Site icon Sanchika

కశ్మీర రాజతరంగిణి-29

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

దిలి ఫరిఘ్ జి దర్ద్ – ఇ ఇష్క్, దిల్ నీస్త్
తన్ బీ దర్ద్ – ఇ దిల్ జుజ్ అబ్ గిల్ నీస్త్
(యూసుఫ్ వ జులైఖా)

యది చిత్తమ్ భవేత్ రాగ వ్యథాహీనమ్ నతన్‌మనః।
తనుస్ తత్పీడయా త్యక్తా నసా మృద్వారినా వినా॥
(కథా కౌతుకమ్ 1.67)

[dropcap]ప[/dropcap]ర్షియన్ నుండి సంస్కృతంలోకి కావ్యాన్ని అనువదిస్తున్నప్పుడు శ్రీవరుడు పర్షియన్ పదాలకు సమానార్థక సంస్కృత పదాలను ఎన్నుకోవటంలో ఎంతో జాగ్రత్త కనబరిచాడు. ‘ఇష్క్’ అన్న పదం ‘సూఫీ’తత్త్వంలో అత్యంత ప్రాధాన్యం వహించే పదం. ఇష్క్‌కు love, ప్రేమ అన్న పదాలను సమానార్థకాలుగా వాడుతున్నాం ప్రస్తుతం. ‘ఇష్క్’ అంటే అధిక శాతం స్త్రీ పురుష ప్రేమ అన్న అర్థం ప్రస్తుతం చలామణీలో ఉంది. కానీ సూఫీతత్త్వం ప్రకారం భగవంతుడిపై భక్తుడికి ఉండే తీవ్రమైన ప్రేమ ‘ఇష్క్’. ఈ పదం తీవ్రత అర్థం కావాలంటే లైలా మజ్నుల ప్రేమను ఉదాహరణగా చూపుతారు.

మజ్ను అంటే పిచ్చివాడు. మజ్ను ఎందుకు పిచ్చివాడంటే అతడు లైలాను పిచ్చిగా ప్రేమించాడు. లైలా నల్లగా ఉంటుంది. గొప్ప అందగత్తె కాదు. కానీ ఆమెను చూడటం కోసం తపించాడు. బెదిరింపులను లెక్క చేయలేదు. ప్రాణాలు పోతాయన్నా బెదరలేదు. లైలాను చూసిన కళ్ళతో ఇతర ప్రపంచాన్ని చూడబుద్ధి కాలేదతనికి. లైలాను మించిన అందం ప్రప్రంచంలో లేదు కాబట్టి, ఆమెను చూసిన తరువాత ఇక ప్రపంచంలో చూసేదేమీ లేదని భావించాడు మజ్ను. కాబట్టి చూస్తే ఆమెనే చూడాలి అని నిశ్చయించుకుని, వారిద్దరూ కలిసే చెట్టు నీడలో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. లైలాను చూడటం కోసమే కళ్ళు తెరవాలని నిశ్చయించుకున్నాడు. ఎవరెంత చెప్పినా కళ్ళు తెరవలేదు. ఆసారి అతడిని కలవడానికి లైలా కొన్ని నెలల వరకూ రాలేదు. తల్లిదండ్రులు బ్రతిమిలాడారు, సమాజం బ్రతిమలాడింది. కానీ మజ్ను కళ్ళు తెరవలేదు. చివరికి దేవుడికి అతడిపై జాలి కలిగింది. మజ్ను దగ్గరకు వచ్చాడు. “నువ్వు ప్రపంచంలోని అన్నీ చూశావు. కానీ నన్ను చూడలేదు. నేను దైవాన్ని. కళ్ళు తెరువు” అన్నాడు.

“నువ్వు దేవుడివైతే ఏమిటి, నా లైలావు కావు. ఫో,  నేను కళ్ళు తెరవను” అన్నాడు మజ్ను.

“అదేమిటి, ప్రపంచంలోని ప్రతి ప్రాణి నన్ను దర్శించాలని తపన పడుతుంది. అయినా నేను ఎవరికీ దర్శనమివ్వను. అలాంటిది నా అంతట నేను నీ దగ్గరకు వచ్చాను. నన్ను చూడకుండా పొమ్మంటావేమిటి?” అన్నాడు దేవుడు.

