Site icon Sanchika

కర్మయోగి-4

[dropcap]అ[/dropcap]క్కడ సునాయాసంగా డాన్సు, సంగీతం తాము సత్తెనపల్లిలో నేర్చుకునేవారు. ఇక్కడ అమెరికాలో ఎంతో ప్రయాసపడి నేర్పంచడం అవుంతుంది. వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకొని, ప్రతి అడుగూ చూసి చూసి వేయాల్సి వస్తుంది. తమ ఊళ్లో స్వేచ్ఛగా, హాయిగా అనిపించేది. ఇక్కడ ‘హాయ్’ ‘బై’ లు తప్పితే నోరారా పలకరించే మనుషులేరీ ఇక్కడ? అదే తమ ఊళ్లో అయితే ఆత్మీయుల పలకరింపులు వెల్లువై పారతాయి, తమ ఇంట్లో వాళ్లైతే  వాళ్ల ప్రేమలో ముంచెత్తుతారు. సంక్రాంతి తమింట్లో ఎంతో సంబంరంగా జరుగుతుంది. ఇక్కడ ఏదో మొక్కులుగా చేసుకుంటాం. గుడి కెడతాం. అక్కడేమో సంప్రదాయం లోపించి, భక్తి కరువైనట్లుగా వుంటుంది. ఈ పండక్కి రోజుకొక ముగ్గు వేయాలని తను ఎన్ని కొత్త ముగ్గులు నేర్చుకునేది!  అన్నయ్య తమ్ముడూ భోగిరోజు పెద్ద పెద్ద భోగి మంట వేసే వాళ్లు. ఇంట్లో వున్న పాత చెక్క ముక్కలన్నీ వెతికి తనూ, చెల్లీ ఆ మంటలో వేసే వాళ్లు. అసలు ఆ నెల రోజులూ పండగలాగానే వుండిది తనకు, చెల్లికీ. దొడ్లో వున్న ఆవు పేడతో గొబ్బిళ్లు చేయచటం, రేగుపళ్లు తినటం, పళ్లు పుల్లగా వున్నాయని విసివేయటం, నాన్నగారి చేత అన్నీ కొనిపించుకోవటం, అమ్మ మురిపెంగా విసుక్కోవటం అన్నీ పదిలంగా, మధురంగా జ్ఞాపకమున్నాయి తనకు. తన పిల్లలు కేవీ ఆ మధుర స్మృతులు? వీళ్లు అటు పూర్తిగా అమెరికన్లూ కాదు. ఇటు ఆంధ్రా సంస్కృతి తెలియని వాళ్ళుగా పెరుగుతున్నారు. అమ్మ అన్నట్లుగా ఇప్పటికైనా ఇండియా వెళ్లిపోతే బాగుండుందమో? నా దేశం, నా ప్రాంతం అని తలుచుకుంటుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. నా పుటిల్లు, నా అత్తిల్లు అక్కడి మనుషుల, వాళ్లందరి అనుభందాలూ ఇవన్నీ నేనూ, నా కుటుంబం ఎందుకు కోల్పోవాలి అన్న  ఆలోచనలో పడింది.

