[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]
[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడికోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! ఈ ప్రపంచంలో ఏ కొత్త సిద్ధాంతమైనా మేధావులనుంచే కదా పుడుతుంది! ఐనా ప్రతి సిద్ధాంతానికీ ఎంతో కొంత సవరణ అవసరమౌతోంది. లోపం సిద్ధాంతానిదా లేక మేధావులదా? సమాధానం ధీమంతుడి కథలో లభిస్తుందేమో! అ కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.
వికల్ప దేశపు రాజు శతృఘ్నుడు తన దేశాన్ని ఇరవై భాగాలుగా విభజించి, ఒకో భాగానికి ఒకో రాజాధికారిని నియమించాడు. అలాంటి విభాగాల్లో ఒకటైన ఇంద్రపురికి సుకాముడు అధికారి. అతడు అహంకారి, కోపిష్టి. తనకు తోచిందే చేస్తాడు. అది ఒప్పైనా, తప్పైనా ఎదురు చెప్పరాదు. ప్రశ్నించినవార్ని చెరసాలలో వేయిస్తాడు. తన ఒప్పుల్ని మెచ్చుకున్నా, తప్పుల్ని సమర్థించినా మెచ్చుకుని కానుకలిచ్చి సత్కరిస్తాడు. ఐతే తిక్కలోడు కావడంవల్ల అతడి మెప్పు పొందడం అంత సులభం కాదనడానికి కొన్ని ఉదాహరణలున్నాయి.
ఒకసారి ఓ అనుచరుడు, “నీ చల్లని పాలనలో, వానలు సకాలంలో పడుతున్నాయి. పంటలు బాగా పండి, రైతులు ప్రతిరోజూ ముందు నిన్ను స్మరించాకనే, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు” అన్నాడు. సుకాముడు సంబరపడి మెడలోని ముత్యాలహారాన్ని అతడికి కానుకగా ఇచ్చాడు.
అప్పుడు పక్కనే ఉన్న అనుచరుడు, “అందుకేనేమో, చాలామంది తమ పూజామందిరాల్లో దేవుడి పటాలు తీసేసి నీ పటాన్ని పెట్టుకుని పూజిస్తున్నారు” అన్నాడు. అంతే! సుకాముడి కళ్లు ఎర్రబడ్డాయి. “నేనే నా పూజామందిరంలో దేవుడి పటాన్ని తియ్యలేదు. దేవుడి పటం స్థానంలో నా పటం పెడితే మురిసిపోడానికి, నేనేమన్నా హిరణ్యకశిపుణ్ణా? అలా చేసిన వాళ్లెవరో చెప్పు. వాళ్లని కఠినంగా శిక్షిస్తాను” అన్నాడు. దాంతో ఆ అనుచరుడికి పచ్చివెలక్కాయ నోట్లో పడ్డట్లయింది. ఏదో సుకాముణ్ణి పొగడాలని నోటికొచ్చింది అన్నాడు కానీ, అతడి ఎరికలో సుకాముడి పటానికి పూజ చేస్తున్నవారు ఒక్కరైనా లేరు. ఆ విషయం బయటపడ్డంతో అతడి ఉద్యోగం ఊడింది.
సుకాముడు తిక్కలోడనీ, అతడికి వీలైనంత దూరంగా ఉండడం మంచిదనీ అంతా అనుకుంటారు. కానీ అన్నివేళలా అలా సాగదు కదా! ఒకోసారి సుకాముడే ఎవరో ఒకర్ని ఉత్తపుణ్యాన రెచ్చగొట్టి, రెచ్చిపోయినందుకు ఫలితంగా వాళ్లు శిక్షలపాలైతే వినోదిస్తుంటాడు. అందువల్ల అక్కడి పౌరులకు జీవితం దినదినగండంగా అనిపిస్తుంటే, కొందరు ధైర్యం చేసి రాజు శతృఘ్నుడికి ఫిర్యాదు చేశారు. రాజు వాళ్లనీ, సుకాముణ్ణీ ఒకచోట సమావేశపర్చి, సుకాముణ్ణి సంజాయిషీ అడిగాడు. దానికతడు “తమరు మహారాజు. నా వల్ల తప్పు జరిగితే, సంజాయిషీ అడక్కుండా దండించే అధికారం తమకుంది. తమరే శిక్ష విధించినా, శిరసావహిస్తాను” అని నమ్రతతో బదులిచ్చాడు.
