కరనాగభూతం కథలు – 17 రాజయ్య మోసం

0
2

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడి కోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! ఏ రాజైనా కొత్త సిద్ధాంతాన్ని అమలు చేసేముందు ఆకర్షణీయమైన మార్పులు ప్రవేశపెడతాడు. అవి శాశ్వతంగా ఉంటాయా అని అనుమానం పుడుతుంది రాజయ్య చేసిన మోసం గురించి తెలిస్తే! ఆ కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.

అనగా అనగా చిత్రపురి రాజ్యం. అక్కడ ప్రజలే రాజును ఎన్నుకుంటారు. రాజు కావాలనుకున్నవాళ్లు ప్రజల మధ్యకు వెళ్లి, రాజుని చేస్తే ప్రజలకు తామేం చేసేదీ చెబుతారు. అలా రాజైనవాడు ఐదేళ్లపాటు పరిపాలన చేసేక కొత్త రాజు కోసం మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. చేసిన వాగ్దానాలు నిలబెట్టుకున్నట్లు ప్రజల్ని ఒప్పించగలిగితే పాత రాజే మళ్లీ ఎంపికౌతాడు. లేదూ కొత్తరాజు వస్తాడు. ఐతే ప్రజల్ని మెప్పించడానికి వాగ్దానాలు నిలబెట్టుకోవాలనేం లేదు. ప్రజల్ని మాటలతో మెప్పించే చాతుర్యముంటే చాలు. అలాంటివాళ్లు ఆ రాజ్యంలో ఏకకాలంలో ఎప్పుడూ ముగ్గురికంటే లేరు. ఆ ముగ్గురు కానీ, వారి వంశంవారు కానీ రాజులు కావడం అక్కడ రివాజు.. అలా ఇప్పుడు చిత్రపురిని ఏలుతున్నది సమరసేనుడు. ఆయన యుద్ధపిపాసి. తరచుగా ఏదో దేశంతో యుద్ధాన్ని ప్రకటిస్తూండేవాడు.

చిత్రపురి సైన్యంలో రాజయ్య అనే సైనికుడున్నాడు. ఆయన వీరుడే కానీ శాంతికాముకుడు. సమరసేనుడి యుద్ధాలు న్యాయమైనవి కావనీ, ప్రజలు వాగ్దానాల గురించి నిలదియ్యకుండా మభ్యపెట్టడానికేనని అనిపించిన అతడు రాజు కొలువు వదులుకున్నాడు. తన భార్య, ఇద్దరు కొడుకులతో చిత్రపురి నగరంలోనే స్థిరపడి. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ భుక్తికి లోటు లేకుండా గడుపుతున్నాడు. ఆయన చిన్నకొడుకు కృష్ణయ్య సమర్థుడు. తండ్రిమీద ఆధారపడకుండా పెళ్లాం పిల్లలతో వేరే వెళ్లి ఉంటున్నాడు. అతడు వేరుపడ్డానికి కారణం, అన్న అంబయ్య. అంబయ్య చూడ్డానికి రాజకుమారుళ్లా ఉంటాడు కానీ పొట్టకోస్తే అక్షరం ముక్క రాదు. ఎంత కష్టమైన పనైనా చెయ్యగలనంటాడు కానీ ఎప్పుడూ వళ్లొంచకపోవడంవల్ల అందుకు దాఖలాలు లేవు. అన్నింటికీ తండ్రిమీదే ఆధారపడ్డంవల్ల, పాతికేళ్లొచ్చినా వాడికింకా పెళ్లి కాలేదు. అర్థాంతరంగా తండ్రికేమైనా ఐతే – వాడి భారం తనమీద పడుతుందని కృష్ణయ్య భయం. తను లేకపోతే అంబయ్య ఎలా బ్రతుకుతాడా అన్నది రాజయ్య చింత.

చిత్రపురిలో ప్రతి ఆదివారం పెద్ద సంత జరుగుతుంది. అక్కడకు దేశం నలుమూలలనుంచీ రకరకాల వ్యాపారులొచ్చి, చిత్రవిచిత్రమైన వస్తువులు అమ్ముతారు. ఆ వస్తువులకి చుట్టుపక్కల పల్లెల్లో మంచి గిరాకీ ఉంది. అందుకని ఆ పల్లెల్లో ఉండే వ్యాపారులు నగరంలో తమ ప్రతినిధులను ఏర్పరచుకుని, వారివద్ద కొంత డబ్బుంచి వెళ్లేవారు. ఆ ప్రతినిధులు సంతకొచ్చిన సరుకుని గుత్తగా కొనేసి, పల్లెకు కబురు పంపేవారు. పల్లెవ్యాపారులా సరుకుని పల్లెకు తరలించి, లాభం పొందేవారు. ఆ లాభాల్లో తమ ప్రతినిధులకూ కొంత వాటా ఇచ్చేవారు.

