Site icon Sanchika

కర్మయోగి-19

[పర్యాటక రంగాన్ని తన శాయశక్తులా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంటాడు జగత్. మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. భీమిలి ఎమ్.ఎల్.ఎ. తమ ప్రాంతపు అభివృద్ధి గురించి ప్రస్తావిస్తే, జగత్ అతనికి హామీ ఇస్తాడు. విజయవాడలో మిల్ స్టోర్ పని చేయడం ప్రారంభమవుతుంది. సత్యనారాయణ కొడుక్కీ, అల్లుడికీ బాధ్యతలు అప్పజెప్తాడు. సత్తెనపల్లిలోని తమ రైస్ మిల్ గుర్తొచ్చి, మామగారు చేసే హడావిడికి విసుక్కుంటాడు సత్యం. కాకినాడలో మాతాజీకి పూర్తిగా నయం అవదు. ఈసారి రాజేశ్వరితో పాటుగా రాజేష్ క్లినిక్‍కి వస్తుంది. ఆమెని పరీక్షించి, మందులు రాసిచ్చి, కాసేపు ఉండమని కోరతాడు రాజేష్. తన ప్రైవేటు రూమ్‍లో వాళ్ళిద్దరిని కూర్చోబెడతాడు. రాజేశ్వరి పోలికలతో ఉన్న తన భార్య గురించి చెప్పి రాజేశ్వరి, ఎవరో ఏమిటో వివరాలు చెప్పమంటాడు. రాజేశ్వరి నోరు విప్పదు. అప్పటికే  బాగా ఆలస్యం అవడంతో, వాళ్ళు బయల్దేరుతారు. ఆశ్రమంలో మాతాజీ రాజేశ్వరి గతం గురించి అడుగుతుంది. తప్పనిసరిగా చెప్పాల్సి వచ్చి, రాజేశ్వరి తన గతం చెబుతుంది. మల్లికార్జునకు కొత్తగా ఫెళ్లయింది. భార్యతో కలసి అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేస్తూంటాడు. తనకు వ్యవసాయమంటే బాగా ఇష్టమని చెబ్తాడు. తండ్రికి మాత్రం వ్యవసాయం అంటే ఇష్టం లేదనీ, తల్లి ప్రోత్సహించిందని చెప్తాడు. తాను కర్నాటకలో సారవంతమైన భూములున్నట్టు తెలుసుకున్నాననీ, రాయచూరు సమీపంలో ఒక తెలుగు వారి క్యాంపులో ఉంటున్నట్టు, అక్కడ భూమి కొని వ్యవసాయం చేస్తున్నట్టు భార్య లక్ష్మికి చెప్తాడు మల్లికార్జున్. – ఇక చదవండి]

[dropcap]“ల[/dropcap]క్ష్మీ! చెప్పిన విషయమే అయినా మళ్లీ చెప్తున్నాను. నేను వ్యవసాయిదారుణ్ణి. అక్కడ రాయచూరు పొలాల్లో విలాసవంతమైన ఇల్లు లేదు. అందురూ కోరుకునేటట్లుగా నాకే ఉద్యోగమూ లేదు. మట్టిలో తిరిగే వాణ్ణి, నాతో పెళ్లికి ఏ ఆడపిల్లా ఇష్టపడలేదు. ఆడపిల్లల తల్లిదండ్రుల దృష్టిలో నేనొక పెళ్లికొడుకునే కాదు. దాంతో నా పెళ్లి బాగా లేటయింది. అమ్మ ఆ దిగులుతోనే పోయింది. నేను చెప్తే విన్నావా? అంటూ నాన్నా నిరసనగా చూసేవాళ్లు. వదిన చాలా మంచిది. అన్నయ్యా వదినే పూనుకుని మన పెళ్లి చేశారు. ఇప్పటికి నన్ను నన్నుగా చూసి నువ్వూ పెళ్లికి ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా వున్నది. నీకు తల్లీదండ్రీ లేకపోయే సరికి మీ అన్నావదినా ఏదో భారం దింపుకోవడం కోసం నిన్ను నాతో పెళ్లికి ఒప్పించారని చాలా మంది అనుకున్నారు. అందుకే నిన్ను ఒకటికి రెండు సార్లు అడిగాను గుర్తుందా!”

“అవును అడిగారు. మా అన్నా వదిన బలవంతంతో కాదు. మీ మాటలు నిజాయితీ నాకు నచ్చాయి. అందుకే మీతో పెళ్లికి ఒప్పుకున్నాను” అని చెప్తుంటే లక్ష్మి మొఖంలోకి సిగ్గు పాకి వచ్చింది.

