కశ్మీర రాజతరంగిణి-11

6
1

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

మగ్నాన్ విస్మృతి విధోదాన్ అతీతాన్ నృపాణి ఇమాన్।
శ్రీ జైనుల్లాభదీనస్య కారుణ్యాద్ ఉజ్జీ హర్షతాః॥
సర్వధర్మాదికారేషు నియుక్తస్య దయావతః।
ముఖా చ శీర్యాభట్టస్స్య ప్రాయుజ్ఞమ్ అనువజ్జయా॥
రాజావళిమ్ పూరయితుమ్ సంప్రతి ప్రతిభా మమ।
కవీనా ముఖి లాషేణ నతు యస్మాన్ మమోద్యమః॥
(జోనరాజ రాజతరంగిణి – 10, 11, 12)

జైనుల్లాభదీను కశ్మీరు సుల్తానుగా ఉన్న కాలంలో శీర్యభట్టు సర్వధర్మాధికారిగా ఉండేవాడు. అతనికి జోనరాజు అంటే గౌరవం. సుల్తాను గతించిన రాజులను, విస్మృతి అనే మహసముద్రంలో పడిన రాజులను రక్షించాలని అనుకున్నాడు. అతని కోరిక నెరవేర్చేందుకు శీర్యభట్టు జోనరాజును గతించిన రాజుల గురించి రాయమని అడిగాడు. జోనరాజు రాజతరంగిణి రచన ఆరంభించాడు. ఈ రచన రాజు కోరిక తీర్చటానికే తప్ప కవిగా గొప్ప పేరు సంపాదించుకోటానికి కాదు.

రాజతరంగిణి రచనను కొనసాగిస్తున్న జోనరాజు ఆరంభంలోనే తాను రాజతరంగిణి రచనను కొనసాగించేందుకు కారణాన్ని వివరిస్తున్నాడు. రాజతరంగిణి రచనను కొనసాగిస్తున్నందుకు వివరణ ఇస్తున్నాడు. కవిగా గొప్ప పేరు సంపాదించుకోవాలన్న తపనతో రాజతరంగిణి రచనను కొనసాగించటం లేదు. కల్హణుడు కశ్మీరు ఆవిర్భావం నుంచి అతని కాలం వరకూ (క్రీ.శ. 1148 వరకూ) కశ్మీరు రాజుల చరిత్రను రచించాడు. అతని మరణంతో కశ్మీరు చరిత్ర రచన ఆగిపోయినట్టు అనిపిస్తుంది. కవులు తమ సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తూ రచనలు చేస్తూనే ఉన్నారు కానీ రాజుల చరిత్రలను కల్హణుడిలా ఒక గ్రంథంలో చేర్చి ప్రతిబింబించలేదు. దాంతో రాజతరంగిణి తరువాత ఒక క్రమ పద్ధతిలో రాజుల వివరాలను అందించే గ్రంథం లేని పరిస్థితి వచ్చింది.

కల్హణుడి రాజతరంగిణి చివరి తరంగంలో కశ్మీరు అల్లకల్లోలం అవటం తెలుస్తుంది. ఇందుకు ప్రధాన కారణం అధికార దాహం. అధికారాన్ని అందుకోవటం కోసం వ్యక్తులు ఎంతటి నీచానికయినా దిగజారటం కనిపిస్తుంది. వ్యక్తిగత స్వార్థం కోసం జన జీవితాన్ని అల్లకల్లోలం చేయటం కనిపిస్తుంది. ఈ పరిణామాలను అత్యంత దుఃఖంతో, ఆవేదనతో కల్హణుడు తన రచనలో పొందుపరిచాడు. అత్యద్భుతమైన మహానుభావులు రాజ్యం చేసిన కశ్మీరు ఎలాంటి వారి పాలబడుతున్నదో అని విచారిస్తాడు. క్రీ.శ. 1148తో కల్హణ రాజతరంగిణి పూర్తవుతుంది. తరువాత కశ్మీరులో పెను మార్పులు సంభవించాయి. కశ్మీరు తురుష్కుల వశమయింది!

