Site icon Sanchika

కశ్మీర రాజతరంగిణి-26

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]జో[/dropcap]నరాజు రచించిన రాజతరంగిణిలో ఒక కథ ఉంది.

కశ్మీరులో శారదాపీఠం సరస్వతీదేవి నిలయం. దేశవ్యాప్తంగా పండితులు, భక్తులు, శారదా పీఠం దర్శించి, శారదాదేవిని అర్చించి, తమ రచనలను దేవికి నీరాజనంగా అర్పించారు. కశ్మీరును ‘శారదాదేశం’ అని కూడా అనేవారు. మనం ‘నలంద విశ్వవిద్యాలయం’ గురించి చదువుతాం. అంత కన్నా గొప్ప విశ్వవిద్యాలయం ‘శారదా మందిర విశ్వవిద్యాలయం’. మార్తాడ మందిరం, అమర్‍నాథ్‌లతో కలిపి శారదాపీఠం కశ్మీరును అత్యంత పవిత్రం చేస్తుంది.

కుమారజీవుడు, థోన్మీ సంభూత్, రించెన్ జాంగ్పో వంటి బౌద్ధ పండితులు శారదాపీఠంతో అనుబంధం కలిగినవారు. శంకరాచార్యుల వల్ల శారదాపీఠం ఖ్యాతి దేశమంతా వ్యాపించింది. రామానుజాచార్యుల వారు శ్రీభాష్యం రచనకు శ్రీకారం చుట్టింది ఇక్కడే. శారదాదేవి ఈ మందిరంలో సజీవంగా దర్శనమిస్తుందని నమ్మకం ఉంది. అయితే కలికాలంలో శారదాదేవి అందరికీ దర్శనం ఇచ్చేందుకు ఇష్టపడక అదృశ్యంగా ఉండిపోయిందని నమ్ముతారు. అలాంటి శారదాపీఠానికి వెళ్ళి, ఆమెను ప్రత్యక్షంగా దర్శించుకోవాలనే కోరిక కలిగింది సుల్తాన్ జైనులాబిదీన్‌కు.

శారదాపీఠంలోని దేవి విగ్రహం జీవంతో ఉంటుందని, విగ్రహానికి చెమటలు పడతాయని, చేతులు కదులుతాయని, పాదాలు తాకితే, తాకినవారి చేతులు కాలతాయని నమ్మకం. అయితే కలియుగంలో దేవి అదృశ్యరూపంలో ఉండడం వల్ల విగ్రహం నిర్జీవంగా కనిపిస్తున్నది. అయినా సరే, శారదా మందిరంలో శారదాదేవి ఉనికిని అనుభవించే వీలుంటుందని, ఆమె ఇంకా కొందరికి కనిపిస్తుందనీ జైనులాబిదీన్ పాలనా కాలంలో నమ్మేవారు.

జైనులాబిదీన్ ఇస్లామీయుడయినా భారతీయ ధర్మం పట్ల, అత్యంత గౌరవం కలవాడు. ముఖ్యంగా అల్లకల్లోలంగా ఉన్న కశ్మీరులో శాంతి నెలకొల్పటానికి, కశ్మీరు వదిలి పారిపోయిన కశ్మీరీయులను తిరిగి కశ్మీరుకు పిలిపించిన తరువాత, వారి వల్ల కశ్మీరులో పాలనా వ్యవస్థ మెరుగుపడి, శాంతిభద్రతలు మెరుగుపడటంతో, జైనులాబిదీన్‍కు కశ్మీరీ బ్రాహ్మణులపై నమ్మకం పెరిగింది. భారతీయ ధర్మాలు, నమ్మకాలపై విశ్వాసం పెరిగింది. ఫలితంగా అతను ఇస్లామీయుడైనా, శారదాపీఠానికి వెళ్ళి శారదాదేవి దర్శనం చేసుకోవాలని కోరుకున్నాడు. రాజు మాటను కాదనే ధైర్యం ఎవరికీ లేదు. దాంతో సుల్తాన్ శారదాపీఠం వెళ్ళాడు. అయితే, అతను శారదాపీఠం వెళ్ళటం సుల్తానుగా వెళ్ళలేదు, శారదాదేవి భక్తుడిగా వెళ్ళాడు. ఒక భక్తుడి వస్త్రధారణ, చేసే పూజలు, మనస్సులో పవిత్ర భావనలతో శారదా మందిరానికి వెళ్ళాడు. పూజలు చేశాడు. శారదాదేవిని ధ్యానించాడు. మందిరంలో నిదురించాడు. కానీ శారదాదేవి దర్శనం కాలేదు.