“అరక తోలుకునే వాణ్ణి అయినా ఆలిని బాగానే చూసుకోగలను లక్ష్మీ. పట్నవాసపు పోకళ్లు అందివ్వలేనేమోగాని నా గుండె నిండా పెళ్లాన్ని, పిల్లల్నీ నింపుకోగలను. అలా చేయలేనినాడు ఈ మల్లికార్జున్ లేనట్లే” అన్నాడు ఎంతో ఉద్వేగంగా.

అటూ ఇటూ చూసి లక్ష్మి ప్రేమగా మల్లికార్జున్ చెయ్యి పట్టుకుని నొక్కింది.

చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి అయిన వారి ఆదరణకు నోచుకోని జీవితం లక్ష్మిది. అతి కష్టం మీద ఇంటర్ పూర్తి చేసింది. జీవితాన్ని మాత్రం చాలా చదివింది. పెళ్ళికి ముందే మల్లికార్జున్ రెండు మూడు సార్లు మాట్లాడాడు. తన కెంతో నమ్మకం, ప్రేమా కలిగాయి. అన్నా వదినలు తన పెళ్లి, వాళ్ల భారం వదిలంచుకోవటానికే చేసుండొచ్చు. కాని లక్ష్మి మాత్రం మనస్ఫూర్తిగానే ఇష్టపడి మల్లికార్జున్‌ను పెళ్లి చేసుకుంది.

మల్లికార్జున్ ఇప్పటికైనా ఒక ఇంటివాడయ్యాడని అతని అన్నా వదినలు సంతోషించారు. అన్నా, వదినలే పూనుకుని పెళ్లి భారమంతా మోశారు. కొద్ది రోజులు మల్లికార్జున్ తన వాళ్లతో గడిపి రాయచూర్‌కు లక్ష్మితో కలిసి బయల్దేరాడు.

 “చిన్న పిల్లలతో ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తున్నానయ్యా. లేకపోతే నేనే వచ్చి మిమ్మల్ని దిగబట్టే దాన్ని” మల్లికార్జున్ వదిన బాధపడింది. లక్ష్మీ వాళ్ల అన్నా వదినలకేమీ పట్టలేదు.

“మరేం ఫర్వాలేదొదినా. చిన్న పిల్లలతో అంత దూరం నువ్వొచ్చి ఇబ్బంది పడవద్దు. నీకిక్కడ నాన్నగారి బాధ్యత కూడా వున్నది. మేం ఇద్దరం వెళ్లగలం. ఫర్వాలేదు” అన్నాడు మల్లికార్జున్.

అలా వాళ్లిద్దరే బయలుదేరి వచ్చారు.

రైలు కిటిలో నుంచి చూస్తూ కూర్చున్నది లక్ష్మి.

“లక్ష్మీ. మనం గుంతకల్‌లో దిగి ఆదోని, ఆదోని నుండి రాయచూర్ వెళ్లాలి. కాసేపు పడుకో” అంటూ తను నడుం వాల్చాడు మల్లికార్జున్.

రాయచూర్‌లో దిగంటతోనే మల్లికార్జున్ స్నేహితుడు వచ్చి వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడో రోజు వున్నారు. లక్ష్మి కలుపుగోలుతనం వాళ్లకు బాగా నచ్చింది.

“మీరూ ఓ సారి మా మండువ క్యాంప్‌కు రండి” అని పిలిచింది స్నేహితుడ్నీ, అతడి భార్యాను.

మండువ క్యాంప్‍లో లక్ష్మీ మల్లికార్జున్‍ల కొత్త కాపురం మొదలయ్యింది. అక్కడ పన్నెండు తెలుగు కుటుంబాలు వుంటున్నాయి. స్థానికంగా వుండే వాళ్లు మిద్దెల లాంటివి కట్టుకుని వున్నారు. వాటిల్లోనే ఓ పక్కన పశువుల్నీ కట్టేసుకున్నారు. తెలుగు కుటుంబాల వాళ్లు మాత్రం పశువులకు విడిగా, చావిడి లాంటిది వేసుకున్నారు.

