Site icon Sanchika

కరనాగభూతం కథలు – 8 పిసినిగొట్టు

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడి కోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! జనం సంతోషానికి కావాల్సినవి ధనమూ, స్వేచ్ఛానూ! పరిపాలనలో ఆ రెంటినీ అదుపు చేసే వ్యవస్థ సంతోషాన్నిస్తుందని నీ భావన. నిన్ను చూస్తుంటే నాకు చంద్రయ్య గుర్తుకొస్తున్నాడు. అతడు లోభిత్వాన్ని నిరసించి, వైభవంగా జీవిస్తూనే, పిసినిగొట్టు అనిపించుకున్నాడు. ఇప్పుడు నీకా కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.

వేగి దేశపు రాజు వృద్ధుడు కాగా, ఆయన కుమారుడు భరతుడు రాజయ్యాడు. పరిపాలనలో కొత్త విధానాలు ప్రవేశపెట్టాలనుకున్న భరతుడు, వాటి అమలుకోసం కొంతమందిని ఎంపిక చేసి, ఒకచోట సమావేశపర్చి ఇలా చెప్పాడు: “అధికారంలో ఉన్నవాడు లోభి ఐతే, మన ఖజానా నిండొచ్చుకానీ, ప్రజాసంక్షేమం జరుగదు. మీరు మన దేశంలోని గ్రామాలన్నీ తిరగండి. అక్కడి అధికారుల్ని పరీక్షించి, వారిలో లోభుల్ని తొలగించి, తగినవారిని నియమించండి. అందరికీ మనం ప్రవేశపెట్టే కొత్త విధానాల గురించి చెప్పండి” అన్నాడు.

అలా చతురకుడు అనేవాడు మంగాపురం అనే గ్రామానికి వచ్చాడు. తానెవరో చెప్పకుండా ఊరి సత్రంలో బసచేశాడు. వాకబు చెయ్యగా ఊరి గురించి అతడికి తెలిసిన విశేషాలివి.

గ్రామాధికారి చంద్రయ్య ఆస్తిపరుడు. పాతికెకరాల పొలం, ఊరిమధ్యలో రెండువేల గజాల స్థలం ఉన్నాయి. ఆ స్థలంలో చంద్రయ్య పెద్ద మేడ కట్టాడు. ఇంటినిండా ఖరీదైన సామగ్రి ఉంది. పాలేళ్లని పెట్టి స్వంత వ్యవసాయం చేస్తున్నాడు. ఆ పాలేళ్లే ఇంటిపనులూ చేస్తారు. వ్యవసాయంతో పాటు చిల్లర వ్యాపారాలూ చేస్తుంటాడు. వాటిలో వడ్డీ వ్యాపారం ఒకటి. వినోదానికి అప్పుడప్పుడు పట్నం వెళ్లి వస్తుంటాడు. ఆమధ్యే కూతురికి పెద్ద కట్నమిచ్చి, పట్నంలో ధనిక వ్యాపారికి కోడల్ని చేశాడు. కొడుకు పట్నంలో చదువుతున్నాడు.

సూరయ్య ఆస్తిపాస్తుల్లో చంద్రయ్యకు సరిసమానుడు. అతడి స్థలం చంద్రయ్య ఇంటిపక్కనే ఉంది. అందులో సూరయ్య చిన్న పెంకుటిల్లు కట్టుకుని – చుట్టూ చెట్లు, పూలమొక్కలు, కూరల పాదులు పెంచుతున్నాడు. ఇంట్లో ఉన్న వస్తుసామగ్రి తగుమాత్రమే. అదీ ఖరీదైంది కాదు. పొలాన్ని తగిన అయివేజుకి నలుగురు రైతులకి కౌలుకిచ్చాడు. తీరుబడి సమయంలో గుడికి వెళ్లి ప్రవచనాలు వింటాడు. కూతురికి కట్నం లేకుండా సామాన్య రైతు యువకుడికిచ్చి పెళ్లి చేశాడు. కొడుకు ఊరిబడిలో చదువుతున్నాడు.

