కరనాగభూతం కథలు – 19 పరమ శుంఠ

0
2

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడికోసం ఎదురు చూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! అధికార మున్నవాడికి సిద్ధాంతాలతో పనుండదనీ, తప్పు తనదే ఐనా, కోపం చెల్లుతుందనీ అంటారు. కానీ ఒకోసారి పరమ శుంఠ అనిపించుకున్న సామాన్యుడికీ అలాంటి అవకాశం రావచ్చునని పుంగవుడు నిరూపించాడు. నీకా కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.

అపూర్వదేశపు రాజు జితేంద్రుడి ఒక్కగానొక్క కొడుకు మహేంద్రుడు. అతడికి చిన్నప్పట్నించీ ఎదుటివాళ్లని ఎగతాళి చెయ్యడం సరదా. వాళ్లు మాటకి మాట బదులిచ్చారో అతడిలో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ క్షణంలో ఏమంటాడో ఏంచేస్తాడో అతడికే తెలియదు.

అది తప్పని తలిదండ్రులు చెప్పారు. మహేంద్రుడు వినలేదు సరికదా, వాళ్లకు తనంటే ప్రేమ లేదని భోరున ఏడ్చాడు. కన్నకొడుకుని ఏడ్పించలేక రాజు, రాణి, “యువరాజుకి కోపమెక్కువే కానీ, అది తాటాకు మంటలాంటిది. చప్పున చల్లారిపోతుంది” అని సమర్థించడం మొదలెట్టారు. రాజకుమారుడు కాబట్టి, రాజు కొలువులో ఉన్నవాళ్లు కూడా అతణ్ణి భరించడం అలవాటు చేసుకున్నారు.

ఈ లోపం పక్కన పెడితే- మహేంద్రుడు ఇరవైఏళ్లొచ్చేసరికే సకల శాస్త్రాలూ నేర్చాడు. యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. కానీ ఎదుటివారిని ఏడ్పించడంలో అతడి ధోరణిలో ఏ మార్పూ లేదు. అందుకే రాజు అతడికి రాజ్యం అప్పగించే విషయమై సందిగ్ధంలో పడి, మంత్రిని సంప్రదించాడు. అప్పుడు మంత్రి ఆయనకు సమీపారణ్యంలోని రామానంద యోగి ఆశ్రమం గురించి చెప్పి, “ఆయన మనిషి ప్రవర్తనను నియంత్రించడంలో నిపుణుడు. దేశదేశాలనుంచి రాకుమారులూ, ఉన్నతోద్యోగులూ శిక్షణకోసం అక్కడికొస్తారు. యువరాజుని ఓ ఏడాది శిక్షణకు అక్కడకు పంపడం మంచిది. అక్కడున్నవారు తనతో సమాన హోదాకలవారు కాబట్టి వాళ్లు మహేంద్రుడికి భయపడరు. తను భయపెట్టలేనివాళ్ల జోలికి యువరాజు వెళ్లడనే నా నమ్మకం” అన్నాడు.

రాజుకీ సలహా నచ్చింది. ఆయన కొడుకుని పిలిచి, “కుమారా! త్వరలో నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఈలోగా నీవు రాజైనవాడు బాధ్యతలనెలా నిర్వహించాలో తెలుసుకోవడానికి రామానందుడి ఆశ్రమానికి వెళ్లు. నువ్వు రాజు కావడానికి ఆయన మెప్పు అవసరం. అక్కడ ఆయన శిష్యులంతా, హోదాలో నీ సరివాళ్లు. కాబట్టి నీ ప్రవర్తనను అదుపు చేసుకోక తప్పదు” అని చెప్పాడు.

మహేంద్రుడికి విషయం అర్థమైంది. రాజు కావాలంటే ఆశ్రమానికి వెళ్లి రామానందుడి మెప్పు పొందాలి. కానీ ఎవర్నో ఒకర్ని ఎగతాళి చెయ్యకుండా, తనకి రోజు గడవదు. అక్కడున్నవాళ్లెవ్వరూ తనని భరించి ఊరుకోరు. యోగికి ఫిర్యాదు చేస్తారు. అలా జరక్కూడదంటే తన ప్రవర్తన మార్చుకోవాలి. లేదా, తనేమన్నా భరించి, యోగికి ఫిర్యాదు చెయ్యని మనిషిని కూడా తీసుకెళ్లాలి. అందుకని అతడు తనతో పాటు ఆస్థానపండితుడి కుమారుడు పుంగవుణ్ణి కూడా శిక్షణకు తీసుకెడతానన్నాడు.

