Site icon Sanchika

కశ్మీర రాజతరంగిణి-41

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

దగ్ధాంగార కదంబకే విలుఠతః స్తోకోన్మిషత్తేజసో కేథా వహ్ని కణస్య శక్తిమతులా మాధాతుకామో హఠాత్।
తన్నిర్వాపణ మిచ్ఛతః ప్రతేనుతే పుంసః సమీపస్థితే సంతాపదృతభూరి సర్పిషిఘాటే పానీయ కుంభ భ్రమమ్॥
(కశ్మీర రాజతరంగిణి II – 78)

[dropcap]బూ[/dropcap]డిదలో అణగి ఉన్న నిప్పు కణానికి అత్యున్నత శక్తినివ్వాలని విధాత అనుకుంటే, ఆ నిప్పును ఆర్పాలనుకున్న వ్యక్తి, దాన్ని ఆర్పేందుకు  నీళ్ళున్నాయన్న భ్రమతో, నెయ్యి నిండిన కుండను ఆ నిప్పు కణంపై పోసేట్టు చేస్తాడు.

చరిత్ర రచయితలు రాజతరంగిణిలోని మొదటి మూడు తరంగాలను చరిత్ర కాదని కొట్టిపారేస్తారు. వారి బుద్ధికి అందని గాథలు అనేకం ఈ మొదటి మూడు భాగాలలో ఉన్నాయి. మాయలు, మంత్రాలు వంటివి నిండిన గాథలు కనబడగానే ‘ఇదంతా కట్టుకథలు, అభూతకల్పనలు’ అని వ్యాఖ్యానించి వాటికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ వారి సిద్ధాంతాలకు బలాన్నిచ్చేటువంటి రీతిలో విశ్లేషించదగ్గ గాథలకు మాత్రం విశేష ప్రచారం ఇచ్చి మన గురించి మనకు అపోహలు సృష్టించారు. న్యూనతా భావానికి గురి చేశారు.

చరిత్ర రచనలో లభ్యమైన ఆధారాలతో పాటు ప్రచారంలో ఉన్న గాథలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీరగాథలు, జానపదుల పాటలు, తరతరాలుగా అందుతున్న కథలు వంటి వాటికి కూడా చరిత్ర నిర్మాణంలో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కల్హణుడు అదే చేశాడు. కానీ భారతీయ జీవన విధానం, నమ్మకాలన్నిటినీ చిన్నచూపు చూసేవారు, చరిత్రను చులకన భావంతో పరిశీలించి, విశ్లేషిస్తే నమ్మకాలు అంధవిశ్వాసాలవుతాయి, ప్రజలలో ప్రచారంలో ఉన్న ప్రాచీన గాథలు పుక్కిటి పురాణాలవుతాయి. అలాంటి గాథనే రాజతరంగిణిలో కల్హణుడు సేకరించి పొందుపరిచిన సంధిమతి కథ.

సంతానం లేకుండా కశ్మీర రాజు మరణించటంతో మరో వంశానికి చెందిన విజయుడు కశ్మీరు రాజయ్యాడు. ఆరంభంలో అతను చక్కగా పాలించాడు. అతడికి సంధిమతి అని ఒక గొప్ప వ్యక్తి మంత్రిగా ఉండేవాడు. సంధిమతి తెలివైనవాడు. ప్రజల అభిమానం చూరగొన్నవాడు. గొప్ప శివభక్తుడు. అతడంటే అసూయ కలవారు రాజుకు సంధిమతి గురించి లేనిపోనివి కల్పించి చెప్పారు. రాజు వారి మాటలు నమ్మేడు. సంధిమతి తనని పదవీచ్యుతుడిని చేసి సింహాసనం ఆక్రమించాలని చూస్తున్నాడని భయపడ్డాడు. సంధిమతిని అవమానించాడు. శత్రువుగా భావించాడు. సంధిమతిని జైలులో ఉంచాడు. పదేళ్ళు సంకెళ్ళతో జైలులో ఉన్నాడు సంధిమతి.

రాజుకు అంత్యదశ సమీపించింది. సంతానం లేదు. తన తరువాత ఎవరు రాజవుతారో తెలియదు. ఎవరు రాజయినా ఫరవాలేదు, కాని సంధిమతి రాజు కాకూడదు. ఇదొక రకమైన మనస్తత్వం. తనకు దక్కకున్నా ఫరవాలేదు, తనకు నచ్చని వాడికి దక్కకూడదు. వాడికి దక్కకుండా ఉండేందుకు ఎంత పనికయినా దిగజారుతాడు.

