కశ్మీర రాజతరంగిణి-36

3
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

తే వాదినః పరాజిత్య వాదేన నిఖిలాన్ బుధాన్।
క్రియామ్ నీలపురాణోక్తా మచ్ఛిన్దాన్నాగ మద్దిషః॥

మన్డలే విలుప్తాచారే విభిన్న బలి కర్మభిః।
నాగైర్జునక్ష యశ్చక్రే ప్రభూత హిమ వర్షిభిః॥
(కల్హణ రాజతరంగిణి I, 178, 179)

[dropcap]హు[/dropcap]ష్క, జుష్క, కనిష్కుల తరువాత అభిమన్యుడు రాజయ్యాడు. ఈ సమయంలో కశ్మీరులో బౌద్ధం ప్రాబల్యం పెరిగింది. ముఖ్యంగా బోధిసత్త్వ నాగార్జునుడి బోధనలను అవలంబించేవారి ప్రభావం పెరిగింది. వీరు వేద వ్యతిరేకులు. వారు గొప్ప గొప్ప పండితులను వాదనల్లో ఓడించారు. వారిని ఓడించిన తరువాత నీలమత పురాణం చెప్పిన కర్మకాండలను వ్రేళ్ళ నుంచి పెకిలించివేశారు. దాంతో కశ్మీరం అల్లకల్లోలం అయింది. నాగుల పూజలు తగ్గిపోయాయి. వారికి బలులు ఇవ్వటం తగ్గిపోయింది. ఇందువల్ల పెద్ద సంఖ్యలో మానవులు ప్రాణాలు కోల్పోవటం తీవ్రతరమయింది. ఈ కాలంలో దట్టంగా మంచు కురిసేది. మంచు ఎంత తీవ్రంగా కురిసేదంటే సంవత్సరం తర్వాత సంవత్సరం పెద్ద సంఖ్యలో బౌద్ధులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో సంవత్సరంలో ఆరు నెలలు రాజు దార్వాభిసార వంటి ప్రాంతంలో నివసించవలసి వచ్చేది.

అయితే తపస్సంపన్నులు, క్రమం తప్పకుండా నాగులకు బలులు ఇచ్చి పూజలు చేసేవారి ప్రాణాలకు మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లేది కాదు. ఇదే సమయంలో బౌద్ధులు పెద్ద సంఖ్యలో నాశనం అయిపోయేవారు.

రాజతరంగిణిలో కల్హణుడు తాను విన్నవీ, తెలుసుకున్నవీ, ప్రాచీన గ్రంథాలలో రాసి ఉన్నవీ అయిన విషయాలను పొందుపరచాడు. కల్హణుడు తాను రాయాలనుకున్నది, రాశాడు. కానీ కల్హణుడు రాసిన దాన్ని ఆధునిక చరిత్ర రచయితలు తమదైన దృక్కోణంతో అర్థం చేసుకుని వ్యాఖ్యానించారు.

కశ్మీరులో బౌద్ధం విస్తరించి, ఆధిపత్యం సాధించిన తరువాత జరిగినదాన్ని కల్హణుడు సూచ్యప్రాయంగా చెప్పాడు. బౌద్ధులు వేదధర్మ వ్యతిరేకులు. వారు వాదనలో పండితులను ఓడించారు. ‘నీలమత పురాణం’ చెప్పిన పూజలను, క్రతువులను వారు  నిర్వహించనీయలేదు. దాంతో కశ్మీరు అల్లకల్లోలమయింది. ఫలితంగా కశ్మీరులో మంచు తీవ్రంగా కురియటం ఆరంభించింది. మంచు ఎంత తీవ్రంగా కురిసేదంటే రాజు ఆరు నెలలు రాజధానికి కూడా మార్చాల్సి వచ్చింది. అయితే ఈ కురిసే మంచు నాగులను పూజించే వారినీ, నీలమత పురాణాన్ని అనుసరిస్తూ, దానిలో సూచించిన క్రతువులు, కర్మకాండలను నిర్వహించే వారినీ ఏమీ చేసేది కాదు. కేవలం బౌద్ధులే ఈ మంచులో నాశనమయ్యేవారు.