రాజు అతడి వినయానికి ముగ్ధుడయ్యాడు. “ఇకమీదట అడ్దమైనవాళ్లూ ఫిర్యాదులతో నా వద్దకు రావద్దు. నేను మేధావుల మాటకు మాత్రమే విలువిస్తాను” అని ఫిర్యాదీల్ని మందలించాడు. ఇంద్రపురికి వెళ్లేక సుకాముడు ఫిర్యాదీల్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. అప్పట్నించీ తడిపై రాజుకి ఫిర్యాదు చెయ్యాలంటేనే, అందరికీ భయం. ఐతే రాజుకి మేధావుల మాటంటే గురి అని గ్రహించిన సుకాముడు ముందు జాగ్రత్తగా, తన కొలువులో ఓ మేధావిని నియమించి తన మనిషిని చేసుకోవాలని మనసులో అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఇంద్రపురికి ధీమంతుడనే పండితుడు వచ్చాడు.
ధీమంతుడిది ఇంద్రపురికి పక్కనే ఉన్న భద్రపురి. దానికి రాజాధికారి శంతనుడు. శంతనుడికీ, సుకాముడికీ ఒకరి పొడ ఒకరికి గిట్టదు.
ఒకప్పుడు ధీమంతుడి తండ్రి శ్రీమంతుడిదీ ఇంద్రపురే. భార్యకు జబ్బు చేసి, గాలి మార్పు కావాలంటే- వైద్యుల సలహాపై, పక్కనే ఉన్న భద్రపురికి మకాం మార్చేడాయన. కాలక్షేపానికి వ్యాపారం మొదలెడితే, బాగా కలిసొచ్చింది. అక్కడే స్థిరపడ్డాడు. ఇంద్రపురిలో తనకున్న పాతికెకరాల్నీ, తానెరిగిన శకారుడనే రైతుకి కౌలుకిచ్చాడు. శకారుడు ఏడాదికోసారి భద్రపురి వచ్చి, ఎంతోకొంత అయివేజు ఇచ్చేవాడు. శ్రీమంతుడు డబ్బు మనిషి కాదు కాబట్టి శకారుడు ఏమిస్తే అది మారుమాటాడకుండా పుచ్చుకునేవాడు.
శ్రీమంతుడి కొడుకు ధీమంతుడు గురుకులవాసం చేసి, ఎన్నో శాస్త్రాలు చదివాడు. చదువయ్యేక గురువతడితో, “నీ జ్ఞానాన్ని నలుగురికీ పంచిపెట్టే ప్రతిభ నీకుంది. ఆ ప్రతిభకు న్యాయం చేసే వృత్తి స్వీకరించు” అన్నాడు. అది తెలిసిన శ్రీమంతుడు, కొడుకుని అప్పటి రాజాధికారి జయపాలుడి వద్దకు సుకెళ్లాడు. జయపాలుడికి ధీమంతుడు నచ్చి, తన కొలువులో ఆస్థానపండితుడిగా నియమించాడు. తర్వాత ధీమంతుడికి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కలిగారు. అలా అతడికి రోజులు సుఖంగా గడిచిపోతున్న సమయంలో, జయపాలుడి స్థానంలో శంతనుడు రాజాధికారిగా నియమితుడయ్యాడు.
శంతనుడి ఆశయాలు జయపాలుడికి భిన్నం. భద్రపురి సుసంపన్నం కావాలంటే – వ్యవసాయం, వ్యాపారం బాగా వృద్ధి చెయ్యాలనీ – ఆ సంబంధమైన చదువులనే ప్రోత్సహించాలనీ అతడనుకున్నాడు. పండితులంటే చిన్నచూపుతో, క్రమంగా వారికి ఉద్వాసన చెప్పసాగాడు. శంతనుడు అధికారిగా వచ్చిన రెండేళ్లలో ధీమంతుడి ఉద్యోగం ఊడింది.