తన మరణం తరువాత, తనకు వారసుడు లేడు కాబట్టి, ప్రజలందరికీ ప్రీతిపాత్రుడయిన సంధిమతిని ఎక్కడ రాజుగా నిలుపుతారో అన్న భయంతో విజయుడు, సంధిమతిని శూలారోహణం చేయించి చంపేశాడు. సంధిమతి మరణించాడన్న వార్త విన్న తరువాతనే రాజు ప్రాణాలు విడిచాడు. ఈ సందర్భంలో కల్హణుడు పై వ్యాఖ్య చేశాడు. నిప్పు కణిక రగిలించాలని విధాత అనుకుటే, ఎవరెంతగా దాన్ని ఆర్పాలని ప్రయత్నించినా అది ఆరదు. ప్రజ్వరిల్లి తీరుతుంది. ఈ సత్యం అందరూ గ్రహించాలన్నది కల్హణుడి ఆశయం.

విజయుడు సంధిమతిని చూసి అసూయపడ్డాడు. అతడిని కారాగారంలో బంధించాడు. అయినా సంతృప్తి చెందక శూలారోహణం చేసి చంపించాడు. తాను మరణించాడు.  రాజుకు వారసుడు లేకపోవడంతో, కశ్మీరం కొన్నాళ్ళు రాజు లేకుండా ఉంది. రాజ్యం అల్లకల్లోలమయింది. అంటే, తన తరువాత రాజ్యం ఏమైనా పర్వాలేదు, సంధిమతి మాత్రం రాజు కాకూడదు. కానీ దైవం సంధిమతిని రాజుని చేయాలని సంకల్పించింది. సంధిమతి రాజు అవుతాడు. మరణించిన సంధిమతి రాజు ఎలా అవుతాడు? ఇది భారతీయ సంప్రదాయాలు, విశ్వాసాలపై నమ్మకం లేని వారికి అర్థం కాలేదు. అర్థం కాని దాన్ని దూషించటం, అవహేళన చేయటం అజ్ఞానుల లక్షణం. అర్థం కాని దాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించటం విజ్ఞుల లక్షణం. అర్థం కాని దాన్ని చూసి భయపడటం మూర్ఖ లక్షణం. సంధిమతి గాథను నమ్మదగనిదని చరిత్ర రచయితలు భావిస్తారు. మనకి తెలిసిన విషయాలతో తూచి చూస్తే నమ్మదగనిదిగా అనిపిస్తుంది. కానీ సంధిమతి కశ్మీరుకు రాజయ్యాడు. ఏ సంధిమతినయితే రాజు కాకూడదని కశ్మీర రాజు చంపించాడో, ఆ సంధిమతి రాజయ్యాడు.

ఒక సంఘటన జరిగిందంటే, చూసిన ప్రత్యక్ష సాక్షులంతా ఒకే రకంగా జరిగిందని చెప్పలేరు. ఎవరెవరి దృక్పథం నుంచి, ఎవరెవరి అవగాహన ఆధారంగా  వారు సంఘటనని వివరిస్తారు. ఎవరికి వారు తాము చూసిందే నిజమని నమ్ముతారు. ఇది చరిత్రలో జరిగిన సంఘటనలకూ వర్తిస్తుంది. సంధిమతి గురించి ప్రచారంలో ఉన్న గాథను కల్హణుడు రాశాడు. అది నిజమా? ఇలా జరగటం సాధ్యం కాదు,  ‘ఇది మూర్ఖత్వం’ అని అనుకుంటే దొరికేది అంతే. ఇది ఎలాగో జరిగి ఉంటుంది. ఇలా ప్రచారమమయింది అనుకుని ముందుకు సాగిపోవాలి.

