[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]
[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడికోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! నీవు అమిత శక్తివంతుడివన్న విషయంలో సందేహం లేదు. కానీ ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే, ఆ శక్తులు నిష్ప్రయోజనమౌతాయి. అపూర్వశక్తులుండీ తనని తాను రక్షించుకోలేక ఉన్న ఊరిని వదిలిపెట్టిన జనార్దనుడి కథే అందుకు నిదర్శనం. ఇప్పుడు నీకా కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.
సింహపురం రాజు హనుమంతుడికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు జనార్దనుడు. చిన్నవాడు శిశుపాలుడు. వయోభారం మీద పడుతుంటే, ఆయన పెద్దవాడైన జనార్దనుడికి రాజ్యాభిషేకం చెయ్యాలనుకున్నాడు. ఐతే చిన్నవాడైన శిశుపాలుడికి రాజు కావాలన్న కాంక్ష జాస్తిగా ఉంది. అతడు శలభుడనే తాంత్రికుణ్ణి మంచి చేసుకుని, ఓ మందు సంపాదించాడు. అది సేవించినవారికి తాత్కాలికంగా పిచ్చి పడుతుంది. కొన్నాళ్లకు దానంతటదే తగ్గిపోతుంది.
శిశుపాలుడా మందు పానీయంలో కలిపి జనార్దనుడి కివ్వాలనుకున్నాడు. కానీ పొరపాటున దాన్ని రాజు హనుమంతుడు సేవించాడు. అంతే, ఆయనకు మతి భ్రమించి, అదోలా నవ్వుతూ గంతులేస్తూ వెకిలి చేష్టలు మొదలెట్టాడు.
రాజవైద్యులకి ఆ జబ్బేమిటో, ఎలా వచ్చిందో తెలియలేదు. అప్పుడు శిశుపాలుడు శలభుణ్ణి రప్పించి, అతణ్ణి గొప్ప యోగిగా అందరికీ పరిచయం చేశాడు. అతడు చెప్పిన ప్రకారమే శలభుడు హనుమంతుణ్ణి పరీక్షించి చూసి, “ఈ జబ్బు నయం చెయ్యడం అశ్వినీ దేవతలకి మాత్రమే సాధ్యం. వారిని ప్రసన్నం చేసుకుందుకు రోగికి జ్యేష్ఠపుత్రుడు అడవికి వెళ్లాలి. అక్కడ ఏ మునివరుణ్ణో ఆశ్రయించి తపోదీక్ష స్వీకరించి, దేవతలు ప్రసన్నం అయ్యేవరకూ తపస్సు చెయ్యాలి” అన్నాడు.
అలా జనార్దనుడు అడవికి వెళ్లాడు. శిశుపాలుడు తాత్కాలికంగా రాజయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే హనుమంతుడికి పిచ్చి తగ్గి మామూలు మనిషయ్యాడు. అప్పుడు శలభుడు హనుమంతుణ్ణి కలుసుకుని, “ప్రభూ! కొన్ని నిజాలు వినడానికి చేదుగా ఉన్నా చెప్పక తప్పదు. నేను యువరాజు జనార్దనుడి జాతకచక్రం పరిశీలించాను. అతడు అన్నివిధాలా సమర్థుడే కానీ, నష్టజాతకుడు. అతణ్ణి రాజు చెయ్యాలని అనుకోగానే తమ ఆరోగ్యం చెడింది. అతడు రాజైతే రాజ్యానికి అరిష్టం తప్పదు. అందుకనే నేనతణ్ణి తపస్సు పేరిట అడవికి వెళ్లమని సూచించాను. చూశారు కదా, అతడలా అడవికి వెళ్లగానే తమ ఆరోగ్యం కుదుటపడింది” అని చెప్పాడు.
హనుమంతుడీ మాటలు నమ్మడంతో శిశుపాలుడు సింహపురానికి శాశ్వతంగా రాజయ్యాడు.
అడవిలో కొన్నాళ్లకి జనార్దనుడికి అంగీరసుడనే మహాముని తారసపడ్డాడు. అతడాయనకు తన కథ చెప్పి, తపోదీక్ష ఇప్పించమన్నాడు. ఐతే దివ్యదృష్టి ఉన్న అంగీరసుడికి అసలు నిజం వెంటనే తెలిసిపోయింది. ఆయన అతడికి శిశుపాలుడు చేసిన మోసాన్ని చెప్పి, “ఎవరి తపస్సూ అవసరం లేకుండానే, నీ తండ్రి ఆరోగ్యం కుదుటపడి ఇప్పుడు మామూలు మనిషయ్యాడు. ఇక నువ్వు తపస్సు గురించిన ఆలోచన కట్టిపెట్టి, నీ రాజ్యానికి తిరిగివెళ్లు” అని సలహా ఇచ్చాడు.
