Site icon Sanchika

కశ్మీర రాజతరంగిణి-47

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

జన్మావన్యనువాదినో న మహతామ్ సత్యమ్ స్వభావాః క్వచిత్॥
(కల్హణ రాజతరంగిణి IV, 41)

[dropcap]క[/dropcap]ల్హణ రాజతరంగిణిలో అడుగడుగునా, ప్రాచీన సమాజం గురించి, ఇప్పటి సమాజంలో ప్రచారంలో ఉన్న విషయాలకూ, రాజతరంగిణిలో కల్హణుడు చూపిస్తున్న విషయాలకు నడుమ తీవ్రమైన వ్యత్యాసం కనిపిస్తూంటుంది. ప్రస్తుతం సమాజంలో ప్రాచీన సమాజం గురించి అంతా తమకు తెలిసినట్టు, తమకు తెలిసినదంతా సత్యమైనట్టు, ఆ సత్యానికి తాము ప్రత్యక్ష సాక్షులయినట్టు ప్రకటించటం కనిపిస్తుంది. కానీ కల్హణుడి రాజతరంగిణి లోని విషయాలు తెలుసుకుంటుంటే, ఇజాల బాజాలు, రంగుటద్దాల హ్రస్వదృష్టులు, సిద్ధాంతాల సంకుచిత్వాలు ఏ రకంగా మన చరిత్ర గురించి మన అభిప్రాయాలను వక్రీకరించాయో స్పష్టమవుతుంది.

దుర్లభుడు రాజయ్యాక ప్రతాపాదిత్య పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. అతని రాజ్యంలో రౌహితక (రోహ్తక్) నుంచి వచ్చి కశ్మీరులో స్థిరపడిన ఓ వ్యాపారవేత్త ‘నోన’ అనే వాడుండేవాడు. రాజు నోన భార్య శ్రీనరేంద్ర ప్రభను మోహించాడు. కానీ తాను రాజు అయి, పరాయివాడి భార్యను మోహించటం నేరం అన్న అపరాధ భావనతో క్రుంగిపోయాడు. అనారోగ్యం పాలయ్యాడు. విషయం తెలిసిన ‘నోన’ తన భార్యను, ఆమె అనుమతితో రాజుకు  అర్పించేందుకు సిద్ధమవుతాడు.  రాజు అందుకు ఇష్టపడడు. దాంతో రాజు ఆరోగ్యం కోసం అతను ఆమెను ఓ మందిరానికి  అర్పిస్తాడు. ఆమెను అప్పుడు రాజు దైవప్రసాదంలా స్వీకరిస్తాడు. ఈ సందర్భంలో రాజు మానసిక సంఘర్షణను కల్హణుడు చక్కగా వర్ణిస్తాడు.

‘అపవాదులకు దూరంగా ఉండాల్సిన రాజుకు  దుష్ప్రవర్తన  తగదు. పరాయి వారి భార్యలను అపహరిస్తే, ఇక ధర్మాన్ని ఉల్లంఘించినవారిని ఎవరు శిక్షిస్తారు?’ ఇలా సాగుతాయి రాజు ఆలోచనలు. చరిత్ర పుస్తకాలలో చెప్తున్నట్టు భారతీయ రాజులు  దుష్ప్రవర్తనులు, ప్రజలను పట్టించుకోకుండా విలాసాల్లో మునిగితేలేవారు, మద్యం మత్తులో ప్రజల బాగోగులను విస్మరించేవారూ కారన్న మాట. సామాన్యుల్లా వారి మనసులోనూ నియమాతిక్రమణ జరిగినా, సామాన్యుల కన్నా సులభంగా తమ కోరికలు తీర్చుకునే వీలు ఉన్నా, సామాన్యుల కన్నా అధికంగా మానసిక క్షోభను అనుభవించేవారన్న మాట ఆనాటి రాజులు. రాజు ప్రవర్తన సామాన్యులకు ఆదర్శమవుతుందని, రాజు పొరపాటు చేస్తే, నేరస్థులను శిక్షించే అర్హత కోల్పోతాడన్న విచక్షణ వారికుండేదన్న మాట. ఇలా తమ ప్రతి చర్య ప్రభావం ప్రజలపై ఉంటుందన్న ఆలోచన ప్రదర్శించే భారతీయ రాజుల గురించి ప్రచారంలో ఉన్న అపవాదులను పరిశీలిస్తే  భారతీయ చరిత్రకు జరిగిన అన్యాయం తెలుస్తుంది.   ఇలాంటి కథలను కట్టుకథలుగా కొట్టేస్తారు. కట్టుకథలను అసలు కథలని ప్రచారం చేస్తారు.

