Site icon Sanchika

కర్మయోగి-20

[ఆశ్రమంలో మాతాజీ గట్టిగా అడిగితే రాజేశ్వరి తన గతం చెప్పడం మొదలుపెడుతుంది. మల్లికార్జునతో తన పెళ్ళి, భర్తతో అన్యోన్యతని వివరిస్తుంది. రాయచూరు ప్రాంతంలో భూములు కొని వ్యవసాయం చేయడంలోని కష్టనష్టాలు ఆమెకి చెప్తాడు మల్లికార్జున. మండవ క్యాంపు గురించి వివరాలు తెలుస్తాయి. లక్ష్మి గర్భవతి అవుతుంది. హాయిగా సాగుతున్న వారి కాపురంలో కష్టాలు ఎదురుతాయి. రాయచూరు ప్రాంతంలో పొలాలన్నీ తమకు కాకుండా ఆంధ్రావాళ్లు కొట్టేస్తున్నరని కసిగా ఉన్న స్థానిక భూస్వామి హెగ్డే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. మల్లికార్జున మిత్రుడు లక్ష్మణ్ – ఆ ప్రాంతంలో పొలం కొందామని డబ్బు తీస్కుని వస్తాడు. లక్ష్మిని – ఊర్లో వదినగారింట దింపి తిరిగి రాయచూరు వస్తాడు మల్లికార్జున. ఇంతలో లక్ష్మణ్‍ని హత్య చేశాడనే నేరం మీద మల్లికార్జునని పోలీసులు అరెస్టు చేస్తారు. కేసు కోర్టుకు వస్తుంది. తాను నేరం చేయలేదని ఎంత చెప్పుకున్నా – కేసు మల్లికార్జునకి వ్యతిరేకంగానే ఉంటుంది. మల్లికార్జున తరఫు లాయరు మల్లికార్జున హత్యలు చేసే మనిషి కాదని నిరూఫించడానికి ప్రయత్నిస్తాడు. – ఇక చదవండి]

[dropcap]’అ[/dropcap]నుమానాలు కాదు సార్. ఆధారాలు వున్నాయి, పర్మిషన్ ఇస్తే సాక్షిని ప్రవేశ పెడతాన’ని ఎదుటి లాయర్ చెప్పాడు.

సాక్షని ప్రవేశపెట్టమనగానే అతణ్ణి బోనులోకి పిలిచారు.

తన పేరు రంగప్ప అనీ, చిన్న చిన్న పనులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నానని చెప్పాడు. “పిల్లల చదువులకు డబ్బు సమకూర్చుకోవడం కష్టంగా వుందని ఆ మల్లికార్జున్ గారిని ఏమైనా పని ఇప్పించమని అడిగాను. ఏ పనైనా చేస్తావా అని, చనిపోయిన వ్యక్తిని చూపించి అతణ్ణి చంపేస్తే పది వేలిస్తానన్నాడు. ఆ మల్లికార్జునతో నాకు బాగానే పరిచయమున్నది. లక్ష్మణ్ బాగా డబ్బు తెచ్చాడని చెప్పాడు. అతణ్ణి చంపేసి ఆ డబ్బు తీసి జాగ్రత్త చెయ్యి. నేను ఆంధ్రా వెళ్లి వచ్చి తీసుకుంటాను. ముందే తీసుకువెళితే అనుమానమొస్తుంది. కాబట్టి రాగానే డబ్బు నాకిద్దువుగాని. సక్రమంగా పని పూర్తి చేస్తే మరి కొంత డబ్బూ ముట్టజెబుతానన్నాడు. దాంతో నా పిల్లలకు మంచి చదువు చెప్పించుకోవచ్చు అని ఆశ పెట్టాడు. ఎలా చంపాలో కూడా తనే చెప్పాడు. ఇక్కడ విషసర్పాలకేం కొదవ లేదు. నేనూ, నా భార్యా ఊరి కెళ్లగానే లక్ష్మణ్ ఇంట్లో ఒక్కడే వుంటాడు. ఒక పామును పట్టి తెచ్చి కిటికీలో నుంచి లక్ష్మణ్ మీద విసిరెయ్. అది కరుస్తుంది. పాము కాటుతో పోయాడని అందరూ అనుకుంటారు. అని చెప్పి తాను ఊరికెళ్లాడు. నేనొక పామును పట్టి అతని మీద కొదిలాను. కాని ఆ పాము లక్ష్మణ్‌ను కరవలేదు సరి కాదా బెదిరి బయటకెళ్లిపోయింది. దాంతో తలుపులు ఉతకలెత్తి నేనే లోపలికెళ్లాను. దిండు పెట్టి ముఖాన్ని బాగా అదిమాను. ఊపిరాడకుండా చేసి చంపేశాను. అతడి ఊపిరి ఆగిపోయిందని తెలుసుకున్నాకే పెట్టెలో పెట్టిన డబ్బును మూటగట్టుకుని నా దారిన నేను బోయాను. చేశానే గాని తర్వాత భయపడ్డాను. ఆ డబ్బు నేం చేయాలో కూడా తోచలేదు. మా ఆడదానిక్కూడా చెప్పలేదు. నాకు శానా భయం పట్టుకున్నది. మా ఆడది తాగమని ఇచ్చిన బెల్లం నీళ్లు కూడా ముట్టుకోబుద్ధి కాలేదు.”

