[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
యియి కరూం సులమ్ అర్త్యున్
యి రసిని విచారోమ్ ధి మంతర్
యిహాయ్ లాగమొ ధహస్ పర్త్యుమ్
సుయ్ పరసివున్ తంతర్
[dropcap]”నే[/dropcap] చేసే ప్రతి పని దైవపూజ అయింది. నేను ఉచ్చరించిన ప్రతి పదం మంత్రం అయింది. ఈ శరీరం ఏం అనుభవించినా, అది పరమ శివుని చేరే ముక్తిమార్గాన్ని చూపే శైవ తంత్ర అయింది”
కశ్మీర్ ధార్మిక చరిత్రలో లల్లేశ్వరి లేక ‘లాల్ దేద్’ అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. లల్లేశ్వరి క్రీ.శ. 1326 ప్రాంతంలో జన్మించి ఉంటుందని అంచనా. ఆమె తండ్రి చేతాభట్. ఆమె కశ్మీరులోని పాంపోర్ వద్ద జన్మించింది. ఆమె జీవితం అక్క మహాదేవి జీవితాన్ని పోలి ఉంటుంది. అక్క మహాదేవి క్రీ.శ. 1130 -1160 నడుమ జీవించిందని అంచనా. వీరిద్దరి నడుమ అంటే క్రీ.శ. 1275-1296 నడుమ సంత్ జ్ఞానేశ్వర్ జీవించాడు. దేశం ఇస్లామీయుల పరం అవుతుంటే, భారతీయ ధర్మం ప్రమాదంలో పడినపుడు, కర్నాటకలో ఒకరు, కశ్మీరులో ఒకరు, మహారాష్ట్రలో ఒకరు భారతీయ ధార్మక పునరుజ్జీవనానికి స్వచ్ఛందంగా నడుం బిగించారు. దేశంలో ధార్మిక పవనాలు వీస్తూ చినికులు కురిపించాయి. ఇస్లామీయుల కరకుకత్తుల నీడన భారతీయ ధర్మ మహావృక్షం కొత్త చిగుళ్ళువేసింది. భారతీయ ధర్మంలోని గొప్పతనం ఇది.
ఎలాగయితే గంగానది నీటిలో తనను తాను పరిశుభ్రం చేసుకునే లక్షణం సహజంగా ఉందో, భారతీయ ధర్మంలోనూ అవసరమైనప్పుడు ధర్మానికి దిశానిర్దేశం చేసి సజీవంగా నిలిపే లక్షణం సహజంగా ఉన్నదనిపిస్తుంది. భారతదేశం బౌద్ధ ధర్మం, ఇస్లామీయుల కాలాల్లో తనని తాను పునర్నిర్వచించుకుని నూతన రూపు ధరించి, సరికొత్త దారుల్లో ప్రయాణిస్తూ కూడా సనాతన ధర్మ ఆత్మను కాపాడుకుంటూ సజీవంగా నిలిచిన తీరు ప్రపంచ ధార్మిక చరిత్రలోనే ‘న భూతో న భవిష్యతి’ అనదగ్గ అతి గొప్ప ధార్మిక పోరాటం. ఇది అపూర్వమైనది, అపురూపమైనది. నిజానికి ఈ పోరాటాన్ని ‘భక్తి ఉద్యమం’ అని వివరిస్తారు కానీ దీన్ని ‘భక్తి ఉద్యమం’ అనటం అంత సమంజసం అనిపించదు.
దేశం నలుమూలలా వ్యక్తులు స్వచ్ఛందంగా భారతీయ ధర్మాన్ని నూతన విధంగా ఆవిష్కరించి, ప్రచారం చేసి, అంతవరకు హిమాలయ శిఖరంపై మంచులా ఉన్నదాన్ని కరిగించి నీరై ప్రవహింప చేసి, సామాన్యులకు చేరువ చేసి ధర్మాన్ని సస్యశ్యామలం చేశారు. దీనికి ప్రణాళిక లేదు. పథకం లేదు. నాయకత్వం లేదు. ఉన్నది కేవలం సనాతన ధర్మంపై అచంచల విశ్వాసం. అక్క మహాదేవి ‘వాక్కు’, సంత్ జ్ఞానేశ్వర్ ‘అభంగ్’లు, కశ్మీరులో లల్లేశ్వరి ‘వాఖ్’లు దేశమంతా వ్యాపించి ప్రజలను ఉత్తేజితులను చేశాయి. ఈనాటికీ ఉత్తేజితులను చేస్తున్నాయి.
