కశ్మీర రాజతరంగిణి-38

2
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

స్పర్శోంగాని యథావాచం కీర్తనం పాపినాం తథా।
సందూష యేదతో నోక్తా తస్యాన్యాపి నృశంసతా॥
(కల్హణ రాజతరంగిణి I-304)

[dropcap]ఈ[/dropcap] రాజు (మిహిరకులుడు) దుశ్చర్యలను నేను రాజతరంగిణిలో పొందుపరచలేదు. ఎందుకంటే పాపాన్ని స్పృశించటం శరీరానికి హానికరం. అలాగే దుశ్చర్యలను వివరించటం కూడా హానికరం కాబట్టి మిహిరకులుడి ఘోర కృత్యాలన్నింటినీ నేను వివరించడం లేదు.

మిహిరకులుడి పాలనను కల్హణుడు నిష్పక్షపాతంగా, నిర్భావంగా వర్ణించాడు. అతడిని అసహ్యించుకోలేదు. దూషించలేదు. మ్లేచ్ఛులని తరిమివేశాడని పొగడలేదు. దక్షిణ ప్రాంతం యముడిది. అతడికి పోటీగా ఉత్తరాన మిహిరకులుడు ఉద్భవించాడని వ్యాఖ్యానిస్తాడు. అంతే కాదు, మిహిరకులుడు వస్తున్నాడనడానికి సూచనగా, అతనికన్నా ముందు అకాశంలో గ్రద్దలు, కాకులు విహరిస్తాయట. అతను చంపే మానవుల కళేబరాలను పీక్కు తినేందుకు అవి అతని కన్నా ముందు వచ్చి ఆకాశంలో ఎదురుచూస్తాయట! ఎప్పుడూ – హత ప్రాణి సహస్ర – వేయి శవాల నడుమ హాయిగా జీవిస్తాడట మిహిరకులుడు.

బాలుర పట్ల జాలి, మహిళల పట్ల క్షమ, పెద్దవారి పట్ల గౌరవం వంటివేవీ మానవతకు శత్రువు అయిన మిహిరకులుడిలో ఏ కోశానా లేవని కల్హణుడు నిర్ద్వందంగా వ్యాఖ్యానిస్తాడు. అందరినీ నిర్దయగా ఊచకోత కోశాడట మిహిరకులుడు. ఈ సందర్భంలో ఒక సంఘటనను చెప్తాడు కల్హణుడు.

ఒక రోజు రాణి శ్రీలంక నుంచి తెచ్చిన వస్త్రం ధరించిందట. ఆ వస్త్రంపై బంగారంతో నేసిన కాళ్ళ గుర్తులున్నాయట. అవి శ్రీలంక రాజు కాళ్ళ గుర్తులు. అది మిహిరకులుడికి కోపం తెప్పించింది. వెంటనే శ్రీలంక పైకి దాడికి వెళ్ళాడు. శ్రీలంక రాజును ఓడించి తనకు సామంత రాజుగా నిలిపాడు. అంటే తన రాణి వస్త్రంపై కాళ్ళ గుర్తులున్న రాజును ఓడించి పాదాక్రాంతుడిని చేసుకున్నాడన్న మాట మిహిరకులుడు. అంతటి పట్టుదల, అంతటి కోపం!

శ్రీలంక రాజును ఓడించి తిరిగి వస్తూ, చోళ, కర్ణాట, లాట దేశ రాజులను ఓడించాడు. కశ్మీరుకి తిరిగి వస్తుండగా పర్వత ప్రాంతంలో ఓ ఏనుగు లోయలోకి పడిపోతూ చేసిన ఆర్తనాదం మిహిరకులుడికి ఎంతో నచ్చింది. దాంతో కొన్ని వేల ఏనుగులను లోయ లోంచి క్రిందకి తోసి అవి పెట్టే కేకలను వింటూ ఆనందించాడు మిహిరకులుడు (ఈ సంఘటనను విశ్వనాథ సత్యనారాయణ ‘మిహిరకులుడు’ నవలలో అత్యద్భుతంగా వర్ణిస్తారు). ఈ సందర్భంలోనే కల్హణుడు – దుష్ట చర్యలను వివరించటం కూడా తప్పేనని వ్యాఖ్యానిస్తాడు.