“ఏందబ్బా! గుటకేయకుండా దిక్కులు చూస్తావేంది” అన్నది. నేను దిక్కులు చూసేది డబ్బులు ఎక్కడ దాచాలా అన్నదానికి. ఇంతలో తెల్లారింది. విషయం పోలీసులదాకా ఎల్లింది. వాళ్లొచ్చి నన్నూ, డబ్బునూ పట్టుకున్నారు” అని చెప్పాడు.

అదంతా విన్న మల్లికార్జునకు ఆశ్చర్యం వేసింది. ఈ రంగప్పకు తాను డబ్బు ఆశ చూపి లక్ష్మణ్‌ను చంపమన్నాడా? ఇది వరకెప్పుడైనా తన పొలంలో చిన్న చిన్న పనులుంటే కూలికి మాత్రం పిలిచేవాడు. ఏ పనీ తిన్నగా చేసే రకంకాదు. అయినా అందరితో పాటు కూలీ ఇచ్చి పంపేవాడు. అతను గంగావతి క్యాంప్ దగ్గర్లో వుంటాడు.

పోలీసులు తనని తీసుకొచ్చారన్నాడు. మొదటి వాయిదాకు అతన్ని కోర్టుకు ఎందుకు తీసుకురాలేదని వీళ్ల లాయర్ అడిగాడు.

“అతడి ఆరోగ్యం బొత్తిగా బాగాలేక రాలేని స్థితిలో వున్నందు వలన తీసుకురాలేదు” అని చెప్పారు.

మల్లికార్జున్ అన్నయ్య వచ్చి లాయర్‌తో మాట్లాడి వెడుతున్నాడు. మల్లికార్జున్ స్నేహితుని ద్వారా, విషయాలన్నీ తెలుసుకున్నాడు. తమకిక్కడ స్థానబలం లేదు. హెగ్డేగారి మనుషుల పనే అని అర్థమవుతున్నది. కాని కోర్టుకు సమర్పించటానికి సరి అయిన సాక్ష్యాధారాలు వీళ్ల దగ్గర లేవు.

“అన్నయ్యా! ఇదొక ఊబి. దీని దాకా వచ్చిన వాళ్లు దీంట్లో పడి మునిగిపోవటమే. నేను మంచి చెయ్యాలనే చూశాను. కాని అదే నాకు కలిసి రాలేదు. దీన్ని నా ఒక్కడితోనే పోనివ్వండి. నా ఖర్మానికి నన్ను వదిలెయ్యిండి. లక్ష్మి గర్భవతి. తనను మీ దగ్గరే వుండనివ్వండి.” అంటూ చేతులు జోడించాడు.

మల్లికార్డున్ తన స్నేహితుణ్ణి కూడా బతిమాలుకున్నాడు. “చూడు మిత్రమా! మనమెక్కడో ఆంధ్రా నుంచి వచ్చాము. ఇక్కడ వ్యవసాయం చెయ్యాలని ఆశ పడ్డాం. నాకు కుదరలేదు. నువ్వైనా జాగ్రత్తపడు. నన్నేదో బయటకు తీసుకురావాలనీ, నాకు మేలు చేయాలనీ చూడకు. సాక్ష్యాలంటూ తిప్పలు పడకు. ఏమీ ఉపయోగం వుండదు. ఈ బురద నీకంటించుకోనని నాకు మాట ఇవ్వు” అంటూ బలవంతాన చేతిలో చెయ్యి వేయించుకున్నాడు. “నాకెలాగూ శిక్ష తప్పదు. ఈ పొలంలో ఎన్నో పంటలు పండిచాలనీ, ఎన్నో ప్రయోగాలు చెయ్యాలనీ కలలు గన్నాను. ఇప్పుడు నా జీవితమే నాశనమైంది. నా పొలమంతా నువ్వే అమ్మిపెట్టు. ఇక్కడెవరికీ నేనొక్క పైసా గూడా బాకీ లేను. నా ఇంటిని క్యాంప్ లోని వారెవరైనా కావాలంటే ఇచ్చేసెయ్. డబ్బంతటినీ అన్నయ్యకప్పజెప్పు” అన్నాడు.

