Site icon Sanchika

కరనాగభూతం కథలు – ప్రారంభ కథ

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము.

ఈ కథలకు ప్రేరణ అయిన విజయవాణి పబ్లిషర్సుకి రచయిత ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అలాగే ఈ కథలకి స్ఫూర్తిగా నిలిచి, 51 ఏళ్ల వయసులో ఈ ఏడాదే కరోనాకు బలి అయిన చిత్రకారుడు చైతన్యని రచయిత ఈ సందర్భంగా సంస్మరించుకుంటున్నారు. [/box]

[dropcap]ఊ[/dropcap]హానగరానికి రాజైన పింగపాంగుడు ఒకరోజు హడావుడిగా అంతఃపురానికి వెళ్లాడు. చిరునవ్వుతో ఎదురైన రాణివైపు కన్నెత్తి చూడకుండా హుటాహుటిన ప్రార్థనా మందిరంలో ప్రవేశించి ఇష్టదైవమైన జిబ్బటీనాథుడి విగ్రహంముందు నిలబడ్డాడు.

గబ్బిలం ఆకారంలో తలక్రిందులుగా ఉన్న నిలువెత్తు విగ్రహమది. దాని కాళ్లు తోటకూర కాడల్లా సన్నం. అటూ ఇటూ రెండు పెద్ద పెద్ద రెక్కలు. గుహలా తెరచిన నోట్లో పైవరుసలో రెండు చిన్న కోరలు. వాటికటూ ఇటూ రెండు పెద్ద కోరలు. ముక్కు స్థానంలో వాడి కొమ్ము. చేటల్లా చెవులు. సజీవ రక్తగోళాల్లా మెరుస్తున్న కళ్లు. చూడగానే గుండెలదిరే ఆ విగ్రహం ముందు పింగపాంగుడు సాష్టాంగపడిపోయాడు.

అసలేం జరిగిందంటే ?

కొన్నేళ్లక్రితం తను రాజు కాగానే పింగపాంగుడు కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టాడు.

ఆ ప్రకారం రాజ్యంలో ఎవరికీ లక్ష రూపాయలకు మించి డబ్బు, రెండెకరాలకు మించి పొలం, ఒకటికి మించి ఇళ్లు ఉండకూడదు. నగరంలో వేడుకలు, విలాసాలు చెయ్యకూడదు. ఇంట్లోనూ వైభవంగా ఉండకూడదు. బయట ఇద్దరికి మించి కలిసి తిరక్కూడదు. రాజు అనుమతి లేందే పౌరులెవ్వరూ దేశం దాటిపోరాదు.

అలా రాజ్యంలో పౌరులకు స్వేచ్ఛ పోయింది. కానీ ఉత్పత్తులు పెరిగి దేశసంపద పెరిగింది. కొందరే చేసే వ్యాపారాలు, పరిశ్రమలు – అందరి చేతుల్లోకీ వచ్చాయి. అందరికీ ఆదాయాలు పెరిగాయి. విలాసాలు, వేడుకలు లేక ఖర్చులు తగ్గాయి. ప్రజలమధ్య సామరస్యం పెరిగింది. కానీ జీవితం రసహీనమైంది. అందుకని కొందరు పొరుగున ఉన్న విశాల దేశానికి పోవాలనుకుంటున్నారు.

విశాలదేశం విస్తీర్ణంలో, జనాభాలో ఊహానగరమంత పెద్దది. అక్కడ పేదల సంఖ్య ఎక్కువున్నా, చెప్పలేనంత స్వేచ్ఛని అనుభవిస్తూ తృప్తిగా ఉన్నారు. ఏ దేశంనుంచి వచ్చినవారినైనా అక్కున చేర్చుకుని ఆదరించే విశాల హృదయం వారిది.

తన పౌరులు దేశం వదలకుండా ఆపాలంటే, విశాల దేశంలోనే కాదు, ప్రపంచదేశాలు అన్నింటా స్వేచ్ఛ లేకుండా శాసించాలి. అందుకోసం యుద్ధం చేసి ఆ దేశాలన్నింటినీ జయించాలి. కానీ, జయాపజయాలు దైవాధీనం కదా! అందుకని ఇప్పుడు ఇష్టదైవమైన జిబ్బటీనాథుడి విగ్రహం ముందు మోకరిల్లి తన కోరిక చెప్పుకున్నాడు.