ఇక్కడే రాజతరంగిణి రచన ఉద్దేశాన్ని స్పష్టం చేస్తూ మరో శ్లోకం రచించాడు కల్హణుడు.

కోవేత్యద్భుత చేష్టానాం కృత్యం ప్రాకృత చేతసాం।
ధర్మం సుకృత సంప్రాప్తి హేతహో సోపి యదాదదే॥
(కల్హణ రాజతరంగిణి I-305)

మానవ మనస్తత్వంలోని వైచిత్రి ఇది. రాజతరంగిణి రచనలో కల్హణుడి ఉద్దేశం కేవలం రాజుల తేదీలు, పరంపరలు చెప్పటం మాత్రమే కాదు. రాజుల గాథలు చెప్పటం ద్వారా మానవ మనస్తత్వ విశ్లేషణ, సృష్టిలో నిబిడీకృతమై ఉన్న సూత్రాల ఆవిష్కరణ, ప్రశాంత జీవనానికి సూచనలు, క్షణభంగురమైన జీవితంలో అధికారం చూసుకుని అహంకరిస్తే పతనం తప్పదని తెలపటం వంటివి రాజతరంగిణి రచనలో కల్హణుడి లక్ష్యం. ఇది రాజతరంగిణిని జీవం లేని చరిత్ర రచన కాకుండా రసవత్తరమైన కావ్యంగా ఎదిగించింది.

మనుషులలో ఎవరూ పూర్తిగా మంచి, చెడూ అంటూ ఉండరు. ప్రతి వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి అధికంగా కనిపిస్తే మంచివాడంటారు. చెడు అధికంగా కనిపిస్తే చెడ్డవాడంటారు. ఈ అధికంగా కనిపించే లక్షణం వల్ల ఇతర లక్షణాలు మరుగున పడతాయి. కానీ  ఎప్పుడోకప్పుడు అతడిలోని మంచి లక్షణం కనిపించినప్పుడు ఆశ్చర్యపోతాం. మిహిరకులుడి విషయంలో కల్హణుడు అలాంటి ఆశ్చర్యాన్నే వ్యక్తపరుస్తున్నాడు. మనుషుల మనస్తత్వంలోని వైచిత్రిని ఎవరు అర్థం చేసుకోగలరు అంటున్నాడు. అత్యంత క్రూరుడు, జాలి, దయ లేనివాడు అయిన మిహిరకులుడు హఠాత్తుగా పుణ్యకార్యాలు చేయటం ఆరంభించాడు.

మిహిరకులుడు శ్రీనగరంలో ‘మిహిరేశ్వరం’ అన్న మందిరం నిర్మించాడు. ‘హోలద’లో మిహిరపురం కట్టించాడు. గాంధార బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేశాడు. ఇక్కడ కల్హణుడు మరో వ్యాఖ్య చేశాడు. మిహిరకులుడి నుంచి దానం స్వీకరించిన గాంధార బ్రాహ్మణులు కూడా మిహిరకులుడి లాగే నీచులయి ఉంటారంటాడు. భారతీయ ధర్మంలో దానం చేసేవాడి గుణదోషాలు దానం స్వీకరించే వాడికి సంప్రాప్తిస్తాయన్న నమ్మకం ఉంది. అందుకే ఎవరు పడితే వాడి నుండి దానం స్వీకరించకూడదంటారు. ఎలాగయితే ఆకాశం నల్ల మేఘాలతో నిండితే, నెమలి సంతోషిస్తుందో, ఆకాశంలో మేఘాలు లేకపోతే బాతులు సంతోషిస్తాయో, అలా ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వారి వారి ఆనందాలంటాడు. .  అంటే, ఈ గాంధార బ్రాహ్మణులూ మిహిరకులుడి లాంటి నీచులే అన్నది కల్హణుడి భావం.

ఈ రకంగా 70 ఏళ్ళు రాజ్యం చేసిన తరువాత మిహిరకులుడికి పలు రకాల వ్యాధులు వచ్చాయి. దాంతో మిహిరకులుడు ఇతరుల పట్ల ఎంత క్రౌర్యం ప్రదర్శించాడో, తన పట్ల కూడా అంతే క్రౌర్యం ప్రదర్శించుకున్నాడు. వ్యాధులతో పతనమవుతున్న తన శరీరాన్ని నిప్పులతో దహనం చేశాడు. తన పాప కర్మలకు  ప్రాయశ్చిత్తమా అన్నట్టు ఎర్రగా కాల్చిన ఇనుప ముళ్ళపై దూకేడు. క్రింద మంటలుంటాయి.  దేశం – దరదులు, భౌద్ధులు, మ్లేచ్ఛుల పాలబడి భారతీయ ధర్మం ప్రమాదంలో పడి దారి తప్పుతున్నప్పుడు మళ్లీ ప్రాచీన ధర్మాన్ని నిలబెట్టాడు మిహిరకులుడు.

