కరువు

8
2

[dropcap]“మ[/dropcap]న ఊరి గుట్ట మీద పే..ద్ద ఆరుకాళ్ల రాక్షసి ఒకటి కాలుమింద కాలు ఏస్కోని కుసున్కోని, మూరెడు పొడుగు కోరల్తో ఊరాకిలంత నోరు తెర్సి.. ఆకలి.. ఆకలి అని కేకలు పెడుతుండాది. దాని అరుపులే మన ఊరికి పట్టిన దరిద్రం. దాని మూలంగనే వానలు సరీగ కురిసేదిలేదు.. పంటలు పండేది లేదు. మనం బాగుపడేది లేదు. దినా..ము యతల్తో ఈ సావు సచ్చేకంటే, పిల్లాతల్లి అంతా ఈ ఊరిడిసి, మన కడుపు నింపే మరో వూరికి పొయ్యి తలదాసుకుందాం పదండి..! ఈ పిచ్చోడేదో నోటికొచ్చింది మాట్లాడుతుండాడ్ల్యా! అని నా మాటని కొట్టి పారెయ్యకండి. రేత్రి ‘పెద్దమ్మ తల్లి’ నా కనుసులేకొచ్చి సెప్పిన మాటలివి… మన మంచి కోసమే కదా అని గొంతుసించుకోని అరిసి సెప్తుంటే ఎవరు నా మాట సెవిన ఏసుకోరేమ”ని తిక్క తిక్కగ వొదురుకుంట.. ఎదురు పన్నోళ్ళని నిలదీసుకుంట సందులు పట్టుకోని ముందుకు పోతావుండాడు మతి సిమితం లేని ‘నింగన్న’ మామ.

ఆ మామకి ‘పిచ్చి’ పుట్టుకతో వచ్చిందేమి కాదు. నాలుగేండ్ల ముందు తన రెండెకరాల భూమిలో ‘పత్తి’పంట ఏసింటే, ఆయేడు వానలు బాగ కురిసి పంట బా(గా)నే పండి, యన్నడు సూడని దుడ్లని సెయ్యి సూస! ఇన్నాళ్ళకి దేవుడు నా కష్టాన్ని కండ్ల సూసినాడుల్యా అని సంబరపడి, దాని ఆసరాతో ఇంగా రోంత కష్టపడితే ఇంగిన్ని దుడ్లు సెయ్యిసూడొచ్చు కదా అని ఆశపడి, ఆ మర్సుటేడు ‘కటికే అంబోజిరావు’ ఎనిమిదెకరాలు సేను ‘గుత్త’కి మాట్లాడి, అదే పత్తిగింజలు నాటి, పెండ్లాం మెళ్ళో తాళిబొట్లు కాట్నుంచి కాలిసుత్తులు వరకు అన్ని కుదువ పెట్టి పెట్టుబడులు పెట్నాడు.

పిల్లా తల్లి రేయాదో పగలాదో అనేది తెలకుండ కష్టపన్నారు పాపం! లాభాల మాట అట్లుంచి (పక్కన పెట్టు).. పెట్టిన పెట్టుబడిలో కనీసం పావలావంతు కూడ రాకుండ సేసి ఒకటేసారి పాతాళానికి తొక్కేశినాడు ఆ జాలిలేని దేవుడు. ఆ దెబ్బతో అతని తలకాయ అనేది సెడిపొయ్యి పిచ్చిపట్టింది. ఆపొద్దునుంచి మనిషి మనషిలక్క లేడు. ఒగతాన నిమ్మలంగ వుండడు. అతను ఏమి మాట్లాడుతాడో ఏంటికి మాట్లాడుతాడో ఎవురికి అర్థం కాదు. మొదిట్లో అయ్యయ్యమ్మ కదన్యా బంగారట్లా మనిషి ఇట్లయిపాయ! అని ఊరంత అంగలాసిరి. కానీ, రాంగ..రాంగ ఆ మనిషి సేతలకి అలవాటుపడి అతని బతుకు ఇంగం తేల్యా! అని ఊరకాయిరి. ఇప్పుడెవరు ఆ మామ గురించి ఆలోసించే వొళ్ళు గానీ, ఆ మనిషి మాట్లు పట్టించుకునేవోళ్ళు గానీ లేరు. కాకపోతే వుండూరు మనిషి కాబట్టి ఎప్పుడింటికొచ్చినా.. అట్లా మనిషికి సేవ సేత్తే పుణ్యమొత్తది కదాని మాసిన బట్లు ఇడిపిచ్చి పెయ్యి మింద నాలుగు సంబులు నీళ్ళు పోస్తారు. అట్లే… ఆకలయితుండాదా నింగన్న.. అని అడిగి, తింటానంటే కడుపునిండ బువ్వ పెట్టి, ఇంగ యాడన్నా తిరుగు పోప్పా! అని అంపిస్తారు.

