[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
శ్రీ త్రిలోచన పాలస్య షాహైః సహాయవార్దహ్వః
దేశం తతో మూర్గ శీర్షే మాసి తం వ్యసృజాన్నృపః
రాజపుత్ర మహామూత్యా సామన్తాది నిరన్తరమ్
సైన్యం తమన్వ గాద్భిరి భువన క్షోభన క్షిమమ్
(కల్హణ రాజతరంగిణి 7, 47, 48)
[dropcap]క[/dropcap]శ్మీరును త్రిలోచన పాలుడు పాలిస్తున్న కాలంలో ‘షాహి’ మహరాజు శత్రువులను ఎదుర్కునేందుకు కశ్మీరు రాజు సహాయం కోరేడు. ఫలితంగా మహావీరులైన రాజపుత్రులతో, సామంత మహామాత్యులు, సకల పరివారం, చతురంగ బలాలతో షాహి రాజు సహాయానికి త్రిలోచన పాలుడు బయలుదేరాడు.
‘షాహి’ రాజు కశ్మీరు రాజు త్రిలోచన పాలుడి సహాయం కోరటం చారిత్రాత్మకంగా అత్యంత ప్రాధాన్యాన్ని వహించే అంశం. రాజతరంగిణిలో తురుష్క ప్రస్తావన ఇంతకుముందు వచ్చినా అది ‘తర్క్’ ప్రాంతం నుంచి వచ్చిన వారికి సంబంధించినది తప్ప, ఇస్లామీయులను సూచించేది కాదు. కానీ ఏడవ తరంగంలో భారత్ పై దండయాత్రకు వచ్చిన ఇస్లాం సేనల ప్రస్తావన వస్తుంది.
ఇస్లాం సేనలు భారత్ పై దండయాత్ర చేసినప్పుడు భారతీయ రాజులు తమలో తాము పోరాడుకుంటూ, పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించలేకపోయారని, పనికిరాని వారు, దూరదృష్టి లేని వారు మన రాజులని అన్న అభిప్రాయం నెలకొని ఉంది. కానీ భారతీయ చరిత్రను, ఈ దేశంపై ఇస్లాం సేనల దాడుల గాథలు పొందుపరిచిన పర్షియన్ చరిత్ర కారుల రచనలను పరిశీలిస్తే, ‘నిజం’, మన చరిత్ర మనకు నేర్పిన దానికి భిన్నంగా ఉందని స్పష్టమౌతుంది.
మహారాజా ‘దాహిర్ సేన్’ను ఓడించి భారత్ లోపలికి దూసుకు వస్తున్న మహమ్మద్ బిన్ ఖాసిమ్ సేనలను త్రివేణి సంగమం లాంటి గూర్జర ప్రతిహారుడు నాగభటుడు, దక్షిణ భారతానికి చెందిన బాదామి చాళుక్యుడు రెండవ విక్రమాదిత్యుడి అనుమతితో అవనీజనాశ్రయ పులకేశి, మేవార్ వంశానికి చెందిన బప్పా రావత్‍ల సంయుక్త సేనలు ఎదుర్కుని ఓడించటమే కాదు, ‘గజ్ని’ వరకూ తరిమి అక్కడ తమ ప్రతినిధిని నిలిపి వచ్చాయి. ఆ కాలంలో ఇస్లాం సేనల దీన పరిస్థితిని వర్ణిస్తూ అరబ్బు చరిత్రకారుడు అల్ బలాధురి ‘అరబ్బులకు తల దాచుకునే స్థలమే లేద’ని రాశాడు.
The people of Hind returned to idolatry with the exception of inhabitants of Qasbah. A place of refuge to which the Muslims might flee was not to be found…..