చెల్లి దేవసేన తన పిల్లలతో సంతోషంగా ఇటు పుట్టింటికీ అటు అత్తింటికీ తిరుగుతుంది. ఇలా పండుగలకు వచ్చినప్పుడు చుట్టాలందరి ఇళ్లకూ ఓ సారి వెళ్తొస్తారు. అందరూ ఎంతో ఆప్యాయంగా పలకరించి అక్కున చేర్చుకుంటారు. తన పిల్లల్ని అందరికీ చూపించొచ్చు. ఒకింట్లో వారు పూలు కోసిస్తే, మరోక ఇంట్లో కాయలు కోసి ఇస్తారు. ఆ కాయల్లో పూలల్లో వాళ్ల ఆత్మీయత దాగుంటుంది. బొట్టు పెట్టి, జాకెటు బట్ట పెట్టి మనసారా ఆశీర్వదిస్తారు. హరిదాసుల సంకీర్తనలు, బుడబుక్కలవాళ్లు అంబ పలుకు, జగదంబ పలుకు అంటూ చెప్తే మాటలు. గంగిరెద్దు వాడి సన్నాయి  విన్న కొద్దీ వినాలనిపించేది.  సంక్రాంతికి అమ్మ నాన్న ఇచ్చే కానుకలు, ఆ స్మృతులు, ఆ అనుభూతులు మనసులను పట్టి వుంచి మనసు పొరను విప్పినప్పుడల్లా గుప్పున గుర్తుకొచ్చి ఎదను ఆనందపు డోలికల్లో ఊపుతాయి. నేను అమ్మ నాన్నాలకు ఏం చేయలేకపోతున్నాను. వారి కష్టం, సుఖంలోనూ నేను పక్కన ఉండటం లేదు. చదువుకుని, పెళ్లి చేసుకుని స్వార్థంగా అమెరికా వచ్చేసాను. రెండేళ్లకో, మూడేళ్లకో వచ్చే నా కటుంబాన్ని కోసం వాళ్ళు కళ్ళు కాయలు కాచేటట్లుగా ఎదురు చూసేటట్లు చేస్తున్నాను. ఎప్పుడైనా ఆంధ్రా వెళ్లినప్పుడు తన పిల్లలు అక్కడ మురికి, ఇక్కడ మురికి అంటూ పట్టి పట్టి విసుగ్గా నడుస్తారు. ఎప్పుడుప్పుడు అక్కడి నిండు వచ్చేద్దామా అనే ధ్యాసలోనే వుంటారు. ఇక్కడ నుండి ఇండియా వెళ్లిపోదామన్నా రవిచంద్ర పెద్దగా అభ్యంతరం పెట్టకపోవచ్చు. కాని తమకు తగ్గ ఉద్యోగాలు అక్కడ ఏమైనా వుంటాయో లేదో ఆలోచించుకోవాలి. తను ఉద్యోగం మానాల్సివచ్చినా అందుకు సిద్ధపడాలి. తన వాళ్ల మధ్య తన దేశంలో ఆనందంగా, స్వేచ్ఛగా వుండాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి అన్న ఆలోచనలో మునిగిపోయింది ప్రియంవద.

***

భోగి రోజు సాయంత్రానికి రాజేష్ సత్తెనపల్లి వచ్చాడు. మర్నాడుదయమే సంక్రాంత్రి రోజున కోదాడ ప్రయాణం పెట్టాడు.

“ఈ రోజు కూడా ఇక్కడే వుండండి” అని రామారావు సత్యవతీ మరీ మరీ చెప్పారు.

“కోదాడలో మా వాళ్లు కూడా ఎదురుచూస్తారు కదండీ. ఈ రోజు వాళ్లతో గడుపుతాం” అంటూ బయల్దేరతీశాడు.

దేవసేనకు కెంపుల గాజులతో పాటు అందరికీ కొత్త బట్టలు పెట్టి పంపారు. శశిరేఖ కుటుంబమొక్కటే మిగిలింది ఇంట్లో. జగత్ మోహన్ ఎలాగూ రాడు. తనైనా పిల్లల్ని తీసుకుని అమ్మ వాళ్లింటికెళ్తే వాళ్లు సంతోషిస్తారు కదా అన్పించింది శశిరేఖకు. ఆ ఆలోచన రాగానే అత్తగారి నడిగింది.

“ఈ రోజు పెద్ద బాబు బయటి వెళ్లాడు. తనూ భోజనానికిక్కడకు వస్తాడేమో కనుక్కో” అంటూ డ్రైవర్నిచ్చి శశిరేఖను పుట్టింటికి పంపించింది సత్యవతి.