మిహిరకులుడు చంద్రకుల్య నది దారి మళ్ళించే సమయంలో నది దారికి అడ్డంగా ఒక రాయి ఉంది. ఎంత ప్రయత్నించినా అది అడ్డు జరగలేదు. శీలవతి అయిన మహిళ తాకితే తప్ప రాయి అడ్డు తొలగదని రాజుకు కలలో దేవత చెప్తాడు. దాంతో మిహిరకులుడు తన రాజ్యంలోని ఉత్తములు, ఉత్తమ కుటుంబ స్త్రీలతో రాయిని తాకించాడు. రాయి కదలలేదు. చివరకు ‘చంద్రవతి’ అనే కుమ్మరి కులానికి చెందిన మహిళ తాకగానే రాయి కదిలింది. ఇది మిహిరకులుడికి – కులస్త్రీలుగా, పెద్ద కుటుంబ స్త్రీలుగా చలామణి అవుతున్న వారిపై ఆగ్రహం కలిగించింది. వారంతా శీలవంతులు కారని, వారి సౌశీల్యం నటన అని కోట్ల సంఖ్యలో స్త్రీలను, వారి భర్తలను చంపించాడు మిహిరకులుడు. ఈ రకంగా క్రౌర్యానికి మారుపేరుగా నిలిచిన మిహిరకులుడు ‘బల్లెపు కొనలు ఖడ్గములు గుచ్చిన వేదిక’ క్రింద అగ్ని జ్వాలలో పడి ప్రాణత్యాగం చేశాడు (ఈ వర్ణన విశ్వనాథ వారి ‘మిహిరకులుడు’ నవలలోది). ఇలా మిహిరకులుడి పాలన అంతమయింది.

మిహిరకులుడు అత్యంత క్రూరుడు అన్నది నిర్వివాదాంశం. కానీ చివరలో కల్హణుడు మిహిరకులుడు దేశాన్ని ధర్మభ్రష్టం చేసిన మ్లేచ్ఛులను, దరదులను తరిమి, మళ్ళీ భారతీయ ధర్మాన్ని నిలిపాడు అన్న విషయం ప్రకటించటంతో మిహిరకులుడిని అర్థం చేసుకోవాల్సిన తీరు మారిపోతుంది. ఎంత క్రూరుడయినా, ధర్మం నిలిపాడు. అతని క్రౌర్యం వెనుక, దౌష్ట్యం వెనుక ‘ధర్మరక్షణ’ అన్న భావన ఉంది. అయితే ధర్మరక్షణ చేసినంత మాత్రాన అతని దౌష్ట్యాన్ని విస్మరించాల్సిన అవసరం లేదంటాడు కల్హణుడు.