భారతదేశంలో ముసల్మానుల ప్రవేశంతో సామాజిక, రాజకీయ జీవనం అస్తవ్యస్తమయింది. రాజులకే పరిమితమైన యుద్ధాలు సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపించటం తీవ్రమైంది. క్రీ.శ. 1320 కల్లా కశ్మీరు సంపూర్ణంగా సుల్తానుల వశమయింది. సుల్తాన్ జైన్-ఉల్-అబిదీన్, జైనులాబిదీన్‍గా ప్రసిద్ధి చెందాడు. ఈయన క్రీ.శ. 1420 నుండి క్రీ.శ. 1470 వరకు, అంటే యాభై ఏళ్ళు కశ్మీరు సుల్తానుగా ఉన్నాడు. అతని ఆస్థానానికి చెందినవాడు జోనరాజు.

సాధారణంగా చరిత్రకారులు సుల్తానుల కాలంలో భారతీయులు ఆనాటి పరిస్థితులను వర్ణిస్తూ రచనలు చేయలేదని అంటారు. ఆ కాలం గురించి పర్షియన్ల చరిత్రకారుల ఆధారంగానే ఆనాటి చరిత్రను రచించవచ్చంటారు. పర్షియన్ల రచనలను ప్రామాణికంగా తీసుకుని చరిత్రను నిర్మిస్తారు. దీనికి తోడు పలు రాజకీయ కారణాల వల్ల వారు భారతీయ రచనలను విస్మరిస్తారు. ఆ కాలంలో సుల్తానుల పాలనలో భారతీయుల కడగండ్లను ప్రస్తావించీ ప్రస్తావించనట్టు ప్రస్తావిస్తారు. ఇతర అంశాలలో రాళ్లెత్తిన కూలీలు, సామాన్యుల జీవన విధానాల గురించిన వివరాలు కావాలని దబాయించినవారు ఈ కాలంలో మాత్రం కవనానికి సుల్తానుల సౌభాతృత్వ భావనలే ముడిసరుకుగా భావిస్తారు. ఫలితంగా, సుల్తానుల ఆస్థానంలో ఉంటూ సుల్తానుల పాలనలో భారతీయుల దుస్థితిని అత్యంత జాగ్రత్తగా, గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తూనే అత్యాచారాల స్వరూపాన్ని ప్రతీకాత్మకంగా చూపించిన జోనరాజు, శ్రీవరుడు కొనసాగించిన రాజతరంగిణి రచనలు అంతగా చర్చకు రావు.

కల్హణుడు రాజతరంగిణిని స్వేచ్ఛగా రచించాడు. అతడిపై ఎలాంటి నియమ నిబంధనలు లేవు. అతడికి రచనకు ప్రేరణ అతడిలోంచే వచ్చింది. ఎవరూ రాయమని చెప్పలేదు. కల్హణుడు స్వతహాగా కవి. జోనరాజు ఇందుకు భిన్నం. జోనరాజు పండితుడు. కవిత్వ సృజన అంతంత మాత్రమే. సుల్తాను దయాదాక్షిణ్యాలపై ఆధారపడి కశ్మీరులో బతుకుతున్నవాడు. సుల్తాను ఆదేశాల మేరకు సుల్తానును సంతృప్తి పరిచేందుకు రాజతరంగిణి రచనను కొనసాగించేందుకు సిద్ధపడ్డవాడు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.

