కర్ర ధైర్యం!!

0
2

[శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన ‘కర్ర ధైర్యం!!’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]నగనగా ఒక కొండ. కొండ పైన గుడి. గుడి అంటే దేవుడో, దేవతో కొలువై వుంటారుగా!

ఇక్కడ ఎంతో చక్కని దేవత-వరప్రదాదేవి ఆమె పేరు!

వరాలు గట్రా బహు త్వరితంగా ఇచ్చే దయగల దేవత. అసలీ గుళ్ళో దేవతకీ, మనుషుల కష్టాలకి ఏదో దగ్గరి సంబంధం ఉన్నట్టుంది. వేలమంది నమ్మకం – మనసు పెట్టి గట్టిగా వేడుకుంటే ఈ అమ్మ వెంటనే ఆ కోరిక తీరుస్తుందని.

ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ గుడికి రావటానికి కొన్ని దశాబ్దాల కింద  జంకేవారు, ప్రయాణ కష్టం చూసి, ప్రయాణంలో వచ్చే కష్టాలు చూసీ!

కొండ చుట్టూ అడవులు, దట్టంగా. దారిలో కాపుకాచి దోచుకెళ్లే దొంగల భయం, మాటు వేసి మీద పడే మృగాల భయం.

భక్తి సంగతి దేవుడెరుగు, ముందు ప్రాణాలు ఉండాలి కదా అని కొంతమంది విరమించుకునేవారు.

గుంపులు గుంపులుగా వెళ్ళడం, డప్పులు, తప్పెటలు మ్రోగించుకుంటూ వెళ్ళటం చేసేవారు.

అయినా అదిగో పులి వచ్చిందిట మొన్న ఆలయ మార్గంలో అని, ఇదిగో ఈ వార్త విన్నారా, దుండగీల తండు అడ్డుకుని, నిలువు దోపిడీ చేసి పంపించారుట అని అడపాదడపానో ఇంకాస్త ఎక్కువ మోతాదులోనో వినబడుతూనే ఉండేవి.

**

క్రమంగా ప్రభుత్వాల్లో, వాటి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఏదో కృష్ణా రామా అనుకొనే బ్యాచులుగా చూశాం వీళ్ళని ఇన్నేళ్ళూ, ఈ భక్తులకు కనుక దొంగల, మృగాల భయం లేకుండా సౌకర్యాలు ఏర్పరుస్తే, బాగా ఎక్కువ సంఖ్యలో, తరుచుగా వస్తారు, మన ఆదాయమూ పెరుగుతుంది, వారికి అమ్మవారి అనుగ్రహమూ లభిస్తుంది అన్న నిర్ణయానికి వచ్చారు.

తద్వారా మనం వారికి పుణ్యం కట్టబెట్టిన భాగ్యం కూడా మూటకట్టుకోవచ్చు అని కూడా అనుకున్నారు.

**

రాజు తలచుకుంటే దెబ్బలకే కాదు, డబ్బులకూ కొదవుండదుగా, వెంటనే రోడ్లు వేయించారు బస్సులు నడపటానికి!

నడక దారికి మెట్లు ఎట్లాగూ ఉన్నాయి.

ఆవాసాలు ఉంటే, మృగ సంచారం తగ్గుతుందని, పైన ఆవాసాలు కట్టడాలు కట్టారు. యాత్రికులు వీళ్ళ కోసం, దుకాణాలు తెరిపించారు. ఒక పది ఇరవై ఏళ్ళలో వేలం వెర్రిగా బస్సుల్లో, నడకదారిలో పొలోమని భక్తులు రావటం మొదలుపెట్టారు.

అమ్మ వారి మహిమ అట్లాగే ఉంది కానీ, దేవాలయం ఆస్తులు ఆకాశం అంటాయి, గుడి ఖ్యాతి భూగోళం అంచులకు పాకింది. ఒకప్పుడు, నిప్పచ్చగా ఉండే ఆ ప్రాంతం, ఇప్పుడు రాత్రి పగలు తేడా లేదా అన్నట్టు, భవనాలతో, జనాలతో వెలిగిపోతోంది.