అప్పుడు పింగపాంగుడి చెవిలో, “భక్తా! పౌరుల స్వేచ్ఛని అరికట్టే నీ పద్ధతి మంచిది కాదు. కానీ మిగతా ప్రపంచంలో స్వేచ్ఛ పేరిట జనం మితిమీరి ప్రవర్తిస్తూ క్రమశిక్షణ మర్చిపోయారు. నావద్ద బందీగా ఉన్న కరనాగభూతానికి స్వేచ్ఛనిచ్చి, జనానికి బుద్ధి చెప్పగలను. అదున్న దేశంలో, మనిషికి స్వేచ్ఛ ఉండదు. కాబట్టి స్వేచ్ఛకోసం నీ పౌరులెవ్వరూ దేశం విడిచి వెళ్లరు. నీకా భూతాన్ని అప్పగిస్తాను. కానీ నువ్వు వివేకం చూపకపోతే ఆ భూతం మానవజాతి మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఆలోచించుకో” అన్న మాటలు వినిపించాయి.

రాజు కరనాగభూతం గురించి పురాణకథల్లో చదివాడు. అరచేతిలో పాములా విషపదార్థాన్ని చిమ్ముతుందని దానికి కరనాగమని పేరు. ఆ విషం అరచేతినుంచి ముక్కు, నోరులకు చేరి శరీరంలోకి ప్రవేశించి ఊపిరాడకుండా చేస్తుంది. ఆ నరకబాధకు తట్టుకున్నవాళ్లు బ్రతుకుతారు. లేనివాళ్లు చచ్చిపోతారు.

ఇదంతా గుర్తొచ్చి రాజుకి చెప్పలేనంత ఉత్సాహం వచ్చింది. ఆయన వెంటనే లేచి నిలబడి, “నా ఆశయం నెరవేరడానికి చాలా గొప్ప ఉపాయం చెప్పావు. ధన్యుణ్ణి దేవా!” అన్నాడు.

అప్పుడు విగ్రహం నోటినుంచి ఆయనకీ మాటలు వినిపించాయిః “కరనాగానికి స్వేచ్ఛనిచ్చే శక్తి నీకిచ్చాను. కానీ స్వేచ్ఛ లభించేక దానిపై నీకు అదుపుండదు. మిగతా దేశాలన్నింటినీ కబళించేక అది నీ దేశాన్నీ వదలదు. కాబట్టి స్వేచ్ఛనిచ్చే ముందు దాన్ని అదుపు చేసే మార్గం తెలుసుకోవాలి. అందుకు నీవు ముందుగా వెనలాంగ మహర్షిని కలుసుకో”.

విగ్రహం నోటివెంట ఈ మాటలు పూర్తి కాగానే, రాజుముందు ఓ ఆకుపచ్చని ఆకారం ప్రత్యక్షమైంది.

సుదర్శనచక్రంలాంటి తల. చక్రం మధ్యలో వ్రేలాడే కళ్లు, ముక్కు, చెవులు, నోరు. ఆ ఆకారం రాజుకి చేతులు జోడించి, “ప్రభువులకు కరనాగభూతం వందనాలు. స్వేచ్ఛ. స్వేచ్ఛ. అదే నా ఇచ్ఛ” అంది.

“స్వేచ్ఛనిస్తాను కానీ, అప్పుడే కాదు. అంతవరకూ ఈ గదిలోనే జిబ్బటీనాథుని విగ్రహాన్ని ఆవహించి ఉండు” అన్నాడు పింగపాంగుడు.

“నన్నదుపు చేసే మార్గం తెలుసుకుందుకు వెనలాంగ మహర్షిని కలవాలని నీ ఆలోచన కదూ! ఆయన నీకా మార్గాలు ఉపదేశించడానికి పాతిక రోజులు పడుతుంది. అంటే నీ కోరిక తీరడానికి అన్నాళ్లు ఎదురుచూడాలి. నాకు స్వేచ్ఛనిస్తే ఇప్పుడే ఆ మార్గాలు చెబుతాను” అని ఆశ పెట్టింది కరనాగం.

“ముందవేంటో చెప్పు. విన్నాక నీకు స్వేచ్ఛనిచ్చే విషయం ఆలోచిస్తాను” అన్నాడు రాజు.

