కశ్మీర రాజతరంగిణి-17

4
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]C[/dropcap]hach then stayed at the fort of Brahmanabad till all the affairs of the country were settled, then the dues of the treasury fixed, and the welfare of his subjects were assured. He degraded the Jats and the Luhanats and bound over their chiefs.

(Chachnama, Page 36)

‘మహాబలా మహావీర్యా మహాసత్య పరాక్రమాః।
సర్వాగ్రే క్షత్రియా జట్టా దేవకల్పా హఢ-వ్రతాః॥’
(దేవసంహిత -15)

మహాబలులు, మహా శక్తిమంతులు, సత్యవంతులు, పరాక్రమవంతులు, క్షత్రియలందరిలోకీ ప్రపంచాన్ని పాలించేవారు జాట్‌లు. దృఢవ్రతులు.

‘దేవ సంహిత’లో పార్వతి శివుడిని ‘జాట్’‍లు ఎవరు? వారు ఎలా ఉద్భవించారు? అని ప్రశ్నిస్తుంది. దానికి శివుడు సమాధానం ఇస్తాడు.

మధ్య యుగంలో గోరఖ్ సిన్హా “దేవ సంహిత” రూపాన ఆ కాలంలో ప్రచారంలో ఉన్న శ్లోకాలను సంకలనం చేశాడు. అత్యంత ప్రాచీనమైన శ్లోకాల సంకలనం ఇది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ మహా రహస్యాన్ని బోధించాడు. పరమ యోగులకు మాత్రమే ఈ రహస్యాన్ని బోధించాలన్న నియమం ఏర్పాటు చేశాడు. మహా రహస్యాన్ని ఇముడ్చుకున్న ఈ శ్లోకాలలో ‘జాట్’ల ఉత్పత్తికి సంబంధించిన అంశాలున్నాయి. ‘జాట్‍లు ఎవరు? వాళ్ళ తల్లి, తండ్రులెవరు? వాళ్ళది ఏ జాతి? వాళ్ళు ఎప్పుడు పుట్టారు?’ వంటి ప్రశ్నలను పార్వతి శివుడిని అడుగుతుంది.

అప్పుడు శివుడు అద్భుతమైన ‘జాట్’ల పుట్టుక గురించి చెప్తాడు.

సృష్ట్యారంభంలో వీరభద్రుడు యోగమాయ వల్ల ఉత్పన్నమయిన పురుషుడికి, దక్ష ప్రజాపతి కన్య ‘గణి’కి జన్మించిన వారు ‘జాట్’‍లు. దక్ష యజ్ఞంలో అవమానాన్ని భరించలేక ‘సతి’ అగ్నికి ఆహుతి అయినప్పుడు ఆగ్రహోదగ్రుడయిన శివుడు వీరభద్రుడిని సృష్టిస్తాడు. దక్షుడి తలను నరికి, ఇంద్రుడిని తొక్కి, యమదండాన్ని విరిచి, దేవతలను కకావికలు చేసి, భూతగణాలతో కైలాసం చేరుతాడు వీరభద్రుడు.

గర్వ్ ఖర్చోత్ర విగ్రాణాం దేవాంచ మహేశ్వరీ।
విచిత్రం విస్మయం సర్వం పౌరాణ కై సంగీపితం॥
(దేవసంహిత -17)

‘జాట్’ జాతి ఉత్పత్తి చరిత్ర అత్యంత ఆశ్చర్యకరం. ఈ చరిత్రలో విప్రులు, దేవతలకు అవమానం గర్వభంగం అవటం ఉంటుంది. ఈ కారణం వల్ల కవులు జాట్ జాతి చరిత్రకు ప్రచారం కల్పించలేదు.

దక్షయజ్ఞ ధ్వంసం తరువాత శాంతించిన శివుడు దేవతల ప్రార్థనను మన్నించి మళ్ళీ దక్షుడిని సజీవుడిని చేస్తాడు. వీరభద్రుడికి తన కూతురుని ఇచ్చి వివాహం చేస్తాడు. వారిద్దరికి జన్మించిన వారు ‘జాట్’లు. శివుడి ‘జట’ నుండి జన్మించిన వారు ‘జాట్’లు. గమనిస్తే, గంగానది కూడా శివుడి జటల్లో బంధీయై ‘పాయ’ లా విడుదల పొందుతుంది. గంగానది కూడా పరోక్షంగా శివుడి ‘జట’ నుండి విడుదలయింది కాబట్టి ‘జాట్’ అవుతుందంటారు. గంగ ‘శివ్ కీ జటా’ ప్రాంతం నుంచి ప్రవహిస్తుంది.

