహదేవుడు అందుకు ఆమోదించడమూ, ఆశ్చర్యంగా అనిపించింది గిరికోన వాసులకి. ఐనా వారు వాడి ప్రవర్తనను భరించి పరీక్షలో నెగ్గారు. ఐతే ఓ ఏడాది తర్వాత రాజు రమణప్పని గిరికోననుంచి జలకోనకు పంపినప్పుడు మాత్రం, వారు హమ్మయ్య అనుకుని తేలికగా ఊపిరి పీల్చుకున్నారు.

అలా రమణప్ప సుమారు పది ఊళ్లు మారాక రాజు, తన దేశంలో ప్రత్యేక చెరసాలలు మూయించేశాడు. క్రమశిక్షణ పాటించని పౌరుల్ని, రమణప్ప రాజాధికారిగా ఉండే ప్రాంతానికి పంపసాగాడు.

కొండచిలువ ఈ కథ చెప్పి, “ఎప్పుడూ రాజునీ, రాణినీ ఏమీ అనలేదు రమణప్ప. అంటే వాడి నోటిదురుసు సాగుబడే కానీ – పుట్టుకతో వచ్చినట్లు కాదనుకోవాలి. అలాంటివాడు సింహగిరిలో నోటిదురుసుతో అందర్నీ కష్టపెడుతుంటే, క్రమశిక్షణ విషయంలో తన పౌరులవల్ల చిన్న పొరపాటు జరిగినా, ప్రత్యేక చెరసాలకు పంపే సహదేవుడు, ఎందుకు సహనం చూపాడు? అంటే అతడికి స్వపరభేదం ఉందా? అందుకే రమణప్పను రాజాధికారిగా కూడా నియమించాడా? రమణప్పను మార్చలేదన్న అపవాదునుంచి తప్పించుకుందుకే ప్రత్యేక చెరసాలలు మూయించేశాడా? క్రమశిక్షణకోసం తపించిన సహదేవుడు – ఒక్క దుడుకు మనిషి పట్ల కృతజ్ఞతతో, వ్యవస్థకు మంచి చేసే సాధనాల్ని వదులుకునేందుకు సిద్ధపడ్డం సబబేనా? తెలిస్తే నా ఈ సందేహాలకి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “రమణప్పకి నోటిదురుసు పుట్టుకతో వచ్చిందే తప్ప, సాగుబడి వల్ల కాదనడానికి ఎన్నో ఋజువులున్నాయి. వాడెంత మొండివాడో తారామతి చెప్పేక, వాణ్ణి మార్చడం ప్రత్యేక చెరసాల శిక్షకులకు అసాధ్యమని సహదేవుడి కర్థమైంది. అక్కడ వాడు మారకపోతే, పౌరులకి వాటిపై నమ్మకం పోతుందన్న భయంతో, అతడు వాణ్ణి చెరసాలకు పంపలేదు. వాడి చేత తిట్లు తినడం ఇష్టంలేకనే విరూపరాజు వాణ్ణి మార్చే బాధ్యతని ఇతరులకి అప్పగించాడు. తారామతి భర్తకి అప్పగించింది. సహదేవుడు కూడా వాడి జోలికి వెళ్లకుండా క్రమశిక్షణ పరీక్షని సాకుగా ఎంచుకున్నాడు. అలా అతడు రమణప్ప నోటిదురుసునుంచే కాదు, వాడిపట్ల తనకు పక్షపాతముందన్న అపవాదునుంచీ తప్పించుకున్నాడు. వాణ్ణి రాజాధికారిగా భరించడమే ఓ కఠినశిక్ష అని గుర్తించేకనే, సహదేవుడు ప్రత్యేక చెరసాలలు మూయించి, నేరస్థుల్ని వాడున్న ప్రాంతాలకి పంపసాగాడు. ఇక ఏ నేరం చెయ్యని అమాయకపౌరుల సంగతంటావా – వాళ్లకు వాణ్ణి భరించడం కష్టం కాదు. ఎందుకంటే నోటికొచ్చినట్లు మాట్లాడ్డమే తప్ప, ఎవర్నీ శిక్షించే అధికారం లేదు వాడికి. అంచేత వాళ్లు వాణ్ణి పట్టించుకోరు సరికదా, కొన్నాళ్లకి వాడు తిడుతుంటే నవ్వుకుంటారు కూడా. తన నోటిదురుసువల్ల ఎవరికీ హాని జరక్కపోతే, కొన్నాళ్లకి విసుగుపుట్టి రమణప్పే మారిపోవచ్చు. కాబట్టి అన్నివిధాలా వాడిపట్ల సహదేవుడి వ్యవహారం సబబైనది” అన్నాడు.

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 14వ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here