కరనాగభూతం కథలు – 20 వెండిపళ్లెం మనసు

0
2

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడి కోసం ఎదురు చూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! ప్రవర్తనని బట్టి మేధావులెవరో, మతిలేనివాళ్లెవరో తెలుసుకోవడం కష్టం. ప్రజాక్షేమం కోరే రాజుగా నీకా విషయం తెలియడానికి వీరబత్తుడి కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.

ఒకప్పుడు ప్రఫుల్ల దేశంలో దొంగల భయం ఎక్కువైంది. ప్రతి ఊళ్లోనూ దొంతగనం జరిగినట్లు రోజుకో ఫిర్యాదొస్తోంది, కానీ ఒక్క దొంగా దొరకలేదు. దాంతో దొంగలకు జనం మద్దతు కానీ ఉన్నదా అన్న అనుమానం కలిగింది రాజు జయసేనుడికి. ఆయన తనకు బాగా నమ్మకస్థుడైన కాముడు అనే చారుణ్ణి అ విషయం తెలుసుకుందుకు నియోగించాడు. కాముడు దేశం నలుమూలలా తిరిగొచ్చి, “ప్రభూ! దొంగలకి జనం మద్దతున్నదని మనమనుకుంటున్నామా! మన కొలువులో కొందరు అధికారులు దొంగలతో కుమ్మక్కయ్యారని జనం అనుకుంటున్నారు. తమరా అధికారుల్ని గుర్తించి హెచ్చరిస్తే, దొంగతనాలు ఆగిపోతాయని వారి భావన” అన్నాడు.

రాజ్యంలో నేరాలు జరక్కుండా చూసే బాధ్యత కొత్వాలు బహురూపుడిది. కాముడి మాట విన్న రాజు వెంటనే బహురూపుణ్ణి పిలిచి, “దేశంలో దొంగతనాల గురించి రోజూ ఫిర్యాదులొస్తున్నాయి. నువ్వేం చేస్తున్నట్లు? నీకు నాలుగే రోజులు గడువిస్తున్నాను. దేశంలో దొంగతనాలు ఆగిపోవాలి. లేదూ, నిన్ను పదవిలోంచి తొలగించి, చెరసాలలో ఉంచుతాను” అన్నాడు కోపంగా.

నాలుగెందుకూ, మూడ్రోజుల్లోనే- దేశంలో దొంగతనాల గురించిన ఫిర్యాదులు పూర్తిగా ఆగిపోయాయి. ఆ వెంటనే బహురూపుడు రాజుని కలుసుకుని, “తమరు నన్ను హెచ్చరించేకనే దొంగతనాలు ఆగిపోయాయని, తమకు నాపై అనుమానంగా ఉండొచ్చు. కానీ తమకో విషయం మనవి చేస్తాను. మొక్కలు భూమిలోని సారాన్ని తీసుకుని – ఆకులు, పూలు, పళ్లు తయారు చేస్తాయి. అందుకు నీళ్లెంత అవసరమో, ఎండ కూడా అంతే అవసరం. నేను మొక్కలాంటివాణ్ణి. ఉద్యోగం నాకు మట్టి, నీరు వంటిది. తమరు సూర్యుడు. తమ హెచ్చరికలు సూర్యకాంతి. ఇంతే, నేను చెప్పగలిగింది” అన్నాడు. ఇది విన్న జయసేనుడు, “ఇలా చెప్పడాన్ని, ముందరి కాళ్లకు బంధమెయ్యడమంటారు. ఐతే ఓ విషయంలో జాగ్రత్తగా ఉండు. దేశంలో మళ్లీ దొంగతనాలు మొదలైతే, సూర్యకాంతి ఈసారి మండుటెండగా మారి, నిన్ను మలమల మాడ్చేస్తుంది” అని హెచ్చరించి పంపేశాడు.

తర్వాత ఏడాది గడిచినా దేశంలో దొంగతనాలకు సంబంధించిన ఫిర్యాదు ఒక్కటైనా లేదు. అందుకెంతో సంతోషించిన జయసేనుడు రాణికి జరిగిందంతా చెప్పి, “రాజు అదుపు చేస్తేనే, అధికారులు సమర్థులై పౌరులకు మేలు జరుగుతుంది” అని గర్వంగా చెప్పాడు. దానికి రాణి, “చారుడి ద్వారా జనవాక్యం తెలిసేకనేకదా, మీరీ విషయం గ్రహించారు! కాబట్టి సమర్థుడైన రాజు ఎప్పటికప్పుడు జనవాక్యం తెలుసుకోవాలి. దొంగతనాలు ఆగిపోవడం విషయంలోనూ తమరు జనవాక్యం తెలుసుకోవాలి” అని బదులిచ్చింది.