ఇది చదివిన తరువాత మనకు అర్థమయ్యేదేమిటంటే, కశ్మీరులో బౌద్ధం విస్తరించి, ఆధిపత్యం సాధించక ముందు, నాగులకు, వేదానుయాయులకు నడుమ పరస్పర మైత్రి భావనలుండేవి. కశ్మీరులోకి మనుషులు వచ్చి నివసించటం ఆరంభించినప్పుడు నాగులకూ, వారికీ నడుమ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం మనుషులు నాగులని గౌరవిస్తూ, నాగులు చెప్పిన పూజలు, చెప్పిన సమయంలో, చెప్పిన పద్ధతిలో నిర్వహించాలి. ‘నీలుడు’ ఈ విషయాన్ని, చేయాల్సిన పూజలను, పాటించాల్సిన విధులను కశ్మీర రాజుకు వివరించాడు. గోనందుడికి నీలుడికి నడుమ జరిగిన ఈ సామరస్యక పూర్వక పరస్పర సహకార ఒప్పందం ‘నీలమత పురాణం’. నీలుడు చెప్పినట్టు కర్మకాండలు చేస్తూ, క్రతువులు జరుపుతూ, పూజాదికాలు నిర్వహించినంత కాలం మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. వారు కశ్మీరులో క్షేమంగా, శాంతిగా ఉంటారు. ఇదీ ఒప్పందం (చూ. ‘నీలమత పురాణం’, తెలుగు అనువాదం – కస్తూరి మురళీకృష్ణ). ఈ ఒప్పందం ఒక సమతౌల్యాన్ని సూచిస్తుంది. తరువాత కశ్మీరులో నాగులు, మానవులు హాయిగా బ్రతికారు. నాగులు సరస్సుల్లో జీవించేవారు. రాజులు నాగులతో స్నేహం చేయటమే కాదు, వారి కన్యలను వివాహమాడేవారు కూడా. బౌద్ధం ఈ సమతౌల్యాన్ని దెబ్బతీసింది. బౌద్ధం రాకతో నాగులకు అందే పూజలు ఆగిపోయాయి. కొన్ని వేల ఏళ్ళ నుంచీ అమలులో ఉన్న ఒప్పందం భగ్నమైపోయింది. దాంతో మనుషులకు నాగులకు మధ్య ఉన్న మైత్రి చెదిరిపోయింది. సహజీవనం భావన ఆవిరైపోయింది. అంటే ప్రకృతితో మమేకమై, ప్రకృతిని పూజించి, గౌరవించి, కాపాడే ఒక వ్యవస్థ దెబ్బతిన్నదన్న మాట. ఫలితంగా వాతావరణ సమతౌల్యం దెబ్బతిన్నది. మంచు తీవ్రంగా కురియటం మొదలయింది. నాగులను పూజించేవారు బ్రతికారు. వారిని పూజించని బౌద్ధులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇదీ రాజతరంగిణిలోని కల్హణుడి శ్లోకాలను అర్థం చేసుకుంటే కలిగే భావన.

కానీ రాజతరంగిణిని అనువదించినవారు బౌద్ధుల వల్ల అల్లకల్లోలమైన ప్రజల జీవితాన్ని గమనించలేదు. భగ్నమైన ఒప్పందాలను పట్టించుకోలేదు.  మనుగడ ప్రమాదంలో పడిన నాగుల జీవితాల గురించి ఆలోచించలేదు. కల్హణుడు తెలిపిన విషయాలలో వారికి బౌద్ధులను వేధించటం, హింసించటం, చంపటం కనిపించింది.

ఈ శ్లోకాలపై వ్యాఖ్యానిస్తూ ఆర్.ఎస్. పండిత్ “This is perhaps a poetical description of the persecution of the Buddhists in Kashmir during the era” అన్నాడు. దీన్లో బౌద్ధుల ‘persecution’ కనబడటం మన చరిత్ర వ్యాఖ్యానం చేసే వారి దృష్టిని స్పష్టం చేస్తుంది. కశ్మీరంలో అంతవరకూ చలామణీలో ఉన్న నమ్మకాలకు, పరిస్థితులకు పూర్తిగా విరుద్ధమైన ధర్మం సమాజంలో అల్లకల్లోలం కలిగించటం, అధికారం సాధించి అందరూ నమ్మే నమ్మకాలను కూలద్రోయటం, హేళన చేయటం వల్ల చెలరేగే నిరసనలు, నిస్పృహలు ఈ శ్లోకాలలో అనువాదకులకు కనబడలేదు. ఏ పద్ధతులను పాటించకపోతే ప్రమాదం అని ప్రజలు నమ్ముతూ, వాటిని తరతరాలుగా పాటిస్తూ వస్తున్నారో, ఆ పద్ధతులను త్రోసిరాజన్నవారు, పద్ధతులను పాటించకపోవటం వల్ల దుష్ఫలితాలను అనుభవిస్తుంటే దాన్ని ‘persecution’ అనటం అర్థం లేని విషయం. ప్రతి ప్రాంతానికి దానికే ప్రత్యేకమైన జీవనవిధానం ఉంటుంది. పద్ధతులుంటాయి. వాటిని కాదని వేరే వాటిని, అక్కడి పరిస్థితులను సరిపోని వాటిని అవలంబించినవారు ప్రమాదంలో పడటం ప్రాకృతికం. మనం మన ఆహారపుటలవాట్లను, పద్ధతులను కాదని ‘పరాయీకరణం’ చెందటం వల్ల ప్రస్తుతం అనుభవిస్తున్న శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.

