Site icon Sanchika

కశ్మీర రాజతరంగిణి-43

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

అథ గ్రాహయుతూ భూపానాజ్ఞాం హింసా నివృత్తయే।
స దిగ్జయాయ నిర్వ్యాజ ధర్మచర్యో వినిర్యయా॥
(కల్హణ రాజతరంగిణి III, 27)

[dropcap]ఇ[/dropcap]తర రాజ్యాల రాజులు అహింస పాటించేట్టు, న్యాయంగా పాలనను సాగించేందుకు – ఇతర రాజ్యాలపై దండయాత్రకు బయలుదేరాడు మేఘవాహనుడు. అహింస అందరూ పాటించేట్టు చేయాలన్న పట్టుదల కలవాడు. అహింస ఆదర్శాన్ని అందరూ అమలు చేసేట్టు చేసేందుకు ఇతర రాజ్యాలపై దండయాత్ర చేశాడు. అంటే, ఆధునిక సమాజంలో తాను నమ్మిందే అందరూ గౌరవించాలి, తాను గౌరవించిన దాన్నే అందరూ గౌరవించాలి, తమ సిద్ధాంతమే అందరూ ఆదర్శంగా భావించాలన్న పట్టుదల పట్టి, అవసరమైతే హింసతో నయినా తమ మాటే నెగ్గాలన్న ప్రవర్తన మేఘవాహనుడు పాటించాడన్న మాట. బౌద్ధ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ అందరూ అహింసను అమలు పరచాలని, హింసకు సైతం వెనుకంజ వేయలేదని తెలుస్తుంది. అంటే, ప్రస్తుతం అందరూ చెప్తున్నటు బౌద్ధ ప్రచారం అంత శాంతియుతంగా సాగలేదన్న మాట. ఇతర దేశాలకు బౌద్ధ భిక్షువులు వెళ్ళి ప్రచారం చేసినా, భారత దేశంలో మాత్రం ‘హింస’ కూడా ప్రచారంలో ఓ భాగం అయిందని మేఘవాహనుడి దండయాత్ర నిరూపిస్తుంది.

మేఘవాహనుడి గురించి చెప్తూ కల్హణుడు ఓ కథ చెప్తాడు. ఒక శబరుడు ఓ ఆటవికుడిని దైవానికి బలి ఇవ్వబోతుంటే, అతడిని వారించి మేఘవాహనుడు అడ్డుకుంటాడు. తాను బలి అవ్వటానికి సిద్ధమవుతాడు. అప్పుడు వరుణదేవుడు ప్రత్యక్షమై మేఘవాహనుడి ‘అహింస’ పాటించటంలో అతడి నిజాయితీని పరీక్షించానని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఈ కథ మేఘవాహనుడి గొప్పతనం చూపిస్తుంది. కానీ ‘అహింస’ కోసం ‘హింసా’యుతమైన యుద్ధం చేశాడన్న నిజం కాస్త బాధ కలిగిస్తుంది. ‘అహింస’ అందరూ పాటించేందుకు బౌద్ధం ‘హింస’ జరిపిందన్న విషయం చరిత్రలో ఎవరూ అంతగా చెప్పని విషయం. బౌద్ధ భిక్షువులు దేశమంతా తిరిగి ప్రజలకు ‘అహింస’ బోధిస్తూ, వారిని బౌద్ధులుగా మలచారన్న విషయానికి ఇచ్చిన ప్రాధాన్యం దండయాత్రల వల్ల, బలప్రయోగం వల్ల ‘అహింస’ నేర్పించిన విషయానికి ఇవ్వరు. అంటే, మనం చరిత్రలో ఈ చరిత్ర రచయితలు చెప్పిన విషయాలను పునర్నిర్వచించి, విశ్లేషించాల్సిన అవసరం ఎంతో ఉన్నదన్న మాట.

ఇద్ధమూ రాక్షసుకులం ప్రాణిహింసామ్ నిష్ధ సహః।
స్వమండలం ప్రతికృతీ వ్యవర్తత నరాధిపః॥
(కల్హణ రాజతరంగిణి III, 79)

రాక్షసులు సైతం జంతు బలులు మాని ‘అహింస’ను పాటించేట్టు నిర్దేశించి మేఘవాహనుడు కశ్మీరుకు తిరిగి వచ్చాడు.