“రాత్రి కొచ్చేసేయ్. మరలా రేపు కనుమ రోజున రాకూడదు శశిరేఖా.”

“పిల్లలకెలాగూ శెలవులేగా, రేపూ వుంటాను అత్తయ్యా. తర్వాతి రోజు తిరిగొస్తాను.”

“నీ ఇష్టం. అక్కడేం ఇబ్బంది పడకు” అంటూ ఎప్పట్లాగే, “మీ అమ్మావాళ్ళకివ్వు” అంటూ బోలెడన్ని స్వీట్లు, ఫ్రూట్స్ ఇచ్చి పంపింది. శశిరేఖ వెళ్లేటప్పుడు బొట్టు పెట్టి కెంపులగాజులు బహుకరించింది. శశిరేఖ చప్పున వంగి అత్తగారి కాళ్లకు దణ్ణం పెట్టింది.

“పిచ్చి పిల్లా, లే” అంటూ శశిరేఖను పైకి లేవదీసింది సత్యవతి.

పిల్లలందరూ వెళ్లేసరికి ఇల్లంతా చిన్నబోయినట్లనిపించింది రామారావుకూ సత్యవతికీ.

***

కోదాడ నుండి కాకినాడ వచ్చేశారు దేవసేనా వాళ్లు. స్కూళ్లు, కాలేజీలు తెరిచారు. ఎవరి పనుల్లో వాళ్లు పడ్డారు. ఊరు నుండి వచ్చిన మర్నాడే పెరట్లోకి వెళ్లగానే పక్కింటి రజనీగారు కేకపెట్టి పిలిచారు.

“మా పుట్టింటి నుండి సున్నుండలు, పాకుండలు, పూతరేకులూ, తెచ్చేసుకున్నానండీ. మీకెప్పుడెప్పుడిద్దామా అని చూస్తున్నాను” అంటూ పెద్ద బాక్సు అందించింది.

“మా అమ్మావాళ్లూ, అత్తయ్యావాళ్లూ ఏమేవో చేసిచ్చారు. ఒక్కనిముషం వుండండి. నేనూ తెచ్చిస్తాను” అంటూ దేవసేన లెపలికెళ్లింది. నేతి అరిసెలు, జీడిప్పపు పాకం, దూతపకోడీలు, గిన్నెల్లో సర్ది తెచ్చి అందించింది. ఇద్దరూ కాసేపు పుట్టింటివీ, అత్తింటివీ విశేషాలు ముచ్చటించుకున్నారు. ఇంతలో బయట కాలింగ్ బెల్ మోగిన చప్పుడు వినపడింది. రజనీగారితో చెప్పేసి దేవసేన లోపలికొచ్చింది. తలుపు తీసి చూస్తే చాముండేశ్వరీ, పక్కన మరొకామె నిలబడి వున్నారు. వాళ్లను పిలిచి లోపల కూర్చోబెట్టింది.

“తను మా వదిన. వాళ్ల పాప మీ కాలేజీలోనే సి.యిస్.సి బ్రాంచ్‌లో సెకండియిర్ చదువుతున్నది. ఫస్టియిర్ మార్కులు బాగానే తెచ్చుకుంది. సెకండియిర్ ఇంటర్నల్స్ మార్కులు బాగానే వున్నాయి. కాని మొన్న వ్రాసిన మిడ్ ఎగ్జామ్స్‌లో మార్కులు తెచ్చుకోలేక ఫెయిల్ అయింది. అదేమో నేను చదివాను వ్రాశాను అని  బుకాయిస్తున్నది. మా అన్నయ్యకేమో పిల్లల చదువులూ, మార్కులు అంటూ కంగారు వుండదు. వదినకేమో గాబారాగా వున్నది. ఇప్పుడవి పూర్తి కాకపోతే ఇవెప్పుడు పూర్తి చేస్తుంది? రెగ్యులర్‌వి ఎప్పుడు చదువుతుంది?  అన్న ఆలోచనలో పడింది. మీతో మాట్లాడితే మీరు ఏదైనా సలహా చెప్తారుగా అనిపించి ఇలా వచ్చాం” అన్నది చాముండేశ్వరి. మళ్లీ మాటలు కొనసాగిస్తూ “కాలేజ్ కొచ్చి డిపార్ట్‌మెంట్‌లో అందర్నీ కలవొచ్చు అనుకోండి. కాని వాళ్లంతా మాకు కొత్త” అంటూండగానే వాళ్ల వదిన అందుకున్నది.