ఆ తరువాత మరో మూడు వందల ఏళ్ళ వరకూ అరబ్బు సేనలు భారత్ వైపు కన్నెత్తి చూడలేదు (చూ. తురుష్క సేనను తరిమి కొట్టిన భారత త్రివేణి సంగమశక్తి, , ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, పేజీ 30, 223). అంటే సింధు రాజ్యాన్ని గెలుచుకుని లోపలకు దూసుకువచ్చినా , ప్రజలు అడుగడుగునా పోరాడటం, ఇస్లాం సేనలు పక్కకు జరగగానే బలవంతాన పుచ్చుకున్న మతాన్ని వదలి భారతీయ ధర్మాని మళ్ళీ స్వీకరించటం, సమష్టి భారతసేనల తాకిడి తట్టుకోలేకపోవటంతో 10వ శతాబ్దానికల్లా ముల్తాన్, మన్సురాహ్ ప్రాంతాల్లో తప్ప మరెక్కడా ఇస్లామీయులు భారత్ లో మిగలలేదు. గజనీ దండయాత్రతో ఈ పరిస్థితి మారింది.
గజనీ సేనలు సింధూ నది దాటి చీకాకు పరుస్తున్నాయని అక్కడి రాజు అభ్యర్థిస్తే పృథ్వీరాజు తన సేనలను పంపి గజనీ సేనలను ఎదుర్కున్నాడు, తరిమికొట్టాడు. ఇలా చెప్తూ పోతే భారతీయ రాజు తమలో తాము ఎంతగా పోరాడుకున్నా, పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించడమే కాదు, దాన్ని ఎదుర్కునేందుకు సమిష్టిగా పోరాడేరు. ఓడిపోయినా నిరాశ పడలేదు. శత్రువు బలహీనపడగానే మళ్ళీ తిరుగుబాటు బావుటా ఎగరువేశారు. శత్రువుని తరిమి తమ ధర్మాన్ని స్థాపించారు. ఈ వీరోచిత పోరాట గాథలు పర్షియన్ చరిత్ర రచయితల గ్రంథాలలో ఇబ్బడిముబ్బడిగా దొరుకుతాయి. ఆ కాలం నాటి భారతీయ కావ్యాలలోనూ లభిస్తాయి. రాజతరంగిణిలో కూడా కాబుల్ (గాంధారం) ప్రాంతాన్ని పాలిస్తున్న హిందూషాహి మహరాజు అరబ్బు సేనల దాడిని తట్టుకునేందుకు సహాయం అభ్యర్థించగానే, తమ మధ్య ఎన్ని కలహాలున్నా, వాటన్నిటినీ పక్కన పెట్టి త్రిలోచన పాలుడు పెద్ద సైన్యాన్ని తీసుకుని ‘షాహి’ రాజు సహాయానికి వెళ్ళాడు. అత్యంత వీరోచితమైన పోరాటం జరిపాడు. ఈ పోరాటాన్ని కల్హణుడు వర్ణించాడు.
చాచ్‍నామా ప్రకారం ‘సాహసి రాయ్’ కుమరుడు ‘శాహిరాస్’, పర్షియాలోని ‘నిమ్రూజ్’ ప్రాంతం రాజుతో ‘కిచ్’ వద్ద పోరాటంలో ప్రాణాలు కోల్పోయాడు. రెండవ ‘సాహసి రాయ్’ కాలంలో ‘చాచ్’ అనే పేద బ్రాహ్మణుడు, రాజు మరణం తరువాత సింహాసనం చేపట్టాడు. రాణిని వివాహమాడాడు. దహర్యీయ్య, దాహిర్ అనే పుత్రులను పొందాడు. రాజ్యాన్ని చేపట్టిన ‘చాచ్’ అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టిన తరువాత పర్షియన్ సామ్రాజ్యం పై దాడి చేసి వారి ఆధీనంలో ఉన్న కొన్ని ప్రాంతాలును – ‘కిర్మాన్’, ‘కందాబిల్’ వంటి వాటిని గెలుచుకున్నాడు. ‘చాచ్’ మరణం తరువాత సోదరుల నడుమ రాజ్యం కోసం పోరు జరిగింది. ‘దాహిర్’ కాలంలోనే అరబ్బు సేనలు సింధు పై దాడి చేశాయి. దాహిర్ అరబ్బు సేనలతో పరాజయం పొందడానికి ప్రధాన కారణం హిందూ రాజుల నడుమ జరిగే అంతర్గత కలహాలు కాదు. రాజ్యం లోనే ఉన్న రాజు వ్యతిరేక శక్తులు.