రాజతరంగిణి రాసిన కల్హణుడు ప్రతాపాదిత్యుడి ప్రవర్తనను సమర్థించలేదు. రాజు మానసిక సంఘర్షణను వర్ణించి, వ్యాపారి ఎంత బ్రతిమిలాడినా అతడి భార్యను రాజు స్వీకరించేందుకు ఇష్టపడకపోవడం వివరిస్తాడు. చివరికి ఆమెను దైవానికి అర్పించటం, రాజు ఆమెను స్వీకరించటం చెప్తు, ‘సిగ్గు పడుతూ, విధి వల్ల, దైవం అతని మనసులో కలిగించిన భావనల వల్ల రాజు ఆమెను స్వీకరించేందుకు సిద్ధపడ్డాడు’ అంటాడు. అంటే, ఆమెపై మరులుగొని  కూడా రాజు ఎగిరి గంతేయలేదన్న మాట.

ఈ గాథలో గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆ కాలంలో భార్యను ‘ఆస్తి’గా, ‘వస్తువు’గా భావించటమన్న భావన కనిపించదు. కిన్నరుడు తన భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె వెంట పడ్డాడు కాబట్టి, ఆమె భర్త కిన్నరుడిని వ్యతిరేకించాడు. అతని రాజ్యాన్ని సర్వనాశనం చేశాడు. దుర్లభ వర్ధనుడు, తన  భార్య ఇష్టంతోనే మంత్రితో సంబంధం నెరపుతోందని గ్రహించాడు. ఆమెను అర్థం చేసుకున్నాడు.  ఆమె రహస్యం బయటకు పొక్కనివ్వలేదు. ఆమెతో కలిసి జీవించాడు. ప్రతాపాదిత్యుడు పరాయివాడి భార్యపై మరులుగొంటే, అది తెలిసిన ఆమె భర్త, ఆమెకి కూడా రాజుపై ఇష్టం ఉందని గ్రహించి, ఆమెను స్వీకరించమని రాజును బ్రతిమిలాడుతాడు. రాజు ఒప్పుకోకపోతే, ఆమెను దైవానికి అర్పించి, దైవదత్తంగా స్వీకరించమంటాడు. అంటే, ఆనాడు పురుషుడు స్త్రీని విలాసవస్తువుగా, ఆస్తిగా భావించేకన్నా, మనసున్న మనిషిగా భావించి ఆమె ఇష్టాఇష్టాలను గౌరవించేవాడన్న మాట. మాటిమాటికీ ‘మనువు’ను ప్రస్తావిస్తూ, ప్రతి చిన్న విషయానికి ధర్మాన్ని దూషిస్తూ, భారతీయ ధర్మం నాశనమైతే కానీ స్త్రీకి గౌరవం రాదన్నట్టు గొంతు చించుకుని అరిచేవారికి [ఇతర ఏ ధర్మం ఇంతకన్నా స్త్రీని గౌరవిస్తుందో చెప్పమంటే నోరిప్పరు]   ప్రాచీన భారతదేశం గురించి తెలియదు. తమ కళ్ళ ముందు ఉన్న దాన్ని కూడా సరిగా చూడలేని అంధులు వారు.

రాజతరంగిణి గురించి వ్యాఖ్యానించేవారు,  వర్తకుడు తన భార్యను దైవానికి అర్పించటాన్ని ‘దేవదాసి’ వ్యవస్థగా భావిస్తారు. ఇది దేవదాసి వ్యవస్థకు నిరూపణ కాదు. వర్తకుడు ఆమెను మందిరానికి అర్పించాడు. మందిరంలోని దైవానికి అర్పించాడు.   రాజు ఆమెను స్వీకరించాడు. అంతే తప్ప, దైవానికి అర్పించినవారు రాజుల సొత్తు, రాజులు వారందరినీ అనుభవించేవారని తీర్మానించటం పొరపాటు.

