కశ్మీర రాజతరంగిణి-22

2
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

గీత గోవింద గీతాని మత్త శృతవతః ప్రభోః।
గోవిందభక్తి సంసిక్తో రసః కోపి ఉదభూతతథా॥
(జైన రాజతరంగిణి, 5, 100)

[dropcap]శ్రీ[/dropcap]వరుడికి జైనులాబిదీన్‍కూ నడుమ ఉన్న సాన్నిహిత్యం, అనుబంధాలను అతి చక్కగా ప్రదర్శిస్తుందీ శ్లోకం.

సరస్సులో జైనులాబిదీన్, శ్రీవరుడు నౌకా విహారం చేస్తున్నారు. ఆ  నౌకా విహారం సమయంలో శ్రీవరుడు ‘గీత గోవిందం’ గానం చేస్తున్నాడు. శ్రీవరుడు పండితుడు మాత్రమే కాదు, గొప్ప సంగీత విద్వాంసుడు కూడా. గాయకుడు కూడా. అది ఈ సందర్భంలో మరింత స్పష్టమవుతుంది. అయితే ఈ సందర్భంలో మరో విషయం కూడా తెలుస్తుంది. సుల్తాన్ జైనులాబిదీన్ కూడా గాయకుడు. ఇద్దరూ కలిసి గీత గోవిందం గానం చేస్తుంటే సుల్తాన్‍లో విష్ణుభక్తి రసం ఉత్పన్నమయింది. అంటే సుల్తాన్ కూడా గాయకుడు, సంస్కృతం తెలిసినవాడు. సంస్కృత కావ్య గాన మాధుర్యాన్ని అనుభవించి పలవరించే సున్నిత హృదయుడు. గీత గోవిందం శ్రీవరుడితో కలిసి గానం చేస్తూ విష్ణుభక్తి రసామృత పానం చేస్తూ ఆ రస ప్రవాహంలో ఓలలాడేవాడు. ఒక ఇస్లాం సుల్తాన్ ఇలా భారతీయుడితో కలిసి సంస్కృత కావ్యగానం చేస్తూ  భక్తి పరవశుడవటం ఊహించలనలవికాని అద్భుతం! సుల్తానుల చరిత్రలో అతి అరుదయిన సన్నివేశం ఇది.

ఈ శ్లోకాల కొనసాగింపుగా శ్రీవరుడు తన కవిత్వ ప్రతిభను ప్రదర్శిస్తాడు. వారిద్దరి యుగళగీతం సరస్సు తీరంలో ఎలా ప్రతిధ్వనించిందంటే, సుల్తానుపై గౌరవంతో కిన్నరులు వారి గానాన్ని తిరిగి పలుకుతున్నట్టుందట. అంతేకాదు సుల్తాన్ భక్తి భావానికి మురిసిన దేవతలు సరస్సులో విహరిస్తున్న సుల్తానుపై స్వర్గం నుంచి పూలజల్లు కురిపిస్తున్నట్టు మంచు కురుస్తోందట.

శ్రీవరుడి వర్ణనశక్తికి ఆశ్చర్యం అనిపిస్తుంది. సుల్తాను పట్ల శ్రీవరుడికి ఉన్న భక్తి భావానికి, గౌరవానికి, విధేయతకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా వారిద్దరి మైత్రి అపురూపం అనిపిస్తుంది. ఇక్కడ సుల్తాన్ జైనులాబిదీన్ గీత గోవిందం గానం చేస్తూ విష్ణుభక్తి రసప్రవాహంలో మునక వేస్తున్న సమయంలో ఢిల్లీలో తుగ్లక్, సయ్యద్ వంశ పాలకులు మారణహోమం కొనసాగించారు. దేవాలయాలను ధ్వంసం చేయటం, ప్రాచీన సంస్కృతి ఆనవాళ్ళను నశింపజేసి సర్వం ఇస్లాంమయం చేయటం కొనసాగించారు.

సుల్తాన్ జైనులాబిదీన్ గొప్పతనం ఏమిటంటే – భారతీయ పండితులే కాదు, పర్షియన్ పండితులు కూడా సుల్తాన్ జైనులాబిదీన్ గుణ గానం చేయటం. స్వాతంత్ర్య పోరాట సమయంలో ప్రత్యేక పాకిస్తాన్ కోరుతూ మహమ్మద్ అలీ జిన్నా “హిందువుల వీరులంతా ముస్లింల శత్రువులు, ముస్లిం వీరులు హిందూ శత్రువులు కాబట్టి హిందూ ముస్లింలు కలసి ఉండడం కుదిరే పని కాదు” అన్నాడు. కానీ ఈ వ్యాఖ్య సుల్తాన్ జైనులాబిదీన్‍కు వర్తించదు.