మల్లికార్జున్ వచ్చిన రెండేళ్లలోనే సంవత్సరానికి మూడు పంటలు పండించాడు. వచ్చిన లాభంతో మరి కొంత పొలాన్ని కొన్నాడు. ఇతడ్ని చూసి కొంత మంది ఇక్కడ పొలాలు కొనుక్కున్నారు. మల్లికార్జున్ అతని ద్వారా మరి కొంత మంది వచ్చి పొలాలు కొనకపోతే శివలింగప్ప వాళ్లు తనకే పొలమంతా అమ్మే వారని హెగ్డేగారి మనసులో బాగా నాటుకుపోయింది.

ఒక రోజు కోర్డు వాయిదాకు లక్ష్మణ్ కుటుంబం కూడా వచ్చింది. జైల్లో వున్న మల్లికార్జున్‌ను కలుసుకోవాలని లక్ష్మణ్ భార్య వచ్చింది. మల్లికార్జున్‌ను చూస్తూనే “మంచి స్నేహితుడని ఎంతో నమ్మకంతో వచ్చాడు. డబ్బంతా పోగుచేసుకుని మరీ వచ్చాడు. నీకు డబ్బే కావాలనుకుంటే అది తీసుకుని మనిషినైనా వదలాలి గదా! నా బిడ్డలకిప్పుడెవ్వరు దిక్కు? నేను ఏడ్చినట్లుగా నీ భార్యా నీ కోసం ఏడ్చే రోజు వస్తుంది” అంటూ శాపనార్థాలు పెట్టింది.

మల్లకార్జున్ ఏం చెప్పబోయినా వినిపించుకోకుండా వెళ్లిపోయింది.“అయ్యో!” అంటూ తల బాదుకున్నాడు. వాద ప్రతివాదాలు నడిచాయి. మల్లకార్జున్ తరుపున బలమైన సాక్ష్యాధారాలు లేవు. రంగప్ప మాటన్నే బలమైన సాక్ష్యంగా తీసుకున్నాడు. రంగప్పకు యావజ్జీవ కారాగార శిక్ష, మల్లికార్జున్‌కు పదేళ్ల జైలు శిక్ష కోర్డు విధించింది. హైకోర్ట్ కెళదామన్నా మల్లికార్జున్ ఒప్పుకోలేదు.

ఇప్పుడు మల్లికార్జున్ పొలం కోనటానికి కూడా అక్కడి వాళ్లు భయపడుతున్నారు. రంగప్ప కుటుంబం పల్లపు ప్రాంతాన్ని వదిలేసి మెరగ్గా వున్న మల్లికార్జున ఇంట్లో మకాం పెట్టారు. దాంతో క్యాంప్ లోని మిగతా వాళ్లు భయపడసాగారు. కాని ఎవరూ పెదవి విప్పి ఏం మాట్లాడటం లేదు. ఎంతో కష్టపడి మల్లికార్జున్ పొలాన్ని అమ్మి డబ్బును వాళ్ల అన్నయ్య చేతిలో పెట్టాడు మల్లికార్జున్ స్నేహితుడు. వాళ్ల అన్నయ్య ఆ డబ్బుతో లక్ష్మణ్ కుటుంబం దగ్గర కెళ్లి ఇవ్వబోయాడు. వాళ్లు ఒక్క రూపాయూ అంటకోలేదు. “మా కుటుంబంలో ముసలీ, ముతకా, కోడలూ పనుల కోసం బయటకెళ్లి పనులు చేసి పిల్లల్ని సాకుతున్నాం. మా ఉసురు వూరికే పోదు” అంటూ శాపనార్ధాలు పెట్టి పంపారు.

చేసేదేం లేక మల్లికార్జున్ అన్నయ్య తిరిగి వచ్చి ఆ డబ్బును తను చేసే వ్యాపారంలో పెట్టి తమ్ముడి భాగంకింద వుంచాడు. ఏనాటికైనా తమ్ముడు తిరిగి వస్తాడు. అతనూ భార్యా పిల్లలతో కలిసి వుంటాడు, అతని భాగం అతనికి అప్పగించాలని ఆలోచన చేశాడు.

లక్ష్మి వేళకు తిండి తినటం లేదు. భర్తను గురించిన ఆలోచనలతోనే కంటికి కడివెడుగా ఏడుస్తున్నది. రెండు సార్లు బావగారితో పాటు రాయిచూరు వెళ్లి భర్తను కలిసి వచ్చింది. అతను ధైర్యం చెప్పి పంపాడు. మనిషి బాగా బలహీనంగా తయారయింది. గుంటూరు కుగ్లర్ హాస్పిటల్‍లో అయితే ‘ డా. లోబో’ లాంటి అనుభవజ్ఞులైన లేడీ డాక్టర్లున్నారు. తల్లీ బిడ్డను క్షేమంగా వుంచుతారనుకుని కాన్పు కోసం లక్ష్మిని గుంటూరు హాస్పిటల్ చేర్చారు. తోటికోడలే కనిపెట్టుకుని వున్నది. లక్ష్మికి కాన్పయింది.