ఆ కాలంలో సింధు ప్రాంతంలో బౌద్ధులు శక్తిమంతులు. వారి వివిధ ప్రాంతాల అధికారులుగా ఉండేవారు. అరబ్బు సేనలు ‘కికానాన్’ ప్రాంతాన్ని గెలుచుకోవటంపై దృష్టి సారించాయి (ఇది బలూచిస్తాన్ ప్రాంతం). కానీ ఇక్కడి ప్రజల వీరోచిత పోరాటంతో అరబ్బు సేనలు వెనుతిరగక తప్పలేదు. ఇలా పలు దాడుల తరువాత ‘రషీద్’ అనే సేనాని నేతృత్వంలో అరబ్బు సేనలు ‘కికానాన్’ను గెలుచుకున్నాయి. కానీ కాస్త ముందుకు వెళ్ళగానే ప్రజలు తిరుగుబాటు చేసి, సేనానితో సహా, సైన్యమంతటినీ ఊచకోత కోశారు. తరువాత ‘షినాన్’ అనే సేనాని ‘బుధియా’ వరకూ వచ్చాడు. అక్కడి ప్రజలు అతడినీ, సైన్యాన్ని అక్కడే చంపేశారు. ‘ఆత్ ముంధిర్’ అనే సేనాని, సైన్యం ‘కుశ్ధర్’ వద్ద దుర్మరణం పాలయ్యారు. ఆ తరువాత ఇరవై ఏళ్ళ పాటు పలు ముస్లిం సేనలు శుక్రాన్‍ను గెలుచుకోవటంతో విఫల ప్రయత్నాలు చేసి ప్రాణాలు కోల్పోయాయి. ఇక భూమార్గంలో గెలుపు కష్టం అని గ్రహించి సముద్ర మార్గంలో దాడి ప్రారంభించారు.
ఈ సమయంలో ‘చాచ్‌నామా’ ప్రకారం, అక్కడ ఒక గొప్ప బౌద్ధ మందిరం, దానిపై ఓ జెండా ఉన్నాయట. ఆ జెండాను విరగ్గొడితే ఆ ప్రాంతం ఇస్లాం మయమవుతుందని గ్రహాలు (జ్యోతిషం) చెప్తున్నాయని తెలిసిన అరబ్బు సేనలు ఆ జెండాను విరగ్గొట్టటంతో నగరం అరబ్బు సేనలకు లొంగిపోయింది. ఆ తరువాత మూడు రోజుల పాటు నిర్దయగా అక్కడ ప్రజల ఊచకోత, కట్టడాల విధ్వంసం సాగింది. ఇదే సమయానికి సింధు రాజ్యంలోని ప్రధాన శక్తివంతమైన కేంద్రాలలోని బౌద్ధ మత అధికారులు అరబ్బు సేనలతో మంతనాలు ఆరంభించారు. వారు ‘హుజ్జుజ్’తో ఒప్పందాలు చేసుకుని అరబ్బు సేనలను తమ ప్రాంతాలలోకి ఆహ్వానించారు. వారు హిందూ రాజు దాహిర్‍కి వ్యతిరేకం. ఎందుకంటే ‘చాచ్’ రాజు అయినప్పుడు బౌద్ధులు వ్యతిరేకిస్తే అతడు వారందరినీ ఓడించి, అణచివేశాడు. ఇప్పుడు అవకాశం దొరకగనే శత్రురాజును రెండు చేతులా ఆహ్వానించారు బౌద్ధమత పెద్దలు . రక్తపాతం జరగకుండా చూడడం కోసమే శత్రువుతో చేతులు కలిపామని వారు సమర్థించుకున్నారు. దాంతో మహమ్మద్ సేనలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం బలహీనమైపోయింది. అరబ్బు సేనల విజయం సులభమయింది. అయితే, ప్రాంతాలను గెలుచుకున్న మహమ్మద్ బౌద్ధులను కూడా వదిలిపెట్టలేదు. అలవాటయిన రీతిలో మగవాళ్ళ ఊచకోతలు, పిల్లలు, స్త్రీలను పట్టుకుని బానిసలుగా చేయటం, పెద్ద ఎత్తున మత మార్పిళ్ళు, అన్ని కట్టడాల విధ్వంసం, మందిరాలను మసీదులుగా మార్చటం వంటివి జరిగిపోయాయి.