మీర్జా ముహమ్మద్ హైదర్ దుఘ్లత్ బేగ్ భారతదేశ చరిత్రలోనే కాదు, కశ్మీరు చరిత్రలోనూ ప్రాధాన్యం వహిస్తాడు. ఈయన చుగ్తాయ్ తుర్కో మంగోల్ (ప్రఖ్యాత ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్, ఈ చుగ్తాయ్ వంశానికి చెందిన కశ్మీరీ). ఈయనకు బాబర్ తల్లి వైపు నుంచి బంధువు. ఇతను యుద్ధ వీరుడయి కూడా పర్షియన్ భాషలో రచనలు చేశాడు. ఇతని ప్రసిద్ధ రచన ‘తారీఖ్-ఇ-రషీదీ’. ఇది ఇతని వ్యక్తిగతానుభవాల సంకలనం. హుమయున్ పరాజయం పొంది ఢిల్లీ వదిలి ‘నా అన్నవాడు’ లేని సమయంలో అతనికి కశ్మీరులో ఆశ్రయం ఇచ్చినవాడు మీర్జా. హుమయున్ కాబుల్‍ను గెలుచుకోగానే కశ్మీరును అతడికి సామంతరాజ్యంగా ప్రకటించినవాడు మీర్జా. ఈయన కశ్మీరు చరిత్రను, రెండు భాగాలలో రాశాడు. ఈయన రచన ద్వారా ‘కజక్‌స్థాన్’లో సుల్తానుల పాలన ఆరంభ విశేషాలు తెలుస్తాయి. తన ఈ రచనలో ఈయన సుల్తాన్ జైనులాబిదీన్‌కు సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ముఖ్యంగా కశ్మీరు అభివృద్ధికి, ఐశ్వర్యానికి, సంపదకు కారణం సుల్తాన్ జైనులాబిదీన్ అని నిర్ద్వందంగా ప్రకటించాడు. అంటే, అటు పర్షియన్ రచయితలు, ఇటు సంస్కృత కవులు సంయుక్తంగా అతి గొప్ప రాజుగా భావించిన ఏకైక సుల్తాన్ ‘సుల్తాన్ జైనులాబిదీన్’. ఇలాంటి సుల్తాన్ మరొకరు భారతదేశ చరిత్రలో లేడు.

జైనులాబిదీన్ తండ్రి సికందర్‌కు జైనులాబిదీన్ అంటే ప్రీతి ఎక్కువ. అందుకని అతడికి చదువు చెప్పించాడు. 1398లో తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు ‘సికిందర్ బుత్‍షికన్’ తైమూరు అధికారాన్ని అంగీకరించి మైత్రి కోరాడు. తైమూరును కలవాలనుకున్నాడు కానీ కుదరలేదు. అందుకని తన కొడుకును సమర్‌ఖండ్ పంపించాడు బోలెడన్ని బహుమతులతో పాటు… దాదాపుగా ఏడేళ్ళు జైనులాబిదీన్ సమర్‌ఖండ్‍లో ఉన్నాడు. అనేక కళలు నేర్చుకున్నాడు. విద్య గ్రహించాడు. తైమూరు మరణం తరువాత కశ్మీరు తిరిగి వచ్చాడు. తాను సుల్తాన్ అయిన తరువాత సమర్‍ఖండ్‍లో పాలన గురించి తాను గ్రహించిన విషయాలను అమలులో పెట్టాడు.