***

‘పొద్దుటూరు’ పక్క శెనక్కాయలు అదునుకొచ్చినాయని, ఓ పద్దినాలుంటే పనులు దొరకొచ్చునని సూసొచ్చేకి పొయ్యినొళ్ళు సెప్తుండారు. అగ్రహారం, కొత్తూరు వాళ్ళు ఈ పొద్దు పోదామా, రేపు పోదామా అని ఆలోసన సేత్తుండారంట. రేపు బేస్తవారం మంచి దినమని మన దామోదరు స్వామి సెప్పినాడు. మీరూ ఊరందరి సరీగ గంట్లు నెత్తిబెట్టి బయలెల్లేదే కద గౌరప్పా!’ అని అనుకుంటొచ్చి పడసాల్లో నాయన పక్కన కుసున్నాడు మా సిన్నతాత.

మా నాయన- ‘యా పక్కో ఒగ పక్క యల్లబారిపొయ్యి పనులు బుడుక్కోని(1) ఓ మూన్నెల్లు ఉండి పదో పరకో సంపాయిచ్చుకోకపోతే ఊర్లోనే ఉండి పిల్లా-తల్లి మన్ను గీన తిని బతకమంటావా మామా! యాదో పండుతాది కదా అని ఎకరానికి అరవై శేర్లు లెక్కన ఇన్నూట.. నలవై శేర్ల (వేరు శనగ) ఇత్తనాలు మొంట్లో పోసి ఇత్తి గిల్సి ఎన్నో ఆశలు పెట్టుకుంటిమి. మొదిట్లో.. మొలకలు బాగ ఎగిసొత్తుంటే లోలోపల్నే మురిసిపోతా అందినకాటికి అప్పుల్జేసి ఎరువులు సల్లి, మందులు కొట్టుకుంటిమి. పైరు బలపడి సేనంత (పసుపు) పచ్చ పూలతోట లక్క (మాదిర్గ) పూతలు పూసి, ఒక్కొక్క సెట్టుకి ముప్పై.. నలభై వూడలు దిగుతుంటే ఎక్కల్లేని ఆశ పుట్ట. న..ల్లగ మిరమిరమని మెరిసిపోయే ఆ పైరుని సూసి, ఈ యేడు ‘గౌరి’గాడు నక్కతోక తొక్కొచ్చి ఇత్తనం ఏసినట్లుండాడని దావనపొయ్యే వొళ్ళు మాట్లాడుకుంటపోతుంటే.. ఈ దెబ్బతో అప్పులన్ని తీరిపొయ్యి ఏలినాటి శని తెగి, సల్లగ నెత్తికి నీళ్ళు పోసుంటాముల్యా అని సంబరంతో సంకలు గుద్దుకుంటి. వూడలు దిగి సరీగ బుడ్డ నీరు పట్టే టైంలో.. ఎవరో గిట్టనోళ్ళు పోయి గిల్లాలు (2) సెప్పినట్ల ఆ వానదేవుడు మొండి సెయ్యి సూప! నమ్ముకున్న దేవుడే నట్టేట్లో ముంచితే నాశనం గాక ఇంగేమైతాం మామా! సరైన టైంలో వానదేవుడు కండ్లు తెర్సి భూమమ్మ తల్లి సోలింటే(పండింటే) నాలుగెకరాలు కల్సి ఎనవై (80) సంచులు కావాల్సింది… సేతిలో దుడ్లు ఆడనప్పుడు సన్నపిల్లోల్లకి పొప్పులు పెట్టి పోరు(3) మాన్పినట్ల తొమ్మిది సంచులాయ! అదిగూడ యట్ల.. పిల్లా తల్లి భూమంత సోపడ(4) పట్టి ఏరకలాడితే ఆటికి ఏడ్చింది. దీన్ని పండడం అంటారా మామా..!’ అంటా కండ్లనిండ నీళ్ళు నింపుకున్నాడు నాయన.

