కర్మయోగి-6

0
3

[dropcap]శ[/dropcap]శిరేఖ హైద్రాబాద్‌లో వుండేసరికి ఇక్కడ ఇంట్లో పిల్లలను చదివించి, హోమ్ వర్క్ చేయించేవాళ్లు లేకపోయారు. సుధారాణి ఏ పనీ త్వరగా అందుకోదు. సత్యవతే తంటాలు పడి, పిల్లలకు లంచ్ బాక్సులు కట్టి ఇస్తున్నది. సుధారాణి తన పిల్లలిద్దరికీ మాత్రమే లంచ్ బాక్సులు సర్దటం, వాళ్ల పనులేమైనా వుంటే చేసి ఊరుకునేది.

‘ఈ పిల్లకెప్పుటికి అర్థమవుతందో? వాళ్లు మన పిల్లలే అనుకోవటం తెలియకపోతే ఎలా? శశిరేఖ తిండైనా, చదువైనా నలుగురికీ కలిపి చేసేది. తోటికోడల్ని ఇన్నాళ్ల నుంచి చూసింది. కొంచెమైనా ఒంట బట్టించుకోలేదు’ అనుకున్నది సత్యవతి.

“పిల్లల్ని చదివించటానికి ఒక ట్యూషన్ మాస్టారు కావాలి. వాళ్లయితే ఇప్పుడొచ్చే పద్ధతుల్లో చదువు నేర్పుతారు. అక్క ఎప్పుడో తను చదివిన చదువు గుర్తు పెట్టుకొని, అప్పటి చదువులు ఇప్పటి పిల్లలకు నేర్పితే ఎలా? నేనెన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోవటం లేదు. ఇప్పుటైనా ఓ ట్యూషన్ మాస్టార్ని పెట్టండి. పిల్లలకు సరైన చదువు వస్తుంది” అంటూ గోల పెట్టింది సుధారాణి.

“ఈ నాలుగురోజులు పోతే శశిరేఖ వచ్చేస్తుందిగా. ఇన్నాళ్ల నుంచి శశిరేఖ చెప్పిన చదువుకే, పిల్లలంతా మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. ఎప్పుడూ పిల్లలు చదువు అర్థం కాలేదంటూ ఏ ఇబ్బందీ పడలేదు.”

“ఏమో అత్తయ్యా. నేను మాత్రం రామ్‌కూ, కృష్ణకూ ట్యాషన్ మాస్టార్ని ఏర్పాటు చేసుకుంటాను. రోజూ పిల్లల్ని కూచోబెట్టి చదివించే ఓపికా, ఆ ఓర్పు, నేర్పు నాకు లేవు” అంది సుధారాణి.

‘రోజు రోజూకూ రామ్, కృష్ణలు పెంకిగా తయారవుతున్నారు. తండ్రి మాట కూడా వినరు. ఇక నా మాట సరే సరి. తల్లిని చూసి వాళ్లు అలా తయారవుతున్నర’ని సత్యవతి బాధపడసాగింది.

ట్యూషన్ మాస్టారు గారు రోజూ సాయంకాలం ఐదున్నర కల్లా వచ్చే ఏర్పాటు చేసుకున్నారు. ఆయన వచ్చి కూర్చున్నా రామ్, కృష్ణలు తెల్ల కాయితాలు చించి రాకెట్లు చేసి వదిలే పనిలోనే వుండేవాళ్లు.

మాథ్స్ చేయిస్తుంటే మధ్యలో వదిలేసి బాత్‌రూమ్ కని, పాలుతాగి వస్తానని ఒకరి తర్వాత ఒకరు మాస్టారుగారి దగ్గర నుంచి జారుకుంటూవుండే వాళ్లు. శశాంక్, శైలజలు మాత్రం ఎక్కువ భాగం కదలకుండా కూర్చునే వుండే వాళ్లు.

“మాస్టారూ! నేను మాథ్స్ చేశేసాను. సైన్స్ తర్వాత చదువుకంటాను. నా ఫోన్ లోకి ఒక గేమ్ డౌన్‌లోడు చేసుకోవాలి.. వెళ్లనా? ” అనేవాడు రామ్.