కరనాగభూతం నవ్వి, “మనుషుల్లో క్రమశిక్షణ నశించిందనేగా, జిబ్బటీనాధుడు నన్ను జనం మీదకు వదలడానికి ఒప్పుకున్నాడు! కాబట్టి క్రమశిక్షణే నన్నదుపు చేసే మార్గం. నా ప్రభావమున్న ప్రాంతాల్లో మనుషులు మాటిమాటికీ చేతుల్ని కడుక్కోవాలి. ముక్కుకీ నోటికీ కలిపి ముసుగేసుకోవాలి. బయటకెడితే తుమ్మకూడదు, దగ్గకూడదు. సాటిమనిషికి కనీసం ఆరడుగుల దూరంలో ఉండాలి. అప్పుడైనా ఎవరికివారే అన్నట్లుండాలి తప్ప గుంపుల్లో తిరక్కూడదు. అందుకని ఇంటాబయటా వేడుకలు, వినోదాలు, విలాసాలు ఆపెయ్యాలి. జిబ్బటీ నాధునిపై ఆన! నాకున్న శక్తితో ఈ నియమాల గురించి ఇప్పటికిప్పుడు ప్రపంచమంతటా తెలిసేలా చేస్తాను. వీటిని పాటించినవార్ని నేనేం చెయ్యలేను. ఈ మాత్రమూ చెయ్యరూ? అప్పుడది వారి కర్మ!” అంది.

భూతానికి స్వేచ్ఛనివ్వాలని పింగపాంగుడికీ ఆత్రుతగా ఉంది. ఆపైన భూతం జిబ్బటీనాధునిపై ఆన అంది. అంతగా పరిస్థితి అదుపు తప్పితే, ఆదుకుందుకెలాగూ వెనలాంగుడున్నాడు. ఆ నమ్మకంతో ఆయన కరనాగానికి వెంటనే స్వేచ్ఛనిచ్చాడు. అంతే!

అక్కడ భూతం మాయమై ఆ స్థానంలో పెద్ద కొండచిలువ ప్రత్యక్షమై భయంకరంగా నోరు తెరిచింది. దాన్ని చూస్తూనే రాజుకి పై ప్రాణాలు పైనే పోయాయి.

అప్పుడా కొండచిలువ మానవభాషలో, “రాజా! భయపడకు. జిబ్బటీనాథుడి సమక్షంలో ఏ శక్తీ నీకు హాని కలిగించలేదు. కానీ నీవు కరనాగం మాటలు నమ్మి, జిబ్బటీనాధుడి సలహాని ఉపేక్షించావు. కరనాగమిప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించడానికి వెళ్లింది. ఇరవైఐదు రోజులు తన ప్రతాపం చూపేక, ఇరవయ్యారో రోజున మొత్తం ప్రపంచాన్ని సర్వనాశనం చెయ్యాలని దాని పథకం. ఈలోగా నీవు వెనలాంగుణ్ణి కలవకుండా నన్ను నియోగించింది. ఐతే నేను నిన్ను ఇరవైఐదు రోజులు మాత్రమే ఆపగలను. అంటే వెనలాంగుణ్ణి కలిసి భూతాన్ని అదుపు చేసే ఉపాయం తెలుసుకుందుకు నీకొక్క రోజే గడువుంటుంది. నేనేమో మంచి ఆకలిమీదున్నాను. అది తీరాలంటే, నువ్వు నేను చెప్పే కథ విని నా సందేహం తీర్చాలి. లేదూ, నేనెళ్లి నీ దేశంమీద పడి నీ పౌరుల్ని మింగేస్తుంటాను” అంది.

కరనాగభూతం తనని మోసం చేసిందని రాజుకి అర్థమైంది. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం? ఆయన కొండచిలువ మాటలకు సరేనన్నాడు.

“ఐతే ఇప్పటికిక్కణ్ణించి వెళ్లు. రాచకార్యాలు చూసుకో. రాత్రి కడుపునిండా భోంచేసి, కాసేపు విశ్రమించి, అర్ధరాత్రి కాగానే ప్రార్థనా మందిరానికి రా” అంది కొండచిలువ.

పింగపాంగుడు ఉస్సూరని నిట్టూర్చి అప్పటికి అక్కణ్ణించి బయటపడ్డాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం మొదటి కథ)

Exit mobile version