పుంగవుడిదీ మహేంద్రుడి వయసే. విద్యలో తండ్రి అంతటి పండితుడు. ఐనా మహేంద్రుడు అప్పటికి పలుమార్లు తనని వేధిస్తే చేసేదిలేక పడి ఊరుకున్నాడు. వీలైనంతవరకూ అతణ్ణి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడతడికి సహచరుడిగా వెళ్లాలంటే అతడి గుండె గుభేల్మంది. కానీ రాజాజ్ఞ. ఆపైన మహేంద్రుడు కాబోయే రాజు. తను కాబోయే ఆస్థానపండితుడు. నేడు కాకపోతే రేపైనా, రోట్లో తలపెట్టక తప్పదు. అదిప్పుడే చేస్తే తన భావి జీవితం పట్ల సరైన అవగాహన ఏర్పడుతుందనుకుని అతడు సరేనన్నాడు.

రామానందుడి ఆశ్రమంలో మహేంద్రుడి ఆగడానికి దొరికిన ఒకేఒక్కడు పుంగవుడు. ఇక రెచ్చిపోడూ! వెడుతూనే అతడు మిగతా శిష్యులకి పుంగవుణ్ణి పరిచయం చేస్తూ, “ఇతడి పేరు పుంగవుడు. మహాపండితుడు. కానీ అక్కడ మేమంతా పరమశుంఠ అని పిలుస్తాం. ఎందుకంటే పండిత పుత్రః పరమశుంఠ అని సామెత ఉందికదా! ఇతడు మా ఆస్థాన పండితుడి పుత్రుడు” అన్నాడు.

ముందు అంతా ఘొల్లుమన్నారు. తర్వాత ఒక శిష్యుడు నెమ్మదిగా, “సామెతని పక్కనపెట్టు. ఇంత చిన్నవయసులోనే మహా పండితుడైన పుంగవుణ్ణి పరమశుంఠ అనడం సబబుగా లేదు” అన్నాడు. దానికి మహేంద్రుడు నవ్వి, “జామచెట్టుకి కాసినవి జాంపళ్లు ఐతే, జాంపళ్లు కాసేది జామచెట్టే కదా! అలాగే పండిత పుత్రుడు పరమ శుంఠ ఐతే – పరమ శుంఠ పండిత పుత్రుడని అర్థం. మా పుంగవుడికి పితృభక్తి ఎక్కువ. తనని పండితుడిగాకంటే పండితపుత్రుడిగానే గుర్తించమని అడిగి మరీ అలా పిలిపించుకుంటున్నాడు. మీరూ అలా పిలిస్తేనే తనకి సంతోషం. ఎటొచ్చీ గురువుగారికీ విషయం చెప్పొద్దన్నాడు. కావాలంటే అతణ్ణే అడగండి” అన్నాడు.

మహేంద్రుడి మాట కాదంటే జరిగే పరిణామాలు తెలిసిన పుంగవుడు ఏమనలేక నవ్వి ఊరుకున్నాడు. నాటినుంచీ ఒక్క మహేంద్రుడే కాక, ఆశ్రమంలో శిక్షణ పొందుతున్న శిష్యులంతా అతణ్ణి పరమశుంఠ అనేవారు. అలా పిలుస్తుంటే, అతడు మారుమాట్లాడకుండా పలికి, వినయంగా బదులివ్వడం వారికి చాలా వినోదంగా ఉండేది. ఈ వేధింపుకి పుంగవుడు పైకి నవ్వుతూనే కనబడ్డా మానసికంగా చాలా క్షోభ అనుభవించేవాడు. ఇప్పుడే ఇలాగుంటే, మున్ముందు మహేంద్రుడి ఆస్థానంలో పండితుడుగా ఉండడం ఎంత నరకమో అని అలోచనలో పడ్డాడు కూడా. దాంతో తగిన సమయం చూసి మహేంద్రుణ్ణి దెబ్బతియ్యాలన్న కోరిక కూడా క్రమంగా అతడిలో బలపడింది.