అదీకాక విభిన్నమైన ఆలోచనలు, పద్ధతులు ఒకదానికొకటి ఎదురుపడ్డప్పుడు ఘర్షణ జరగటం స్వాభావికం. ‘తస్కిన్నవసరే బౌద్ధాదేశే ప్రబలతాం యుయుః’ అని అంతకు ముందు శ్లోకంలో కల్హణుడు చెప్పాడు. నాగులకు పూజలు జరగటం లేదని, నీలమత పురాణం చెప్పినవన్నీ వ్రేళ్ళతో నాశనం చేసారని కల్హణుడు చెప్పాడు. అక్కడ కనిపించని ‘persecution’; మంచు తీవ్రంగా కురియటం వల్ల బౌద్ధులే మరణించారనీ, నీలమత పురాణాన్ని పాటించిన వారి ప్రాణాలు నిలిచాయని చెప్పటంలో కనిపించటం ‘దృష్టిదోషం’ తప్ప మరేమీ కాదు. ఒక పద్ధతి ప్రకారం, భారతీయ ధర్మం, ముఖ్యంగా బ్రాహ్మణులు (దీన్ని బ్రాహ్మణ ధర్మం అనీ విమర్శిస్తారు) శాంతియుతమైన  బౌద్ధ ధర్మంపై దాడి చేశారని, బౌద్ధులను హింసించారనీ ప్రచారం చేయటం ధ్యేయంగా కల చరిత్రకారులు భారతీయ చరిత్రను చూసిన దృష్టి, వారి లోపభూయిష్టమైన చరిత్ర రచనా పద్ధతి రాజతరంగిణిని విశ్లేషించిన రీతి స్పష్టం చేస్తుంది. రాజతరంగిణిని పాశ్చాత్యులు అనువదించిన విధానాన్ని విమర్శించి, జాతీయవాద దృష్టితో దాన్ని అనువదించిన ఆర్.ఎస్. పండిత మహాశయుడు కూడా ఈ రకమైన వంకర భాష్య ప్రభావాన్నుంచి తప్పించుకోలేకపోవటం దురదృష్టకరం.

ఈ సందర్భంలో కల్హణుడు జరిగిన సంఘటన చెప్తాడు. కశ్యప గోత్రుడయిన చంద్రదేవుడు, నాగుల రాజు అయిన నీలుడిని ప్రార్థిస్తాడు. తపస్సు చేస్తాడు. నీలుడు అతడికి ప్రత్యక్షమై ‘నీలమత పురాణం’లో చెప్పిన పద్ధతులను పాటించమంటాడు. పూజలు చేయమంటాడు. చంద్రదేవుడు వాటిని అమలు పరుస్తాడు. ముఖ్యంగా మూడవ గోనందుడు నీలమత పురాణ పద్ధతులను అమలు పరచటం వల్ల కశ్మీరులో మళ్ళీ శాంతి నెలకొంటుంది.

ఆద్యేన చంద్రదేవేన శమితో యక్ష వుప్లవః।
ద్వితేయన తుదేశేస్శిన్ధుః సహోభిక్షు విప్లవః॥
(కల్హణ రాజతరంగిణి I, 184)

మొదటి చంద్రదేవుడు యక్షుల బెడదని తప్పిస్తే, ద్వితీయ చంద్రదేవుడు దేశాన్ని భిక్షువుల ప్రమాదం నుండి రక్షించాడు.