సుల్తాన్ ఎంతయినా సుల్తాన్. ఇస్లామీయుడు. మనిషి ఎంత ప్రయత్నించినా తన జీవలక్షణాన్ని మార్చుకోలేడు. సాధారణంగా, భారతీయులు దైవ దర్శనం వాంఛిస్తే, దర్శనం కోసం తపిస్తారు. దర్శనం లభించకపోతే తమ ప్రాణాలు అర్పిస్తారు. కానీ సుల్తాన్ ఇస్లామీయుడు కావటంతో దైవ దర్శనం లభించకపోవటంతో ఆగ్రహించాడు. కనీసం నిద్రలో ఏదో ఒక రూపంలో దేవి కనిపిస్తుందనుకున్న సుల్తాన్‍కు దేవి దర్శనం కాకపోవటంతో పట్టరాని కోపం వచ్చింది. ఆ కోపంలో శారదాదేవి విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు సుల్తాన్ జైనులాబిదీన్. ఈ సంఘటనను వర్ణిస్తూ జోనరాజు “సుల్తాన్ చేత తన విగ్రహాన్ని దేవి ధ్వంసం చేయించుకుంది. ఎందుకంటే అనాగరికులయిన మ్లేచ్ఛుల స్పర్శతో మందిరం అపవిత్రం అయింది. సుల్తాన్ భక్తుడు కావచ్చు. కానీ అతని అనుచరులు అనేక అకృత్యాలు జరిపారు. సుల్తాన్‌తో వారూ మందిరంలోకి ప్రవేశించారు. అందువల్ల అపవిత్రం అయిన మందిరంలో ఉండలేక దేవి సుల్తాన్‍తో తన విగ్రహాన్ని తానే ధ్వంసం చేయించుకుంది. ఎందుకంటే తన అనుచరులు జరిపే అకృత్యాల ప్రభావం, ఎంత పవిత్రుడయినా సుల్తాన్‍పై కూడా పడుతుంది” అని వ్యాఖ్యానించాడు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, సుల్తాన్, అతి పవిత్రమయిన శరదా దేవి విగ్రహాన్ని ముక్కలుచేస్తూంటే ఆగ్రహావేశాలతో జోనరాజు కంపించిపోయివుంటాడు. బాధతో తల్లడిల్లిపోయివుంటాడు. లోలోన కుమిలిపోయివుంటాడు. కానీ, బహిరంగంగా కోపాన్ని కానీ, శోకాన్ని కానీ, బాధను కానీ చూపలేడు. అలాగని సుల్తాన్ జీవలక్షణంలోనే రాక్షసత్వం వుందని వ్యాఖ్యానించలేడు. జోనరాజే కాదు, కశ్మీరులో వున్న భారతీయులందరి మనుగడ సుల్తాన్ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడివుంది. కాబట్టి దోషం సుల్తాన్‌ది కాదు అని అనాల్సిందే. సుల్తాన్ పనిని సమర్థించాల్సిందే. మనసులో వేదన పెదవులపైకి రాకూడదు. ఈ సంఘటనకు జోనరాజు సుల్తాన్ బాధ్యుడు కాడని నిరూపించేందుకు ఎంతో కష్టపడ్డాడు. ఆకాలంలో దేశవ్యాప్తంగా ఇస్లామీయుల పాలనలోవుంటూ, మనుగడకోసం వారి దయాదాక్షిణ్యాలమీద ఆధారపడినవారందరి దుస్థితి ఇదే. మనసులోని మాటను మనసులో అదిమిపెట్టి, ఆవేశాన్ని పంటిబిగువున పట్టి, పైకి సమయానికి తగినమాటలాడి, తమకు మంచిరోజులు భవిష్యత్తులో వస్తాయన్న ఆశతో తరువాత తరాలపై ఆశలు పెట్టుకుని వారికి ప్రతీకాత్మకంగా ధర్మంపై గౌరవం కలిగేట్టు చేయటంద్వారా, ధర్మ దీపం తుపాను కాలాన్ని తట్టుకుని వెలిగేందుకు తమ చిన్ని చేతులు అడ్డుపెట్టి కాస్త కాలమయినా కాపాడేరు. అలా, ఎన్నెన్నో చిన్ని చేతులు ఎన్నెన్నో తరాలు చేసిన ప్రయత్నాలే ఈనాటికీ భారతీయ ధర్మం సజీవంగా నిలచివుండటం.