త్వరలోనే పుంగవుడికి అలాంటి అవకాశం వచ్చింది. రామానందుడు – శిక్షణ పూర్తి కావస్తున్న కొందరు శిష్యులకి క్లిష్టమైన ఓ సంస్కృత శ్లోకం చెప్పి, “రేపుదయానికల్లా దీనర్థం చెప్పినవారికి శిక్షణ పూర్తయినట్లే” అన్నాడు. దాంతో శిష్యులంతా నిఘంటువులు ముందేసుకుని కూర్చుని శ్లోకార్థంకోసం తంటాలు పడసాగారు. పండితుడైన పుంగవుడొక్కడికే, గురువు చదివినప్పుడే శ్లోకార్థం తెలిసిపోయింది.

మహేంద్రుడికి నిఘంటువులు చూసి శ్లోకార్థాన్ని గ్రహించేటంత సహనం లేదు. కానీ పుంగవుడికి తనకంటే ముందే శిక్షణ పూర్తయితే భరించలేడు. అందుకని అతడు పుంగవుణ్ణి కలుసుకుని, మాటలతో మంచి చేసుకుని, సాయమడిగాడు. పుంగవుడు సరేనని, ఓపికగా అతడికి శ్లోకార్థాన్ని వివరించి చెబుతుండగా- అలా వచ్చిన ఓ శిష్యుడది చూసి, “ఏం జరుగుతోందిక్కడ?” అనడిగాడు. అదే అవకాశమనుకున్న పుంగవుడు వెంటనే, “పరమ పరమ శుంఠకు శ్లోకార్థం చెబుతున్నాను” అన్నాడు. ఈ జవాబుకి తెల్లబోయిన ఆ శిష్యుడు అంతలోనే, “అవున్లే! పరమ శుంఠ దగ్గర నేర్చుకునేవాడు పరప పరమ శుంఠే కదా!” అని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.

కానీ అంతవరకూ అలాంటి ఎదురు సమాధానం ఎరుగని మహేంద్రుడికి అంతాఇంతా అనలేని కోపమొచ్చింది. అతడు వెంటనే, “ఆశ్రమంలో ఉండి బ్రతికిపోయావు. ఈరోజునుంచీ నువ్వెవరో నేనెవరో! ఆశ్రమం విడిచేక మళ్లీ నీ మొహం చూపించకు. చూపించావో ఏంచేస్తానో నాకే తెలియదు” అని అక్కణ్ణించి వెళ్లిపోయాడు. తర్వాత పుంగవుడు తప్ప – శిక్షణ పూర్తయిన శిష్యులు ఎవరి దేశాలకి వాళ్లు వెళ్లారు. మహేంద్రుడు అపూర్వదేశానికి వెళ్లి రాజయ్యాడు. అతడు పుంగవుడికీ తనకీ మధ్య జరిగిన గొడవని ఆస్థానపండితుడికి చెప్పి, “కోపంలో ఏదో అన్నాను. ఎక్కడికెళ్లాడో తెలియదు కానీ, పుంగవుడు నాతో రాలేదు. వస్తే ఆస్థాన పండితుడి పదవి అతడికే ఇస్తానని కబురు చెయ్యండి” అన్నాడు. కానీ కబురు చెయ్యడానికి ఆస్థానపండితుడికి కొడుకు పత్తా తెలియలేదు.

పుంగవుడు అంతవరకూ తానెరుగని ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ పండితసభల్లో ప్రసంగాలు చేసి, తన ప్రతిభాపాటవాలు ప్రదర్శించి ఏదాదిలోనే మంచి పేరు తెచ్చుకుని అక్కడే స్థిరపడ్డాడు. అతడి ప్రతిభ గురించి విని వివిధ దేశాలనుంచి అతడికి ఆహ్వానాలు వచ్చాయి. అలా పుంగవుడు అనేక దేశాలు తిరిగాడు కానీ – తలిదండ్రుల్ని చూడ్డానికి కూడా అపూర్వ దేశానికి వెళ్లలేదు. ఐతే మరికొంతకాలం గడిచేక తలిదండ్రుల్ని తనతో వచ్చి ఉండమని కబురంపాడు.