At debal , the temples were demolished and mosques founded; a general massacre endured for three days; prisoners were taken captive; plunder was amassed….At Nairun, the idols were broken, and mosques founded, not withstanding its voluntary surrender…..ఇది అరబ్బు చరిత్రరచయితల పెర్షియన్ రచనల ఆధారంగా ఇలియట్, దాసన్ లు రాసిన ది హిస్టరీ ఆఫ్ ఇండియా ఆస్ టోల్డ్ బై ఇట్స్ ఓన్ హిస్టారియన్స్ లోని వ్యాఖ్య.
తన సేనానులు, ప్రాంతీయ బౌద్ధ పాలకులు ఇస్లాం సేనలతో చేతులు కలిపినా దాహిర్ వీరోచితంగా పోరాడాడు. దాదాపుగా విజయం సాధించాడు. చాచ్‍నామా ప్రకారం “Thus the infidels made a rush on the Arabs from all sides, and fought so steadily and bravely that the army of Islam became irresolute, and their lives were broken in great confusion. It was generally believed that the Arabs were defeated and put to fight our men were struck dumb or over awed”. అంటే భారతదేశ చరిత్రలో పలుమార్లు జరిగినట్టే విజయపు అంచుల నుండి పరాజయపు కోరల్లో చిక్కుకున్నాయన్న మాట. ఈ రకంగా సింధు రాజ్యాన్ని అరబ్బు సేనలు గెలుచుకున్నాయి. భారత్‍లోకి అడుగుపెట్టగలిగాయి. అయినా మరో మూడు వందల ఏళ్ళ వరకు లోపలకు చొచ్చుకురాలేకపోయాయి.
సింధు రాజ్యాన్ని అరబ్బు సేనలు గెలుచుకున్న విధానాన్ని గమనిస్తే అరబ్బు సేనలను అడుగడుగునా ఎదుర్కుని చీకాకు పరిచి వీరోచితంగా పోరాడి తరిమేస్తున్న భారతీయుల పోరాట పటిమ స్పష్టమవుతుంది. మన చరిత్ర పఠనం ద్వారా మనవాళ్ళు పోరాటం లేకుండా లొంగిపోయారు, రాజులు, రాజ్యాల అంతర్గత కలహాల వల్ల, అనైకమత్యం వల్ల భారతదేశం ఇస్లాం సేనల వశమయింది అన్నది అపోహనే తప్ప, అసలు సత్యం కాదన్నది అర్థమవుతుంది. ఇక్కడ సింధు రాజు ఓడిపోయింది – శక్తివంతమైన బౌద్ధమత పెద్దలు ఇస్లాం సేనలతో చేతులు కలపడం వల్ల, జ్యోతిషాన్ని నమ్మి ఓడిపోవటం తప్పదనే భావన వల్ల, అసలైన సమయంలో విధి వక్రీకరించటం వల్ల ఓటమి సంభవించింది, దీన్లో రాజుల విలాస జీవితం, ప్రజల అణచివేత, అనైకమత్యం ప్రస్తక్తి లేనే లేదు. ఇక్కడ మరో విషయం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.