కవులు సృజనాత్మక జీవులు. సృజనాత్మకత స్వసిద్ధమైన లక్షణం. అది ఒకరి ఆజ్ఞలకు లోబడి ఉండదు. కానీ మనిషి విచ్చలవిడిగా ప్రవహించే నదికి ఆనకట్ట కట్టి దాని ప్రవాహ గతిని నియంత్రించాలని తపన పడతాడు. సృజనాత్మకత కూడా ప్రవాహం లాంటిదే. దాన్ని నియంత్రించాలని ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నం రచయిత అంతరంగంలోంచి ఉద్భవిస్తే ఫలితం ఒకరకంగా ఉంటుంది. అడ్డు అదుపు లేని సృజనాత్మకత ప్రవహాం అభిలషణీయం కాదు. కాబట్టి తమ సృజనాత్మక ప్రవాహంపై స్వీయ నియంత్రణ స్వచ్ఛందంగా విధించుకున్న కవి రచనలు ఒక రకంగా ఉంటాయి. అలా కాక, ఈ నియంత్రణ బాహ్య ఒత్తిళ్ళ వల్ల అయితే ఫలితం ఇంకో రకంగా ఉంటుంది.

కల్హణుడు తన సృజనాత్మకతను స్వయంగా నియంత్రించుకున్నాడు. తనలోని కవిని, తాత్త్వికుడిని అదుపులో పెట్టుకుని ‘రాజతరంగిణి’ని రచించాడు. జోనరాజు ప్రధానంగా విమర్శకుడు. భారవి రచించిన ‘కిరాతార్జునీయం’, మంఖుడు రచించిన ‘శ్రీకంఠ చరిత’, జయానకుడు రచించిన ‘పృథ్వీరాజ విజయం’ వంటి కావ్యాలపై వ్యాఖ్యానాలు రాశాడు జోనరాజు. ఆయన సృజనాత్మక రచనలు చేసినట్టు ఆధారాలు లేవు. అంటే జోనరాజును సృజనాత్మక ‘కవి’గా పరిగణించటం కష్టం. కావ్యాలతో పరిచయం ఉంది. కావ్యాలపై అవగాహన ఉంది. కానీ జోనరాజు ప్రధానంగా వ్యాఖ్యానకర్త. సృజనాత్మక కవి కాదు. కానీ రాజతరంగిణిని కొనసాగించమని సుల్తాను నుంచి ఆజ్ఞలు అందాయి.

కల్హణుడు రాజతరంగిణి రచనలో కవిగా, తాత్త్వికుడిగా, ఒక ఎత్తు నుంచి నిష్పాక్షికంగా, నిజాయితీగా మానవ సమాజాన్ని దర్శించి, విశ్లేషించి తన రచనలో పొందుపరిచాడు కల్హణుడు. కావ్యారంభంలోనే నిర్మోహంగా ఉంటానని వాగ్దానం చేశాడు. తనలోని కవిని అణచిపెడతానని చెప్పాడు. అంటే, తాను చేపట్టిన కార్యంపై కల్హణుడికి స్పష్టమైన అవగాహన ఉంది. తన లక్ష్యం నిర్ణయించుకున్నాడు. అందుకు తగిన రీతిలో వ్యవహరించాడు.

జోనరాజు పరిస్థితి భిన్నం. జోనరాజుకు పాండిత్యం ఉంది. కవిత్వం తెలుసు. ఇంతలో సుల్తాన్ రాజతరంగిణిని కొనసాగించమని ఆజ్ఞాపించాడు. కాబట్టి కావ్యం రచించక తప్పదు. అంటే, విమర్శకుడు తప్పనిసరిగా కవి కావాల్సి వచ్చిందన్నమాట. జోనరాజు తరువాత రాజతరంగిణిని కొనసాగించిన శ్రీవరుడు జోనరాజు శిష్యుడు. ఈయన రాజతరంగిణిని కొనసాగిస్తూ ఆరంభంలో తన గురువు జోనరాజు గురించి ప్రస్తావిస్తాడు.

