[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
మనేమేస్తు సదా శంభో భవేత్సేవా పరస్పరమ్।
చిత్తం గుణగణమ్ నిత్యం రసనేయం ప్రవర్తతామ్॥
(కథా కౌతుకమ్ 1.7)
అనువాదం అంటే ఒక భాషలో ఉన్నదాన్ని మరో భాషలోకి తర్జుమా చేయటం. భావాన్ని మార్చటం ఉండదు. తన స్వంత ఆలోచనలను రచయిత అనువాదంలో చొప్పించడం ఉండకూడదు. స్వేచ్ఛానువాదం చేసినా, మూల రచయిత రచనలోని భావం చెడకూడదు. ఈ కోణంలోంచి చూస్తే శ్రీవరుడు, ముల్లా జామి రచన ‘యూసఫ్ వ జులైఖా’ను అనువదించాడు అనే కన్నా , తన దృష్టితో పునః రచించాడు అనవచ్చు. కథను తీసుకున్నాడు. పర్షియన్ భాషలోని పదాలకు సంస్కృతంలోని సమానార్థక పదాలు తీసుకున్నాడు. సుల్తానులకు, ఇతర పర్షియన్ పండితులకు ఆగ్రహం కలగకుండా సంస్కృత రచనలో ఇస్లామీయులు పవిత్రంగా భావించే పదాలను, నామాలను ఉంచాడు. కానీ ధర్మం విషయం వచ్చేసరికి కశ్మీరీ శైవ సిద్ధాంతాలను, భావాలను రచనలో ప్రదర్శించాదు. రచన ఆరంభంలోనే ఈ విషయం స్పష్టం చేశాడు.
‘అపారమైన అర్థం లేని జన్మపరంపరలో, అనంతమైన ఆందోళనల వల్ల గుడ్డివాడినైన నాకు దారి చూపించు దేవదేవా, నా దీపమా!’ అంటూ ప్రార్థిస్తూ ‘నా మనస్సు సదా శివుడిపైనే లగ్నమయి ఉండాలి. నా నాలిక నిత్యం శివుడి గుణగణాలను గానం చేస్తూనే ఉండాలి’ అన్న కోరికను ప్రకటించాడు.
అది సుల్తానుల కాలం. ఇస్లాం తప్ప ఇతర ధర్మ ప్రచారానికి తావు లేదు. ఇస్లామేతరులు ద్వితీయశ్రేణి పౌరులు. కశ్మీరులో మతమౌఢ్యం పెరుగుతున్న కాలం అది. ఇస్లామేతరులు సౌఖ్యాలు అనుభవించటం, స్వేచ్ఛగా తమ ధర్మాన్ని అనుసరిస్తుండటం ఇస్లాం మత ఛాందసవాదులకు కన్నెర్ర అవుతూ రాజ్యాధికారం ద్వారా ఇస్లామేతరులను అణచి వేస్తున్న కాలం అది. శైవ సిద్ధాంతాలను, సూఫీ తత్వ సిద్ధాంతాలతో పోల్చి ఇస్లామేతరులను, శివభక్తులను సూఫీలుగా మారుస్తున్న కాలం అది. ఇలాంటి సమయంలో రాజు అండ ఉండటంతో శ్రీవరుడు లాంటి వారికి ప్రమాదం అంతగా లేదు, కానీ, సామాన్య శివభక్తులు ఎప్పుడు ‘సూఫీ’లుగా మారిపోతారో తెలియని కాలం అది. లల్లాదేవి శైవ సిద్ధాంతాలను సరళం చేసి కశ్మీరీ భాషలో ప్రజలకు చేరువ చేసింది. కానీ రాజాశ్రయం లభించని ధర్మం ఎంతకాలం మనగలుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇలాంటి పరిస్థితులలో శ్రీవరుడు శైవ సిద్ధాంత భక్తిని తన రచనలో ప్రదర్శించటం అంటే కత్తి మీద సాము చేసినట్టే. అందుకే శ్రీవరుడు పర్షియన్ కావ్యంలోని ఇస్లాం మత సిద్ధాంతాలను ప్రదర్శిస్తూ వాటి సరసనే శైవ సిద్ధాంతాలను ప్రదర్శించాడు. తన పరమత సహనం చూపిస్తూనే శైవ ధర్మం పట్ల తన అపారమైన విశ్వాసాన్ని ప్రదర్శించాడు. పర్షియన్ కావ్య అనువాదాన్ని పర్షియన్ వాసనలుంచుతూనే శివమయం చేశాడు.