కశ్మీరులో ఇస్లాం ప్రవేశంతో భారతీయ ధర్మం ప్రమాదంలో పడింది. కశ్మీరులో ‘శైవం’ ప్రధానంగా చలామణీలో ఉన్న ధర్మం. ఒక వైపు ఇస్లామీయుల బలవంతపు మత మార్పిళ్ళను ఎదుర్కుంటూ, మరో వైపు ఇస్లాంతో సమన్వయం సాధించాలని ఆనాటి సమాజంలో జరిగిన మథనం ఫలితంగా ఉద్భవించిన అమృతం లల్లాదేవి ‘వాఖ్’. ఈమె వివాహాన్ని తిరస్కరించింది. శరీరంపై ఎలాంటి ఆచ్ఛాదనను ఆమోదించలేదు. శివభక్తిని, ఇస్లాంతో సమన్వయాన్ని బోధిస్తూ కశ్మీరమంతా సంచరించింది లల్లేశ్వరి. ఈమె గురించి జోనరాజు కానీ, శ్రీవరుడు కానీ తమ రాజతరంగిణిలో ప్రస్తావించలేదు. అయితే కశ్మీరులో లల్లాదేవి ‘వాఖ్’లు ఒక రకంగా కశ్మీరీ జనజీవితంలోకి విస్తరిస్తున్న ఇస్లామీయులు, ముఖ్యంగా ‘సూఫీ’ మత ప్రచారకుల ప్రభావానికి ప్రతిస్పందన. సాహిత్య పరంగా శ్రీవరుడు ‘కథా కౌతుకమ్’ అనువాదంలో, ఇస్లామీ సిద్ధాంతాలకు ప్రతిగా శైవ సిద్ధాంతాలను నిలిపాడు. శైవ తాంత్రిక సిద్ధాంతాలను తన రచన ద్వారా ప్రచారం చేశాడు. అతను అనువదించిన ‘యూసఫ్ ఏ జులైఖా’ సూఫీ ప్రేమతత్వాన్ని ప్రదర్శించే కావ్యం. దాన్ని శైవ సిద్ధాంతం ప్రదర్శించే కావ్యంగా అనువదించాడు శ్రీవరుడు. కానీ రాజతరంగిణిలో కనీసం లల్లేశ్వరీ దేవి పేరును కూడా ప్రస్తావించలేదు. ఆమె ప్రభావం వల్ల కశ్మీరు ధార్మిక జగత్తులో సంభవించిన పరిణామాలనూ ప్రస్తావించలేదు. తన రచనను రాజకీయాలకే పరిమితం చేశాడు. జైనులాబిదీన్, అతని తరువాత వచ్చిన సుల్తానుల పాలనను వర్ణించాడు కానీ లల్లేశ్వరి ప్రస్తావన తేలేదు. ఇది ఒక విషయం స్పష్టం చేస్తోంది. రాజతరంగిణి ప్రధానంగా రాజకీయ చరిత్ర రచన, ధార్మిక అంశాల జోలికి వెళ్ళలేదు. కల్హణుడు అక్కడక్కడా ధార్మిక విషయాలను ప్రస్తావించినా, జోనరాజు కానీ, శ్రీవరుడు కానీ, అతని తరువాత అనువాదాన్ని కొనసాగించిన ప్రజ్ఞాభట్టు కానీ, శుకుడు కానీ రాజకీయాలకే పరిమితమయ్యారు. ధార్మిక అంశాల గురించి వ్యాఖ్యానించి బ్రతికి బట్టకట్టే పరిస్థితి లేదు వారికి. రాజతరంగిణిలో ప్రదర్శితం కాని ఒక అద్భుతమైన పోరాటం ఆనాటి కశ్మీరు సమాజం దర్శించింది.
అయితే భారతీయ ధర్మం వల్ల ఇస్లాం కూడా ప్రభావితం అయింది. ఇస్లాంలో ‘సూఫీ’ తత్త్వం ఆవిర్భవించింది.