ఒక పద్ధతి ప్రకారం ప్రాచీన భారత సామాజిక చరిత్ర గురించి అసత్య ప్రచారం తీవ్రంగా సాగుతోంది. ఎంత తీవ్రంగా అంటే అసత్యం, సత్యంగా చలామణీ అయి, అమాయకులు అదే అసలు నిజం అని నమ్మి ద్వేషాల్ని పెంచుకునే రీతిలో ప్రచారం సాగుతోంది. భారతీయ సమాజంలోని ప్రతి దోషానికి ఒక వర్గం వారిని దోషులుగా చూపి, ద్వేష భావనలు విచ్ఛిన్నకరమైనవి పెరిగే రీతిలో ఈ ప్రచారం సాగుతోంది. దేశంలో ఇస్లాం విస్తరించటానికీ, ప్రజలు పెద్ద ఎత్తున ఇస్లాం మతాన్ని స్వీకరించటానికి ప్రధాన కారణం సామాజిక అసమానతలు, అణచివేతలు అని నమ్మించే ప్రయత్నం ఒక పద్ధతి ప్రకారం సాగుతోంది. కానీ చరిత్రను గమనిస్తే, ఎక్కడా ఈ ప్రసక్తి రానే రాదు.
‘దాహిర్’ ఓటమిలో ప్రధాన పాత్ర వహించింది బౌద్ధ మత పెద్దలు. అరబ్బు సేనలకు సహాయం చేసి, వారిని ఆహ్వానించటం. వారు అరబ్బు సేనలను ఆహ్వానించటం కూడా అణచివేతలు, అన్యాయాల వల్ల కాదు. వారికి రక్తపాతం ఇష్టం లేదు. రాజు రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న విధానం నచ్చలేదు. అందుకని వారు రాజు శత్రువులో చేయి కలిపారు. శత్రువులను రాజ్యంలోకి ఆహ్వానించారు. గతంలో గ్రీకు సేనలతో కూడా బౌద్ధులు ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటుంటే, రాజును సంహరించి పుష్యమిత్రుడు రాజ్యాధికారం చేపట్టి గ్రీకు సేనలతో పోరాడాడు (చూ. దేశభక్తుల మిత్రుడు పుష్యమిత్రుడు, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, పేజీ నెం.48). కీలకమైన సమయంలో రాజ్యం గుట్టుమట్లు చెప్పి శత్రుసేనల విజయానికి తోడ్పడిన ద్రోహులంతా అగ్రస్థానాల్లోవుండి రాజ్యాధికారంపైననో, ధనంపైనో ఆశకలవారే తప్ప అణచివేతలకుగురై సమాజంలో అట్టడుగు స్థాయిలో దుర్భరంగా జీవితం గడుపుతున్నవారు కాదు. ఒక వేళ ఇప్పుడు సమాజంలో ప్రచారంలో ఉన్న రీతిలోనే అణచివేతలు, ఆ కాలంలోనూ ఉండుంటే బౌద్ధులు కాదు, ఈ వర్గం వారు తమని అణచివేస్తున్న వారికి వ్యతిరేకంగా శత్రు సేనలతో చేతులు కలపాలి. రెండు చేతులతో శత్రువులను ఆహ్వానించి ప్రతీకారం తీర్చుకోవాలి. కానీ అలా జరగలేదు. అరబ్బు సేనలకు అడుగడుగునా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమయింది. అరబ్బు సేనలను వ్యతిరేకించి పోరాడటమే కాదు, తాత్కాలికంగా ప్రాణాలు కాపాడుకునేందుకు మతం మారినా, అరబ్బు సేనలు దాటిపోగానే మళ్ళీ పుచ్చుకున్న కొత్త మతం ముసుగు తొలగించి, సనాతన ధర్మం స్వీకరించి ఇస్లాం సేనలపై తిరుగుబాటు బావుటాను ఎగురవేశారు ప్రజలు. ఈ తిరుగుబాటు ఒక వర్గం వారో, ఒక వర్ణం వారో జరిపింది కాదు. సమస్త భారత సమాజం ఏకమై సమిష్టిగా జరిపిన పోరాటం ఇది. ఇప్పుడు ప్రచారమౌతున్న రీతిలో ఆనాటి సమాజం ఉంటే, ఈ రకమైన సమిష్టి పోరాటం సంభవమయ్యేదే కారు. భారత్ లోని అణువణువు గెలుచుకోవటం కోసం ఇస్లాం సేనలు ఇలా వందల ఏళ్ళుగా పోరాటం జరపాల్సి వచ్చేదే కాదు. కాబట్టి సమాజంలో ద్వేషాలు పెంచుతూ, విచ్ఛిన్నకరమైన ధోరణులను పదే పదే ప్రచారం చేసేవారు చరిత్రను అధ్యయనం చేసి నిజాలు గ్రహించాలి.
