కరివేపాకు

0
3

[dropcap]ఆ[/dropcap]దివారం కదా అని ఉదయం తీరికగా కూర్చుని కాఫీ తాగుతూ మొబైల్ చూస్తూ వాట్సాప్ పద్దు తెరిచాను. నన్ను ట్యాగ్ చేస్తూ సుమారు వందకుపైగా మెసేజులు చూపిస్తోంది. మా కాలనీ ఆడవాళ్ళందరమూ కలిసి మా అవసరాల కోసం ఏర్పరుచుకున్న వాట్సాప్ సమూహం. నేనూ ఉద్యోగస్థురాలినే కనుక రోజూ ఆ వాట్సాప్ ఎక్కువ చూడను. గుడ్‌మార్నింగ్ లేదా ఆ రోజు ఏ దేవుడి రోజైతే ఆ దేవుడి బొమ్మలూ, వాటి వెంటే నమస్కారాలూ యిదే ఎక్కువ. ఈ వెల్లువలో ఈ రోజు నీళ్లు రావనో లేక చెత్త తీసుకెళ్ళే వాడు రాడనో తెలియజేసే మెసేజ్ మరుగున పడిపోతుంది. అందువలన ఈ వాట్సాప్ సమూహం నాకొక తలనొప్పిగా తయారైంది. ఎగ్జిట్ అయిపోదామనుకుంటూనే ఆ పని చేయడానికి భయపడుతూ వుంటాను. మా కాలనీలో దక్షిణాది కుటుంబాలు రెండే వున్నాయి. మేము ఆంధ్రా వాళ్ళమైతే మరో కుటుంబం తమిళనాడు వారు. మాకిద్దరికీ అప్పుడప్పుడూ ఈ వాట్సాప్ ‌సమూహంలోంచి తప్పుకోవాలని ఒకేలా ఆలోచన వచ్చినా ‘మదరాసీలు యిద్దరూ గ్రూపులోంచి తప్పుకున్నారే’ అని విమర్శలు వెల్లువెత్తుతాయని భయం కొద్దీ కొనసాగుతున్నాం. వారానికొకసారైనా మేమూ వున్నాం అని తెలియడానికి ప్రతీ ఆదివారం సమూహంలో కాస్త హడావిడి చేస్తుంటాము. ఇదిగో! అందుకోసమే తీరికగా కూర్చుని మా కాలనీ వాట్సాప్ సమూహంలోకి తొంగి చూస్తూ యిష్టం లేకపోయినా కొన్ని కామెంట్లు/మెసేజ్లు పెడదామని ఆలోచిస్తున్నాను.

నన్ను ట్యాగ్ చేస్తూ వచ్చిన సందేశాలన్నిటిలో నాపై విమర్శా వర్షం వెల్లువెత్తింది. మా కాలనీలో పది బిల్డింగులు వున్నాయి. ఒక్కో బిల్డింగ్‌లో పదహరు యిళ్ళు. ఒక్కో అంతస్తులో రెండు యిళ్ళు ఎదురెదురుగా, మరో రెండు యిళ్ళు పక్కపక్కనే ఎదురెదురిళ్ళ నడుమ వుంటాయి.

