Site icon Sanchika

కర్మయోగి-16

[సుజాత భర్తకూ, సుధ తండ్రి సత్యనారాయణకు వాదన జరుగుతుంది. డబ్బు అవసరమయ్యి తమ స్థలం కాగితాలు పెట్టి తెలిసిన వాళ్ల దగ్గర అప్పు తీసుకున్నామని సుజాత భర్త చెబుతాడు. ఆ స్థలం అమ్మేసి వాళ్ళ బాకీ తీరుస్తానంటాడు. ఇద్దరూ కల్సి కాగితాలున్న వ్యక్తి ఇంటికి వెడతారు. అతను కాగితాలు ఇవ్వనంటాడు. సత్యనారాయణ కాస్త కఠినంగా మాట్లాడి సమస్య పరిష్కంచుకోవాలని సూచిస్తాడాయనకు. తిరిగి వచ్చాక, సుజాత భర్త తాను తీసుకున్న పాతిక లక్షల రూపాయలను ఎలాగైనా తిరిగిచ్చేస్తానని, తనని నమ్మమని అంటాడు. సత్యనారాయణ ఆయనకి ధైర్యం చెప్పి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల్ని, అన్నా వదినలని తమ ఇంటికి విజయవాడ పిలుద్దామని అంటాడు సత్యం సుధతో. సందర్భం ఉన్నప్పుడు పిలుద్దామంటూ తిరస్కరిస్తుంది. పిల్లలు సరిగా చదువుకోవడం లేదని, సుధ వాళ్ళని పట్టించుకోవడం లేదని బాధపడతాడు. – ఇక చదవండి]

[dropcap]అ[/dropcap]సెంబ్లీ సమావేశాలు మరలా జరుగుతున్నాయి. యమ్.ఎల్.ఏ.లు అనేక విషయాల మీద మాట్లాడుతున్నారు.

తమ తమ నియోజికవర్గ అభివృద్ధికి కావాలసిన వనరులు కల్పించమని సంబంధిత శాఖా మంత్రులను కోరుతున్నారు.

కడప ప్రాంతానికి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే లేచి నిలబడ్డాడు.

“అధ్యక్షా, మన పర్యాటక శాఖా మంత్రిగారికి మా ప్రాంతంలో వున్న గండికోట దుర్గాన్ని అభివృద్ధి చేయటం చాలా అవసరమని తెలియ చేసుకుంటున్నాను అధ్యక్షా. ఈ గండికోట దుర్గం కడప జిల్లాలో జమ్మలమడుగు ప్రాంతంలో వున్నది. ఈ దుర్గం నుంచే అద్భుతమైన పెన్నా నదీ తీరప్రాంతం కనపడుతూ వుంటుంది. ఈ గండికోట కొంత శిధిలమైనా కొండ మీద వున్న ఈ కోట ఈనాటికీ అద్భుతమైన కట్టడాలతో, శిల్పాలతో వుండి పర్యాటకులను బాగా ఆకర్షిస్తున్నది అధ్యక్షా. ఈ దుర్గంలో వున్న కోట బురుజులు, కోటలోపలున్న ‘నగరాఖానా’, ‘చార్‌మినార్’ కారాగారం, ఎర్రకోనేరు లాంటివి గొప్ప చారిత్రక కట్టడాలు. ఈ గండికోటకు దిగువునున్న పెన్నానది సహజంగా ఏర్పడిన కందకంలాగా వుంటుంది. ఈ లోయ అమెరికాలోని లాస్ వెగాస్ వద్దనున్న గ్రాండ్ కానియన్ లోయను గుర్తుకు తెస్తుందని పరిశీలకులు చెప్తున్నారు. కోటలో నుంచి చూస్తుంటే 300 అడుగులోతులో పెన్నానది కనుపిస్తూ కనువిందు చేస్తూ వుంటుంది.”

తెలియని విషయాలు తెలుసుకుంటూ చాలా మంది యమ్.ఎల్.ఏ.లు మంత్రులు ఆసక్తిగానే వింటున్నారు. జగత్ మోహన్ మరీ శ్రద్ధగా వింటున్నాడు.