నరేంద్ర ప్రభ, ప్రతాపాదిత్యులకు ముగ్గురు కొడుకులు కలిగారు. చంద్రపీడుడు, తారాపీడుడు, ముక్తపీడుడు. వీళ్ళకే వజ్రాదిత్య, ఉదయాదిత్య, లలితాదిత్య అన్న పేర్లు కూడా ఉన్నాయి. వీరిలో చంద్రపీడుడు ఉత్తముడు. అతని గుణగణాలను వర్ణిస్తూ కల్హణుడు అంటాడు – “మేఘాలు దట్టంగా అలముకున్నప్పుడే స్వచ్ఛమైన నీరు వస్తుంది. మేఘాలు అంటే పొగ. నల్లటి మేఘాలు కాబట్టి  స్వచ్ఛంగా లేని పొగ. స్వచ్ఛం కాని పొగ నుండి స్వచ్ఛమైన నీరు వస్తుంది. కాబట్టి వ్యక్తి ‘గుణగణాలకు’, అతని ‘జన్మ’కు సంబంధం లేదు.”

ఇలాంటి వాక్యాలను ఆధునిక మేధావులు ఉదహరించరు. కల్హణుడు చేసిన ఈ వ్యాఖ్య సమాజంలో జరిగిన  సంఘటన ఆధారంగా వచ్చింది. కట్టుకథనో, కల్పితగాథనో కాదు. నరేంద్రప్రభ వర్తకుడి భార్య. అంటే ఆమెది ‘వైశ్య’ వంశం. రాజు క్షత్రియుడు. కర్కోటనాగు వంశంవాడు. రాజు ఆమెను వివాహమాడేడు. రాజు ఆమెను వివాహమాడటం కోసం ఆమె భర్త ఆమెను వదిలేశాడు. అలాంటి ఆమెకు, రాజుకూ జన్మించినవాడు చంద్రపీడుడు. అత్యుత్తమ గుణాలు కలవాడు. ఈ కాలం భాషలో చెప్పాలంటే వాళ్ళది ‘inter-caste’ వివాహం. Divorcee వివాహం. Second marriage.   కాబట్టి జన్మకు గుణగణాలకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాడు కల్హణుడు. రాజు ఇలాంటి వివాహం చేసుకోవటం ఆనాటి సమాజంలో ఎలాంటి అల్లకల్లోలం కలిగించలేదు. పైగా, చంద్రపీడుడిని రాజుగా సంతోషంగా ఆమోదించారు ప్రజలు. ఈనాటి సమాజాన్ని  ఆనాటి సమాజంతో పోలిస్తే, ఆనాటి సమాజం ఎంత ఉన్నతమైనదో అర్థమవుతుంది.  ఇప్పుడు మనం, ఆధునికం, అభివృద్ధిగా భావించి, ప్రాచీనులు అనాగరికులని అనుకుంటున్నామో, రాజతరంగిణిని పరిశీలిస్తే, వారు మనకన్నా, ఆధునికులు, విశాల భావాలు కలవారు, కులం, మతం, ప్రాంతం వంటి సంకుచిత భావాలకతీతులు అని అర్ధమవుతుంది. ఉచ్చ స్థాయిలో ఉన్న సమాజం, ఎక్కడో దారితప్పి, దిగజారి, తనను తాను మరచిపోయి, వేరే ఏదోగా మారి, తన గతంలోని ఔన్నత్యాన్ని మరచి, దుష్ప్రచారాన్ని నమ్మి, న్యూనతాభావానికి గురవుతూ, తనని తాను ద్వేషించుకునే స్థితిలో వుందన్నమాట. స్వీయ నాశానం వైపు పరుగులిడుతోందన్నమాట.

యాభై ఏళ్ళు సక్రమంగా పాలించిన తరువాత దుర్లభుడు ప్రాణాలు వదిలాడు. అతని తరువాత చంద్రపీడుడు రాజయ్యాడు. రాజుకు ముగ్గురు కొడుకులున్నారు. కానీ వారి నడుమ అధికారం కోసం పోరు లేదు. హత్యలు లేవు. కుట్రలు లేవు.

