కార్తీకం రాగానే….

5
2

దీపావళి మర్నాడు ఉదయం వాకింగ్ చేయడానికి కాలనీలోని పార్కుకు వెళుతున్నాను. సమయం ఐదున్నర అవుతోంది. ఆకాశం స్వచ్ఛంగా, కాంతిమంతంగా ఉంది. నా ముందు ఇద్దరు పెద్దవాళ్ళు మెల్లగా నడుస్తున్నారు…

“కార్తీకం వచ్చేసింది” అన్నారొకాయన.

“అవును… శరదృతువులో రెండో మాసం వచ్చేసింది. అందుకే ప్రకృతిలో ఈ మార్పు” అన్నారు.

“అవునవును. శరత్తు ప్రకృతి ప్రేమికులని ఆకర్షిస్తుంది. భావుకుల్లో హర్షం కలిగిస్తుంది” అన్నారింకో ఆయన.

శరదృతువును తలచుకోగానే నాకు నన్నయ, ఎర్రనలు గుర్తొచ్చారు.

భారతంలో నన్నయ చివరి పద్యం, ఎర్రన మొదటి పద్యం శరత్తునే వర్ణిస్తాయి.

ఆంధ్రమహాభారతంలో నన్నయ

“శారదరాత్రు లుజ్జ్వలలసత్తరతారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధబంధురో
దారసమీరసౌరభము తాల్చి సుధాంశువికీర్యమాణ క
ర్పూరపరాగపాండురుచిపూరము లంబరపూరితంబు లై” అంటూ వర్ణించారు (అరణ్యపర్వ చతుర్థాశ్వాసం-141). శరత్కాలంలో రాత్రులు కాంతివంతమైన నక్షత్ర సమూహాలతో మరింతగా ప్రకాశించాయి అని భావం.

అరణ్యపర్వం శేషభాగాన్ని తెనిగించిన ఎర్రన
“స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి నిరస్తనీరదా
వరణము లై దళత్కమలవైభవజృంభణ ముల్లసిల్ల ను
ద్ధురతరహంససారసమధువ్రతనిస్వనముల్‌ సెలంగఁగాఁ
గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళఁ జూడఁగన్‌” అనే పద్యంతో ప్రారంభించారు(అరణ్యపర్వ చతుర్థాశ్వాసం-142). శరదృతువులో ప్రభాత సమయాలు, పగళ్లు ఎక్కువగా ప్రకాశించాయి – అన్నది కవి భావన.

ఆశ్వయుజ మాసం ముగిసి కార్తీక మాసం ప్రవేశించింది. కార్తీకంలో ప్రకృతి మరింగా పరిశుభ్రంగా ఉంటుంది. సూర్యోదయం మరింత తెల్లగా ఉంటుంది.

వాళ్ళిద్దర్ని దాటుకుని ముందుకు నడుస్తుండగా తెలిసిన టీ కొట్టతను అయ్యప్ప మాలలో గుడి వైపు వెళ్తూ కనిపించాడు. అతని జేబులోంచి సెల్‌ఫోన్ నుంచి “కార్తీకం రాగానే కలతలెల్ల పోయే” అని జేసుదాసు గారు ఆలపించిన మధుర గీతం వినబడుతోంది.

పార్కుకి చేరి నడుస్తున్నా, నాలో కార్తీక మాసం గురించిన ఆలోచనలు పోవడం లేదు.

***

కార్తీక మాసం వస్తూనే ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. వ్రతాలు, ఉపవాసాలు, పూజలు, వన భోజనాలు… సామూహిక కార్యక్రమాల జోరును పెంచుతుంది. అందరూ కలివిడిగా ఉండే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతటా ఒక రకమైన పండుగ వాతావరణం విస్తరిస్తుంది. ఆలయ సందర్శనలు, శివపూజలు, అయ్యప్పస్వామి పూజలు, కేదారేశ్వర వ్రతం, క్షీరాబ్ది ద్వాదశి వంటి కార్యక్రమాలతో స్త్రీపురుషులు హడావిడిగా ఉంటారు.

కార్తీకమాసం ఆరంభంలో అనేకమంది అయ్యప్ప దీక్ష తీసుకోవడం కద్దు. అస్తవ్యస్తంగా సాగుతున్న జీవనాన్ని కనీసం మండలం రోజులైనా ఓ క్రమపద్ధతిలో పెట్టి, నియమ నిష్ఠలతో జీవనం సాగించి స్వామి దర్శనం చేసుకొని వస్తారు అయ్యప్ప భక్తులు.

పురాణాల్లో “కార్తీక మహా పురాణము” ఒకటి. వేదవ్యాసులవారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద, పద్మ పురాణాలు రెండింటిలోనూ వివరించారు. ఈ మాసంలో ఈ పురాణంలోని కథలతో సత్కథా కాలక్షేపమూ జరుగుతుంది.

