[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]
[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడి కోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! అధికారం నీకొచ్చిన గొప్ప అవకాశం. అది సత్ఫలితాన్ని ఇవ్వాలంటే, సహనం అవసరం. ఐతే సూరన్న అనే రైతుబిడ్డ, తనకొచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందుకు చూపిన సహనం, నిజంగా సత్ఫలితాన్నిచ్చిందా అని నాకు అనుమానంగా ఉంది. ఆ కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.
ఒక ఊళ్లో భీమయ్య అనే సన్నకారు రైతు కొడుకులు జక్కన్న, సూరన్న. ఇద్దరికీ వ్యవసాయమంటే ఆసక్తి లేదు. ఎందుకంటే – వానలు లేకపోతే పంటే ఉండదు. ఆ వానలే మరీ ఎక్కువైతే, పండింది కూడా పాడౌతుంది. ఆపైన పండిందానికి చీడ పట్టొచ్చు. పండిందాంట్లో సగం పందికొక్కుల పాలబడొచ్చు. అన్నింటినీ దాటుకుని గోదాములు నిండేంత పంట కాస్తే, గిరాకీ ఉండకపోవచ్చు. రాజు కొలువులో సైనికుడికి యుద్ధమప్పుడే పోరాటం. కానీ సైనికులతో సహా, మొత్తం పౌరులందరికీ అన్నం పెట్టే రైతుకి, ప్రతిరోజూ బ్రతుకే ఓ పోరాటం.
అన్నదమ్ములిద్దరూ ఎవరికివారు వ్యాపారం చెయ్యాలని ఉబలాటపడుతున్నారు. జక్కన్నయితే తండ్రి దగ్గర డబ్బు లేదని ఊరుకున్నాడు కానీ, అప్పైనా చేసి డబ్బు తెచ్చిమ్మని తండ్రిని రోజూ వేధిస్తున్నాడు సూరన్న. డబ్బు లేకుంటే పస్తులుంటా కానీ, అప్పు చెయ్యనని తేల్చి చెప్పేశాడు భీమయ్య. “నాకు పొలం పనుల్లో సాయపడండి. ఒకరికి ముగ్గురైతే, దిగుబడి ఎక్కువై, రాబడి పెరుగుతుంది. అదనపు డబ్బు ఇద్దరూ పంచుకుని తోచిన వ్యాపారాలు మొదలెట్టండి” అని కొడుకులకి చెప్పాడు. అందుకు జక్కన్న ఒప్పుకున్నాడు కానీ, సూరన్న ససేమిరా అన్నాడు. జక్కన్న సాయంతో భీమయ్య అదనంగా పొలం గట్లమీద నువ్వులు, పెసలు, ఆముదం వగైరా మొక్కలు వేశాడు.
జక్కన్న సాయానికి తోడు ఆ ఏడాది అన్నీ కలిసొచ్చాయి. పంటలు బాగా పండి, గిరాకీ బాగుండి, ధరలు బాగా పలకడంతో భీమయ్యకు అదనంగా ఐదొందల వెండి కాసులొచ్చాయి. కొడుకులిద్దర్నీ చెరి సగం తీసుకోమన్నాడు భీమయ్య. ఐతే సూరన్న, “ఈ ఏటికి మొత్తం డబ్బు నేను తీసుకుని, పట్నం వెళ్లి వ్యాపారం చేసుకుంటాను. వచ్చే ఏడాది పంటలోంచి అన్న డబ్బు తీసుకుంటాడు” అన్నాడు.
నిజానికా డబ్బు జక్కన్న కష్టఫలం. అందుకని భీమయ్య తటపటాయించాడు. కానీ జక్కన్న మంచి మనసుతో తమ్ముడి మాటలకు సరేనన్నాడు. సూరన్న ఆ డబ్బు తీసుకుని పట్నం వెళ్లి – ఏడాది తర్వాత ఉన్న డబ్బంతా పోగొట్టుకుని వెనక్కి వచ్చాడు.