ఒక ధర్మాన్ని సజీవంగా నిలపాలంటే, ప్రయత్నం కేవలం ఒక కోణంలో జరిగితే సరిపోదు. పలుకోణాలలో ధర్మ రక్షణ పోరాటం జరగాల్సి ఉంటుంది. శ్రీవరుడు సాహిత్యపరంగా తను చేయగలిగిన పోరాటాన్ని కొనసాగించాడు. ఇస్లామీ మతానుయాయుల సముద్రం నడుమ భారతీయ ధర్మ ద్వీపంలా నిలిచాడు. చుట్టూ ఉన్న సముద్రం ద్వీపాన్ని కొద్దికొద్దిగా కబళిస్తోందని తెలిసినా, చివరి వరకు తన పోరాటం కొనసాగించాడు. సాహిత్య పరంగా శ్రీవరుడు చేస్తున్న పోరాటానికి ధార్మికపరంగా మద్దతు లల్లాదేవి నుంచి లభించింది. లల్లాదేవి పోరాటంలో శైవ తత్త్వాలను సరళం చేసి స్థానిక భాషలో సామాన్యులకు చేరువ చేయటం మాత్రమే కాదు, సాంఘిక సంస్కరణ కూడా అంతర్గతంగా ఉంది. భక్తి ఉద్యమంగా ముద్ర వేసి ధార్మిక ప్రచారానికి పరిమితం చేసిన ఈ పోరాటం సాంఘిక సంస్కరణలతో ముడి వేసుకుని ఉంది. సంత్ జ్ఞానేశ్వర్‍ను సమాజం వెలి వేసింది. పండితులు భగవద్గీత సిద్ధాంతాలను తప్పుడు రీతిలో అందిస్తూ సమాజంలో మనుషుల నడుమ అడ్డుగోడలు నిర్మిస్తున్నారని అర్థం చేసుకున్న జ్ఞానదేవుడు భగవద్గీతను మరాఠీ భాషలోకి అనువదించాడు. సామాన్యులకు భగవద్గీతను అందుబాటులోకి తెచ్చాడు. అందరు పాడుకునే ‘అభంగ్’ల రచన ద్వారా భారతీయ తత్వాన్ని సామాన్యులకు చేరువ చేశాడు. సామాజిక అసమానతలు మానవ సృష్టి అని గోవు నోటి ద్వారా వేదం పలికింప చేసి నిరూపించాడు. అతని తరువాత ఈ ధర్మ రక్షణ ఉద్యమం కొన్ని వందల సంవత్సరాలు కొనసాగింది నామదేవ్, తుకారామ్ వంటి వారి ద్వారా. లల్లాదేవి కూడా తన ‘వాఖ్’ల ద్వారా ఈ రకమైన సాంఘిక సంస్కరణకు పునాదులు నిర్మిస్తూ ధార్మిక సిద్ధాంతాలను సామాన్యులకు చేరువ చేసింది. ఈ సాహిత్య, ధార్మిక, సాంస్కృతిక పోరాటాలకు రాజకీయమైన అండ లభిస్తే పోరాటం ఫలవంతమవుతుంది. దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం ఈ పని చేసింది. ఉత్తర భారతదేశంలో ‘శివాజీ’ ఆవిర్భావం వరకు సాహిత్య, సాంస్కృతిక, ధార్మిక పోరాటానికి పెద్ద ఎత్తున రాజకీయ అండ లభించలేదు. రాజకీయపరమైన అండ లభించగానే భారతీయ ధర్మ రక్షణ పొరాటం కొత్త చిగుళ్ళు వేసింది. కశ్మీరులో రాజకీయపరమైన అండ లభించడం కనుచూపు మేరలో లేదని శ్రీవరుడికి తెలుసు. చిన్న ద్వీపం లాంటి తమని ఇస్లాం సముద్రం ముంచెత్తక తప్పదని తెలుసు. అందుకే తన మనసు శంభుని మీదే లగ్నం కావాలని, తన జిహ్వ శివుడి గుణగణాలనే గానం చేయాలని కోరుకుంటూ కావ్యం ఆరంభించాడు.