కల్హణుడు రాజతరంగిణిలో మేఘవాహనుడు ఇతర రాజులు కూడా ‘అహింస’ పాటించి ‘జంతు హింస’ను నిషేధించేట్టు చేసేందుకు దండయాత్ర చేశాడని చెప్పాడు. సముద్రం దాటి శ్రీలంక చేరుకోగానే శ్రీలంక రాక్షసరాజు విభీషణుడు మేఘవాహనుడి ఆధిక్యం ఒప్పుకుని జంతుబలులను నిషేధించాడు. మేఘవాహనుడు కశ్మీరుకు తిరిగి వచ్చాడు. ఇంతే సమాచారం ఇస్తాడు కల్హణుడు. మేఘవాహనుడు సముద్రం చేరుకోగానే నీరు ఘనీభవించి దారి ఇచ్చేట్టు వరం పొందుతాడు. అలా సముద్రం దాటేడు. మిగతా విషయాలు ఎలా ఉన్నా, మేఘవాహనుడు కశ్మీరు నుంచి శ్రీలంక వరకూ జైత్రయాత్ర చేశాడన్న సూచన రాజతరంగిణి ద్వారా తెలుస్తోంది. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే, కశ్మీరు రాజులు కశ్మీరుకు మాత్రమే పరిమితం కాలేదు. దేశం లోని ఇతర రాజ్యాలు కశ్మీరును పవిత్రంగా చూశాయి తప్ప కశ్మీరును పరిచయం లేని, సంబంధం లేని పరాయి దేశంగా చూడలేదు. కశ్మీరుకు రాజు అవసరం అయితే విక్రమాదిత్యుడి బంధువు కశ్మీరుకు వచ్చాడు. రాజ్యం చేశాడు. మిహిరకులుడు శ్రీలంకను జయించాడు. చోళులను ఓడించాడు. మేఘవాహనుడు కశ్మీరు నుండి బయలుదేరి శ్రీలంక వరకూ ‘అహింస’ను పాటించేట్టు చేశాడు. కానీ చరిత్రలో అశోకుడు దేశమంతా ఏకఛత్రాధిపత్యానికి తెచ్చిన రాజని అంటారు. మహమ్మద్ బీన్ తుఘ్లక్ మొత్తం దేశంపై అధికారం సాధించిన రాజు అంటారు. బ్రిటీష్ వారు దేశాన్ని కలిపారంటారు. స్వాతంత్ర్యం తరువాతనే భారతదేశం ఏర్పడింది అంటారు. అలా నమ్మేవారందరికీ నమస్కారం పెడుతూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎందుకంటే, నిజం గ్రహించిన వారికి చెప్పాల్సిన అవసరం లేదు. నిజం ఒప్పుకోని వారికి ఎంత చెప్పీ లాభం లేదు. ఈ విషయం కల్హణుడికి కూడా తెలుసు.

ఇత్యాద్యద్య తనస్వాపి చరితం తస్య భూపతేః।
పృథగ్జనేశ్వ సంభావ్యం వర్నయంత్ర స్తపామహే॥
(కల్హణ రాజతరంగిణి III, 94)

