Site icon Sanchika

కరనాగభూతం కథలు – ముగింపు కథ

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ప్పుడు పింగపాంగుడి చెవిలో, “భక్తా! కొండచిలువ ద్వారా – స్వేచ్ఛకీ, అధికారానికీ, రాజ్యపాలనకీ, పౌరుల మస్తత్వాలకీ సంబంధించిన పాతిక కథలు విన్నావు. ఇప్పుడు నీ బుద్ధి మరింత వికసించింది. నీలో వివేకం పెరిగింది. నీకు నీకంటే, నీ నమ్మకాలకంటే – ప్రజాహితమే ఎక్కువ. తక్షణ కర్తవ్యమేమిటో ఈపాటికి స్ఫురించే ఉండాలి. వెంటనే కార్యాచరణకు దిగు” అన్న మాటలు వినిపించాయి.

పింగపాంగుడు వెంటనే తేరుకుని ఇష్టదైవమైన జిట్టీభనాథుడి నిలువెత్తు విగ్రహానికి రెండు చేతులూ జోడించి, అక్కణ్ణించి కదిలాడు. రాత్రికిరాత్రి ఆయన మంత్రుల్ని సమావేశపర్చి, “ఇరవైఐదు రోజులుగా నేను పగలు నిద్రపోతూ, రాత్రిళ్లు జిట్టీభనాథుణ్ణి అర్చిస్తున్నాను. అందుకోసం పాలనాభారాన్ని మీకు అప్పగించాను. నా పూజల ఫలితంగా యావత్ప్రపంచం శక్తిహీనమై, ఊహానగరానికి దాసోహమనే సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను. మీరు నాకు ప్రపంచ విశేషాలు చెప్పండి” అన్నాడు.

మంత్రులందరూ ఏకకంఠంతో, “జయహో పింగపాంగా! జయహో జిట్టీభనాథా! అంతా మీరన్నట్లే జరుగుతోంది. వివరాలు మన వాంగుడు చెబుతాడు” అన్నారు. అప్పుడా మంత్రుల్లో వాంగుడనేవాడు గొంతు సవరించి, “ప్రభూ! మీ పూజాఫలితం కాబోలు. ఈ పాతిక రోజుల్లోనూ ప్రపంచంలో ఎన్నో మార్పులొచ్చాయి. ఇదివరలో మన పౌరులకు స్వేచ్ఛ లేదని ఇతర దేశాలు నిరసించేవికదా! ఇప్పుడు అవన్నీ, స్వేచ్ఛ నరికట్టడంలో మనని మించిపోయాయి. అక్కడ పౌరులిప్పుడు ఇల్లొదిలి బయటకు రాకూడదని నియమం. తప్పనిసరై బయటకొచ్చినా, ఒకరికొకరు అల్లంత దూరాన ఉండాలి. తామెవరో తెలియకుండా ముక్కూ నోరూ కప్పేలా ముఖాలకి ముసుగులు తొడుక్కోవాలి. వాళ్లకిప్పుడు వేడుకలు లేవు, సరదాలు లేవు. మితిమీరిన స్వేచ్ఛవల్లనే వాళ్లకీ గతి పట్టిందని మేము మన దేశమంతా ప్రచారం చేశాం. అది పౌరులపై గొప్ప ప్రభావం చూపించింది. స్వేచ్ఛ లేదని గొణిగేవారు మన పౌరుల్లోనూ కొందరున్నారు కదా! ఇప్పుడు వారు కూడా స్వేచ్ఛను అదుపు చేసే మన పద్ధతే గొప్పదని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు” అన్నాడు.