స్సైయేహి జగతేనేవ నశ్యతే వచనం వినా।
శంభు భక్తియుతం తచ్ఛీచ్ఛోమత్ సాధుపూజితమ్॥
(కథా కౌతుకమ్ 1.10)
శంభు భక్తి ప్రదర్శించని పదాలు లేకపోతే ప్రపంచం మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఇలా అడుగుగడుగునా శంభు భక్తి లేని ప్రపంచం నాశనం అవుతుందని ఆవేదనను ప్రకటిస్తూ వచ్చాడు. ఇది అతని మనోవేదన. ఇది అతని ఆవేదన. తన చుట్టూ ఇస్లాం సముద్రం పరుగు పరుగున ముంచెత్తడానికి రావటం చూస్తున్నాడు. తుఫాను తాకిడికి చిక్కుకున్న దీపం తాను నమ్మిన ధర్మం అని అర్థం చేసుకున్నాడు. అయినా ఆ తుఫాను తాకిడి నుంచి రక్షించి దీపం వెలుగుతూండేట్టు చేయాలని తపన పడ్డాడు.
ఇక్కడ మనం మరో విషయాన్ని ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. శ్రీవరుడు అనువాదానికి ఎంచుకున్న కావ్యం మరీ పాతది కాదు. ఆ కాలంలో బహుళ ప్రచారం పొందిన పర్షియన్ కావ్యం. స్త్రీ పురుష ప్రేమను భగవంతుడి ప్రేమకు ప్రతీకగా చూపే కావ్యం. అంతవరకూ భారతీయ కావ్యాలలో ప్రదర్శితమైన ప్రేమ వేరు. పర్షియన్ కావ్యాలలో ప్రదర్శితమయ్యే ప్రేమ వేరు. భారతీయ కావ్యాలలో స్త్రీ పురుష ప్రేమను దైవ ప్రేమతో సమానంగా చూపటం అంతవరకూ లేదు. అది సీతారాముల ప్రేమ కావచ్చు, శివపార్వతుల ప్రేమ కావచ్చు, నల దమయంతుల ప్రేమ కావచ్చు, శకుంతల దుష్యంతుల ప్రేమ కావచ్చు, సత్యవాన్ సావిత్రిల ప్రేమ కావచ్చు. ప్రేమ ధర్మం అన్న భావన తప్ప ప్రేమ దైవం అన్న భావన కనబడదు. 12వ శతాబ్దంలో జయదేవుడు సంస్కృతంలో రచించిన ‘గీత గోవిందం’ రాధాకృష్ణుల ప్రేమకు దైవత్వాన్ని ఆపాదించింది. కృష్ణుడు, గోపికల లైంగిక ప్రేమలో అధ్యాత్మికత్వాన్ని ప్రదర్శించింది. ఈ కావ్యం దేశమంతా విస్తృతంగా ప్రచారం పొందింది. కశ్మీరులో జైనులాబిదీన్ దాల్ సరస్సులో విహరిస్తూ, శ్రీవరుడితో కలిసి గీతగోవిందాన్ని గానం చేసేవాడని శ్రీవరుడు రాజతరంగిణిలో రాశాడు. అంటే ప్రాచీన కావ్యాలకు భిన్నంగా భౌతిక ప్రేమకు ఆధ్యాత్మికతను ఆపాదిస్తూ ‘ప్రేమ’ భావనను దివ్య భావనగా భావించటం భారతీయ సమాజంలో ఇస్లాం అడుగుపెట్టిన తరువాతనే మొదలయింది. ఇది సూఫీ తత్వాన్ని ప్రభావితం చేసి మళ్ళీ సూఫీల ద్వారా మన దేశంలోకి మరో రూపంలో ప్రవేశించింది. అలా ప్రవేశించటానికి చక్కని ఉదాహరణ ‘కథా కౌతుకమ్’.
యోయమ్ మహమదో నామ పైగంబర శిరోమణిః।
కృతాతాపొ ఖదైవేన సహ శుద్ధాయోపి సన్॥
(కథా కౌతుకమ్ 1.16)
ఇది పరిశుద్ధ భాండాగారం వంటి మహమ్మద్ అనే పేరు గల పైగంబర శిరోమణికి దేవదూత వినిపించిన కథ.
