Site icon Sanchika

సాగే బాధల బిడారు: కారవాఁ

[box type=’note’ fontsize=’16’] “ప్రయాణంలో ముగ్గురు, ముగ్గురి బాధలూ గాధలూ వేరు, అది చెప్పిన తీరు మాత్రం తేలికైన హాస్యం” అంటున్నారు పరేష్ ఎన్. దోషికారవాఁ” సినిమాని సమీక్షిస్తూ. [/box]

మనకు ఆకాశ్ ఖురానా నటుడుగా తెలుసు. మహేశ్ భట్ చిత్రాలలో యెక్కువగా చూశాం. అలాగే శ్యాం బెనెగళ్, గోవింద్ నిహలానీ చిత్రాలలో కూడా. నాటకాలలో చేయడం, నాటకాలను డైరెక్ట్ చేయడం, సినెమాలకు కథలు, స్క్రీన్ ప్లేలు అందించడం చేశాడు. ఫ్రంట్ పేజ్, కుఛ్ రేత్ కుఛ్ పాని తర్వాత దర్శకత్వం వహించిన మూడవ చితం ఇది.

కాస్త సీరియస్ విషయాన్ని తీసుకుని హాస్య వాతావరణంలో తేలికగా అల్లబడిన కథ ఇది. మనకు హిందీలో ఈ మధ్య “రోడ్ చితాలు” బాగానే వస్తున్నాయి. అలాంటిదే మరొకటి. ప్రయాణంలో ముగ్గురు, ముగ్గురి బాధలూ గాధలూ వేరు, అది చెప్పిన తీరు మాత్రం తేలికైన హాస్యం. అవినాష్/అవి (దుల్కర్ సల్మాన్) బెంగళూరులో వుంటాడు. అతని తండ్రి ఆకాష్ ఖురానా వొక బస్సు ప్రమాదంలో మరణించాడనీ, అతని శవాన్ని ఫలానా చోటునుంచి తీసుకెళ్ళమనీ ఫోనొస్తుంది.
తీరా అక్కడికెళ్ళి చూస్తే వొక స్త్రీ శవం దొరుకుతుంది, తన తండ్రి శవం ఆ స్త్రీ శవం చేరాల్సిన చోటుకి, కొచి కి, చేరిందని తెలుస్తుంది. ఇక తన స్నేహితుడైన షౌకత్ (ఇర్ఫాన్ ఖాన్) వేన్ లో అతన్ని తోడుగా తీసుకుని బయలుదేరుతాడు. ఆ స్త్రీ శవం అమల తల్లిది. అమలతో ఫోన్ మీద సంభాషణ జరుపుతుంటే ఆమె అంటుంది తన కూతురు ఫోన్ కలవట్లేదనీ, వీలైతే ఆమెను కూడా పికప్ చేసుకుని రమ్మని. ఆ విధంగా తాన్యా (మిథిలా పాల్కర్) వీళ్ళతో కలుస్తుంది. దారిలో రకరకాల ఉపకథలు. ముగ్గురూ మొదట వొకరిని వొకరు ఇష్టపడకపోయినా జీవితపు ఈ మలుపులో విషాదం వాళ్ళను దగ్గరకు చేర్చి, తమ మనసులు విప్పుకునేలా చేస్తుంది. తనకు ఇష్టమైన ప్రవృత్తిని తండ్రికిష్టం లేదని వదులుకోవాల్సి రావడం చేత యెప్పుడూ తండ్రిని ద్వేషించే అవి. మందుల దుకాణానికి వెళ్ళి గర్భధారణ పరీక్షకు పనికొచ్చేవి ధైర్యంగా కొనగల తాన్యా. పాతకాలం భావజాలాలున్న షౌకత్ వొకపక్క పొట్టి బట్టలు వేసుకునే తాన్యాని అసహ్యంగా చూసినా, తను వొక ముసలతని కూతురిగా భావించిన వో బుర్ఖా స్త్రీని పాత పధ్ధతుల్లో తన ప్రేమ ప్రకటన చేయడం, ఆమె ఆ ముసలతని భార్య అని తెలిసిన తర్వాత, ఆమెకూడా ఇష్టపడటంతో లేవనెత్తుకుపోవడానికి తయారవడం ఇదీ షౌకత్ పాత్ర. ప్రయాణం మధ్యలో వో చోట మజిలీ అవి పాత ప్రేమికురాలింట. ఇలా వొక్కో పొరనే విప్పుకుంటూ కథ సాగుతుంది. వొక, లేదా రెండు అనాలేమో, మరణ/మరణాల నేపథ్యంలో ప్రతి పాత్రా యెలా ఆత్మావలోకన చేస్తాయి అన్నది చాలా తేలికగా (lightగా) చూపించాడు. బరువైన నేరేషన్ కంటే ఇది ఇంకా శక్తిమంతం.

నటన గురించి చెప్పాలంటే దుల్కర్, ఇర్ఫాన్ ఇద్దరూ చాలా బాగా చేశారు. పెద్ద పాత్ర లేకపోయినా ఇర్ఫాన్ తన సంభాషణలతోనే ఆకట్టుకుంటాడు. ఇక నటన చేస్తున్నట్టు కనపడకుండానే దుల్కర్ తన పాత్రను చాలా సున్నితంగా మనముందు ప్రదర్శిస్తాడు. ఆకాష్ ఖురానా దర్శకత్వం బాగుంది. నేపథ్య సంగీతమూ, పాటలూ బాగున్నాయి. అవినాష్ అరుణ్ చాయాగ్రహణం అందంగా వుంది.

ఇక పోతే ఇద్దరు కంటే యెక్కువ ముఖ్య పాత్రలు పెట్టి సినెమా తీసిన వారు కొంతమంది ఆ నిడివిలో అందరి కథా చెప్పలేక పోతున్నారని నేను “ఈ నగరానికేమైంది” చూసినప్పుడు గ్రహించాను. ఈ చిత్రం చూడండి, దారిలో వొక చోట ఆగినప్పుడు సంభాషణలలో భాగంగా ఇర్ఫాన్ ఖాన్ తన తండ్రి, తల్లి, తన బాల్యం వీటి గురించి చెబుతాడు. చాలా కదిలిస్తుంది అది. మరచిపోలేము. Spoiler భయంతో దాన్ని వివరించడంలేదు. కాని కాన్వాస్ పెద్దది పెట్టుకున్నప్పుడు అన్ని ఉపకథలకూ న్యాయం చేయడానికి పరిహరించాల్సినవి యేవి, తడమాల్సినవి యేవి అన్నది అవిచ్చిన్నంగా తలలో మెదులుతూనే వుండాలి.

రొటీన్ చిత్రాలు చూసి చూసి విసుగెత్తిన ప్రేక్షకుడికి అప్పుడప్పుడన్న ఇలాంటి చిత్రాలు రావాలి.

Exit mobile version