Site icon Sanchika

కర్మయోగి-10

[భార్య సుధకి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తాడు సత్యం. ఆస్తులు పంచుకుని ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపడాల్సిందే అంటుంది సుధ. రామారావు ఇంటికి ఆనందస్వామి వస్తారు. సుల్తానాబాద్‍లో జరిగే అఖిలాంధ్ర సాధుపరిషత్ మహాసభల ఏర్పాట్లు చూస్తుంటారాయన. రాజేష్ మళ్ళీ మహాత్మా గాంధీ సేవాసమితికి వెళ్ళి రాజేశ్వరి గారి గురించి అడుగుతాడు. ఆవిడ మాతాజీతో కలిసి సుల్తానాబాద్ వెళ్ళిందని తెలుస్తుంది. ఆస్తుల పంపకం, కుటుంబం విడిపోవడం గురించి దిగులుగా ఉన్న రామారావుకి – ప్రియంవద కూతుళ్ళు గీసి పంపిన బొమ్మల ఆల్బం చూపిస్తుంది సత్యవతి. అందరి స్వభావాలను గ్రహించి అచ్చం వాళ్ళలానే పిల్లలు బొమ్మలు గీశారని ముచ్చట పడతారిద్దరూ. అమెరికా ఫోన్ చేసి మనవరాళ్ళతో మాట్లాడాలనుకుంటారు. – ఇక చదవండి]

[dropcap]అ[/dropcap]నుకున్నట్లుగానే ఆ సాయంకాలం అమెరికా ఫోన్ చేసి మాట్లాడారు. ప్రియంవదతో మాట్లాడాక, పిల్లల్ని ఫోన్ దగ్గరకు పిలవమన్నారు. మోహన, సోహానలిద్దరూ లైన్లోకొచ్చారు. వీడియో కాల్‌లో మనవరాళ్ల వంక చూస్తూ, ఆనందంగా, ప్రేమనంతా రంగరించి రామారావూ, సత్యవతులూ ఒకరి తర్వాత ఒకరు, మాట్లాడసాగారు.

“బంగారు తల్లులూ! బొమ్మలు ఎంత బాగా గీశార్రా తల్లూలు. మీరెక్కడో అమెరికాలో వున్నారు. ఇక్కడ, జరిగే సంగతులన్నీ చూచినట్లే గీశారు. ఎలా కుదిరాయిరా అంత చక్కగా? మీ పెద్ద మామాయ్య రాజకీయలు మీకే తెలిశాయి. మీ చిన్నత్త వేసుకునే మేకప్పూ మీకే కనపడింది. అన్నిటి కన్నా విచిత్రం కిరణ్‌కి పలుగుతో నేలను తవ్వటం ఇష్టమనీ, ప్రణవికి పొయ్యిలు వెలిగించటం, వంటలు ఇష్టమనీ మీకు ఎవరు చెప్పారు? అదంతా చూసినట్లే బొమ్మ వేశారు.”

“ఆ మధ్య పిన్నికి ఫోన్ చేశాం తాతయ్య. వాళ్ల వివరాలడిగాం. వాళ్లు చేసే అల్లరి గురించీ అడిగాం. పిన్ని ఓపిగ్గా అన్నీ చెప్పింది. మేం బాగా గుర్తు పెట్టుకున్నాం. బొమ్మలు గీశాం. మా బొమ్మలు మీకు నచ్చినయ్యా?”

“నచ్చటమా? మీ అమ్మమ్మా నేను ఎంత పొంగిపోయామో, మాటల్లో చెప్పలేను. అలాగే మీ మామయ్యలూ, మురిసిపోతారు. అక్కడ పిన్నీ, బాబాయిలు కూడా మెచ్చుకుంటారు.”

“మమ్మీ తిరిగి వచ్చిన తర్వాత మీ విషయాలన్నీ చెప్పింది అమ్మమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. తాతయ్యను శ్రద్ధగా చూసుకో. నడుమున చెయ్యి పెట్టుకుని నవ్వుతూ ఊరికే నిలబడిపోకు. అమ్మమ్మా! మా మామ్మీ మాకు చాలా రూల్స్ పెడుతుంది. మీరు కూడా మమ్మీ చిన్నప్పుడు మమ్మీకి, పిన్నికి ఇలాగే రూల్స్ పెట్టేవాళ్లా?”