ఈ సంఘటన ద్వారా జోనరాజు ప్రతీకాత్మకంగా చెప్పినదేంటంటే, శారదాదేశంగా ప్రసిద్ధి చెందిన కశ్మీరు మ్లేచ్ఛమయం అవటంతో శారదాదేవి కశ్మీరును వదిలి వెళ్ళిందన్న సత్యం. శారదాదేవి అంటే సంస్కృతం. శారదాదేవితో పాటు సంస్కృతం కూడా కశ్మీరును వదిలి వెళ్ళిందన్న చేదు నిజాన్ని అత్యంత ప్రతీకాత్మకంగా స్ఫురింపచేసేట్టు ఈ సంఘటనను వివరిస్తాడు. కశ్మీరు సంస్కృత అధ్యయన కేంద్రం. కానీ కల్హణుడి ‘రాజతరంగిణి’ తరువాత కశ్మీరులో చెప్పుకోదగ్గ సంస్కృత కావ్యం రాలేదు. ఒకవేళ వచ్చినా అది తరువాత తరాలకు అందలేదు. కల్హణుడి తరువాత కశ్మీరు అల్లకల్లోలం అయింది. భారతీయుల పాలన అంతమై, ఇస్లామీయుల పాలన ఆరంభమయింది. ఈ అల్లకల్లోల పరిస్థితులలో కశ్మీరులో కావ్య సృజన దాదాపుగా ఆగిపోయింది. కొనసాగినా, కశ్మీరులోని అల్లకల్లోల అనిశ్చింత పరిస్థితుల వల్ల సృజించిన కావ్యం ప్రజలను చేరలేదు. చేరినా, సజీవంగా నిలవలేదు. తమ మనుగడ కోసం అనుక్షణం పోరాడుతున్నవారికి కావ్య పఠనం, దాన్ని మెచ్చుకోవటం, గుర్తుంచుకుని మననం చేస్తుండటం వంటి పనులకు తీరిక ఉండదు. దీనికి తోడు మంగోలుల దాడిలో కశ్మీరులోని గ్రంథాలయాలు సర్వం బూడిద అయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్ళు, ఊళ్ళూ దగ్ధమయ్యాయి. ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయిన వారు గ్రంథాలు వెంట తీసుకెళ్ళారో, లేదో. అలా వెంట తీసుకుని వెళ్ళీనా, కొత్త ప్రదేశంలో వారి మనుగడ ఎలా సాగిందో, గ్రంథాలు వారు భద్రపరిచారో, తరువాత తరాలకు వాటి విలువ తెలిసిందో లేదో… ఇన్నిటి మీద ఆధారపడి ఉంది ఒక గ్రంథం తరువాతి తరాలకు సజీవంగా అందటం! అందుకే అనేక కశ్మీర గ్రంథాల ప్రతులు దేశంలోని పలు ప్రాంతాలలో లభించాయి. ఇవన్నీ 12వ శతాబ్దానికి ముందరి ప్రతులు కావటంతో, కల్హణుడి నుంచి జోనరాజు నడుమ 300 ఏళ్ళు కశ్మీరులో సంస్కృత సాహిత్య సృజన జరగలేదని, జరిగినా దాని ఆనవాళ్ళు అదృశ్యం అయ్యాయనీ అనుకోవాల్సి వస్తుంది. జోనరాజు కూడా సుల్తాన్ జైనులాబిదీన్ ఆశ్రయంలో ఉండటం వల్ల సంస్కృతంలో రచనలు సాగించాడు. కానీ అతను సృజనాత్మక రచనలు చేయలేదు.