Islam on coming into contact with Mahayana Buddhism in Central Asia and in Some parts of Persia, could not but be influenced by its philosophical thought, and the devotion and ardour of its monks. (Culture and Political History of Kashmir, – P. N. K. Bamzai.)
అబు సయ్యిద్ ప్రథమంగా ఇస్లాం, బౌద్ధం సనాతన ధర్మాల సమ్మిశ్రితమైన సిద్ధాంతానికి రూపుదిద్దాడు. ధ్యానంలో భగవంతుడి ప్రేమలో జీవితాన్ని త్యాగం చేసే సన్యాస వ్యవస్థకు ఇస్లాంలో శ్రీకారం చుట్టాడు. అబు సయ్యిద్ శిష్యులు వూలు దుస్తులు ధరించేవారు. వారిని ‘సూఫీ’లనేవారు. రాను రాను సూఫీతత్వం పలు విభిన్నమైన రూపాలు ధరించింది. ఈ మార్పులపై భారతీయ ధర్మం ప్రభావం ఎంతగా ఉండేదంటే ‘హల్తాజ్’ అనే సూఫీ ‘ప్రతి మనిషీ దైవమే’ అన్న ఉపనిషద్వాఖ్యానాన్ని ప్రవచించాడు. అతడిని హింసించి చంపేశారు.
సూఫీల్లోనూ, మత గురువుల, ప్రవక్తను బట్టి పలు వర్గాలు ఏర్పడ్డాయి. అబ్దుల్-అల్-జిలానీ వల్ల ఖాదరియా, అహ్మద్-ఉల్-రిఫాయీ వల్ల రిఫయ్యా, జలాల్-ఉద్-దిన్‍రూమీ వల్ల మవాలియా, ఇలా సూఫీల్లోనూ పలు వర్గాలు ఏర్పడ్డాయి. వీరిలో ఒక వర్గం ‘నక్షబంద్యా’లు – ‘శ్వాస పై ధ్యాస’ వంటి ‘యోగ’ను ప్రచారం చేశారు. సూఫీతత్వం శైవత్వానికి దగ్గరగా ఉంటుంది. అందువల్ల కశ్మీరులో సూఫీలకు అత్యంత ఆదరణ లభించింది.
కశ్మీరులో అడుగుపెట్టిన తొలి సూఫీగా ‘సయ్యిద్ బుల్బుల్ షాహ’ను గౌరవిస్తారు. కశ్మీరు అల్లకల్లోలంగా ఉన్న కాలంలో ఈయన ప్రజలను ఆకర్షించాడు. కశ్మీరులో తొలిసారిగా ఈయన సహదేవుడి రాజ్యకాలంలో అడుగుపెట్టాడు. కానీ అంతగా ప్రజల ఆదరణ లభించలేదు. రెండవసారి కశ్మీరు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు రాజ్యాధికారం సాధించిన రించన్‌కు శైవధర్మం ఇచ్చేందుకు తిరస్కరించినప్పుడు, అందిన అవకాశాన్ని ‘బుల్బుల్ షాహ’ చక్కగా ఉపయోగించుకున్నాడు. రించన్‌ను ఇస్లాం మతానికి మార్చాడు. ఫలితంగా కశ్మీరులో ఇస్లామీయుల పాలన ఆరంభమయింది. ఆ తరువాత ఒకరొకరుగా అధికారులందరినీ ఇస్లాం మతానికి మార్చటం ద్వారా గొప్ప ప్రభావాన్ని చూపాడు. ఈయన క్రీ.శ. 1327లో మరణించాడు. శ్రీనగర్‍లో, ఇప్పటికీ ఈయన నిర్మించిన మసీదు ‘బుల్బుల్ లంకర్’ ప్రాంతంలో ఉంది. సుల్తాన్ షహబుద్దీన్ కాలంలో ఈయన మరణించాడు. ఈయన తరువాత మాల్లా కశ్మీరు విద్యామంత్రి అవటంతో, కశ్మీరులో పర్షియన్ భాష విస్తృతంగా ప్రచారానికి వచ్చింది.