“అబ్బో చాలా జాగ్రత్తలు చెప్పేవాళ్లం. మీ తాతగారయితే మమ్మీ వాళ్లతో పాటు నాక్కూడా చాలా రూల్స్ పెట్టేవాళ్లు. మేం ఆ ప్రకారమే నడుచుకునే వాళ్లం. మీరు కూడా మీ మమ్మీ డాడీ చెప్పినట్లు వినండి. పెద్దవాళ్లెపుడూ పిల్లల బాగు కోరి చెప్తారు. పెద్దవాళ్ల మాట వినటం, బాగా చదువుకోవటం ఈ రెండూ ఇప్పుడు, మీరు చెయ్యాల్సిన పని. అప్పుడే మంచి అమ్మాయిలుగా తయారవుతారు. ఈసారి శెలవులివ్వగానే ఇండియా రండి. ఇప్పట్నించే ప్లాన్ చేసుకోండి. సరేనా! తాతయ్య కోసారి ఫోన్ ఇస్తాను. తనేమైనా మాట్లాడతారేమో?” అన్నది సత్యవతి.

“తాతయ్య! నీ ఆరోగ్యం ఓ.కే.యేగా మందులు వేసుకో. రెస్ట్ తీసుకో. ఇక మీ అమ్మాయితో మాట్లాడుకోండి. ఇంకా కాసేపుంటే మాక్కూడా ఏమైనా రూల్స్ పెట్టేస్తారు. నీతో జాగ్రత్తగా వుండాలి” అంటూ ఫోన్ ప్రియంవద కిచ్చేసి వెళ్లిపోయారు.

“ఏమ్మా! అల్లుండికా రాలేదా? మీకు అక్కడంతా బాగానే వుందిగా? ఇబ్బందు లేమీ లేవుగా? రేపెప్పుడన్నా అల్లుడ్ని ఒకసారి మాట్లాడమను. అల్లుణ్ణి చూసిగాని, మాట్లాడిగాని చాలా రోజులయింది. ఈ మధ్య మీ అత్తగారూ, మామగారూ వచ్చి నన్ను పలకరించి వెళ్లారు. మీ ఊళ్లో బాగా డెవలప్‌మెంట్ కనపడుతున్నదంట. పెద్ద పెద్ద రోడ్లే శాంక్షన్ అయ్యాయంట. అవన్నీ పూర్తయితే మీ ఊరి రూపురేఖలే మారిపోతాయి. మరయితే జాగ్రత్త తల్లీ! వుంటాం” అన్నారు.

కూతురితోనూ, మనుమరాళ్లతోనూ, మాట్లాడేసరికి ఒంట్లోకి కొత్త శక్తి ఏదో వచ్చినట్లుగా అనిపించింది రామారావుకీ, సత్యవతికీ, అక్కడ ప్రియంవందకూ మనసు ఉల్లాసమయింది.

‘అరరే. దేవసేన పోలికలతో వున్న మనిషెవరో కనిపించిదని రాజేష్ చెప్పాడని చెప్పటం ఎప్పటికప్పుడు మార్చిపోతున్నానే’ అనుకున్నది ప్రియంవద.

***

వరలక్ష్మి చెల్లెలి కొడుకు కాలేజీ చదువుకుంటున్నాడు. తండ్రి లేడు. తల్లీ తనూ వుంటారు. జరుగుబాటు పెద్దగా లేదు. వరలక్ష్మి చెల్లెలు కొడుకు చదువుకు సహాయం చేయమని అడిగింది. వరలక్ష్మి తన దగ్గరున్న డబ్బు కొద్దికొద్దిగా ఇస్తూ సాయపడుతున్నది. ఇప్పడు తను కూడబెట్టుకున్నదే రేపు ముసలితనం వచ్చాక తనకు ఆధారమనుకోవాలి. అందుకని చాలా జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేస్తున్నది. చెల్లెలు డబ్బు అడిగేసరికి సత్యవతితో చెప్పింది.

“ఆయనతో మాట్లాడి ఏదైనా సాయం చేయమంటానులే వరలక్ష్మీ” అన్నది.

ఆ మాటల్ని సుధారాణి విన్నది.

“అంతగా చదువుకోవటానికి వెసులుబాటు లేనివాళ్లు – వాళ్లనీ, వీళ్లనీ అడిగి ఎంత వరకు చదువుకుంటారు అత్తయ్యా? చదువాపేసి తమకు తగ్గ పని ఏదో ఒకటి చూసుకోవాలిగానీ. వరలక్ష్మీ! నీ చెల్లెలి కొడుక్కు కూడా ఇదే మాట చెప్పు” అన్నది.