“రామ్ అలా అడక్కూడదు. మాస్టారుగారితో అలా మాట్లాడకూడదు. మనం చదువుకోవటం అయిన తర్వాత నేను నీకా గేమ్ డౌన్‌లోడ్ చేసి పెడతాను” అన్నాడు శశాంక్.

“అన్నయ్యా! నాకూ కావాలి” అన్నది శైలజ.

కృష్ణ సోఫా ఎక్కి తొక్కుతూ గంతులు పెడుతున్నాడు. మాస్టారుగారు ముందు వాళ్లందర్నీ కుదురుగా కూర్చోబెట్టారు.

“స్కూల్లో పగలంతా చదువుకున్నాం మాస్టారు. స్కూల్లోనూ చదువటం, రాయటం, మరలా ఇంటికిరాగానే చదువు చదువు అంటారేంటి మాస్టారూ? నేను ఫోన్‌తో ఆడుకోవాలి మాస్టారూ, ఊ… ఊ…” అంటూ గారాలు పోయాడు కృష్ణ.

“అలాగే, స్కూల్లో ఇచ్చిన హోమ్ వర్కంతా కంప్లీట్ చేసెయ్యండి.  ఆ తర్వాత ఆడుకోవచ్చు. మీరు గుడ్ బోయిస్ కదా! చెప్పినట్లు వింటారు.” అని మాస్టారు నచ్చచెప్పారు.

“నేను స్కూల్లో కేంబ్రిడ్జ్ ఇంగ్లీషు క్లాసులుకు కూడా వెళ్లానండీ. నా కెప్పుడూ ఫుల్‌కి ఫుల్ వస్తున్నాయి మాస్టారు. చెల్లీ, నేను అబాకస్ క్లాసులకు క్కూడా వెళ్లాం.” అన్నాడు శశాంక్.

“నేను కుదిరినప్పుడల్లా డాన్సు క్లాసులకు వెళ్తాను” అన్నది శైలజ.

“అబ్బో! చాలా నేర్చేసుకుంటున్నారే వెరీగుడ్. ఏం రామ్! కృష్ణా! మీరు కూడా అక్కనూ, అన్ననూ చూసి నేర్చుకోండి. చక్కగా హోమ్ వర్క్ నీట్‌గా చేయటం, క్లాసులో మంచి మార్కులు తెచ్చుకోవటం, చెయ్యాలి. సరేనా! తెచ్చుకుంటారుగా.”

రామ్ కాని, కృష్ణగాని ఏం మాట్లాడలా. వాళ్ల ధ్యాస అంతా ఫోన్‌లో ఆటల మీదే వున్నది. ఈ మాస్టారు ఎప్పుడెళ్లిపోతారా? పుస్తకాలు గిరాటు పెట్టి ఫోన్ తీసుకుందామని ఎదురు చూస్తున్నారు. అందుకని మాస్టారి మాటలకు సమాధానం చెప్పకుండా బుంగమూతులు పెట్టుకుని కూర్చున్నారు. ముందు వాళ్ల మూడ్ మార్చాలనుకున్నారు మాస్టారు. “మీరంతా హోమ్ వర్క్ నీట్‌గా త్వరగా, పూర్తి చేసేస్తే నేనో కథ చెప్తాను. తెలుగు కథ. చాలా బావుంటుంది. రామ్‌కూ, కృష్ణకూ కూడా బాగా నచ్చుతుంది” అన్నారు. కథ అనేటప్పటికి చేతిలోని ఫోన్ పక్కన పెట్టి వర్క్ చేయటంలో మునిగిపోయారు. మొత్తానికి ఎలాగైతే నలుగురూ వర్కంతా పూర్తి చేసుకున్నారు. మాస్టారు టైమ్ చూసుకున్నారు. తను వచ్చి గంటన్నర అయ్యింది. వెళ్లాలి. కాని ‘తను ఇప్పుడు కథ చెప్పకుండా వెళితే ఈ చిన్న పిల్లలు తను చీటింగ్ చేశాననుకుంటారు. కష్ట పెట్టుకుంటారు. ఒక్క పది నిముషాలు కథ కోసం కేటాయించి వీళ్లకేదో ఒక కథ చెప్పాలి’ అనుకుంటూ… “మీకే కథ కావాలి? రాక్షసుల కథా? రాజుల కథా? జంతువుల కథా? వేటిని గురించి చెప్పుకుందాం?” అని అడగ్గానే “జంతువుల కథ అయితే బాగుంటుంది” అన్నారు.