‘ఈ భూమిపై నా గురువు జోత్స్నాకరుడు (జోనరాజు). నా గురువు వాక్కు అమృతం. ఆయన శివభక్తుడు. పేరు ప్రఖ్యాతులు, ఐశ్వర్యం అమితంగా కలవాడు. ఆడిన మాట తప్పనివాడు. శాంతమూర్తి. బ్రాహ్మణులకు నాయకుడి లాంటి వాడు. అందరి గౌరవం పొందేవాడు. ఉత్తమ నడవడి కలవాడు. రాజు సన్మానం పొందేవాడు. రాజు అమితంగా గౌరవించేవాడు. అనంతమైన ఉత్తమ గుణాలు కలవాడు. వేదాలు, శాస్త్రాలలో నిష్ణాతుడు. నిరంతరం ధ్యాన నిమగ్నుడు. రాజసభలో బృహస్పతి లాంటి వాడు. అనేక శిష్యగణం కలవాడు’ అంటూ శ్రీవరుడు తన గురువు జోనరాజును పొగిడేడు. ఈ పొగడ్తలలో ఎక్కడా ‘కవి’ అన్న ప్రస్తావన రాలేదు. పండితుడు, వేద శాస్త్రాలలో నిష్ణాతుడు అన్నాడు తప్ప ‘కవి’ అనలేదు. ఇది గమనార్హం!

సుల్తాను ఆజ్ఞలను అనుసరించి రాజతరంగిణి రచనకు పూనుకున్నాడు తప్ప అది స్వతహాగా కలిగిన ప్రేరణ కాదు. జోనరాజు రచించిన ఏకైక కావ్యం ‘రాజతరంగిణి’. కల్హణుడి రాజతరంగిణి, జోనరాజు రాజతరంగిణిని పోలిస్తే తేడా స్పష్టంగా తెలుస్తుంది. కల్హణుడు జరిపినంత పరిశోధన జోనరాజు చేయలేదు. దీనికి తోడుగా కల్హణుడు రాజతరంగిణి రాసిన కాలానికి, జోనరాజు రాజతరంగిణి రాసిన కాలానికి వాతావరణంలో తేడా వచ్చింది!

జైనులాబిదీన్ తండ్రి సికందర్. ఈయనకు ‘బుత్‌షికన్’ అన్న బిరుదు ఉంది. ‘బుత్’ అంటే విగ్రహం. ‘బుత్‍షికన్’ అంటే విగ్రహాలను ధ్వంసం చేసేవాడు అని అర్థం. సికందర్ క్రూరుడు. ధూర్తుడు. కశ్మీరులో ఇస్లామేతరులకు నరకం చూపించినవాడు. మతం మారని వారిని నిర్దాక్షిణ్యంగా, అతి ఘోరంగా మృత్యువుకు ఎరగా వేసినవాడు. అతని పాలానా కాలంలో కశ్మీరులో ఇస్లాం స్వీకరించిన వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇస్లామేతరులు ప్రాణాలు అరచేత పట్టుకొని కశ్మీరు వదిలి పారిపోయారు. కానీ ‘సికందర్’ వారిని అలా కూడా పారిపోనీయలేదు. సరిహద్దులను కట్టుదిట్టం చేసి పారిపోతున్న వారిని వెతికి వెతికి పట్టుకున్నాడు. ఇస్లాం స్వీకరించిన వారిని వదిలేడు. లేనివారిని చంపించాడు.