ఈ విషయం గురించి వ్యాఖ్యానిస్తూ విశ్వనాథ “లోకములో భౌతికములేకాక,  అతి భౌతికములుండనే యున్నవి. భూతములు, దయ్యములు, యోగశక్తులు మొదలైన వెన్నియో ఒక్క హిందూదేశమునందేలేవు, పర దేశములందునూ సమృద్ధిగా కలవు. ఈ ఆధునిక నాగరికత యన్న పేరు చెలామణి అగుచున్నదియు పాశ్చాత్య చరిత్ర కారులు, ఆ రాజకీయ వేత్తలు, మన దేశములను జయించి నల్ల జాతులు మూఢవిశ్వాసములు కలవారని వారి యాధిక్యమును నిరూపించుకొనుకు మనలోనున్న మూఢులను మోసము చేయుటకొరకు నిర్మించిన పథకము. మన పండితులకు వారు వ్రాసినదే ప్రమాణము కాని, తాము చూచినది ప్రమాణము కాకపోవుచున్నది” అంటారు, సంధిమతి గాథ ఆధారంగా రచించిన సంజీవకరణి నవల ముందుమాటలో.

సంధిమతి గురువు ఈశానుడు. తన శిష్యుడికి పట్టిన దుర్గతికి బాధపడి అతడికి దహన సంస్కారాలు చేసేందుకు శ్మశానానికి వెళ్తాడు. అక్కడ ఎముకల గూడును చూస్తాడు. నక్కలు ఎముకలను పీకుతూంటాయి. ఈశానుడు, శూలం పై నుంచి అస్థిపంజరాన్ని దింపి సంస్కారాలు చేసేందుకు సిద్ధమవుతుంటే, సంధిమతి నుదుటిపై ‘ఇతడు రాజవుతాడు’ అని కనిపిస్తుంది.

బహుశా కల్హణుడికి కూడా సంధిమతి గాథ ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటుంది. మరణించినవాడు ప్రాణం పొంది రాజయి రాజ్యం చేయటం అతడికీ బోధపడి ఉండదు. దాన్ని నమ్మేందుకు అతడి బుద్ధి ఆమోదించి ఉండదు. కానీ ‘ఇలా జరిగింది’ అని అందరూ అంటున్నారు. కాబట్టి కల్హణుడు ఈ కథను అలాగే ఆమోదించి తీరాలి. దాన్ని సమర్థించాలి. అందుకని ఒక అద్భుతమైన శ్లోకం రచించి, తరువాత పురాణాల నుంచి, చరిత్ర నుంచి ఉదాహరణలు చూపిస్తాడు. అంటే తనని తాను సమర్థించుకునే ప్రయత్నం అన్నమాట.

మనుషులు విధిని వ్యతిరేకించాలని శాయశక్తులా ప్రయత్నిస్తారు. కానీ విధి ఎంత శక్తివంతమైనదంటే, అసంభవం అనిపించే పరిస్థితులలో కూడా, ఎన్ని ప్రతిబంధకాలున్నా, తాను నిర్ణయించినది జరిపి తీరుతుంది.

సంధిమతి లలాట లిఖితం చూసిన ఈశానుడు అదెలా సాధ్యమవుతుందో చూడాలని శ్మశానంలో రహస్యంగా దాక్కుంటాడు. ఆ రాత్రి కొందరు యోగినులు శ్మశానానికి వస్తారు. వారు సంధిమతి కళేబరాన్ని చూస్తారు. ఒక్కొక్కరు ఒకో అంగం అతడికి ప్రసాదిస్తారు.  అతడితో శృంగారం జరపాలని అతడికి ప్రాణం పోస్తారు. తెల్లవారుతుంటే ఈశానుడికి ఓ సందేహం వస్తుంది. వీళ్ళు వెళ్ళిపోతూ, సంధిమతి అస్థిపంజరం నుంచి ఎవరు ఇచ్చిన అంగాన్ని వారు తీసుకెళ్ళిపోతారేమోనన్న భయంతో తెల్లవారే లోపల అరుస్తూ పరిగెడతాడు. యోగినులు అదృశ్యులవుతారు. సంధిమతిని ఈశానుడు కౌగిలించుకుంటాడు. కల్హణుడి రచన ఇక్కడ ఎంత సహజంగా ఉంటుందంటే, చదువుతున్న పాఠకుడికి ఇలాగే జరిగి ఉంటుందనిపిస్తుంది. ఎవరినయితే కలలో కూడా కలవటం కష్టమో, అతడిని కౌగిలించటం ఎంతో ఉత్తేజానికి దారి తీస్తుంది. ఈశానుడు అలాంటి ఉత్తేజాన్ని అనుభవిస్తాడు. ఆ తరువాత సంధిమతి, ఈశానుడు కలసి మానవ జీవితం గురించి, అశాశ్వతమూ, వ్యర్థమూ అయిన మానవ సంవేదనల గురించి అత్యద్భుతమైన ప్రపంచ పరిణామ క్రమం గురించి చర్చించుకుంటారు.