పింగపాంగుడి ఆనందానికి అవధులు లేవు. అతడు మంత్రులతో, “ఇదంతా కరనాగభూతం ప్రభావం. స్వేచ్ఛ అంటే ప్రపంచపౌరుల్లో భయం పుట్టడానికి కారణం ఆ భూతమే! ఐతే త్వరలో కరనాగం ఊహానగరానికీ వస్తుంది. ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే – ఆ భూతాన్ని మనకి అనుకూలంగా మలచుకునే ఉపాయం తెలియాలి. అది చెప్పగలవాడు వెనలాంగ మహర్షి ఒక్కడే! నేనిప్పుడాయన ఆశ్రమానికి వెడుతున్నాను. నేను తిరిగొచ్చేదాకా – ఇంతవరకూలాగే పాలనా బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించండి” అన్నాడు.

వెనలాంగ మహర్షి పేరు వినగానే మంత్రులు కలవరపడ్డారు. ఆయన ఆశ్రమం రాజుకి మాత్రమే తెలిసిన రహస్య స్థలంలో ఉంది. ఘటనా ఘటన సమర్థుడనీ, మహాజ్ఞాని అనీ ఆయన గురించి చెప్పుకుంటారు. కొందరాయన్ని తపస్వి అంటారు. కొందరు శాస్త్రజ్ఞుడంటారు. ఊహానగర వైభవానికి ఆయన ప్రతిభే కారణమని అంతా నమ్ముతారు. ఐతే దేశానికి ప్రమాదం వాటిల్లే పరిస్థితుల్లో తప్ప, పింగపాంగుడు కూడా ఆయన్ని కలవడు. ఆయన మహర్షిని కలిసినప్పుడల్లా – దేశంలో కొందరు విద్రోహకారుల గుట్టు బయటపడింది. ఆయన వాళ్లని మట్టుబెట్టాడు. అందుకని – ఇప్పుడెవరి గుట్టు బయటపడుతుందోనని, మంత్రులు ఒకర్నొకరు అనుమానంగా చూసుకున్నారు. కానీ రాజు వారికింకేం చెప్పలేదు. సమావేశం పూర్తయినట్లు ప్రకటించి వారిని పంపేశాడు.

అక్కణ్ణించి పింగపాంగుడు అంతఃపురానికెళ్లి నిద్రపోతున్న రాణిని లేపి, తను వెనలాంగ మహర్షిని కలవడానికి వెడుతున్నట్లు చెప్పాడు. తర్వాత అంతఃపురమందిరపు గోడముందు నిలబడి- మనసులో ఏదో మంత్రం జపించాడు. అంతే! గోడ రెండుగా చీలింది. అక్కణ్ణించి కిందకు వెళ్లడానికి మెట్లున్నాయి. రాజు లోపలికెళ్లి మెట్లు దిగుతుంటే, గోడ మళ్లీ మూసుకుపోయింది. పింగపాంగుడు మెట్లు దిగి వెళ్లగానే ఒక రహస్య ఉద్యానవనం. వనం మధ్యలో ఈతకొలను. రాజు అక్కడికెళ్లి నోట్లో వేళ్లు పెట్టుకుని చిత్రమైన శబ్దం చేశాడు. అంతే! నీటిలోంచి పదహారడుగుల పొడవున్న మొసలి పైకి తేలి, వెడల్పాటి నోరు తెరిచింది. రాజు ఏమాత్రం సంకోచం, భయం లేకుండా ఆ మొసలి నోట్లోకి ప్రవేశించాడు. వెంటనే మొసలి నోరు మూసుకుని కొలను అడుక్కి వెళ్లిపోయింది.

చూడ్డానికి సజీవంగా అనిపించే ఆ మొసలి నిజానికో మరబొమ్మ. కొలను అడుగున ఉన్న సొరంగమార్గంలో పయనించ గలిగినది ఆ మొసలి మాత్రమే. వెనలాంగ మహర్షి ఆశ్రమం చేరుకునేందుకు ఆ మొసలి ఒక సాధనం. ఒక మనిషి కొన్ని రోజులపాటు ఉండడానికి అవసరమైన సదుపాయాలన్నీ ఆ మొసలి లోపల ఉన్నాయి. పింగపాంగుడు మొసలి నోట్లో ప్రవేశించేక, లోపల సిద్ధంగా ఉన్న తల్పం మీద మేను వాల్చాడు. వెంటనే అతడికి వళ్లెరుగని నిద్ర పట్టింది.  కళ్లు తెరిచేసరికి మొసలి నోరు తెరిచి ఉంది. ఆయన తల్పంమీంచి లేచి మొసలి నోట్లోంచీ నడిచి బయటకొచ్చాడు.