ఐతే సూరన్నలో డబ్బు పోయిందన్న బాధ ఏ కోశానా లేదు. పైగా, “ఇప్పుడు నాకు బాగా అనుభవం వచ్చింది. మునుపటేడు లాగే ఓ ఐదొందల వెండి కాసులిస్తే – ఈసారి ఏడాదిలో పది రెట్లు చేసి తెస్తాను” అన్నాడు. కానీ ఆ ఏడాది భీమయ్యకు ఏదీ కలిసి రాలేదు. ఆ ఏటికి తిండికి సరిపడ పంట కాక మిగిలినవి రెండే రెండు వెండి కాసులు. భీమయ్య వాటిని జక్కన్న చేతిలో పెట్టి, “నా దగ్గరున్నదిదే! ఇద్దరూ పంచుకోండి” అన్నాడు. సూరన్నకి కోపమొచ్చి తండ్రిమీద గట్టిగా అరిచాడు. జక్కన్న అతణ్ణి వారించి, “నాన్న ప్రేమతో ఇచ్చిన డబ్బిది. ఇదే అక్కరకొస్తుందేమో బయటికెళ్లి చూద్దాం. కాకపోతే అప్పుడే నాన్నమీద నీ కోపం చూపుదువుగాని” అన్నాడు. గొణుక్కుంటూనే సూరన్న అన్నతో కలిసి బయటికొచ్చాడు. తమ్ముణ్ణి శాంతపరచడానికి ఏదో అన్నాడు కానీ బయటికెళ్లి ఏం చెయ్యాలో జక్కన్నకీ తెలియదు. ఇద్దరూ అనాలోచితంగా నడుచుకుంటూ, ఊరి పొలిమేరలకు చేరేసరికి వారికక్కడ ఓ బైరాగి కనిపించి, “మీరిద్దరూ చెరో వెండికాసూ నాకివ్వండి. మీ ఆశయాలు సిద్ధించే అవకాశం కల్పిస్తాను” అన్నాడు.
సూరన్న చిరాగ్గా అతణ్ణి చూసి, “బైరాగివి. బిచ్చమెత్తుకుని బ్రతికేవాడివి. మా దగ్గరున్న వెండికాసులు కాజెయ్యాలన్న పన్నాగం కాకపోతే, నువ్వు మాకు మా ఆశయాలు సిద్ధించే అవకాశం కల్పించడమేమిటి? అలాగనడానికి సిగ్గుగా లేదూ!” అని పరుషంగా మాట్లాడాడు.
బైరాగి నవ్వి, “నాయనా! నేను బైరాగిని కాబట్టి బిచ్చమెత్తుకుని బ్రతకుతున్నాను. మరి బైరాగి కాని నువ్వు చేస్తున్న పనేమిటి? గతేడాది మీ నాన్నని అడుక్కుని ఐదొందల కాసులు తీసుకెళ్లి పోగొట్టుకును మళ్లీ తండ్రిని అడుక్కోవడానికొచ్చావు. నువ్వూ బిచ్చగాడివే కదా! బిచ్చగాడినని నన్ను తేలిక చెయ్యడానికి నీకు సిగ్గుగా లేదూ!” అన్నాడు.
అసలే ఉక్రోషంగా ఉన్న సూరన్నకు ఈ మాటలతో మరింత కోపమొచ్చి బైరాగిమీద చెయ్యి చేస్కోబోయాడు. జక్కన్న అతణ్ణి ఆపి, తను వెంటనే బైరాగికి రెండు చేతులూ జోడించి, “అయ్యా! నీవు మామూలు బైరాగివి కాదు. నా తమ్ముడు దుడుకు మనిషే కానీ చెడ్డవాడు కాదు. జరిగిందానికి మమ్మల్ని క్షమించు. నువ్వడిగిన రెండు వెండి కాసులూ ఇస్తున్నాను. మా భవిష్యత్తు బాగుండాలని దీవించు” అని అప్పటికి తన వద్దనున్న రెండు వెండి కాసులూ ఇచ్చేశాడు.
బైరాగి ఆ కాసులు తీసుకుని, “బైరాగిని. రాగద్వేషాలకు అతీతుణ్ణి. నాకు మీమీద కోపం లేదు కాబట్టి, క్షమించాల్సిన అవసరం లేదు. మీకు తప్పక సాయం చేస్తాను” అంటూ గచ్చకాయ పరిమాణంలో ఉన్న రెండు గింజల్ని వాళ్లకి చూపించి, “ఇవి మామూలు గింజలు కావు. వీటిలో తెల్ల గింజని అడుగులోతునా, పసుపు గింజని అరడుగు లోతునా గొయ్యి తీసి పాతాలి. ఈ రాత్రి పాతితే మర్నాడు తెల్లారేసరికి అక్కడో మొక్క మొలుస్తుంది. ఆ మొక్కని తెచ్చి జాగ్రత్తగా తెచ్చి నాకివ్వాలి. అప్పుడు మీకు మీ ఆశయాలు సిద్ధించే అవకాశం కల్పిస్తాను. ముందు మీలో ఎవరికి ఏ రంగు గింజ కావాలో చెప్పండి” అన్నాడు.