‘జాట్’ల ప్రసక్తి మహాభారతంలో వస్తుంది. మహాభారత యుద్ధం తరువాత క్షత్రియ వంశాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. క్షత్రియులు బలహీనమైపోయారు. దాంతో ఒక శక్తి కేంద్రం అంటూ లేక అనైకమత్యం ప్రబలింది. ఈ సమయంలో శ్రీకృష్ణుడు క్షత్రియులందరినీ ఒక త్రాటి క్రిందకు తెచ్చాడు. వారందరినీ కలిపి ‘జ్ఞాతిసంఘ’ను ఏర్పాటు చేశాడు. అత్యంత ప్రజాస్వామికమైన వ్యవస్థ ఇది. ‘అష్టాధ్యాయి’లో పాణిని ‘జట ఝూట సంఘాతే’ అన్నాడు. ‘జాట్’లు ప్రజాస్వామిక సంఘాలు, ‘ఏకార్ధాన్నిచ్చే పదాలు’ అన్నమాట. ‘జాట్ సంఘం’ ఏర్పాటును పాండవులు సమర్థిస్తారు. మహాభారత కాలంలోని అనేక రాజవంశాలు గాంధార, యాదవ, సింధు, నాగ, లవ, కుశాన, కుశమ, బుదర్, నారదీయ వంశాలు ఈ సంఘంలో భాగమయ్యాయి. ఈ లెక్క ప్రకారం శ్రీకృష్ణుడు కూడా ‘జాట్’.

రామాయణంలో కిష్కింధ కాండ లోని 42వ సర్గ ద్వారా అవంతి వద్ద ‘జాట్‌పుర్’లో జాట్‍లు ఉండేవారని, తరువాత వీరు సింధు నది ప్రాంతంలో స్థిరపడ్దారని తెలుస్తుంది.

ఇస్లామీ సేనలు భారత్ పై దాడులు ఆరంభించినప్పుడు వారిని సమర్థవంతంగా ఎదుర్కుని తరిమివేసింది ‘జాట్’ రాజులు, జాట్ వీరులే. ఆ కాలంలో ‘జాట్’లు పర్వతాలలో సంచరిస్తూ ఉండేవారు. అత్యంత శక్తిమంతులు, వీరులు వీరు. శ్రీకృష్ణుడు ‘జాట్ సంఘం’ ఏర్పాటు చేసిన తరువాత కొందరు జాట్‌లు పర్షియా సరిహద్దులయిన కిర్మాన్, మన్సురా వంటి ప్రాంతాలలో సంచార జాతులుగా అయ్యారు. ఆరంభంలో అరబ్బులతో పోరాడిన హిందూ వీరులు జాట్‍లు. ‘All the Hindus were known to the Arabs by the name of Jat only’ (History of the Jats by J. C. Sarkar). ఇస్లామీయుల తాకిడి వల్ల పలు జాట్‍లు ఇస్లాం మతం స్వీకరించారు. ఇస్లాం స్వీకరించటం ఇష్టం లేని వారు సింధు ప్రాంతం వదిలి పంజాబ్, హర్యానా వంటి సురక్షితమైన ప్రాంతాలకు పారిపోయారు. ఇస్లామీయులకు చిక్కి మతం మారని జాట్‌లు అరేబియా దేశాలలో బానిసలయ్యారు. మరికొందరు కొండప్రాంతాలు దాటి క్రిగిజ్‌స్థాన్ వంటి దేశాలకు పారిపోయారు.