“అధ్యాక్షా, నేను కొంచెం సమయం తీసుకుని విషయాలన్నీ పర్యాటక మంత్రిగారికి తెలపాలనుకుంటున్నాను. నాలుగు మైళ్ల విస్తీర్ణంతో వున్న కోట అధ్యక్షా ఇది. ఈ కోటలో వున్న ప్రతి మంటపమూ దేని కదే సాటి. కోట చుట్టూ వున్న కొండలూ, అడవులూ ఎంతో మనోహరంగా వుంటాయి. ముఖ్యమైన చారిత్రక ప్రాంతం కావటాన రెండో హంపి అని ఫ్రెంచ్ పర్యాటకుడు కొనియాడాడు. ఈ కోటను గురించి కవులు కావ్యాలు వ్రాశారు. దర్శకులు సినిమాలు తీశారు. మా జమ్మలమడుగు ప్రాంతం ప్రజల విన్నపమేటంటే మన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గత ప్రభుత్వ హయాంలో ఒక హోటల్‌ను కట్టారు. అది చాలదు. అనేక పరిశ్రమలు పెట్టొచ్చు. కోటకు వెళ్లే దారులు విశాలంగా చెయ్యాలి. కోట నుండి పెన్నానదిని చూడటానికి వెళ్లే వారికి వీలుగా కొండ మీద ఫెన్సింగ్, సైట్ సీయింగ్ స్పాట్లు ఏర్పాటు చెయ్యాలి. పెన్నానదిలో బోటు సౌకర్యం కల్పించాలి. దీన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్షా. చివరగా ఒక్క మాట అధ్యక్షా. ఈ జిల్లాలో వర్షపాతం తక్కువ. కరువు ఎక్కువ. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందితే ప్రజలకు ఎన్నో రకాల, జీవనోపాధి దొరుకుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన పర్యాటక శాఖా మంత్రిగారు ఈ గండికోట అభివృద్ధిపై దృష్టి పెట్టాలని విన్నవించుకుంటున్నాం” అంటూ ముగించాడు ఆ యమ్.ఎల్.ఏ.

పర్యాటక శాఖా మంత్రి తన సమాధానం విన్పించటానికి లేచాడు. “అధ్యాక్షా! యమ్.ఎల్.ఏ గారి సూచనల పట్ల దృష్టి పెడతాను. ఇప్పటికే నాకు కొన్ని ఆలోచనలు వున్నాయి. ఏయే ప్రాంతాలను మన వారసత్వ సంపదగా పరిగణించవచ్చో అలాంటి పరిగణనకు ఏయే ప్రాంతాలు అనువుగా వున్నాయో తెలుసుకుంటాను. వారసత్వపు హోదా లభించటానికి ప్రభుత్వపరంగా మా కృషి మేం చేస్తాం. కేంద్ర పురావస్తు శాఖతోను సంప్రదిస్తాం. వారి సహకారం తీసుకుంటాం. మన ముఖ్యమంత్రిగారి దృష్టికి తరచూ నేనీ విషయాలు తీసుకెడతాను. వారసత్వ హోదా దక్కిన ప్రాంతాలకు సహాయ మందిచటానికి యూనెస్కో సంస్థ ముందుకొస్తుంది. అలా వస్తే ఎంతో మంది పరిశోధక విద్యార్థులు దేశవిదేశాల నుండి పరిశోధనల నిమిత్తం వస్తారు. మనం బ్రహ్మాండమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే ఎన్నో చిన్న పెద్ద వ్యాపారాలు పెరుగుతాయి. కోట అంతా లైటింగ్ పెట్టించే ఆలోచన వున్నది. అటు తిరుపతి, కడప దర్గా, ఒంటిమిట్టలను కలుపుతూ ఒక యాత్రా కారిడారును ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికున్నది. నేను దీనిని మన ప్రభుత్వం తరుపున ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా చేపట్టాలనుకుంటున్నాను.” అంటూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు.

ప్రస్తావన ప్రారంభించిన యమ్.ఎల్.ఏ.తో పాటు మిగతా వారూ ఆ ఆలోచనలకు హర్షధ్వానాలు ప్రకటించారు. కొద్ది రోజుల్లో సమగ్రమైన సమాచారాన్ని సేకరించి పెట్టుకున్నారని జగత్ మోహన్‍ను ముఖ్యమంత్రితో సహా మిగతావారూ మెచ్చుకున్నారు. తానే స్వయంగా నాల్గు చోట్ల తిరిగి మరింత అవగాహన పెంచుకునే ఆలోచనలో వుంటున్నాడు జగత్ మోహన్. అసెంబ్లీ సమావేశాలలో చక్కని విషయాలను, తన ఆలోచనలను తెలియజేస్తూ అనుభవమున్న రాజకీయవేత్త లాగానే రాణిస్తున్నాడు.