 “మీ దగ్గరైతే ఫ్రీగా మాట్లాడవచ్చని ఇలా వచ్చాం. ఏమీ అనుకోకండి.”

“భలే వారే. ఇందులో అనుకోవటానికి ఏముంది? పిల్లల చదువులంటే ఎవరికైనా గాభరాగానే వుంటుంది. పిల్లల్ని ఒత్తిడి పెట్టటమెందుకని వాళ్ళ అన్నయ్యగారి ఉద్దేశమయివుంటుంది. తన పేరూ, రోల్ నంబరూ చెప్పండి. కాలేజీలో నేను పిలిపించి మాట్లాడుతాను. ఒక్కమాట. ఇంటర్‌లో మంచి పర్సంటేజ్ వున్నదంటున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్టియిర్ మార్క్స్ ఫర్వాలేదు, బాగానే వున్నాయి. అంటే చదవగలిగిన అమ్మాయే. సెకండియిర్ తగ్గనవంటే తను కొంచెం అశ్రద్ధ చేసివుంటుంది. ఫస్టియిర్ కంటే ఈ ఇంయిర్ ఇంటర్నల్స్ లో కూడా మార్కులు తగ్గాయి. అక్కడే తెలుస్తుంది తను బాగా ప్రిపేర్ అవ్వలేదని. ఈ వయసులో ఇది సహజమే లెండి. పైగా ఇలాగే కొన్ని పేపర్లు ఫెయిల్ అవుతూ వుంటారు. తర్వాత వాళ్లే పూర్తి చేసుకుంటారు. అలా పూర్తి చేసుకుంటే బాక్‌లాగ్స్ అంటూ సర్టిఫికెట్‌లో ఏమీ మెన్షన్ చేయరు. మీరేం వర్రీ కానఖ్ఖర్లేదు. నా సెకండియిర్‌లో ఈసారి అరవై మంది మిడ్ ఎగ్జామ్స్ వ్రాస్తే ఇరవై మందికే అన్ని పేపర్లూ క్లియర్ అయ్యాయి. అందులో పదిహేను మంది అమ్మాయిలే వున్నారు. అబ్బాయిలది మరీ ఘోరం. వాళ్లు ఎక్కవగా  ఎప్పుడూ పేపర్లు మిగలుస్తూనే వుంటారు. వాళ్లతో పోల్చుకుంటే అమ్మాయిలు చాలా బెటర్. శ్రద్ధగా చదువుతుంటారు. మీ అమ్మాయిది పెద్ద సమస్యేం కాదు. ఈ సబ్జక్టులు అంత కష్టమైనవీ కాదు. రోజు రెండు గంటలు రెగ్యులర్‌గా శ్రద్ధగా చదివించండి. క్లియర్ అయిపోతాయి. మీకో మాట చెప్పనా చదువుకునే రోజుల్లో నేనూ అంత గొప్పగా ఏం చదవలేదు. ఏవరేజ్‌గా వుండేదాన్ని. ఆ తర్వాత పోను పోను నాకే శ్రద్ధ కలిగింది. ఎక్కడా బ్రేక్ లేకుండా యమ్.టెక్ పూర్తి చేయగలిగాను. మరో సారి చెప్తున్నాను. ఈ వయసులో ఇలాంటి కోర్సుల్లో ఇలా జరగటం సహజమే. మీరు ధైర్యంగా వుండండి” అంటూ ఎన్నో రకాలుగా ధైర్యం చెప్పంది దేవసేన.