“నిన్ను చూడాలంటే నువ్వు లైలా లాగా రావాలి. ఎందుకంటే ప్రపంచంలో నాకు లైలా తప్ప మరేమీ కనబడదు. చెట్టు చూస్తే లైలా కనబడుతుంది. నక్షత్రాలు చూస్తే లైలా కనబడుతుంది. లైలా నా హృదయంలో ఉంది. నా రక్తంలో ఉంది. నా శరీరంలో అణువణువునా లైలా ఉంది. లైలా లేని స్థలం లేదు. కాబట్టి దయయుంచి నన్ను వదిలి వెళ్ళిపో” అన్నాడు మజ్ను.

ఇది ఇష్క్. మజ్ను మనిషి. లైలా దైవం. ‘ఇష్క్’ అంటే మజ్నులా భగవంతుడిని తప్ప మరొకటి చూడలేని, భగవంతుడు తప్ప మరొకటి లేని పిచ్చి ప్రేమ. ఇక్కడ ఎలాంటి నిబంధనలు లేవు. ఒప్పందాలు లేవు, పరిధులు లేవు, పరిమితులు లేవు. మానవ చైతన్యం మొత్తం భగవంతుడి కోసం తపన. అదే ‘ఇష్క్’.

జామి తన కావ్యంలో ఇలాంటి ‘ఇష్క్’ను ప్రస్తావిస్తున్నాడు. ప్రేమ బాధ లేని హృదయం, హృదయం కాదు. హృదయంలో ప్రేమ బాధ లేని శరీరం కేవలం మట్టి, నీరు మాత్రమే. ఇదీ జామి వాడిన ‘ఇష్క్’ పదం వెనుక ఉన్న భావన. ఇప్పుడు మన సమాజంలో ఎక్కడ చూస్తే అక్కడ, ఎలాబడితే అలా వాడే ‘ఇష్క్’ మూలం నుంచి ఎంత దూరం వచ్చిందో అర్థమవుతుంది. అసలీ ‘ప్రేమ రోగం’ మూలం ఎక్కడుందో కూడా అర్థమవుతుంది.

అలాంటి ‘ఇష్క్’ను శ్రీవరుడు భారతీయ సంస్కృతి, తత్వం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని అనువదించాలి. ఎందుకంటే ఇలాంటి ప్రేమ భారతీయ సమాజానికి కొత్త. సీతా వియోగాన్ని సహించలేక శ్రీరామ చంద్రుడు బాధపడ్డాడు. కానీ ధర్మాన్ని, కర్తవ్యాన్ని విస్మరించేంత కాదు. నలుడు, దమయంతి కూడా విరహ వేదనలో తపించారు. కానీ ధర్మాన్ని, కర్తవ్యాన్ని విస్మరించేంత కాదు. శ్రీకృష్ణుడు, రాధ, గోపికల ప్రేమ భావన కూడా ఇలాంటిదే. భారతీయ సమాజంలో భౌతిక ప్రేమకూ, ఆధ్యాత్మిక ప్రేమకు నడుమ విభజన రేఖ విస్పష్టం. యయాతి గాథ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. దేవయాని కోరికను కచుడు తిరస్కరించటంలో కూడా ధర్మం, కర్తవ్యాలు ప్రాధాన్యం వహిస్తాయి. దీన్ని బట్టి చూస్తే ‘ఇష్క్’ భావన భారతీయ సమాజానికి కొత్త. అర్థం కానిది. ఒక అమ్మాయి కోసం తపించటం, ఆ తపనను దైవం కోసం తపనగా భావించటం భారతీయ సమాజానికి అంతగా ఆమోదయోగ్యం కూడా కానిది. కానీ ఈ భావన సమాజంలోకి ప్రవేశించిన తరువాత నైసర్గిక స్వరూపాన్ని బట్టి నది తన ప్రవాహాన్ని మార్చుకుని ప్రవహించినట్టు భారతీయ సమాజం కూడా ప్రవర్తించింది. ‘ఇష్క్’ను తలపించే ప్రేమ గాథలు ఇస్లామీయులు భారతదేశంలో అడుగుపెట్టిన తరువాతనే చలామణీలోకి వచ్చాయి.