అది ఒక పచ్చిక బయలు. దానికి కాస్త దూరంలో ఒక ఆశ్రమం. పింగపాంగుడు పచ్చిక బయల్లో అడుగిడిన సమయానికి, ఆశ్రమం లోంచి ఆరడుగుల ఆజానుబాహుడు బయటకొస్తున్నాడు. కొప్పులా చుట్టిన నల్లని జుట్టు. చురుకైన చిన్న కళ్లు. సన్నటి దారాల్లా వేలాడుతున్న మీసాలు, గెడ్డం. మెడనుంచి కాళ్లదాకా కప్పే అంగీ. ఆయన్ని వెనలాంగ మహర్షిగా గుర్తించిన పింగపాంగుడు చప్పున చేతులు జోడించాడు. మహర్షి ప్రసన్నంగా నవ్వి, “నీ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇలావచ్చి కూర్చో” అన్నాడు.

ఆయన అలాగనగానే పక్కనే రెండు ఆసనాలు ప్రత్యక్షమయ్యాయి. వెనలాంగుడు, పింగపాంగుడు వాటిపై ఎదురెదురుగా కూర్చున్నారు. అప్పుడు పింగపాంగుడు గొంతు సవరించుకుని, “స్వామీ! జిట్టీభనాధుడు అనుగ్రహించి ప్రసాదించిన కరనాగభూతం సహాయంతో, ప్రపంచ దేశాలన్నింటినీ మన దారికి తీసుకురావడమే కాదు, మనకు దాసోహం అనే స్థితికి తెచ్చాను. ఐతే అదే కరనాగభూతంవల్ల మన ఊహానగరానికీ ప్రమాదం పొంచి ఉంది. దాన్ని అదుపు చేసే ఉపాయం నువ్వు చెబుతావని జిట్టీభనాథుడు సెలవిచ్చాడు” అని ఇంకా ఏదో చెప్పబోతుండగా వెనలాంగుడు ఆపి, “స్వేచ్ఛనివ్వమని నిన్ను కోరేముందు కరనాగం నీతో ఏమన్నదో గుర్తు చేసుకో” అన్నాడు.

గుర్తు చేసుకుందుకు రాజు కొద్ది క్షణాలు కళ్లు మూసుకుంటే, ‘నా ప్రభావమున్న ప్రాంతాల్లో మనుషులు మాటిమాటికీ చేతుల్ని కడుక్కోవాలి. ముక్కుకీ నోటికీ కలిపి ముసుగేసుకోవాలి. బయటకెడితే తుమ్మకూడదు, దగ్గకూడదు. సాటిమనిషికి ఆరడుగుల దూరంలో ఉండాలి. గుంపుల్లో తిరక్కూడదు. ఇంటాబయటా వేడుకలు, వినోదాలు, విలాసాలు ఆపెయ్యాలి. జిబ్బటీనాధునిపై ఆన! నాకున్న శక్తితో ఈ నియమాల గురించి ఇప్పటికిప్పుడు ప్రపంచమంతా తెలిసేలా చేస్తాను. వీటిని పాటించినవార్ని నేనేం చెయ్యలేను. ఈ మాత్రమూ చెయ్యరూ? అప్పుడది వారి కర్మ!” అన్న కరనాగభూతం మాటలు గుర్తొచ్చాయి. ఆ మాటే వెనలాంగుడికి చెప్పాడు.