ఈ శ్లోకం కన్నా ముందరి శ్లోకాలలో ప్రాచీన కావ్యాన్ని తాను సంపూర్ణంగా అర్థం చేసుకున్నానని, ఈ కావ్యంలోని శృంగార రసంతో పాటు శాంత రసాన్ని కూడా అర్థం చేసుకున్నానని రాశాడు. ఈ కావ్యానికి దైవత్వాన్ని ఆపాదిస్తూ మహమ్మద్ అనే పైగంబర శిరోమణికి ఈ కావ్యాన్ని దేవదూత వినిపించాడని ప్రకటించాడు. అంతేకాదు, ఈ కావ్య మహత్యం గురించిన సందేహాలన్నీ పొరపాట్లనీ ప్రకటిస్తూ, ‘మహారాజా’, ఈ కావ్యాన్ని ఆరంభిస్తున్నానని రాజును సంబోధిస్తూ ప్రకటించాడు. ఇక్కడే శ్రీవరుడి పథకాన్ని మనం గమనించవచ్చు.
కావ్యం ఆరంభం నుంచీ ‘శంభు’ నామ జపం చేస్తున్నాడు శ్రీవరుడు. శంభు నామం పలకని జిహ్వ వ్యర్థం అన్నట్టు ప్రకటిస్తున్నాడు. కానీ అనువదిస్తున్న కావ్యం పర్షియన్ కావ్యం. ఇస్లాం తత్వాన్ని ప్రదర్శించే కావ్యం. శ్రీవరుడు ఉన్నది సుల్తాన్ సామ్రాజ్యంలో. చుట్టూ ఇస్లామేతరుల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంకుచితపూర్ణమైన హింసాత్మక వాతావరణం. అలాంటి వాతావరణంలో శివుడి గొప్పతనాన్ని వివరిస్తూ, హఠాత్తుగా ‘పైగంబర శిరోమణి’ ప్రసక్తి తీసుకువచ్చాడు. మహమ్మద్ ప్రవక్తను, ‘ప్రవక్తలలో శిరోమణి’ అనటంతోనే సుల్తాన్ ‘ఖుష్’. ఒక పరాయి మతం వాడు తన మతాన్ని పొగుడుతూంటే గర్వించని వాడుండడు. ఇప్పటికీ మనం ‘ఆ దేశంలో జనగనమణను గొప్ప గీతం అన్నారు’, ‘ఈ దేశంలో భగవద్గీతను గొప్ప పుస్తకం అన్నారు’, ‘ఫలానా దేశంలో సంస్కృతాన్ని గౌరవించారు’, మనం ఎంత గొప్ప అని గర్విస్తున్నాం. ఈ మనస్తత్వాన్ని శ్రీవరుడు అర్థం చేసుకున్నాడు, పైగా సుల్తాన్ అతని శిష్యుడు. కాబట్టి, శ్రీవరుడి అంతటి పండితుడు, పరమ శివభక్తుడు కూడా ‘పైగంబర శిరోమణి’ అని ప్రవక్తను అనటంతో సుల్తాన్‌తో పాటు ఇస్లామీయులంతా సంతోషిస్తారు. శ్రీవరుడి విశాల హృదయాన్ని పొగుడుతారు. పర్షియన్ కావ్యాన్ని ‘దేవభాష’ అయిన సంస్కృతంలోకి అనువదిస్తూ సూఫీతత్వానికి, శైవతత్వానికి ముడిపెడుతున్న అతని పరమత సహనాన్ని అభినందిస్తారు. కానీ అందరినీ సంతృప్తి పరుస్తు చాప క్రింద నీరులా శ్రీవరుడు సజీవంగా భావితరాలకు శైవ భక్తిని, శైవ తత్వాన్ని అందించాలన్న తపనను గమనించరు.
పర్షియన్‌లో ‘జమీర్ – ఆమ్ రా సెసాస్ అందీష్ గర్దాన్ / జబాన్ ఆమ్ రా సితాయిష్ పి షే గర్దాన్’ అని ఉంటుంది. ‘నా మనస్సులో భగవంతుడిని పొగిడి కృతజ్ఞతలు అర్పించే ఆలోచనలు రానీ. నా నాలిక భగవంతుడి ప్రార్థనలే చేయనీ’ అన్న అర్థం వస్తుంది జామి రాసిన ఈ పదాలకు.