ప్రొద్దునే లేచి వాకిలి చిమ్మి నీళ్లు చల్లి తనితీరా ముగ్గులు పెట్టేది లక్ష్మి. శుక్రవారమొస్తే వాకిలి మొత్తం దాకా పేడా మట్టీ కలిపి అలికేది. ముగ్గు మధ్యలో లక్ష్మీ పీఠాన్ని, శ్రీచక్రాన్ని పోలిన గీతల ముగ్గునీ ఇమిడ్చేది. వాకిలి మొత్తల్లో తామరపువ్వునో సూర్యచంద్రుల్నీ తీర్చిదిద్దేది. అలా ప్రతి పనిలోనూ తన ప్రత్యేకతను చూపించేది. అది మల్లికార్జున ఇల్లు. మల్లికార్జున్ పెళ్లాం గట్టిదే అనుకునే వాళ్లు క్యాంప్ లోని మిగతా ఆడవాళ్లు.

లక్ష్మీ మల్లికార్జున్‌లకు వెన్నెల్లో తిరగటమంటే చాలా ఇష్టం. వెన్నెల రోజుల్లో తలుపు అలా, దగ్గరగా వేసి ఆరు బయట కొచ్చేవాళ్లు. అంతటా నిశ్శబ్దంగా వుండేది. ఇంకాస్త ముందుకు వెడితే అన్నీ పొలాలే. కనుచూపు మేరంతా పత్తి మొక్కలో, పొద్దుతిరుగుడు మొక్కలో, నేల మట్టానికున్న వేరుశనగ మొక్కలో కనపడేవి. ఎంత దూరం నడిచేవాళ్లో తెలిసేది కాదు. కాళ్లు పీకుతుంటే లక్ష్మి ఎక్కడైనా కూచుందామనేది. లక్ష్మి కూర్చుంటే మల్లికార్జున ఆమె ఒళ్లో తల పెట్టుకుని పడుకునేవాడు. వెన్నెట్లో లక్ష్మి పచ్చటి చెంపలు మెరుస్తూ వుండేవి. ఆరు బయటిగాలికి రేగిన నొక్కున జుట్టు దాని తాలుకు ముంగురులు నుదుటి మీద చెంపలమీద పడేవి. ఒకసారి చూస్తే మళ్లీ, మళ్లీ చూడాలనిపించే అందం లక్ష్మిది. అలాంటి అందగత్తెను తనకు భార్యగా చేసినందుకు, భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకునేవాడు. తన అదృష్టానికి మురిసిపోయేవాడు.

క్రిందటి జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో, మల్లికార్జున్‌కు భార్యను కాగలిగాను అని లక్ష్మి భావించింది. కాసేపటికి ఇద్దరి ఒళ్లు చల్లగా అయిపోయేది. చలిగా అనిపించి లక్ష్మి తన పమిట కొంగును భుజాల చుట్టూ కప్పుకునేది. అలా కాదు, ఇలా అంటూ లక్ష్మిని తన గుండెల్లో పొదవుకునేవాడు మల్లికార్జున్.

పగలంతా పొలం పని, రాత్రి ప్రొద్దుపోయే వరకు లక్ష్మితో ప్రేమ విహరంలో తాను మునుగుతూ, లక్ష్మిని కూడా ముంచుతూ జంట హంసల్లాగా ప్రేమ కాసారంలో ఈదులేస్తున్నారు మల్లికార్జున్, లక్ష్మిలు. ఆరుబయటి ప్రకృతి, ఈ వెన్నెల ఇంత బాగుంటాయని లక్ష్మికి ఊహా మాత్రంగా కూడా తెలియదు. చంద్రుడు మబ్బుల చూటుకు వెళ్లిపోతూ వుండేవాడు. వెన్నెల కూడా ముసుకుపోతుందేమోనని మొదట్లో తెగ ఆరాట పడిపోయేది లక్ష్మి.

వీలు కుదిరినప్పుడల్లా వెన్నెల విహారం చేసే వాళ్లు మల్లికార్జున దంపతులు. ఒక రోజు “ఒంట్లో బాగాలేదు, రాయచూరు హాస్పటల్ కెళ్లి చూపించుకోవాలి” అన్నది లక్ష్మి.

హాస్పటల్ కెళ్లారు. ’తల్లి కాబోతుందన్న శుభవార్త’తో తిరిగి వచ్చారు లక్ష్మీ, మల్లికార్జున్‌లు.

మండవ క్యాంప్ లోని వారికి పొలాల సాగు ఆశాజనకంగానే వున్నది. మల్లికార్జున్ కయితే మరీ సంతృప్తిగా వున్నది. మరి కాస్త పొలం కొన్నాడు. తెలిసిన స్నేహితులు, బంధువుల్లో కొంత మందికి వ్యవకాయం మీద ఆసక్తి కలిగింది. “మేమూ వస్తే మాక్కూడా పొలం కొనిపెడతావా” అని అడగసాగారు.