మరో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గండికోట విశేషాలు విన్పించినట్లుగానే తానుకూడా భట్టిప్రోలు బౌద్ధ స్తూపాన్ని గురించి తెలియజేయ్యాలన్న ఉత్సాహంతో రేపల్లె నియోజకవర్గ ఎమ్.ఎల్.ఏ. లేచి నిలబడ్డాడు. “అధ్యక్షా! నేను భట్టిప్రోలు బౌద్ధ స్తూపాన్ని, దాని అభివృద్ధిని గురించి మన మంత్రిగారికి చెప్పాలనుకుంటున్నారు. ఇది గుంటూరు నుండి రేపల్లె వెళ్లే దారిలో వున్నది. ఈ స్తూపం దగ్గర కొన్ని శాసనాలు కూడా దొరికాయి. దాన్ని బట్టి చూస్తే ఇది అశోకుని కాలంకంటే కూడా ముందుదని తెలుస్తున్నది. పురావస్తు పరిశోధకులే ఈ విషయాన్ని నిర్థారించారు. ఇక్కడి ఇటుకలు చాలా పెద్దవి అధ్యక్షా. ఇప్పటికీ అక్కడ కనపడతాయి. ఇక్కడే బుద్ధుని తల ప్రతిమ కూడా లభ్యమైంది. ఇక్కడి తవ్వకాలలో లభించిన బండరాతి పేటికలు, ధాతుకరండాలు, స్ఫటికపు పేటిక, ఆ పేటికలో లోపలి భాగంలో చెక్కబడిన ప్రాకృత భాష, బ్రహ్మీలిపి చాలా పేరు పొందింది. ఎందుకంటే ఇలాంటి అమరిక మరెక్కడా లేదు కాబట్టి. దీన్ని మొదట్లో ప్రతీపాలపురం అని పిలిచేవారు అధ్యాక్షా. ఇక్కడి స్తూపం మధ్య భాగంలో బుద్ధుని ధాతువులు నిక్షేపించటం వలన ఆ ధాతువులతో పాటు కొన్ని బంగారు పుష్పాలు, మరి కొన్ని వస్తువులు, స్వస్తిక్ ఆకారంలో వున్న రాగిరేకులు వెండి నాణేలూ, నీలం, పగడం, మత్యం లాంటి వాటిని కూడా వుంచటం జరిగింది అధ్యక్షా. వాటి ఫోటోలు ఇవి అధ్యాక్షా” అంటూ భట్టిప్రోలు స్తూపపు ఛాయా చిత్రాన్ని, స్తూపపు తవ్వకాలలో దొరికిన ఇటుకలు, నాణెం ఛాయాచిత్రాలను సభలో చూపించారు. ఆయన శ్రద్ధకు అందరూ ముచ్చటపడ్డారు.

“బౌద్ధులకిది చాలా పవిత్ర స్థలం అధ్యక్షా. ఎంతో చారిత్రక సంపద లభించిన చోటు ఇది. ఇప్పటికీ బుద్ధ జయంతి రోజున బౌద్ధభిక్షువులు వచ్చి ప్రణామాలు అర్పించి వెళతారు. ఇప్పటికీ స్తూపపు చుట్టు ప్రక్కల చాలా ప్రాంతం ఆక్రమణలకు గురైంది. దీన్నొక చారిత్రక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో వున్నది. ఇక్కడొక గైడ్ నేర్పాటు చేసి ఈ స్థూపపు చారిత్రక నేపథ్యం, ఆనాటి సంస్కృతిని పర్యాటకులకు చెప్పించాల్సిన అవసరం ఎంతో వున్నది. ఇక్కడొక మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలి. భట్టిప్రోలులో దొరికిన శాసనాలు, స్తూప ఆకృతిని, స్తూపం దగ్గర దొరికిన, విలువైన వస్తువులను, ఇటుకలతో సహా భద్రపరచాలి. ఈ బౌద్ధ స్థూప పరిరక్షణకు వెంటనే చర్యలు చేపట్టాలి. అలా పరిరక్షిస్తే మంచి పర్యాటక ప్రాంతం అవుతుంది. కాబట్టి అధ్యక్షా! మన పర్యాటక శాఖా మంత్రిగారు ఈ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుతున్నానధ్యక్షా” అంటూ కూర్చున్నాడు.