దేవసేన చెప్పిన మాటలతో చాముండేశ్వరికీ, ఆమె వదినకూ బాగా ధైర్యమొచ్చింది. బెంగగా, దిగులుగా వచ్చిన వాళ్లు రిలీఫ్‌గా, హాపీగా ఫీలయ్యారు.

“చాలా ఓపిగ్గా మాట్లాడి మా బెంగతా పోగొట్టారు మేడమ్” అన్నది మనస్ఫూర్తిగా.

“వెళ్లొస్తా మంటూ” లేచినిలడ్డారు. మరలా మాటలు కొనసాగించారు “మీరు చెప్పనట్లే రెగ్యులర్‌గా మా అమ్మాయిని చదివిస్తాం. తననూ,యమ్.టెక్ కాని యమ్. బి.ఏ గాని చేయించాలని మాకు బాగా కోరిగ్గా వున్నది.”

“చదువుతుంది లెండి. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా ఈజీగా చదివేస్తున్నారు” అన్నది దేవసేన.

 “దేవసేవగారూ మిమ్మల్ని చూసి మా ఇంట్లో వంట చేసే రాజేశ్వరిగారు చాలా ఆలోచనలో పడ్డారు. రెండు సార్లు మిమ్మల్ని గురించి అడిగారు. మీ నాన్నగారి పేరూ, ఊరు అడిగారు. వదినా దేవసేనగారిని పరిశీలనగా చూడు. నువ్వు మా ఇంటికి పంపిన రాజేశ్వరిగారికీ, దేవసేనగారికీ ఎంతో దగ్గర పోలికలు కనపడతాయి” అన్నది చాముండేశ్వరి.

“నిజమే. చాముండేశ్వరీ! చాలా ఆశ్చర్యంగా వున్నది. ఇందాకట్నుండి టెన్షన్ పడుతూ, ఈ విషయాల్ని గమనించలేదు. ఇద్దరు పరిచయం లేని, ఏ సంబంధమూ లేని ఇద్దరు మనుష్యుల మధ్య ఇంత దగ్గర పోలికలుండటం చాలా ఆశ్చర్యంగా వున్నది.”

“నువ్వే ఆమెను మా ఇంటికి పంపిచావు కదా! నీకు తెలిసినావిడని నేనూ ఆమె పుట్టుపూర్వోత్తరాలేవీ కనుక్కోలేదు.”

