కరనాగభూతం కథలు – 5 అర్హత లేని కీర్తి

0
2

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడికోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! పాలకులు పౌరుల్ని దానధర్మాలతో ఆదుకుంటారు. పౌరులు పాలకుల్ని కృతజ్ఞతతో కీర్తిస్తారు. ఐతే అర్హత లేకుండా లభించే కీర్తి పుండై బాధించే ప్రమాదముంది. మరి అర్హత ఉన్నదీ లేనిదీ ఎలా తెలుస్తుంది? ఒకప్పుడు జయసేనుడనే రాజుకి అదే సమస్య వచ్చింది. నువ్వా కథ తెలుసుకోవాలి” అంటూ కథ చెప్పసాగింది.

అనగనగా విశ్వపుర దేశం. దానికి రాజు వీరసేనుడు. ఆయన ఎన్నో ఏళ్లు జనరంజకంగా రాజ్యపాలన చేసి ఎంతో పేరు తెచ్చుకున్నాడు.

ఆయన కుమారుడు జయసేనుడు రెండు పదుల వయసుకే సకల విద్యాపారంగతుడయ్యాడు. తర్వాతనుంచి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ, కాబోయే రాజుకి తగిన శిక్షణ పొందాడు. కొన్నాళ్లకి అతడికి అశ్వపుర రాకుమారి మిత్రవిందతో వివాహమైంది. వారిది అన్యోన్య దాంపత్యం.

వీరసేనుడికి స్వతహాగా రాజ్యకాంక్ష లేదు. వారసత్వంగా సంక్రమించిన సింహాసనాన్ని బాధ్యతగా స్వీకరించాడు. కొడుకులో రాజు కావడానికి తగిన అర్హతలు చేకూరాయన్న నమ్మకం కుదరగానే, ఆయన రాజ్యభారాన్ని జయసేనుడికి అప్పగించి, “అడవికి వెళ్లి అక్కడ తపస్సు చేసుకుంటూ, చివరి రోజులు గడపాలని నాకూ, మీ అమ్మకీ కోరిక. ఎప్పుడైనా అవసరం అనుకుంటే సలహాల కోసం నా వద్దకు రావచ్చు” అని చెప్పి సెలవు తీసుకున్నాడు.

జయసేనుడు తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ రాజ్యపాలన కొనసాగిస్తూ తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. ఐతే అతడు రాజైన ఆర్నెల్లకి దేశంలో శ్రీపురం గ్రామంలో పెద్ద గాలివాన వచ్చి చాలా ఇళ్లు కూలిపోయాయి. వాన తగ్గేక, కలిగినవారు తమ ఇళ్లను బాగు చేయించుకున్నారు. పేదవాళ్లలో కొందరికి వాళ్ల యజమానులో, బంధువులో, మిత్రులో కొంత సాయం చేసి అదుకున్నారు. విధనుడు అనేవాడు మాత్రం ఎవరి సాయం తీసుకునేందుకూ ఇష్టపడక, రాజధానికి వెళ్లి నేరుగా రాజును కలుసుకుని తన కష్టం చెప్పుకున్నాడు.

కొత్తగా రాజయ్యాడేమో జయసేనుడికి, జనంలో పేరు తెచ్చుకోవాలని తాపత్రయంగా ఉంది. అందుకని రాజ్యంలో అన్ని ప్రాంతాలవారి ఇక్కట్లు, అవసరాలు గురించి ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుంటున్నాడు. అలా అతడికి శ్రీపురం విశేషాలు మొత్తం తెలుసు.

జయసేనుడు విధనుడితో, “నా ప్రజలు కష్టాల్లో ఉంటే, ఆదుకోవడం నా బాధ్యత అనుకుంటాను. ఐతే నేను పురాణాల్లో దాతల్లా వెనకా ముందూ ఆలోచించకుండా అడిగినవారందరికీ దానాలివ్వను. మీ ఊరి గురించి మొత్తం సమాచారం నావద్ద ఉంది. ఎవరెవరికి ఏమేం అవసరమో నాకు తెలుసు. మీ ఊళ్లో మిగతావాళ్లకిలాగా కాక, నువ్వు వేరెవ్వరి సాయం తీసుకోకుండా నేరుగా నా వద్దకు రావడం నాకు నచ్చింది. నీకు నూరు వరహాలు ఇస్తున్నాను. ఆ డబ్బుతో ఇల్లు బాగు చేయించుకుని, మిగతా అవసరాలు కూడా గడుపుకో” అన్నాడు.