ఈ భావాన్ని సంస్కృతంలోకి అనువదిస్తూ శ్రీవరుడు ‘నా మనస్సు సదా శివుడిపై లగ్నమవనీ, శివుడి సేవలో జీవితం గడపనీ, శివుడి గుణగణాలనే నా నాలిక గానం చేయనీ’ అన్నాడు. అంటే జామి మతతత్వాన్ని, ఆలోచనలను శ్రీవరుడు శివుడి ప్రార్థన పదాలుగా మార్చి అనువదించాడు. అర్థం మారలేదు, భావం మారింది. పర్షియన్, సంస్కృత భాషలలో భగవంతుడిపైనే దృష్టి నిలపాలనీ, భగవంతుడి గుణగణాలు గానం చేయాలనే ఉంది. కానీ పర్షియన్‍లో జామి భావించిన భగవంతుడు వేరు. సంస్కృతంలో శ్రీవరుడు ప్రదర్శించిన భగవంతుడు వేరు. చివరకు శ్రీవరుడు సంస్కృతంలో పర్షియన్ పదాలకు సమానార్థకాలు వాడుతూ కూడా విభిన్నమైన భావం వచ్చేట్టు రాశాడు. ‘గర్దాన్’ అంటే పరిభ్రమించటం. ‘గర్దాన్’కు సమానార్థకంగా ‘ప్రవర్తతామ్’ అన్న పదం వాడేడు శ్రీవరుడు. పర్షియన్ లోని ‘సెపాస్’ (కృతజ్ఞత)ను ‘సేవ’గా అనువదించాడు శ్రీవరుడు. పర్షియన్ లోని ‘కృతజ్ఞత’ లోని భక్తి భవాన్ని గ్రహించి దాన్ని సంస్కృతంలోని భక్తి భావంలోని ‘సేవ’గా తర్జుమా చేశాడు శ్రీవరుడు. ఈ రెండు పదాలు ఆయా సంస్కృతి, ధర్మాలలో తమదైన ప్రత్యేక అర్థాలు కల పదాలు. అంటే శ్రీవరుడు పర్షియన్‍లో పదాలు పలికే భావాలు అర్థం చేసుకొని, వాటికి భారతీయ సాహిత్య ధార్మిక సాంప్రదాయంలో సమానార్థక పదాలను చాలా తెలివిగా వాడేడన్న మాట. పర్షియన్‌లో లేని ‘శంభో’ అన్న పదాన్ని సంస్కృతంలో చేర్చటం వల్ల – ‘చేతులారగ శివుని పూజింపడేని’ అన్న అర్థాన్ని ప్రతిఫలించాడు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. అభ్యంతరం చెప్పినా ఎవరూ పట్టించుకోరు. ఈ రకంగా శ్రీవరుడు పర్షియన్ కావ్యాన్ని సంస్కృతంలోకి అనువదిస్తూ, రెండు సంస్కృతులు, భాషల నడుమ వారధి నిర్మిస్తున్నా, నిజానికి అతను తన కావ్యం ద్వారా సంస్కృత కావ్య రచననూ, సంస్కృత భాషనూ, శివభక్తిని సజీవంగా నిలపాలని తన వంతు ప్రయత్నం – ఎవరికీ అభ్యంతరాలు, ఆవేశాలు రాకుండా చేశాడు.
శ్రీవరుడు అత్యద్భుతంగా తన అసలు ఉద్దేశాన్ని పదాలలో దాచి, పైకి అందరికీ ఆమోదయోగ్యమైన అర్థాన్ని ప్రదర్శించటం ‘ఇష్క్’ అన్న పదానికి సంస్కృత సమానార్థకాన్ని వాడటంలో కనిపిస్తుంది. ‘ఇష్క్’ అంటే ‘ప్రేమ’ అన్నది మామూలు అర్థం. ‘సూఫీ’తత్వంలో ‘ఇష్క్’ అన్నది భగవంతుడిపై ప్రేమ. ‘యూసుఫ్ వ జులైఖా’ వారిద్దరి ప్రేమ గాథ. కానీ ఈ ప్రేమ గాథ చివరలో భగవంతుడికి భక్తుడికి నడుమ ప్రేమ గాథలా మారుతుంది. ఈ ‘ఇష్క్’ అన్న భావనను సంస్కృతంలోకి అనువదిస్తూ శ్రీవరుడు అత్యద్భుతమైన చమత్కారం చేశాడు.
(ఇంకా ఉంది)