“ఇక్కడ అమ్మకానికి భూములు దొరుకుతాయి. తప్పకుండా రండి. నాలుగు చోట్లా చూపిస్తాను” అంటే కొంత మంది వస్తున్నారు. చూసుకుంటున్నారు. నాల్గు రోజుల క్రితం లక్ష్మణ్ అనే స్నేహితుడు డబ్బుతో వచ్చాడు. అతడు లోగడ బళ్లారి జిల్లాలోనూ, గదగ్ జిల్లాలోనూ అంతా తిరిగి చూశాడట. పెద్దగా నచ్చలేదు. రాయచూర్ జిల్లా అయితే బాగుంటుందని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయంతోనే ఒకేసారి కొని రిజిస్టర్ కూడా చేయించుకోవాలన్న ఉద్దేశంతో వచ్చాడు.

“ఈసారి మాత్రం పొలంకొని, రిజిస్టర్ చేసుకున్న కాగితాలతోనే ఆంధ్రా వెళ్తాను మల్లికార్జున్” అన్నాడు లక్ష్మణ్.

మల్లికార్జున్ వాళ్లు కొనుకున్న పొలాలన్నీ శివలింగప్ప, అతని సోదరులూ అమ్మినవే. వాళ్లు పెద్ద పెద్ద వ్యవసాయాలు చెయ్యలేక, పండిన రాగుల్లాంటి వాటికి సరైన రేటు లేక ఇబ్బందులు పడుతూ, టమేటా సాగు చేశారు. వాటికీ రేటు లేక వ్యవసాయమంటే విసుగొచ్చి కొంత కొంత పొలం అమ్మేసుకుంటున్నారు. వీళ్లు పొలాలు కొనుక్కుని బెంగుళూరులో కాపురముండే హెగ్డే గారి భూములున్నాయి. హెగ్డే గారే శివలింగప్ప వాళ్ల పొలాలు కలుపుకోవాలంటారు. సరైన రేటు మాత్రం ఇవ్వరు. శివలింగప్ప నేనడిగిన రేటుకు ఇవ్వకేంచేస్తాడన్న ధీమా బాగా వుంది. కాని ఇంతలో మల్లికార్జున్ వాళ్లు వచ్చి న్యాయమైన రేటు ఇచ్చి శివలింగప్ప వాళ్ల భూములు కొనుక్కున్నారు. ఇంకా కొంటున్నారు. శివలింగప్ప వాళ్లంతా పొలాల కివతలగా వున్న చిన్న ఊళ్లో వుంటారు. అక్కడుండే పెద్ద మనుషులు కొంత మంది హేగ్డే గారికి నమ్మనబంట్లు. వీరు హెగ్డేగారికి ఇక్కడి కబుర్లన్నీ చిలవలు పలవలు చేసి మోస్తారు. వారి కన్ను ఇప్పుడు మండువా క్యాంప్ మీద పడింది. వాళ్ల ఇళ్లూ, వాకిళ్ల గురించీ, వాళ్లు పండించే పంటల గురించీ మల్లికార్జున్ నాయకత్వం గురించీ అసూయగా చెప్పసాగరు.

“హెగ్డే గారూ! మీరు పెట్టబోయే ఫ్యాక్టరీకి చాలా పొలం అవసరమౌతుందన్నారు. మీకు దక్కనీయకుండా ఆ మల్లికార్జున్ అడ్డం పడుతున్నాడు. ఊళ్ళో వున్న శివలింగప్ప, అతడి అన్నదమ్ములే, కాదు మిగతా వాళ్లూ కూడా చీటీకీ మాటికీ ఆ మల్లికార్జున దగ్గరకు సలహాల కోసం పోతున్నారు. ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ తిష్టవేశాడు. రోజు రోజుకూ పాతుకుపోతున్నాడు. ఇప్పుడిక్కడ, మిమ్మల్ని ఎవరూ గుర్తు చేసుకోవటం లేదు” అంటూ పదే పదే వెళ్లి చెప్పసాగారు.

హెగ్డేగారికి మల్లికార్జున్ అంటే ముందునుంచీ కోపంగా వున్నది. వీళ్లు ఆంధ్రా నుంచి వచ్చి ఆ పొలాల్ని కొనకపోతే మొత్తం రైతుల తనకే అమ్మేవాళ్లు. వీళ్ల మూలంగా తనకు చౌకగా భూము దొరక్కుండా పోయింది. వచ్చి పాతుకుపోయిన వాళ్లు ఇప్పుడప్పుడే ఇక్కడ నుంచి కదలరు. వాళ్లను చూసి, మిగతా వాళ్లు భూములు రేటు పెంచి చెప్తారు. అన్ని విధాలా ఈ మల్లికార్జున్ అడ్డుగా తయారవుతన్నాడని కక్ష పెంచుకున్నారు.