తమ్ముడింత మోసం చేస్తాడని జనార్దనుడు ఊహించలేదు. అతడు మునితో, “నాకు తమ్ముడంటే ఇష్టం. తనకి రాజు కావాలనుందని ఒక్క మాట అనుంటే, అతడికి నేనే రాజ్యం అప్పగించి ఉండేవాణ్ణి. అతడు నన్నిలా మోసం చెయ్యడంతో భవబంధాలమీద విరక్తి పుట్టింది. నాకు రాజరికం వద్దు. తపస్సు చేసుకుంటూ ఇక్కడే శేషజీవితాన్ని గడిపేస్తాను. తపోదీక్ష ఇప్పించండి” అని వేడుకున్నాడు.
అంగీరసుడు ఒప్పుకోలేదు, “నీ తమ్ముడిలాంటి మోసగాడి పాలనలో ప్రజలకు సుఖశాంతులుండవు. నీవు యోగ్యుడివి. సమర్థుడివి. యువకుడివి. నువ్వుండాల్సింది అడవిలో కాదు. నీవల్ల సమాజానికి ఎంతో ప్రయోజనముంది. కాబట్టి తక్షణం నీ రాజ్యానికి తిరిగివెళ్లు. నీ తమ్ముడి మోసాన్ని బయటపెట్టి, నీవే రాజువై ప్రజారంజకంగా పరిపాలించు” అన్నాడాయన. అంతే కాదు. శలభుడివంటి తాంత్రికుల్నీ, శిశుపాలుడివంటి మోసగాళ్లనీ అదుపు చెయ్యడానికి వీలుగా జనార్దనుడికి కొన్ని అపూర్వశక్తులు ప్రసాదించాడు.
ముని మాట కాదనలేక జనార్దనుడు తన రాజ్యానికి తిరిగి వెళ్లాడు. కానీ, తోడబుట్టిన శిశుపాలుణ్ణి మోసగాడుగా నిరూపించడానికి అతడికి మనస్కరించలేదు. అందుకని రాజధానికి వెళ్లకుండా, తనకు లభించిన అపూర్వశక్తులతో ప్రజాసేవ చెయ్యాలనుకుని ముందుగా పల్లవరం అనే చిన్న ఊరు చేరుకున్నాడు. ఊరి పొలిమేర చేరేసరికి అతడికి చెట్టుకి ఉరేసుకుని వ్రేలాడుతూ ఓ మనిషి కనిపించాడు.
జనార్దనుడు వెంటనే ఆ మనిషిని చెట్టునుంచి దింపాడు. కొసప్రాణంతో ఉన్న అతడికి తగిన ఉపచారాలు చేశాడు. స్పృహ వచ్చేక ఆ మనిషి తన కథ చెప్పుకున్నాడు: అతడి పేరు మల్లన్న. భార్య గౌరమ్మ. ఆ దంపతులకి ఓ కూతురూ, కొడుకూ. కొడుకింకా చిన్నవాడు. విద్యాభ్యాసానికి దూరప్రాంతాల ఉన్న ఓ గురుకులానికి వెళ్లాడు. ఇన్నేళ్లుగా గుట్టుగా రోజులు గడిపేస్తున్న మల్లన్నకి ఒక్కుమ్మడిగా కష్టాలొచ్చి మీదపడ్డాయి. వానలు లేక రెండేళ్లుగా పంటలు లేవు. డబ్బుకోసం ఇల్లు తాకట్టు పెట్టాడు. అదయ్యేక పొలం తాకట్టు పెట్టాడు. అంతలో పెళ్లానికి పెద్దజబ్బు చేసింది. వైద్యం చేయించే స్తోమత లేక, ఆమె కళ్లముందే రోజురోజుకీ కృశించిపోతోంది. కట్నం డబ్బు సమకూర్చలేదని కూతురికి కుదిరిన పెళ్లిసంబంధం రద్దయింది. ఈ పరిస్థితుల్లో దిక్కు తోచక, చివరికి ఆత్మహత్యకు పూనుకున్నాడు.