మహర్షి నవ్వి, “తనని అదుపు చేసే ఉపాయాల్ని ప్రపంచమంతా ముందే ప్రచారం చేస్తానని కరనాగం నీతో మనస్ఫూర్తిగానే అన్నది. అందుకే జిట్టీభనాధుడిపై ఒట్టేసి చెప్పింది. ఎందుకంటే కరనాగం చెడ్దది కాదు. ప్రపంచంలో అవధులు దాటుతున్న స్వేచ్ఛ నరికట్టడానికి, దేవుడెన్నుకున్న ఓ సాధనం. స్వేచ్ఛను నమ్మనివారికి మాత్రమే కరనాగం అధీనమౌతుంది. అందుకే జిట్టీభుడు భూతాన్ని నీకు స్వాధీనం చేశాడు. నువ్వు కరనాగానికి స్వేచ్ఛనిచ్చావు. కరనాగం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దాన్నదుపు చెయ్యడానికి స్వేచ్ఛను త్యాగం చెయ్యక తప్పదని ప్రపంచదేశాలు గుర్తించాయి. ఈ పాతిక రోజుల్లోనూ ప్రపంచంలో స్వేచ్ఛ ఆరోగ్యకరంగా మారింది” అని ఆగాడు.

తర్వాత మళ్లీ వెనలాంగుడే, “అలా ప్రపంచానికి నీవు మహోపకారం చేశావు. కానీ ఊహానగరానికి విపత్తు తెచ్చావు” అన్నాడు. పింగపాంగుడు తెల్లబోయి, “కరనాగంవల్ల ప్రపంచం నాశనమైందని నేననుకుంటున్నాను. నువ్వేమో ప్రపంచానికి నావల్ల ఉపకారం జరిగిందంటున్నావు. ఊహానగరానికి నావల్ల విపత్తు వచ్చిందంటున్నావు. నాకంతా గజిబిజిగా ఉంది” అన్నాడు.

వెనలాంగుడు గొంతు సవరించి, “మితిమీరిన స్వేచ్ఛ అనర్థమే. కానీ స్వేచ్ఛవల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. స్వేచ్ఛ వల్లనే ప్రపంచ దేశాలన్నీ ఎక్కడ కరనాగం విజృంభిస్తున్నదో ఖచ్చితంగా తెలుసుకున్నాయి. పరస్పరం సంప్రదించుకుని, కరనాగాన్ని అదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకోగలిగాయి. దాంతో పాతిక రోజుల్లోనే కరనాగానికి ప్రపంచదేశాల్లో మనుగడ కష్టమై, ఊహానగరాని కొచ్చింది. ఇప్పుడు ఊహానగరం కరనాగం కోరల్లో చిక్కుకుని గజగజలాడుతోంది….” అని ఇంకా ఏదో చెప్పబోగా, “పొరపడుతున్నావు స్వామీ! ఊహానగరంలో పరిస్థితులు చక్కగా ఉన్నాయని మంత్రులు చెప్పేకనే, నేను నీవద్దకొచ్చాను…..” అన్నాడు.

“ప్రజలకు అధికారులవద్ద నిజం చెప్పే స్వేచ్ఛ లేదు. అధికారులకు మంత్రులవద్ద నిజం చెప్పే స్వేచ్ఛ లేదు. మంత్రులకు నీవద్ద నిజం చెప్పే స్వేచ్ఛ లేదు. అంటే ఊహానగరంలో ఎక్కడా నిజం చెప్పే స్వేచ్ఛలేదు. కాబట్టి నీకు మంత్రులు చెప్పింది నిజం కాదు. స్వేచ్ఛ మితిమీర కూడదని ప్రపంచదేశాలు తెలుసుకుని బాగుపడ్డాయి. స్వేచ్ఛపై అదుపు మితిమీరకూడదని నువ్వు తెలుసుకుంటే, ఊహానగరానికీ ప్రమాదం తప్పుతుంది” అన్నాడు. దీనికి పింగపాంగుడు, “నాకంతా అయోమయంగా ఉంది. స్వేచ్ఛని ఎంతవరకూ అనుమతించాలో తెలుసుకోవడం ఎలా?” అన్నాడు పింగపాంగుడు.

