కశ్మీర రాజతరంగిణి-48

3
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

ఏషైవ మషతీ లజ్జా సదాచారస్య భూపతేః
యదకాలభవో మృత్సుస్తస్య సంస్పృశతి ప్రజ్ఞః
(కల్హణ రాజతరంగిణి IV.84)

[dropcap]త[/dropcap]న భర్త అకాల మరణం చెందాడని ఉపవాస వ్రతం చేస్తున్న బ్రాహ్మణ వనితను రాజ్యసభలో న్యాయాధికారులు ప్రశ్నిస్తారు. ఆమె సమస్య ఏమిటో అడుగుతారు. దానికి ఆమె సమాధానమిస్తూ, తన రాజ్యంలో ఒక వ్యక్తి అకాల మృత్యువు వాత పడ్డాడని తెలిసి కూడా రాజు చూస్తూ ఊరుకోవటం ఏ రకంగా సమంజసం అని ప్రశ్నిస్తుంది. అంతటితో ఆగదు. “కలియుగంలో రాజులు ఇలా అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటారు కాబోలు” అంటుంది. “ఒక ఉత్తముడయిన రాజుకు తన రాజ్యంలో ఓ వ్యక్తి అకాల మృత్యువాత పడటం తీవ్రమైన అవమానం” అంటుంది.

ఈ వాక్యం చదవగానే ఒకసారి మనకు సమకాలీన సమాజం గుర్తుకు వస్తుంది. ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా అకాల మృత్యువులకు అధికారంలో ఉన్నవారిని బాధ్యులను చేయటం జరగుతోంది. అయితే, ఆ కాలంలో ఇలాంటి మృత్యువులు అరుదుగా సంభవించేవి. ఈ కాలంలో సాధారణమయిపోయింది. ఆ మృత్యువులను ప్రతిపక్షాలు రాజకీయంగా లబ్ధి పొందేందుకు వాడుకోవటం, ప్రభుత్వం తనని తాను సమర్థించుకోవటం అనవాయితి అయింది. కానీ, ప్రాచీన కాలంలో కేవలం ఉత్తమ పాలన అందించటం మాత్రమే రాజు బాధ్యత కాదు. ప్రజలు   నైతిక విలువలు పాటించేట్టు చేయటంతో పాటు వారి అధ్యాత్మిక ఎదుగుదలకు కూడా బాధ్యత రాజుదే. రాజ్యంలో ఎవరయినా అకాల మృత్యువాత పడితే దోషం రాజుదే. అందుకే ఆ బ్రాహ్మణ వనిత రాజును నిలదీస్తోంది. “నువ్వు ఎంతో గొప్పవాడివి. కలికాలమా నా భర్త హఠాత్మరణం చెందితే చూస్తూ ఊరుకున్నావు? ” అని అడుగుతోంది.

ఒక చర్మకారుడు రాజును నిండు రాజసభలో ఎదిరించి మాట్లాడటం, తన భూమిని ఇవ్వ నిరాకరించటం, తన భూమి అవసరమైతే తన ఇంటికి వచ్చి అభ్యర్థించాలి అనటం,  రాజు ఆ పని చేయటం, ఒక మహిళ తన భర్త అకాల మృత్యువాత పడటం రాజు దోషం అని రాజును దూషించటం అన్నది ఒక భారతదేశంలోనే సాధ్యం. అందుకే భారతదేశంలోని రాజరికాన్ని ఇతర దేశాల రాచరిక వ్యవస్థతో పోల్చకూడదు.

విదేశాలలో రాజులు, ధనవంతులు, భూస్వాముల ప్రవర్తనతో, వ్యవహారశైలితో భారతదేశంలోని రాజులు, ధనవంతులు, భూస్వాముల నీతిమయ, నైతిక విలువల సహితమైన ప్రవర్తనకు పోలికనే లేదు. ఇతర దేశాలలో రాజుకు మతాధికారులకు నడుమ జరిగిన అధికార పోరాటాలను భారతదేశంలో అరోపించి మన వ్యవస్థను వారి వ్యవస్థ స్థాయికి దిగజార్చకూడదు. అక్కడ మతం అధికారం కోసం తాపత్రయపడింది. ఇక్కడ ధర్మం రాజుతో కలసి ప్రజల సుఖజీవనానికి బాటలు నిర్మించింది. రాజుకు నైతిక విలువలు నేర్పింది. బాధ్యత నేర్పింది. ప్రజలకు  ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్నిచ్చింది. అంటే, అక్కడ మతం అల్లకల్లోలం సృష్టించి, మనుషులను పశువులను చేస్తే, ఇక్కడ ధర్మం ఆధ్యాత్మికత నేర్పి, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడి, ఉత్తమ మానవుల నిర్మాణం సుసాధ్యం చేసింది. ఈ తేడాను గమనించకుండా తమ సంస్కారాన్ననుసరించి, తమకు తెలిసిన దాన్ని ఇక్కడ ఆరోపించి పాశ్చాత్యులు మనలను వాళ్ళ స్థాయికి దింపితే మనం సంతోషంగా దాన్ని ఆమోదించి, ఇంకా దిగజారటంలో పోటీలు పడ్డాం, ఇంకా పడుతూనే ఉన్నాం.