జయసేనుడికి అది నిజమే ననిపించింది. ఇతే ఈసారి ఆయన చారుడికి బదులు తనే మారువేషంలో బయల్దేరాడు. ఆయన తన దేశసంచారాన్ని ముందుగా రాజధానితో ప్రారంభించాడు. అలా ఆయన నగరంలో తిరుగుతూ, మధ్యమధ్య ఎవరినైనా పలకరించి, “అయ్యా! నేను పరదేశిని. మీ రాజు జయసేనుడి పాలనలో ఎక్కడా దొంగతనాలే లేవని విన్నాను. అది నిజమేనా?” అని అడగసాగాడు. దానికి జనం, “ఆ విషయం మమ్మల్నడిగితే ఎలా తెలుస్తుంది? నేరశిబిరాలున్నాయి. అక్కడ అడిగి తెలుసుకో” అని చెప్పారే తప్ప, ఒక్కరూ జయసేనుడి గురించి గొప్పగా మాట్లాడలేదు.

ఏ నేరశిబిరంలోనూ ఒక్క ఫిర్యాదైనా నమోదు కాలేదన్న విషయం జయసేనుడికి తెలుసు. అందుకని ఆయన నగరమంతా తిరిగి ఎవర్నడిగినా ఒకే జవాబు పొందుతూ – సాయంసంధ్యవేళకి ఓ ఇంటిముందాగి, అప్పుడే అరుగుమీద కూర్చోబోతున్న వీరబత్తుడనే గృహస్థుని అదే ప్రశ్న వేశాడు. వీరబత్తుడు బదులివ్వకుండా, అరుగుమీద కూర్చుని, ఒడిలోంచి చిన్న మూట తీసి కింద పెట్టాడు. మూత విప్పితే – నాలుగు తాళపత్రాలు, ఓ ఘంటం ఉన్నాయి. వాటినోసారి కళ్లకి అద్దుకుని, మళ్లీ మూటగా కట్టాడు. ఆయనిలా మూట కట్టాడో లేదో, ఎక్కణ్ణించో ఓ దొంగ వచ్చి, ఆ మూట తీసుకుని పరుగెత్తాడు. వీరబత్తుడు, “దొంగ, దొంగ” అని కేకలు పెడుతూ వెంటబడ్డాడు. అంతవరకూ అదంతా విడ్డూరంగా చూస్తున్న జయసేనుడు తనూ అటు పరుగెత్తి, నాలుగు అంగల్లో వీరబత్తుణ్ణి దాటి వెళ్లి, దొంగని గట్టిగా పట్టుకున్నాడు. వీరబత్తుడు రాగానే దొంగ మూట ఆయనకిచ్చేశాడు. వీరబత్తుడు మూట అందుకుని, “నాది నాకు దొరికింది. ఇక అతణ్ణి వదిలిపెట్టెయ్యి” అని రాజుకి చెప్పాడు.

రాజు వెంటనే, “మూట దొరికిందని వదిలేస్తే, వీడు మరో దొంగతనం చెయ్యడని నమ్మకమేమిటి? ఇతణ్ణి నేరశిబిరంలో అప్పగిద్దాం” అంటుండగా, అక్కడికి ఆజానుబాహుడైన వ్యక్తి ఒకడు వచ్చి, “ఏం జరుగుతోందిక్కడ?” అనడిగాడు.

వీరబత్తుడు రాజువైపు తిరిగి, “అయ్యా! ఈయనే ఈ ప్రాంతపు నేరశిబిరం అధికారి. కడు సమర్థుడు. నేరాలేమైనా జరుగుతున్నాయేమో స్వయంగా తెలుసుకుందుకు, అప్పుడప్పుడు ఇలా బయటికొస్తుంటాడు” అని చెప్పాడు. తర్వాత అధికారితో, “అయ్యా! రోజూ ఇదే సమయానికి – నా ఇంటరుగుమీద కూర్చుని, విలువైన కొన్ని వస్తువుల్ని మూట కడుతుంటాను. ఎవడో ఒకడొచ్చి ఆ మూటని దొంగిలించడానికి ప్రయత్నించడం రివాజు. అందుకు నా అజాగ్రత్త కూడా కొంత కారణం. నా వస్తువులు గట్టివి కాబట్టి, అవి నాకు మళ్లీ దక్కుతున్నాయి. ఇదంతా తమకు తెలుసు. ఈ పరదేశికి తెలియదు. అందుకే పట్టుబడ్డవాణ్ణి నేరశిబిరంలో అప్పగించ మంటున్నాడు. ఇతడికి నేను నచ్చజెబుతాను. తమరు వెళ్లొచ్చు” అని వినయంగా చెప్పాడు. ఆ అధికారి హుందాగా నవ్వి వెళ్లిపోయాడు.