ఇంతలో సంధిమతి జీవితుడయ్యాడన్న వార్త నగరవాసులకు తెలుస్తుంది. శ్రీనగర వాసులు, మంత్రులు అందరూ అక్కడికి వస్తారు. అతడిని రాజ్యం స్వీకరించమని అభ్యర్థిస్తారు. సంధిమతి మహాశివభక్తుడు. అతడికి ఎలాంటి కోరికలు లేవు. అందుకని రాజ్యాన్ని తిరస్కరిస్తాడు. కానీ గురువాజ్ఞను అనుసరించి రాజ్య నిర్వహణ భారం స్వీకరిస్తాడు. సంధిమతి లాంటి రాజు ప్రపంచంలో ఎక్కడయినా దొరకటం దుర్లభం. కేవలం భారత దేశంలోనే, భారతీయ ధర్మంలోనే ఇలాంటి రాజులుంటారు.

సంధిమతి యోగీశ్వరుడు. యోగి రాజు అయితే ఎలా ఉంటుందంటే సంధిమతిని చూస్తే చాలు. ఆయనకు శివుడి ధ్యాస తప్ప మరొకటి లేదు. సంధిమతి శివభక్తిని కల్హణుడు ఎంతో మధురంగా, భక్తి శ్రద్ధలతో వర్ణిస్తాడు. నిజానికి ఆ వర్ణనను పంచుకోవాలని ఉన్నా, గ్రంథ విస్తరణ భీతితో ముందుకు సాగాల్సి ఉంటుంది. మన అసలు లక్ష్యం జోనరాజు, ఆ తరువాత రచించిన రాజతరంగిణిల అనువాదం. కాని జోనరాజు అనువాదం హఠాత్తుగా ఆరంభిస్తే, కథ సగం నుంచి వింటున్నట్టు ఉంటుందని కల్హణ రాజతరంగిణిని టూకీగా పరిచయం చేసుకుంటున్నాం. కానీ రాజతరంగిణిలోని గాథలు ఎంతో  అద్భుతమైనవి.  విజ్ఞానదాయకమూ, ఆలోచనాత్మాకమూ అయి మన దేశం గురించి, ధర్మం గురించి, జీవన విధానం గురించి ఉన్న పలు అపోహలను తొలగించగల శక్తివంతమైనవి.  వాటిని ప్రస్తావించకుండా ముందుకు సాగాలంటే – ప్రాముఖ్యమైన దాన్ని వదిలి ముందుకు సాగిన నేర భావన కలుగుతుంది. అందుకని వీలయినంత సంక్షిప్తంగా కల్హణ రాజతరంగిణిని పరిచయం చేసుకుంటూ అసలు లక్ష్యమైన  జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టు, శకుల అనువాదం వైపు సాగాల్సి ఉంటుంది.

సంధిమతి రాజు అయినా ఎలాంటి అధికారం కోసం, ఐశ్వర్యం కోసం, భోగలాలస కోసం అర్రులు సాచలేదు. ఆయన రాజభవనంలో నివసించలేదు. నగరానికి ఆవల పర్ణశాలను నిర్మించుకుని నివసించాడు. రోజూ వెయ్యి శివలింగాలను అభిషేకించిన తరువాతనే రాచవ్యవహారాలు ఆరంభించేవాడు. అతడు ఎటువెళ్ళినా శివలింగమే కనిపించేందుకు కశ్మీరంతా శివలింగాలు ప్రతిష్ఠించారు ప్రజలు. కశ్మీరులో ఎటు చూసినా శివుడు, నందీశ్వరుడు, త్రిశూలాలే కనిపించేవి. అడుగడుగూ శివమయమై కశ్మీరు అత్యంత పవిత్రభూమిలా విలసిల్లింది. ఇలాంటి రాజు పరిపాలిస్తుండడంతో కశ్మీరు ప్రజలు ధనధాన్యలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించారు.

అత్యద్భుతం రాజ్యలాభమిత్థం సఫలయంకృతే।
పంచాశతమ్ త్రివర్షో నామత్సక్రామత్స వత్సరాన్॥
(కశ్మీర రాజతరంగిణి II – 142)

ఈ రకంగా తన జీవితాన్ని సాఫల్యం చేసుకుంటూ, రాజ్య కార్యనిర్వహణ భారాన్ని సఫలీకృతంగా నిర్వహిస్తూ సంధిమతి నలభై ఏడేళ్ళు రాజ్యం చేశాడు.