చంద్రపీడుడి గురించి కల్లణుడి వర్ణన భారతీయ రాజుల వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇతరుల కాలంలో ధర్మం ఒక పాదంపై నిలిచి ఉందట. చంద్రపీడుడు దాన్ని నాలుగు పాదాలపై నిలబెట్టాడు. రాజులు మంత్రుల  సలహాలు తీసుకుంటారు. కానీ చంద్రపీడుడు మంచి, చెడు వివరించి మంత్రులకు మార్గదర్శనం చేసేవాడు. వజ్రం అన్నిటినీ కోస్తుంది, కానీ వజ్రాన్ని ఏదీ కోయలేదు కదా! ఏ పని చేస్తే తరువాత పశ్చాత్తాపపడాల్సి వస్తుందో అలాంటి పనులు రాజు చేసేవాడు కాదు. ఎవరైనా పొగిడితే సిగ్గు పడేవాడు. విమర్శలను ఏకాగ్రతతో విని అర్థం చేసుకుని మంచి చెడు గ్రహించేవాడు. ఒకవేళ తన కోరిక అన్యాయం అనిపిస్తే, ఆ కోరికను వదులుకునేవాడు తప్ప, చట్ట వ్యతిరేక చర్య చేపట్టేవాడు కాదు. ఆయన పాలనా చట్టాన్ని ఏర్పాటు చేశాడు. పాలనా సూత్రాలను ఏర్పాటు చేశాడు.

చంద్రపీడుడి గొప్పతనాన్ని, ప్రాచీన భారతీయ రాజుల ఔన్నత్యాన్ని తెలిపే సంఘటనలు చంద్రపీడుడి పాలనా కాలంలో జరిగాయి. చంద్రపీడుడు ‘త్రిభువన స్వామి’ మందిరాన్ని నిర్మించాలనుకున్నాడు. కానీ ఆ మందిరం నిర్మించాలనుకున్న స్థలంలో చెప్పులు కుట్టుకుని జీవించే చర్మకారుడు తరతరాలుగా జీవిస్తుంటాడు. ప్రస్తుత కులాల లెక్కల ప్రకారం అతడు ‘మాల’ కులానికి చెందినవాడని అనుకోవచ్చు. అతడు రాజాజ్ఞను ధిక్కరిస్తాడు. త్రిభువనేశ్వర మందిర నిర్మాణానికి తరతరాలుగా వస్తున్న తన భూమిని వదులుకొనేందుకు ఇష్టపడడు. ఈ విషయం రాజు వరకూ వెళ్తుంది. అంటే, ఇప్పటిలాగా, భూమి ఇచ్చేందుకు ఇష్టపడని వారిని హింసించి, బెదిరించి, కేసులు పెట్టి, అవసరమైతే చంపించి, భూములు వాడుకోవటం ఆ కాలంలో లేదన్నమాట.

రాజు కూడా “చర్మకారుడేంటి? మా మాట ధిక్కరించటం ఏంటి? జైల్లో వేయండి. చంపండి” లాంటి అహంకారం, అధికార దర్పం ప్రదర్శించలేదు. “ముందుగా అతడి అనుమతి అడగకుండా నిర్మాణం ఎలా ఆరంభించారు?” అని ప్రశ్నిస్తాడు రాజు. అంటే రాజాజ్ఞ ప్రజల అభీష్టానికి వ్యతిరేకమయితే, రాజాజ్ఞనే ఉపసంహరించుకునేవారన్న మాట. సామాన్య ప్రజ అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకునేవారన్న మాట.

నియమ్యతామ్ వినిర్మాణం యద్యాన్యత్ర విధీయతామ్।
పరభూమ్యాపహరణేన స్వకృతమ్ కః కళంకయేత్॥
(కల్హణ రాజతరంగిణి IV, 59)

“నిర్మాణం ఆపేయండి. లేకపోతే మరో స్థలంలో నిర్మించండి. అంతేగానీ, పరభూమిని అన్యాయంగా ఆక్రమించామన్న కళంకంతో పుణ్యకార్యం చేయడం వల్ల పుణ్యం ఏమొస్తుంది? అది ధర్మ విరుద్ధం. ధర్మాన్ని పాటించాల్సిన మనమే ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే ఇక ధర్మాన్ని రక్షించేదెవరు?” అని ప్రశ్నిస్తాడు.