అప్పటికి సూరన్నకి కూడా బైరాగిమీద కొంత గురి కుదిరింది. అతడు వెంటనే గొయ్యి తవ్వడంలో శ్రమ తక్కువని పసుపు గింజ అడిగి తీసుకున్నాడు. మిగిలిన తెల్ల గింజని జక్కన్న తీసుకున్నాడు. అప్పుడు బైరాగి వాళ్లతో, “మీరిద్దరూ కలిసి గోతులు తవ్వకూడదు. తవ్వేటప్పుడు మీ పక్కన ఎవరూ ఉండకూడదు. ఉంటే మొక్క మొలవదు. మరో విషయం. రేపు మీరిద్దరూ నావద్దకు కలిసి కాకుండా విడివిడిగా రావాలి” అని హెచ్చరించి పంపాడు.
అన్నదమ్ములిద్దరూ ఉత్సాహంగా ఇంటికెళ్లారు. తలిదండ్రులతో ప్రశాంతంగా మాట్లాడారు. ఆ రాత్రి ముందు సూరన్న వెళ్లి సరిగ్గా అరడుగు లోతు గొయ్యి తీసి అందులో పసుపురంగు గింజని పాతాడు. తర్వాత జక్కన్న వెళ్లి అడుగు లోతు గొయ్యి తీసేసరికి ఆశ్చర్యంగా అక్కడో వెండి కాసు కనబడింది. దాన్ని తీసి జేబులో వేసుకుని తెలుపు గింజని పాతేశాడు.
తెల్లారి లేచి చూస్తే జక్కన్న పాతినచోట ఏ మొక్కా మొలవలేదు. అతడు ఎంతో నొచ్చుకుని వెంటనే వెళ్లి బైరాగిని కలుసుకుని జరిగింది చెప్పి, “నావల్ల ఎక్కడో పొరపాటు జరిగింది. నీకు మొక్క తెచ్చి ఇవ్వలేకపోయాను” అని బాధపడ్డాడు.
బైరాగి నవ్వి, “ఫలానికైనా, ప్రతిఫలానికైనా నుదుట రాసిపెట్టుండాలి. నీకు వెండి కాసు రాసిపెట్టి ఉంది. అది దొరికిన సంతోషంలో గింజని పాతడం మర్చిపోయుంటావు. నీ జేబులో చూసుకో” అన్నాడు. జక్కన్న చూసుకుంటే జేబులో ఆ గింజ అలాగే ఉన్నది. అది చూసిన బిచ్చగాడు, “మొక్క మొలిచేదాకా నీ ప్రయత్నం మానకు. మళ్లీ మొక్క మొలిచేకనే నావద్దకు రా” అని చెప్పి అతణ్ణి పంపేశాడు.
సూరన్న గింజ పాతిన చోట మర్నాడు తెల్లారేసరికల్లా ఓ మొక్క మొలిచింది. అతడు దాన్ని జాగ్రత్తగా పెళ్లగించి, తీసుకెళ్లి బైరాగికి ఇచ్చాడు. బైరాగి ఎంతో సంతోషించి, “ఈ మొక్క నాకు అవసరం. దీన్ని దగ్గరుంచుకుంటాను. నీకు మరో పసుపు గింజ ఇస్తాను. నువ్వు దాన్ని ఈ రాత్రి అరడుగు లోతున పాతు. రేపటికల్లా అక్కడో మొక్క మొలుస్తుంది. నెల్లాళ్లలో అదో పువ్వు పూస్తుంది. ఆ పువ్వుని కోస్తే ఓ వెండికాసు రాలిపడుతుంది. కొయ్యకుండా ఆ పువ్వుని అలాగే వదిలేస్తే, మరో రెండు నెలలకి అది కాయగా మారుతుంది. ఆ కాయని కోస్తే దాని లోపల ఓ బంగారు కాసు ఉంటుంది. కొయ్యకుండా ఆ కాయని అలాగే వదిలేస్తే, మరో నెలకి అది పండుగా మారుతుంది. దాన్ని కోస్తే అందులో రెండు పసుపు రంగు గింజలు ఉంటాయి. వాటితో మళ్లీ మొక్కలు మొలుస్తాయి. ఈ గింజను వాడి, వచ్చిన కాసులతో వ్యాపారమే చేస్తావో, లేక లెక్కలేనన్ని బంగారు కాసులు పోగు చేసుకుంటావో అది నీ ఇష్టం” అన్నాడు.