చరిత్ర వ్యాఖ్యాతలు పలువురు కల్హణుడు భారతీయ ధర్మ పక్షపాతి అనీ, బ్రాహ్మణుల గొప్పతనం ప్రకటించటం కోసం రాజతరంగిణి రచించాడని దుర్వ్యాఖ్యానం చేస్తుంటారు. కానీ మిహిరకులుడి గురించి కల్హణుడు రాసిన తీరును గమనిస్తే కల్హణుడి అంత నిష్పక్షపాత చరిత్ర రచయిత మరొకరు లేరని అర్థమవుతుంది. మిహిరకులుడిని ఉత్తరాన ఉన్న యమధర్మరాజుతో పోల్చాడు. అతని దుశ్చర్యలను స్మరించటమే పాపం అన్నాడు. అతని ద్వారా అగ్రహారాలను పొందిన బ్రాహ్మణులను దుష్టులు అని వ్యాఖ్యానించాడు. ధర్మాన్ని తిరిగి నిలిపాడు కదా ఎక్కడా మిహిరకులుడిని ఈషణ్మాత్రమైనా పొగడలేదు కల్హణుడు. శీలవంతులయిన స్త్రీలు ఉన్నత కుటుంబాలలో లేరన్న విషయాన్ని ఏ మాత్రం మొహమాటం లేకుండా ప్రకటించాడు. మహిళలను, వారి భర్తలతో సహా కోట్ల సంఖ్యలో సంహరించటాన్ని వివరించాడు. అంటే ఎక్కడా ఎలాంటి పక్షపాతం చూపించలేదు కల్హణుడు. ఉన్నది ఉన్నట్టు, తెలిసింది తెలిసినట్టు తెలుపుతూ, తనకు మంచి అనిపించిన దాన్ని పొగిడాడు. చెడు అనిపించిన దాన్ని విమర్శించాడు. వారి జీవితాల ద్వారా నేర్చుకోదగ్గ పాఠాలను తేటతెల్లం చేశాడు. నీతి బోధ చేశాడు. దీనిలో ఎలాంటి పక్షపాతం లేదు. అందుకే చివరలో మిహిరకులుడి గురించి వ్యాఖ్యానిస్తూ

ఇయం నాన్యమతే ఖ్యాతిః ప్రధత్ తధ్యాతః పునః।
అథవ్యా సనిమితాపి ప్రాణి హింసా గరీయసి॥
(కల్హణ రాజతరంగిణి I-323)

‘ప్రాణి హింస చేయటం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. అది అత్యంత నీచమైన, గర్హనీయమైన పని’ అని నిర్ద్వందంగా ప్రకటించాడు కల్హణుడు రాజతరంగిణిలో. అలాంటి కల్హణుడికి ‘బ్రాహ్మణ పక్షపాతి’ అన్న నేరాన్ని అంటగట్టటం ఆధునికుల సంకుచిత దృష్టిని, కళ్ళకు కమ్మిన రంగుల దోషాలను స్పష్టం చేస్తుంది.

ఇక్కడ మరో విషయం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. కల్హణుడు వర్ణించిన మిహిరకులుడు శ్రీలంక చేరి  అక్కడి రాజును ఓడించాడు. వెనక్కి వస్తూ కర్ణాటక, చోళ రాజులను ఓడించాడు. ఈ మిహిరకులుడిని చరిత్ర రచయితలు బౌద్ధులపై హింస నెరపి, ఆరామాలను కూల్చిన మిహిరకులుడితో జత కట్టారు. ఫాహియాన్, యువాన్‌త్సాంగ్‌ల పర్యటన ఆధారంగా మిహిరకులుడి కాలాన్ని, పనులను నిర్ణయించారు. పర్షియన్ రచనల ఆధారంగా మిహిరకులుడిని నిర్ధారించారు. పర్షియన్ రచయిత రచనలన్నింటికీ ఆధారం కల్హణుడి రచననే. మూలాన్ని కాదని, మూలం ఆధారంగా రచించిన ఇతర రచనలను ప్రామాణికంగా తీసుకోవటం అత్యంత హాస్యాస్పదమయిన విషయం. మూల రచయితకు విలువ లేదు. అతను రాసింది అభూత కల్పన. కానీ దాన్ని అనువదించిన రచన మాత్రం నిజం!