మధుపురంలో కనకయ్య అలాంటి వ్యాపారి. చిత్రపురిలో అతడి ప్రతినిధి రాజయ్య. ఓసారి రాజయ్య కబురంపితే, సరుకు తెచ్చుకుందుకు నగరానికి బయల్దేరాడు కనకయ్య. చుట్టుదారిలో వెడితే రోజంతా పట్టే ఆ ప్రయాణానికి ఊరినానుకున్న అడవిలోంచి వెడితే, రెండు గంటలు చాలు. కానీ ఆ దారిలో దొంగల భయం ఉన్నది.

దగ్గర డబ్బేం లేదన్న ధైర్యంతో కనకయ్య అడవి దారినే ఎన్నుకున్నాడు. ఐతే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా చుట్టుదారిలో వెళ్లేవాళ్ల ద్వారా రాజయ్యకా విషయం కబురు కూడా చేశాడు.

అడవి దారిలో కనకయ్యని ఓ దొంగ అటకాయించాడు. ఎంత సోదా చేసినా ఆయన వద్ద చిల్లిగవ్వకూడా దొరక్కపోవడంతో దొంగకి ఉక్రోషమొచ్చింది. “రెండు నెలలుగా, దోచుకుందుకు మనుషులే దొరకడం లేదు. దొరికినవాళ్లవద్ద డబ్బుండడం లేదు. మా పూజారికి కులదేవత కలలో కనబడి – మా రాబడి బాగుండాలంటే, నరబలి కావాలంది. ఈసారి దొరికిన మనిషివద్ద డబ్బు దొరక్కపోతే, దేవతకు బలి ఇవ్వాలనుకున్నాం. నాల్రోజుల్లో వచ్చే పున్నమికి నిన్ను అమ్మవారికి బలిస్తాం” అని చెప్పి, కనకయ్యని తమ గూడేనికి తీసుకెళ్లాడు. ఇలా జరుగుతుందని ఊహించని కనకయ్య, తనకిక ఆయువు మూడినట్లేనని గ్రహించి రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు.

ఇదిలా ఉండగా కబురందింది కానీ, కబురు కంటే ముందు రావాల్సిన కనకయ్య రాకపోవడంతో రాజయ్య మనసు కీడు శంకించింది. ఆయన వీరుడు, సాహసి, పరోపకారి. అందుకని మారాలోచన లేకుండా కత్తి చేతబట్టుకుని, తన తెల్లగుర్రాన్నెక్కి అడవిలోకి వెళ్లాడు. కాసేపటికే ఓ దొంగ ఎదురైతే, వాణ్ణి క్షణాలమీద చిత్తు చేసి, కనకయ్య వివరాలడిగి, వాడి సాయంతోనే కనకయ్యని బంధించినచోటకి వెళ్లాడు. అక్కడ కనకయ్యకి నలుగురు దొంగలు కాపలా ఉన్నారు. రాజయ్య వారితో పోరాడుతూనే, కనకయ్యని బంధవిముక్తుణ్ణి చేసి, గుర్రం మీదెక్కించుకుని దౌడు తీశాడు. దొంగలు వాళ్లని తరిమారు కానీ, ఎంత పరుగెత్తినా గుర్రపు వేగాన్ని అందుకోలేకపోయారు.

రాజయ్య కనకయ్యని ఇల్లు చేర్చాడు. దొంగలతో గొడవలో రాజయ్యకు కొద్దిగా గాయాలయ్యాయి. గ్రామవైద్యుడు వచ్చి ప్రథమ చికిత్స చేసి, “ఈ రాత్రికి విశ్రాంతి అవసరం” అని చెప్పి వెళ్లాడు. ఆ రాత్రి రాజయ్య కనకయ్య ఇంటనే బస చేశాడు. భోజనాలయ్యేక ఇద్దరూ పక్కపక్కన మంచాలేసుకుని చాలాసేపు కబుర్లాడుకున్నారు. మాటల సందర్భంలో కనకయ్య, “రాజయ్యా! నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు. ఏమిచ్చినా నీ ఋణం తీర్చుకోలేను. ఐనా ఉడతాభక్తిగా నీకో మాటిస్తున్నాను. నీ పెద్దకొడుకు అంబయ్య గురించి నీకు బెంగ కదా! వాణ్ణి నా వద్దకు పంపు. జీవితాంతం భుక్తికి లోటు లేకుండా ఏర్పాటు చేస్తాను” అన్నాడు.