“చిన్నతనంలో చాలా మంది కష్టపడి చదుకుని పైకొచ్చిన వాళ్లంటారు సుధా. నిజంగా, చదువు మీద ఆసక్తి వున్నవాళ్లకు సాయం చేసినా తప్పులేదు. వాళ్ల చదువయిపోయే వరకు కొంత సాయం చేస్తే చాలు. జీవితంలో పైకొస్తారు” అన్నది శశిరేఖ.

“ఆ వస్తారొస్తారు. అందరూ ఉద్యోగాలు చేసి ఊళ్లేలితే పనిపాటలు చేసేదెవరు? మనకు మంచి డ్రైవర్ కావాలి. అలాగే బజారు పన్లు చేయటానికీ ఒక మనిషి అవసరమే. వరలక్ష్మీ! నా మాట విను నీ చెల్లెల్ని ఎక్కడన్నా చాకిరీ చేసుకోమను. తన కొడుకును మన దగ్గర పనిలో పెట్టమను. నెల జీతమిస్తాం. వాళ్లందరికీ గడిచిపోతుంది” అన్నది సుధారాణి.

“వాడికి చదువంటే బాగా ఇష్టమమ్మా. చిన్నప్పటి నుంచీ మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. పొరుగురు పంపి చదివించలేక నా చెల్లెలు ఉన్న వూళ్లోనే డిగ్రీ చెప్పిస్తున్నది. ఇంకొక్క ఏడాది చదువుకుంటే డిగ్రీ పూర్తవుతుందంటమ్మా. బాగా తెవివిగలవాడు. ఏదో ఒక ఉద్యోగం వస్తుదన్న ఆశతో వున్నారమ్మా వాళ్లిద్దరూ. బాగా డబ్బు అవసరమైతే గాని నా చెల్లెలు నోరు తెరిచి అడగదు. మనసు వుండ బట్టలేక సత్యవతమ్మతో అన్నాను” అన్నది వరలక్ష్మి.

“నువ్వడిగావు. ఆవిడ ఇస్తానన్నది. ఉమ్మడి సొమ్మంతా తమ చేతుల్లో పెట్టుకుంటున్నారు. ఎవరికైనా ఇస్తారు. ఎంతైనా ఇస్తారు. నేను కాదంటే మాత్రం ఆగుతారా? ఏమన్నానా?” అంది విసురుగా.

“చూడు సుధా. ఇది చాలా చిన్న విషయం. పదీ పాతికా, ఎవరికైనా సహాయం చేయటం మనింట్లో, ఏప్పుడైనా వున్నదే. ఈ విషయాన్ని కూడా నువ్వు ఆస్తులతో ముడి బెడుతున్నావు. ఆ ధోరణి కొంచెం తగ్గించుకో. మామయ్యగారికి బాగా తెలుసు. మేం ఆలోచించి ఎప్పుడేం చెయ్యాలో అప్పుడది చేస్తాం. నీకింకా చిన్నతనం. ఉమ్మడిగా వుండి నాలుగు విషయాలూ నేర్చుకో. అది ముందు ముందు నీకే మంచిది” అన్నది నచ్చజెప్పే ధోరణిలో సత్యవతి.

“నేర్చుకునే అంత గొప్ప విషయాలు లేవులే ఇక్కడ. మీరే మీ పెత్తనాలు పోతాయని దడుస్తున్నారు.” అన్నది కోపంగా.

“మామయ్యగారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు సుధా. మన మాటలు ఆయనకు వినపడితే, బాగుండదు. అత్తయ్య అన్నట్లు మామయ్యకు ఒకళ్లు చెప్పనఖ్ఖర్లేదు. ఆయనే అన్ని పన్లూ చక్కదిద్దే సమర్థులు. మనం కొన్నాళ్లు ఆగుదాం సుదా” అన్నది శశిరేఖ.

“ఎన్నాళ్లాగాలి! బావగారు ఎలక్షన్స్‌లో నుంచుని డబ్బంతా ఖర్చు బెట్టేదాకానా? నువ్వు చాలా తెలివిగలదానివి. ఉమ్మడిగా వుంటూ మీ సరదాలూ, మీ అవసరాలూ అన్నీ తీర్చేసుకోవాలని, మీరాలోచిస్తున్నారు. నా పిల్లలకు ఏమీ మిగలకుండా పోతుందని నేనఘోరిస్తున్నాను. మా వాటాకు ఎంతో ఆస్తి ఇస్తారన్న నమ్మకంతో మా వాళ్లు నిలువెత్తి కట్నం పోసి నన్నీ ఇంటికి పంపారు. మా నాన్న వాళ్లొచ్చి మొత్తుకున్నా మీకెవరికీ చీమ కుట్టినట్టుగా కూడా లేదు. అత్తయ్యను చూడు మామయ్య కేం నచ్చెప్పకుండా, నాకే చెప్పాలని చూస్తున్నది. అందరూ కలిసి నాకూ, నా పిల్లలకూ అన్యాయం చేద్దామనే ఆలోచనతో వున్నారు. మా ఆయనకు ఇదేం తెలియటం లేదు. ఇదంతా నా ఖర్మ” అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయింది.