ఈ విచిత్ర ఘటనకు ఆశ్చర్యపడ్డ జయసేనుడు ఏదో అనబోగా, వీరబత్తుడు వారించి, “తర్వాత అన్నీ మీకు సవివరంగా చెబుతాను. ముందు వాణ్ణి వదిలిపెట్టండి” అన్నాడు. అయిష్టంగానే రాజా దొంగని వదిలిపెట్టాడు. వాడు తాపీగా అక్కణ్ణించి వెళ్లిపోయాడు.

వీరబత్తుడు జయసేనుణ్ణి ఇంటికి తీసుకెళ్లి మంచినీళ్లిచ్చి దాహం తీర్చి తన కథ చెప్పాడు: వీరబత్తుడిది పండితవంశం. అతడి ఘంటం తాతగారినుంచి, తండ్రికీ, తండ్రినుంచి అతడికీ వారసత్వంగా సంక్రమించింది. కొన్నేళ్లుగా అతడు ఘంటాన్నుపయోగించి తాళపత్రాలపై ఒక్క అక్షరమైనా వ్రాయలేదు. విసిగిపోయి వాటిని వదుల్చుకోవాలనుకున్నాడు. అలాగని ఎవరికీ ఇవ్వలేడు. కావాలని పారేయలేడు. అందుకని రోజూ సాయంసంధ్యవేళ ఇంటరుగుమీద కూర్చుని, చూసేవారికి ఖరీదైన వస్తువులన్న భ్రమ కలిగేలా ప్రవర్తించి, వాటిని మూట కడుతున్నాడు. ఏ దొంగైనా వాటిని కాజేయడానికి వీలైనంత అజాగ్రత్తగా ఉంటున్నాడు. దొంగ వెంటబడ్డం కూడా అతడి నటనే! కానీ ఏం లాభం- ఇంతవరకూ ఏ దొంగా వాటిని కాజెయ్యలేకపోయాడు. ఈరోజు కూడా వాటిని జయసేనుడు కాపాడేడు.

“ఈరోజుతో నాకు జ్ఞానోదయమైంది. ఆ ఘంటం, తాళపత్రాల ద్వారా నానుండి ఏదో ఘనకార్యం జరగాలని ఉంది. అదీకాక అవి నాకు పెద్దలనుంచి వారసత్వంగా లభించిన గొప్ప సంపద. ఇక మీదట ఇలా చెయ్యకూడదని నిర్ణయించుకున్నాను” అన్నాడు వీరబత్తుడు.

తనలో మంచి మార్పు తెచ్చినందుకు కృతజ్ఞతగా, వీరబత్తుడు రాజుకి ఆ రాత్రి గొప్ప విందు చేశాడు.

అపూర్వమైన ఆ ఆతిథ్యానికి జయసేనుడు చాలా ఆనందపడి, “మహానుభావా! జీవితంలో మర్చిపోలేని విందునిచ్చావు. నీ మాటలు వింటుంటే, నువ్వు చేసే సాహిత్యపు విందు ఇంకా గొప్పగా ఉంటుందనిపిస్తోంది. త్వరలోనే నువ్వు ఘంటం పట్టాలనీ, మహాకావ్యాలతో తాళపత్రాలు నింపాలనీ నా కోరిక. అందుకు నా వంతుగా నేనేం చెయ్యాలో అడుగు. నా శక్తికి మించినదని సంకోచించక, నీకేం కావాల్సినా అడుగు. నీ పెద్దల దీవనలతో, నీ ఘంటం నీకు దక్కినట్లే, నావల్ల ఆ కోరికా నెరవేరొచ్చు” అన్నాడు.

వీరబత్తుడు తటపటాయించకుండా, “నాదొక్కటే కోరిక! నీవంటి అతిథులకు అజంతా శిల్పాలతో చెక్కిన ప్రత్యేకమైన వెండిపళ్లెంలో భోజనం పెట్టాలని. ఆ పళ్లేలు ఈ నగరంలోని ప్రముఖ నగల వ్యాపారి మహాభాగ్యుడివద్ద మాత్రమే దొరుకుతాయి” అన్నాడు.

