Site icon Sanchika

కశ్మీర రాజతరంగిణి-39

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

భూక్షీర వాటికాయాం యో నిర్వాస్య లషు నాశినః।
భాసటాయాం వ్యధాద్విస్రాన్ని జాచర వివర్జితాన్॥
అన్యాంశ్చనీయ దేశోభ్యః పుణ్యేభ్యో వశ్చికాదిషు।
పాపనాన గ్రహరేషు బ్రహ్మణాన్య న్యరోపయత్॥
(కల్హణ రాజతరంగిణి I, 342, 343)

[dropcap]మి[/dropcap]హిరకులుడి ప్రాణత్యాగం తరువాత అతడి సంతానం బకుడు రాజయ్యాడు. అతడి తరువాత క్షితినంద, నర, అక్ష, గోపాదిత్య వంటి వారు రాజ్యం చేశారు. గోపాదిత్యుడు జేష్ఠేశ్వర మఠం ‘గోప పర్వతం’పై కట్టించాడు. ఈ గోప పర్వతాన్నే ‘గోపకార్’ అంటారు. ప్రస్తుతం దీన్ని శంకరాచార్య పర్వతం అంటారు. ఈ పర్వత పాదం వద్ద ‘దాల్ సరస్సు’ దగ్గరి ప్రాంతాన్ని ఇప్పటికీ ‘గుప్కార్’ అంటారు. ఇటీవలి కాలంలో కశ్మీరీ రాజకీయ పార్టీల కూటమిని ‘గుప్కార్ అలియన్స్’ అనటం మనం వింటున్నాం. ఈ ‘గుప్కార్’ అన్న పేరు ఆనాటి ‘గోపాదిత్యుడి’ పేరు అన్నమాట. గోపాదిత్యుడు చక్కగా రాజ్యం చేశాడు. దేవతలకు పండుగల సమయంలో ఇచ్చే బలులు తప్ప ఇతర సమయాల్లో జీవహింసను నిషేధించాడు. ఇతని తరువాత గోకర్ణ, నరేంద్రాదిత్య, అంధ యుధిష్ఠిరుడు వంటి వారు రాజ్యానికి వచ్చారు.

గోపాదిత్యడి రాజ్యపాలనలో ఆయన పలు మందిరాలు నిర్మించటమే కాకుండా వెల్లుల్లి తినే బ్రాహ్మణులకు దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. వారిని ‘భూక్షీరవాటిక’మనే ప్రాంతానికి తరిమివేశాడు. ఎవరయితే బ్రాహ్మణ జీవన విధానాన్ని, వారి పద్ధతులను విస్మరించారో వారందరినీ ‘ఖాసతో’ వద్ద బంధించాడు. ఇతర పవిత్ర స్థలాల నుండి, పద్ధతి ప్రకారం, సంప్రదాయబద్ధంగా పవిత్రంగా జీవనం సాగిస్తున్న బ్రాహ్మణులను కశ్మీరు రప్పించాడు. వారికి వశ్చాక, ఇతర అగ్రహారాలలో నివాసం కల్పించాడు.

గోపాదిత్యుడి ఈ చర్య కొన్ని విషయాలను స్పష్టం చేస్తుంది.

మనుస్మృతి (5,4.5) ప్రకారం ‘వేద అభ్యాసాన్ని, పద్ధతులను నిర్లక్ష్యం చెయటం వల్ల, విధ్యుక్త కర్మల నిర్వహణలో లోపాల వల్ల, నిషేధిత ఆహారాన్ని సేవించటం వల్ల బ్రాహ్మణుల జీవితకాలం తగ్గిపోతుంది. ఉల్లి, వెల్లుల్లి, పుట్టగొడుగులు, అశుద్ధ పదార్థాల నుంచి జన్మించే ఆహార పదార్థాలను బ్రాహ్మణులు స్వీకరించకూడడు.’