జగత్ మోహన్ అంతా శ్రద్ధగా విని తన సమాధానం చెప్పటానికి లేచాడు. “అధ్యక్షా! రేపల్లె ఎమ్.యల్.ఏ. గారు చాలా మంచి విషయం తెలియజేశారు. ఈ విషయాలు కొన్ని నేనూ విన్నాను. త్వరలోనే ఆ స్తూపాన్ని చూడాలనుకుంటున్నాను. పురావస్తు శాఖ వారితో కూడా సంప్రదించి ఏయే రీతిగా చర్యలు తీసుకోవాలో తెలుసుకుంటాను” అని హామీ ఇచ్చాడు.

“దాంతో పాటి ఇంకా కొన్ని విషయాలున్నవి. ఇవే కాదు. జలరవాణా పట్ల కూడా శ్రద్ధ వహించాలి. మన రాష్ట్రంలో కొన్ని ద్వీపాలున్నాయి. వాటిని మరింత అభివృద్ధి చేసి పర్యాటకరంగాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతో మన రాష్ట్ర ప్రభుత్వమున్నది. పరిశీలించే కొద్దీ ఏన్నో ప్రదేశాలు తటస్థపడుతున్నాయి. మన రాష్ట్రానికి ఎంతో చారిత్రక సంపద యాత్రా స్థలాల వంటివి లెక్కకు మిక్కిలిగా వున్నాయి. కొండ ప్రాంతాలు కానీ, అటవీ ప్రాంతాలు కానీ గిరిజన ప్రాంతాలు కానీ, దేన్నీ వదలి పెట్టటమో, నిర్లక్ష్యం చేయటమో జరగదు. వీలున్నంత వరకు అభివృద్ధి పరుస్తాం” అని చెప్పి కూర్చున్నాడు.

***

రాజేష్‌కు మెడికల్ కాలేజీలో పని ఒత్తిడి ఎక్కువగా వుంటున్నది. ఒక పక్క కాన్ఫరెన్సులకు వెళ్లి రావాల్సి వస్తున్నది. డిగ్రీ వాళ్లకో, పీ.జీ వాళ్లకో పరీక్షలు జరుగుతూ వుంటాయి. మధ్య మధ్యలో అటు యమ్.బి.బి.యస్. వాళ్లకో, పి.జీ వాళ్లకో సప్లిమెంటరీలు జరుగుతూనే వుంటాయి. వీటికి ఎగ్జామినర్‌గా వుండాలి. లేదా వేరే మెడికల్ కాలేజీలకు ఎగ్జామినర్‌గా వెళ్లి రావటమో జరుగుతుంది. యమ్.డి. చేసే వాళ్లు, యమ్.ఎస్. చేసే వాళ్లు సబ్‌మిట్ చేసిన థీసిస్ పుస్తకాలు సరిచూడటం చెయ్యాలి. ప్రతి నిముషమూ పని వున్నట్లే వుంటున్నది. తమ కాలేజీ పని చేసే చాలా మంది డాక్టర్లకు కాకినాడలోనే ప్రైవేట్ ప్రాక్టీస్ వున్నది. రాజేష్ అందుకిష్టపడక సాయంత్రాలు అయినా కుటుంబంతో గడపాలని ఇటీవలి వరకూ ప్రాక్టీస్ జోలికి పాలేదు. కాని బంధువులూ, స్నేహితులూ నచ్చజెప్పారు – కొంత మంది రోగులకైనా ఉపయోగముంటుంది. ప్రతి ఒక్కరూ కాలేజీ హాస్పటల్‌కు రాలేరు. అక్కడ ట్రీట్‌మెంట్ కోసం రెండు మూడు సార్లైనా తిరగాలి. నువ్వు కనీసం ఒక చిన్న క్లినిక్ లాంటిది పెట్టి, కొంత మందినైనా పరీక్షించి మందులు రాసిస్తే ఉపయోగంగా వుంటుంది. నీ క్లినిక్ లోనే ఒక మెడికల్ షాపు చిన్నదైనా పెట్టించు. మందులూ ఇక్కడే కొనుక్కుంటారు. తనికీ పని దొరుకుంది. అలాగే క్లినిక్‌లో ఒక టెక్నీషియన్‌నూ, ఒక రిసెప్షనిస్టునూ అప్పాయింట్ చేసుకుంటే బాగుంటుంది. నువ్వు సరేనంటే మంచి సెంటర్ లో ఒక చిన్న బిల్డింగ్ చూస్తాము. క్లిన్క్ ఓపెన్ చేస్కో – అని పదే పదే చెప్తే రాజేష్ అలాగే చూడమన్నాడు.