“ఇప్పుడు నువ్వు నన్ను చావకుండా చేశావు. బ్రతికి ఏంచెయ్యాలో చెప్పు” అన్నాడు మల్లన్న నిష్ఠూరంగా. అందుకు జనార్దనుడు నవ్వి, “దేవుడిచ్చిన ప్రాణాలివి. వీటిని దేవుడే తీసుకోవాలి తప్ప మనం తీసుకోకూడదు. దేవుణ్ణి నమ్ము. వెంటనే బయల్దేరి ‘రక్ష రక్ష జనార్దనా’ అన్న మంత్రాన్ని జపిస్తూ ఇల్లు చేరుకో. నీతోపాటు నేనూ వచ్చి ఏం జరుగుతుందో చూస్తాను” అన్నాడు.
మల్లన్న అలాగే చేశాడు. అతడు ఇల్లు చేరేసరికి, గౌరమ్మ ఎదురొచ్చి, “ఇప్పుడే నా రోగం చేత్తో తీసినట్లు మాయమైపోయింది. వంటికి ఇదివరకెన్నడూ లేని జవసత్వాలొచ్చాయి” అని ఉత్సాహంగా చెప్పింది. అంతలో కూతురు అలా వచ్చి, “అమ్మా! వంటగదిలో బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలు ఉన్నాయి. ఎవరు తెచ్చిపెట్టారు?” అంటూ తండ్రినీ, జనార్దనుణ్ణీ చూసి చటుక్కున ఆగిపోయింది. అప్పుడు జనార్దనుడు మల్లన్నని చూసి నవ్వుతూ, “కాసేపట్లో నీకు పెళ్లివార్నించి కబురొస్తుంది. సంబంధం రద్దు చెయ్యడం తమవల్ల జరిగిన పొరపాటనీ, అందుకు పరిహారంగా నీ కూతుర్ని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామనీ!” అన్నాడు.
మామూలుగా ఐతే మల్లన్న ఈ మాటలు నమ్మేవాడు కాదు. కానీ ఇంతవరకూ జరిగిందాన్నిబట్టి అతడొక సిద్ధపురుషుడని నమ్మకం కుదిరింది. అతడు జనార్దనుణ్ణి ఇంట్లోవాళ్లకి పరిచయం చేసి జరిగింది చెప్పాడు. వాళ్లంతా జనార్దనుడికి చేతులు జోడించి, తమతో ఉండిపోవలసిందని బ్రతిమాలారు. జనార్దనుడు కూడా ఎక్కడికెళ్లాలో ఇంకా నిర్ణయించుకోలేదు కాబట్టి అప్పటికి సరేనన్నాడు. ఆ రాత్రి అంతా భోంచేస్తుండగా, జనార్దనుడు చెప్పినట్లే పెళ్లివార్నించి కబురొచ్చింది. దానికే ఆ ఇంట్లోవాళ్ల సంతోషానికి అవధులు లేవనుకుంటే, మర్నాడింకో విడ్డూరం జరిగింది. మల్లన్న పెరటిబావినుంచి నీళ్లు తోడుతుంటే చేయి జారి చేద నూతిలో పడిపోయింది. చేద తియ్యడానికి గేలం వేస్తే బరువుగా ఏదో తగిలింది. పైకి లాగడానికి జనార్దనుడి సాయం కూడా అవసరమైంది. అప్పుడు పైకి వచ్చాయి లంకెబిందెలు. వాటినిండా బంగారు కాసులు. మల్లన్న దరిద్రం తీరిపోవడమే కాదు, భాగ్యవంతుడు కూడా అయ్యాడు.
ఇలాంటి విషయాలు దాగవు కదా! జనార్దనుడి శక్తి గురించి బాగా ప్రచారమైంది. ఆర్తులైనవారు ఎక్కడెక్కణ్ణించో వచ్చి తమ కష్టాలు అతడికి చెప్పుకునేవారు. అతడు వారితో, “మీరు శ్రమపడి ఇంతదూరం రానవసరం లేదు. నన్ను తలచుకుని, ‘రక్ష రక్ష జనార్దనా’ మంత్రజపం చేయండి. మీ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. ఐతే ఆ మంత్రం ఆర్తులకూ, అసహాయులకూ మాత్రమే పని చేస్తుంది. స్వార్థపరులకూ, ఆశాపాతకులకూ ఉపయోగపడదు” అని చెప్పేవాడు.