“సరే అయితే వినండి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా జంతువులుండేవి. వాటిల్లో ఒక నక్క కూడా వుండేది. పిల్లలూ, నక్క అంటే మనకు కనిపించే కుక్కలాగా వుంటుంది. కాని ఇది బూడిదరంగులో వుంటుంది. కుక్క కన్నా కాస్త బలంగా కూడా వుంటుంది. మన కథలోని నక్క కూడా చాలా బలంగా ఎత్తుగా వుంటుంది. అది భలే జిత్తులమారిది.”

“జిత్తులమారి అంటే” రామ్‌కు సందేహమొచ్చింది.

“జిత్తులమారిది అంటే అబద్ధాలు చెప్తూ వుండేది. మోసాలు చేస్తూవుండేది. అలా చేస్తూ తనక్కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటూ వుండేది. దాని కంటికి ఏదైనా జంతువు కనిపిస్తే,  ఏదో ఒక విధంగా మోసం చేసి ఆ జంతువు మీదకు దూకేది. దాన్ని పట్టుకుని తినేది. దాని కోక రోజు అడవిలో ఏ జంతువూ దొరకలేదు. నెమ్మదిగా నడుచుకుంటూ అడవి బయటకు వచ్చింది. అక్కడొక చిన్న పల్లె వున్నది. ఆ పల్లెలో ఒక చివరగా బట్టలకు రంగులు వేసే వాళ్లు వున్నారు.”

“బట్టలకు రంగులు వెయ్యిటమంటే” కృష్ణ అడిగాడు.

“తెల్లగా కానీ లేత నీలంగా కాని లేతాకు పచ్చరంగులో కాని వున్న బట్టల్ని తీసుకుంటారు, కావలసిన రంగు పొడి తెచ్చి నీళ్లలో కలుపుతారు. ఆ నీటిని బాగా ఉడకబెడతారు. చల్లారిన తర్వాత ఆ రంగు నీళ్లులో బట్టల్ని ముంచి ఒక అరగంట ఉంచితే లేతరంగువి కాని, తెలుపువి కాని ఎఱ్ఱగానో, నల్లగానో, పచ్చగానో ముదురు రంగులోకి మారిపోతాయి. అపుడు వాటిని ఎండలో వేసి ఆరబడతారు. అలా బట్టలకు రంగు వేస్తారు. వాళ్లు పెద్ద పెద్ద మట్టి గాబుల్లో రంగు నీళ్లను పోసి వుంచారు. వాటి మీద దుమ్ము పడకుండా ఒక బట్టను కప్పి వుంచారు. వాళ్లింట్లో చాలా కోళ్లున్నాయి. ఆ కోళ్లను నక్క చూసింది. నోరూరింది. ఇప్పుడే కోడి వెంట పడితే అది చిక్కదు. పారిపోతుంది. పైగా ఇంటి వాళ్లు చూసి కర్ర తీసుకుని నన్నే తరిమేస్తారు. చీకటి పడే దాకా ఇక్కడే దాక్కుని వుంటాను. చీకటి పడిన తర్వాత కోళ్లకు సరిగా కళ్లు కనుపించవు. వాటిని పట్టుకుని తేలిగ్గా తినేయొచ్చు అనుకున్నది. అక్కడే రంగు నీళ్లుంచిన గాబుల పక్కన దాక్కున్నది. దాన్ని ఎవరూ చూడలేదు. చీకటి పడింది. రాత్రయింది. కోడినీ, కోడి పిల్లల్నీ ఒక పెద్ద బుట్ట కింద దాచి వుంచారు. నక్క వెళ్లి ఆ బుట్టను తోసేసింది. చిన్న చిన్న పిల్లల్ని తింటే తన ఆకలి తీరదు. కనుక పెద్దకోడినే తినాలనుకున్నది. పెద్ద కోడిని పట్టుకోబోయింది. కోడి అరుచుకుంటూ ఎగిరింది. నక్క కూడా ఎగిరి కోడిని పట్టుకోబెయింది. రెండు ఎఱ్ఱ రంగు నీళ్లు కలిపి వుంచిన మట్టి గాబు మీద పడ్డాయి. దాని మీద కప్పివుంచిన బట్ట జారిపోయింది. ఆ ఎర్రరంగు నీళ్లలో, కోడి, నక్కా పడ్డాయి. నీళ్లలో పడ్డ కోడి నక్క నోటికి చిక్కలేదు. కోడి పెద్దగా అరచి గోల చేసింది. తల్లి అరుపు విని, పిల్లలూ కుయ్, కుయ్ మన గోలగోలగా అరిచాయి. ఆ అరుపులకు ఇంటి వాళ్లు లేచి దీపం తీసుకుని వచ్చారు. నక్క కూడా రంగు నీళ్లలో నుంచి లేచి నీళ్లను దులుపుకుంటూ వున్నది. ఈలోగా వాళ్లు నక్కను చూశారు. కోళ్ల కోసం వచ్చి రంగునీళ్ళలో పడిందని వాళ్ల కర్థమైంది. చేతిలో వున్న కర్రను నక్కకేసి గట్టిగా గిరాటు పెట్టారు. నక్క తప్పించుకుని పారిపోయింది. పోవటం పోవటం, అడవిలోకే పోయింది.”