కైంకర్యాలు, కళ్యాణాలు, మొక్కులు, ఒకటేమిటి- సంరంభమే 24 గంటలూ!

**

అయితే అంతా బాగానే జరుగుతున్న సమయంలో, ఒక దుర్ఘటన చోటు చేసుకొన్నది, గుడి నడక దారిలో.

ఒక 7 ఏళ్ళ అబ్బాయిని, ఎక్కడ దాక్కుందో, ఒక పులి వచ్చి లాక్కెళ్ళి పోయి చంపేసింది.

లబోదిబోమంటూ ఆ పిల్లవాడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

ఈ వార్తతో ప్రజలంతా భయభ్రాంతులయ్యారు.

మీడియా క్షణ క్షణం ప్రతి క్షణం ఎంత ధర్యవంతులకయినా భయంగొలిపే రీతిలో  వార్తా కథనాలు పలవరించాయి.

చెడ్డపేరు వస్తే వ్యాపారం పడిపోతుందని, భక్తి కన్నా పులి భయం ఎక్కువైతే అసలుకే మోసం వస్తుందనీ గ్రహించిన ఆలయం కమిటీ వారు ప్రత్యేక ఉత్తర్వులు వేసి బాగా వెతికించారు అడవి అంతా.

నిర్ధారణ అయింది, అది పులి వల్లే జరిగిందని! పసి ప్రాణం అన్యాయంగా బలి అయిపోయింది.

బతిమాలో బామాలో, ఆ అబ్బాయి తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేసో, విషయం సద్దుమణిగేట్టు చేశారు పాలక మండలి వారు!

**

ఏ ఏ రక్షణ చర్యలు చేపట్టాలి అని ఆలోచించడానికి, ఆలయ పాలక మండలి మర్నాడే సమావేశమయింది.

ఆడ మెంబర్లు గరగరల పట్టచీరెలతో, మగవారు విభూతులు, పట్టు ధోవతులతో హాజరయ్యారు మీటింగ్‌కు.

అందరూ చాలా బాధతో ఉన్నట్టు, శోక సంతాపం తెలియ జేశారు, జరిగినదానికి. ఉన్నట్టు ఏంటి, నిజంగా పాపం బాధ తోటే!

చైర్మన్ గారు, గంభీరంగా, ఏమేమి తక్షణ చర్యలు చేపట్టాలి ఒక్కొక్కరూ చెప్పవలసిందిగా కోరారు, సభ్యులను.

“మా ఆడవారి తరఫున నన్ను చెప్పమంటే”, పంకజాక్షి గారు, కాస్త మొబైల్‌లో మెసేజ్‌లు చూసుకోవటం ఆపి మొదలెట్టారు, “ప్రతి స్త్రీ యాత్రికురాలికీ ఒక కత్తిపీట ఇవ్వాలి రక్షణ కోసం, ఆడపిల్లలైతే చాకులు! ఎట్లాగూ వాళ్ళకు ఇళ్ళల్లో అలవాటైన ఆయుధం కాబట్టి, క్షమించాలి పరికరం కాబట్టి, వాళ్ళు సులభంగా ఆత్మరక్షణ చేసుకోగలరు, ఎంతటి జంతువొచ్చినా! అలాగే పిల్లలు, వారి స్థాయిలో చాకులతో ధైర్యంగా నడక దారిన సాగగలరు. అసలు నన్నడిగితే, ఒక ఆయుధం చేతిలో ఉందంటేనే, అదొక గొప్ప గుండె ధైర్యాన్నిస్తుంది ఎవ్వరికైనా! ఇంకో మాట, మనం ఎక్కడికి బయటకి వెళ్ళనక్కరలేదు ఇవి ఆర్డరు చేయడానికి! టెండర్ పిలవండి, మా అబ్బాయి చేతే అతితక్కువ రేటులో కొటేషన్ వేయించి పంపుతా, మా వాడిది టింబర్ ఐరన్ బిజినెస్ కాదూ, తెలుసుగా! నే చెప్తాలే, ఏదో ధర్మ కార్యం, మనమూ సహాయం చేసినట్టు  ఉంటుంది, కాస్త సరీస్గా వేయించు నాయనా రేట్ అని! నా మాట జవదాటడు లే, ఆ పూచీ నాది!”