ఊళ్లో ఎవరికైనా అప్పివ్వగల స్తోమత ఉన్నవాళ్లు చంద్రయ్య, సూరయ్య మాత్రమే. పద్ధతులు మాత్రం ఇద్దరివీ వేరు: చంద్రయ్యవద్ద వడ్డీ ఎక్కువ. బాకీ వసూలుకి ఖచ్చితం. సూరయ్యవద్ద వడ్డీ తక్కువ. బాకీ వసూలుకి అసలు విషయంలోనే ఖచ్చితం. వడ్డీ అన్నదానికి తగ్గినా సరేనంటాడు కానీ ఎంతోకొంత ఇవ్వందే ఊరుకోడు. ఐతే ఒకసారి అప్పు చేసినవారికి, అది తీర్చేదాకా మళ్లీ అప్పివ్వడు.

“వడ్డీ లేకుండా డబ్బిస్తే సాయమౌతుంది కానీ, అప్పు అవదు. డబ్బు విషయంలో సాయం చెయ్యడం, అందుకోవడం గౌరవప్రదం కాదని నా అభిప్రాయం. నామమాత్రపు వడ్డీ తీసుకుని అప్పివ్వడం – ఇచ్చినవారికీ, పుచ్చుకున్నవారికీ గౌరవప్రదం” అంటాడు సూరయ్య. దానికి చంద్రయ్య, “సూరయ్య పిసినిగొట్టు. పైసా పైసా కూడబెట్టి డబ్బు పోగు చేస్తాడు. ఏ సరదాలూ లేవు సరికదా, కడుపునిండా తిండైనా తింటాడో లేదో తెలియదు.  నేనలా కాదు. మా పూర్వీకులు రాజ్యాలేలారు. ఆ వారసత్వమే నాకు వైభవంపట్ల మోజు కలిగించింది. అప్పిస్తే ఎంతోకొంత వడ్డీ వస్తే చాలని సూరయ్యలా కక్కుర్తిపడను. బాకీ త్వరగా తీరుస్తారనే, హెచ్చు వడ్డీ తీసుకుంటాను. అంత వడ్డీకి అప్పు తీసుకోవడం కూడా గొప్ప విషయమే కాబట్టి, నావద్ద అప్పు చెయ్యడం, చేసినవారికి గౌరవం” అంటాడు చంద్రయ్య.

ఆ మాటలు మంత్రంలా పనిచేసి, కొంతమంది హెచ్చువడ్డీకైనా చంద్రయ్యనే అప్పడిగేవారు. అంతగా తీర్చలేకపోతే ఆ బాకీ తీర్చడానికి సూరయ్యవద్ద అప్పు చెయ్యొచ్చని ధైర్యం. ఐనా వాళ్లకి చంద్రయ్య మీదున్న గౌరవం సూరయ్య మీదుండేది కాదు. ఎందుకంటే….

చంద్రయ్య మేడ రంగులతో తళతళలాడుతూ, పనివాళ్లతో సందడిగా ఉంటుంది. దానిపక్కన సూరయ్య పెంకుటిల్లు వెలవెలబోతూ, నిశ్శబ్దంగా ఉంటుంది. చంద్రయ్య దంపతులు ఇంట్లోనూ రోజంతా ఖరీదైన దుస్తులు ధరిస్తారు. తమ పనులు తామే చేసుకునే సూరయ్య దంపతులు ఇంట్లో సాదా బట్టలతోనే ఉండేవారు. బయటికొచ్చినా వాళ్లు మరీ ఖరీదైన బట్టలు ధరించేవారు కాదు.

గ్రామస్థులు చంద్రయ్య వైభవం, ఆర్భాటం చూసి, పలకరించడానికే భయపడేవారు. కనబడితే వంగి సలాం చేసేవారు. సూరయ్యని మాత్రం తమలో ఒకడిగా అనుకునేవారు. చనువుగా పలకరించి, భుజం భుజం రాసుకు తిరిగేవారు.

ఇది చంద్రయ్యకు సంతోషంగా ఉన్నా కొంచెం ఇబ్బందీ కలిగించేది. తనతో సమానమైన ఆస్తిపరుడు సూరయ్యతో పోల్చి, తనది మిడిసిపాటు అంటారని ఓ భయం. సూరయ్యంటే చులకనభావం కలిగించాలన్న ఉద్దేశంతో – అతడు ఏదో వంకన ఊరివాళ్లని ఇంటికి పిల్చి, ఫలరసమో, ఫలహారమో ఇచ్చేవాడు. వాళ్లు తన వైభవానికి అబ్బురపడితే, “మన సూరయ్య ఆస్తిలో నాకంటే తక్కువవాడా? ఎంత కూడబెట్టినా, పోయేటప్పుడు వెంటరాదని తెలిసీ పిసినిగొట్టులా ఉంటున్నాడంటే, అతడి పూర్వీకులు కూడా పరమలోభులై ఉంటారు. ఆ వారసత్వమే అతడికొచ్చింది” అని నిట్టూర్చేవాడు.