విధనుడు డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు. ఈ విషయం రాజ్యమంతటా ప్రచారమైంది. దాంతో రాజ్యంలో ఎక్కడెక్కడినుంచో జనం వచ్చి రాజుకి తమ ఇబ్బందులు చెప్పుకోసాగారు. వాళ్లవి నిజమైన అవసరాలని నిర్ధారించుకున్నాకనే అతడు వారికి తగిన సాయం చేసేవాడు.

క్రమంగా జయసేనుడికి దానకర్ణుడని పేరొచ్చింది. అలాంటి పేరు తన తండ్రికి కూడా రాలేదు. అందుకని అతడు ఎంతో మురిసిపోయి, ‘ఈ విషయం నా తలిదండ్రులకి తెలిస్తే ఎంత సంతోషిస్తారో’ అనుకున్నాడు.

ఐతే మురిసినంత కాలం పట్టలేదు. జయసేనుడికి కుడిచేతిమీద పుండు వేసింది. అది మామూలు వైద్యానికి లొంగలేదు. రాజవైద్యుడా పుండుని పలు విధాలుగా పరీక్షించాడు. చికిత్సకోసం వైద్యగ్రంథాలెన్నో తిరగేశాడు. రకరకాల కొత్త మందులు తయారు చేసి రాజుమీద ప్రయోగించాడు. ఫలితం కనబడలేదు.

పుండు సలుపు ఎక్కువై బాధ భరించలేక అవస్థ పడుతున్న అతణ్ణి చూసి మంత్రి మహానందుడికి జాలేసింది. “రాజా! మీ పుండు మామూలు వైద్యానికి లొంగేది కాదని తేలిపోయింది. దివ్యశక్తులున్నవారే దీన్ని నయం చెయ్యగలరు. ప్రస్తుతం మీ తలిదండ్రులు అడవిలో తపోదీక్షలో ఉన్నారు కదా! ఒకసారి వారిని కలుసుకుంటే మంచిది” అని సలహా ఇచ్చాడు.

పుండు సలుపు గురించే కాదు. రాజ్యపాలనలో తను తెచ్చుకున్న మంచిపేరు గురించి తలిదండ్రులకు చెప్పుకోవాలని జయసేనుడికి మహామనసుగా ఉంది. అందుకని అతడు అడవికి వెళ్లి తలిదండ్రుల్ని కలుసుకున్నాడు.

తనయుణ్ణి చూస్తూనే తల్లి ఆప్యాయంగా దగ్గరగా తీసుకుని, యోగక్షేమాలడిగింది. ఆ తల్లీ కొడుకుల మాటలు ముగిసేక, వీరసేనుడు అతణ్ణి, రాజ్యపాలన గురించీ, ప్రజాసంక్షేమం గురించీ ప్రశ్నలు వేశాడు.

“ప్రజలు సుఖంగా ఉన్నారు. రాజ్యపాలన మీరున్నప్పటికంటే ఇంకా మెరుగైంది. జనం నన్నెంతగా ఇష్టపడుతున్నారంటే, వారు నాకు దానకర్ణుడని బిరుదు కూడా ఇచ్చారు. ఎటొచ్చీ నేనే చేతిమీద పుండుతో యాతన పడుతున్నాను” అన్నాడు జయసేనుడు దిగులుగా.

వీరసేనుడు నవ్వి, “దానకర్ణుడన్న పేరు తెచ్చుకున్నావంటే, నువ్వు చాలా ఎక్కువగా కాయకష్టం చేస్తున్నావన్న మాట! చేతికి పుండు పడ్డాకనైనా నువ్వు కాయకష్టం మానుకోకుంటే, పుండు ఎలా మానుతుంది? అంతా స్వయంకృతం. పేరుకంటే ఆరోగ్యం ముఖ్యం నాయనా! ఆ మాత్రం తెలియదా?” అన్నాడు.

జయసేనుడు ఆశ్చర్యపోయి, “నేనేమిటి? కాయకష్టం చెయ్యడమేమిటి?” అన్నాడు.

“మరి కాయకష్టం చెయ్యకుండా, దానకర్ణుడని పేరొచ్చేటంతగా దానాలివ్వడానికి డబ్బెలా సంపాదించావు?” అన్నాడు వీరసేనుడు.

“నేను సంపాదించడమెందుకు? మన కోశాగారం నిండా బోలెడు డబ్బుంది కదా!” అన్నాడు జయసేనుడు ఆశ్చర్యంగా.

“ఆ డబ్బు నువ్వు సంపాదించింది కాదు. పన్నుల రూపంలో వసూలైన ప్రజాధనం” అన్నాడు వీరసేనుడు.

“కోశాగారంలో ఉన్నది ప్రజాధనం అని నాకు తెలుసు. కానీ అందులో ఒక్క వరహా కూడా నాకోసం ఖర్చు చెయ్యలేదు. అంతా ప్రజలకోసమే వెచ్చించాను” అన్నాడు జయసేనుడు గొప్పగా.