“అదృష్టవంతులమ్మా. ఒకే కాన్పులో ఇద్దరు బిడ్డలు ఒక మగా, ఒక ఆడా” అంటూ నర్సు లక్ష్మికి చెప్పింది. ఆమె కళ్ల వెంట నీరు కారింది. ఆనందమో, దుఃఖమో తెలియదు.

స్నానం చేయించుతానికి నర్సు తానొక బిడ్డను చేతిలోకి తీసుకొని వెళ్లంది. లక్ష్మి తోటికోడలు, తానొక బిడ్డను ఎత్తుకుని ఆమె వెనకాలే వెళ్లింది. స్నానం అయ్యాక హాస్పిటల్ బాత్ రూమ్ నుంచి పిల్లల్ని తీసుకుని నర్సు, ఆమె ఇద్దరు లోపలికొచ్చారు. రూమ్‍లో లక్ష్మి లేదు. బాత్ రూమ్‍లో వుందేమోననుకున్నారు. ఈలోగా రెండు ఉయ్యాలలు తెచ్చి బిడ్డల్ని పడుకోబెట్టారు. పావుగంట గడిచింది. అనుమానం వచ్చి లక్ష్మి తోటికోడలు బాత్ రూమ్ తలుపు తెరిచి చూసింది. ఖాళీగా వున్నది. ‘పచ్చి బాలింత ఎటుపోయింది’ అనుకుంటూ ‘నర్సులతో కాని, ఆయాలతో కాని ఏమైనా మాట్లాడుతుందా? కవల పిల్లలకు జన్మనిచ్చినా కాన్పు తేలిగ్గానే అయింది. ఈ లక్ష్మి ఎటు పోయింది’ అనుకుంటూ, గది బయటికొచ్చి నిలబడింది. ‘వెళ్లి చూద్దామంటే గదిలో కళ్లు తెరవని పసి బిడ్డలు’ అని ఆలోచిస్తూండగానే నర్సు వచ్చింది. పిల్లల నోట్లో డిస్టిల్ వాటర్ పిండాలంటూ పిండింది.

“ఈ పూటకే ఈ వాటర్. నెమ్మదిగా తల్లిని రొమ్ము పట్టించమనండి. పాలు అవే పడతాయి. ఒకరి తర్వాత ఒకరికి పాలు తాగించండి.”

“సిస్టర్! మా లక్ష్మి రూమ్‍లో లేదు. మీ దగ్గరకేమైనా వచ్చిందా?” అన్నది భయం భయంగా.

“మేమే మాటి మాటికీ వస్తుంటిమి. ఇంకెక్కడకుపోయి వుంటుంది?” అంటూ సిస్టరే అంతా చూసి వచ్చింది. ఎక్కడా లక్ష్మి కనపడలేదు. ఆయాలను, చివరికి సెక్యూరిటీ గార్డును కూడా, అడిగి వచ్చింది.

“ఆవిడ మీ స్వంత మనిషేనా? పెళ్లయిందా? భర్త వున్నాడా?” అంటూ రకరకాల ప్రశ్నలు వేసింది. ఈలోగా లక్ష్మి బావగారు వచ్చారు. ‘ఇదేంటి ఇలా జరిగింది? ఈ లక్ష్మి వెళ్లి ఏ అఘాయిత్యమైనా చేసుకోలేదు గదా? తమ్ముడు మొదటే జైల్లో వున్నాడు. ఇప్పుడు లక్ష్మి కూడా ఇలా చేసింది. వీళ్ల గతేంటి?’ అని ఆలోచిస్తుంటే అతని మనసు మొద్దు బారిపోయింది. అతని భార్యకైతే నిలువుగుడ్లు పడిపోయాయి.