ఆ మాటలే కాదు. సూరయ్యని పిసినిగొట్టు అనుకుందుకు తగిన సంఘటనలు ఆ ఊళ్లో అప్పటికే కొన్ని జరిగాయి. చంద్రయ్య మాటలు వాటిని బలపర్చాయంతే!

ఉదాహరణకి – ఒకసారి ఊళ్లో సూరయ్య, చంద్రయ్యలతో సహా కొందరికి గొంతు పట్టేసి మాటరాని జబ్బొకటి వచ్చింది. చంద్రయ్య వైద్యుడివద్దకెళ్లాడు. ఆయన అప్పటికప్పుడు ఓ గుళిక తయారుచేసిచ్చాడు. అది సేవించగానే చంద్రయ్య జబ్బు క్షణాలమీద మాయమైంది. చంద్రయ్య ఆయనకి అడిగినంత డబ్బిచ్చి ఇంటికెళ్లాడు.

ఇది తెలిసి సూరయ్యతో సహా మరికొందరు వైద్యుణ్ణి కలిశారు. ఐతే ఆ మందు చాలా ఖరీదైనది. ధర తగ్గించమని కోరితే, “ఇంతకంటే తక్కువకి ఈ మందు తయారుచెయ్యడం నావల్ల కాదు. ఖర్చు లేకుండా ఇది తగ్గాలంటే గృహవైద్యమొకటుంది. కరక్కాయ, కాకరకాయ కలిపి నూరిన లేహ్యాన్ని రోజూ రెండు పూటలా సేవించండి. పది రోజుల్లో మీరు మామూలుగా మాట్లాడకపోతే నన్నడగండి” అన్నాడు.

‘ఒక్కరోజులో పోయేదానికి, పది రోజులు మాట్లాడకుండా ఉండాలా?’ అని కొందరనుకున్నారు. కరక్కాయ, కాకరకాయ పేరు వినగానే కొందరు భయపడ్డారు. మరికొందరు ఒకటి రెండు రోజులు ప్రయత్నించి ఆ లేహ్యం తినడం తమవల్ల కాదని గ్రహించారు. వీరంతా ఎలాగో డబ్బు కూడబెట్టారు. ఇద్దరు ముగ్గురు సూరయ్యవద్దే అప్పు తెసుకున్నారు. మొత్తమీద అంతా వైద్యుడు చెప్పిన ధర ఇచ్చి, ఆ మందు సేవించి స్వస్థులయ్యారు. పదిరోజుల గృహవైద్యానికి సిద్ధపడి స్వస్థుడైనవాడు ఊరిమొత్తానికి సూరయ్య ఒక్కడే!

ఖరీదైన మందుతో స్వస్థులైనవారందర్నీ చంద్రయ్య ఓ రోజు తనింటికి పిలిచి, “ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. అది తెలుసుకున్న మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందుకు డబ్బుకి వెనకాడలేదు. మనలో కొందరికది శక్తికి మించిన ఖర్చు. ఐనా ధైర్యం చేశారు. కానీ కొందరు పిసినిగొట్టుతనంతో అనారోగ్యాన్ని పదిరోజులపాటు భరించడానికి సిద్ధపడతారు. నోటబెట్టలేని పదార్థాల్ని రోజుల తరబడి సేవిస్తారు. అలాంటివారిని స్ఫూర్తిగా తీసుకోనందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను” అన్నాడు.

చంద్రయ్య అంతటివాడు తమని పొగిడినందుకు వాళ్లు మురిసిపోయారు. చంద్రయ్య నిరసించింది సూరయ్యనే అని అర్థమై, తాము కూడా సూరయ్యను అపహాస్యం చేస్తూ తలో మాటా అని వినోదించారు. ఈ విశేషాలన్నీ తెలిసేక – చతురకుడికి ఓ విషయం స్పష్టమైంది. ఊరివాళ్ల దృష్టిలో సూరయ్య పిసినిగొట్టు. చంద్రయ్యంటే చెప్పలేనంత గౌరవం. అతడు తమతో మాట్లాడ్డమే ఘనతగా వాళ్లు భావిస్తారు.