దీన్ని బట్టి ప్రాచీన కశ్మీరంలో ‘మనుస్మృతి’ని సంపూర్ణంగా పాటించకున్నా, బ్రాహ్మణుల విషయంలో మాత్రం అమలుపరిచేవారని తెలుస్తుంది. అంతేకాదు, నిషేధిత పదార్థాలను సేవించినందుకు వారికి శిక్షలు కూడా పడేవని తెలుస్తోంది. నియమాలను అతిక్రమించిన బ్రాహ్మణులకు శిక్షలు పడటంతో పాటు వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పద్ధతులను పాటించే బ్రాహ్మణులను కశ్మీరుకు రప్పించి వారిని అగ్రహారాలలో స్థిరపరిచారనీ తెలుస్తోంది. దీన్నిబట్టి తెలిసేదేమిటంటే ఆనాడయినా, ఈనాడయినా నియమాలను పాటిస్తూ, విద్యుక్త ధర్మాలను అనుసరిస్తూ, నిజాయితీగా జీవించే వారికే గౌరవం అని. దీనికి బ్రాహ్మణుడు, ఇతరులు అన్న తేడాలేదు. పైగా బ్రాహ్మణుడు అయితే నియమాలు ఇంకా కఠినం. ఇలా భ్రష్టులుగా భావించిన బ్రాహ్మణులు బహుశా బహిష్కారం పొందటం, ఇతరులనుంచి వేరుగా చూడటం వల్ల వారి స్థాయి సామాజికంగా తగ్గటంవల్ల సమాజంలో పొరలు, అరలు ఏర్పడ్డాయేమో! కాలక్రమేణ ఇది గట్టిపడటంవల్ల సామాజికంగా పలు మార్పులు జరిగివుండవచ్చు. ఈ విషయంపై ఇంకా లోతుగా పరిశీలించాల్సివుంది.

చరిత్ర రచయితలు ఆరంభం నుంచీ కశ్మీరు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో సంబంధం లేకుండా ఎదిగిందనీ, కశ్మీరు ప్రత్యేకం అని నిరూపించాలని తపన పడుతున్నారు. వారి వ్యాఖ్యలు, తీర్మానాలు, అన్నీ కశ్మీరు ప్రత్యేకం అన్నట్టు ఉంటాయి. కానీ రాజతరంగిణిని పరిశీలిస్తే ఆరంభం నుంచీ కశ్మీరుకు భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధం ఉండడమే కాదు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రాకపోకలు సాగుతుండేవని తెలుస్తుంది.

కశ్మీరు ఆవిర్భావమే కశ్యపుడి రాకతో సంభవం అయింది. కశ్మీరు రాజుకు జరాసంధుడితో మైత్రి ఉండడంతో మధురపై దాడిలో కశ్మీరు రాజు పాల్గొన్నాడు. కృష్ణుడి చేతిలో హతమయ్యాడు. కృష్ణుడు కశ్మీరును రాణి యశోవతికి అప్పగించాడు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి బౌద్ధులు కశ్మీరుకు వచ్చారు. నాగార్జునుడు కశ్మీరులో బౌద్ధ మత ప్రచారం చేశాడు. మిహిరకులుడు కశ్మీరు నుంచి బయలుదేరి శ్రీలంకను గెలుచుకుని వస్తూ చోళులను, కన్నడిగులను జయించాడు. ఇప్పుడు గోపాదిత్యుడు దేశంలోని పవిత్ర స్థలాలు, అంటే, గంగ, గోదావరి, కావేరి, యమున వంటి నదుల ప్రాంతాలలో పవిత్ర స్థలాలలో నివసించే బ్రాహ్మణులను కశ్మీరు రప్పించాడు. వారికి నివాసం కల్పించాడు. ఈ రకమైన వివరాలను గమనిస్తే కశ్మీరూ ఏనాడూ భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రత్యేకం కాదనీ, రాజు వేరయినా, రాజ్యం వేరయినా, ధార్మికంగా, మానసికంగా కశ్మీరు భారతదేశంలోని అంతర్భాగమని స్పష్టం అవుతుంది. ఇది కాదని నిరూపించాలని తపన పడేవారి దురుద్దేశాన్ని, దుష్టపుటాలోచనలను అర్థం చేసుకోవటం సులభం.