ఇదంతా మల్లికార్జున్‌కు కాని మిగతా క్యాంప్ లోని వాళ్లకు కాని తెలీదు. మల్లికార్జున్ ఎప్పట్లాగానే శివలింగప్పతోనూ, అతడి అన్నదమ్ములతోనూ మాట్లాడి లక్ష్మణ్ కోసం భూమిని కొనిపెట్టమన్నాడు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని బేరసారాలు సాగిస్తున్నారు.

“లక్ష్మికి ఐదవ నెల వచ్చింది. మరలా మూఢం వస్తుంది. నువ్వూ, లక్ష్మీ వెంటనే మనింటికి రండి. నీ వ్యవసాయం పనులెప్పుడూ వుండేవే. నువ్వు లక్ష్మిని తీసుకొస్తే సీమంతం జరిపిస్తాం. వాళ్ల పుట్టింటి వాళ్లు పట్టించుకోరు. మనమైనా జరిపిద్దాం. నీకు పని ఒత్తిడి లేకపోతే నువ్వూ ఓ వారం పాటు లక్ష్మితోపాటు ఇక్కడే వుండు. లేకపోతే లక్ష్మినైనా తీసుకుని వచ్చి దింపి వెళ్లు” అంటూ వదిన ఉత్తరం వ్రాసింది. వెళ్లక తప్పదు. ఇటు లక్ష్మణ్ పని పూర్తి కాలేదు.

“లక్షణ్! నువ్విక్కడే వుండు. శివలింగప్ప వాళ్లు నమ్మకమైనవాళ్లే. నేను చెప్పి వెడతాను. లక్ష్మిని ఆంధ్రాలో వదిలేసి నేను వెంటనే బయల్దేరి వస్తాను.”

“అలాగే మల్లికార్జున్! నువ్వు వచ్చే వరకు నేనిక్కడే వుంటాను. లక్ష్మిని దింపేసి రా” అని పంపించాడు.

క్యాంప్ లోనే వున్న మరో కుటుంబం వారితో లక్ష్మణ్‌కు భోజనం పెట్టమని చెప్పి ఆరోజే లక్ష్మిని తీసుకుని మల్లికార్జున్ బయల్దేరాడు.

రాగులు, వక్కలు, అల్లం, శుబ్రం చేసిన పత్తి లాంటివి తీసుకుని వచ్చిన వదినకిచ్చాడు.

“ఎందుకొదినా అంత హడావిడిగా తీసుకురమ్మన్నావు? నాకక్కడ చాలా పనులున్నాయి.”

“నీకు పనులు లేనిదెప్పుడు? ఏ సమయంలో జరిపే వాటిని ఆ సమయంలో జరుపుకోవాలి. నువ్వూ వుండు. మీ ఆవిడకు జరుపబోయే వేడుక చూద్దువుగాని.”

“ఇప్పుడు కుదరదులే వదినా. తర్వాత మళ్లీ వస్తాను.” అంటూ మల్లికార్జున వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు. రాయచురులో దిగాడు. తన క్యాంప్ కెడదామని హడావుడి పడుతుంటే ఇద్దరు పోలీసులు వచ్చి అటకాయించారు. “యస్.ఐ.గారు తీసుకు రమ్మంటున్నారు, స్టేషన్‍కు నడువు” అన్నాడొక పోలీసు మొరటుగా.

“స్టేషన్‌కా? ఎందుకు” అన్నాడు మల్లికార్జున్ తెల్లబోయి.

“చెప్తేకాని రావా? పద. నడువు” అంటూ మల్లికార్జున్ మెడ మీద లాఠీ పెట్టి ముందుకు ఒక నెట్టు నెట్టారు.

తూలిపడబోయి సర్దుకున్నాడు. వాళ్లతోపాటు స్టేషన్ కెళ్లాడు. యస్.ఐ స్టేషన్ లోనే వున్నాడు. శివలింగప్ప వాళ్ల కోసం వెళ్లినపుడు కనిపించిన వాళ్లు, అదే వూరి వాళ్లు అక్కడ వున్నారు. ఇంకా అయోమయంలో వున్న మల్లికార్జున్ ఆలోచనలకు విషయం ఏమిటో అంతుబట్టటంలేదు.