కాలం గడుస్తున్న కొద్దీ సంధిమతికి ఆధ్యాత్మిక దృష్టి ఎక్కువై రాజ్యపాలనపై దృష్టి తగ్గడంతో ప్రజలలో అసంతృప్తి పెరిగింది. వారు సంధిమతికి ప్రత్యామ్నాయం కోసం వెతకటం ఆరంభించారు. వారి దృష్టి అంధయుధిష్ఠిరుడి మునిమనుమడు, గాంధార రాజు సంరక్షణలో ఉన్న గోపాదిత్యుడి కొడుకు పై పడింది. గోపాదిత్యుడి కొడుకు తండ్రి ప్రోద్బలంతో ప్రాగ్జోతిష్పురం రాకుమారి అమృతలేఖ స్వయంవరానికి వెళ్ళాడు. ఆమెని వివాహమాడేడు. అతడు మేఘవాహనుడు. అతడిని కశ్మీర ప్రజలు రాజుగా నిర్ణయించటంతో సంధిమతి స్వచ్ఛందంగా రాజ్యాన్ని మేఘవాహనుడికి అప్పగించాడు. ఇన్నాళ్ళకి తనకి విముక్తి లభించిందని సంతోషిస్తూ శివలింగాన్ని తీసుకుని కట్టుబట్టలతో కాలినడకన రాజ్యం విడిచి వెళ్ళాడు. ఈ సంఘటనను కూడా కల్హణుడు అతి గొప్పగా వర్ణిస్తాడు.

ఇలాంటి రాజు ప్రపంచం మొత్తంలో కంచుకాగడా పెట్టి వెతికినా దొరకడు. ప్రజలు రాజ్యం స్వీకరించమని వెంటబడితే రాజ్యభారం వద్దనేవాడు, రాజ్యం స్వీకరించినా అన్ని భోగాలకు దూరంగా ఉండి, యోగిలా జీవిస్తూ నిర్మోహంగా రాజ్యం చేసేవాడూ, నలభై ఏడేళ్ళు రాజ్యం చేసి కూడా ఎలాంటి అధికార వ్యామోహం అంటకుండా, అహంకారాన్ని దరి రానీయకుండా, ప్రజలు మరో రాజును ఎన్నుకోగానే అతడికి రాజ్యం అప్పగించి శివధ్యానంలో సర్వం మరిచి అడవుల్లోకి వెళ్ళిపోయే రాజు సంధిమతి తప్ప మరొకడు దొరకటం కష్టం. ఉన్నా భారతదేశంలోనే తప్ప, మరో దేశంలో ఉండడన్నది నిస్సందేహం. బహుశా మరణాంతరం సంధిమతి జీవితుడవటం కన్నా నిర్మోహంగా రాజ్యం చేసి, రాజభోగాలకు దూరంగా ఉంటూ, తన వయసు అయిపోగానే మరో రాజుకు స్వచ్ఛందంగా రాజ్యం అప్పజెప్పి తపస్సుకు వెళ్ళిపోయే రాజులున్నారని నమ్మటం చరిత్ర రచయితలకు కష్టంగా అనిపించి ఉంటుంది. ఈ సంధిమతి అద్భుతమైన జీవితాన్ని విశ్వనాథ సత్యనారాయణ ‘సంజీవకరణి’ నవలలో ప్రదర్శించారు. సంజీవకరణి సంధిమతి రాజు అయ్యేంతవరకూ ప్రదర్శిస్తుంది.  ‘సంధిమతి’ గాథకు తార్కికమైన వివరణనిస్తూ, సంధిమతి మనస్తత్వాన్ని, భారతీయ ధార్మికతను విశ్లేషిస్తూ, కస్తూరి మురళీకృష్ణ ‘కల్హణ కశ్మీర రాజతరంగిణి’లో ‘సంధిమతి ఆదర్శ జీవితం’ అన్న కథ రాశారు.  సంధిమతి  గురించి మరిన్ని విశేషాలు తెలియాలంటే ఈ రెండు రచనలు చదవచ్చు.

(ఇంకా ఉంది)

Exit mobile version