Site icon Sanchika

కరనాగభూతం కథలు – 25 దేవుడైన అధికారి

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడి కోసం ఎదురు చూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! సామాన్యజనాన్ని సేవించుకోవాలనే ఆశయమున్న జనకుడనేవాడికి, ఒక ఊరికి అధికారి అయ్యే అవకాశమొచ్చింది. ఐతే అధికారమున్నవారికి సామాన్యజనం విధేయులౌతారనీ, అందువల్ల కష్టనష్టాలొచ్చినా భరిస్తారనీ, తమకంటే అధికారులే ఎక్కువ ప్రయోజనం పొందినా పట్టించుకోరనీ – త్వరలోనే అతడికి తెలిసింది. ఐనా అతడు అధికారి కావాలని అనుకున్నాడు. అధికారంవల్ల కలిగే లాభనష్టాలు తెలుసుకుందుకు నీకా కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.

చిత్రపురం గ్రామంలో కొత్తరకం మహమ్మారి రోగమొచ్చింది. అధికారి జయంతుడు తీసుకున్న జాగ్రత్తలు, సమకూర్చిన సదుపాయాలతో ఆ రోగం తొందరగానే అదుపులోకొచ్చింది. కానీ అప్పట్నించీ గ్రామస్థులకి కాస్త ఎండ తగిలితే అలసట, నిస్త్రాణ. వాళ్లు పగలు పనిచెయ్యడం మానేశారు. అలా ఊరికి ఆదాయం తగ్గిపోవడంతో జయంతుడు ఎందరో వైద్యుల్ని సంప్రదించినా ఫలితం లేదు. ఒక వైద్యుడు మాత్రం, “ఇది మామూలు జబ్బు. ఈ ఊరి నేలలోనే పండిన నేరేడుపళ్లు తింటే నిస్త్రాణ పోయి కొత్త ఉత్సాహమొస్తుంది. ఐతే ఆ పండు సోమరులకు పనిచెయ్యదు. పండు తినేముందు- మండుటెండలో కనీసం రెండు గంటలసేపు శ్రమ చెయ్యాలి” అన్నాడు.

చిత్రపురంలో నేరేడు మొక్క ఒక్కటైనా లేదని జయంతుడు వాటినెక్కణ్ణించో తెప్పించి అక్కడ నాటిస్తే, ఊరి పొలిమేరలో నాటినదొక్కటే బ్రతికింది. అది ఎదిగి పళ్లు కాయడానికి నాలుగేళ్లైనా పడుతుందనీ, ఈలోగా పౌరులు సోమరులై, ఊరి ఆదాయానికి గండి పడరాదనీ భావించిన జయంతుడు- జనం పగలు పనిచేసి తీరాలని శాసించాడు. అది గ్రామస్థులకు పెద్ద ఇబ్బందిగా మారింది. చిత్రపురంకి అధికారి కావాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్న సుమంతుడికి అదో అవకాశంగా మారింది. ఎవరినైనా మాటలతో మెప్పించే నేర్పున్న అతడు రాజును కలిసి, జయంతుడి అసమర్థపాలనలో గ్రామస్థులకొచ్చిన ఇబ్బందుల్ని వివరించాడు. అతడి స్థానం తనకిస్తే, ఆ ఇబ్బందుల్ని తొలగిస్తానన్నాడు. రాజు సరేనని, చిత్రపురం పౌరుల కష్టాలు పోయేదాకా ఆర్థికసాయం కూడా చేస్తానన్నాడు.

సుమంతుడు చిత్రపురం అధికారి అయ్యాడు. వెంటనే అతడు పౌరులెవ్వరూ పగలు పని చెయ్యాల్సిన అవసరం లేదన్నాడు. వారి ఆరోగ్యం మెరుగయ్యేదాకా, నిత్యావసరాలు ఉచితంగా ఇస్తున్నాడు. శ్రమ లేకుండా కనీసావసరాలు తీరడంతో, జనానికతడు దేవుడైపోయాడు.

దండకారణ్యంలో జ్ఞానాక్షుడి గురుకులానికి ప్రపంచప్రఖ్యాతి ఉంది. రాజులు, వ్యాపారులు, ధనికులు, విద్యాలయాధికారులు – తమ దూతల్ని పంపి – తమ కొలువుల్లో నియామకాలకి తగినవారిని ఎంపిక చెయ్యమని జ్ణానాక్షుణ్ణి కోరేవారు. ఇటీవలే కేతవరం గ్రామానికి కొత్త అధికారి నియామకం కోసం జ్ఞానాక్షుడికి కబురొచ్చింది. అప్పుడు జ్ఞానాక్షుడికి కొద్ది రోజుల క్రితమే విద్యాభ్యాసం పూర్తి చేసిన జనకుడు గుర్తొచ్చాడు. ఎందుకంటే అతడికి నా అన్నవారు లేరు. తన విద్యని సామాన్యుల సేవకి ఉపయోగించాలన్నది అతడి ఆశయం. అధికారముంటే అహంకారం పుట్టి, సేవలకు ఆటంకం ఔతుందని అతడు గట్టిగా నమ్ముతాడని జ్ఞానాక్షుడికి తెలుసు. అందుకని, ముందు దూతని నెల్లాళ్ల గడువడిగాడు. తర్వాత జనకుణ్ణి పిలిచి, “సామాన్యుల్ని సేవించుకోవాలన్నది నీ ఆశయం కదా! అందుకు తగిన గ్రామం చిత్రపురం” అంటూ ఆ ఊరి వివరాలు చెప్పాడు.