ఆ తర్వాత ఒకరోజున చతురకుడు గ్రామాధికారి చంద్రయ్యను కలుసుకుని, “నేను మహారాజు భరతుడి పనుపున వచ్చాను. గ్రామాధికారి పదవినుంచి నిన్ను తొలగించి, ఆ స్థానంలో సూరయ్యను నియమించమని రాజాజ్ఞ” అన్నాడు. చంద్రయ్య నివ్వెరపోయి, “మహారాజు అలా నిర్ణయించడానికి నేను చేసిన తప్పేమిటి? సూరయ్యలో ఉన్న ఒప్పేమిటి?” అనడిగాడు.

“తప్పకుండా తెలుసుకోవచ్చు. పిసినిగొట్టులు అధికారంలో ఉండడం ఆయనకిష్టంలేదు. నువ్వొక పిసినిగొట్టువి. సూరయ్య పిసినిగొట్టు కాదు” అన్నాడు చతురకుడు.

కొండచిలువ ఈ కథ చెప్పి, “చతురకుడి నిర్ణయం చిత్రంగా ఉంది. డబ్బు కూడబెట్టడమే తప్ప, అనుభవించడం తెలియని సూరయ్యని ఊరంతా పిసినిగొట్టు అనడం సహజం. కానీ చతురకుడు కాదన్నాడు. పైగా వైభవంగా జీవిస్తున్న చంద్రయ్యని పిసినిగొట్టు అన్నాడు. పొరపాటు ఊరివాళ్లదా? చతురకుడిదా? లేక అతణ్ణి ఎంచుకున్న మహారాజు భరతుడిదా? తెలిస్తే నా ఈ సందేహాలకి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “సూరయ్యది తృప్తికరమైన జీవితం. అతడు సామాన్యంగా జీవించడంవల్ల ఇతరులకొచ్చిన నష్టం లేదు. పైగా అతడి డబ్బు ఆర్తులని ఆదుకుంటోంది. అదీ అప్పు తీసుకున్నవాడికి చిన్నతనం ఉండకూడదని అడిగిన వడ్డీ. ఇక చంద్రయ్య ఎంత వైభవంగా జీవించినా, అందువల్ల ఇతరులకేం లాభం? చేసే ఖర్చంతా తనకోసమే కదా! అప్పిచ్చినా హెచ్చు వడ్డీ తీసుకుంటాడు. పోనీ తృప్తిగా ఉన్నాడా అంటే, సూరయ్యని నిరసించడమే పనిగా పెట్టుకున్నాడు. అసంతృప్తితో బాధపడేవాడే, ఎదుటివారిని అపహాస్యం చెయ్యాలనుకుంటాడు. అలాంటి అసంతృప్తిపరుడి చేతిలో అధికారం రాణించదు. సూరయ్య చంద్రయ్యని పల్లెత్తుమాటన్న దాఖలా లేదు. అంటే అతడు తృప్తిగా జీవిస్తున్నాడని అర్థం. అందుకే చతురకుడు అతణ్ణి గ్రామాధికారిని చెయ్యాలనుకున్నాడు. ఇక జనం విషయానికొస్తే, వాళ్లు కంటికి కనిపించే వైభవానికి సలాం చేస్తారే తప్ప, ఆ వైభవంతో తమకేం ప్రయోజనమని ఆలోచించరు. అందుకే చతురకుడు వారి అభిప్రాయానికి విలువనివ్వలేదు. సూరయ్య గ్రామాధికారి ఐతే, జనం అప్పులకోసం బయటి వ్యక్తుల్ని ఆశ్రయించక్కర్లేదు. ప్రభుత్వధనంతో వాళ్లని ఆదుకోగలడు. కాబట్టి చతురకుణ్ణి ఎన్నుకున్న భరతుడి నిర్ణయమూ, సూరయ్యనెన్నుకున్న చతురకుడి నిర్ణయమూ – రెండూ సబబైనవే” అన్నాడు.

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 9వ కథ)

Exit mobile version