ఆమె నిలదీస్తుంటే రాజు ఆమెకు క్షమార్పణలు చెప్తాడు. తన భర్త అకాల మరణానికి ఎవరయినా కారకులని అనుమానం ఉన్నదేమో అడుగుతాడు. ఆమె మంత్రాలు తెలిసిన మరో బ్రాహ్మణుడు కారణం అని చెప్పుంది. కానీ దానికి నిరూపణలుండవు. పేరు తెచ్చుకోవటంలో విఫలమయిన వారు, జ్ఞానహీనులు, అసూయతో ఇవన్నీ ఉన్న వారికి హాని చేస్తారు. కాబట్టి అలాంటి హీనుడికి రాజు శిక్ష విధించాలని ఆమె కోరుతుంది. రాజు కనక నేరస్థుడిని శిక్షించకపోతే ఆమె తన ఉపవాసాన్ని కొనసాగించి ప్రాణత్యాగం చేస్తానని బెదిరిస్తుంది. అప్పుడు రాజుకు ఇంకో పాపం చుట్టుకుంటుంది.

ఆమె మాటలకు రాజు ఆగ్రహం ప్రదర్శించడు. ముఖం పాలిపోతుంది. ‘నేర నిరూపణ కానిదే ఎలాంటి వాడినీ శిక్షించటం కుదరదు. కాబట్టి ఇలాంటి మాయ మంత్రాలతో మరణానికి కారకుడయ్యాడని శిక్షించటం ఎలా’ అని మథనపడతాడు. ఏం చేయాలో తెలియక త్రిభువన స్వామి పాదాలపై పడి తానూ ఉపవాసం ప్రారంభిస్తాడు. అద్భుతమైన సంఘటన ఇది!

ఒక సామాన్య పౌరురాలి బాధ తీర్చలేనందుకు రాజు సైతం ఆమె లాగా తనూ సమస్య పరిష్కారమయ్యేంత వరకూ ఉపవాసం ఉండటం, నిరాహార దీక్ష స్వీకరించటం అనేది చరిత్రలో ఎక్కడా కనీ వినీ ఎరుగం. అందుకే పాశ్చాత్యులు ఇలాంటివన్నీ కట్టు కథలనీ, ఆధారం లేనివనీ కొట్టిపడేశారు.

ముఖ్యంగా రాజు మందిరంలో తను నమ్మిన దైవం పాదాల వద్ద పడి ఉపవాసం చేయటం, అలా మూడు రోజుల తరువాత దైవం కలలో కనపడి, అనుమానితుడు, గుడి చుట్టు మూడు ప్రదక్షిణలు చేస్తే, అతని పాదముద్రల వెనుక బ్రహ్మహత్య పాతకం కనిపిస్తే అతనే దోషి అని చెప్పటం, ఆ మాంత్రిక బ్రాహ్మణుడి దోషం అలా నిరూపితం అవటం వారికి కొరుకుడు పడదు. కాబట్టి ఇది అభూత కల్పన. దోషం నిరూపితమైన బ్రాహ్మణుడికి, బ్రాహ్మణుడు కాబట్టి మరణ శిక్ష విధించకుండా దేశబహిష్కార శిక్ష విధిస్తాడు రాజు. ఆ బ్రాహ్మణుడు రాజుపై కక్షకడతాడు. రాజు సోదరుడు తారాపీడుడు ఆ మాంత్రిక బ్రాహ్మణుడి సహాయంతో రాజు అకాల మరణానికి కారకుడవుతాడు. ఇక్కడ కల్హణుడు ఎంతో లోతైన వ్యాఖ్యలు చేస్తాడు.

దుష్కర్మదుర్భగాన్భోగాన్భోక్తుమ్ పాపా గుణోన్నతమ్
మృద్రంతి కంటకాన్ర్పాప్తుం కరభా రౌతకమ్
(కల్హణ రాజతరంగిణి IV.113)

తమ జీవితం సుఖమయం చేసుకుందుకు దుష్టులు – ముళ్లను కోరిన ఒంటె మొగలి పూలను నలిపివేసినట్టు మంచి వారికి హాని చేస్తారు.