జనకుడు వెంటనే, “గురువాజ్ఞ నాకు శిరోధార్యం. నేనక్కడి పౌరులకెలా సాయపడగలనో చెప్పండి” అన్నాడు. జ్ఞానాక్షుడు గంభీరంగా, “చల్లాపురంనుంచి వచ్చిన దూత ఒకడు వెనక్కి వెడుతున్నాడు. నిన్నతడు గుర్రంమీద తన ఊరు తీసుకెడతాడు.  ఒక రాత్రి అతడి ఇంట్లో విశ్రాంతి తీసుకో. మర్నాడుదయం స్నానం చేసి కాలినడకన బయల్దేరు. మిట్టమధ్యాహ్నానికి చిత్రపురం చేరతావు. ఊరి పొలిమేర చేరేదాకా చుక్క నీరైనా తాగకుండా ఉపవాసముండాలి. ఊరు చేరేక ఏంచెయ్యాలో నీకే తెలుస్తుంది” అన్నాడు.

జనకుడు సరేనని గురువు చెప్పినట్లే చేసి, చల్లాపురంనుంచి చత్రపురానికి బయల్దేరాడు. కాసేపటికే ఎండ తీవ్రమైంది. నెత్తి మాడుతుంటే, భుజమీది కండువాతో కప్పాడు. కాసేపటికి బాగా ఆకలేస్తే ఓర్చుకుని ముందుకి నడిచాడు. మరికాసేపటికి నీరసమొచ్చి అడుగెయ్యడం కష్టమైంది. ఐనా లేని ఓపిక తెచ్చుకుని ముందుకెడుతూంటే- మిట్టమధ్యాహ్నం వేళకి కాస్త దూరంలో ఓ చెట్టు కనబడింది. ఎలాగో ఓపిక తెచ్చుకుని ఒక్క పరుగున వెళ్లి ఆ చెట్టుకింద కూలబడ్డాడు. ఆయాసం తగ్గేక అటూఇటూ చూస్తే దగ్గర్లో ఇళ్లు కనబడ్డాయి. అదే చిత్రపురమని గ్రహించి లేచి నిలబడబోతే, ఓపిక చాలలేదు. కానీ సరిగ్గా అప్పుడే చెట్టునుంచి రెండు పళ్లు రాలి అతడి ఒడిలో పడ్డాయి. జనకుడికి ప్రాణం లేచివచ్చినట్లై, వెంటనే ఆ పళ్లని నోట్లో వేసుకుని చప్పరించాడు. వెంటనే దాహం కట్టేసింది. ఆకలి తగ్గింది. అలసట పోయి కొత్త ఉత్సాహం వచ్చింది. లేచి చూస్తే అదో నేరేడుచెట్టు. తను తిన్నవి నేరేడుపళ్లు. “ఓహో, జయంతుడు నాటించిన మొక్క పళ్లనివ్వడం మొదలెట్టిందన్నమాట. కానీ ఇవి మామూలు పళ్లు కావు. రెండే రెండు తినగానే నాలో ఇంత మార్పొచ్చింది. రోజూ తినే గ్రామస్థుల సమస్య ఈపాటికి తొలగిపోయి ఉంటుంది. ఇక వారికి నేను చెయ్యగల సేవ ఏముంటుంది?” అనుకుంటూ ఊళ్లోకెళ్లాడు.

ఆశ్చర్యమేమంటే, బయట ఎండ నిప్పులు చెరుగుతున్నా, అతడికి పండువెన్నెల్లా ఆహ్లాదకరంగా ఉంది. ఐతే ఆ వెన్నెల్ని ఆస్వాదించడానికి తను తప్ప వేరే జనాలెవరూ వీధిలో కనిపించలేదు. పైగా అన్నిళ్ల తలుపులూ మూసి ఉన్నాయి. కారణం తెలుసుకోవాలని అతడో ఇంటి తలుపు తడితే – తలుపు తెరుచుకుని నీరసంగా అడుగులేస్తూ ఓ యువకుడు బయటకొచ్చాడు. అతడు జనకుణ్ణి ఎగాదిగా చూసి, “నువ్వెవరో తెలియదు. కానీ మర్యాదస్థుడివనిపించదు. లేకపోతే, ఎండకి తాళలేక ఇంటిల్లపాదీ సోలిపోయి ఉన్నాం. ఇలాంటప్పుడు తలుపు తట్టి పిలిచి మమ్మలిబ్బంది పెడతావా?” అన్నాడు.