ఎంత గొప్ప రాజులు! ఎంత గొప్ప వ్యక్తిత్వాలు! ఒక చెప్పులు కుట్టేవాడు తన భూమిని మందిర నిర్మాణానికి ఇవ్వనంటే, రాజు ఆ వ్యక్తి మనోభావాలను గౌరవించి, మందిర నిర్మాణాన్ని మానేయటమో, వేరే స్థలంలో నిర్మాణం జరిపించాలనుకోవటమో… ఆధునిక ప్రజాస్వామ్యంలో కూడా జరగనిది ఇది. ప్రజలే ప్రభువులయిన కాలంలో కూడా కుదరని పని ఇది. ఇలాంటిది  ఒక్క భారతదేశంలోనే సాధ్యం అవుతుంది.

ఇంతలో ఆ చెప్పులు కుట్టే వ్యక్తి రాజసభకు వస్తాడు. ఆ స్థలం అప్పగించేందుకు ధనం ఇస్తానంటాడు రాజు. లేకపోతే, గొప్ప భవనం మరో స్థలంలో కట్టిస్తానంటాడు. అప్పుడు ఆ చర్మకారుడు మాట్లాడిన మాటలు ఆశ్చర్యం గొలపటమే కాదు, గర్వం కలిగిస్తాయి. ఈనాడు అణచివేయబడిన వారిగా, వేల సంవత్సరాలుగా భారతీయ ధర్మం కక్షగట్టినట్టు అణచివేస్తూ, అన్ని అధికారాలకు, సౌకర్యాలకు, హక్కులకూ దూరంగా ఉంచుతూ, పశువుల కన్నా ఘోరంగా చూస్తున్నట్టు విద్వేషపూరిత ప్రచారం జరుగుతున్న అట్టడుగు స్థాయికి చెందిన వ్యక్తి, నిండు రాజసభలో, కశ్మీర రాజ్యాధిపతి అయిన రాజుతో మాట్లాడిన మాటలు ఈనాడు ఐ.ఎ.ఎస్.లు, ఐపిఎస్‌లు, బోలెడంత అధికారం కలవారు కూడా ఒక రాజకీయ నాయకుడి ముందు నిలబడి మాట్లాడలేరు. మాట్లాడి బ్రతికి బట్టకట్టలేరు. ఒక చర్మకారుడు రాజుతో ఈ విధంగా మాట్లాడటం, ఆనాటి వ్యవస్థ గొప్పతనం చూపించటమే కాదు, ఈనాడు ప్రాచీనకాలం నుంచీ వివక్షతకు గురయి, అనాదికాలంగా సామాజికంగా అట్టడుగు స్థాయిలో వున్నవాడిగా భావిస్తున్న వ్యక్తి, ప్రాచీన కాలంలో నిజంగా ఎంతటి ఆత్మవిశ్వాసాన్నీ, ఎంతటి ఆత్మగౌరవాన్నీ ప్రదర్శిస్తూ జీవించేవాడో  స్పష్టమవుతుంది.  ప్రస్తుతం కులాలనడుమ విద్వేషాలు రెచ్చగొట్టేట్టు సాగుతున్న ప్రచారంలోని విషం అర్ధమవుతుంది.  ఈనాడు సామాజికంగా ఉన్నతులుగా భావించేవారూ ఇంతటి ధైర్యాన్నీ ఇంతటి తెగువనూ ప్రదర్శించలేరు.

నాహమానః శునోకాస్తి కాకుత్సాత్ స్థాత్పార్థివః పృథుః।
క్షుభ్యన్తీవాధ్య తత్సభ్యాః శంకుభ్యామేవ బధ్యతే॥
(కల్హణ రాజతరంగిణి IV, 67)

రాజా, నేను శునకం కన్నా నీచుడను కాను. నువ్వు రామచంద్రుడి కన్నా గొప్పవాడివి కాదు. అలాంటిది మనమిద్దరం సంభాషిస్తుంటే మంత్రులెందుకు ఆందోళన చెందుతున్నారు?

జాతస్య జాన్తోః సంసారే భంగురః కాయకంచుకః।
అహంతామమతాఖ్యాఖ్యాం శంకుభ్యామేవ బధ్యతే॥
(కల్హణ రాజతరంగిణి IV, 68)

జీవిత చక్రంలో పలు జన్మలెత్తిన మనిషిని ఆత్మశక్తి, స్వార్థం అనే రెండు మేకులు పట్టి ఉంచుతాయి.