అప్పటికి ధీమంతుడికి ముప్పైఏళ్లు. వర్తకం అతడి ప్రవృత్తికి సరిపడదు. తండ్రి అసరా ఉండడంవల్ల భుక్తికి లోటు లేదు కానీ, కూర్చుని తినడం అతడికిష్టం లేదు. అదీకాక, పండితులకి విలువనివ్వని శంతనుడి ఏలుబడిలో ఉండడం అవమానమని అతడికి తోచింది. అతడి మనఃస్థితిని అర్థం చేసుకున్న శ్రీమంతుడు, “మన శకారుడు రెండేళ్లుగా అయివేజు ఇవ్వడంలేదు. నువ్వు ఇంద్రపురికి వెళ్లి, మన పొలం స్వాధీనపర్చుకుని, వ్యవసాయం చెయ్యి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పరిస్థితి చక్కబడ్డాక మళ్లీ ఇక్కడకొద్దువుగాని” అన్నాడు.
అంతవరకూ శ్రీమంతుడి పాతికెకరాల పొలాన్నీ స్వంతదారుడిలా అనుభవిస్తున్న శకారుడికి ధీమంతుడి రాక నచ్చలేదు. “దున్నేవాడిదే భూమి. ఇరవైఏళ్లుగా సాగు చేస్తున్న ఈ పొలంపై సర్వహక్కులూ నావే! కావాలంటే మా అధికారి సుకాముడికి ఫిర్యాదు చేసుకో” అని మొండికేశాడు. అతడి ధైర్యం ధీమంతుడు సుకాముడికి ఫిర్యాదు చెయ్యడని. ఒకవేళ చేసినా అతడు భద్రపురినుంచి వచ్చాడు కాబట్టి, సుకాముడు అతణ్ణి శంతనుడి మనిషిగా భావించి, సాయం చెయ్యడని అనుకున్నాడు శకారుడు. కానీ అలా జరుగలేదు.
ధీమంతుడు సుకాముణ్ణి కలుసుకున్నాడు. పండితుల శైలిలో అప్పటికప్పుడు ఆశువుగా అల్లిన చక్కని పద్యంతో దీవించాడు. అంతవరకూ పద్యాల దీవెన ఎరుగని సుకాముడు పొంగిపోయి, ధీమంతుడి కథ అడిగి తెలుసుకున్నాడు.
ధీమంతుణ్ణి చేరదీస్తే అటు తనకు మేధావి అండ లభించినట్లూ ఉంటుంది, ఇటు శంతనుడికి చెంపపెట్టులాగా ఉంటుందని భావించిన సుకాముడు – అతడికి శకారుడినుంచి పొలాన్ని ఇప్పించడమే కాక, అతణ్ణి తన కొలువులో ఆస్థాన పండితుడిగానూ నియమించాడు.
ధీమంతుడికి రొట్టె విరిగి నేతిలో పడ్డట్లయింది. తానిక ఇంద్రపురిలోనే స్థిరపడుతున్నట్లు తండ్రికి కబురంపాడు. తర్వాత నమ్మకస్థుల సాయంతో వ్యవసాయం చేస్తూ, కొలువులో తన జ్ఞానాన్ని ప్రవచనాల రూపంలో పంచిపెడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు.
సుకాముడు తిక్కలోడు కదా, అతడి తలతిక్క పనులవల్ల ఇబ్బందిపడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వచ్చింది.
నేరుగా ఫిర్యాదు చేస్తే ప్రమాదమని చాలామంది రాజుకి ఆకాశరామన్న లేఖలు పంపసాగారు. అవి క్రమంగా వేలదాకా పెరగడంతో రాజు సుకాముణ్ణి పిలిపించి మళ్లీ సంజాయిషీ అడిగాడు. సుకాముడు ఎంతో వినయంగా, “నా గురించి నేనేం చెప్పుకున్నా, అది స్వోత్కర్ష ఔతుంది. ఇంద్రపురి కొలువులో ధీమంతుడనే మేధావి ఉన్నాడు. మన భద్రపురి అధికారి శంతనుడి కొలువులో ఉండలేక అతడు నావద్ద చేరాడు. తమరు అతణ్ణి పిలిపించి విచారించండి. ఆ తర్వాత మీ నిర్ణయం ఏమైనా శిరసావహిస్తాను” అన్నాడు. .