“మర్నాడుదయం తెల్లవారింది. జంతువలన్నీ నక్క వంక అనుమానంగా చూడసాగాయి. ఎందుకంటే అదిప్పుడు రంగు నీళ్లలో పడింది కదా? నక్క ఏ రంగు నీళ్లలో పడిందో గుర్తుందా?”

ఎఱ్ఱరంగని పిల్లలు నలుగురూ చెప్పారు. “అవును ఎఱ్ఱరంగే, అదిప్పుడు చూడటానికి ఎలా వుంటుది? చెప్పగలరా?” అని మాస్టారు అడిగారు.

“ఎఱ్ఱగా వుంటుందని” వెంటనే అనేసారు మళ్లీ,

“ఎఱ్ఱగా వుండటం వలన అడవిలో నక్కని ఏ జంతువూ గుర్తు పట్టలేకపోయినవి. ఆ సంగతి నక్క గమనించింది. తన ఒళ్లంతా ఎఱ్ఱగా వున్నందుకు సంతోషపడింది. కొంచెం గర్వం కూడా వచ్చింది. మిగతా జంతువులతో ఏమన్నదంటే…. ‘నేను హిమాలయ పర్వతాల దగ్గర వుండేదాన్ని. ఒక మునీశ్వరుడు అక్కడ తపస్సు చేసుకుంటూ వుండేవాడు. ఆయనే నన్నిక్కడకు పంపాడు. ఈ అడవికి రాజు లేడు. నువ్వెళ్ళి ఆ అడవికి రాజుగా వుండు అని చెప్తే నేనిక్కడకు వచ్చాను. ఈ రోజు  నుండి నేనే మీ రాజును. ఈ చెటు దగ్గరే వుంటాను. అడవిని కనిపెట్టుకుని వుంటాను. రోజూ ఒక జంతువు చొప్పున నాకు ఆహారంగా ఇస్తే నేను తినేసి నా ఆకలి తీర్చుకుంటాను. అలా రాకపోతే నేను మీ అందరి మీదా దాడి చేస్తాను. కనుపించిన వాటినల్లా చంపేస్తాను. జాగ్రత్త’ అని భయం పెట్టింది. జంతువులన్నీ ఒప్పుకుని రోజూ ఒకటి చొప్పున వచ్చి నక్కకు ఆహారంగా మారేవి. ఇలా నక్క తన జిత్తులమారితనంతో శ్రమపడకుండా తన ఆకలి తీర్చుకునేది. ఆ అడవిలోనే ఒక కుందేలు కూడా వుండేది. అది చాలా తెలివిగలది. దానికి మాత్రం అనుమానం కలిగింది. ఇదివరకు ఇక్కడ కనిపించే నక్క కనపట్టం లేదు. పైగా ఇప్పుడు రాజునంటూ వచ్చిన జంతువు అచ్చం నక్క పోలికలతో వున్నది. రంగు మాత్రం ఎఱ్ఱగా వున్నది. ఎలాగైనా ఈ కొత్త రాజు ఎవరో కనిపెట్టాలనుకున్నది. ఆ రోజు ఉదయం రాజు దగ్గరకొచ్చింది.