హస్పిటలంతా గాలించారు. ఏ విషయమూ తెలియలేదు. “ఒక ఆడమనిషి ఇలా హాస్పిటల్ నుండి మాయమైనదని పోలీసు రిపోర్టిస్తే హాస్పిటల్‌కు చెడ్డ పేరు వస్తుంది. ఆ మనిషి నెవర్నో తీసుకొచ్చి మీరే మాయం చేశారని మమ్మల్ని పోలీసులు వదలరు” అంటూ పిల్లలనిద్దరినీ అప్పగించి హాస్పిటల్ నుంచి పంపేశారు. అప్పటి వరకు మల్లికార్జున్ అన్నావదినలకి ఇద్దరు పిల్లలు. వుంటడం వెంగళాయి పాలెం. ఆ తర్వాత నలుగురు పిల్లల్నీ తీసుకుని సత్తెనపల్లి మకాం మార్చారు. అప్పటి వరకూ గుంటూరు రాకపోకలు సాగిస్తూ చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు. సత్తెనపల్లిలో అందరూ వీళ్లకు నలుగురు పిల్లలనే అనుకున్నారు. వాళ్లే రామారావూ, సత్యవతులు. తమ కడుపున పుట్టిన జగత్ మోహన్, ప్రియంవదలతో పాటు, మల్లికార్జున్ పిల్లలైన కవలపిల్లలకు దేవసేన, సత్యవర్ధన్ అని పేర్లు పెట్టి వాళ్లనూ కన్నబిడ్డలాగానే సాకి కడుపులో పెట్టుకున్నారు.

ఆ రోజు లక్ష్మి తను హాస్పిటల్ నుండి బయటికి వస్తూ తోటి కోడలు పర్సు తీసుకొచ్చింది. రిక్షా ఎక్కి రైల్వే స్టేషన్‌కు పోయింది. తన ముందు వాళ్లెవరో విజయవాడకు టికెట్ ఇవ్వండి అని అడుగుతుంటే తనూ విజయవాడకు టికెట్ తీసుకున్నది. విజయవాడకు టికెట్ కొనుక్కున్న ఆమె వెంబడే పోయింది. నెమ్మదిగా ఆమెతో మాటలు కలిపింది. ఆమె విజయవాడ వెళ్లి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో సామర్లకోట దిగి, అక్కడి నుండి కాకినాడ పోతున్నానని చెప్పింది. అక్కడున్న మహాత్మాగాంధీ సేవా సమితిలో తన అక్క వుంటున్నదనీ, ఆమెను ఎప్పుడైనా వెళ్లి చూసి వస్తాననీ చెప్పింది.

“నాకెవరూ లేరు. దయ చేసి నన్ను మీతో పాటు తీసుకెళ్లండి” అని చేతులు జోడించి నిస్త్రాణగా కళ్లు మూసుకుని పడుకున్నది. ఆమె వెంట కాకినాడ వరకూ ఎలా వెళ్లిందో ఆ పరమాత్ముడికే తెలుసు. రొమ్ముల్లో పాలు ఉబికి ఛాతీ భాగమంతా వాపు వచ్చింది. బాగా జ్వరం కూడా వచ్చింది. కాకినాడ సేవా సమితికి వెళ్లటం తోటే కూలబడిపోయింది. పట్టుకుని, మంచం మీద పడుకోబెట్టారు. అక్కడి వృద్ధుల నందరినీ పరీక్షించే డాక్టరుగారు ఆ సమయానికిక్కడే వున్నారు. ఆమెనూ పరీక్షించారు. లక్ష్మి పరిస్థితి డాక్టరుగారి కర్థమయింది.

“ఎవరమ్మా నీవు? ఇంత పచ్చి బాలింతగా వుంది ఇక్కడికెందుకు వచ్చావు? నీ బిడ్డ ఏమైంది?” అని అడిగారు

“దయచేసి నన్నేమీ అడగొద్దు. నేను పాపాత్మురాలిని మాత్రం కాదు” అని చెప్పి మరలా కన్నులు మూసుకున్నది.

“అలాగేలే” అంటూ డాక్టరుగారు అక్కడి సమితి నిర్వాహకులతో ఏదో మాట్లాడారు. ఇద్దరు సహాయకులను తన వెంట తీసుకొచ్చారు. “రండి వెళదాం” అంటూ లక్ష్మిని పట్టుకుని కారులో కూర్చోపెట్టుకుని సహాయకులతో సహా తన ఇంటికి తీసుకెళ్లారు.

ఇంట్లో నుండి బలహీనమైన నెలల పిల్లవాడి గొంతు కీచుగా ఏడుస్తూన్నట్లుగా వినపడుతున్నది. ఆ పిల్లవాడు డాక్టరుగారి కొడుకు. వాడికి ఏ రకమైన పోతపాలు పడటం లేదు. తల్లి దగ్గర పాలు లేవు. పాలిచ్చే తల్లిగా ఇప్పుడు లక్ష్మి ఆ యింటికి వచ్చింది. పిల్లవాడిని లక్ష్మి చేతికందించారు. పక్కన వారి సహాయంతో పిల్లవాడికి పాలివ్వగలిగింది లక్ష్మి.