రాజు సుకాముణ్ణి పంపేసి, తన మంత్రుల్లో విజ్ఞుడని పేరొందిన సుబుద్ధిని పిలిచి విషయం చెప్పి, “నాకు మేధావులంటే గౌరవం. వారిని ఇక్కడకు రప్పించడంకంటే, మనమే అక్కడకు వెళ్లి కలవడం గౌరవం. తమరు ఇంద్రపురికి వెళ్లి ధీమంతుణ్ణి కలుసుకుని, సుకాముడిపై వచ్చిన ఆరోపణలు చెప్పి, ఆ మేధావి అభిప్రాయం తెలుసుకుని రండి” అని నియోగించాడు.
సుబుద్ధి రాజు చెప్పినట్లే చేశాడు. ధీమంతుడు ఆయనతో, “సుకాముడిపై వచ్చిన ఆరోపణలలో నిజానిజాలతో నాకు పని లేదు. అతడు నాకు జరిగిన అన్యాయాన్ని సరిచేశాడు. నా పాండిత్యానికి తగిన విలువనిచ్చాడు. నా దృష్టిలో అతడు ఉత్తముడు. అతడేం చేస్తే అదే ఒప్పు” అన్నాడు.
సుబుద్ధి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుని, తిరిగి వెళ్లి రాజుని కలుసుకుని, “ప్రభూ! తమరు నన్ను ఇంద్రపురి వెళ్లి ధీమంతుణ్ణీ, మేధావినీ కలుసుకోమనీ చెప్పారు. నేను ధీమంతుణ్ణి కలుసుకున్నాను కానీ మేధావిని కలుసుకోలేకపోయాను” అన్నాడు.
రాజు క్షణం ఆలోచించి, “అప్పగించిన కార్యం పూర్తి చేసుకొచ్చారు. ధన్యవాదాలు” అని ప్రశంసించి ఆయన్ని పంపేశాడు.
కొండచిలువ ఈ కథ చెప్పి, “రాజు ధీమంతుడనే మేధావిని కలుసుకోమని సుబుద్ధిని నియోగించాడు. మరి సుబుద్ధి ధీమంతుడు, మేధావి వేరని ఎందుకు పొరబడ్డాడు? ఆయన పొరబడ్డాడు సరే, రాజెందుకు ఆ పొరపాటుని సరిచెయ్యలేదు? పోనీ ధీమంతుడు, మేధావి నిజంగానే వేర్వేరు వ్యక్తులని అనుకున్నా- ధీమంతుణ్ణి మాత్రమే కలుసుకుని వచ్చిన సుబుద్ధిని, కార్యం పూర్తి చేసుకొచ్చినట్లు ఎందుకు మెచ్చుకున్నాడు? తెలిస్తే నా ఈ సందేహాలకి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.
దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “మేధావి అంటే ఏ విషయాన్నయినా సూక్ష్మబుద్ధితో అర్థం చేసుకుని, తార్కికంగా ఆలోచించి సరైన నిర్ణయం చెప్పేవాడు. ధీమంతుడు సుకాముడి విషయంలో అలాంటి అవగాహన చూపలేదు. తనకు సుకాముడివల్ల మేలు జరిగింది కాబట్టి, సుకాముడేం చేసినా సమర్థనీయమే అనుకోవడం మేధావి లక్షణం కాదు. అందుకే సుబుద్ధి అతడిలో మేధావిని చూడలేదు. ఇక రాజుకి ధీమంతుడు మేధావి అని తెలియదు. సుకాముడు చెబితే ఔననుకున్నాడు. సుబుద్ధి ఇంద్రపురి వెళ్లి రావడంవల్ల – ధీమంతుడు మేధావి కాడనీ, అతడిలో మేధావిని చూసే సుకాముడి సామర్థ్యం సందేహాస్పదమనీ తెలిసింది. అలా సుబుద్ధికి తాను అప్పగించిన పని పూర్తయిందని గ్రహించి, రాజు అతణ్ణి మెచ్చుకున్నాడు” అన్నాడు.
అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.
(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 15వ కథ)