కశ్మీరు రాజతరంగిణి మొదటి తరంగంలో వర్ణించిన చివరి రాజు అంధయుధిష్ఠిరుడు. ఇతని కళ్ళు చాలా చిన్నవిగా ఉండేవి కాబట్టి అతడిని అంధయుధిష్ఠిరుడు అనేవారట. ఆరంభంలో యుధిష్ఠిరుడు చక్కగా పాలించాడు. తరువాత అధికార మదం తలెకెక్కింది. అర్హులైన వారికి సరైన పదవులు ఇవ్వలేదు. తెలివైన వారిని గౌరవించలేదు. జాలి, దయ మరిచాడు. తనకు విధేయులుగా ఉండేవారిని అవమానించటం వల్ల, వారిని పనికిరానివారితో సమానంగా చూడటం వల్ల, వారు రాజుకు దూరమయ్యారు. దాంతో రాజు చుట్టూ అతనిని పీడించి, తప్పుదారి పాటించి, లాభాలు పొందేవారు చేరారు. వీరంతా పరాన్నజీవులు. అందరినీ సమంగా చూడటం యోగులకు చెల్లుతుంది కానీ రాజులకు అది లోపం అని వ్యాఖ్యానిస్తాడు కల్హణుడు.

నయద్భిర్గుణతాం దోషాన్ దోషతాం చ గుణాన్వితైః।
స లుప్త ప్రవి భశ్చేక్రే శనవైః స్త్రీ జితోపమ॥
(కల్హణ రాజతరంగిణి I, 356)

రాజు చుట్టూ చేరిన పరాన్నజీవులు రాజు లోపాలను గొప్పతనాలుగా, రాజు మంచితనాన్ని దోషాలుగా చూపారు. కొన్నాళ్ళకి రాజు తన స్వంత తెలివిని కోల్పోయాడు. మహిళలకు దాసుడైపోయాడు. దాంతో అతడి చుట్టూ ఉన్న దుష్టులు రాజ్యంపై పట్టు సంపాదించారు. రాజు అధికారాన్ని వారు కబళించి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటంతో పొరుగు రాజ్యాల రాజులు కశ్మీరుపై దృష్టదుక్కులు ప్రసరించసాగారు. వారంతా గ్రద్దలలాగా కశ్మీరు అనే మాంసం కోసం ఆశపడసాగారు. రాజు వ్యతిరేకులు అందరూ కలిసి ఒక జట్టుగా ఏర్పడి రాజుకు వ్యతిరేకంగా సైన్యాన్ని తయారు చేశారు. దాంతో రాజు తన కుటుంబంతో కశ్మీరు వదిలి వెళ్ళిపోయేందుకు సిద్ధమయ్యాడు. అందుకు వీరు అనుమతినిచ్చారు. దాంతో, రాజు తన పరివారంతో కశ్మీరు వదిలి పర్వత ప్రాంతాలకు వెళ్ళాడు. అతడు వెళ్తుంటే దారిదోపిడిగాళ్ళు రాచస్త్రీలను ఎత్తుకుపోయారు. ప్రజలు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ వీడ్కోలు పలికారు. రాజు కూడా కశ్మీరు దాటిన తరువాత ఒక్కసారి వెనక్కు తిరిగి తాను వదిలి వచ్చిన తన సామ్రాజ్యాన్ని చూసుకున్నాడు.

ఈ భాగాన్ని కల్హణుడు కరుణ రసంతో నింపేస్తాడు. ఒక రాజు అధికార మదంతో తనకు ఎదురులేదని విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ, శ్రేయోభిలాషుల సలహాలను పెడచెవిన పెట్టి, దుష్టుల కుతంత్రాలకు, మాయమాటలకు లొంగిపోయి మంచివారందరినీ దూరం చేసుకుంటే అతనికే కాదు, అతని రాజ్యానికి, రాజ్యంలోని ప్రజలకు కలిగే అనర్థాలను కల్హణుడు అద్భుతంగా చూపించాడు.

దీంతో మొదటి తరంగం పూర్తవుతుంది.