నాకు మొక్కల పిచ్చి బాగా వుంది. నా చిన్న బాల్కనీలో మూడు పూలకుండీలకన్నా ఎక్కువ పెట్టుకోవడానికి చోటు సరిపోదు. దానితో కరివేపాకు మొక్క వేసిన కుండీ చంద్రాకారంలో మెట్లకి అనుకుని వున్న పిట్టగోడపై పెట్టాను. నిన్న చీకటి పడ్డాక నా పక్కింటి ఆవిడ కరివేపాకు రెమ్మ తుంచబోయేసరికి చీకటి పడ్డాక కోయకూడదని వారించాను. అయినా ఆమె వినకపోయేసరికి “సైన్స్ చదువుకోలేదా? చీకటి పడ్డాక చెట్లు కార్బన్ డైయాక్సైడ్ విరజిమ్ముతాయి తెలియదా?” అనడంతో చేసేదిలేక వెళ్ళి తలుపు వేసుకుంది. దాని తరువాత నేనెందుకు వారించానో అన్న విషయం మరుగున పెట్టి, తనని ఒక్క కరివేపాకు రెమ్మ కోసుకోనివ్వలేదని మెసేజ్ పెట్టింది. అంతే! నాకు పిసినారితనంతో సహా అన్ని దుర్గుణాలూ అంటగడుతూ విమర్శల వెల్లువ. అందరూ ఒక్కుమ్మడిగా నాపై దాడి చేశారు. కళ్ళనీళ్ళు రావడమే తరువాయి. ఎలాగో బిగబట్టుకుని మా బిల్డింగ్‌కి నాలుగు బిల్డింగుల అవతల బిల్డింగ్‌లో వున్న నా ఒకే ఒక్క దక్షిణాది స్నేహితురాలు యింటికి బయలుదేరాను. నేను తలపైకెత్తి ఎవరి బాల్కనీ వైపు కిటికీల వైపు చూడకపోయినా అందరూ నన్ను చూస్తున్నారనే భావనే కలిగింది. గబగబా అడుగులు వేస్తూ రెండవ అంతస్తులో వుంటున్న స్నేహితురాలు బృంద యింటి కాలింగ్ బెల్ నొక్కేలోపు తెలుపు తెరిచి తను “ఐ సా యూ ఫ్రమ్ ది బాల్కొనీ ప్లీజ్ కమిన్” అని లోపలకి తీసుకుని వెళ్ళింది. నేను సోఫాలో కూలబడిపోయేముందే ఏడ్చేసాను. బృంద మామయ్య గారు “ఏమయిందమ్మా మాధవీ? ఇంట్లో అందరూ బాగానే వున్నారు కదా?” అనేసరికి బృంద ఆయనకి విషయం తమిళంలో వివరించింది. బృంద మామయ్య గారు మద్రాసులో వుంటున్నా బ్యాంకు ఉద్యోగం మూలంగా ఆంధ్రాలో చాలా ఏళ్ళు వుండటం వలన ఆయనకు తెలుగు బాగానే వచ్చు.

విషయం అంతా విన్నాక “చూడమ్మా! మాధవీ నువ్వు చీకటి పడ్డాక కరివేపాకు కోయకూడదని వారించడం తప్పు కాదు. కానీ నీ మీద విమర్శలు రావడానికి నాకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది మహానగరాల్లో అవసరం సంప్రదాయాన్ని వెనక్కు నెడుతుంది. రెండవది ఆ పట్టింపు మనకే వుంది. కానీ మాట వరసకైనా మీ చుట్టుపక్కల ఉత్తరాది వారితో ఎప్పుడూ ప్రస్తావించి వుండవు. కారణం వాళ్ళతో నువ్వైనా, నా కోడలైనా మమేకం కాలేకపోవడమే! ‘బీ ఏ రోమన్ యిన్ రోమ్’ అని చిన్నప్పుడే చదువుకున్నాం కానీ నీ సంస్కృతిని నువ్వు కాపాడుకుంటూనే వారితో కలవకపోవడం వలన నీ సంస్కృతి గురించి వారికి తెలియదు, వారి సంస్కృతి గురించి మీకూ తెలియదు. వారి సంస్కృతిలో కూడా చీకటి పడితే చెట్టు రెమ్మ తెంచకూడదు అన్న నమ్మకం వుండే వుంటుంది. కానీ చెప్పానుగా మహానగరాల్లో అవసరం నమ్మకాన్ని వెనక్కు తోస్తుంది. హలో అంటే హలో వరకే వున్న మీ మధ్య పలకరింపులు కూడా ఏదైనా అవసరం పడుతుందని మాత్రమే అంటే స్పష్టంగా చెప్పాలంటే సాంబారులో కరివేపాకులానే వున్నారు. వాసన అనే అవసరం కోసం వేసుకుని తినే ముందు తీసిపడేస్తాం. ఇతరులతో మీ సంబంధాలూ అంతే. మీవన్నీ కరివేపాకు బంధాలు మాత్రమే సుమా!” అని కాఫీ తాగుతూ పేపరు చదువుకోవడంలో మునిగిపోయారు. నేనూ బృంద తెచ్చిన కాఫీ తాగి, తన మామయ్య గారు అన్న మాటలు గురించే ఆలోచిస్తూ ‘నేనూ ఎప్పుడైనా అలా చేసానా’ అనుకుంటూ బృంద పిలుస్తున్నా పట్టించుకోకుండా నా యింటికేసి త్వరగా అడుగులేసాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here