‘పండటం పండకపోవడమనేది భగవంతుని ఆట గౌరప్పా… మనకి ఎంత అంటే దుంటే అంత అంటుతాద’ని తాత సర్దిసెప్పేకి సూసినాడు.

“ఏమి భగవంతుని ఆటో పో మామా! యాటికో ల్యా.. పండిన పంటని పారబోసుకోలేము కదా అని, ఆ తొమ్మిది సంచుల్ని ‘ఆదోని’ మార్కెట్టుకి ఎత్తకపోతే ఆ యాపారస్థులు.. బుడ్లని(5) పిడికిల్లతో పట్టి.. పట్టి సూసి, పిండాలు సరీగ లేవని మూతులు సింగరిచ్చి.. సింగరిచ్చి బలవంతంగ.. బేరాలాడ్రి!

మొత్తం మూడు కింటాలు అయింటే, కింటము రెండువేల లక్కన.. ఆరువేలు బిళ్ళయింది. మందులని మాకులని రెండుమూడుసార్లు తెచ్చుకొనిన దుడ్లుకి వడ్డి-గంటు(6) కల్సి మొత్తం ముప్పై వేలయితాది గౌరప్పా! ఇంగా నువ్వే నాకి ఇరవై ఆరువేలు బాకి అని బుక్కు లేకి ఎక్కిచ్చ సిన్నషావుకారి.

ఆ మాట సెవిన పడతానే సంగటం పొంగుకోనొచ్చి కండ్లలో నీళ్ళు దుంకులు దుంక సూడు మామ! ఎంత ఆపుకుందామనుకున్యా నా శాతగాకపాయ. తూ! ఎవురన్న సూత్తే ఆడదాన్లక్క ఏడుతుండాడు ఆడంగులోడని అనుకుంటారని వొళ్ళె మొకానికి అడ్డ పెట్టుకోని అంగడి ఎనిక్కి పొయ్యి సరీగ ఒగ గంట సేపు ఏడ్సింటాను సూడి! అన్సకారికి(7) మెల్లంగ తమాయించుకోని షావుకారు వద్దకి పొయ్యి, “ఇంట్లో బొత్తిగ తిండి గింజలు లేవు.. ఓ రెండువేలిచ్చి ఖాతాలో రాసుకో షావుకారి..! వచ్చేయేడు సెల్లబెడతా’నంటే, ‘మొబ్బుల్ని సూసి ముంత ఒలకబోసుకున్నట్ల.. ఇట్లా యాపారాలు సెయ్యలేము సూడు గౌరప్పా! మీకి బుద్ధిపుడితే మా అంగడికి సరుకు త్యాండి.. లేదంటే యేరే అంగళ్ళకి పొయ్యి యేసుకోండి. అంతేగాని, సముచ్చరం ముందునుంచి అంగళ్ళగాటికొచ్చి అవి లేవు.. ఇవి లేవు అని మనుషుల్ని సతాయీయొద్దండి అని బజార్లో గెజికుక్కని సూసినట్ల సూసి, జేబులోనుంచి నూరు రూపాయలు తీసి అడుక్కునే వోనికి ఇసిరేసినట్ల ఇసిరేస్తే, నువ్వేమన్న అనుకో మామా! మగ పుట్టుక పుట్టి ఇట్లా బతుకు బతకరాత్తీ.. అని రైలుకింద పడి సచ్చిపోదామనిపిచ్చ! ఇంటికాడ పిల్లలు మతికొచ్చి ఆగిపోతి సూడు మామా! ల్యాకుంటే ఇయ్యాల్కే దినాలు.. గినాలు(దివసం) అన్ని అయిపోయి మీరందరు మర్సిపోతుంట్రి…

నాయన; తాతతో తన గోడు ఇట్లా యల్లబోసుకోని గుండెల్లోని బరువు దించుకుంటా వుండాడు.