నెర్ర గొట్టి నీటి కోసం అల్లల్లాడే నేల ఆబగా వర్షపు నీటిని పీల్చుకున్నట్లుగా పిల్లవాడు ఆత్రంగా లక్ష్మి దగ్గర పాలు తాగాడు. కడుపు నిండా పాలు తాగి ఆదమరచి నిద్రకు పడ్డాడు.

“నువ్వు కొన్నాళ్లు ఇక్కడే వుండి నా కొడుకు ఆలనా పాలనా చూడు. నేను స్వామీజీతో మాట్లాడుతాను” అన్నారు డాక్టరుగారు.

లక్ష్మికి తన బిడ్డలు గుర్తొచ్చారు. తన పిల్లలకీ పోతపాలు పడవేమో! ఆకలికి ఎంత అల్లాడుతున్నారో? సత్యవతక్క ఎన్ని తిప్పలు పడుతున్నారో? పిల్లలకెప్పటికీ తండ్రి హంతకుడని తెలియకూడదు. తను కూడా లేకపోతే తల్లీ తండ్రీ లేని పిల్లలని అక్కా, బావా వాళ్లను చేరదీసి తమ బిడ్డల్లాగే పెంచి పెద్ద చేస్తారన్న నమ్మకం తనకున్నది. ఎంతో ఆలోచించాను. ఇంత కన్నా నాకు వేరే మార్గం దొరకలేదు. తన భర్త హత్య చెయ్యటమేమిటి? దుర్మార్గుల అకృత్యానికి బలయ్యాడు. పదేళ్ల జైలు శిక్ష అనుభవించి వచ్చి మల్లికార్జున్ మరలా ఈ సమాజంలో ఇమడగలడా? హంతకుడనే ముద్ర వెంటాడుతుంది. తనది మొదటి నుంచీ దురదృష్ట జాతకమే. మల్లికార్జున్‌తో పెళ్లి, ఆ కొద్ది నెలల కాపురమే అపురూపమైనది. తన కింతే ప్రాప్తం అనుకుని వాళ్ల జీవితాలలో నుండి తప్పుకున్నది. తన కోసం బావగారు వెదికిస్తారు. తాను మాత్రం తన ఆచూకీ తెలియనివ్వ కూడదు. ఎక్కడా తను నోరు విప్పకూడదు.

“డాక్టరుగారు చాలా మంచి వారమ్మా. ఇక్కడ నీకే భయం వుండదు” అని చెప్పి తనతో వచ్చిన వారు వెళ్లపోయారు.

లక్ష్మి పాలు తాగి బాబు ముద్దుగా, బొద్దుగా తయారయ్యాడు. మాటి మాటికీ లక్ష్మి మీదకు దూకటం, పాల కోసం తన చిన్న చేతుల్తో లక్ష్మి ఎద తడిమి వెతుక్కోవటం కన్న తల్లి భరించలేకపోతున్నది. తన ఖర్మ కాకపోతే ఏమిటి? ఏ కులమో, ఏ ఊరో తెలియని మనిషిని నా భర్త తెచ్చి ఇలా ఇంట్లో పెట్టటమేంటి? బిడ్డ ఆరోగ్యం కోసం తనూ మొదలకుండా ఊరుకున్నది. అన్నప్రాశన అయింది. అయినా తన భర్త ఆమెను పంపేద్దామనటం లేదు.

లక్ష్మికి ఈ సంగతి మొదట్లోనే అర్థమయింది. డాక్టరుగారి మంచితనానికి, బాబు ముద్దులు మూటగట్టే పసితనానికీ ముగ్ధురాలయ్యి ఓపిగ్గా అక్కడే వున్నది. బాబుకు పదో నెల వచ్చింది. అప్పడు లక్ష్మిని మహాత్మా గాంధీ సేవా సమితికి పంపిచారు. కాని బాబు బెంగ పడ్డాడు. నాలుగు రోజులున్నాక డాక్టరు దంపతులు బాబును తీసుకొచ్చి లక్ష్మిని చూపించారు. లక్ష్మిని చూట్టంతోనే ఆ పిల్లవాడు మీదకు దుమికి కరుచుకుపోయాడు. లక్ష్మి కూడా పసివాడిని ముద్దులతో ముంచెత్తింది. తిరిగి వెళ్లేటప్పుడు అతి కష్టం మీద వెళ్లాడు. ఆ తర్వాత వాణ్ణి తీసుకురావటం తగ్గించారు.

“ఇప్పటి వరకు ఇవన్నీ స్వామీజీ హయాంలో జరిగిన సంగతులమ్మా. ఆ తర్వాత మీరు ఈ సేవా సమితి బాధ్యతలు తీసుకున్నారు. వారి పెంపుడు కూతురుగా, ఇప్పుడు మాతాజీగా మీరుంటున్నారు. మీ హయాంలో కూడా నేను ప్రశాంతంగా వుంటున్ననమ్మా. నన్ను వెళ్లమని మాత్రం అనవద్దు.” అన్నది చేతులు జోడించి.