జోనరాజు తరువాత శ్రీవరుడు సంస్కృతంలో రచనలు చేశాడు. కానీ ఆయన కూడా సృజనాత్మక రచనలు చేయలేదు. ‘కథా కౌతుకమ్’ అనువాద రచన. ఈ నడుమ శ్రీవరుడు ‘సుభాషితావళి’ అని కశ్మీరు సంస్కృత కావ్యాలలోని నీతి శ్లోకాలని సంకలనం చేశాడు. ఇదొక బృహత్ప్రయత్నం. ‘సుభాషితావళి’ అనే ఈ పుస్తకంలో కూడా 12వ శతాబ్దం నడుమ వరకూ సృజించిన కావ్యాల నుంచే శ్లోకాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో 3500 శ్లోకాలు ఉన్నాయి. దాదాపుగా 350 మంది కవుల ప్రస్తావన ఉంది. అంటే ఈ పుస్తకం వల్ల కశ్మీరుకు చెందిన 350 కవుల పేర్లు తెలుస్తున్నాయి. వాళ్ళు రాసిన కొన్ని శ్లోకాలు లభిస్తున్నాయి. ఈ రకంగా శ్రీవరుడు కశ్మీరులో ప్రాచీన కవుల ఆనవాళ్ళను భవిష్యత్తు తరాలకు సజీవంగా అందించాడు. నీతి శ్లోకాలను అందిస్తూ కశ్మీరులో, సంస్కృతాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేశాడు. ఈ 350 మంది కవులలో గుప్పెడు మంది కవులు తప్ప మిగతా వారి ఉనికికి నిదర్శనం శ్రీవరుడు చేసిన ‘సుభాషితావళి’ సంకలనం మాత్రమే. జోనరాజు కశ్మీరు నుంచి శారదాదేవి అదృశ్యం కావటాన్ని ప్రస్తావిస్తే, శ్రీవరుడు అదృశ్యం అయిన శారదాదేవి స్మృతులను సజీవంగా నిలపటం ద్వారా సంస్కృత భాషను సజీవంగా ఉంచాలని ప్రయత్నించాడు. సంస్కృతం సజీవంగా నిలవాలన్న ప్రయత్నాన్ని, తన ఆకాంక్షను ప్రతిబింబిస్తూ సంస్కృతాన్ని ‘నిర్జర భాష’ అన్నాడు శ్రీవరుడు.