తాత- ‘నువ్వట్ల బాధపడొద్దు గౌరప్పా! బ్రహ్మ రాతకి అందరు కిందే అనే సంగతి మనకి తెలిసిందే కదా! మన పురాణాల్లో హరిశ్చంద్రమారాజు, పాండవులు, శ్రీరామశంద్రుడు.., వీళ్ళంత గొప్పగొప్ప రాజులు కదా! మరి వాళ్ళకి ఏమి తక్కువై వనవాసాలు, అజ్ఞాతవాసాలు.. అవి-ఇవి అంటా, ఏమిటికి అగసాట్లు పడాల్సొచ్చిందంటావ్..!? విధిరాత గౌరప్పా..! విధిరాత..! పోయిన జన్మలో ఏమేమి పాపాలు సేసి పుట్నామో.. బతికినన్నాళ్ళు భరించి సాయల్లంతే. వానలు పల్లేదు.. పంటలు పండలేదు.. పంటకి రేట్లు పలకలేదు.. ఊరిడిసి పెట్టి సుగ్గులికి(8) పోవల్ల… ఇట్లా కష్టాలు మన జిల్లాలో రైతుపుట్టుక పుట్టిన ప్రతి ఒక్కని జీవితంలో వుండాయి. ‘నలుగురితో పాటు నారాయణ.., ఊరు సుట్టు గోవిందా!’ అంటా నాయన్ని సముదాయించే ప్రయత్నం సేసి ఇంటికి యల్లబారిపోయినాడు తాత.

***

స్వామి మంచి దినమని సెప్పిన బేస్తవారం…

“పొద్దుటూరు సేరల్లంటే, ముందు మా ‘రాజుల మండగిరి’ నుంచి.. ఏడు మైళ్ళు దూరముండే ‘పత్తికొండ’ సేరుకోవల్ల. ఆట్నుంచి బస్సుకి ఎదుక్కోని ‘గుత్తి’టేషన్‌కి సేరి, ఆడ రైలుబండెక్కి ‘యర్రగుంట్ల’ దిగితే ఆట్నుంచి పొద్దుటూరు సుమార్గ పది మైళ్ళుంటాది. ఆ సుట్టుపక్కన పల్లెల్లో పనులు సిక్కుతాయి.

పిల్లాతల్లుల్లో అంతదూరం ప్రయాణం సేసే పనని సుక్క పొద్దుతో నిద్రలేసి మూటా-ముళ్ళె కడతా వుశారు పడుతుండారు ఊరిజనం. మగొళ్ళు బాయికి పొయ్యి నీళ్ళు తెస్తుంటే ఆడోళ్ళు వంట-వార్పుల సంగతి సూసుకోని గిన్నెల్లో సద్దులు కడతావుండారు. మొత్తం కుటుంబంత నెత్తికి నీళ్ళు పోసుకోని ‘పెద్దమ్మ’ గుడికి పొయ్యి, ‘పనులు బాగ జరిగి పదిరూపాయలు కండ్ల సూసేట్టుగ సూడు తల్లి’ అని టెంకాయలు కొట్టి దండాలు పెట్టుకోని వొస్తుండారు.

అనుకున్నట్లే అందరికంటే ముందు మా ‘సిన్న నల్లగుట్టి’ తాత- తన కొడుకు క్వాల్లి(9)తో మూట నెత్తి పెట్టుకోని బయలెల్ల. తాత ముందు నడిస్తే, మంచి జరుతాదని అందరి నమ్మకం అన్నమాట. ఇట్లా తప్పుడు పొరపాట్న ఆ తాతకన్న ముందు ఎవరన్న బయలెల్లిరా.., పొయ్యినకాడ పనులు బాగ జరిగి సేతిలో దుడ్లు సరీగ ఆడితే సరే సరే. ల్యాకుంటే, వాళ్ళెదురూగనే ఏమి మొగమాటం ల్యాకుండ ఇనప్పాదాలోడని, శనేశరం నాయాళని నోటికొచ్చినట్ల నానా కూతలు తిడతారుపో..! దానికనే ముందు రడీ అయినోళ్ళుగూడ ఆ తాత బయలెల్లేడనే వార్త వొచ్చినంక గంట్లు ఎత్తుకుంటారు.