కంకణాంగ దహరో దిశోభినాం భవతాం యథా।
నిష్కించనానా మస్మాకం స్వదేహే హంక్రియా తథా॥
(కల్హణ రాజతరంగిణి IV, 69)

నీ శరీరం పలు రకాల అభరాణలతో అలంకృతమై ఎలా మీకు విలువైనదో, అలాగే మాకంటూ ఏమీ లేకపోయినా మా శరీరం మాకు ప్రియమైనది.

గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. లేచి చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. ‘నీకు నువ్వు గొప్పవాడివైతే, నాకు నేను గొప్పవాడిని. నీ ముందు నేను తలవంచటం ఏమిటి?’ అని ఈ ప్రపంచంలో ఎవరైనా మహారాజుతో అన్న సందర్భం ఎక్కడైనా ఉందా? ఉంటే, అది ఒక్క భారతీయ ధర్మంలోనే ఉంటుంది. ఈ జన్మలో రాజు. అంతకు ముందు జన్మలో ఏమిటో తెలియదు. తరువాతి జన్మలో ఏమవుతాడో తెలియదు. ఈ జన్మలన్నింటినీ  బంధించే దారం రెండు కొనల్లో ఒకటి ఆత్మగౌరవం, రెండవది స్వార్థం, సంచిత కర్మలు. దీన్లో రాజు గొప్ప లేదు, చర్మకారుడి తక్కువ లేదు. జరామరణ చక్రంలో బంధితులమే అందరం. ఒకడిని తనకన్నా గొప్పగా భావించటం అజ్ఞానం. ఈ జన్మలో ఫలానా అవుతాం. అది మన తక్కువ కాదు, ఇంకొకడి ఎక్కువ కాదు. దీనిలో ఆత్మన్యూనతాభావానికి తావులేదు. ఒకడికి తలవంఛే ప్రసక్తి లేదు; వాడు రాజు కానీ, దైవం కానీ. ఇది భారత జాతి శక్తి! ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఈ జాతికి పట్టుగొమ్మలు. అలాంటి విశిష్ట వ్యక్తిత్వం కల భారతీయ ధర్మం ఈనాడు ప్రతి చిన్న విషయానికి అభద్రతా భావానికి గురవుతూ, బానిసల కన్నా నీచమైన మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూండటం కాలమహిమ, సమాజ వ్యక్తిత్వ దోషం తప్ప ధర్మంలో దోషం కాదు. ఎప్పుడయితే భారతీయులు పరాయి ప్రచారాల ప్రభావాన్నుంచి తప్పించుకుని తమ ధర్మం అసలు స్వరూపం గ్రహిస్తారో అప్పుడు ‘ఈశావాస్యం ఇదం సర్వం’ అని గ్రహిస్తారు. రాజు సామాన్యుడి ముందు మోకరిల్లుతాడు. సామాన్యుడు రాజును శాసిస్తాడు. ‘The meek shall inherit the Earth’ అంటే ,  బలహీనులు రాజ్యం సంపాదించి బలవంతులపై అధికారం చలాయిస్తారని కాదు. అలా జరిగితే బలహీనుడు బలవంతుడవుతాడు. బలవంతుడు బలహీనుడవుతాడు. మళ్ళీ అణచివేతలు, ప్రతీకారాలు, మళ్ళీ తారుమార్లు. ఇది ఎడతెగని గోల.  ప్రతి వ్యక్తి తన అత్మశక్తిని గుర్తిస్తాడని అర్ధం.  అప్పుడు బలహీనుడు, బలవంతుడు అన్న ప్రసక్తే లేదు. ఎవరి స్థానంలో వారు ఉన్నతులు. ఇది ఒకప్పటి భారతీయ సమాజ స్వరూపం! మాంసం కొట్టేవాడి నుంచి మహారాజు   పరమాత్మ స్వరూప జ్ఞానం తెలుసుకున్న ధర్మం ఇది! శరీరం తప్ప ఏమీలేకున్నా, నీ కన్నా నేనేమి తక్కువ? అని రాజును నిలదీసిన ఆ చర్మకారుడెక్కడ, తరాలుగా అణచివేతకు గురవుతున్నామని, మతం మారి కూడా కులం వదలకుండా అన్ని లాభాలు పొందుతూ ఉన్నత స్థాయికి చేరుకుని తరతరాలుగా లాభాలు పొందుతూ ఇంకా అణచివేతకు గురవుతున్నవారమేనని ఆవేశాలు, ద్వేషాలు ప్రదర్శించేవారెక్కడ? వెనకబాటుతనం మానసికం, భౌతికం కాదు.