“మా చెల్లెలి కొడుకు సంగతి అనవసరంగా చెప్పానమ్మా. సుధమ్మ ఇలా మాట్లాడి వెళ్లింది. ఏమనుకోకు సత్యవతమ్మా” అన్నది బాధగా వరలక్ష్మి.

“నీ మాటల్తో అనేముంది? ఎక్కడ ఏ వంక దొరుకుతుందా, గొడవ పెట్టుకుందామని సుధ ఎదురు చూస్తున్నది. దీన్నింకా పెరగనివ్వకూడదు. సత్యం తన బాధను పైకి చెప్పుకోలేకపోతున్నాడు. వాళ్ల నాన్నగారికే నచ్చచెప్పాలి” అన్నది సత్యవతి.

***

సుల్తానాబాద్‍లో అఖిలాంధ్రా సాధు పరిషత్ మహాసభలు జరుగుతున్నాయి. ఏర్పేడు ప్రధాన స్వామికి, ఆనంద స్వామి చేదోడు వాదోడుగా వుంటాడు. స్వామీజీ ఎక్కడుంటే ఆనందస్వామి కూడా అక్కడే వుంటాడు. సభలు జరిగే నాలుగు రోజులూ అక్కడే వుండాలనుకున్నారు. కాని ప్రధానస్వామికి తప్పనిసరి పనుండేటప్పటికి ఒక రోజుకే తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆయనతో పాటే ఆనందస్వామి వెనుదిరిగాడు.

ఏ రోజుకారోజుకు ఏయే ఆశ్రమాల స్వామీజీలు మాతాజీలు, ప్రవచనాలు చెప్తారో అంతా ముందుగానే ప్రణాళికను రూపొందించారు. దాని ప్రకారం ప్రార్థనలు, ఉపదేశాలు జరిగిపోతున్నాయి. విశాలమైన పందిళ్ళలో భక్త జనం వేలాదిగా కూర్చుని ప్రవచనాలు వింటున్నారు. వచ్చిన వారందరికీ భోజన సౌకర్యం కల్గిస్తున్నారు. బ్రహ్మాండమైన ఉపవ్యాస వేదిక, విశ్రాంతి గదులూ, అన్నీ ఏర్పాటయినాయి.

మూడవ రోజూ, నాల్గవ రోజు కార్యక్రమాలకు మాతాజీ, రాజేశ్వరి హాజరయ్యారు. ఇంత మంది పెద్దలను ఒకేసారిగా చూడటం, వారి అనుగ్రహ భాషణం వినటం కోసం ఓపిక చేసుకుని వీళ్లిద్దరూ వుండిపోయారు. రెండు రోజుల కార్యక్రమాలు పూర్తయినాక వాళ్లిద్దరూ కలిసి కాకినాడ తిరిగి వెళ్లారు.

***

ఆ రాత్రి భోజనాలయ్యాక వరలక్ష్మి చేత వంటిల్లంతా సర్దించి ఆమెను పడుకోమని చెప్ప శశిరేఖ తన గదికొచ్చింది. పిల్లలు నిద్రపోయ్యారు. జగత్ మోహన్ మాత్రం పడుకుని ఏదో దీర్ఘాలోచనలో వున్నాడు.

“ఏమిటి? ఆలోచిస్తున్నారు? ఇంటి విషయాలా? బయటి రాజకీయాలా?” అన్నది శశిరేఖ.