అయితే క్షత్రియ కులస్థులు, వీరులు, రాజులు అయిన జాట్‌లను  బ్రాహ్మణాబాద్ గెలుచుకున్న తరువాత ‘చాచ్’ ఘోరంగా శిక్షించాడు. వారి స్థాయిని దిగజార్చాడు. వారు ఆయుధాలు ధరించకూడదు. అత్యవసరమైతే తప్ప మారణాయుధాలు తాకకూడదు. వారు తక్కువ స్థాయి దుస్తులు ధరించాలి. జీన్లు లేని గుర్రాలపై సవారీ చేయాలి. వాళ్ళు తలపై రక్షణ లేకుండా, పాదరక్షలు లేకుండానే నడవాలి. వారు ఎప్పుడు ఇంటి బయటకు వచ్చినా, వారి వెంట కుక్క ఉండాలి. వారు బ్రాహ్మణాబాదు రాజుకు వంట చెరుకును అందించాలి. రాజుకు మార్గం చూపించేవారిలా కానీ, గూఢచారిగా గానీ వ్యవహరించాలి. రాజ్యంపై శత్రువులు దాడి చేసినప్పుడు వారు రాజ్యాన్ని కాపాడేందుకు ప్రాణాలనయినా త్యాగం చేయాలి. ఇవన్నీ ‘జాట్’లపై ‘చాచ్’ విధించిన నియమాలు. అంతకు ముందే ఇస్లాం స్వీకరించిన జాట్‍లు, ఇతర మ్లేచ్ఛ జాతుల యువతులను వివాహమాడిన ‘జాట్’లు ‘జాట్’ సంఘానికి దూరమయ్యారు. ఇప్పుడు ‘చాచ్’ తన రాజ్యంలో ‘జాట్’ల స్థాయిని దించాడు. ఇలా జాట్‌ల స్థాయిని దించటం వెనుక జాతి, కులం, మతం ప్రసక్తిలేదు. కేవలం వారు శత్రురాజు తరఫున పోరాడేరన్నదే కారణం. గమనిస్తే శత్రు రాజుకు సహాయంచేసిన శ్రమణుడిని సలహాదారు చేసుకున్నాడు. జాట్ వర్గం స్థాయి దించాడు. దీన్లో రాజకీయం, స్థానిక పరిస్థితులు తప్ప ఇప్పటి సమాజోద్ధారకులు ప్రకటిస్తున్నట్టు కులం, వర్గం, వర్ణం ప్రసక్తి, అగ్రవర్ణాల దౌష్ట్యం వంటి వాటి ప్రసక్తి లేదు. అంటే లెక్క ప్రకారం క్షత్రియులైన ‘జాట్’లు కాలక్రమేణా పలు మార్పులు పొంది సంచార జాతుల స్థాయికి దిగజారారన్నమాట. ఏడవ శతాబ్దంలో సింధు ప్రాంతాన్ని దర్శించిన ‘యువాన్ త్సాంగ్’ జాట్‍లను ‘శూద్రు’లన్నాడు. 11వ శతాబ్దంలో అల్ బెరూనీ జాట్‍లను వ్యవసాయం చేసుకునే తక్కువ జాతుల వారన్నాడు.

సంస్కృతం నుంచి అరబ్బీ భాషలోకి ‘అబు అల్ హసన్’ అనువదించగా పర్షియా భాషలో లభిస్తున్న ‘ముజ్మల్ ఉత్ తవారిఖ్’ అనే గ్రంథంలో జాట్లు, మేద్‍లు సింధు ప్రాంతంలో రాజ్యం చేస్తున్నట్టుంది. అణచివేతకుగురవుతున్నట్టులేదు.. నాలుగవ శతాబ్దానికల్లా వారు ‘ముల్తాన్’ ప్రాంతంపై రాజ్యం చేశారు. వారిలో పేరు మోసిన రాజు ‘జిత్ శైలేంద్ర’ జాట్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ‘ముజ్మల్ ఉల్ తవారిఖ్’లో కొందరు జాట్ రాజుల పేర్లు రాజా జిత్ శైలేంద్ర, దేవాంగి, శంభూక్, దేగలి, వీర నరేంద్ర, వీర చంద్ర, శాలి చంద్ర. జాట్‍లు, మేద్‍లు తమని పాలించమని దుర్యోధనుడికి ఆహ్వానం పంపారు. అతడు, జయద్రధుడి భార్య అయిన తన సోదరి దుస్సలను వారిని పాలించేందుకు పంపించాడు. అయితే తన కొత్త రాజ్యంలో బ్రాహ్మణులు లేరని సోదరుడికి దుస్సల వర్తమానం పంపిస్తే, దేశం మొత్తం నుండి 30,000 మంది బ్రాహ్మణులను సేకరించి, సోదరి రాజ్యానికి దుర్యోధనుడు పంపించాడు. అప్పటి నుంచీ బ్రాహ్మణాబాద్ ప్రాంతంలో ఈ బ్రాహ్మణులు, ‘జాట్’లు పెద్ద ఎత్తున స్థిరపడ్దారు. సామరస్యంగా జీవించారు. కొందరు జాట్‌లు బౌద్ధం కూడా స్వీకరించారు. కానీ ఘర్షణ రహితంగా పరస్పర గౌరవంతో జీవించారు. వీరు ఇస్లామీ సేనలను చీకాకు పరిచారు తమ శౌర్యంతో.

