Site icon Sanchika

కర్తృత్వ భావనను త్యజించాలి

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘కర్తృత్వ భావనను త్యజించాలి’ అనే రచనని అందిస్తున్నాము.]

~

నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్।
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్॥

ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్ నిమిషన్నపి।
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్॥
(భగవద్గీత 5వ అధ్యాయం కర్మయోగం, 8 & 9 శ్లోకాలు)

కర్మ యోగములో దృఢ సంకల్పంతో ఏకాగ్ర మనస్థితులై ఉన్న వారు – చూస్తున్నప్పుడూ, వింటున్నప్పుడూ, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడూ, కదులుతున్నప్పుడూ, నిద్రిస్తున్నప్పుడూ, శ్వాస క్రియలప్పుడూ, మాట్లాడుతున్నప్పుడూ, విసర్జిస్తున్నప్పుడూ, స్వీకరిస్తున్నప్పుడూ, కన్నులు తెరుస్తున్నప్పుడూ, మూస్తున్నప్పుడూ అంటే సర్వాకాల సర్వాయవస్థల యందు కూడా ఈ కర్మనూ కూడా చేసేది నేను కాదు అని భావిస్తారు. ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు అని పై శ్లోకానికి అర్థం. అన్ని భక్తి మార్గాలలో కంటే అత్యున్నతమైనది గా భావించే సర్వస్య శరణాగతికి పై స్థితి నిదర్శనం.

భగవంతుని శుద్ధ భక్తి భావనలో వున్న సాధకులు కర్త, కర్మ, ప్రయత్నం ఇత్యాది కారణాలపై వారి మనస్థితి ఆధారపడి వుండదు. ప్రతీ శ్వాసలో కూడా భగవంతుని యందే చిత్తశుద్ధితో మనస్సు నిలిపి ఉంచడమే అందుకు కారణం. భౌతికవాదులు ఇంద్రియాలను ఇంద్రియ భోగానికి వినియోగిస్తారు కాని సాధకులు లేదా కర్మయోగులు మాత్రం తమ ఇంద్రియాలను సాక్షీభావనతో చూడడమే కాక వాటిని భగవంతుని కోసం వినియోగిస్తారు.

అత్యున్నత యోగ స్థితికి ఇది ఒక చక్కని నిదర్శనం. భగవత్ దృక్పథంలో ఉన్న సాధకులు కర్తృత్వ భావన అనే ఒక పెద్ద అడ్డంకిని సునాయాసముగా అధిగమిస్తారు. పరిశుద్ధమొనర్చుకున్న బుద్ధితో వారు తమని తాము శరీరం కంటే వేరుగా చూస్తారు, కాబట్టి తమ శారీరక క్రియలను తమకు ఆపాదించుకోరు. ఈ చరాచర సృష్టికి కారణభూతమైన భగవంతుని చైతన్య శక్తే తమ శారీరక విధులకు కారణం అని భావించి నిమిత్తమాత్రులై జీవిస్తుంటారు. అటువంటి కఠోర సాధకులు ఇంద్రియ కర్మల వలన ఎప్పుడు ప్రభావితం కాకపోగా వారు తాము భగవంతునికి సదా దాసులమను భావిస్తూ ‘భగవంతుని కోసం నిర్దేశించబడిన కార్యాలనే నేను చేస్తున్నాను’ అనే భావనతో మనస్సు మరియు ఇంద్రియాల ద్వారా చేసే చర్యలను కర్మ అని శాస్త్రం నిర్వచిస్తోంది. స్థూలంగా (బాహ్యంగా) కన్పించే కర్మలు కొన్నయితే, సూక్ష్మంగా అంతరంగంలో సాగేవి మరికొన్ని కర్మలు వుంటాయి. ఉదాహరణకు ఆలోచనా రూపంలో, మాటల రూపంలో, చేతల రూపంలో కర్మలు చేస్తూనే ఉంటాం. అలా చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. అది అనుభవంలోకి వస్తుంది. ఈ జగత్తులో ప్రతి జీవి జన్మించడానికి కారణం మునుపుటి జన్మల కర్మ ఫలితమే. ఈ స్పృహతోనే భాగవతులు ప్రతీ కర్మను కర్తృత్వ భావన లేకుండా భగవంతుని ప్రీతి కోసం చేస్తూ భగవంతుని పాదాల చెంత చోటు సంపాదించుకుంటారు. వేదాలు ప్రవచించినట్లు బాహ్యంగా కర్మలను శ్రద్ధతో ఆచరించుము, కానీ అంతర్గతంగా మాత్రం వారిని వారు అకర్తగా మరియు భగవంతుడే అన్ని శారీరక, మానసిక చర్యలకు ప్రధాన కర్తగా భావించుట అభ్యాసం చేస్తారు.

Exit mobile version