శ్రీవరుడు చేసిన ‘సుభాషితావళి’ సంకలనం ఒక భాషను సజీవంగా తరువాతి తరాలకు అందించటం, కవులను సజీవంగా నిలపటంలో సంకలనాల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తుంది. శ్రీవరుడి కాలం అల్లకల్లోలాల కాలం. జైనులాబిదీన్ రాజ్యానికి రాకముందు ‘సికందర్ బుత్‍షికన్’ దురాగతాల వల్ల ఇస్లామేతరులు కశ్మీరును వదిలి పారిపోయారు. కేవలం పదకొండు బ్రాహ్మణ కుటుంబాలు అత్యంత దయనీయ స్థితిలో కూడా తమ స్వస్థలాన్ని వదిలిపోకుండా కశ్మీరులో నిలచి ఉన్నాయి. వారికి ప్రాణ రక్షణ, ధర్మరక్షణ తప్ప మరో విషయానికి సమయం ఉండి ఉండదు. జైనులాబిదీన్ పాలనలో మళ్ళీ భారతీయులు కశ్మీరులో పెద్ద ఎత్తున ప్రవేశించినా, భవిష్యత్తు ప్రహేళికనే. అయితే ఇప్పుడు సంభవిస్తున్న మార్పులు శాశ్వతంగా కశ్మీరును రూపాంతరం చెందించాయని, గత కాలం తిరిగి రాదని, గతింతిన సంస్కృతి సంప్రదాయలు గతించినట్టే అని జోనరాజుకు తెలుసు. అందుకే కశ్మీరును వదిలి శారదాదేవి వెళ్ళిపోయిందన్నాడు. దానికి మ్లేచ్ఛుల వల్ల అపవిత్రం అవటం అన్న కారణాన్ని ప్రతీకాత్మకంగా చూపించాడు. అయితే భారతీయ ధర్మంలోనే సజీవంగా ఉండే లక్షణం ఉంది. ఆద్యంతాలు లేనిది ఈ ధర్మం అన్న విశ్వాసం ప్రజల నరనరాల్లోనూ నిండి ఉంది. అందుకే చీకటి నిండిన రాత్రులలో కూడా ఆకాశంలో కనబడే తారలను చూస్తూ కాబోయే ఉషోదయం కోసం తయారీలు చేస్తూంటారు. ‘సంభవామి యుగే యుగే’ అన్నది ఇక్కడి జీవ సిద్ధాంతం. కాబట్టి ‘ధర్మసంస్థాపనార్ధం’ ఆ వ్యక్తి ఉద్భవించే వరకూ ధర్మాన్ని వీలయిన రీతిలో సజీవంగా నిలిపే ప్రయత్నం చేయటం ప్రతి వ్యక్తి ధర్మం. ఆ ఆశతో, తప్పకుండా సూర్యోదయం అవుతుందన్న విశ్వాసంతో భావి తరాల లోంచి ధర్మసంస్థాపన కోసం వ్యక్తి సంభవించే వరకూ ధర్మాన్ని ఏదో ఓ రూపంలో భావితరాలకు అందే ఏర్పాటు చేస్తూనే ఉండాలి. ధర్మం సజీవంగా ఉంచటం అనేది రిలే పరుగు పందెం లాంటిది. ఒక తరం తెర వెనక్కు వెళ్తూ మరో తరానికి అందించటం, ఆ తరం తమ తరువాత తరానికి దాన్ని అందించి సాగిపోవటం. ఈ రకంగా ధర్మం సజీవంగా ఉంటుంది. సంప్రదాయం సజీవంగా ఉంటుంది. భాష, సంస్కృతులు సజీవంగా నిలుస్తాయి.

ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులలో భారతీయ ధర్మం సజీవంగా నిలవటం ప్రశ్నార్థకమేనని జోనరాజుకు, శ్రీవరుడికే కాదు, ఆ కాలంలోని ప్రతి భారతీయుడికీ తెలుసు. ఇస్లామీయులు అధికారానికి రావటం అంటే ఇస్లాం తప్ప మరో ధర్మానికి మనుగడ లేదని అర్థం. భారతీయులు ఈ చేదు నిజాన్ని అనుభవం ద్వారా గ్రహించారు. కానీ ‘సంభవామి యుగే యుగే’ అన్న సిద్ధాంతంపై విశ్వాసం వారి ధర్మాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నాలు ఎంతటి తీవ్రమైన నిరాశా నిస్పృహల్లోనయినా వారితో చేయించింది. కల్హణుడు రాజతరంగిణిని రచించటం ఇలాంటి ప్రయత్నమే. జోనరాజు రాజతరంగిణిని కొనసాగించటం ఆ ప్రయత్నంలో భాగమే. శ్రీవరుడు రాజతరంగిణి రచించటమే కాదు, ‘కథా కౌతుకమ్’ అనువదించటం, ‘సుభాషితావళి’ పేరిట నీతి శ్లోకాల సంకలనం చేయటం కూడా సంస్కృతిని సజీవంగా ఉంచే ప్రయత్నంలో భాగమే. భవిష్యత్తులో కావ్యాలు చదివే ఓపిక, తీరిక ప్రజలకు ఉండే వీలుండదని శ్రీవరుడికి తెలుసు. అందుకని శ్లోకాలను ఇలా సంకలనం చేసి అందించటం వల్ల భవిష్యత్తు తరాల వారికి సంస్కృత శ్లోకాల గురించి తెలుస్తుంది, తమ పూర్వీకులు జీవితానుభవాల ద్వారా సంగ్రహించి పొందుపరిచిన విజ్జానం తెలుస్తుంది, కవులు తెలుస్తారు. ఇది ప్రపంచంలో ఏ మూల కూడా జరగనటువంటి అద్భుతమైన, అపూర్వమైన ‘ధర్మ పరిరక్షణ పోరాటోద్యమం!’. ఈ పోరాటానికి అత్యద్భుతమైన వేదిక కశ్మీరం. అనాడు దేశంలోని ఏ ప్రాంతానికి, ఆ ప్రాంతం తమ మనుగడ కోసం పోరాడుతూ కూడా, ధర్మాన్ని, సంస్కృతిని సజీవంగా ఉంచాలని తమ వంతు ప్రయత్నాలు చేశాయి. సామాన్యుల నుంచి అసామాన్యుల వరకూ, నిరక్షరాశ్యుల నుంచి పండితోత్తముల వరకూ ఎవరికి వారు తమ వంతు కర్తవ్యాన్ని, బాధ్యతను స్వచ్ఛందంగా నిర్వహించారు. దైవ కార్యంగా భావించి నిర్వహించారు. అందుకే ఇస్లామీయులు అడుగుపెట్టిన చోటల్లా కొన్ని నెలల్లో, సంవత్సరాలలో స్థానిక ధర్మాలు సమూలంగా తుడిచిపెట్టుకుపోయినా, భారతదేశంలో మాత్రం ఇస్లామీయుల ప్రాబల్యం ఎంతగా విస్తరిస్తే, అంతగా స్వధర్మ రక్షణ పోరాటం తీవ్రమయింది. ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తి అయి ధర్మ రక్షణ పోరాటంలో యోధుడిగా నిలవటంతో ఈ ధర్మం ఈనాటికీ సజీవంగా నిలుస్తోంది.