జనకుడు వెంటనే, “నీ మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. నేను మండుటెండలో చల్లాపురంనుంచి నడిచి ఈ ఊరొచ్చాను. ఎండ దెబ్బ. గొంతులో దాహం. కడుపులో ఆకలి. వంట్లో నీరసం. అలాంటి నేను ఈ ఊరి పొలిమేరలో ఉన్న నేరేడుచెట్టువి రెండే రెండు పళ్లు తింటే, అన్ని బాధలూ పోయాయి. ఎండ వెన్నెలయింది. అలాంటి దేవతావృక్షముండగా, నువ్వూ మీ ఇంట్లోవాళ్లూ – ఎండ భయంతో పట్టపగలు ఇంట్లో తలుపులేసుకుని పడుకోవడమేమిటి?” అన్నాడాశ్చర్యంగా. అంతే, ఆ యువకుడి మొహంలో చిరాకు కనిపించింది. “ఊరిచివర నేరేడు చెట్టా? అదే ఉంటే, మాకీ దుర్దశ ఎందుకు? నువ్వు జయంతుడి మనిషివని నాకు అనుమానంగా ఉంది” అన్నాడు.

జనకుడి ఆశ్చర్యానికి అంతు లేదు. ఎక్కణ్ణించో వచ్చిన తనకు కనబడ్డ నేరేడుచెట్టు, ఎన్నేళ్లుగానో ఇక్కడుంటున్న ఈ యువకుడికి ఇంకా కనబడలేదా? కనబడిందని అన్నవాళ్లు జయంతుడి మనుష్యులెందుకౌతారు? ఇందులో ఏదో తిరకాసుందనుకున్న జనకుడు అతడితో, “జయంతుడెవరో నాకు తెలియదు. నీకు నేరేడుచెట్టు చూపిస్తాను. ఆ పళ్లు తినిపించి నీకున్న ఎండ ఇబ్బంది పోగొడతాను“ అన్నాడు.

“ఇప్పుడొద్దు. ఎండ తగ్గేక సాయంత్రం వెడదాం” అన్నాడా యువకుడు. ఆ ప్రకారం సాయంత్రానికి ఆ యువకుడొక్కడే కాదు, ఇంకా చాలామంది అతడితో ఊరి పొలిమేరకు వెళ్లారు. జనకుడు నేరేడుచెట్టు చూపగానే ఆ యువకుడు ఫక్కున నవ్వి, “ఇదా! ఇది జామ చెట్టు. కాయలు చూస్తే తెలియడం లేదా? దీన్ని జయంతుడు నాటించాడు. దీని కాయ తిన్నామో, ఆ తర్వాత నేరేడు పళ్లు దొరికి తిన్నా కూడా మా జబ్బు తగ్గదు” అన్నాడు. అతడి మాటను అక్కడున్నవారందరూ సమర్థించారు.

విసిగిపోయిన జనకుడు, “మిమ్మల్ని వేరే గ్రామం తీసుకెళ్లి – ఏది నేరేడుచెట్టో, ఏది జామచెట్టో నిరూపిస్తాను” అన్నాడు.

“ఎక్కడికో ఎందుకు? నిన్ను మా అధికారి సుమంతుడివద్దకు తీసుకెడతాం. ఆయనేమంటే అదే మాకు వేదవాక్కు” అని గ్రామస్థులతణ్ణి సుమంతుడివద్దకు తీసుకెళ్లి విషయం చెప్పారు. జనకుడు జ్ఞానాక్షుడి శిష్యుడని తెలిసిన సుమంతుడతడికి వినయంగా నమస్కరించి, “నీకు చెప్పదగినవాణ్ణి కాను. కానీ ఈ గ్రామస్థులకి నేను దేవుణ్ణి. నేనేమంటే అదే వారికి ప్రమాణం. నీ నమ్మకానికి ఊళ్లో నీకు బస ఏర్పాటు చేస్తాను. ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్లుండు. ఊళ్లో ఒక్కరంటే ఒక్కరిచేత అ జామచెట్టుని నేరేడుచెట్టని చెప్పించు. నేనూ అది నేరేడుచెట్టని నమ్ముతాను” అన్నాడు. ఆ ప్రకారం జనకుడక్కడ నాలుగు రోజులున్నాడు. పొలిమేరలో ఉన్నది జామచెట్టు కాదనీ, నేరేడుచెట్టనీ ఒప్పుకున్నవారొక్కరు లేరు. జనకుడు తిరిగి గురుకులం చేరుకుని, గురువు నియోగించిన కేతవరానికి అధికారిగా వెళ్లాడు.