ఈ శ్లోకంలో ‘భిక్షు విప్లవ’కు, ‘బౌద్ధ విప్లవ’ అన్న పాఠ్యాంతరం ఉంది. భిక్షువుల వల్ల ప్రమాదం అయినా, బౌద్ధుల వల్ల ప్రమాదం అయినా అర్థం ఒకటే. బౌద్ధుల ఆధిక్యం వల్ల కశ్మీరంలో సమతౌల్యం దెబ్బతిన్నది. నీలుడు చెప్పిన పద్ధతులను పాటించటం వల్ల కశ్మీరంలో మళ్ళీ శాంతి నెలకొంది. కశ్మీరంలో భిక్షువుల (బౌద్ధుల) బెడద తొలగింది [ఈ సంఘటన ఆధారంగా కస్తూరి మురళీకృష్ణ కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలలో ‘ప్రజాపుణ్యైః సభవంతి మహీభుజః’ (పేజీ నెం.58) అన్న కథను సృజించారు].

రాజా తృతీయో గోనన్దః ప్రాప్తోరాజ్యే తదన్తరే।
యాత్రా యాగాది నాగానం ప్రావర్తయత పూర్వవత్॥
(కల్హణ రాజతరంగిణి I, 185)

ఆ తరువాత రాజ్యానికి వచ్చిన మూడవ గోనందుడు తీర్థయాత్రలను, నాగుల పూజలను, కర్మకాండలను మళ్ళీ పూర్వకాలంలో లాగే అమలులోకి తెచ్చాడు.

దీన్లో పొరపాటు ఏమీ లేదు. బౌద్ధుల వల్ల దెబ్బతిన్న సమతౌల్యాన్ని పునరుద్ధరించారు కశ్మీర రాజులు. తమ ధర్మాన్ని రక్షించుకోవటం, సమతౌల్యాన్ని తిరిగి సాధించటం వంటివి పొరపాటు పనులు కాదు. ఇది ఎవరు చేసినా సమర్థిస్తారు కానీ భారతీయులు చేస్తే మాత్రం ‘persecution’ అవుతుంది. అన్యాయం అవుతుంది, అక్రమం అవుతుంది.

రాజ్ఞా ప్రవర్తితే తేన పునర్నీలోదిత్ విధౌ।
భిక్షవో హిమదోపాశ్చ సర్వతః ప్రశమం యుయుః॥
(కల్హణ రాజతరంగిణి I, 186)

ఎప్పుడయితే  నీలుడు చెప్పిన పద్ధతులు కశ్మీరంలో మళ్ళీ అమలు అవటం మొదలయిందో అప్పుడు కశ్మీరుకు భిక్షువుల నుంచి, మంచు కురియటమనే ప్రమాదం నుంచి విముక్తి లభించింది.

క్రీ.పూ. 12వ శతాబ్దానికి చెందిన విషయం ఇది.

అయితే మామూలుగా విషయాలని రాస్తే అది జీవం లేని రచన అవుతుంది. కల్హణుడు రచిస్తున్నది మహాకావ్యం. రాజుల పరంపరలను, వారి జీవిత విశేషాలను తెలుసుకోవటం ద్వారా భావితరాల వారు గుణపాఠాలు నేర్చుకోవాలన్నది కల్హణుడి అభిలాష. సమాజ గమనరీతిని అవగాహన చేసుకోవాలన్నది కల్హణుడి ఆలోచన. ఈ సందర్భంలో కల్హణుడు భావితరాలు నేర్చుకోవాల్సిన గుణపాఠాన్ని శ్లోకం రూపంలో అందిస్తాడు.

కాలే కాలే ప్రజాపుణ్యైః సభవంతి మహీభుజః।
యైర్మండల్య క్రియతే దురోత్సన్నస్య యోజనమ్॥
(కల్హణ రాజతరంగిణి I, 187)

ప్రజల పుణ్యకర్మలను అనుసరించి రాజులు వస్తారు. పతనమయ్యే రాజ్యాన్ని వారు నిలబెడతారు. ‘యథా రాజా, తథా ప్రజా’ అన్నదాన్ని తిరగేసి చెప్పిన శ్లోకం ఇది. ప్రజల పుణ్యాన్ని అనుసరించి అందుకు తగ్గ రాజులు వస్తారంటున్నాడు కల్హణుడు.  ‘You get what you deserve’ అని కుండ బద్దలు కొట్టి ఉదాహరణలతో సహా చెప్తున్నాడు కల్హణుడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here