ఒక ధర్మం సజీవంగా నిలవాలంటే పోరాటం పలు విభిన్నమైన కోణాలలో జరగాల్సి ఉంటుంది. సంస్కృతి పరిరక్షణ, భాష రక్షణ, చరిత్ర రక్షణ, కర్మకాండల రక్షణ, ఆధ్యాత్మ భావ రక్షణ… ఇలా పలు విభిన్నమైన కోణాలలో పోరాటం సాగాల్సి ఉంటుంది. ఈ పోరాటం భారతదేశంలో వీధి వీధినా, వాడ వాడనా జరిగింది. ఒక సంఘటిత శక్తి లేకపోవటంతో, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఏ వ్యక్తికి ఆ వ్యక్తిగా పోరాటం జరగటంతో సజీవంగా నిలిచిన సంస్కృతిలో ప్రాంతీయంగా భేదాలు నెలకొన్నా భారతీయ ధర్మం అనంతమైనది అన్న నిరూపణ లభించింది. అయితే ఇలా స్థానిక పోరాటాలు ఎన్ని జరిగినా, రాజకీయంగా జరిగే పోరాటం ఛత్రఛాయ లభ్యమయితేనే సమష్టిగా ధర్మ రక్షణ పోరాటం విజయవంతమవుతుంది. భారతదేశ చరిత్రను గమనిస్తే ఏయే ప్రాంతాలలో వ్యక్తులు జరిపిన వ్యక్తిగత ధర్మ రక్షణ పోరాటాలు, రాజకీయ అండ లభించినప్పుడు విజయవంతమయ్యాయో, ఆయా ప్రాంతాలలో భారతీయ ధర్మం సజీవంగా నిలిచింది. దేశంలో అధిక ప్రాంతాలలో ఇది జరిగింది. కానీ కశ్మీరులో దురదృష్టవశాత్తు భారతీయులు ఒకసారి అధికారం కోల్పోయిన తరువాత మళ్ళీ వారికి అధికారం లభించలేదు. సంపూర్ణంగా ఇస్లామీయుల అధికారం కొనసాగటంతో సామాన్యుల స్థాయిలో మాత్రమే ధర్మం నిలిచి ఉంది. అదీ అతి గొప్ప విశేషం. అదే రాజకీయాధికారం లభించి ఉంటే, దేశంలోని ఇతర ప్రాంతాలలో లాగా కశ్మీరులోనూ భారతీయ ధర్మం ఆధిక్యతలో నిలిచేది. సాహిత్యంలోనే కాదు ఆధ్యాత్మిక రంగంలో కూడా కశ్మీరులో ఈ ధర్మ పరిరక్షణ పోరాటం దేశంలోని ఇతర ప్రాంతాలకు మార్గదర్శకంగా, ఆదర్శంగా సాగింది.

(ఇంకా ఉంది)

Exit mobile version