ఇప్పుడట్లే. ఆ తాత ఎనకనే రామరాతొళ్ళు, కటికే నర్సోజిరావొళ్ళు, జెట్టప్పొళ్ళ గుంపు, అట్లే… కిందికొస్తే మా మచ్చన్న మామొళ్ళు, పెండేకంటోళ్లు… ఒగరెనుకొగరు వారధి(వరస) కట్టి, ఊరిబయట సెరువు కట్టమిందికి పొయ్యి మూటలు దించి, ‘ఇడ్సి పెట్టి పోయినారు కదా’ అనే మాటోస్తాదని ఎనకనుంచి వొచ్చేవొళ్లకోసం ఎదురుసూసుకుంటుంటే, మా బోయగేరి జనమంత మన సీమలపుట్ట కదా పగిలినట్ల.. ఒగటేసారి దబ్బ..దబ్బమంటా ఎల్లబారొచ్చి సెరువుకట్ట సెర్రి. వీళ్ళని సాగనంపేకొచ్చిన ముసలి ముతక తమ మనవల్ని.. మనవరాల్ని పట్టుకోని ఏడ్సులు ఏడుతుండారు. ఆ పిల్లలైతే మా యవ్వతాతల్ని ఇడి పెట్టి రామని మొండికేత్తా, మొంట్లో పొర్లాడుతుండారు. పిల్లల్ని ఇండ్లకాడ ఇడ్సి పెట్టిపోతే ముసలోల్లకి మాటినక అల్లర్లుపడి సెట్లు.. గుట్ల పాలైతారని బెయపడి, నిదానస్తులైన(10) తండ్రిగారు.. బిస్కెట్లు, నానిరెట్లు(11) కొనిస్తామని ఆశపెట్టి, మచ్చిక సేసుకునేకి తండ్లాతుంటే, కోపస్తులు మాత్రం పిల్లల పిర్రలు వాసేతట్ల కొడుతుండారు. అజూసి పిల్లల ‘అమ్మ’లు కండ్లనిండ నీళ్ళు దింపుకుంట కొంగులొత్తుకుంట.. పిల్లాతల్లుల్ని ఎడబాపి, ఇంతమంది గోడు కొట్టుకోని ఆ గుడ్డి దేవుడు ఏమి పుణ్యం మూట కట్టుకుంటాడో.. ఏమో!’ అని కరువు కోపంతో దేవునికి శాపనార్థాలు పెడ్తావుంటే, అట్ల అలుగుపక్క తుమ్మ సెట్లల్లోనుంచి అగురారమొళ్ళు, కొత్తూరొళ్ళు వొచ్చి కల్సుకుండ్రి. వాళ్ళు.. వీళ్ళు అందరు సేరి సుమార్గ హోసూరు నరసింహస్వామి తిరునాల జనం కల్సినట్లయ!

ఏడ్సుకుంట.. తూడ్సుకుంటూనే అందరొచ్చినట్లే కదాని రూడి సేసుకోని నెత్తిన మూటలు పెట్టి ఒగరెనుకొగరు భా..రంగ కదిలిరి.

వానదేవుడు సన్నసూపు సూడబట్టే మా రైతుబతుకు ఇట్లా ఉట్టికి స్వర్గానికి ల్యాకుండ మధ్యల్లోన యాలాడినట్లుండాది. దేశానికి అన్నం పెట్టేవోడు ‘రైతు’ అంటారు. మరి అట్లాంటి రైతే ఇయ్యాళ తన కడుపు సేతపట్టుకోని దేశాలు మీద తిరుగుతున్నాడంటే యట్లాంటి గడ్డుకాలం దాపురించేదనల్ల, మా మూడూర్ల నుంచి పోతున్న జనమే తిరునాలని తలపిస్తే మరి ‘పత్తికొండ’ మండలంలో ఎంత జనం పోతుండల్ల! అట్లే…, జిల్లా మొత్తంలో ఎంతమంది గడప దాటుతుండల్ల..! ఈ లెక్క కరెట్టుగ తేలల్లంటే కర్నూలు, ఆదోని, తుగ్గలి, గుత్తి.. రైలు టేషన్లలో దినాము మూటా..ముళ్ళెలో కనపడే జనాన్ని గమనిస్తే తెలుత్తాది. మాసిపోయిన బట్టల్లో వుండే వాళ్ల వద్దకి పొయ్యి; ‘ఏమప్పా! మూటలు కట్టి మొత్తం పిల్లా తల్లి పయానం అయ్యేర.. యాటికి పోతుండార’ని! అని అడిగి సూడండి.