రాజయ్య నవ్వి, “మానవత్వంతో నీ ప్రాణాలు కాపాడాను. ఆ కృతజ్ఞతతో ఇలాగన్నావు కానీ నీకు మావాడి గురించి పూర్తిగా తెలియదు. తోడబుట్టిన తమ్ముడే వాణ్ణి భరించలేక దూరం పెట్టాడు. ఐనా నేనుండగా అంబయ్య భుక్తికే లోటూ ఉండదు” అన్నాడు.

రాజయ్య తన మాటలు నమ్మడం లేదనుకున్న కనకయ్య – మర్నాడు ఆయన ఊరిపెద్దల్ని పిలిచి, వారికి రాజయ్య తనను రక్షించిన కథ చెప్పి, “ఏమిచ్చినా ఈ రాజయ్య ఋణం తీరదు. ఐనా ఉడతాభక్తిగా ఈయన కుమారుడు అంబయ్య ఎప్పుడొచ్చినా, వాడి భుక్తికి ఏర్పాటు చేస్తానని మాటిస్తున్నాను. అందుకు మీరంతా సాక్షులు” అని తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నాడు.

దానికి రాజయ్య. “నీ అభిమానానికి సంతోషం. కానీ మాది వీరుల వంశం. ఏదీ ఆయాచితంగా స్వీకరించడానికి ఇష్టపడం. కాబట్టి నేటినుంచే అంబయ్యకి కాయకష్టంలో గట్టి శిక్షణ ఇస్తాను. ఎప్పుడైనా మా అంబయ్య నీవద్దకొస్తే, పనిలో పెట్టుకో కానీ ముందు వాణ్ణి పరీక్షించు. ఆ పరీక్ష మామూలుగా ఉండకూడదు. ఒక్క గంటలో పది గంగాళాల నీళ్లు తోడమను. ఒక్క రోజులో పదెకరాల పొలం దున్నమను. అలా చేస్తేనే పనిలోకి తీసుకో. పరీక్షించకుండా పనిలోకి తీసుకున్నావా, నా ఆత్మకు శాంతి ఉండదు” అన్నాడు. ఆ పరీక్షల్లో నెగ్గడం ఎవరికైనా అసాధ్యం కాబట్టి – కొడుకుని కనకయ్య వద్ద పనిలో పెట్టడం రాజయ్యకిష్టంలేదనుకున్నారు అక్కడున్నవారంతా.

ఈలోగా ఓ ఘోరం జరిగింది. తమపై దాడిచేసిన రాజయ్యమీద పగబట్టిన అడవిదొంగలు వెతుక్కుంటూ చిత్రపురానికొచ్చి, ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చి పారిపోయారు. రాజయ్య ప్రాణాలొదిలేముందు- భార్యని కృష్ణయ్య దగ్గర ఉండమన్నాడు. అంబయ్యతో, “మధుపురం వెళ్లి కనకయ్యని కలుసుకో. ఆయనే పరీక్ష పెట్టినా సంకోచించకుండా ఒప్పుకో. చనిపోయినా నా ఆత్మ నిన్ను వెన్నంటే ఉంటూ సాయపడుతుంది. నిన్నా పరీక్షల్లో నెగ్గిస్తుంది. ఒకసారి నువ్వు పనిలో చేరి స్థిరపడ్డాక, నా ఆత్మకు శాంతి లభించి పరలోకాలకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత నువ్వు నీ కాళ్లమీద నిలబడ్డం అలవాటు చేసుకోవాలి” అని కన్నుమూశాడు.

అంబయ్య మధుపురం వెళ్లి కనకయ్యని కలుసుకున్నాడు. “మీ నాన్నకి మాటిచ్చాను కాబట్టి, పరీక్షకు మాత్రమే ఈ కష్టమైన పనులు” అంటూ ఆయన వాడికి – గంటలో పది గంగాళాల నీళ్లు తోడే పని చెప్పాడు. తండ్రి ఆత్మ సాయంతో అంబయ్య ఆ పని అవలీలగా చేసి, ఆ మర్నాడే పదెకరాల మెట్టపొలాన్ని కూడా ఒక్కడూ దున్నేశాడు. ఈ విషయం ఊరంతా ప్రచారమైంది. ఊరిపెద్దలు అంబయ్యని పనిలో పెట్టుకుందుకు మేమంటే మేమంటూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. వాణ్ణి వాళ్లెక్కడ ఎగరేసుకుపోతారోనని కనకయ్యకి భయం కూడా వేసింది. ఆయన హెచ్చు జీతంమీద ఐదేళ్లపాటు తనింట్లో పని చెయ్యడానికి వాడితో ఒప్పందం చేసుకున్నాడు.