**

“అంత దాకా ఎందుకు, కిందటేడు ఆ పచ్చళ్ళ కంపెనీ, ఓ 50000 ఆవకాయ కత్తిపీటలకు ఆర్డర్ ఇచ్చి, కాన్సిల్ చేసుకున్నారు! మా గోడౌన్‌లో అట్టాగే పడున్నాయ్! అవి, ఇవ్వొచ్చు, మాంచి బలంగా ఉంటాయి, ఎంతటి మెకమూ జడుసుకోవాల్సిందే! ఏమంటారు, మీరు OK అంటే, ఆట్టే టైమ్ కూడా పట్టదు, మా చిత్తూరు నుంచి సరాసరి కొండ కింద మన ఆఫీసుకి లారీ బుక్ చేయిస్తా!!” అన్నది ఇంకో లేడీ మెంబరు, కాంతామణి గారు!

చైర్మన్ గారు అన్నీ వింటున్నారు, కాస్త చిరాగ్గానే, ఈ స్త్రీ సభ్యుల ఉచిత సలహాలు!!

ఇంతలో ఆదికేశవులు అందుకున్నాడు.

“అయ్యా, మీకు తెలుసు నా బ్యాంక్‌గ్రౌండూ అదీ! మిలిటరీలో చేసి వచ్చిన వాణ్ణి, నన్ను పంపిస్తే వెళ్ళి కాల్చొచ్చేస్తాను ఒక్క రౌండ్‌లో, ఎన్నుంటాయి, మహా ఉంటే 3, 4 పులులు అంతేగా! కానీ అది కుదరదు, వన్యప్రాణి సంరక్షణ కూడా మన బాధ్యత కాబట్టి! వేరొక ఉపాయం ఉంది నా దగ్గర! శివకాశి టపాకాయలు కంపెనీకి సోల్ డిస్ట్రిబ్యూటర్ని నేను, మా కావలిలో! రాత్రి పూటేగా భయం! నడక దారెమ్మటే, పొద్దు గూకంగానే, వరాస పెట్టి రిబ్బన్ లడీలు, లక్షమాలలు కాలుస్తూనే పోవాలి, ఆ మోతకి ఎక్కడి పులి సింహం చచ్చూరుకోవాల్సిందే!  లేదా కనీసం, అడవి నుంచి బయటకు రావడానికి బయపడాల! అంతే సమస్య తీరిపోతుంది, ప్రజలు హాయిగా గోయిందా గోయిందా అనుకుంటూ నడక దారిని ముందుకెళ్ళి పోతారు!” ఎట్లా ఉంది అని కూడా అడగలేక పోయాడు పాపం, ఆదికేశవులు గారు, చైర్మన్ చూసిన చూపుతో!

కాంతామణి ముసిముసి నవ్వులు నవ్వుతుంటే, ఉండబట్టలేక అడిగేశాడు, కేశవులు, “ఇందుట్లో నవ్వేదేముంది?!” అని.

మణి గారు మెల్లిగా చెప్పారు,”ఆ టపాసుల చప్పుడుకి ముందు భక్తులే కదండీ బయపడి ఇబ్బంది పడతారు…దీనికి తోడు టపాకాయలు అదుపుతప్పితే అగ్నిప్రమాదంలో భక్తుల ఆహుతి అని మీడియా చంపుతుంది. ఈ శబ్దాలకి జంతువులు బెదురుతున్నాయని పర్యావరణ పరిరక్షకుల గోల ఒకటుంటుంది ” అని!