“రెండూ గడ్డుగానే వున్నాయి. ముందు ఇంటి విషయానికొస్తే మన కుటుంబం ఎవరూ వేలేత్తి చూపటానికి వీల్లేకుండా వున్నది. తండ్రీ కొడుకులు ఒకే మాట మీద వుంటారని చాలా మంది మెచ్చుకుంటూ వుంటారు. సత్యానిదీ, నాదీ ఒకే మాట, మా ఇద్దరికీ నాన్నగారు చెప్పిందే వేదం. ఆయనేం చెప్పినా, ఏం చేసినా బాగా ఆలోచించి మాట్లాడతారు. అంత కంటే ఎక్కువ ఆలోచించి చేస్తారు. చేసే ప్రతి పనిలోనూ నిజాయితీగా వుంటారు. అందుకే రాజకీయాల్లో దిగి కొద్దొ గొప్పో చేతిదే వదిలించుకున్నారు. కాని ప్రజలకు సేవ చేశానన్న సంతృప్తిని మిగుల్చుకున్నారు. తెలీకుండా నాలోనూ అవే భావాలు చొచ్చుకుపోయాయి. నాన్నగారు ప్రోత్సహించారు. తమ్ముడూ సరేనన్నాడు. ఎలక్షన్స్‌కు మన యమ్.పి.గారు కొద్దో గొప్పో సాయం చేస్తారు. మిగతాదంతా మనమే భరించాలి. మన కుటుంబంలోని వ్యక్తి యమ్.ఎల్.ఎ. అవుతాడని మేమనుకున్నాం. కుటుంబంకిందే ఖర్చు పెట్టాలని మొదట అనుకున్నాం. కాని సుధ అస్సలు ఒప్పుకోవటం లేదు. ఆ అమ్మాయి భయం ఆ అమ్మాయిది. కీడెంచి మేలెంచాలి కదా? నాన్నగారికి ఇవన్నీ తెలియక కాదు. ఆయనే ఒక నిర్ణయం తీసుకుంటారని నేననుకుంటున్నాను. ‘సుధ కోరినట్లే పంచి ఇవ్వండి. నా తిప్పలు, నేను పడతానని నాన్నగారికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారా’ అని ఆలోచిస్తున్నాను. నేను నోరు తెలిచి చెప్పక తప్పదులా వుంది.”

“మీ మాటలకడ్డు వస్తున్నాను. సత్యానికొక్కడికీ పంచి ఇస్తే కుదరదు. మామయ్య గారిదీ, మీదీ కలిపి మీరే వాడుకుంటారా? అని సుధ ప్రశ్నిస్తుంది. మొత్తం ఆస్తిని ముగ్గురూ పంచుకోవట మొకటే మార్గం. మీ వాటా కొచ్చిన దాంట్లోనే మీరు వాడుకోండి” అన్నది శశిరేఖ.

“స్థిరాస్తులోకటే కాదు ఈనాటి వరకూ మనదంతా ఉమ్మడి వ్యాపారం. ఇప్పుడా వ్యాపారాలనూ విడగొట్టకోవాలి. నాన్నగారి సలహాలతో మా ఇద్దరి ఆలోచనలు, పనితీరులు ఇలా వ్యాపారాలన్నీ మూడు పువ్వులూ, ఆరు కాయలూ అన్న చందాన వున్నవి. విడిపోవాలని మేము ఏనాడూ అనుకోలేదు” అన్నాడు బాధగా.

“ఆస్తులు పంచుకుంటే కాపురాలు వేరయిపోతాయని మామయ్యగారి బాధ. సుధేమో రోజుకోక గొడవ పెట్టుకుంటున్నది. అత్తయ్య కూడా చాలా బాధ పడుతున్నారు. ఈ విషయానికే మామయ్య కూడా లోపలోపల క్రుంగిపోతున్నారు.”

“నిజం శశీ, మా నాన్న చాలా మథనపడుతున్నారు. కనీసం ఆయన సంతృప్తి కోసమైనా, ఆయన ఆరోగ్యంగా వున్నంత కాలం మనమంతా కలిసి మెలిసి వుంటే చాలా బాగుండేది. ఈ చికాకుల వలనే నాన్న ఆరోగ్యం కూడా పాడవుతున్నది. రేపే నాన్న దగ్గర ప్రస్తావన తీసుకొస్తాను. ఇంకా గొడవలు పెరిగి మనుష్యులు మధ్య దూరం పెరక్క ముందే దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలి.”

“మీరూ అదే పనిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి” అంటూ జగత్ మోహన్ దగ్గరగా జరిగి తన ముఖాన్ని, తలనూ ప్రేమగా నిమరసాగింది.