చిత్రమైన ఈ కోరికకు ఆశ్చర్యపడినా, వీరబత్తుడి కోరిక తీర్చాలనుకుని పరదేశి వేషంలోనే మర్నాడు మహాభాగ్యుణ్ణి కలిసి అలాంటి వెండి పళ్లేల గురించి అడిగి, ఎంత ధరకైనా వాటిని కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. దానికి మహాభాగ్యుడు, “వెండిపళ్లేలపైన అలాంటి చిత్రకళ నేడు అసాధ్యం. పూర్వకాలానివి అలాంటివి నావద్ద నాలుగు పళ్లేలున్నాయి. కానీ అవి ఒక వ్యక్తి నావద్ద దాచుకున్నాడు. అందుకుగానూ నెలకో వరహా అద్దె కడుతున్నాడు. వాటిని అమ్మే హక్కు అతడికే కానీ నాకు లేదు” అన్నాడు.

“దాచుకున్న ఆ వ్యక్తి ఎవరో చెప్పండి. అడిగినంతా డబ్బిచ్చి అతణ్ణి ఒప్పిస్తాను” అన్నాడు జయసేనుడు. ఐతే ఆ వ్యక్తి వీరబత్తుడు అని తెలియగానే ఆయన మారుమాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోయాడు. తర్వాత ఆయన కొత్వాలు బహురూపిని పదవిలోంచి తొలగించాడు.

కొండచిలువ ఈ కథ చెప్పి, “వీరబత్తుడిది పండితవంశమైనా, తను పండితుడనిపించదు. పైగా మతిస్థిమితం లేనివాడనిపిస్తుంది. లేకుంటే – వస్తువు పోగొట్టుకుందుకు, దొంగల నాకర్షించడమెందుకు?. పట్టుబడ్డ దొంగని నేరశిబిరంలో అప్పజెప్పకుండా వదిలేసి మరిన్ని దొంగతనాలకు పాల్పడేలా చెయ్యడం నేరమవదా? ప్రత్యేకమైన వెండిపళ్లెంలో అతిథులకు విందు చేస్తానన్నవాడు, తనవద్దనున్న వెండి పళ్లేల్ని వేరే చోట దాచడమెందుకు? ఇక రాజు విషయం. ఆయనా వీరబత్తుడిలాంటివాడే అనిపిస్తుంది. లేకుంటే వీరబత్తుడు శిక్షార్హుడనీ, అబద్ధాలకోరు అనీ తెలిసి కూడా అతణ్ణి శిక్షించడానికి బదులు, కొత్వాలుని పదవినుంచి తప్పించడమెందుకు? తెలిస్తే నా ఈ సందేహాలకి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “వీరబత్తుడు మహాపండితుడు, మేధావి. జరిగిందాన్ని బట్టి – దేశంలో దొంగతనాలు నిజంగా ఆగిపోలేదనీ, ఫిర్యాదులు మాత్రమే ఆగేయనీ- అందుకు కొత్వాలు జనాల్ని భయపెట్టడమే కారణమనీ తెలుస్తోంది. ఆ విషయం పైకి అనడానికి కూడా జనం భయపడుతున్నారు. అందుకని వీరబత్తుడు పరోక్షంగా ఆ విషయం బయట పెట్టడానికి తన ప్రయత్నం తను చేస్తున్నాడు. కొన్నేళ్లుగా ఘంటం వాడ్డం లేదంటే – ఫిర్యాదులు వ్రాసే స్వతంత్రం లేదని. పట్టుబడ్డ దొంగని వదిలేస్తానంటే, వెంటనే ఒప్పుకోవడం నేరశిబిరాధికారి తప్పు. అదాయన బయటపెట్టాడు. వెండిపళ్లేలుండి కూడా, వాటిలో భోజనం చెయ్యకుండా మహాభాగ్యుడివద్ద దాచుకున్నాడంటే- సామాన్యులకు దేశంలో దొంగల భయమున్నదని అర్థం. అతడు తేజస్సుని బట్టి ఆ పరదేశిని రాజుగా గుర్తించినా గుర్తించి ఉండొచ్చు. రాజు అతడి సూచనల్ని అర్థం చేసుకున్నాకనే కొత్వాలుని పదవినుంచి తొలగించాడు”

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 21వ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here