‘సికిందర్ బుత్‍షికన్’ పాలనలో అధికారం అంతా ఇస్లామీయుల చేతుల్లోకి వెళ్ళింది. వారు పాలన కన్నా, ప్రజలను పీడించటం, అవినీతి, ఇస్లామేతరులను హింసించటం పైనే దృష్టి పెట్టారు. దాంతో పాలనా వ్యవస్థ అస్తవ్యస్తమయిపోయింది. ప్రజలు ఇక్కట్లను అనుభవిస్తున్నారు. ఇది గమనించిన జైనులాబిదీన్ ముందుగా పాలనా వ్యవస్థను చక్కదిద్దడం ప్రారంభించాడు. ‘సికిందర్ బుత్‍షికన్’ ఇస్లామేతరులపై విరుచుకుపడక ముందు పాలనా వ్యవస్థ చక్కగా ఉండేది. దాంతో కశ్మీరు వదిలిపోయిన, ఇస్లామేతరులను కశ్మీరుకు రప్పించాడు. వారికి రక్షణ కల్పించాడు. వారికి పూర్వపు పదవులు ఇస్తూ పాలన స్వేచ్ఛ ఇచ్చాడు. అవినీతి, అసహనం ప్రదర్శించే ఇస్లామీ అధికారులను పక్కకు తప్పించి, శిక్షించాడు. వారి స్థానాలలో కశ్మీరీ పండితులను నియమంచాడు. ఎటువంటి అన్యాయాన్ని సహించేవాడు కాదు. నిర్దాక్షిణ్యంగా శిక్షించేవాడు. కానీ పేదరికం వల్ల నేరం చేసిన వారితో దయగా వ్యవహరించేవాడు. వారికి ఉద్యోగాలు ఇచ్చి ఆదాయం చూపించేవాడు. వారు స్వతహాగా నేరస్తులు కారు. పేదరికం వారిని నేరం వైపు నెట్టిందని వారికి ఆదాయం కల్పించేవాడు. ప్రతి ఊరిలో తిండి లేని వారి కోసం ఉచిత సత్రాలు ఏర్పాటు చేశాడు. ఆ ఊరి ప్రజలు స్వచ్ఛందంగా తిండిలేని వారి కోసం తిండి పెట్టే ఏర్పాట్లు చేశాడు. ఇస్లామేతరులపై అన్యాయంగా విధించిన పన్నులు రద్దు చేశాడు. బహిరంగ స్థలాలలో ప్రజలు పాటించవలసిన నీతులు, నియమాలు ప్రదర్శించాడు.

ఇక్కడ జైనులాబిదీన్ గురించి మరో గొప్ప విషయం చెప్పుకోవాలి. ఆయన ఎవరికీ మరణ శిక్ష విధించేందుకు ఇష్టపడేవాడు కాదు. ఒకసారి ఒక నేరస్తుడికి మరణ శిక్ష విధించినందుకు పరిహారంగా 400 ఒంటెల ధనాన్ని అర్పించాడు. విప్లవం లేవదీసిన  నాయకుడిని సంహరించాడు కానీ, అతడి కొడుకుకు పెద్ద పదవి ఇచ్చాడు. అయితే అహంకారంతో అన్యాయం చేసినవారితో కఠినంగా వ్యవహరించేవాడు. ఆస్తుల వివరాలు, భవనాల వివరాలను క్రమబద్ధీకరణం చేశాడు.

ప్రజలు కేవలం వ్యవసాయం పైనే ఆధారపడకుండా పలు రకాల వస్తువుల తయారీని ప్రోత్సాహించాడు. సమర్‍ఖండ్‍లో నేర్చుకున్న విద్యలన్నీ కశ్మీరులో నేర్పించాడు. దేశ విదేశాల నుండి అందమైన వస్తువుల తయారీ నిపుణులను కశ్మీరు రప్పించాడు. ‘తారీఖ్-ఇ-రషీదీ’లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ “In Kashmir one meets with all those arts and crafts which are in most cities uncommon, such as stone-processing, stone-cutting, bottle making, window-cutting, gold beating etc. On the whole, Mever-ul-nahr except in Samarkhand and Bukhara, these are nowhere to be met with, while in Kashmir, they are ever abundant. This is all due to Zain-ul-abidin.” అంటాడు మీర్జా.

ఇక సంగీతం సాహిత్యం విషయంలో జైనులాబిదీన్‍కు సాటి లేదు. జైనులాబిదీన్ లలిత కళలను ఆదరిస్తాడని తెలిసి  ప్రపంచం నలుమూలల నుంచి కళాకారులు కశ్మీరుకు వచ్చి చేరారు. భరోసాన్‌కు చెందిన ముల్లా ఊది, ‘ఊద్’ వాయిద్య నిష్ణాతుడు. ముల్లా జమాల్ గానకళా నిష్ణాతుడు. సుల్తాన్ జైనులాబిదీన్‍కు సంగీతంపై ఉన్న ఆసక్తిని గమనించిన గ్వాలియర్ రాజు ‘సంగీత చూడామణి’ వంటి సంగీత శాస్త్ర గ్రంథాలను సుల్తానుకు బహుకరించాడు. ‘సికిందర్ బుత్‍షికన్’ నిషేధించిన సంగీత, నృత్యనాటకాలను మళ్ళీ కశ్మీరులో పునరుద్ధరించాడు జైనులాబిదీన్. నలుమూలల నుంచి నటీనటులు కశ్మీరు వచ్చి చేరేవారు. తమ ప్రదర్శనలతో, సంబరాలతో ప్రజలను ఉర్రూతలూపారు. ప్రతి సంబరంలోనూ సుల్తాన్ ఆనందంగా పాల్గొని అందరినీ ఉత్సాహపరిచేవాడు. సత్కరించేవాడు.