***

శరదృతువు ప్రాచీన కవులకు ప్రేరణనిచ్చినట్లే, కార్తీకం తెలుగు సినీకవులకూ ఉత్తేజాన్నిచ్చింది. కార్తీక మాసం గురించి, కార్తీక పున్నమి గురించి తమ పాటలలో రాశారు. కార్తీకం యొక్క లక్షణాలను తమ గీతాలలో ప్రస్తావించారు.

శోభన్ బాబు, శారద, శ్రీదేవి ప్రధాన పాత్రధారులుగా 1979లో ‘కార్తీక దీపం’ అనే సినిమా విడుదలయింది. మహిళలు కార్తీక దీపానికిచ్చే విలువని తెలిపే గీతాన్నిఈ సినిమాలో దేవుపల్లి కృష్ణశాస్త్రి రాశారు. సత్యం సంగీతం సమకూర్చగా, పి.సుశీల, ఎస్.జానకి గానం చేశారు.

“ఆ ఆ ఆ… ఆ ఆ ఆ…
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం
ఇదే సుమా నా కుంకుమతిలకం
ఇదే సుమా నా మంగళసూత్రం
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం”
అంటూ సాగుతుందీ పాట.

ఈ చిత్ర విజయానికి ఈ సినిమాలోని పాటలు కూడా దోహదం చేశాయని చెబుతారు.

~ ~

1978లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలయిన ‘శివరంజని’ సినిమా గొప్ప మ్యూజికల్ హిట్.

“నవమి నాటి వెన్నెల నేను…
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతి రేయి…
కార్తీక పున్నమి రేయి…” అంటూ సాగే ఈ పాట వీనుల విందుగా ఉంటుంది. వేటూరి గీతానికి రమేష్ నాయుడు సంగీతం. గానం బాలు, సుశీల.

~ ~

1974లో విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ కృష్ణ గారికి గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమా. ఈ సినిమాలో విజయనిర్మల మీద చిత్రించిన ‘వస్తాడు నా రాజు ఈ రోజు/రానే వస్తాడు నెలరాజు ఈ రోజు’ అనే పాట సూపర్ హిట్.

డా. సి. నారాయణ రెడ్డి గీతానికి పి. ఆదినారాయణరావుగారు స్వరాలందించగా పి. సుశీల పాడారు.

“వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
తేలి వస్తాడు నా రాజు ఈ రోజు

వేల తారకల నయనాలతో
నీలాకాశం తిలకించేను
వేల తారకల నయనాలతో
నీలాకాశం తిలకించేను” అని సాగుతుందీ గీతం. ప్రియునిపై విరహం, అతనొస్తాడనే విశ్వాసం… గీతంలోనూ, చిత్రీకరణలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

~ ~

1982లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, సుజాత ప్రధాన పాత్రధారులుగా విడుదలైన సినిమా ‘యువరాజు’. ఈ సినిమా కోసం దాసరి ఓ హుషారైన యుగళగీతం రాశారు.

“ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
కార్తీక పున్నమి చలిపొద్దులో
కృష్ణా గోదారి నడిబొడ్డులో
ఒక యువరాజు పుట్టాడని
ఒక యువరాజు పుట్టాడని
వాడే వాడే నారాజు అవుతాడని” అని సాగే ఈ పాట బాగా హిట్ అయింది. చక్రవర్తి సంగీతం సమకూర్చగా, బాలు, సుశీల గానం చేశారు.

~ ~

1983లో కృష్ణంరాజు, జయప్రద, చిరంజీవి ప్రధాన పాత్రధారులుగా కె.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో ‘పులి బెబ్బులి’ అనే సినిమా వచ్చింది. ‘పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది’ అని గొప్ప హిట్ సాంగ్ ఉందీ సినిమాలో. “ఏ జన్మ సంబంధమో నాలో విరితావి వెదజల్లిపోయిందిలే/జాబిలిగా వెన్నెలగా ఈ జంట కలిసింది/కార్తీక పూర్ణేందు హాసాలలో” అన్నారు వేటూరి ఈ గీతంలో. రాజన్ నాగేంద్ర సంగీతం సమకూర్చిన ఈ గీతాన్ని ఎస్.పి. బాలు, పి. సుశీల అద్భుతంగా ఆలపించారు.

~ ~

సుప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నవల ‘ఆఖరిపోరాటం’ ఆధారంగా అదే పేరుతో నాగార్జున, శ్రీదేవీ హీరో హీరోయిన్లుగా 1988లో సినిమా తీశారు. ఈ సినిమాలో “తెల్ల చీరకు తకథిమి” అనే పాట చరణాలలోని వచ్చే వాక్యాలు – “కార్తీకం కలిసి వస్తే నీ పరువం అడుగుతున్నా/హేమంతం కరుగుతుంటే నీ అందం కడుగుతున్నా” అని ఉంటాయి. ఎంతటి అద్భుతమైన భావుకతని గీతంలో ఇమిడ్చారో వేటూరి.