వీరసేనుడు నవ్వి, “ఈ పాటికి నీకు అర్థమయుండాలి. దానకర్ణుడన్న బిరుదే నీకు చేతిమీద పుండై బాధిస్తోంది. ఆ బిరుదుని వదులుకో. నీ చేతి పుండు మాయమౌతుంది” అన్న్నాడు.

జయసేనుడు ఉలిక్కిపడ్డాడు. స్వతహాగా తెలివైనవాడు కావడంతో అతడికి తండ్రి మాటల్లో అంతరార్థం అవగతమైంది. “నా కళ్లు తెరుచుకున్నాయి” అంటూ అతడు తలిదండ్రులవద్ద సెలవు తీసుకుని రాజ్యానికి తిరిగి వెళ్లాడు.

మంత్రి మహానందుడు అతణ్ణి ఆప్యాయంగా పలకరించి, “ప్రభూ! తమ తండ్రిగారు, మీ బాధ నివారణకు ఏమైనా ఉపాయం చెప్పారా?” అని ఆత్రుతగా అడిగాడు.

జయసేనుడు ఆయనతో, “ఆయనేం చెప్పలేదు. నేనే తెలుసుకున్నాను. ఇకమీదట నన్నెవ్వరూ దానకర్ణుడని పిలవకూడదనీ, పిలిచినవారు కఠినంగా శిక్షించబడతారనీ – దేశమంతటా చాటింపు వేయించండి” అని చెప్పాడు.

“అంటే ఇకమీదట ప్రజలు సాయానికి నేరుగా తమర్ని కలుసుకోరాదని కూడా చాటింపు వేయించమంటారా?” అనడిగాడు మంత్రి.

జయసేనుడు తల అడ్డంగా ఊపి, “అవసరంలో ఉన్నవారు ఎప్పటిలాగే నన్ను కలుసుకుని ప్రభుత్వ సహాయం పొందవచ్చునని కూడా చాటింపు వేయించండి. నన్ను దానకర్ణుడని అనడం మాత్రం నిషిద్ధం. అంతే!” అన్నాడు.

మంత్రి అలాగే చేశాడు. రాజంటే ఎంత ప్రేమాభిమానాలున్నా శిక్షకు భయపడి జనం అతణ్ణి దానకర్ణుడని అనడం మానేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకే అతడి చేతి పుండు మాయమైంది. తర్వాత జయసేనుడు విశ్వపురాన్ని ఎన్నో ఏళ్లు జనరంజకంగా పాలించి గొప్ప రాజుగా పేరుకెక్కాడు.

కొండచిలువ ఈ కథ చెప్పి, “వీరసేనుడు జయసేనుడికి ఏం చెప్పాడో, అందులో జయసేనుడికి ఏమర్థమయిందో నాకు తెలియలేదు. కోశాగారంలో డబ్బు తనకోసం వాడుకోక, ప్రజలకోసమే వాడిన జయసేనుణ్ణి ప్రజలు దానకర్ణుడని కీర్తిస్తే, అది అతడి చేతిమీద పుండై ఎందుకు సలిపింది? అలా వాడడం తప్పు అనుకుందామంటే, అతడు పూర్వంలాగే దానాలు కొనసాగించాడు. పోనీ అని ఆ డబ్బు సంపాదించడానికి కాయకష్టమూ చెయ్యలేదు. కోశాగారంనుంచే ఇచ్చాడు. తేడా అల్లా, ప్రజలు తనని దానకర్ణుడని కీర్తించకుండా ఆపాడు. దానికే ఆ పుండు మాయమవడమేమిటి? తెలిస్తే నా ఈ సందేహాలకి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “సమాధానం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. జయసేనుడు స్వయంకృషితో డబ్బు సంపాదించి, దాన్ని నిస్వార్థంగా ఇతరులకు దానం చేస్తే, అతణ్ణి దానకర్ణుడని అనొచ్చు. కానీ ప్రజాధనాన్ని ప్రజలకోసం ఖర్చు చేస్తే, అతడు సమర్థుడైన రాజౌతాడు కానీ, దానకర్ణుడు ఎలాగౌతాడు? అర్హత లేని కీర్తి చేతిమీద పుండుగా మారుతుందన్న తండ్రి హెచ్చరికని అతడు గ్రహించాడు. అందుకే ఇదివరలో ‘నా సహాయం పొందవచ్చు’ అనేవాడు, ఇప్పుడు ‘ప్రభుత్వ సహాయం పొందవచ్చు’ అని చాటింపు వేయించాడు. పుండు మాయం కావడానికి ఆ తేడా చాలుగా” అన్నాడు.

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 6వ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here