జైనులాబిదీన్ కశ్మీరులో వంతెనలు, కాలువలు నిర్మింపజేశాడు. రహదారులను అభివృద్ధి చేశాడు. ఉత్పల్‍పూర్, బిజ్జిహారా, అద్విన్, అంబుర్హెర్, మానస్ బల్, జైనగిర్, షాహేరుల్ వంటి ప్రాంతాలలోని కట్టడాలు చెప్పుకోదగ్గవి. ఈయన నిర్మించిన వంతెనలను, కాలువలను మరమ్మత్తులు చేసి ఇప్పటికీ వాడుతున్నారు. జోనరాజు, శ్రీవరుడి ‘రాజతరంగిణి’ల్లో ఈ కట్టడాల వివరాలు ఉన్నాయి. జైనరాజు కట్టించిన చెక్కవంతెన ఇప్పటికీ, జైనకాదల్, Zain-ul-abidin Bridge గా వాడుతున్నారు.

జైనులాబిదీన్ కట్టించిన భవంతుల వివరాలు ‘తారీఖ్-ఇ-రషీదీ’ లో లభిస్తాయి. ఇక ఆయన నిర్మించిన తోటలు అసంఖ్యాకం. బాగ్-ఎ-జైనగరి, బాగ్-ఇ-జైనదాబ్, బాగ్-ఎ-జైన్‍పూర్, బాగ్-ఇ-జైనకుట్ వంటి అద్భుతమైన తోటలను జైనులాబిదీన్ నిర్మించాడని తెలుస్తోంది. కానీ వాటి ఆనవాళ్ళు లభించటం లేదు.

కశ్మీరు సంస్కృత పాండిత్యానికి, కావ్యాలకు పెట్టింది పేరు అని తెలుసుకున్న జైనులాబిదీన్ కశ్మీరుకు పాండిత్యం విషయంలో, కావ్య సృజన విషయంలో పూర్వ వైభవం తేవాలని సంకల్పించాడు. కశ్మీరమంతా పాఠశాలలు, విద్యాలయాలు స్థాపించాడు. నలుమూలల నుంచి పండితులను కశ్మీరుకు ఆహ్వానించాదు. సోమ పండితుడు జైనులాబిదీన ఆస్థానంలో ‘అనువాద’ విభాగానికి అధిపతి. ఈయన ‘జైన చరిత్ర’ అనే గ్రంథం రాశాడు.

‘బోధభట్టు’ పలు సంస్కృత కావ్యాలను పర్షియన్ భాషలోకి అనువదించాడు. మౌలానా కబీర్, ముల్లా హఫీజ్ బాగ్దాదీ, ముల్లా జమాలుద్దీన్, ఖాజీ మీర్ అలీ వంటి పర్షియన్, అరబిక్ పండితులు అతని ఆస్థానంలో ఉండేవారు. జైనులాబిదీన్ స్వయంగా సంస్కృత, పర్షియన్, అరబిక్ భాషలలో నిష్ణాతుడు కావటంతో అతని మెప్పు పొందడం ఒక గౌరవంగా భావించేవారు. సుల్తాన్ ఎలా పడితే అలా, ఎక్కడ దొరికితే అక్కడ నుంచి పుస్తకాలు సేకరించి గ్రంథాలయంలో భద్రపరిచేవాడు. అతడి గ్రంథాలయం ప్రపంచంలోని ఏ అత్యుత్తమ గ్రంథాలయానికీ తీసిపోదు. ఆయన మరణం తరువాత వంద ఏళ్ళ వరకూ అతని గ్రంథాలయం ఉంది. ఆ తరువాత ఆ గ్రంథాలయంలో ఇస్లామేతరుల గ్రంథాలున్నాయని దాన్ని కాల్చేసేవరకూ అది భద్రంగానే ఉంది.