భూతం లాంటి ‘బుత్‌షికన్’ తనయుడు జైనుల్ అబిదీన్. తన తండ్రి దుశ్చర్యల ఫలితంగా కశ్మీరు అల్లకల్లోలం అవటం చూశాడు. పాలన స్థంభించిపోవటం గమనించాడు. తండ్రిలాగే ప్రవర్తించాడు ఆరంభంలో. విగ్రహాలు ధ్వంసం చేశాడు. మందిరాలను నేలమట్టం చేసి మసీదులు నిర్మింప చేశాడు. ఇంకా మతం మారకుండా మిగిలి ఉన్నవారిని హింసించి మతం మార్చాడు. అయితే అతడి దుశ్చర్యల ఫలితంగా అతడు తీవ్రమైన వ్యాధి పాలయ్యాడు. ఎలాంటి మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. ఎంతమంది వైద్యులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వ్యాధి తగ్గలేదు. ఈ సమయంలో శీర్యభట్టు సుల్తానుకు వైద్యం చేసేందుకు ముందుకు వచ్చాడు. అయితే సుల్తాన్ రోగం నయం చేసేందుకు అతడు ఒక నియమం విధించాడు. సుల్తాను కశ్మీరీయులపై అత్యాచారాలు చేయకూడడు. ఇస్లామేతరులనూ కశ్మీరులో ప్రశాంతంగా బ్రతకనివ్వాలి. వారిని కశ్మీరుకు ఆహ్వానించి వారు ప్రశాంతంగా జీవనం కొనసాగించే వీలు ఇవ్వాలి. మత మార్పిళ్ళు మానాలి. అందరినీ సమానంగా చూడాలి. గత్యంతరం లేని పరిస్థితులలో సుల్తాను శీర్యభట్టు నిబంధనలకు ఒప్పుకున్నాడు. వాగ్దానం చేశాడు.

శీర్యభట్టు సుల్తానుకు చికిత్స చేశాడు. సుల్తానుకు రోగం నయం అయింది. సుల్తాను మాట నిలబెట్టుకున్నాడు. కశ్మీరు వదిలిపోయిన పండితులందరినీ సగౌరవంగా కశ్మీరుకు ఆహ్వానించాడు. వారిని గౌరవించాడు. సముచిత పదవులు ఇచ్చి సత్కారం చేశాడు. మందిరాలు నిర్మింపచేశాడు. దాంతో మళ్ళీ కశ్మీరులో ఇస్లామేతరులు ప్రశాంతంగా నివసించే పరిస్థితులు నెలకొన్నాయి. అలాగని ఇస్లామేతరులపై వివక్ష సంపుర్ణంగా అంతరించలేదు. కానీ గతమంత ఘోరంగా లేదు. ఇలాంటి పరిస్థితులలో సుల్తాను కోరికను శీర్యభట్టు జోనరాజుకు చెప్పాడు. జోనరాజు ఆ ఆదేశాలను శిరసావహించి రాజతరంగిణి రచనకు ఉపక్రమించాడు.

ఇప్పుడు రాజతరంగిణి రచనలో జోనరాజు సమస్య మనకు మరింత స్పష్టమవుతుంది.

జోనరాజు సుల్తాన్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడినవాడు. అతడు చరిత్రను రచించి సుల్తాన్‌ను సంతోషపరచాలి. సుల్తాన్‌ను గొప్పగా చూపించాలి. భూతం లాంటి ‘బుత్‌షికన్’‌ను ఉన్నదున్నట్టు చూపించే వీలు లేదు. కవి ఎంతటి నిరంకుశుడయినా, అన్ని సందర్బాలలో నిరంకుశుడిగా వ్యవహరించే వీలు లేదు. ఇంతే కాక, దేశమంతా ఇస్లామీయుల ప్రాబల్యం పెరుగుతోంది. పలు రకాల అకృత్యాల గాథలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు సుల్తాన్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది. బయట జరుగుతున్న అకృత్యాలు ప్రస్తావిస్తే, ఇస్లామీయుల గురించి చెడ్డగా రాసినట్టవుతుంది. అది సుల్తానుకు ఆగ్రహం కలిగించే వీలుంది. పైగా, ప్రాచీన ఇస్లామేతర రాజుల గొప్పతనం చెప్తే అది ఇంకో సమస్యకు దారి తీస్తుంది. వారి పాలనాకాలాన్ని చక్కగా వర్ణిస్తే సుల్తానుకు కోపం రావచ్చు. అసూయ కలగవచ్చు. తన ఆస్థానంలో తన తిండి తింటూ తన దయ వల్ల జీవిస్తున్నవాడు పరాయివాడిని పొగుడుతున్నాడని ఆగ్రహం రావచ్చు. రాజతరంగిణి రచనలో జోనరాజు ఇన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here