తన ప్రపోజల్‌లో ఇంతటి లొసుగుందా అని ముందు ఆశ్చర్యపోయి, తర్వాత చిన్నబోయాడు ఆయన! మౌనంగా కూర్చున్నాడు, సీలింగ్ ఫాన్ కేసి చూస్తూ!!

**

ఇంకా మిగతా సభ్యులు కూడా ఏవో ఉపాయాలు చెప్పారు కానీ అవేవీ అపాయం తప్పించేవిగా అనిపించలేదు ఎవ్వరికీ!!

**

చైర్మన్ గారు మాట్లాడటం మొదలు పెట్టారు.

“ఇప్పుడు కావాల్సింది త్వరగా ఆచరణలోకి తేగల, సులభమైన రక్షణ పద్దతి, భక్తులకు ధైర్యం కల్పించేలా! నేను కొంతమంది నిపుణులతో మాట్లాడాను, వారు చెప్పినది సబబుగానే అనిపిస్తోంది నాకు, అదేమిటంటే- యాత్రికులకు కర్రలు ఊతంగా ఇవ్వాలని! నాకు కూడా అనిపిస్తోంది, ఇది బాగా సులభంగా ఆదరణ పొందుతుందని, జనానికి కొంత భరోసాగా ఉంటుందని! మీరందరూ సరేనంటే, రెజల్యూషన్ ప్రవేశపెట్టి ప్యాస్ చేద్దాము. ఒక వారం రోజుల్లో మొదలు పెట్టవచ్చు ఇది, ఏమంటారు?”

ఆయన ఔనంటే వారు కాదంటారా?! ఔననే. అన్నారు, ఆర్డర్ ప్యాస్ అయిపోయింది.

వారం రోజుల తరువాత నుంచి కర్రలు ఇవ్వటం మొదలైంది.

ఈ వార్త తెలియని భక్తులు, నడక మొదలయ్యే స్థానంలో కర్రలను సిబ్బంది ఇవ్వగానే, ఇచ్చిన వాణ్ణీ, కర్రనూ ఎగాదిగా చూసి, “ఇదెందుకూ, ఏం చేయాలి?” అని అడగటం మొదలెట్టారు.

వారు చెప్పినది విని, ఓరి బాబోయ్ పులి బారిన పడ్తామా అని అప్పటివరకు అంతగా లేని భయానికి గురయ్యారు!

తప్పదు కాబట్టి తీసుకెళ్ళారు, ఈ కర్రతో ఆగే పులేమిటో, అని విస్తుపోతూ, ఆ ఎక్స్‌ట్రా లగేజ్‌కి గునుస్తూ!!

**

నాలుగైదు రోజులైంది కర్రలు పంపిణీ మొదలై, సోషల్ మీడియాలో వింత వింత నాటకాలు మొదలయ్యాయి.

నడకదారిలో ఏదో చిన్న వివాదం వస్తే భక్తులు ఆవేశంలో వొళ్ళూ పై మరచి కర్రలతో కొట్టుకున్నారు.

సిసింద్రీలు కర్ర పులి ఆటలాడారు.

ఒక సీన్ సృష్టించటం, కొంతమంది కర్రలు, అర్జునుడు లాగా ఫీలవుతూ పాశుపతాస్త్రాల లాగా పట్టుకొని కాలిబాటన వెళ్ళటం, ఇంతలో హఠాత్తుగా వారిలోనే ఎవరో ఒకరు పులి గాండ్రించినట్టు మిమిక్రీ చేయటం, “అమ్మ బాబోయ్, పులి”, అని అరిచి చేతి సంచులు, ఆయుధం అనుకుని తెచ్చుకున్న కర్రలు అన్నీ విసిరేసి చెల్లాచెదురుగా అందరూ పరుగు లంకించుకోవటం!!

చివరకు అందరూ నవ్వుకోవటం!!