‘జీర్ణకోశ వ్యాధుల క్లినిక్’ పేరుతో సాయంకాలం 5 గంటల నుండి రాత్రి తొమ్మిది వరకు పని వేళలు నిర్ణయింపబడ్డాయి. రోజు కొక పదిహేను మందిని పరీక్షిస్తే చాలు. తక్కువ ఫీజుతో ప్రజలకు కాస్త అందుబాటులో ఉండాలనుకున్నాడు. దాని ప్రకారమే క్లినిక్ రన్ చేస్తుండటంతో తీరిక అనేదే లేకుండా పోయింది. కాని మధ్య మధ్యలో రాజేశ్వరి విషయం గుర్తుకొస్తూనే వున్నది.

ఒక రోజు క్లినిక్‌లో కూర్చుని వున్నాడు రాజేష్. క్లినిక్ ముందు ఒక ఆటో ఆగింది. దాంట్లో నుంచి మహాత్మాగాంధీ సేవా సమితిని నడిపే మాతాజీ దిగింది. ఆమెతో పాటు సహాయకులుగా ఇద్దరొచ్చారు. మాతాజీ నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికొచ్చి కూర్చున్నది. ఆమెను గమనించి రిసెప్షనిష్టు వెంటనే లోపలికి పంపించింది. తాను కూడా లోపలికెళ్లి “డాక్టరుగారూ ! వీరిని మాతాజీ అంటారు. మహాత్మాగాంధీ సేవాసమితిని నడుపుతారు. వీరు వృద్ధాశ్రమం కూడా నడుపుతారు” అని పరిచయం చేసింది.

“మాతాజీనా?” తనకు కావాల్సిన వ్యక్తి వీరేనని గ్రహించాడు. పక్కనున్న సహాయకుల వంక చూశాడు. వారిలో రాజేశ్వరి లేదు.

“చెప్పండమ్మా! మీ ఇబ్బంది ఏమిటి?”

“పేగుపూత అన్నారు డాక్టరుగారూ! ఎండోస్కోపీ కూడా చేశారు. ఇదుగో దాని తాలూకు రిపోర్టు.” అంటూ చూపించారు.

“పూత బాగానే వున్నది. దీని వలన మీకెలాంటి ఇబ్బందులు వస్తున్నాయి.”

“ఒక్కోసారి గొంతులో నుంచి బాగా వికారంగా అన్పిస్తుంది. ఛాతీ భాగంలో కూడా అసౌకర్యంగా వుంటుంది. తల కూడా బాగా బరువుగానూ వుంటున్నది. ఆహార పదార్థాలు చాలా వరకు పడటం లేదు.” మాతాజీ తన బాధలు ఏకరవు పెట్టింది.

“ఎసిడిటీ బాగా పేరుకుంటుందమ్మా. వేళకు ఆహారం తీసుకోండి. ఉపవాసాలవీ ఎక్కువగా చేయద్దు. కారాలు, మసాలాలు ఎలాగూ వాడరేమో కదా? సరిపడని పదార్థాలు వదిలి పెట్టండి. ముఖ్యంగా వేళకు ఆహారం తీసుకోవటం, ప్రతి రెండు గంటలకోసారి మీకు సరిపడే ఆహారం కొద్ది కొద్దిగా తీసుకోండి. ఉదయం పూట పరగడుపున వాడే బిళ్లతో పాటు సాయంకాలం వేసుకోవటానికి మరో టాబ్లెట్ వ్రాస్తాను. పొట్ట సాఫీగా వుంటడానికి సిరప్ వ్రాసిస్తాను. రాత్రి పూట భోజనం తర్వాత వేసుకోవటానికి ఒక చిన్న టాబ్లెట్ వ్రాస్తున్నాను. దాని వలన ప్రశాంతంగా వుంటారు. ఎక్కువగా ఆలోచనలేం పెట్టుకోకండి. ఒక నెలకు వ్రాసిస్తాను మందులు. నెల తర్వాత మళ్లీ రండి. ఈలోగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వచ్చేసేయండి” అంటూ మందులు వ్రాసిచ్చాడు.