స్వామీజీ తన పెంపుడు కూతురును తన తర్వాత ఉత్తరాధికారిగా ప్రకటించారు. తానుండగానే తన సిద్ధాంతాలన్నింటిని ఆమెకు నూరిపోశారు. స్వామీజీ దృష్టిలో గాంధీజీ ఈ నేల మీద నడయాడిన భగవంతుడే. తన తర్వాత కూడా గాంధీజీ ఆశయాల బాటలో నడిచి, వీలయినంత మంది అనాథలకు వృద్ధులకు సేవ చేయాలన్నదే వారి ఆశయం. స్వామీజీకి కుల మతాల పట్టింపే లేదు. ఈ భగవంతుని దృష్టిలో అందేరూ సమానమే. ఆ సమానత్వంతోనే రాజేశ్వరి లాంటి ఎంతో మందికి ఆశ్రయమిచ్చారు. తన యావదాస్తిని సంస్థకు ధారాదత్తం చేసి, దయగల దాతల ఆర్థిక సహాయంతో మహాత్మాగాంధీ సేవా సమితిని నడుపుతున్నారు. స్వామీజీ ఆశయాలు నచ్చి కొంత మంది తమ సేవలను ఈ సమతికి అందించేవారు. అలాంటి వారిలో ఈ డాక్టరుగారొకరు. ఉచితంగా ఇక్కడి రోగులకు వైద్య సహాయం అందించేవారు.

“రాజేశ్వరీ! తరువాత ఎప్పుడూ కూడా మీ వాళ్లను కలుసుకుందామని అన్పించలేదా? నీ భర్త జైలు నుండి వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలనిపించలేదా?” మాతాజీ అడిగింది.

“మనసును చాలా ఉగ్గబెట్టుకుంటున్నానమ్మా. నేను లేననుకునే నా పిల్లలు పెరగాలనుకున్నాను.”

“అది సరైంది కాదేమో రాజేశ్వరీ. అసలు నీ పేరేమిటి పూర్తి పేరు చెప్పు.”

“నాకు అమ్మానాన్నలు పెట్టిన పేరు లక్ష్మీరాజరాజేశ్వరి. అత్తవారింట్లో అక్కా బావలు కాని, ఆయన కాని ‘లక్ష్మీ!’ అనే పిలిచే వాళ్లు. అక్కడ క్యాంప్ లోనూ అందరూ లక్ష్మీ అనే వాళ్లు. నేనిక్కడకు వచ్చినపుడు నా పేరు ‘రాజేశ్వరి’ అని చెప్పాను. దాంతో ఇక్కడి వాళ్లు నన్ను రాజేశ్వరనే పిలుస్తున్నారు. నాకిప్పుడు సర్వస్వం మీరే. మిమ్మల్ని వదిలి ఎక్కడికీ పోను. ఈ సేవా సమితి నాకు దేవాలయం లాంటిది. ఇక్కడి వారికి చేసే సేవే గొప్ప పూజలాంటిదమ్మ.”

“అంతటి భక్తి భావమున్న దానివి ఆ మధ్య నన్నొదిలి చాముండేశ్వరి గారింటికెళ్లావు. అది పొరపాటు పనికాదా!”

“మిమ్మల్నేదో మీ బంధువులకు కాకుండా నేనే చేస్తున్నానని నా మీద బాగా అపోహపడుతున్నారు అమ్మా. ఆ అపోహ తొలగించుకోవటానికి అలా చేశాను క్షమించడమ్మా.”

“ఇప్పటికైనా నీ ఉనికిని బయటపెట్టడం అవసరం రాజేశ్వరీ. ఈ విషయాలన్నీ డాక్టర్ రాజేష్ గారికి చెప్తాను. ప్రొద్దుపోయింది, పడుకో.”

“మీరు పడుకోండి మాతాజీ. మీరు విశ్రమించాక నేను వెళ్లి పడుకుంటాను” అంటూ రాజేశ్వరి ట్యూబ్ లైడ్ తీసేసి జీరో బల్బ్ వేసింది.

డా. రాజేష్‌కు ఫోన్ చేసి విషయాలన్నీ మాతాజీ చెప్పింది.

“నేను ఊహించింది నిజమే. రాజేశ్వరిగారికి చాలా గతం వున్నది. మనకింకా చాలా విషయాలు తెలియాలి. మరోసారి వెంటనే ఈ విషయాల గురించి మాట్లాడుదాం” వుంటాను మాతాజీ ! అంటూ ఫోన్ పెట్టేశాడు.