**

ఇది గుడి కమిటీకి ఏమాత్రం నచ్చలేదు, సహాయం చెయ్యాలి అని మనం సంకల్పించి, మేధస్సును కరిగించి ఈ కర్ర స్కీమ్ తెస్తే, చివరకు నవ్వులాటగా మారేటట్టు ఉంది అనుకొని నొచ్చుకొని ఒక గట్టి ఉత్తరం రాశారు ప్రభుత్వానికి!

ఏమనీ?!

సోషల్ మీడియాలో గాని, ఇంకే ఇతర మాధ్యమాల్లో గానీ ఈ విషయం చర్చకే రాకూడదని, అతిక్రమిస్తే చర్యలు తప్పవు అని!

ప్రభుత్వం వారు సానుకూలంగా ఇచ్చారు ఉత్తర్వులు, తరువాత జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి, నాటకాల రాయుళ్ళది!!

**

ఐదారు నెలలు గడిచాయి.

సంబంధించిన శాఖల వాళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం, ఇంక ఆట్టే మృగ భయం లేదు అని నివేదిక ఇచ్చారు.

ప్రజలు కూడా పెద్ద సుముఖంగా లేరు, ఈ కర్ర బరువులను మోయడానికి అని తెలియటంతో కమిటీ వారు ఆదేశాలు విడుదల చేశారు, ఇంకో రెండు నెలల తరువాత, ఈ ‘సౌకర్యం’, విరమిస్తున్నామని!

సౌకర్యమో అసౌకర్యమో, ఆ విషయం, ఆ వరప్రదాదేవే తేల్చాలి!

అడుగడుగునా రక్షణ సిబ్బంది భక్తులను అనుగమిస్తారనని కూడా చెప్పారు అదనంగా!

**

ఒక ఆరు నెలలు గడిచాయి, మళ్ళీ పులి సంచార సూచనలు కనిపిస్తున్నాయి అన్న వార్తలు అప్పుడప్పుడు రావటం మొదలయ్యాయి.

ఈ సారి ఏం చేస్తారో అని ఉత్కంఠ!

– కొంతమంది బాణాలిస్తారనీ, కొంతమంది కత్తో డాలో ఇవ్వటానికి ఆస్కారం ఉందనీ – తర్జన భర్జనలూ, జోకులూ ప్రారంభమయ్యాయి!

కొందరు పులి నుండి కాపాడే తాయెత్తులిస్తే, ఇంకొందరు పులి రక్షణ కవచాలు తయారు చేశారు.

కమిటీ ఎంతకూ ఈ విషయమై చర్చకు సమావేశం కావటంలేదు.

ఇంతలో ఎలా వచ్చిందో, ఎవరు సృష్టించారో తెలియదు, నడకాయుధ స్తోత్రం  ఒకటి చలామణీలోకి వచ్చింది.

 ఓం కర్రాయ నమః, ఓం బాణాయనమః

ఓం కత్తాయనమః, ఓం డాలాయ నమః!!

నడక దరిన అడుగడుగునా ఈ స్తోత్రం మైకులనుంచి వినిపించటం ఆరంభమయింది. గతంలో దేవీ నామజపం చేస్తూ వెళ్ళే భక్తులిప్పుడీ నడకాయుధ స్తోత్రం జపిస్తూ పోతున్నారు.

చిత్రం!!!!

నడకాయుధ స్తోత్రం నలుదిశలా మ్రోగుతున్నప్పటినుంచీ పులి కనబడటం మానేసింది. దాని ఆనవాళ్ళూ కనబడటంలేదు.

దాంతో నడకాయుధ స్తోత్రం జంతుబాధ నివారిణి అన్న నమ్మకం కుదిరింది. అది దేశం నలుమూలలా మార్మ్రోగ సాగింది.

ఇటీవలే ఓ పత్రికలోనో చానెల్ లోనో ఒక వార్త వచ్చింది.

త్వరలో కర్రకో గుడికడుతున్నారని..

ఈ వార్తలో నిజానిజాలు ఆ వరప్రదాయినికే తెలియాలి.

ఓం వరప్రదాదేవ్యై నమః!!

స్వస్తి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here