ఎందుకూ పనికిరాడని పేరుపడ్డ తనకోసం అంతమంది పోటీపడ్డం అంబయ్యకి కొత్తగా, గర్వంగా, సంతోషంగా అనిపించింది. వాడు కనకయ్యింట్లో పనిలో చేరేక తండ్రి ఆత్మ సహకారంతో కష్టమైన పనులకు కూడా పూనుకుని ఇట్టే చేసేవాడు. అందగాడు, పనిమంతుడు కావడంతో వాడికి పెళ్లి కూడా కుదిరింది. అంబయ్య మధుపురంలో ఓ ఇంటివాడుగా స్థిరపడ్డాడు. ఈ జీవితం వాడికెంతో బాగుంది.

కొన్నాళ్లకి రాజయ్య ఆత్మకు తృప్తి కలిగింది. “నేను పరలోకానికి వెళ్లిపోతున్నాను. ఇకమీదట కష్టమైన పనులకు పూనుకోకు. కనకయ్య కనుక అదేమని అడిగితే, ఒకసారి చిత్రపురిలో రాజు గురించి ప్రజలేమంటున్నారో తెలుసుకుని రమ్మను” అని అతణ్ణొదిలి వెళ్లిపోయింది.

కొండచిలువ ఈ కథ చెప్పి, “కనకయ్య ఏ షరతులూ లేకుండా అంబయ్యకు భుక్తి కల్పిస్తానంటే కాదన్నాడు రాజయ్య. తనే కఠినమైన షరతులు పెట్టమన్నాడు కూడా. అది స్వాభిమానం అనుకుందాం. మరి అంబయ్య పరీక్షలో నెగ్గడానికి ఆత్మగా తాను సాయపడ్డంవరకూ బాగుంది. ఆ తర్వాత ఆ ఆత్మ కొడుకుని వదిలి వెళ్లిపోతే, అంబయ్య మునుపటిలా పని చెయ్యలేడుకదా! అది మోసం కదా! ఆ మోసాన్ని జనం హర్షించరు కదా! స్వాభిమాని రాజయ్య అలాంటి మోసానికి ఎందుకు సిద్ధపడ్డాడు? తెలిస్తే నా ఈ సందేహానికి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “అంబయ్య సోమరి, అసమర్థుడు. తనపైన కృతజ్ఞతతో వాణ్ణి పనిలో పెట్టుకున్నా, తర్వాత కనకయ్య వాణ్ణి చీదరించుకుంటాడు. వాడు సమర్థుడని నిరూపించడానికే రాజయ్య ఆత్మ కొన్నాళ్లు వాడితో ఉంది. పనిమంతుడన్న పేరు రావడంతో పెళ్లి కుదిరి, జీవితం మారిపోడంతో అంబయ్య కూడా నెమ్మదిగా కష్టపడి పనిచెయ్యడానికి ఇష్టపడడం సహజం. అదీకాక అంబయ్య సోమరితనానికి రాజయ్య పితృప్రేమ కూడా ఒక కారణం. కనకయ్యది యజమాని ప్రేమ, అది పితృప్రేమలా ఉండదు. ఎల్లకాలమూ రాజయ్య ఆత్మ కొడుకుని అంటిపెట్టుకునుంటే, కనకయ్య మరీ కష్టమైన పనులు చెప్పడానికి అలవాటు పడిపోతాడు. ఆ ఆత్మ వెళ్లిపోయేక, అంబయ్య మామూలు మనిషి చెయ్యగల పనులు మాత్రమే చెయ్యగలడు. రాజయ్యపైన కృతజ్ఞతతో దానికి కనకయ్య సద్దుకుపోగలడు. అంతగా సద్దుకుపోకపోతే చిత్రపురి ప్రజలు ఉండనే ఉన్నారు. ఏ రాజైనా రాజు కావడానికి చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకోకపోవడం సహజమని వాళ్లనుకుంటారు. యథా రాజా తథా ప్రజా” అన్నాడు.

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 18వ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here