ఆ కబురందుకున్న ఆస్థాన పండితుడికి – మహేంద్రుడు తనకి చేసిన అవమానాన్ని పుంగవుడు మర్చిపోలేదని గ్రహించాడు. ఆయన అతడికి, “నాయనా! జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అన్నారు. నాకు స్వదేశంలోనే ఉండాలనుంది. ఇక మహేంద్రుడంటావా, అతడి తత్వం చిన్నప్పట్నించీ తెలిసిందే! రామానందుడి ఆశ్రమానికి వెళ్లొచ్చేక, ఇతరుల్ని ఆటపట్టించే అలవాటు పోయింది. ముక్కుమీద కోపం ఇంకా ఉంది కానీ- అది తాటాకు మంటలాంటిది. నీతో జరిగిన గొడవని అతడెప్పుడో మర్చిపోయాడు. నువ్వు స్వదేశానికి తిరిగిరా. మనమంతా ఇక్కడే కలిసుందాం” అని కబురు పంపాడు. పుంగవుడా కబురందుకుని, “నాకు మాతృభూమి అంటేనే కాదు, మన రాజన్నా గౌరవముంది. నాకోసారి ఆయన్ని కలుసుకుని మాట్లాడాలని కూడా ఉంది. కానీ మీ మాట మీద అక్కడికి రాలేను. ఆయన స్వయంగా కబురంపితేనే అక్కడికి రాగలను” అని స్పష్టం చేశాడు. అది తెలిసిన మహేంద్రుడు, “తీరా, నేను కబురు పంపేక తను రానంటే అది నాకు అవమానం. అందుకే తటపటాయిస్తున్నాను” అని పుంగవుడి తండ్రికి చెప్పాడు.

ఏ కళనున్నాడో మహేంద్రుడందుకు ఒప్పుకుని, పుంగవుణ్ణి స్వదేశానికి ఆహ్వానిస్తూ రాజముద్రిక ఉన్న లేఖను పంపాడు. లేఖ అందిన తక్షణం పుంగవుడు బయల్దేరి వెళ్లి మహేంద్రుణ్ణి కలుసుకున్నాడు. మహేంద్రుడేదో అనేలోగా అతడు, “రాజా! ఆశ్రమంలో ఉండగా నిన్ను నేను పరమ పరమ శుంఠ అన్నాను. అపరిపక్వమైన ఆ ప్రవర్తన నన్ను చాలా బాధ పెట్టింది. అప్పట్నించీ నీకు క్షమార్పణ చెప్పుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. నీవల్ల నేడది లభించింది. ధన్యవాదాలు” అన్నాడు.

కొండచిలువ ఈ కథ చెప్పి, “పుంగవుడు దేశమంటే గౌరవమంటాడు. దేశం వదిలి వెళ్లాడు. రాజంటే గౌరవమంటాడు. ఆయనకు క్షమార్పణ్ చెప్పడానికి కూడా ఆయన పిలిస్తేనే వెడతాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నానంటాడు. అది రాజే ఇవ్వాలా, తనే తీసుకోవచ్చుగా! అతడి ప్రవర్తన వింతగా, అర్థరహితంగా లేదూ? తెలిస్తే నా ఈ సందేహానికి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “పుంగవుడి దేశభక్తినీ, రాజభక్తినీ ఏమాత్రం శంకించనవసరం లేదు. మహేంద్రుడతణ్ణి మొహం చూపించొద్దన్నాడు. దాన్నతడు రాజాజ్ఞగా స్వీకరించాడు కాబట్టే, మళ్లీ రాజే స్వయంగా ఆ ఆజ్ఞని వెనక్కి తీసుకునే దాకా- తన తలిదండ్రుల్ని కలుసుకుందుకు కూడా దేశానికి వెళ్లలేదు. తను మహేంద్రుడి తప్పు ప్రసక్తి తేకుండా, తన తప్పుకి క్షమార్పణ చెప్పడం – రాజు పట్ల అతడి గౌరవాన్ని తెలియజెయ్యడమే కాదు – మహేంద్రుడు తను చేసిన తప్పుని ఎలా దిద్దుకోవాలో పరోక్షంగా సూచించాడు కూడా. పుంగవుడి ప్రవర్తనలో సంస్కారం, సంప్రదాయం, వివేకం ఉన్నాయి” అన్నాడు.

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 20వ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here