ఆరంభంలో కశ్మీరు రాజ్యాన్ని గెలుచుకుని కూడా కశ్మీరును పార్వతిగా భావించి రాణి యశోవతిని రాజ్యంపై నిలిపిన కృష్ణుడి నుంచి, చివరికి రాజు కట్టుబట్టలతో ప్రాణాలు అరచేత పట్టుకుని రాజ్యం వదిలి అడవులలోకి పారిపోయే దుస్థితి వరకూ మొదటి తరంగం వర్ణిస్తుంది. రాజుల పరంపరను, వారు రాజ్యం చేసిన కాలాన్ని వివరిస్తుంది. అవసరమైన చోట కవిత్వం గుప్పిస్తుంది. అవకాశం దొరికినప్పుడు నీతులు చెప్తుంది. జీవిత సత్యాలను వివరిస్తుంది. జగతి రీతిని విశదపరుస్తుంది. గతం నుండి నేర్చుకోవలసిన గుణపాఠాలను బోధిస్తుంది. రాజుల జీవితాలను, వారి ప్రవర్తనలను చూపిస్తూ వారు పొందిన ఫలితాలను వివరిస్తుంది. అంటే, భారతీయుల దృష్టిలో చరిత్ర రచన అంటే ఏ రాజు తరువాత ఏ రాజు వచ్చాడు?, ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది?, ఏ రాజు ఏం చేశాడు? అన్నవాటి వివరణతో పాటు ఈ రాజు జీవితం ద్వారా భావితరాలు ఏం గ్రహించాలి? ఈ రాజు జీవితం ఎటువంటి పాఠాలు నేర్పుతోంది? ఈ సంఘటనల వల్ల ఎలాంటి ఫలితం వచ్చింది? వంటి విషయాలను గమనిస్తూ వర్తమానాన్ని చక్కదిద్దుకుంటూ భవిష్యత్తుకు బంగారు బాట వేసే విధంగా చరిత్రను అధ్యయనం చేయటం అన్నమాట!

భారతీయుల దృష్టిలో చరిత్ర ఒక నిర్జీవ, చైతన్య రహిత పదార్థం కాదు. చరిత్ర గతం మాత్రమే కాదు. భారతీయుల దృష్టిలో ఈ విశ్వం నిత్య చైతన్య, నిత్య పరిణామశీలి. ప్రతీదీ మరోదానిపై ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రభావాన్ని, ఫలితాన్ని అధ్యయనం చేస్తూ సాగటం కోసం చరిత్ర. చరిత్ర అధ్యయనంలో మరొక కోణం ఉంది.

ప్రతి వ్యక్తి ఎంతటి సామాన్యుడయినా ఈ విశ్వ ప్రణాళికలో అతని ప్రాధాన్యం అతనిది. ప్రతి వ్యక్తి తాను క్షణికుడు మాత్రమే కాదని, తన ప్రతి చర్య పై గతం ప్రభావం ఉంటుందని, తన ప్రతి చర్య భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా మెలగాలి.

యత్యాశ్రితః కిల సమాశ్రణీయ లభ్యాం నిన్ద్యాం గతింజగతి సర్వజనార్చితాంవా।
గచ్ఛత్య ధస్త్రుణ గుణ్వా శ్రిత కూపయంత్రః పుష్యాశ్రయీ సురశిరోభవి రూఢిమేతి॥
(కల్హణ రాజతరంగిణి I, 284)

నాగరాజు కూతురిని మోహించి తాను నాశనమై, కశ్మీరు నాశనానికి కారకుడయిన కిన్నెరుడి తరువాత అతడి కొడుకు రాజ్యానికి వచ్చి సలక్షణంగా పాలిస్తాడు. కశ్మీరులో శాంతి నెలకొల్పుతాడు. పునర్నిర్మిస్తాడు. ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. ఈ విషయం తెలిపిన తరువాత కల్హణుడు చేసిన వ్యాఖ్య ఇది. నరుడిని ఆశ్రయించినవారు నాశనమయ్యారు. ఉత్తముడైన అతడి కొడుకును ఆశ్రయించినవారు సుఖశాంతులు పొందారు. కాబట్టి వ్యక్తులు తాము ఆశ్రయం పొందినవారిని అనుసరించి సుఖదుఃఖాలు పొందుతారు. తాము ఆశ్రయించినవారు ప్రజల మెప్పు పొందితే తాము మెప్పు పొందుతారు. వారు నిందాపాత్రులయితే, ఆశ్రయించినవారూ నిందలను అనుభవిస్తారు. గిలకను ఆశ్రయించిన తాడు పాతాళానికి పోతోంది. అదే పూలను ఆశ్రయించిన దారం దేవతల శిరస్సుపై నిలుస్తుంది. అంటే, వ్యక్తి తాను ఎలాంటి వాడి సమక్షంలో ఉంటున్నాడు, ఎలాంటి వాడితో స్నేహం చేయాలి, ఎలాంటి వాడిని ఆశ్రయిస్తున్నాడు వంటి విషయాలను విశ్లేషించి విచక్షణను ఉపయోగించాలి అన్నమాట. చరిత్ర అన్నది మానవ జీవిత గాథ. పలు జీవిత చరిత్రలను అభ్యసించటం వల్ల, పరిశీలించి విశ్లేషించటం వల్ల జగతి రీతి బోధపడుతుంది. ప్రపంచ ప్రణాళిక అర్థమవుతుంది. ఇందుకోసం చరిత్ర చదవాలి. ఇతిహాసాలు, పురాణాలు ఇందుకోసమే.