‘బుల్బుల్ షాహ’ తరువాత కశ్మీరులోకి పలువురు సూఫీలు ప్రవేశించారు. సయ్యద్ జలాలుద్దీన్ బుఖారా, సయ్యద్ తాజుద్దీన్, సయ్యద్ మసూద్, సయ్యద్ యూసుఫ్ వంటి వారు కశ్మీరులో సూఫీ మత ప్రచారం చేశారు. అయితే కశ్మీరులో సయ్యిద్ అలి హమదాని ప్రవేశంతో అంత వరకూ ఉన్న సామరస్య వాతావరణం దెబ్బతిన్నది. ఇస్లామేతరుల మనుగడ ప్రశ్నార్థకమయింది. పర్షియాను తైమూరు గెలుచుకుని సయ్యిద్‌లను క్రూరంగా అణిచివేస్తున్న సమయంలో ప్రాణాలు అరచేత పెట్టుకుని ఏడు వందల మంది అనుచరులతో క్రీ.శ. 1372లో కశ్మీరు వచ్చి చేరాడు సయ్యిద్ హమదాని. ఓ నాలుగు నెలలు కశ్మీరులో ఉండి, మక్కా వెళ్ళాడు. మళ్ళీ క్రీ.శ. 1379లో కశ్మీరు వచ్చాడు. రెండున్నర ఏళ్ళు ఉన్నాడు.
మొదటిసారి 700మంది అనుచరులతో కశ్మీరు చేరినప్పుడు అప్పటి సుల్తాన్ ఖుత్బ్ ఉద్దీన్ ఈయనను సగౌరవంగా ఆహ్వానించాడు. అయితే కశ్మీరులో ఇంకా ఇస్లామేతరులు అధికంగా ఉండటం, కశ్మీరీ బ్రాహ్మణులు అధికారంలో కీలకమైన పదవులు నిర్వహించటం, భారతీయులు ఇస్లామీయులు ఒకే రకమైన దుస్తులు ధరించటం, పద్ధతులు పాటించటం, వారిని చూడగానే వీరు ఇస్లామీయులు, వీరు భారతీయులు అని గుర్తించే వీలు లేకపోవడం ‘హమదాని’ని బాధించింది. పైగా సుల్తాన్ ప్రతీ రోజూ ‘అలాఉద్దీన్ పురా’లోని మందిరంలో దైవ దర్శనం చేసుకోవటం, ఇస్లామీయులు అధిక సంఖ్యలో ఇక్కడ పూజలు చేయటం ఆయనకు నచ్చలేదు. పైగా కరువు కాటకాలను నివారించేందుకు సుల్తాన్ ప్రతి భాద్రపద మాసంలో యజ్ఞాలు చేయటం, సుల్తాన్ ఇద్దరు భార్యలు ఇస్లాం నియమాలకు విరుద్ధంగా అక్కచెలెళ్ళు కావటం ఈ ‘హమదాని’ భరించలేకపోయాడు. అయితే, సుల్తాన్ హమదానిని గౌరవించాడు కానీ అతడి బోధనలను, సూచనలను పెడచెవిన పెట్టాడు. అయితే ప్రతీ రోజూ సుల్తాన్‌కు హమదాని ‘ఇస్లామీ టోపీ’ ఇచ్చేవాడు. సుల్తాన్ దాన్ని తన కిరీటం క్రింద ధరించేవాడు. సుల్తాన్ మరణం తరువాత ఆ టోపీతో సమాధి చేశారు. ఈ పద్ధతి కశ్మీరులో చాలాకాలం కొనసాగింది. కశ్మీరులో ఇస్లామేతరులు స్వేచ్ఛగా ఉండకూడదని, ఇస్లామీయులు ఇతరులతో కలవటం, వారి పద్ధతులను పాటించకుండా ప్రత్యేకంగా ఉండాలని ప్రచారం చేసే హమదాని, లల్లేశ్వరిల భేటీ జరిగింది. ఈయన ఇస్లాంకు ప్రత్యేకమైన గుర్తింపు దుస్తులు ప్రతి ఒక్కరూ ధరించాలని పట్టుబట్టిన వ్యక్తి. లల్లేశ్వరి ఒంటిపై దుస్తులు వేసుకోవటం అంటే ‘నేను’ అన్న భావన ఉన్నట్టే, భగవంతుడి నుంచి భక్తుడు తనను వేరుగా భావిస్తున్నట్టే అని నమ్మిన వ్యక్తి. వీరిద్ధరి నడుమ ధార్మిక, తాత్విక చర్చలు జరిగాయి. కశ్మీరు ధార్మిక చరిత్రలో లల్లేశ్వరి ప్రాధాన్యం ఇక్కడే తెలుస్తుంది.