నిండు రాజసభలో రాజుకు తాను ఏ రకంగాను తక్కువ కాదని నిరూపించి చివరగా ఆ చర్మకారుడు – “నీకే కనుక నా స్థలం అవసరమైతే మర్యాదగా నా ఇంటికి వచ్చి అభ్యర్థించు. అవసరమున్నవాడు అభ్యర్థించాలి. అంతేకాని, అధికారబలంతో  సాధించాలనుకోవటం అనర్థదాయకం” అంటాడు. రాజు అంగీకరిస్తాడు. మరుసటి రోజు అతడి గుడిసెకు వెళ్ళి స్థలం అభ్యర్థిస్తాడు. అతడు కోరిన ధనం ఇచ్చి, అక్కడ మందిరం కడతాడు. ‘నాభిమానః శుభార్థనాం’ అంటాడు కల్హణుడు. ఎవరయితే ఆత్మసంతృప్తి (శుభం) కోరుతున్నారో, వారికి అహం  ఉండదు (న అభిమానః). ఇదీ భారతీయ ధర్మం [ఈ సంఘటనను ఆధారం చేసుకుని పిలకా గణపతి శాస్త్రి   త్రిభువన స్వామిఅని అద్భుతమైన కథ రాశారు. ‘కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు’లో, ఇదే కథను హుష్క మహారాజు కాలంలో ఆరోపించి కస్తూరి మురళీకృష్ణ ధర్మరక్షణఅన్న కథ రాశారు ].

ఇక్కడ మరో విషయం గమనించాల్సి ఉంటుంది. మహరాజు శివమందిరం త్రిభువన స్వామి మందిరం కట్టించాడు. ప్రకాశదేవిగా ప్రసిద్ధి పొందిన రాణి ‘ప్రకాశిక విహారం’ కట్టించింది. ఇంతకన్నా పరమత సహనానికి నిదర్శనం ఏముంది!

రాజతరంగిణి చదువుతుంటే, అసలు ఏమి కాలం అది! ఏమి వ్యక్తిత్వాలు వారివి! ఎంతటి గొప్ప ఔన్నత్యానికి, ఉత్తమత్వానికి వారసులం మనం అన్న భావన అడుగడుగునా కనిపిస్తుంది. వర్తమానం కళ్ళ ముందు నిలిచి మరింతగా బాధిస్తుంది. బహుశా, ఈ జాతికి ఈ ఉజ్జ్వల వారసత్వాన్ని గుర్తు చేయాలనే వివేకానంద అంత తపన పడి ఉండవచ్చు. వివేకానంద మాటల్లో ప్రతి పదంలో కొట్టొచ్చినట్టు కనబడే వేదన ఇదే. ఇదే వేదన అరవిందో ప్రతి వాక్యంలో తొణికిసలాడుతుంది. అత్యంత ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కల భారతీయ ధర్మం అత్మన్యూనతకు గురవటం అత్యంత బాధాకరం. విశ్వగురువు,  విశ్వం ముందు అజ్ఞానిలా అంధకారంలో నిలబడి విజ్ఞానపు వెలుగు కోసం ఇతరులవైపు ఆశగా చూడటాన్ని మించిన అనౌచిత్యం, దౌర్భాగ్యాలు ఇంకా ఏమైనా ఉన్నాయా!

ఇప్పుడు మరో సంఘటన చెప్తాడు కల్హణుడు.

ఒక బ్రాహ్మణ వనిత రాజభవనం ఎదురుగా ఉపవాస  నిరసన వ్రతం చేస్తుంటుంది. ఆమె భర్త మంచివాడు, ఎలాంటి అనారోగ్యం లేనివాడు, నిద్రలో హఠాత్తుగా మరణిస్తాడు. ఆమె అతని అకాల మరణానికి రాజును దోషిగా ఎంచి, న్యాయం కావాలని ఉపవాసం నిరసన చేస్తూంటుంది. ప్రజల బాగోగులు రాజు బాధ్యత. అకాల మృత్యువు రాజు దోషానికి నిదర్శనం. ఇదీ ఆనాటి సంఘం!

(ఇంకా ఉంది)

Exit mobile version