కోట వేంకటాచలం గారు మిహిరకులుడి కాలనిర్ణయం పట్ల, తీవ్రమైన అభ్యంతరాలు  లేవనెత్తారు. తార్కికంగా, ఆధారాలతో పాశ్చాత్య చరిత్రకారుల కట్టుకథలలోని డొల్లతనాన్ని చూపించారు. కశ్మీర మిహిరకులుడికి, పాశ్చాత్యులు నిర్మించిన మిహిరకులుడికి ఏ మాత్రం పోలికలు లేవని నిరూపించారు. రాజతరంగిణి ప్రకారం మిహిరకులుడు క్రీ.పూ.704 సంవత్సరం నాటి వాడు. ఆయన గోనంద వంశం వాడు. కశ్మీరుకు చెందినవాడు. కానీ పాశ్చాత్య చరిత్రకారులు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయనను క్రీ.శ. ఆరవ శతాబ్దానికి తీసుకువచ్చి హుణుడని తీర్మానించారు. మిహిరకులుడిని యశోధర్మ అనే రాజు ఓడించాడని, మిహిరకులుడు అతడి పాదాలకు నమస్కరించాడని రాశారు. కల్హణుడి రాజతరంగిణిలో మిహిరకులుడి ఓటమి ప్రస్తక్తి లేదు. ఒకవేళ మిహిరకులుడిని ఎవరైనా రాజు ఓడిస్తే ఆనందంగా దాన్ని ప్రకటించేది కల్హణుడే. ఎందుకంటే దేవతలు చల్లగా చూశారు కాబట్టి మిహిరకులుడు ఎంత దౌష్ట్యంగా ప్రవర్తించినా ప్రజలు అతడికి ఎదురుతిరగలేదు. అతడిని హత్య చేయలేదు (I-324) అని వ్యాఖ్యానించాడు కల్హణుడు. కాబట్టి మిహిరకులుడు తన జైత్రయాత్రలో పరాజయం పొంది, మరో రాజు పాదాల వద్ద తల వంచి ఉంటే దాన్ని సంతోషంగా రాజతరంగిణిలో పొందుపరిచేవాడు కల్హణుడు. పైగా, జైత్రయాత్ర నుంచి తిరిగివచ్చిన మిహిరకులుడి ప్రవర్తన ఓటమిని అనుభవించిన రాజులాగా కూడా లేదు. ఏనుగులను వేల సంఖ్యలో లోయల్లోకి తోసి చంపించాడు. కోట్ల సంఖ్యలో స్త్రీలను, వారి భర్తలతో సహా చంపించాడు. ఇది విజయ గర్వంతో మదమెక్కిన దుష్టుడి ప్రవర్తన తప్ప, పరాజయంతో కుమిలిపోతూ, ఆ కసిని ప్రజలపై తీర్చే నీచుడి ప్రవర్తన కాదు. అదీ గాక, మిహిరకులుడిని ఎవరైనా రాజు ఓడించి ఉంటే కల్హణుడు ఆ రాజును ఆకాశానికి ఎత్తేసి ఉండేవాడు. అంత ప్రధానమైన సంఘటనను వదిలేవాడు కాదు.

పాశ్చాత్య చరిత్రకారులు మిహిరకులుడి తండ్రిగా చెప్తున్న తోరమాణుడు కశ్మీరులో రాజ్యం చేయలేదు. కశ్మీరుకు చెందిన 82వ రాజు ‘హిరణ్యవాసి’ సోదరుడు తోరమాణుడు. ఈయన రాజు అనుమతి లేకుండా నాణేలను కరిగించి తన బొమ్మతో నాణేలను ముద్రించాడు. ఇది రాజుకు ఆగ్రహం తెప్పించి అతడిని కారాగారంలో బంధించాడు. తోరమాణుడు కారాగారంలోనే మరణించాడు. అంటే తోరమాణుడు తన బొమ్మలతో నాణేలు వేయించాడు కానీ రాజ్యం చేయలేదు. ఈ నాణేల ఆధారంగా చరిత్ర రచయిత్రలు తోరమాణుని కొడుకు మిహిరకులుడని, ఈయన హుణుడని, గాంధారం గెలుచుకుని, కశ్మీరు వచ్చాడని తీర్మానించారు. అంతేకాదు, మిహిరకులుడిని ఓ బౌద్ధ భిక్షువు అవమానించాడని, దాంతో మిహిరకులుడు బౌద్ధులను హింసించి, ఆరామాలను ధ్వంసం చేశాడనీ రాశారు. అంటే ఎలాంటి ఆధారాలు లేని ఓ మిహిరకులుడిని సృష్టించి కశ్మీరుకు చెందిన మిహిరకులుడిని ఈ  ఊహా మిహిరకులుడితో సమానం చేశారన్నమాట (చూ. విశ్వనాథ విరచిత ‘పాతిపెట్టిన నాణెములు’). ఇది తప్పన్నవారిని చరిత్రకారులు కాదన్నారు. కల్హణుడిని కాదన్నారు. కళ్ళ ఎదురుగా ఉన్న నిజాలను మాయా వాదనలతో కప్పిపెట్టారు. భారతీయ చరిత్రతో విశ్వనాథ మాటల్లో చెప్పాలంటే ‘అకాండతాండవం’ చేశారు.

మిహిరకులుడి తరువాత అతని కొడుకు ‘బకుడు’ రాజయ్యాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here