మేఘవాహనుడికి సంబంధించి మరో కథ చెప్తాడు కల్హణుడు. ఓ బ్రాహ్మణుడి కొడుకు కొన ఊపిరితో ఉంటాడు. జంతుబలి ఇవ్వందే అతడు బ్రతకడని బ్రాహ్మణుడి నమ్మకం. రాజు వల్ల తన కొడుకు ప్రాణం కోల్పోతున్నాడని ఆరోపిస్తాడా బ్రాహ్మణుడు. గతంలో రాజులు బ్రాహ్మణుల ప్రాణాలు కాపాడేందుకు మనుషులనే బలి ఇచ్చారని, ఈ రాజు వల్ల జంతువుల ప్రాణం మనిషి ప్రాణం కన్నా విలువైనదయిందనీ దూషిస్తాడు. అతడి ఫిర్యాదు విన్న మేఘవాహనుడు తెల్లారి సమస్యకు పరిష్కారం ఇస్తానంటాడు. తెల్లారేలోగా దైవం ఆ బ్రాహ్మణుడి కొడుకు ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. అహింస విజయం సాధిస్తుంది. ఆ కథ చెప్పి, ఇలాంటి కథలు బోలెడన్ని ఉన్నాయని పై శ్లోకం రాశాడు కల్హణుడు. ఇలాంటి కథలు సామాన్యులకి నమ్మశక్యంగా ఉండవనీ, ముఖ్యంగా, ఇప్పటి (అంటే కల్హణుడి కాలం నాటికి) రాజులు వీటిని నమ్మరనీ, ఇలాంటి కథలు విని ఇబ్బంది పడతారు, సిగ్గు పడతారనీ అంటున్నాడు కల్హణుడు. అందుకే రచయితలను ‘ద్రష్ట’ అంటారు. వారికి దివ్యదృష్టి ఉంటుంది. వారికి మనుషుల మనస్తత్వాలు తెలుసు. మానవ సమాజ మనస్తత్వం తెలుసు. కల్హణుడు అన్న మాటలు ఇప్పటికీ వర్తిస్తాయి. ఇప్పటికీ ఇలాంటి కథలలోని ‘మంచి’ని గ్రహించి, నచ్చని దాన్ని విస్మరించే విచక్షణ ఆధునిక మేధావులు ప్రదర్శించటం లేదు. రాజు ప్రాణాలు కాపాడటానికి దుర్గాదేవి బ్రాహ్మణ బాలుడిని ఆరోగ్యవంతుడిని చేయటం కట్టుకథగా అనిపిస్తుంది. కానీ కట్టుకథ అన్న భావనను పక్కన పెట్టి, ఈ కథను జాగ్రత్తగా విశ్లేషిస్తే ఆ కథలో పొందుపరిచిన సత్యాలు బోధపడతాయి.

ఈ కథలు ‘అహింస’ను ప్రచారం చేయటంలో మేఘవాహనుడు ఎదుర్కొన్న ఇబ్బందుల స్వరుపాన్ని ప్రదర్శిస్తాయి. మేఘవాహనుడు వాటిని అధిగమించటం చూపిస్తాయి. శబరుడు మొదటి కథలో బలి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాడు. జంతుబలులు, మానవ బలుల ద్వారా దైవాన్ని పూజించే ఆటవికులు మేఘవాహనుడి నిబంధనను వ్యతిరేకించారనీ, మేఘవాహనుడు ఆ ప్రతిఘటనను అధిగమించాడన్నది మొదటి కథ చెప్తుంది.

రెండవ కథలో బ్రాహ్మణుడు రాజు నిర్ణయాన్ని విమర్శిస్తాడు. అంటే, అటు ఆటవిక సమాజం, ఇటు ఉన్నత స్థాయి సమాజం వ్యతిరేకతను సైతం మేఘవాహనుడు అధిగమించాడన్న మాట. పైగా, ఆ కాలంలో బ్రాహ్మణులు సైతం జంతుబలులు ఇచ్చేవారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. బహుశా, రాను రాను, నాగరికత ముదిరి జంతుబలులు సమాజంలో తక్కువ స్థాయి వారు ఇస్తారన్న భావన ప్రబలి ఉంటుంది. రాజతరంగిణి కథ ప్రకారం బ్రాహ్మణులూ జంతుబలులు ఇచ్చేవారు. దీని అర్థం, మన సమాజం ఒకప్పుడు, ఎలా ఉందని మనం అనుకుంటున్నామో అలా లేదు. మన ధర్మం సైతం మౌలికంగా మార్పు లేకున్నా పలు విషయాలలో మారింది. సమయానికి తగ్గట్టు రూపాంతరం చెందుతూ వస్తోంది. అలాంటప్పుడు సమాజం ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నదనుకోవటం కుదరదు. ఇది కూడా మన సామాజిక చరిత్రను సైతం మనం పునర్విమర్శ చేసుకోవాల్సిన ఆవశ్యకతను నిరూపిస్తోంది.