***

రాజేశ్వరి పాలిచ్చి పెంచిన బాబు ఇప్పుడు పెద్దవాడయ్యాడు. డాక్టరుగారు ఇప్పుడు వృద్ధులయ్యారు.

కాబట్టి తరుచూ వచ్చి ఇక్కడి వారిని చూడలేకపోతున్నారు.

బాబు ఇప్పుడు ఐ.పి.యస్.కు సెలక్టయ్యాడు. ఈ మధ్య వరకూ యమ్. ఫార్మసీ చదువుకుని బెంగుళూరులో ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూనే పరీక్షలు వ్రాశాడు. సెలక్టయ్యాడు. డాక్టర్ గారు ఇక్కడకు వచ్చినప్పుడల్లా రాజేశ్వరిని కలిసి యోగక్షేమాలు విచారిస్తూ వుండే వాళ్లు. బాబు సంగతులు చెప్తూ వుండేవాళ్లు.

బాబు హైద్రాబాద్ వల్లభాయ్ పటేల్ పోలీసు శిక్షణా శిబిరంలో సంవత్సరం పాటు ట్రెయినింగ్ పూర్తి చేశాడు. త్వరలో పెద్ద అధికారి హోదాలో కర్ణాటక వెళ్లబోతున్నాడు. ఆ సందర్భంగా డాక్టరుగారింట్లో విందు ఏర్పాటు చేశారు. మాతాజీకి, రాజేశ్వరికీ ప్రత్యేక ఆహ్వానం అందింది.

మాతాజీకి మనసారా నమస్కరించి రాజేశ్వరిని చూస్తూనే బాబు తల్లి “బాగున్నావా?” అంటూ పొడిపొడిగా పలుకరించింది. డాక్టరుగారు మాత్రం సాదరంగా ఆహ్వనించారు. మాతాజీని ప్రత్యేకంగా కూర్చోబెట్టారు. డాక్టరుగారు బాబుని తీసుకొచ్చి మాతాజీ ఆశీస్సులు తీసుకోమన్నారు. ఆ తర్వాత ప్రక్కనే వున్న రాజేశ్వరిని కూడా చూపించి “ఆమె కూడా నీకు అమ్మలాంటిదే. ఆమె ఆశీస్సులు కూడా తీసుకో” అన్నారు.

తండ్రి మాటల్లో ఏదో ప్రత్యేకమైన అర్థమున్నదని బాబు కర్థమైంది. ఆమెను చూస్తూ ఏదో స్వంతమనిషిని చూసిన అనుభూతే పొందాడు. నిండైన, పరిపూర్ణమైన స్త్రీత్వానికి ప్రతీకలాగా వున్న ఆమె దగ్గరకెళ్లి మనసారా శిరస్సు వంచి నమస్కరించాడు.

రాజేశ్వరిలో మమకారం పెల్లుబికింది. బాబు వంచిన శిరస్సును ఆదరంగా పెకెత్తి తన రెండు చేతుల్లో అతని ముఖాన్ని స్పృశిస్తూ “కన్నా సుఖంగా వుండు” అంది అప్రయత్నంగా.

ఆ మాటల్లో ఏదో తెలియని మమకారం, ఆర్తి అనురాగం గోచరించాయి బాబుకు.

కర్ణాటక వెళ్లబోతున్నడని వినగానే రాజేశ్వరిలో అలజడి బయలుదేరింది.

“కర్ణాటకకా? ఏ ప్రాంతానికి?” అంది అప్రయత్నంగా.

“రాయచూరమ్మా!” అన్నాడు బాబు.

“రాయచూరుకా! వద్దొద్దు. అక్కడంతా మోసం. కుట్రలు జరుగుతాయి. జీవితాలను నాశనం చేస్తారు.” అన్నది కంగారుగా.

“నీకా ప్రాంతం తెలుసా అమ్మా!”

“తెలుసు. కాని ఎక్కువగా తెలీదు. ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను” అంటూ త్రోటుపడింది.

‘బాబును అక్కడకు వెళ్లకుండా ఆపితే బాగుండను. కాని ఎలా?’ అంటూ ఆతృత పడసాగింది.

ఆ విందుకు కాకినాడలోని ప్రముఖులు చాలా మంది డాక్టర్లు కూడా వచ్చారు. వచ్చిన వారిలో డాక్టర్ రాజేష్ కూడా ఒకరు. రాజేశ్వరితో మాట్లాడాలని పించింది. కాని తగిన చోటు కాదని ఆలోచించాడు. ఇక్కడ ఇంకా ఎవరితోనైనా సన్నిహితంగా వుంటుందా? ఇంకేమైనా విషయాలు దాస్తున్నదా అన్న అనుమానం కూడా రాజేష్ కొచ్చింది.

(ఇంకా ఉంది)

Exit mobile version