“మీ సేవా సమితిలో కార్యక్రమైలు చాలా వున్నట్లున్నాయి. అన్నీ సజావుగా జరుగుతున్నాయా? ఒకటి రెండు పర్యాయాలు నేను వచ్చాను. కాని అప్పుడు మీరు లేరు. కలవటం కుదరలేదు” అన్నాడు.

“అయ్యో! అలాగా! మాతో మీకేం పనో తెలుసుకోవచ్చా డాక్టరుగారూ?”

“పెద్దగా ముఖ్యమైన పని ఏం లేదు. మహాత్మాగాంధీ సేవాసమితిలో మంచి వాతావరణం వుంటుంది. అక్కడ మాకు తెలిసిన వారినొకర్ని చేర్చటానికి వీలవుతుందా అని వేరే వూరి వారు ఫోన్ చేశారు. అదేంటో తెలుసుకుందామని నేనే వచ్చాను. అదీ ఈ క్లినిక్ పెట్టకముందు. నాకు ఫోన్ చేసిన వారికి ఇప్పటికీ అదే ఉద్దేశముంటే మీకు ఫోన్ చేస్తాను మాతాజీ. ఈ మందులు వాడండి. ఈసారి మిమ్మల్ని చూడటానికి, మీ ఆరోగ్యం గురించి తెలిసికోవటానిక నేనే అక్కడికొస్తాను.”

“అయ్యో అంతకన్నానా! కాని మీకు తీరికెక్కడుంటుంది డాక్టరుగారూ! నేనే వచ్చి చూపించుకుంటానులే, డాక్టరుగారూ. వస్తాను” అంటూ ఆమె శెలవు తీసుకుని వెళ్లిపోయింది.

వచ్చి చూస్తాను అన్నాడు కాని రాజేష్‌కు వెళ్లటానికి వీలుపడనే లేదు. వరల్డ్ మెడికల్ కాన్ఫరెన్స్ జెనీవాలో జరుగుతుంటే అక్కడికి వెళ్లవలసి వచ్చింది. అక్కడివ్వవలసిన ప్రెజెంటేషన్ పేపర్సును ప్రిపేర్ చేసుకోవటంలో మునిగిపోయాడు. అంతే కాక అక్కడ జరిగే వర్క్‌షాప్‌లో నెల రోజుల పాటు వుండవలసి వచ్చింది. జెనీవా నుండి తిరిగొచ్చాక కూడా కాస్త హడావుడిగానే వుండిపోవలసి వచ్చింది. ఆ తర్వాత మాతాజీనే మరలా క్లినిక్ కొచ్చింది.

“ఇది వరకటంత ఉదృతం లేదు కాని ఇంకా ఇబ్బంది పెడుతూనే వున్నది. ఒకసారి చూపించుకోవాలని వచ్చాను” అని చెప్పింది.

“నేను జెనీవా వెళ్లాల్సిరావటంతో మిమ్మల్ని కలవటానికి రాలేకపోయ్యాను. పూర్తిగా తగ్గటానికి కాస్త టైమ్ పడుతుంది. ఇది సీరియస్ కాదు గాని బాగా చికాకు పెడుతుంది. ముఖ్యంగా మీరు ఆలోచనలు తగ్గించుకోండి. వేళకు తినండి. బాగా నిద్రపోతున్నారా?”

“నిద్ర బాగానే పడుతున్నది. నన్ను కవలటానికి వస్తానంటున్నారు. చాలా సంతోషం. కాని మీకు సమయం దొరకకపోవచ్చు. నేను చేయగలిగిన పని ఏదైనా వుంటే చెప్పండి.”

“అదేం లేదు. వైద్యం చేయించుకుని వెళ్లండి. నేను పని మీద తప్పకుండా వస్తాను. కాని ఎప్పుడొస్తానో తెలియదు. మీరిక బయలుదేరండి” అంటూ మాతాజీతో వచ్చిన వారి వంక పరిశీలనగా చూశాడు. వారిలో రాజేశ్వరి లేదు.

అసలావిడ అక్కడే వుందా! లేక వెళ్లిపోయిందేమో కూడా తెలియదు. ఆ విషయం అందరి ముందు క్లినిక్‌లో అడగటం అంత సభ్యత కాదేమోనని ఆగాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version