అందుకే శ్రీవరుడు జైనులాబిదీన్ సాహిత్య ప్రేమ గురించి రాస్తూ జైనులాబిదీన్ పాలనలో ‘మహిళలు, పనివారు, వంటవాళ్ళూ అందరూ కవులే. వారు రచించిన పుస్తకాలు ఈనాటికీ చలామణీలో ఉన్నాయి. రాజు విద్యాసముద్రమయితే, ప్రజలు కూడా విద్యావంతులవుతారు. రాజు జైనులాబిదీన్ విద్య పట్ల ఆసక్తి కలవారి కోసం ఉచితంగా పుస్తకాలు ఏర్పాటు చేశాడు. వసతి గృహాలు కట్టించాడు. ఆహారం ఏర్పాటు చేశారు. కశ్మీరులో ఈ కాలంలో పఠించని అంశం లేదు. పరిశోధించని విజ్ఞానశాఖ లేదు’ అని రాశాడు.

అయితే జైనులాబిదీన్ ఇస్లామీయులను, ఇస్లామేతరులను సమానంగా ఆదరించి గౌరవించటంతో అసూయ, ద్వేషాలకు తావు లేకుండా పోయింది. ఎవరైనా ఏదైనా అంశం ద్వారా ద్వేషభావనలు రెచ్చకొట్టాలని చూస్తే, ప్రజలే వారిని తిరస్కరించేవారు. జైనులాబిదీన్ ఆస్థానంలో కుమారభట్టు అనే గొప్ప వైద్యుడుండేవాడు. అరేబియా నుంచి, పర్షియా నుంచి గొప్ప గొప్ప హకీములు కశ్మీరు వచ్చేవారు.

పి.ఎన్.కె. బంజాయ్ ‘కల్చరల్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ కశ్మీర్’ అన్న పుస్తకం రెండవ వాల్యూమ్‍లో జైనులాబిదీన్ గురించి ‘Living in a age when religious persecutions were the order of the day, his reign shines on as a bright gem amidst the narrow-minded and short sighted rules of our time. He made Kashmir the real paradise in which men of all religions and nationalities, mingled together and shared one another’s joy and sorrows’ అని వ్యాఖ్యానించాడు.

అయితే జైనులాబిదీన్ తరువాత అధికారానికి వచ్చినవారు జైనులాబిదీన్ అంత సమర్థులు కారు. అతడిలా సహృదయులు కారు. దూరదృష్టి ఉన్నవారు కారు. దీనికి తోడు దేశంలో పెరుగుతున్న ఇస్లాం ప్రాబల్యం కశ్మీరుకు వచ్చి తాకింది. అసహనం, సంకుచిత్వం కశ్మీరును ముంచెత్తాయి. అందుకే భారతదేశ చరిత్రలో జైనులాబిదీన్ ప్రత్యేకంగా నిలుస్తాడు. అతడికి ముందు, అతడి తరువాత అతని లాంటి సుల్తాన్ లేదు, రాలేదు.

తన మరణం ఆసన్నమయిందని గ్రహించిన సుల్తాన్ జైనులాబిదీన్, ముల్లాలను పిలవలేదు. శ్రీవరుడిని పిలిచాడు. మరణశయ్యపై ఉన్న సుల్తానుకు శ్రీవరుడు ‘మోక్షోపాయం’ వినిపించాడు.

సంసార దుఃఖ శాంతార్థం మత్తో వ్యాఖ్య వేదినః।
అశ్ర్నోద్ గణరాత్రామ్ స శ్రీ మోక్షోపాయ సంహితామ్॥
స్వకంఠ స్వర భంగ్యామ్ తద్వృత్త పరివర్తనైః।
వ్యాఖ్యామ్ అకరవతు యేన నిఃశోకో భూత క్షణమ్ నృపః॥

పలు రాత్రుళ్ళు మోక్షోపనిషత్ సంహితను రాజుకు వినిపించాను. సంసార దుఃఖం ఉపశమించే విధంగా వ్యాఖ్యానించాను. అతని జీవిత గాథలను మోక్షోపనిషత్‌లో ఆరోపించి కంఠ స్వరాన్ని మారుస్తూ వినిపించాను. ఈ రకంగా రాజు దుఃఖాన్ని ఉపశమింప చేశాను.

ఇది శ్రీవరుడి రాజతరంగిణిలో సుల్తాన్ జైనులాబిదీన్ చివరి రోజుల వర్ణన. మోక్షోపనిషత్తు వింటూ మరణించిన ఏకైక సుల్తాన్ జైనులాబిదీన్. కశ్మీరుకే కాదు భారతదేశానికంతటికీ ఆదర్శప్రాయమైన రాజుల జాబితాలో ఉండవలసిన సుల్తాన్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here