ఆ రాజ్యంలో ‘రక్ష రక్ష జనార్దనా’ అన్న మంత్రంఎంత ప్రసిద్ధి చెందిందంటే, సామాన్యపౌరులు తమ కష్టాల్ని రాజుకి చెప్పుకోవడం మానేసి, జనార్దనుణ్ణే తమ రాజుగా భావించసాగారు. ఈ విపరీతానికి ఆశ్చర్యపడ్డ శిశుపాలుడు చారులను పంపి, ఆ జనార్దనుడు తన అన్నగారేననీ, అతడికిప్పుడు అద్భుతశక్తులు వచ్చేయనీ తెలుసుకున్నాడు. ప్రస్తుతానికి తన జోలికి రాకున్నా ఏదో ఒకరోజున అన్న వల్ల తన సింహాసనానికి ముప్పేనని అనుమానించి వెంటనే శలభుణ్ణి పిలిచి, ఏంచెయ్యాలో చెప్పమని అడిగాడు. శలభుడు కాసేపాలోచించి, “నువ్వొప్పుకుంటే తాంత్రిక శక్తులతో నీ అన్నని హతమార్చగలను. అందుకు మూడువారాలు ఉపాసన చెయ్యాల్సి ఉంటుంది. ఈ మూడు వారాల్లోనూ నీ అన్నని మన రాజ్యం దాటివెళ్లకుండా ఆపాలి. నా శక్తి ఈ రాజ్యం ఎల్లలకే పరిమితం” అన్నాడు.
శిశుపాలుడు మారాలోచన లేకుండా సరేనన్నాడు. శలభుడి ఉపాసన మొదలైంది. ఐతే వెంటనే ఆ విషయం జనార్దనుడి దివ్యదృష్టికి తెలిసిపోయింది. అతడు మల్లన్నని పిలిచి, “నేనిక్కడుంటే నా ప్రాణాలు దక్కవు. అందుకే- ఈ ఊరే కాదు, ఈ రాజ్యాన్నే వదిలి వెడుతున్నాను. నాకోసం వెదికే ప్రయత్నం చెయ్యొద్దు. కానీ ‘రక్ష రక్ష జనార్దనా’ మంత్రం ఎప్పటిలాగే పని చేస్తుందని హామీ ఇస్తున్నాను” అనేసి మారుమాటకు అవకాశమివ్వకుండా అక్కణ్ణించి వెళ్లిపోయాడు.
కొండచిలువ ఈ కథ చెప్పి, “జనార్దనుడి తీరు నాకు విచిత్రంగా ఉన్నది. అపూర్వశక్తి ఉన్నప్పటికీ శిశుపాలుణ్ణి శిక్షించలేదు. తను రాజు కావాలనుకోలేదు. కానీ అదే అపూర్వశక్తితో జనంచేత తనే రాజు అనిపించుకున్నాడెందుకు? దూరంగా ఉన్నవారిని కూడా కష్టాల బారినుంచి రక్షించగలవాడు, ఒక తాంత్రికుడి శక్తినుంచి తనని రక్షించుకోలేడా? ఒకవేళ తాంత్రికుడు అతడికంటే బలవంతుడా, అనుకుందామంటే, తను లేకున్నా తన మంత్రం పనిచేస్తుందని జనాలకు హామీ ఎలా ఇచ్చాడు? తెలిస్తే నా ఈ సందేహాలకి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.
దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “జనార్దనుడు ఉత్తముడు. రాజ్యకాంక్ష లేనివాడు. తమ్ముడికి రాజ్యకాంక్ష ఉన్నదని తెలిసి, రాజ్యాన్ని అతడికే వదిలిపెట్టాడు. ఐతే సింహపురం ప్రజాసంక్షేమం పట్ల తన బాధ్యతను విస్మరించకుండా, తనకున్న అద్భుతశక్తిని – దేశంలోని అసహాయుల్నీ, ఆర్తుల్నీ అదుకుందుకు ఉపయోగించాడు. శలభుడు చంపాలనుకున్నది తనని మాత్రమే కాబట్టి, తన శక్తిని తన రక్షణకోసం ఉపయోగించుకోవడం ఇష్టంలేక రాజ్యం వదిలి వెళ్లాడు. అలా అతడు తనకి రాజ్యకాంక్ష లేదన్న విషయాన్నీ తమ్ముడికి స్పష్టం చేశాడు. తన దేశపౌరులకు రక్షణ ఏర్పాటూ చేశాడు” అన్నాడు.
అది సరైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.
(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 10వ కథ)