చరిత్రకారులు, సామాజిక, ధార్మిక వ్యాఖ్యాతలు లల్లాదేవిని – సంస్కృత పండితులు శాస్త్రాలు, ధర్మాలపై బిగించిన ఉడుంపట్టు పై తిరుగుబాటు చేసిన వ్యక్తిగా వ్యాఖ్యానిస్తారు. కానీ అప్పటి సామాజిక, ధార్మిక పరిస్థితులను విశ్లేషిస్తే లల్లాదేవి చేసింది భారతీయ ధర్మంలోని ఏదో ఓ అంశంపై తిరుగుబాటు కాదు, ఆమె భారతీయులలోని ధార్మిక శక్తిని రగిలించి, తమ ధర్మరక్షణ కోసం వారిని ఉద్యుక్తులను చేసేందుకు ఆధ్యాత్మికతను ఆశ్రయించిన ధార్మిక పోరాటానికి నాయకురాలిగా తోస్తుంది.
సూఫీ తత్వం శైవ తత్వానికి దగ్గరగా ఉండటంతో, సూఫీ తత్వానికి రాజాశ్రయం లభించటంతో, పెద్ద సంఖ్యలో ప్రజలు శైవాన్ని వదిలి తప్పనిసరి పరిస్థితులలో, రాజాశ్రయం కోరో, లాభాలు ఆశించో, ప్రాణరక్షణ కోసమో ఇస్లాంను స్వీకరించసాగారు. ఈ సమయంలో కశ్మీరులో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆచరించే శైవం ప్రమాదంలో పడింది. ఈ సమయంలో లల్లేశ్వరి శైవ తత్త్వ సారాన్ని సరళం చేసి కశ్మీరమంతా తిరుగుతూ, శైవ సిద్ధాంత ప్రచారం చేసింది. ఆరిపోతున్న దీపానికి నూనెపోసి వత్తిని సరిచేసి ఇంకాస్సేపు వెలిగే వీలునిచ్చింది. ఈమె ప్రభావంతో ప్రజలు మళ్ళీ శైవం వైపు ఆకర్షితులవటం, ఇస్లామీయులు సైతం ఆమెను దైవంలా భావించటం ఆ కాలంలోని ఇస్లాం పెద్దలలో కలవరం కలిగించింది. ఆమెతో వాదించి, ఆమె ప్రభావాన్ని తగ్గించాలని ప్రయత్నించిన హమదాని సైతం ఆమె ఔన్నత్యాన్ని, దైవం పైని అచంచల విశ్వాసాన్ని అంగీకరించాల్సి వచ్చింది. పెద్ద సంఖ్యలో ఇస్లామీయులు లల్లేశ్వరి బోధనలవైపు ఆకర్షితులవుతుండటంతో ప్రతిగా ఇస్లాంలోనూ ఒక రుషి వ్యవస్థ ఏర్పాటు అయింది. కశ్మీరుకే ప్రత్యేకమయిన ఈ ఇస్లాం రుషి వ్యవస్థను రూపొందించిన వ్యక్తి లల్లేశ్వరి శిశ్యుడు ‘నంద రుషి’.