దేశంలో ప్రజలు ఇస్లాం మతాన్ని స్వీకరించటం భారతీయ ధర్మంపై వ్యతిరేకతతోనో, ఒక వర్గంపై ద్వేషంతోనే కాదు. అత్యంత కఠినమైన పరిస్థితులలో, తప్పనిసరి పరిస్థితులలో ప్రాణాలు కాపాడుకుణేందుకు మతం మారారు తప్ప, స్వచ్ఛందంగా మతం స్వీకరించలేదు. అందుకే భారతదేశంలో ఇస్లాం వేళ్ళూనుకునేందుకు వందల సంవత్సరాలు పట్టింది. కశ్మీరులో ఇస్లాం ఏడవ శతాబ్దంలోనే అడుగుపెట్టినా 14వ శతాబ్దంలో సికందర్ బుత్ షికన్ (1394-1417), పెద్ద ఎత్తున ఇస్లాం మత ప్రచారాన్ని చేపట్టిన తరువాతనే ఇస్లామీయుల సంఖ్య పెరిగింది. ‘మరణమో, మతం మారటమో’ అన్న ఉద్యమాన్ని కఠినంగా అమలు చేయటం వల్ల పెద్ద సంఖ్యలో మరణాన్ని స్వీకరించినా, ఇస్లామీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అనేకులు మతం మారటం ఇష్టం లేక, రాజ్యం వదిలి పారిపోయారు, సురక్షిత రాజ్యాలకు. ‘సికందర్ బుత్ షికన్’ పర్షియా, అరేబియా, మెసపటేమియాల నుంచి ఇస్లాం మత ప్రచారకులను కశ్మీరుకు ఆహ్వానించాడు. ఇతర ప్రాంతాలలోని ఇస్లామీయులకు పెద్ద సంఖ్యలో కశ్మీరులో స్థిర నివాసం కల్పించాడు. కశ్మీరులోని ప్రధాన మందిరాలయిన మార్తాండ మందిరం, విశ్వ మందిరం, ఈశాన మందిరం, చక్రభృత మందిరం, త్రిపేశ్వర మందిరం… వీటన్నింటినీ ధ్వంసం చేశాడు. ఈ సమయంలో ఇస్లాం స్వీకరించటం ఇష్టం లేని వారు స్వచ్ఛందంగా ప్రాణత్యాగం చేశారు. ఈ సమయంలో పలువురు తాత్కాలికంగా ఇస్లాం స్వీకరించినట్టు నటించినా, ‘తకియా’ (Taqiya) జీవనం సాగించారని ‘ఫెరిస్తా’ రాశాడు. అంటే పైకి ఇస్లామీయులు, కాని లోపల భారతీయ ధర్మానుయాయులు.
‘Taqiya’ means concealing one’s conviction and faith from the enemies to avoid worldly, spiritual or religious harm.
మహమ్మద్ బిహామిద్ ఖాన్ రచించిన ‘తారిఖ్-ఇ-మహమ్మది’ ప్రకారం – సుచిర్ రాయ్‌తో యుద్ధం జరిపే సమయంలో సుల్తాన్ ‘If I will give orders to the army to fight outright, they will not leave even a force of the kafirs in the region, but I shall advance slowly, then probably those people will agree to embrace Islam’ అని ప్రకటించి నెమ్మదిగా ముందుకు సాగి ప్రజలను ‘మరణమో, మతం మారటమో’ నిర్ణయించుకోమన్నాడు.