“లక్ష్మణ్ నెందుకు చంపావు?” అన్నాడు యస్.ఐ. గట్టిగా.

“లక్ష్మణ్! నా స్నేహితుడు. వాణ్ణి నేను చంపేడేమిటి? వాడికేమయింది?” అన్నాడు ఆదుర్దాగా.

“చంపి పారిపోయివ వాడివి. నీకేం తెలియదేం” అంటూ యస్.ఐ రెండు తగల్నిచ్చాడు.

“నువ్వు చంపనూ లేదు. డబ్బు కాజేసి ఆంధ్రా పారిపోనూ లేదు. మేమే తమాషా చేస్తున్నాం” అంటూ మరో రెండు తగల్నిచ్చాడు.

ఈలోగా యస్.ఐ ఎదురుగా కూర్చున్న వాళ్లు లేచి నిలబడ్డారు. “మేము వెళ్లొస్తాం. యమ్.ఐ.గారూ మరో రెండు సెక్షన్లు తగిలించి వీణ్ణి లోపలకు తొయ్యండి. ఎంత కాలం వీలైతే అంత కాలం జైల్లోనే మగ్గేటట్లు చెయ్యండి” అన్నారు అక్కసుగా.

వాళ్లకు తనేం అపకారం చేశాడో ఎంత ఆలోచించినా మల్లికార్జున్‌కు గుర్తుకురాలేదు.

“లక్ష్మణ్! అయ్యో లక్ష్మణ్! పొలం కొనాలని ఎంతో ఆశతో డబ్బు కూడా సిద్ధం చేసుకుని మరీ వచ్చావు. మా ఇంట్లోనే ఉండమని నిన్నొదిలేసి నేను ఆంధ్రా వెళ్లాను. ఇంతలో ఏం జరిగింది. ఎలా జరిగింది అంతు బట్టటం లేదు” అని ఆక్రోశించాడు.

“యస్.ఐ.గారూ! దయచేసి విషయం చెప్పండి. లక్ష్మణ్ నా ప్రాణ స్నేహితుడు. వాడి కేమయింది?”

“ప్రాణ స్నేహితుణ్ణే చంపావుగా.”

“అయ్యో! అలా అనకండి. వాణ్ణి నేనెందుకు చంపుతాను?”

“లక్ష్మణ్ కూడా ఆంధ్రావాడేగా? నీ దగ్గర కెందుకొచ్చాడు?”

“ఆంధ్రావాడే. ఇక్కడ పొలం కొనుక్కొని సేద్యం చేయాలని వచ్చాడు.”

“డబ్బు బాగానే తెచ్చాడా? వెంట బెట్టుకుని?”

“ఓ పదెకరాలు కొనుక్కుంటానని వచ్చాడు. డబ్బు తెచ్చానన్నాడు. ఎంత తెచ్చిందీ ఏంటీ నేనడగలేదు. తెచ్చిన డబ్బు తన దగ్గరే వున్నది. మా క్యాంప్‌లో దొంగల భయమేమీ వుండదు. తన దగ్గరే అట్టేపెట్టుకున్నాడు. నేను నా బార్యాను తీసుకుని ఆంధ్రా వెళ్లాను. లక్ష్మణ్‌ను మా ఇంట్లోనే వుండమన్నాను. ఇప్పుడే ఆంధ్రా నుంచి తిరిగొస్తున్నాను. ఇంకా ఇంటికైనా వెళ్లలేదు. దార్లోనే నన్ను పట్టకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇంతకు మించి నాకేం తెలియదు.”