34 ఏళ్ళ పాలన తరువాత మేఘవాహనుడు మరణించటంతో అతని కొడుకు శ్రేష్ఠసేనుడు రాజయ్యాడు. ప్రజలు అతడిని ప్రవరసేనుడు, తుంజీనుడు అన్న పేర్లతో పిలిచేవారు. 30 ఏళ్ళు చక్కగా రాజ్యం చేసిన తరువాత శ్రేష్ఠసేనుడు మరణించాడు. అతనికి ఇద్దరు కుమారులు. హిరణ్యుడు, తోరమాణుడు. వీరిలో హిరణ్యుడు రాజు అయ్యాడు. అయితే, హిరణ్యుడు అచ్చువేసిన నాణేలు సరిగ్గా లేవని తోరమాణుడు వేరే నాణేలను ముద్రించాడు. ఇది హిరణ్యుడికి ఆగ్రహం కలిగించింది. ‘రాజును నేనయితే, నాణేలు తన పేరు మీద ఎలా ముద్రించుకుంటాడు?’ అని  అతడికి కోపం వచ్చి తోరమాణుడిని జైలులో పెట్టాడు. తోరమాణుడి భార్య గర్భవతి. ఆమె ఓ కుమ్మరి ఇంట్లో తల దాచుకుంది. పుట్టిన పిల్లవాడికి ప్రవరసేనుడు అని పేరు పెట్టారు.

ఎదిగిన ప్రవరసేనుడికి నిజం తెలుస్తుంది. ఇంతలో తోరమాణుడు మరణిస్తాడు. దాంతో విరక్తి చెందిన ప్రవరసేనుడు తీర్థయాత్రలకు వెళ్తాడు. ఇంతలో 30 ఏళ్ళు రాజ్యం చేసిన హిరణ్యుడు మరణిస్తాడు. రాజతరంగిణిలో కల్హణుడు రాసింది ఇది.

తత్రా నేహస్యుజ్జయిన్యామ్ శ్రీమాన్వర్షా పరాభిధిః।
ఏకఛత్ర శ్చక్రవర్తీ విక్రమాదిత్య ఇత్యభూత॥
(కల్హణ రాజతరంగిణి III, 125)

ఆ కాలంలో ఉజ్జయినిని విక్రమాదిత్య -హర్షుడు ‘ఏకఛత్ర చక్రవర్తి’గా పాలిస్తూండేవాడు. అతడి దగ్గర మాతృగుప్తుడనే కవి ఉండేవాడు. మాతృగుప్తుడు తన నిజాయితీతో రాజు మెప్పు పొందాడు. ఒకరోజు అందరూ నిద్రిస్తున్నా, మాతృగుప్తుడు మేల్కొని రాజుకు కాపలాగా ఉంటాడు. ఇది చూసిన విక్రమాదిత్యుడు మాతృగుప్తుడికి సరైన సత్కారం చేయాలనుకుంటాడు. ఆ సమయంలో కశ్మీరుకు రాజు లేడు. హిరణ్యుడు, తోరమాణుడు మరణించారు. తోరమాణుడి కొడుకు విరక్తితో తీర్థయాత్రలు చేస్తున్నాడు. కాబట్టి మాతృగుప్తుడిని కశ్మీర రాజుగా నియమించమన్న లేఖ రాసి వార్తాహరులను కశ్మీరు పంపుతాడు. తెల్లారే ఓ పత్రం ఇచ్చి మాతృగుప్తుడిని కశ్మీరు పంపుతాడు. ఆ పత్రం తీసుకుని కశ్మీరు చేరుకున్న మాతృగుప్తుడిని కశ్మీరు మంత్రులు కశ్మీరు రాజుగా విక్రమార్కుడి ఆజ్ఞానుసారం నిలుపుతారు.

నిర్దిష్టః స్వసమానస్త్యం శోధి నః పృథ్వీమిమాం।
మండలాని విలభ్యన్తే యోనేన ప్రతిక్షణమ్॥

“విక్రమాదిత్యుడి ఆజ్ఞానుసారం మీరు తనతో సమానంగా భావించమన్న మాటను మన్నించి ఈనాటి నుంచి కశ్మీరు రాజుగా మిమ్మల్ని ఆమోదిస్తున్నాం. కశ్మీరును రక్షించమన్న అభ్యర్థను ఆమోదించండి” అంటూ కశ్మీరు మంత్రులు మాతృగుప్తుడిని కశ్మీరు రాజుగా నియమించారు.