“మనిషి చాలా మంచిది. నెమ్మదస్థురాలు. మహాత్మాగాంధీ సేవసమితిలో పని చేసేది. మేము కొంత మందిమి కలిసి ఆ సేవాసమితికి ఉప్పులూ, పప్పులూ, కూరగాయలూ, డబ్బూ సేకరించి అందిస్తూ వుంటాం. వాళ్లు ఒక వృద్ధాశ్రమం కూడా నడుపుతున్నారు. ఎక్కువగా అనాథ వృద్ధులున్నారు. వాళ్లందరినీ రాజేశ్వరి చాలా దయగా చూస్తుంది. ఏవైనా కార్యక్రమాలున్నప్పుడు, ఎక్కువగా, సర్వీస్ చేయటానికి కొంత మందిమి కలిసి తరుచూ అక్కడికి వెళుతూ వుంటాం.  రాజేశ్వరి లాంటి వాళ్లు ఇంకా కొంత మంది అక్కడున్నారు. వీళ్లందరికీ క్వార్టర్స్ లాంటివి అక్కడే వున్నాయి. తన పని కాగానే అక్కడున్న మామిడ చెట్టు కింద నిశ్శబ్దంగా కూర్చుని వుండిది. ఆ చెట్ల మధ్యలో చిన్న చిన్న బంగళా పెంకు ఇళ్లు వుంటాయి. పచ్చని చెట్లు ఏపుగా పెరిగి వాతావరణం చాలా బాగుంటుంది. యోగా కూడా బాగా నేర్పుతారు. మేమంతా నేర్చుకున్నాం. ఇద్దరు భార్యాభర్తలు ఈ మహాత్మా సేవాసమితిని చూస్తున్నారు. వాళ్లనందరూ స్వామీజీ, మాతాజీ అని పిలుస్తారు. ఆమె ఎక్కువగా గీతా ప్రవచనాలు చెప్తూ వుంటారు. దాంతో పాటు మహాత్మాగాంధీ రచలన నుండి కొన్ని విషయాలు తీసుకుని అవి కూడా చెప్తూ వుంటారు.  స్వామీజీ ఎప్పుడూ ప్రయోగాల్లో వుంటారు. యోగా నేర్చుకోవటంతో పాటు మేం ఆ ప్రవచనాలు కూడా విని వస్తాం. మాలో చాలా మంది ఈ మధ్య పెళ్లి రోజులు, పిల్లల పుట్టినరోజులు అక్కడే జరుపుకుంటున్నాం. ఆ రోజున ఆ వృద్ధులకు అన్నదానం చేస్తున్నాం. అలాంటప్పుడు రాజేశ్వరి ఎంతో తోడుగా వుంటుంది. ఆలా నాకు బాగా పరిచయమైంది. మొన్నామధ్య నెమ్మదిగా నన్నడిగింది. నేను ఇక్కడ నుండి బయటకు వెళ్లాలనుకుంటున్నాను. నాకేదైనా పని చూపించగలరా అని.”

“ఏ పన్లు చేయగలుగాతావని” అడిగాను.

“పిల్లల్ని పెంచుతాను. చివరకు వంట పనైనా సరే. ఇక్కడ వంట చేసే అలవాటున్నది. ఎవరిట్లోనైనా సరే వంట చేసి పట్టగలనన్నది. వెంటనే నాకు నువ్వు గుర్తొచ్చావు చాముండేశ్వరీ. వంట మనిషి కావాలనుకుంటున్నారు కదా? మాతో పాటు సేవ కొచ్చే ఒకావిడ తన ఔట్ హౌస్ కొచ్చి వుండమన్నది. అలా వున్నందుకు వాళ్ల ఇంటి పెరట్లోను, ముంగిటా వున్న మొక్కలన్నీంటినీ పోషణా చేస్తుంది. ఇంకా ఆమెకు అన్ని పనుల్లోను సహాయం చేస్తున్నది. మా ఇంట్లోనూ వాళ్లింటిలోనూ కాలం గడుపుతుంది. మాకు తెలిసినంతవరకూ ఆవిడతో ఎవరికీ ఏ పేచీ వుండదు” అంటూ వివరంగా చెప్పింది.

“అవునొదినా, ఏ పని చెప్పినా కాదనకుండా నిశ్శబ్దంగా చేసుకుపోతుంది. ఆవిడతో కాని, ఆవిడ పని పట్ల కాని ఏవిధమైన కంప్లైంటు లేదు. అసలావిడ  ఏ విషయంలోనూ పెద్దగా ఆసక్తి పెట్టేదికాదు. ఒక్క దేవసేన గారి విషయంలోనే కాస్త ఉత్సాహపడింది. చాలా ధాంక్స్ దేవసేనగారూ! మా అమ్మాయి చదువు గురించి చాలా విషయాలు బోలెడంత ధైర్యమూ ఇచ్చారు. రాజేశ్వరిగారి విషయాలు మాట్లాడి మీకు బోర్ కొట్టించామేమో? ఇక్కడి దాకావచ్చాం. మాథ్స్ ప్రొఫెసర్ గారు మాకు బాగా తెలిసిన వారు. వారిని కూడా ఒకసారి కలిసి వెళతాం” అంటూ వెళ్లారు.

(ఇంకా ఉంది)

Exit mobile version