“నాకు చెప్తున్నావు కాని శశీ! పగలంతా సుధతో ఇబ్బందులు పడేది అమ్మా, నువ్వు. సాఫీగా జరిగిపోయే సంసారంలో ఇలాంటి చికాకులు వస్తున్నాయి. అమ్మెంత నలిగిపోతుందోనన్న బాధ నన్ను కుంగదీస్తున్నది. అటు నాన్నగారికి చెప్పలేక ఇటు సుధకు సర్ది చెప్పలేక అల్లాడిపోతున్నది. అమ్మను తలుచుకుంటేనే నాకు చాలా దిగులు పుడుతున్నది. నీకూ, అమ్మకూ ఓర్పు చాలా ఎక్కువ. దాని వలనే మేమింత ప్రశాంతంగా బతుకుతున్నాం. సరే, ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందిలే, పిల్లలెలా చదువుతున్నారు? శశాంక్, శైలజ లిద్దరూ తెలివిగలవాళ్లు. చదువులో వాళ్లకు నీ తెలివి తేటలే వచ్చాయి శశీ” అంటూ జగత్ మోహన్ పిల్లలిద్దరికీ దుప్పటి సరిచేశాడు.

“నా తెలివి తేటలతో పాటు మీ మంచితనమూ వచ్చింది లెండి. మిగతా విషయాలన్నింట్లో మన పిల్లలు అచ్చం మీరే” అన్నది మురిపెంగా. “చాలా పొద్దుపోయింది పడుకోండి” అన్నది.

నిజంగానే ఈ మధ్య కాలంలో ఇంత సావకాశంగా జగత్ మోహన్ ఇంటి విషయాలు మాట్లాడి చాలా నెలలయ్యింది. ఏ విషయామూ అతని దాకా తను వెళ్లనివ్వదు. తనే సమర్థించుకుంటుంది. అదే సుధ అయితే ప్రతి చిన్న విషయానికీ నానా యాగీ చేస్తుంటుంది. తననూ పిల్లల్ని ప్రేమగా చూసుకోవంటతో పాటు శశిరేఖ అత్తమామల్నీ గౌరవంగా, భక్తిగా చూసుకోవటం చూసి జగత్ మోహన్ పొంగిపోతాడు. ‘తను నిజంగా శశిరేఖను పెళ్లి చేసుకుని మంచి పని చేశాననుకుంటాడు. తన నిర్ణయాన్ని అమ్మానాన్నలు కూడా సమర్థించారు. అలా జరగబట్టే ఇల్లు ఇంత ఆహ్లాదంగానూ, మనుషులం ఇంత సంతోషంగానూ వుంటున్నాం. ఇంటికి దీపం ఇల్లాలే నని మా అమ్మ, శశిరేఖా నిరూపిస్తారు.’ అనుకుంటూ శశిరేఖ మీద ఒక చేయి వేశాడు కృతజ్ఞత నిండిన ప్రేమతో.

అదే సమయానికి సత్యవతి కూడా భర్తతో ఆస్తి పంపకాల విషయమే మాట్లాడుతున్నది. “ఇంట్లో ఇంకా గొడవలు పెరిగి ఇల్లు నరకం కాకముందే మనం మేల్కొంటే బాగుంటుందండీ. మన పిల్లలకు ఎవరి వాటా వారికి పంచి ఇవ్వండి. నేనెందుకు చెప్తున్నానో కాస్త ఆలోచించండి. పెద్ద బాబు జగత్ మోహన్ తన వాటాలో కొచ్చిన దాంట్లోనే ఖర్చు పెట్టకుంటాడు. అది రాజకీయలు కానివ్వండి, వ్యాపారం కానివ్వండి. ఈ ఒక్క సారికీ నా మాట వినండి” అన్నది బతిమాలే ధోరణితో.

“నీ బాధ నాకర్థమయింది సత్యవతీ. స్థిరాస్తులు, వ్యాపారాలతో బాటు ఇల్లూ పంచుకోవాలి. అంతే కాదు అన్నీ పంచుకున్న తర్వాత సత్యం మెడలు వంచి సుధా, ఆమె తరుపు వాళ్లు కాపురాన్ని ఇక్కణ్ణుంచి పెళ్లగించుకోపోతారు. సత్తెనపల్లిలో వాడిని మన కళ్ల ముందు ఉంచరు. ఏ విజయవాడో తీసుకెళ్లి వ్యాపారం చెయ్యమంటారు. వాళ్ల ధోరణి నా కర్థమై నేను ఇలా తాత్సారం చేస్తున్నాను. బంగారలాంటి కుటుంబం చూస్తూ చూస్తూ ముక్కలు చేయలేను” అన్నాడు బాధగా.

(ఇంకా ఉంది)

Exit mobile version