~ ~

భానుచందర్, సురేష్, అశ్విని, నూతన్ ప్రసాద్, రాజ్యలక్ష్మి తారాగణంగా 1989లో కె. రంగారావు దర్శకత్వంలో ‘ఆఖరి క్షణం’ అనే సినిమా వచ్చింది. ఇందులో “ఆషాడంలో అత్తారిల్లు కార్తీకంలో వానజల్లు” అంటూ ఓ పాట ఉంది. రాజ్ – కోటి సంగీతంలో ఎస్.పి. బాలు, ఎస్. జానకి ఆలపించారు. గీత రచన: వేటూరి సుందర రామ్మూర్తి.

~ ~

“కవ్వించే కార్తీకం నవ్వించే వైశాఖం ప్రేమించమంది నిన్నే, పెళ్ళాడమన్నది నిన్నే” అంటూ ఓ యుగళగీతాన్ని కె.ఎస్.ఆర్ దాస్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ‘ఇన్‌ప్సెక్టర్ రుద్ర’ సినిమా కోసం వేటూరి రాశారు. ఈ పాటని ఎస్.పి.బాలు, చిత్ర పాడగా కృష్ణ, యములనపై చిత్రీకరించారు. సంగీతం మహదేవన్. 1990లో విడుదలైంది ఈ సినిమా.

~ ~

ఇలా కొన్ని తెలుగు సినిమా గీతాలలో కార్తీక మాసాన్ని ఉపయోగించుకుంటూ చక్కని ప్రయోగాలు చేసి చక్కని పాటలని అందించారు గీత రచయితలు.

‘కార్తీక మాసం వ్రత మహత్యం’ అనే సినిమా కూడా ఉంది. సీనియర్ నరేష్, ప్రవల్లిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఆనంద బాబు గెద్దాడ దర్శకత్వం వహించారు.

***

కార్తీక మాసంలో ప్రధానంగా అందరూ ఇష్టపడేది వన భోజనాలు. కుటుంబ సభ్యులతో, కాలనీ వాళ్ళతో, ఆఫీస్ కొలీగ్స్‌తో… ఏ తోటలోనో వన భోజనాలు చేయాలని అందరం సరదాపడతాం. పెళ్ళి పుస్తకం (1991) సినిమాలో ‘ప ప ప పప్పు దప్పళం’ అనే వనభోజనాల పాట బావుంటుంది. ఈ పాటలో – వన భోజనం జన రంజనం అంటారు ఆరుద్ర.

“ప ప ప ప ప ప ప పప్పు దప్పళం
ప ప ప ప ప ప ప పప్పు దప్పళం
అన్నం.. నెయ్యి వేడి అన్నం.. కాచినెయ్యి
వేడీ వేడీ అన్నం మీద… కమ్మని పప్పు కాచినెయ్యి
వేడీ వేడీ అన్నం మీద కమ్మని పప్పు కాచినెయ్యి
పప్పూ దప్పళం కలిపి కొట్టడం
భోజనం వన భోజనం
వన భోజనం జన రంజనం” అంటూ సాగే ఈ పాటలో తెలుగువాళ్ళకు అమితంగా నచ్చే పదార్థాలను వర్ణిస్తారు. కె.వి. మహదేవన్ సంగీతం కూర్చిన ఈ పాటని బాలు గారు, వసంత గారు ఆలపించారు. ఈ పాట వింటుంటే నోరూరుతుంది.

అయితే ఇటీవలి కాలంలో వనభోజనాలు కాస్తా కులభోజనాలుగా మారిపోయి… వాటి వెనుక స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని అనుకున్నాను.

***

పార్క్ దగ్గరగా ఉన్న ఒక ఇంట్లో కొందరు అయ్యప్ప భక్తులు సామూహిక పీఠం పెట్టుకున్నట్టున్నారు. బయట నల్ల దుస్తులు ఆరేసి ఉన్నారు. స్పీకర్స్ లోంచి పాట గట్టిగా వినిపిస్తోంది. “కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకుని మాలధరించిన భక్తులు గుమిగూడి ఉన్నారు…” అనే పాట అది.

కొంచెం వాల్యూమ్ తగ్గించి పెట్టుకోవచ్చుగా అనిపించింది. హై వాల్యూమ్‌కి నా ఆలోచనలు కాస్త చెదిరాయి.

ఇలా ఆలోచనల్లోనే రోజూ నేను నడిచే 25 రౌండ్లు పూర్తి చేసి ఇంటిదారి పట్టాను.

కార్తీకంలో చేపట్టే చన్నీటి స్నానాలు, ఉపవసాలు, నోములు, వ్రతాలు, దీక్షలు, వనభోజనాలు ఆడంబరం కోసమో/గొప్ప కోసమో కాకుండా చిత్తశుద్ధితో, వాటి అంతరార్థాన్ని గ్రహించి ఆచరిస్తేనే అందరికీ మేలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here