‘నంద రుషి’గా పేరుపొందిన ముస్లిం రుషి వ్యవస్థ స్థాపకుడి అసలు పేరు షేక్ నూరుద్దీన్ నూరాని. లల్లేశ్వరి ‘వాఖ్’ల ద్వారా తన సిద్ధాంతాన్ని ప్రజలకు చేరువ చేసినట్టే, ‘షున్’లనే నాలుగు నుంచి ఆరు పాదాలుండే కవితల ద్వారా తన సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. లల్లేశ్వరి లాగే ఈయన అన్ని మతాలు కలిసి ఉండాలని బోధించినా, ప్రధానంగా ఈయన ‘ముస్లిం రుషి’ వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా ఇస్లాంలో కూడా భారతీయ ధర్మంలో లాగా ‘రుషి’ అన్న భావనను స్థిరపరచాలని ప్రయత్నించాడు. ఎలాగయితే ఇటీవలి కాలంలో ఇతర మతస్థుల్లు భారతీయ ధర్మాన్ని అనుసరిస్తూ, తమ ధర్మ ప్రచారాన్ని చేస్తున్నారో, ప్రజలను ఆకర్షించేందుకు భారతీయ ప్రతీకలను, భారత పౌరాణిక పాత్రలనూ తమకనువుగా వాడుకుంటున్నారో, అలాగే ఆ కాలంలో లల్లాదేవి బోధనలతో ఆకర్షితులవుతున్న ఇస్లామీయులను ఇస్లాం పరిథి దాటకుండా చేసేందుకు లల్లాదేవి పంథానే అనుసరిస్తూ ఇస్లాంలోనూ అలాంటి వ్యవస్థనే రూపొందించారన్నమాట. అంటే, దేశంలోని ఇతర ప్రాంతాలలోలాగా కాకుండా, కశ్మీరులో భారతీయ ధర్మం, ఇస్లాం పాలూ-నీళ్ళలా కలవాలని ప్రయత్నించాయన్న మాట. కానీ ఇస్లాం, భారతీయ ధర్మం పాలూ నీళ్ళూ కావు, నీళ్ళూ – నూనెలు అని నిరూపించాడు మీర్ సయ్యిద్ అలి హమదాని. ఈయన ప్రభావంతో సుల్తాన్ సికిందర్ ‘సికిందర్ బుత్‌షికన్’ అయ్యాడు. కశ్మీరులో మత సంకుచిత్వం పెరిగి పోయింది. జైనులాబిదీన్ ఈ సంకుచిత్వానికి అడ్డుకట్ట వేశాడు. కానీ అది తాత్కాలికమే. ‘నంద రుషి’గా పేరుపొందిన నూరుద్దీన్ క్రీ.శ. 1438లో మరణించాడు. అప్పటి సుల్తాన్ జైనులాబిదీన్ ‘చారారె షరీఫ్’ వద్ద ఇతని సమాధిని నిర్మించాడు. ఇప్పటికీ ఇస్లామీయులు ఈ స్థలాన్ని పవిత్రంగా భావించి దర్శిస్తారు.
లల్లాదేవి, నంద రుషిలను గమనిస్తే భారతీయ ధర్మం, ఇస్లాంలు కలిసిపోయి సామరస్యంగా జీవించాలని చేసిన ప్రయత్నాలు స్పష్టమవుతాయి. భారతీయ చరిత్రలో ఈ విషయానికి అంత ప్రాధాన్యం లభించకపోవటం, ఈ అంశం గురించి చర్చలు జరగకపోవటం గమనార్హం. ఇస్లాం సుల్తానుల ‘పరమత సహనం’ గురించి మాట్లాడేవారు, సామాన్యుల స్థాయిలో ఈ రెండు ధర్మాలు సమన్వయం సాధించాలని చేసిన ప్రయత్నాలను ప్రస్తావించరు. ఆధునిక చరిత్ర రచయితల లాగే జోనరాజు, శ్రీవరుడు కూడా తమ వంతు సాంస్కృతిక పోరాటం సాగించారు కాని ధార్మిక విషయాలను ప్రస్తావించలేదు. ఇందుకు అప్పటి జోనరాజు, శ్రీవరులకు ఎలాంటి కారణాలు అడ్డుపడ్డాయో, ఇప్పటి ఆధునిక చరిత్రకారులకూ అవే కారణాలు ఈ విషయాన్ని విస్మరించేట్టుచేశాయి. లల్లాదేవిని భారతీయ ధర్మంలోని మౌఢ్యంపై తిరుగుబాటుగా మాత్రమే అర్ధంచేసుకునేట్టుచేశాయి. సామాన్యస్థాయిలో స్వఛందంగా భారతీయసమాజంలో సంభవించిన ధార్మిక పునరుజ్జీవన ఉద్యమాన్ని విస్మరించి , పునర్నిర్వచన పోరాటంపై భక్తిఉద్యమ పరదాకప్పేట్టుచేశాయి. శ్రీవరుడు అనువదించిన కథాకౌతుకం కావ్యాన్ని పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది.
(ఇంకా ఉంది)