మహమ్మద్ హబీబ్ ‘Some Aspects of the Foundation of Delhi Sultanate’ అనే పుస్తకంలో “In 1320 the country was invaded by Mongols who indulged in arson, rape and murder throughout the valley (Kashmir). The king and the Brahmins fled away but among the inhabitants who remained, Muslim way of life were gradually adopted by the people as the only alternative” అని రాశాడు. ‘only alternative’. ఒకే ప్రత్యామ్నాయం, అంటే గత్యంతరం లేక రాజ్యంలో ఉండిపోయిన ప్రజలంతా ఇస్లాంను స్వీకరించారన్నమాట. ఇక్కడ ఎక్కడా సమాజంలో అణచివేతలు, దౌర్జన్యాలు, దౌష్ట్యాల వల్ల ప్రజలు ఇస్లాం సేనలను ఆహ్వానించినట్టు లేదు. జోనరాజు రాజతరంగిణిలో మాత్రమే కాదు, ఆ కాలంలోని పర్షియన్ రచనలలో కూడా ఎక్కడా ప్రజలు ఇస్లాం సేనలకు ఆహ్వానం పలికిన సంఘటనలు లేవు. ఇస్లాం సేనల బారిన పడి మతం మారటం ఇష్టం లేక అడవుల్లోకి పారిపోయిన సంఘటనలు కోకొల్లలు. అడుగడుగునా ఎదిరించి వీరోచిత పోరాటాలు జరిపిన సంఘటనలు అనంతం.
ఇస్లామీయులు దేశంలో ప్రవేశించిన తరువాతనే ‘నీచం’గా భావించే అనేక వృత్తులు దేశంలో ఆవిర్భవించాయి. అంతకుముందు భారతీయ సమాజం ఎరుగనటువంటివి, ఊహించనటువంటివి అనేక వృత్తులు భారతీయ సమాజంలో ఏర్పడ్డాయి. సమాజం సంపూర్ణంగా రూపాంతరం చెందింది. మతం మార్చటం ప్రధానోద్దేశ్యంగా జరిగే దాడులను ఎదుర్కోవటంలో, మతమార్పిళ్ళవల్ల సమాజంలో సంభవిస్తున్న మార్పులను తట్టుకుని నిలబడటంలో భారతీయ సమాజం అల్లకల్లోలమయింది. వీటన్నిటినీ అధ్యయనం చేయకుండా, గమనించకుండా , భారతీయ సమాజంలోని అణచివేతలవల్ల , అగ్రవర్ణాల దౌష్ట్యంవల్ల అసంతుష్టులయివున్న ప్రజలు ఇస్లాం ను ప్రత్యామ్నాయంగా భావించి, తమ పరిస్థితి మెరుగు పరచుకునేందుకు ఇస్లాం ను స్వీకరించారని నిరూపించాలని చరిత్రకారులు తపనపడ్డారు. ప్రజలు బౌద్ధం స్వీకరించేందుకు ఇదే కారణం చూపించారు. తరువాత ప్రజలు క్రైస్తవం స్వీకరించేందుకూ ఇదే కారణం చూపించారు. ఒక పద్ధతి ప్రకారం కాల్పనిక సత్యాన్ని అసలయిన సత్యంగా ప్రకటించి సమాజంలో విష బీజాలను నాటటం గమనించవచ్చు. ఆ విషవృక్షం సమాజాన్ని ప్రభావితం చేయటం అర్ధం చేసుకోవచ్చు. అందుకే మన చరిత్రను పరాయివారి దృష్టితో కాక మన దృష్టితో చూసి అర్ధంచేసుకోవాల్సిన ఆవశ్యకత గతంలో కన్నా ఇప్పుడు అధికంగా వుంది. రాజతరంగిణి గురించి అందరూ తెలుసుకుని నిజానిజాలను విశ్లేషించాల్సిన అవసరమూ ఎంతో వుంది.
(ఇంకా ఉంది)