ఇది మన చుట్టు ప్రతి చిన్న విషయం లోనూ చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. అర్హతలేని వాడు ఆశతో అర్హత ఉన్న వాడిని అణచివేస్తాడు. ముళ్ల కిరీటం కోసం అత్రపడతాడు. దాన్ని తాను సమర్థవంతంగా నిర్వహించలేడు. అందువల్ల తాను ఇబ్బందుల పాలవుతాడు. ఇతరులను ఇబ్బంది పెడతాడు. రాజ్యం కోరిన తారాపీడుడు ఉత్తముడైన సోదరుడిని అన్యాయంగా చంపించి రాజ్యం హస్తగతం చేసుకుంటాడు.

చంద్రపీడుడు ఎనిమిది సంవత్సరాల ఎనిమిది నెలలు రాజ్యం చేసాడు. అతడి తరువాత తారాపీడుడు రాజ్యాధికారం చేపట్టాడు.

తతః ప్రభృతి భ్రూవినాం రాజ్యేచ్ఛూనాం గురూన్ప్రతి
దుష్టాః ప్రవృత్తాం రాజ్యేస్మిన్నభిచారికాః క్రియాః
(కల్హణ రాజతరంగిణి IV.114)

ఇక అప్పటి నుంచీ రాజ్యాధికారం కోసం రాజులు మాయ మంత్రాలు ఇతర దుష్ట పద్ధతులు అవలంబించటం ఆరంభమయింది.

చరిత్ర రచనలో ఇది భాగం. చరిత్ర అంటే కేవలం రాజులు పుట్టిన తేదీలు, మరణించిన తేదీలు, ఎన్నెన్ని రాజ్యాలు గెలిచాడు, ఎంత మంది తలలు నరికాడు వంటి వివరాలు కాదు. చరిత్ర రచనలో పలు పొరలుంటాయి. అనాటి సామాజిక జీవితాన్ని గ్రహించటం నుంచి అప్పటి సామాజిక మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటం, సమాజంలో ధార్మిక ఎదుగుదల, నైతిక విలువలు రూపాంతరం చెందటం, భావితరాలపై ప్రభావం చూపిన అంశాలను విశ్లేషించటం వంటి అనేకానేక విషయాలుంటాయి. తన రాజతరంగిణి రచనలో  ప్రధానంగా కశ్మీర సమాజంలో నైతిక విలువల రూపాంతరం, ధార్మిక వ్యవస్థ, మనస్తత్వాలలో వచ్చిన మార్పులను ప్రదర్శిస్తూ, విశ్లేషిస్తూ భావితరాల వారికి పాఠాలు నేర్పటం ప్రధాన లక్ష్యాలుగా కల్హణుడు నిర్ణయించుకున్నాడు. అయితే, చరిత్ర రచన అంటే  మండుటెడారి లాంటి రచన అని నిర్ణయించుకున్న సృజనాత్మక అభినివేశం లేని చరిత్రకారులకు ఇలాంటి రచన కొరుకుడు పడదు.

తారాపీడుడు అక్రమంగా రాజ్యం సంపాదించటం కశ్మీరు చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం. అంత వరకూ రాజ్యభారం మారటంలో ఎలాంటి వికృతులు లేవు. ఒక రాజు పోతే అతని వారసులు లేకపోతే, ఇంకెవరినో రాజవంశీకులను వెతికి తెచ్చి రాజ్యభారం అప్పచెప్పేవారు. కొందరైతే రాజ్యభారం వద్దని వదలి వెళ్లిపోయారు. ఇంకొందరు రాజ్యధికారాన్ని ఓ బాధ్యతగా స్వీకరించి, తాము పర్ణశాలలో ఉంటూ దైవారాధన చేస్తూ రాజ్యాన్ని సన్యాసిలా పాలించారు. అలాంటి అత్యద్భుతమైన వ్యక్తులు రాజ్యం చేసిన కశ్మీరు కలియుగ ప్రభావంతో దిగజారటం ఆరంభమయిందంటాడు కల్హణుడు. అయితే,  సృష్టిలో సమతౌల్యం ఉంది. కర్మ సిద్ధాంతం ఉంది. ఎలాంటి పనికి అలాంటి ఫలితం ఉంటుంది. అక్రమంగా రాజ్యాన్ని సంపాదించిన వారెవరూ సుఖపడలేదు. రాజ్యభారాన్ని సవ్యంగా అనుభవించలేదు. తాము కష్టపడ్డారు, ప్రజలను కష్టపెట్టారు. దేశాన్ని దిగజార్చారు. ఇది అపుడే కాదు ఇప్పటికీ వర్తిస్తుంది. ఇప్పటికీ కాదు ఎప్పటికీ వర్తిస్తుంది.