‘జాట్’ల చరిత్రను పరిశీలిస్తే భారతీయ వ్యవస్థలో ‘కులం’ అన్నది ఒక ‘చలనం’ లేని నిశ్చల అంశం కాదని, నిత్యపరిణామశీలి అని అర్థమవుతుంది.  వేద కాలం నుంచి ఈనాటివరకూ ఎవరూ ఒకే కులంలో, ఒకే స్థాయిలో ఆధునిక సామాజికవాదులు చెప్తున్నట్టు లేరని, ఇప్పుడున్నట్టు అప్పటి సమాజంలేదని గ్రహించాలి. ‘బ్రాహ్మణాబాద్’లో ‘చాచ్’ వల్ల స్థాయి దిగజారిన జాట్‌లు, 833 – 811 ప్రాంతంలో అమ్రాన్ బిన్ మూసా ఓడించే వరకు ‘లైకన్’ ప్రాంతంలో రాజులుగా ఉన్నారు. అయితే జాట్‍లు రాజ్యం కోల్పోయినా ఇస్లామీయులకు లొంగలేదు. ఇస్లామీ సేనలపై దొంగదాడులు చేస్తూ అడుగడుగునా చీకాకు పరిచారు. కొందరు దేశంలోని సురక్షిత ప్రాంతాలు చేరుకున్నారు. అక్కడ వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు. రాజ్యాధికారులు అయ్యారు. ముఘలు సేనలకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటాలు చేశారు. సోమనాథ మందిరాన్ని ధ్వంసం చేసిన తరువాత తిరుగు ప్రయాణంలో గజనీని అడుగడుగునా చీకాకు పరిచి హడలెత్తించి ప్రాణాలు అరచేత పట్టుకుని పరిగెత్తేట్టు చేసింది ‘జాట్’ వీరులే. గజనీ ఒక్కడే కాదు, నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలీతో సహా ప్రతి ఇస్లామీ సేనలపై మెరుపు దాదులు, దొంగదాడులు చేస్తూ భయోత్పాతాలు సృష్టించారు. వీరి పోరాటానికి గజనీ ఎంతగా విసిగిపోయాడంటే ‘జాట్’లను అణచటానికి ప్రత్యేకంగా దాడి చేశాడు. జాట్ వీరులను చంపినా గజనీ కసి తీరలేదు. ‘The Sultan’s army proceeded to the places where their families were concealed and took them all prisoners’ (తాబత్-ఇ-అక్బరీ).

పృథ్వీరాజు పరాజయం తరువాత హర్యానా జాట్‍లు విప్లవ బావుటా ఎగురవేశారు. ఖుతుబుద్దీన్ సేనలతో జాట్ వీరుల యుద్ధాన్ని ‘తాజ్-ఉల్-మాసిర్’ గ్రంథం విపులంగా వర్ణిస్తుంది. ‘The field of battle become tulip-dyed with the blood of warriors’. తరువాత జాట్‍లు, సునామ్, సమానా వంటి ప్రాంతాలలో ఇతరులతో కలిసి మండలాలుగా ఏర్పడి మహమ్మద్ బీన్ తుగ్లక్‍తో తలపడ్డారు. ‘తారిఖ్-ఇ-ఫిరోజ్‌షాహి’, ‘ముల్ఫుజత్-ఇ-తైమూరి’ వంటి గ్రంథాలలో జాట్ వీరుల యుద్ధాలు, వారెంతగా పాలకులను చీకాకు పరిచారో పొందుపరిచి ఉంది.