‘ఏమి సేత్తామయ్యా..! ఈ యేడు వాన దేవుడు కండ్లు తెరక పంటలన్ని ఎత్తిపోయి సేతిలేకి పావలా గూడ రాల్యా. ఇంగ పిల్లా తల్లి ఏమి తినల్లని., కడుపు సేతపట్టుకోని ‘కడప’ పక్క పోతుండామని.., గుంటూరు పక్క బతికేకి పోతుండామని, ల్యాకపోతే బెంగుళూరు పక్క బేల్దారి పనికి పోతుండామ’ని సన్నపోయిన మొకాలు పెట్టుకోని వాళ్ళు సెప్పే సమాధానం ఇంటే, మనది నాగరిక జీవనమేనా అని మీకే అనుమానం కలుగుతాది. అమ్మతోడు.. ఒట్టు పెట్టుకోని సెప్తుండాను.. మా అవస్థలు సూసి మీరు నిజంగ మనసు వున్నొళ్ళమయితేగీన ఇంటకి పొయ్యి తలిలో(12) ఐదు ఏళ్ళు పెట్టి బువ్వ తినలేరు. అట్లే కడుపనేది రగిలి పొయ్యి, ఇట్ల జరుగుతున్నా పట్టించుకోని నాయకులమీదా.., మనకేంటికిల్యా ఈ అవస్థలు మనకి లేవు గదా అని పట్టనట్ల నడుసుకునే ఈ సమాజం మీదా అసయ్యమేస్తాది.

ఏ ఒక్కరైనా.. దేవుని మనసు సేసుకోని; మన జిల్లా రైతులందర్ని ఒక తాటిమిందికి తెచ్చి, బలమైన నాయకుల్ని పట్టుకోని ఉద్యమాలు నడిపి, ప్రభుత్వాలతో పోరాటాలు సేసి, ప్రాజెక్టులు కట్టించి రైతాంగానికి నీటి వసతి ఏర్పాటు సేసి మన జిల్లా ప్రజల్ని ఈ కరువు కాటకాల యతల్నుంచి కాపాడొచ్చు. లేదంటే ‘ఫ్యాక్టరీ’లట్లాటివి తెప్పిచ్చి రోంత మందికన్న పనులు కల్పించొచ్చు. కానీ, అది మన పని కాదుల్యా అన్నట్లుండి ఏ ఒక్క మహానుభావుడు ముందుకురాడు కదా! అగా అక్కడే వొచ్చింది సిక్కంతా..!

మా ఈ సమస్య నిన్న మొన్నట్నుంచి పుట్టుచ్చిందేమి కాదు. మా తాత ముత్తాతల్నుంచి ఇవే మా అవస్థలు. అన్నేండ్ల నుంచి వున్న్యా మా గురించి ఆలోసన సేసే నాయకులు గానీ పాలకులు గానీ లేరు. ఓట్లు అడిగేకి వచ్చిన నాయకుల్ని నిలదీసేదానికి మా వాళ్ళకి ధైర్యం లేదు!

ఇప్పటి జనాలంతా నిన్న మొన్నొచ్చిన రాజకీయ నాయకుల్ని గూడ మంత్రులైతే బాగుంటాది, ముఖ్యమంత్రులు అయితే బాగుంటాదని మాట్లాడుకుంటారు… ఆ పార్టీ పేరుతో వేలకి వేలు ఖర్చులు పెట్టి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి, ఇంటర్నెట్లో పోస్టు పెడతా వాళ్ళ మీదవుండే అభిమానాన్ని సాటుకుంటుండారు. అట్లే.. పలానా మా ‘హీరో’ సినిమా హిట్టయి, మంచి కలెక్షన్లు సాధించి రికార్డులు బద్దలు కొట్టల్లని పాలాభిషేకాలు సేసుకుంట డి.జెలతో ఊరుఊరంతా తిప్పి ఊరేగింపులు సేత్తావుండారు.

మరి, వీటన్నిటి గురించి అలోసన సేసే జనాలకి మా బతుకుల గురించి ఏంటికి పట్టదో ఏమో మరి..! – వాళ్ళు సేసుకున్న పుణ్యమేమో! మాము సేసుకున్న పాపమేమో! మాకైతే అర్థం కాదు. అందరి కడుపులు నింపే పంటలు పండించి, అట్లే మా కడుపు నింపుకోవాలనుకోవడం పాపమేనేమో..!

(సమాప్తం)

కొన్ని పదాలకి అర్థాలు:

  1. బుడుక్కోని= వెతుక్కొని
  2. గిల్లాలు= అబద్దాలు
  3. పోరు= ఏడుపు
  4. సోపడ= జల్లెడ పట్టినట్లు
  5. బుడ్లని= వేరు శనగలు
  6. గంటు= అసలు
  7. అన్సకారికి=తరువాత
  8. సుగ్గులికి=వలసలు
  9. క్వాల్లి = కోడలు
  10. నిదానస్తులైన= శాంతపరులైన
  11. నానిరెట్లు=బ్రెడ్ ముక్కలు
  12. తలిలో=పళ్ళెంలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here