ఒకప్పుడు తమ మంత్రాలతో దేవతలను భూమిపైకి దింపిన బ్రాహ్మణులు, ఆ మంత్రాలను నీచపు కోర్కెలకు వినియోగించటం వల్ల, ఆగ్రహించిన దేవతలు బ్రాహ్మణులు శిక్షను విధించినట్టు, తనకు దుష్టపనిలో సహాయ పడటంతో బ్రహ్మణలంటే క్రోధం వహించిన తారాపీడుడు బ్రాహ్మణులందరికీ శిక్ష విధించాడు. అతను తన అణచివేత చర్యల ద్వారా ప్రజలందరినీ భీతిభ్రాంతులను చేశాడు. అయితే బ్రాహ్మణులు మళ్లీ మంత్రాల ప్రయోగం ద్వారా రాజు జీవితాన్ని హరించారు. నాలుగు సంవత్సరాల ఒక్క నెలకు ఆరు రోజులు తక్కువగా రాజ్యం చేశాడు తారాపీడుడు. ఇక్కడ మళ్లీ ఓ గొప్ప సత్యం చెప్పాడు కల్హణుడు. ‘ఎవరైతే ఎదుట వారికి హాని చేస్తాడో, ఆ హానికరమైన చర్య వల్లే అతడు నశిస్తాడు. నిప్పు పొగను కల్పిస్తుంది. ఆ పొగ మేఘమై వర్షించి నిప్పును ఆర్పేస్తుంది. కాబట్టి చెడు పని ద్వారా మంచి ఫలితం ఉండదు. భావితరాల వారు ఇది గ్రహించాలి’ అంటున్నాడు కల్హణుడు.

కల్హణుడి దృష్టిలో తారాపీడుడు దుష్టుడు. కల్హణుడు రాజతరంగిణిని 12వ శతాబ్దంలో రాశాడు. అంటే, తారాపీడుడు రాజ్యం చేసిన దాదాపుగా అయిదారు వందల సంవత్సరాల తరువాత కల్హణుడు రాజతరంగిణి రాశాడు. అప్పటికి తారాపీడుడి అనేక చర్యల  ఫలితాలు ఇంకా ప్రస్ఫుటం కాలేదు. కల్హణుడికి పర్షియన్లు, తుర్కిస్థానీయులు, చైనీయులు, టిబెటన్లు రాసిన అనేక గ్రంథాలు, చరిత్ర రచనలు అందుబాటులో లేవు. కాబట్టి కల్హణుడు తారాపీడుడి అణచివేత, దౌష్ట్యాల గురించి మాత్రమే రాశాడు. తారాపీడుడు అక్రమంగా రాజ్యం సంపాదించటంలో సహాయం చేసిన బ్రాహ్మణులు శాపానికి గురయినట్లు కష్టాలపాలయ్యారన్నాడు. కానీ ఆ కాలంలో కల్హణుడి దృష్టికి రాని సంఘటనలు కొన్ని సంభవించాయి.