హిరణ్యుడి దగ్గర నుంచి మాతృగుప్తుడు కశ్మీరు రాజుగా నియమితుడయ్యే వరకు  వివాదాలు చరిత్రపరంగా ఉన్నాయి. తోరమాణుడు, సోదరుడి అనుమతి లేకుండా నాణేలు తన పేరు మీద ముద్రించాడు. ఈ నాణేలు చరిత్ర పరిశోధకులు తోరమాణుడు రాజు అని నిర్ధారించటంలో తోడ్పడాయి. కానీ రాజతరంగిణి ప్రకారం తోరమాణుడు కశ్మీర రాజు కాదు. సోదరులిద్దరూ పరస్పర అవగాహనతో రాజ్యం చేస్తున్నా, అధికారం పెద్దవాడయిన హిర్యణ్యుడిదే. పెద్దవాడవడం వల్ల రాజ్యం వారసత్వంగా అతనికే లభిస్తుంది. అందుకే హిరణ్యుడు ముద్రించిన నాణేలు సరిగ్గా లేవని తోరమాణుడు తన పేరు మీద వేరే నాణేలు ముద్రించాడు. కానీ రాజు తాను కాబట్టి, తన అనుమతి లేకుండా, తోరమాణుడు స్వంత పేరు మీద నాణేలు ముద్రించటం హిర్యణ్యుడికి కోపకారణం అయింది. తోరమాణుడిని జైలులో పెట్టాడు.

సమాచారం సూటిగా ఉంది. దీనిలో వివాదం ఏముంది? అనిపించవచ్చు. వివాదం ‘తోరమాణుడు’ అన్న పేరుతో వస్తుంది. పాశ్చాత్యులు ‘మిహిరకులుడి’ని హుణుడిని చేసి, అతని తండ్రి తోరమాణుడు అని తీర్మానించారు. వారికి అదృష్టవశాత్తు తోరమాణుడు అన్న పేరు రాజతరంగిణిలో కనిపించింది. కాబట్టి కల్హణుడు – కొడుకు మిహిరకులుడు పుట్టిన 700 ఏళ్ళ తరువాత తండ్రి రాజ్యం చేసినట్టు రాశాడు, కాబట్టి కల్హణుడు తప్పయినా రాసి ఉండాలి, లేదా, ఇంకో తోరమాణుడయినా ఉండిఉండాలి అని తీర్మానించారు. ఇంకో తోరమాణుడున్నాడు అంటే మిహిరకులుడి తండ్రి క్షత్రియుడు అని ఒప్పుకోవాల్సి ఉంటుంది. కానీ వారు మిహిరకులుడు హుణుడు, అతని తండ్రి తోరమాణుడు అని తీర్మానించారు. కాబట్టి కల్హణుడయినా తప్పు రాసి ఉండాలి, పాశ్చాత్య చరిత్రకారులయినా తప్పు అర్థం చేసుకొని నిర్ణయించి ఉండాలి. కానీ తమ తప్పు ఒప్పుకోవటం ఎవరికీ ఇష్టం ఉండదు. అందుకని మిహిరకులుడి తండ్రి తోరమాణుడు, మిహిరకులుడు హుణుడు అని నిర్ధారించి, మిహిరకులుడిని ఏడు వందల ఏళ్ల ముందుకు లాక్కువచ్చారు. తోరమాణుడి కొడుకుని చేశారు.

కానీ, తోరమాణుడు కశ్మీరు రాజు కాదు. అతడు ముద్రించిన నాణేలు రాజు పేరు మీద లేవని రాజు అతడిని జైలులో పెట్టాడు. అతడి కొడుకు ప్రవరసేనుడు విరక్తితో తీర్థయాత్రలకు వెళ్లాడు. రాజతరంగిణి స్పష్టంగా ఉంది. రాజుల పాలనాకాలం, వారి వారసుల గురించి కల్హణుడు స్పష్టంగా చెప్తున్నాడు. కానీ దాన్ని ఒప్పుకోవటానికి అహం అడ్డొస్తోంది. దాంతో చరిత్రను మొత్తం తమ ఇష్టం వచ్చినట్టు నిర్ణయించారు [ఈ నిజాన్ని తెలుపుతూ కల్హణుడిని ఎలా పాశ్చాత్యులు తప్పుగా విశ్లేషించారో వివరిస్తూ విశ్వనాథ సత్యనారాయణ పాతిపెట్టిన నాణెములుచారిత్రక నవలను రాశారు]. ఈ పరిస్థితిని జటిలం చేస్తూ రంగంలోకి విక్రమార్కుడు ప్రవేశించాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version