కొండచిలువ ఈ కథ చెప్పి, “జ్ఞానాక్షుడు జనకుణ్ణి చిత్రపురానికెందుకు పంపాడు? చిత్రపురవాసులు ఊరి పొలిమేరల్లోని నేరేడుచెట్టుని, జామచెట్టని ఎందుకు నమ్మారు? నేరేడుపండు సత్ఫలితాన్నిచ్చిందని జనకుడు చెప్పినా, కనీసం ప్రయత్నించాలని కూడా గ్రామస్థులు ఎందుకనుకోలేదు? జనకుణ్ణి గౌరవించే సుమంతుడు, పౌరుల శ్రేయస్సుకోసమైనా ఆ చెట్టు పళ్లనొకసారి తినమని పౌరుల కెందుకు చెప్పలేదు? అధికారులెలాగుంటారో స్పష్టంగా తెలిసేక కూడా, జనకుడు కేతవరానికి అధికారిగా ఎందుకెళ్లాడు? తెలిస్తే నా ఈ సందేహాలకి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “సుమంతుడు స్వార్థపరుడే కాక వివేకవంతుడు కూడా.. గ్రామాభివృద్ధికంటే – పదవిలో కొనసాగడం, డబ్బు కూడబెట్టడమే అతడి ముఖ్యాశయాలు. అవి తీరడానికి రెండు సూత్రాల్ని వాడుకున్నాడు: ఒకటి – అధికారంతో జనాల్ని నమ్మించడం అతిసులభం. రెండు – సామాన్యులకు అలాంటి అధికారిపై ఉండే భక్తిగౌరవాలు, నిజమైన సేవకులపై ఉండవు. ఈ వివేకంతోనే రాజుని మెప్పించి అధికారి అయ్యాడు. రాజిచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చెయ్యకుండా, అందులో స్వల్పమొత్తాన్ని పౌరుల కనీసావసరాలకి ఉచితంగా పంచుతూ, వాళ్లు తనని దేవుడనేటంత మెప్పు పొందాడు. మిగతా సొమ్మంతా తను స్వాహా చేస్తున్నాడు. ఎప్పటికీ సోమరులుగా ఉంటేనే పౌరులు తనకు కలకాలం విధేయులుగా ఉంటారని – నేరేడుచెట్టుని జామచెట్టు అన్నాడు. జయంతుడిపై దుష్ప్రచారం చేశాడు. జనకుడు స్వార్థపరుడు కాదు. అతడిలో సేవా గుణముంది.  అధికారం ప్రభావం తెలిస్తే – తనూ అధికారాన్ని చేపట్టి, సామాన్యులకు అసలైన సేవలు అందించే దేవుడౌతాడని జ్ఞానాక్షుడి నమ్మకం. అందుకే ఆయన జనకుణ్ణి చిత్రపురం పంపాడు. ఆ తర్వాత అంతా ఆయన అనుకున్నట్లే జరిగింది”

అప్పుడా కొండచిలువ, “రాజా! సరైన సమాధానమిచ్చి నా ఆకలి తీర్చావు. సంతోషం. కరనాగభూతం ప్రపంచాన్ని గడగడలాడించడానికి వెళ్లి ఇరవైఐదు రోజులయింది కదా! ఇరవయ్యారో రోజున ప్రపంచాన్ని సర్వనాశనం చెయ్యాలని చూస్తుంది. నివారణోపాయం చెప్పగల వెనలాంగ మహర్షిని కలవకుండా నిన్ను ఈ ఇరవైఐదు రోజులూ ఆపగలిగాను. నేటితో నా శక్తి ఐపోయింది. వెనలాంగుణ్ణి కలిసి భూతాన్ని అదుపు చేసే ఉపాయం తెలుసుకుందుకు నీకిక ఒక్క రోజే గడువుంది. ఈ ఒక్కరోజులో ప్రపంచాన్ని కాపాడ్డానికి ఏం చేస్తావో నాకు తెలియదు. కానీ నీకు నా శుభాకాంక్షలు” అని మాయమైంది.

పింగపాంగుడు నివ్వెరపోయి కాసేపు అక్కడే నిలబడిపోయాడు.

—0—

కరనాగభూతం ప్రారంభ కథ మరోసారి చదువుదామనుకునేవారు ఈ లింక్‍లో చదవచ్చు.

https://sanchika.com/karanaagabhootam-kathalu-intro-story/

(వచ్చే వారం ముగింపు కథ)

Exit mobile version