అనుచితంగా ప్రవర్తించేవారు రాక్షసులు. ప్రజలకు మేలు చేసేవారు, ఉత్తమ ప్రవర్తన కలవారు దేవతలు. రాక్షసులు చెడు. అవినీతి, అధర్మం. దేవతలు నీతి, సత్ప్రవర్తన, శీలం, ధర్మం. ఈ ప్రపంచంలో నిత్యం మంచి, చెడుల మధ్య ఘర్షణ సాగుతుంది. ఇందులో ‘సత్యమేవజయతే’. రామాయణమైనా, భారతమైనా, రాజతరంగిణి అయినా నిరూపించేది ఇదే. వాటి నుంచి గ్రహించాల్సింది ఇదే. భారతీయ వాఙ్మయంలో ఏ రచన అయినా అది నిరూపించేది ఇదే. దాని లక్ష్యం ఇదే. అందుకే భారతీయ వాఙ్మయంలో చివరికి మంచి గెలుస్తుంది. ప్రజలను బాధించిన వాడు, వాడు ఎంత మంచి ఉద్దేశంతో ప్రజలను బాధించినా, దుష్టుడే. అందుకు తగ్గ శిక్షను అనుభవించాల్సిందే. దాని నుంచి తప్పించుకునే ప్రసక్తి లేదు. చేసిన కర్మఫలం అనుభవించాల్సిందే.

మొదటి తరంగం క్రమంగా దిగజారుతున్న విలువలు, గుణాలు, జీవన విధానం వంటి విషయాలను ప్రదర్శిస్తుంది. కశ్మీరుపై మ్లేచ్ఛుల దాడులు, వాటిని అణచేందుకు రాక్షసుల్లా ప్రవర్తించే రాజులను చూపిస్తుంది. మంచి రాజులు, అందరినీ ఆదరించి, అన్ని రకాల ఆలోచనలను ఆహ్వానించిన రాజులను చూపిస్తుంది. తాత్కాలిక మోహాలు, ప్రలోభాలకు లొంగి తామే కాదు, తమ వంశాన్నీ, తమపై ఆధారపడిన ప్రజలను సర్వనాశనం చేసిన రాజుల చరిత్రను చూపిస్తుంది. ఆరంభంలో సక్రమంగా ఉండి, అధికార అహంకారానికి లొంగి, చుట్టూ చేరి తప్పుదారి పట్టించే పరాన్నజీవుల ప్రలోభంలో పడి, కర్తవ్యాన్ని విస్మరించి, ధర్మం తప్పిన రాజులు, వారి వల్ల కష్టాల పాలయ్యే ప్రజలను గురించి చెప్తుంది. అంటే, మొదటి తరంగం క్రీ.పూ.3450 సంవత్సరం నుండి క్రీ.పూ. 285వ సంవత్సరం వరకూ కశ్మీరు చరిత్రను ప్రత్యక్షంగా, భారతదేశ చరిత్రను పరోక్షంగా, భారతీయ సామాజిక ధార్మిక జీవన రూపాన్ని, అంతర్లీనంగా ప్రదర్శిస్తుందన్న మాట. సింధువును బిందువులో చూపించటం ఇది. మూడవ గోనందుడి కాలం క్రీ.పూ. 1182 నుంచి అంధయుధిష్ఠిరుడి కాలం క్రీ.పూ.272 వరకు అంటే దాదాపుగా 910 ఏళ్ళ అవిచ్ఛిన్నమైన చరిత్రను రాజుల పరంపరను, వారి పాలనాకాలాన్ని ప్రదర్శిస్తుంది.

ఇక రెండవ తరంగాన్ని అనుభవిద్దాం.

(ఇంకా ఉంది)

Exit mobile version