“If one go into Hindustan, the Jats and Gujars always pour down in countless hoardes from hill and plain for loot in bullock and buffalo. These ill-omened people are senseless oppressors” అంటుంది ఎ. ఎస్. బెవరిడ్జ్ పుస్తకం ‘మెమొయిర్స్ ఆఫ్ బాబర్’ లో. అంటే ఇస్లామీయులపై దాడి చేసే జాట్‍లు ‘Senseless Oppressors’ అన్నమాట. అంటే ఏ తక్కువ కులాలు, జాతుల వారిని భారతీయ సమాజం అణచివేసింది, అందుకని వారు సఛ్చందంగా ఇస్లాంను స్వీకరించారని ఈనాడు చరిత్ర రచయితలు చెప్తున్నారో వారినే ఆనాటి ఇస్లామీయులు ‘Senseless Oppressors’ గా భావించారన్నమాట…దొంగ పోలీసును జైల్లో వేయటం లాంటిది ఇది. ఈ రకంగా చూస్తే శూద్రులు, తక్కువస్థాయి వారు బ్రాహ్మణరాజు చాచ్ ద్వారా పలు అణచివేతలకు గురయినా ఎలాంటి ద్వేషభావం, వ్యతిరేకతలు లేకుండా తమ ప్రాణాలు పణంగా పెట్టి చరిత్ర అంతా భారతీయ ధర్మ సంరక్షణ కోసం పోరాడినవారు ‘జాట్’లు. వీరి చరిత్రను టూకీగా పరిశీలిస్తే ఎక్కడా, ఎవరూ వీరిని అణచివేసినట్టు కనబడదు. ‘చాచ్’ నియమ నిబంధనలు విధించినా అది ‘రాజకీయం’ తప్ప ‘కుల’ సంబంధి కాదు. ఒక్క జాట్ చరిత్రను పైపైన చూస్తేనే ‘అగ్రవర్ణాల అణచివేతను వ్యతిరేకించి నిమ్నవర్గాల వారు ఇస్లాంను రెండు చేతులా ఆహ్వానించారు’ అని చరిత్రకారులు తీర్మానించటం ఎంత అనృతమో, ఎంత విచ్ఛిన్నకరమో తెలుస్తుంది.  ఇక ప్రతి ఒక్క జాతి, ప్రతి ఒక్క కులం చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పోతే, ఈనాడు సంస్కరణవాదులు, సామాజికోద్ధారకులు, అన్య మతస్తులు చేస్తున్న ప్రచారాలలోని డొల్లతనం స్పష్టమవుతుంది. ‘మేమే మూలవాసులం’, ‘బ్రాహ్మణులు, అగ్రవర్ణాలు మమ్మల్ని దూరం పెట్టటం వల్లనే మతం మారేం’ అంటూ సమాజంలో విద్వేషకరమైన అడ్డుగోడలు నిర్మించటం ఎంత అనర్థదాయకమో స్పష్టమవుతుంది.  మన చరిత్ర గురించి మనకు తెలియకపోవటం వల్ల, మన చరిత్రను మన దృష్టితో చూడకపోవటం వల్ల, మనపై మనకు విశ్వాసం లేక ఎవరు ఏది చెప్పినా ‘మనం పనికి రానివారం’ అన్న నమ్మిక వల్ల వారు చెప్పిన దాన్ని గుడ్డిగా విశ్వసిస్తూ, న్యూనతాభావానికి గురవటం వల్ల అసత్యాలు సత్యాలుగా, అబద్ధాలు నిజాలుగా చలామణీ అవుతూ సమాజాన్ని అల్లోకల్లోలం చేయగలుగుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. ఒకే దేశ పౌరుల నడుమ విద్వేషాగ్నులు సృష్టించగలుగుతున్నారు.. ఈ దుష్ప్రచారాల కాపట్యం గ్రహించి మన మధ్య సామరస్యం సాధించాలంటే అందరూ చరిత్రను మన దృష్టితో అధ్యయనం చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది.

అప్రస్తుతమనిపించినా ఈ విషయాలు తెలియటం వల్ల కల్హణుడు కానీ జోనరాజు కానీ ‘రాజతరంగిణి’ రచనలో ప్రదర్శించిన అనేక విషయాలను అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. చరిత్ర విశ్లేషకులు ఏ రకంగా వీరి రచనలను తప్పుదారి పట్టించి, ఆయా రచనలలో తమ సిద్ధాంతాలను సమర్థించే వాటికి ప్రాధాన్యం ఇచ్చి, దుర్వ్యాఖ్యలు చేశారో గమనించే వీలు లభిస్తుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here