రాధాకృష్ణుల ప్రేమకు అత్యంత ప్రాచుర్యాన్ని తెచ్చిన జయదేవుడు 12వ శతాబ్దం వాడు. చైతన్య ప్రభు 16వ శతాబ్దం నాటి వాడు. తులసీదాసు 16వ శతాబ్దం నాటి వాడు. సూరదాసు 16వ శతాబ్దం వాడు. వల్లభాచార్యుడు 15 -16 శతాబ్దాల వాడు. రామానుజార్యుడు 11-12వ శతాబ్దాల నాటి వాడు. బసవేశ్వరుడు 12వ శతాబ్దం నాటి వాడు. అంటే భారతదేశంలో ఇస్లాం వేళ్ళూనుకోవటం ప్రారంభమయిన తరువాత, భారతీయ సమాజంలో అంతర్గతంగా ఒక ధార్మిక విప్లవం సంభవించింది. దేశం నలుమూలలా సంభవించిన ఈ విప్లవం, భారతీయ ధర్మానికి కొత్త రూపు నిచ్చింది. దిశ నిచ్చింది. మారుతున్న పరిస్థితుల కనుగుణంగా ప్రవాహ దిశను మార్చుకుని ప్రవహించే సజీవనదిలా భారతీయ ధర్మం ప్రవర్తించింది. ప్రస్తుత సమాజానికి మరింత సులభంగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, శరీరంలోకి అపరిచితమైనది ప్రవేశించగానే, ఎలాగైతే శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి ఆ అపరిచితమైన దాన్ని నిరోధించటం కోసమో, లేక దానికి తగ్గట్టు శరీరం  మార్పులు చెందేట్టు చేయటం కోసమో, తగు చర్యలు తీసుకుని సాఫల్యత సాధిస్తుందో, భారతీయ సమాజం సరిగ్గా అలాగే ప్రవర్తించిందన్న మాట. ఈ ‘ప్రతిచర్య’ను, ఈ ‘విప్లవాన్ని’ భక్తి ఉద్యమం అనో, సాంఘిక సంస్కరణోద్యమమనో కాకుండా, దేశంలోకి ప్రవేశించిన ఇస్లాంను తట్టుకుని, దాన్ని దేశం నుండి పూర్తిగా తరిమివేయటంలోనో, లేక అర్థం చేసుకుని తనలో కలిపి వేసుకోవటంలోనూ, లేదా దానికి తగ్గట్టు తనని తాను రూపాంతరం చెందించుకుంటూ తన అస్తిత్వాన్ని నిలుపుకోవటం కోసమో భారతీయ సమాజం చేసిన అత్యద్భుతమూ, అనిర్వచనీయమూ, అమోఘమూ, అపూర్వమూ, అద్వితీయమూ అయిన ‘పోరాటం’గా పరిగణించాల్సి ఉంటుంది. ఈ పోరాట స్వరూపాన్ని అర్థం చేసుకునేందుకు శ్రీవరుడు ‘కథా కౌతుకమ్’ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సూఫీ ‘ఇష్క్’ తత్త్వాన్ని కశ్మీరీ శైవానికి తగ్గట్టుగా ‘రాగ’గా అనువదించటం, ఈ పోరాటం వెనుక ఉన్న హృదయాన్ని, ఆత్మను సూక్ష్మంలో ప్రదర్శిస్తుంది.

ముల్లా జామి పర్షియన్ షేర్‌ను శ్రీవరుడు “చిత్తంలో ‘రాగ’ భావన లేకపోతే, అది మనస్సే కాదు. రాగ భావనతో పీడితం కాని శరీరం కేవలం మట్టి, నీరు మాత్రమే”గా అనువదించాడు. భావం ఒకటే. ‘ఇష్క్’ను ‘రాగ’ భావనగా అనువదించాడు. ‘ఇష్క్’ అంటే Love. ‘రాగ’ అంటే Passion. ‘దిల్’ అంటే హృదయం. దాన్ని చిత్తంగా, మనస్సుగా అనువదించాడు. తన్ ను తనువుగా అనువదించాడు.అంటే అర్థం మార్చలేదు. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే భావంలో తేడా తోస్తుంది. శ్రీవరుడు ‘రాగ’ ను ‘ఇష్క్’ కు సమానార్థకంగా నిర్ణయించటం వెనుక వున్న పరమార్థం బోధపడాలంటే శ్రీవరుడి కాలంలోని కశ్మీరీ శైవం గురించి టూకీగా నయినా తెలుసుకోవాల్సి ఉంటుంది.

మహాభారత యుద్ధం తరువాత ద్వాపర యుగం అంతమయింది. కలియుగం ప్రారంభమయింది. కలియుగంలో వేద ఋషులుండరు. వేద ప్రభావం తగ్గుతుంది. అందువల్ల వేద విజ్ఞానాన్ని సామాన్యులకు చేరువ చేసేందుకు ఋషులు వచ్చారు. వేదం అర్థం చేసుకునేందుకు దర్శనాలు వచ్చాయి. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వ మీమాంస, అద్వైత అనే ఆరు దర్శనాల ఆధారంగా సామాన్యులు సైతం వేద విజ్ఞానాన్ని గ్రహించవచ్చు. ఈ దర్శనాల లక్ష్యం అహం (నేను), ఇదమ్ (నేను)ల నడుమ సందేహాలను, సందిగ్ధాలను తొలగించటం.