“నాలుగు రోజుల క్రితం నువ్వు ఊరికి వెళ్లావు. అదే రాత్రి లక్ష్మణ్‌ను దిండు పెట్టి అదిమేసి ఎవరో చంపేశారు. మర్నాడు కాని ఈ విషయం బయటికి రాలేదు. ఆరా తీస్తే పొలం కొనటానికని వచ్చి అతను డబ్బుతో సహా మీ ఇంట్లోనే వున్నాడని క్యాంప్ లోని వాళ్ల ద్వారా తెలిసింది. డబ్బు కోసం నువ్వే లక్ష్మణ్‌ను చంపి డబ్బుని, భార్యనూ తీసుకొని ఆంధ్రా ఉడాయించావు. నీ కోసం ఆంధ్రాకు ఇన్ఫర్మేషన్ వెళ్లింది. నువ్వు వెంటనే తిరిగొస్తున్నావని తెలిసి ఇక్కడ మా వాళ్లు మాటేశారు. డబ్బును అక్కడ భద్రం చేసి ఏమెరగనట్లు మళ్లా ఇక్కడకు చేరుకున్నావన్న మాట. ఏం ప్లాను రా నీది? చచ్చు ప్లాను వేశావు. అడ్డంగా దొరికిపోయావు. నిన్ను కోర్టులో హాజరు పరుస్తాం. మనిషిని చంపిన నేరానికి ఉరిశిక్ష, జీవిత ఖైదో పడుతుంది. దొంగతనం చేసినందుకు మరో శిక్ష వుంటుంది. అనుభవించు. చేసుకున్న వాడికి, చేసుకున్నంత మహాదేవ అన్నారుగా. మేకతోలు కప్పుకుంటే మాత్రం లోపలున్న ఛండాలపు క్రూరబుద్ధి ఏడమాసిపోతుందిరా? ఛండాలపు వెధవా” అంటూ తిట్లు లంకించుకున్నాడు.

“లక్ష్మణ్‌ను ఇప్పుడెక్క వుంచారు?”

“అతని బట్టలన్నీ వెతికాం. అవన్నీ చిందరవందరగా వుండి దాంట్లో కొద్దిగా డబ్బూ, కొంత చిల్లరా కనపడ్డాయి. అతడి ఊరి పేరూ, అడ్రసూ, మరి కొన్ని వివరాలున్న చిన్న పాకెట్ డైరీ కూడా కనుపించింది. దాంట్లో నుండే అడ్రస్ తీసుకుని వాళ్ల వాళ్లకు తెలియజేశాం. ఈ రోజు ఉదయమే అతని కుటుంబ సభ్యులు వచ్చారు. గవర్నమెంట్ జిల్లా ఆసుపత్రి నుంచి లక్ష్మణ్ శవాన్ని తీసుకున్నారు. ఇప్పటికి మూడు రోజులు దాటింది. ఇవాళ ఉదయమే కారు మబ్బులాంటి ముఖంతో వాళ్లు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరో దిండుతో ముఖాన్ని అదిమి ఊపరాడకుండా చేశారు. వేలిముద్రలు కనపడకుండా తుడిచేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పు చేసిన వెధవ ఎంత కాలం తప్పించుకుంటాడు? అందుకే దొరికిపోయావు. క్యాంప్‍లో ఇతర కుటుంబాల వారిని విచారించాం. వివరాలు చెప్పారు. నువ్వు చెప్పి భోజనం ఏర్పాటు చేసి పోయ్యావట. అక్కడే భోజనం చేసి వచ్చి నీ ఇంట్లో పడుకున్నాడు. నువ్వే చంపేసన్నా ఆంధ్రా పారిపోయి వుండాలి. లేదా నువ్వు వెళ్తూ వెళ్తూ ఎవరైనా పురమాయించి వెళ్లుంటావు. ఏం జరిగినా నీ ప్రమేయంతోనే జరిగింది. నిజం చెప్పు. చేసిన తప్పు ఒప్పుకో. ఈ వివరాలు చాలా? దొరగారికి ఇంకా వివరాలు కావాలా?”

“నేను చంపేసి వెళ్లినా, ఎవర్నైనా పంపి చంపించినా మరలా వెంటనే ఎందుకు తిరిగి వస్తాను? ఆ సాయంకాలమే నేను నా భార్యతో బయలుదేరి వెళ్లిన మాట నిజం. ఆ తర్వాత ఏం జరిగిందో, నాకు తెలియదు. నా ప్రమేయం ఏమీ లేదు.”

“వుందో లేదో మా ఇన్వెస్టిగేషన్‌లో తేలుస్తాం. అప్పటి దాకా నోర్మూసుకుని పడుండు.” పోలీసులు కేసు పెట్టారు. రాయచూరు జిల్లా కోర్టులో కేసు నడుస్తున్నది. మల్లికార్జున్ తరుపున అతని స్నేహితుడు ఒక లాయర్‍ను ఏర్పాటు చేశాడు. పోలీసులు, గవర్నమెంట్ లాయరు కలిసి ఏదో కుట్ర పన్నుతున్నరన్న అనుమానం మల్లికార్జున్ స్నేహితుడికొచ్చింది.

తాను నిర్దోషినని మల్లికార్జున్ చాలా ధైర్యంగా వున్నాడు. ఆ రోజు తను కొనుక్కున రైల్ టికెట్స్, తన ప్రయాణ వివరాలు అన్ని లాయరుకు చెప్పాడు.