“రాజా! నమస్కారం. నేనిప్పుడు వస్తుంటే అచ్చం మీలాగే వున్న ఒకరు నాక్కనిపించారు. ఈ అడవికి నేనే కదా రాజును. వేరెవరో నా వేషంలో వచ్చారని విన్నాను. నీకేమైనా తెలుసా అని అడిగారు.”

“నిజంగానా! వేరే రాజు కనిపించాడా? పద చూద్దాం” అంటూ కుందేలు వెంట బయలుదేరింది.

కుందేలు ఒక చెఱువు దగ్గరకు నక్కను తీసుకెళ్లింది. ‘ఆ చెరువులోనే స్నానం చేస్తున్నట్లుగా వుంది చూడండి’ అంటూ ముందుకు చూపించింది.

నక్క నిజమని నమ్మింది. అక్కడున్న రాతి మీద నిలబడి చెఱువులోకి తొంగి చూసింది. నక్కకు తన నీడే కనపడింది. కుందేలి పళ్లు ఆకులు కొరికి కొరికి బాగా పదును తేలివున్నాయి. అది తన నోటిని తెరిచి నక్క కాలును గట్టిగా పట్టుకున్నది.

నక్క ఉలిక్కిపడింది. ఆ ఉలికిపాటుతో ఎగిరిపడింది. అలా ఎగరటంతో రాతి మీద నుండి పట్టుదప్పి నీళ్లలోకి పడింది. నక్క పడీ పడగానే నీళ్లన్నీ ఎఱ్ఱగా మారసాగినయి. బట్టలకయితే రంగు బాగా అంటుకుంటుంది గాని నక్క వంటికి రంగు బాగా అంటుకోక నీళ్లలో కరిగిపోసాగింది. నక్కకున్న ఒంటి రంగంతా చాలా వరకు కరిగిపోయి మాములు నక్కలాగా మారిపోయింది. నక్క తెప్పరిల్లి నీళ్లలో నుండి బయటకొచ్చేసింది. ఒంటికున్న నీటినంతా గట్టిగా విదిలించుకున్నది. అదిప్పుడు మామూలు నక్క అయిపోయింది. అది చేసిన మోసం మిగతా జంతువులకు తెలిసిపోయింది. ఈ నక్క ఎంత మోసం చేసింది అనుకున్నాయి. కుందేలు తెలివైన పని చేసిందని కూడా అన్నింటికీ అర్థమైంది. నక్క తోక ముడుచుకుని చెట్టు చాటుకు వెళ్లిపోయింది. అదీ కథ” అనగానే, “బాగుంది మాస్టారూ!”  అంటూ చిన్నగా చప్పట్లు కొట్టసాగారు.

“చూశారా! పిల్లలూ! ఎవర్నైనా మోసం చేయబోయినా అది ఎక్కువ రోజులు సాగదు. కనుక మనం ఎవర్నీ మోసం చేయాలనుకోకూడదు” అని చెప్పారు మాస్టారు.

సత్యవతి మాస్టారుకు కాఫీ, బిస్కట్లు పంపింది. తర్వాత తనూ వచ్చింది.

“చాలా సంతోషం మాస్టారూ! మీరు ఓపిగ్గా చెప్పిన కథంతా నేనూ విన్నాను. చదువుతో పాటు మా పిల్లలకు కథనూ నేర్చించారు” అన్నది మెచ్చుకోలుగా. “ఇంక మీరు వెళ్లిరండి. ఇప్పటికే మా వాళ్లు మిమ్మల్ని చాలా సేపు వుంచేశారు” అన్నది.

“ఫర్వాలేదులెండమ్మా. ఏదో ఒక విధంగా పిల్లలకు చదువు రావటమే ముఖ్యం కదా” అంటూ ఆయన వెళ్లిపోయారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here