ఈ షడ్దర్శనాలలో యోగం ఆధారంగా పలు ప్రయోగాలు సత్యాన్వేషణ దిశలో జరిగాయి. ఇవి ‘తంత్ర’ కు దారి తీశాయి. వేదం అపౌరుషేయం. ‘తంత్ర’కు ‘క్రియ’ సాధనం. తంత్ర ప్రధానంగా ‘మనస్సు’ (Psychophysical) కు సంబంధించినది.

కాలక్రమేణా తంత్ర మూడు విభిన్నమైన రూపాలను ధరించింది. శైవ – శక్తి తంత్రం, బౌద్ధ తంత్రం, వైష్ణవ తంత్రం. శైవ – శక్తి తంత్రంలో శివుడు సర్వం. శక్తితో కలిసిన శివుడే చైతన్యం. దీన్నే ‘శైవం’ అంటున్నారు. ఈ శైవం భారతదేశంలో మూడు విభిన్నమైన విభాగాలుగా విస్తరించింది. ఉత్తరాన కశ్మీరీ శైవం, దక్శిణాన కేరళ-తమిళనాడుల శైవం, తూర్పున గౌడ (బెంగాల్) శైవం. ఈ మూడు రకాల శైవతత్త్వాలు ఆరు రకాల సిద్ధాంతాలను కలుపుకున్నాయి. శైవ సిద్ధాంతం – పశుపతి శైవం, కశ్మీరు శైవం, వీర శైవం, శివ సిద్ధాంతం, శివ అద్యన్త, సిద్ధ సిద్ధాంతం అనే ఈ ఆరు తంత్ర క్రియలు. వీటిలో కశ్మీరులో చలామణీలో ఉన్నది అద్వైత శైవం. దీన్ని ‘త్రిక’ తత్వం అని కూడా అంటారు. దైవం, మనిషి, ప్రకృతి నడుమ సంబంధం శివ – శక్తి – నరుల సంబంధంగా వివరిస్తుంది త్రిక తత్త్వం.

కశ్మీరులో శైవం క్రీస్తు పూర్వం నుంచీ అమలులో ఉంది. కశ్మీరులో శైవం స్థిరపడేందుకు ‘మాలిని విజయత్తర’ అనే ఆగమం ప్రధాన పాత్ర పోషించందంటారు. వసుగుప్తుడి ‘శివ సూత్ర’, భట్ట కలట్టుడి ‘స్పందకారిక’, సోమానందుడి ‘శివదృష్టి’ కశ్మీరు శైవ తత్వాభివృద్ధికి భూమికను ఏర్పాటు చేశాయి. ఉత్పలదేవుడి ‘ఈశ్వర ప్రత్యభిజ్ఞాకారిక’ కశ్మీరు శైవ సిద్ధాంతాలను విపులీకరిస్తుంది. కశ్మీరులో శైవ తత్వం అభివృద్ధి చెందిన విధానాన్ని అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది. అభినవ గుప్తుడు ‘తంత్ర లోక’ కశ్మీరులో అంతవరకూ ఉన్న ఆలోచనలను, సిద్ధాంతాలను, తత్త్వాలను తార్కికంగా అందిస్తుంది. అభినవ గుప్తుడు ఈ గ్రంథంలో తన ఆలోచనలను, వ్యాఖ్యలను కూడా పొందుపరిచాడు. కశ్మీరులో శైవాన్ని అర్థం చేసుకోవటానికే కాదు, అభినవ గుప్తుడి తరువాత కశ్మీరు శైవం రూపురేఖలు మార్చిన గ్రంథం ‘తంత్ర లోక’. కశ్మీరు శైవం అద్వైత సిద్ధాంతంపై ఆధారపడినది. దీన్ని అభినవ గుప్తుడు ‘పరాద్వైతం’ అన్నాడు. సృష్టి ఆవిర్భావాన్ని అభినవ గుప్తుడు శైవతత్వం ఆధారంగా వివరించాడు. ‘కథా కౌతుకమ్’లో శ్రీవరుడు సృష్టి ఆవిర్భవాన్ని శివ అద్వైత సిద్ధాంతం ఆధారంగానే వివరించాడు నాందీ ప్రస్తావనలో.