లక్ష్మణ్ మల్లికార్జునకు ఆప్రమిత్రుడు. అలాంటి వాడిని ఎందుకు చంపుతాడు?  చంపదలచుకుంటే అతణ్ణి అక్కడా, ఇక్కడా వారం రోజులపాటు ఎందుకు తిప్పుతాడు? వచ్చిన రెండో రోజో, మూడో రోజో చంపేసేయొచ్చు. వారం దాకా ఆగక్కర్లేదు. ఆ క్యాంపులో ఎవరిని కనుకున్నా మల్లికార్జున్ గురించి మంచిగా చెప్పేవాళ్లే. ఆ క్యాంప్ లోనే కాదు. సింధునూర్ తాలుకా లోని మాన్వీ క్యాంప్, గంగావతి క్యాంప్ లలో కూడా మల్లికార్జున్ గురించి పెద్ద మనిషే అని చెప్పారు. లక్ష్మణ్ హత్య చెయ్యబడ్డాడని డాక్టర్ రిపోర్ట్ వచ్చింది.

“అదెవరు చేసారో తేలాలి. ఇంట్లో ఎవరూ లేరు అని తెలుసుకుని డబ్బు కోసమే ఎవరో, దొంగతనానికి పాల్పడివుంటారు. పెనుగులాటలో లక్ష్మణ్‍ను చంపేశారు. అంతే కాని హత్యకూ, నా క్లయింట్‌కూ ఎలాంటి సంబంధం లేదు.” అని మల్లికార్జున్ తరుపు లాయరు వాదించాడు.

“కాదు. మల్లికార్జునే చేయించాడు. కొంచెం సమయమిస్తే సాక్షిని ప్రవేశ పెడతాం.” అని ఎదుటి లాయర్ సమయం అడిగాడు. జడ్జిగారు అంగీకరించారు. కేసు వాయిదా పడింది.

మల్లికార్జున్ స్నేహితుడు వెళ్లి తమ లాయర్‌ను కలిశాడు. తనకు తెలిసిన విషయాలను లాయర్‌కు చెప్పాడు. హెగ్డేగారికి ఈ చుట్టు పక్కల సారాయి, కల్లు పాటలున్నాయి. వారి కనుకూలమైన వారికే వాటిని లీజ్‌కూ, సబ్ లీజుకూ ఇస్తారు. మిగిలిపోయిన కల్లు, సారాయిలలో అమోనియమ్ క్లోరైడ్ మిథేన్ లాంటి రసాయినిక పదార్ధాలు కలిసి కల్తీ కల్లు, కల్తీ సారాయిలు తయారు చేసి సారా కాంట్రాక్టర్‍లు అమ్మిస్తున్నారు. అదే కొనుక్కుని తాగాలి కాని ఎవరూ తాటి చెట్లూ ఈత చెట్లూ ఎక్కి కల్లు గీయకూడదని రూల్ పెట్టారు. అది అన్యాయమని అందిరికీ తెలుసు. కాని నోరెత్తే ధైర్యం ఎవరికీ లేదు. ఆ విషయం మీద మల్లికార్జున్ పట్టించుకుని కొంత మంది గ్రామీణుల చేత సంతకాలు పెట్టించుకుని వారి చేత అర్జీలు వ్రాయంచి ఫిర్యాదులు ఇప్పించాడు. ఆ విషయాలు పేపర్లో వచ్చేటట్లు చేశాడు. కల్లు గీత కార్మికులు, గ్రామీణులు సంతోషించారు, కాని సారా కాంట్రాక్ట్ కడుపు మండింది. హెగ్డేగారికి ఫిర్యాదు వెళ్లింది. ఈ మల్లికార్జున్ అనేవాడు తనకు ప్రతి దాంట్లోనూ అడ్డుపడుతున్నాడు. గిల్లేయాలని హెగ్డేగారి మనసులో అప్పుడే బీజం పడింది.

ఈ విషయాలన్నీ విన్న లాయర్ ఆలోచనలో పడ్డాడు. ఈ కేసు తననుకున్నంత సరళంగా లేదు. బాగానే వల పన్నారు శత్రువులు అన్పించింది.

కేసు మరోసారి వాయిదా కొచ్చింది.

అనుమానాలే కాని ఆధారాలేమీ లేవని మల్లికార్జున్ తరుపు లాయరు వాదన. మల్లికార్జున్ ఎంత మంచి వాడో, కల్లు గీత కార్మికులతో సహా చెప్పించాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version