“అన్నీ తెలుసుకుని, ఈ ప్రశ్న నన్నడుగుతున్నావా? పాతిక రోజులు కొండచిలువ చెప్పిన కథలు విన్నావుగా! అందులో పాలనావ్యవస్థలో- స్వేచ్ఛకీ, అధికారానికీ, రాజ్యపాలనకీ, పౌరుల మస్తత్వాలకీ సంబంధించిన విశేషాలెన్నో నీకు తెలియలేదా? తెలిసి క్లిష్టమైన ప్రశ్నలకు అవగాహనతో కూడిన సమాధానా లివ్వలేదా? ఇప్పుడు స్వేచ్ఛ గురించిన జ్ఞాన పరిజ్ఞానాలు నీకంటే ఎవరికి బాగా తెలుసు?” అన్నాడు మహర్షి. దీనికి పింగపాంగుడు తల అడ్డంగా ఊపి, “నా తెలివిపై నాకంత నమ్మకంలేదు. నీవే నాకు కర్తవ్యబోధ చెయ్యాలి” అన్నాడు.

వెనలాంగుడు నవ్వి, “ఉపదేశిస్తే కర్తవ్యబోధ నీతిపాఠంలా అంటీముట్టనట్లుంటుంది. అదే కథలా చెబితే మనసుకి హత్తుకుని జీవితకాలం గుర్తుండిపోతుంది. అందుకే నీవు కరనాగానికి స్వేచ్ఛనివ్వగానే కొండచిలువను పంపాను. నీ గ్రహింపుశక్తి తెలిసినవాణ్ణి కాబట్టి పాతిక రోజులు చాలనుకుని అన్నాళ్లూ దాని చేత కథలు చెప్పించాను. అవి స్ఫురణకు తెచ్చుకో. స్వేచ్ఛ గురించే కాదు, పాలనావ్యవస్థ గురించీ నీ జ్ఞాన పరిజ్ఞానాల్ని గుర్తిస్తావు. ఆ అవగాహనతో రాజ్యపాలన చేస్తే – ఊహానగరానికి ప్రపంచం దాసోహమనడం తథ్యం” అన్నాడు.

తనని వెనలాంగుణ్ణి చేరకుండా పాతిక రోజులు ఆపిన కొండచిలువ- వెనలాంగుడు పంపినదేనని తెలిసేక పింగపాంగుడి మనసులో సందేహాలన్నీ తీరిపోయాయి. ఆయన మహర్షికి నమస్కరించి, సెలవు తీసుకున్నాడు. వెనక్కి వెళ్లేక – తను విన్న కథల స్ఫూర్తితో ఊహా నగరంలో  కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టి – సత్ఫలితాలు సాధించాడు. కరనాగభూతం కారణంగా తను విన్న కథలకు దేశ విదేశాల్లో ప్రచారం కల్పించాడు.

కరనాగంవంటి ప్రమాదకరభూతం కూడా మానవజాతికి క్రమశిక్షణ నేర్పి మేలు చెయ్యగలదని ఈ కథలు చెబుతాయి. అది కరనాగం గొప్పతనమో, మానవజాతి అల్పత్వమో – మనమే నిజాయితీగా తేల్చుకోవాలి. నిజాయితీ ఎందుకంటే – ప్రస్తుతానికి కరనాగం ప్రశాంతంగా కనిపించే మహాసముద్రం. ఎప్పుడైనా దాని కెరటాలు ఉవ్వెత్తున లేచి మనని ముంచెయ్యొచ్చు. ఐతే అంతా మనలోనే ఉంది.

(సమాప్తం)

Exit mobile version