జక్కన్నకి ఆ రాత్రి కూడా అడుగు లోతు గొయ్యి తియ్యగానే, మళ్లీ వెండి కాసు దొరికింది. ఈసారి గుర్తుంచుకుని గింజని పాతినా కూడా, మర్నాడు మొక్క మొలవలేదు. చూస్తే గింజ జేబులోనే ఉంది. అలా అతడికి రోజుకో వెండి కాసు దొరుకుతోంది. కొన్నాళ్లకు అతడా డబ్బుతో వ్యాపారం మొదలెట్టాడు. రోజుకో వెండి కాసు, వ్యాపారంలో లాభాలతో అతడికి రోజులు సుఖంగా వెళ్లిపోతున్నాయి.
సూరన్నకి గింజ పాతిన మర్నాడుదయానికి మొక్క మొలిచింది. నెల్లాళ్లకి దానికో పువ్వు పూసింది. అతడు దాన్ని కొయ్యలేదు. మరో రెండు నెలల్లో అది కాయగా మారింది. అతడు దాన్నీ కొయ్యలేదు. మరో నెలకి అది పండుగా మారేక, దాంట్లో ఉన్న రెండు గింజల్నీ తీసుకున్నాడు. అలా నాలుగు నెలల్లో ఒక్క గింజ రెండు గింజలైంది. మరో నాలుగు నెలలోల్లో ఆ గింజలు నాలుగయ్యాయి. ఏడాది తిరిగేసరికి ఎనిమిది. ఆ గింజలు ఎన్నుంటే, అన్ని బంగారు కాసులొస్తాయి కాబట్టి వాటిని లక్షదాకా పోగు చెయ్యాలని అప్పటికి అతడి ఆశ. అతడా బంగారు కాసుల గురించి కలలు కంటూ, ప్రస్తుతానికి భుక్తికి పూర్తిగా తండ్రిపైనా అన్నపైనా, ఆధారపడి జీవిస్తున్నాడు.
కొండచిలువ ఈ కథ చెప్పి, “బైరాగి ప్రవర్తన నాకు విడ్డూరంగా ఉంది. సాత్వికుడైన జక్కన్నకు వెండి కాసులు మాత్రమే దక్కేలా చేసి, స్వార్థపరుడైన సూరన్నకి లక్షల బంగారు కాసులు దక్కేలా ఎందుకు చేశాడు? తెలిస్తే నా ఈ సందేహానికి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.
దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “సూరన్నకి సహనం తక్కువ. బైరాగి అతడికి సహనం నేర్పాలనుకున్నాడు. అందుకే లక్షల కాసులు కూడబెట్టడానికి ఏళ్ల తరబడి ఎదురుచూసేలా చేశాడు. ఐతే ఫలానికైనా ప్రతిఫలానికైనా రాసిపెట్టి ఉండాలని కూడా బైరాగి అన్నాడు. ఐతే నుదుటివ్రాతని రాసేది విధాత కాదు. మనిషి మనస్తత్వమే ప్రతిఫలాన్ని నిర్ణయిస్తుంది. అవకాశాలు అన్నివేళలా రావు. వచ్చినప్పుడు దాన్ని చక్కగా ఉపయోగించుకూవాలంటే – కొంత శ్రమ పడాలి. కొంత స్వార్థాన్ని వదలాలి. కొంత మంచిని చూపాలి. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ కూడదు. ఇవన్నీ ఉన్న జక్కన్న తనకొచ్చిన అవకాశంతో సుఖంగా జీవిస్తున్నాడు. ఆ లక్షణాలు లేని సూరన్న వచ్చిన అవకాశాన్ని బంగారానికి బదులు, బంగారాన్నిచ్చే గింజల్ని కూడబెట్టడానికే వాడుతూండడంవల్ల అతడికీ, ఇతరులకీ కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఆశైనా, అధికారమైనా అతిగా మారితే – జరిగేదంతే!” అన్నాడు.
అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.
(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 17వ కథ)