ద్యిత్వహీనేప్య నిర్దేశ్యే జగన్నామ వివర్జితా।
దైవేత్యే కేవలం తస్మిన్నాసీదేవో మహేశ్వరః॥
(కథా కౌతుకమ్ 1.51)

ఈ ప్రపంచంలో ద్వైత భావనను విసర్జించాలి. ఈ ప్రపంచంలో ఉన్నదొక్క పరమేశ్వరుడే. మిగతావేవీ లేవు.

‘యూసుఫ్ వ జులైఖా’ కావ్య అనువాదానికి ‘నాందీ ప్రస్తావన’ లోనే ఈ ప్రపంచంలో ‘ప్రేమ’ అంటే శివుడే అని ప్రకటించి, శివుడు తప్ప మరేదీ లేదని నిర్ద్వందంగా ప్రకటిస్తాడు. కశ్మీరీ శైవ సిద్ధాంతంలో శివుడే సర్వస్వం. శివుడే గురువు. మోక్షం ఇచ్చేది గురువు. ఆత్మలను  బంధనాల నుంచి విడిపించేది గురువు. సకల ప్రాణులు ‘శివ పదం’ చేరటం కోసం దారి చూపిస్తాడు గురువు.

కశ్మీరీ శైవ సిద్ధాంతంలో 36 తత్వాలున్నాయి. వీటిలో 24 ఆత్మ తత్వాలు. 7 విద్య తత్వాలు.  5 శివ తత్వాలు. పంచభూతాలు – అయిదు మాత్రలు (శబ్దం, స్పర్శ, రూపం, రుచి, వాసన) 5 ఇంద్రియాలు, 5 కర్మ ఇంద్రియాలు (వాక్, పాణి, పాద, పాయు, ఉపాస్థ) అహంకారం, బుద్ధి గుణాలు ఇలా మొత్తం 24 ఆత్మ తత్వాలుంటారు. విద్య తత్వాలు – పురుష, రాగ, విద్య, కళ, నియతి, కాల, అశుద్ధి (మాయ). శుద్ధ విద్య, ఈశ్వర, సదాశివ, శక్తి, శివ అన్నవి అయిదు శివతత్వాలు. అంటే ‘ఇష్క్’ కు సమానార్థకంగా వాడిన ‘రాగ’ అన్న పదం కశ్మీర శైవంలో 7 విద్య తత్వాలలో ఒక తత్వం అన్న మాట. సూఫీ సిద్ధాంతంలో ‘ఇష్క్’ సర్వస్వం. కానీ శైవ సిద్ధాంతంలో ‘రాగ’ అన్నది 36 తత్వాలలో ఒక తత్వం. శ్రీవరుడు సూఫీ తత్వాన్ని సులభంగానే అర్థం చేసుకున్నాడు. ఆ తత్వంలోని ‘ఇష్క్’ కు భారతీయ ధర్మంతో పొసగదని గ్రహించాడు. ఎందుకంటే భారతీయ ధర్మంలో ప్రేమ స్వరూపం వేరు. భారతీయ ధర్మంలో ‘దాంపత్య ధర్మం’ అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. దాంపత్యానికి దారి తీయని ప్రేమను భారతీయులు ఊహించలేరు. ‘ప్రేమను ప్రేమించు ప్రేమకై’ అన్నది ఆ కాలంలో అర్థం కాని సిద్ధాంతం. కాబట్టి శ్రీవరుడు ‘సూఫీ’ సిద్ధాంతంలో సర్వస్వాన్ని సూచించే పదానికి భారతీయ ధర్మంలో మోక్ష సాధన మార్గంలోని ఒక మెట్టుతో పోల్చాడు. పైపైన చూస్తే అంతా సవ్యంగానే ఉంటుంది. ఎవరికీ అభ్యంతరం ఉండదు. లోతుగా చూస్తే సూఫీ సిద్ధాంతాన్ని, తత్వాన్ని తక్కువ చేస్తూ భారతీయ సిద్ధాంతాల ఔన్నత్యాన్ని సూచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి తరానికి అర్ధమయ్యేట్టు చెప్పాలంటే, “నీ ఎమ్మే, మా అయిదో తరగతితో సమానం” అన్నట్టన్నమాట. అవగాహనతో కూడిన ఔచిత్యాన్ని ప్రదర్శించే అహంకారం ఇది. భౌతిక రూపంపై ప్రేమ ఆధ్యాత్మిక రూపరహిత ప్రేమగా అభివృద్ధిచెందటం అంత సులభతరం కాదన్న అవగాహనతో కూడిన సున్నితమయిన ధిక్కారం ఇది.

(ఇంకా ఉంది)

Exit mobile version