చంద్రపీడుడి పాలనాకాలంలో అరబ్బులు భారతదేశంపై దాడులు ప్రారంభించారు. ఈ సమయంలో మహమ్మద్ బీన్ ఖాసిమ్ సింధురాజు ‘దౌహిర్’ను ఓడించాడు. అతని రాజ్యాన్ని ఆక్రమించాడు. ఖాసిమ్ దౌహిరును ఓడించినప్పుడు అతని కొడుకు జయసింహుడు పారిపోయి కశ్మీరు చేరుకున్నాడు. అతనికి అతడి వెంట వచ్చిన ముసల్మానుకు చంద్రపీడుడు ఆశ్రయం ఇచ్చాడు. ముసల్మానుకు మత స్వేచ్ఛనిచ్చాడు. మసీదు కట్టుకోనేందుకు స్థలం ఇచ్చాడు. అయితే వీరిలో జయసింహుడు మళ్లీ సింధురాజ్యనికి వెళ్లి మతం మారిపోయాడు. కశ్మీరులో ఆశ్రయం లభించిన ఇస్లామీయుడు కశ్మీరులో స్థిరపడి, కశ్మీరులో ఇస్లాం బీజాన్ని నాటాడు. ఇస్లాం మతం పట్ల కుతూహలంతో రాజులు అరబ్బు దేశాలనుంచి ముస్లిం మత గురువులను కశ్మీరుకు రప్పించారు. అయితే కశ్మీరులో కల్హణుడి కాలం తరువాత కానీ ఇస్లాం రాజ్యాధికారం సాధించలేకపోయింది. (కశ్మీరులో ఇస్లాం రాజ్యాధికారం సాధించిన విధానం జోనరాజు రాజతరంగిణి ద్వారా తెలుస్తుంది) తన రాజ్యంలో ఇస్లామీయుడికి ఆశ్రయం ఇచ్చాడు కానీ చంద్రపీడుడు ఇస్లాం వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించాడు. కశ్మీరు చుట్టుప్రక్కల ఉన్న హిందు, బౌద్ద రాజులందరినీ కూడగట్టుకున్నాడు. శక్తివంతమైన సైన్యం తయారు చేసుకున్నాడు. ‘ముల్తాన్’ వద్ద ఖాసిమ్‌ను ఎదుర్కొని తరిమివేశాడు. తమతో చేతులు కలపమని చైనా రాజుకు కూడా వర్తమానం పంపించాడు చంద్రపీడుడు. ఇస్లాం సేనలు విస్తరిస్తే చైనాకు కూడా ప్రమాదం అని గుర్తించాడు చంద్రపీడుడు. ఆ కాలంలో వ్యాపార దారులపై అధికారం కీలకమైనది. అరబ్బు సేనలు విజయం సాధిస్తే, వ్యాపార రహదారులు వారి హస్తగతమపోతాయని, అది కశ్మీరుకే కాదు చైనాకు కూడా ప్రమాదకరం అని గ్రహించాడు చంద్రపీడుడు.  తిబ్బత్తు రాజులు (ఆ కాలంలో తిబ్బత్తు శక్తివంతమైన రాజ్యం) ఈ రహదారిని ఆక్రమిస్తే, వారిని తరమటంలో చైనాకు చంద్రపీడుడు సహాయం కూడా చేశాడు. భారతదేశంలో ఆ కాలంలో కనౌజు రాజు యశోవర్మ శక్తిమంతుడు. అతడితో చేతులు కలిపే ప్రయత్నాలు కూడా చేశాడు చంద్రపీడుడు. జలంధర్ వరకూ వచ్చిన మహమ్మద్ ఖాసిమ్ చంద్రపీడుడి శక్తికి వెరచి ‘కాంగ్డా’ వైపు మళ్లాడు. ఈ రకంగా ఉత్తముడు అయిన చంద్రపీడుడు ఎంతో దూరదృష్టి ప్రదర్శించాడు. అతడిని అక్రమంగా హతమార్చి తారాపీడుడు రాజ్యానికి రావటం భారతదేశ చరిత్రలో జరిగిన అనేక దురదృష్టకర సంఘటనలలో ఒకటి. దీనికి తోడు చంద్రపీడుడు ఔదార్యంతో, సహృదయంతో ఆశ్రయమిచ్చిన అరబ్బు వల్ల భవిష్యత్తులో కశ్మీరు ఇస్లాంమయం అవుతుందనీ, అధిక సంఖ్యను చూపి కశ్మీరు తమదేనని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామీయిలు కశ్మీరు విముక్తి కోసం గొంతెత్తుకుని ప్రకటిస్తారని తెలిసి ఉంటే చంద్రపీడుడు ఏం చేసేవాడో! కల్హణుడు ఏం రాసేవాడో! అందుకే ఈనాడు ఆఫ్ఘన్ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు ప్రపంచదేశాలు భయపడుతున్నాయి. శరణార్థుల వేషంలో తీవ్రవాదులు దేశంలో ప్రవేశిస్తారని వణికి పోతున్నాయి. చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్వనివారు చేసిన తప్పులే పదే పదే చేస్తారు. చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. చంద్రాపీడుడు ఆశ్రయం ఇచ్చిన ఇస్లామీయుడు మంచివాడు. తరువాత జరిగిన సంఘటనలతో అతనికి ప్రమేయంలేదు. కానీ, ఇస్లామీయులతో కశ్మీరీయుల సంపర్కం అతనితో ఆరంభమయింది.

అయితే తారాపీడుడు అధిక కాలం రాజ్యం చేయకపోవటం ఒక అదృష్టం. అతని తరువాత అతని సోదరుడు ముక్తాపీడుడు రాజయ్యాడు. లలితాదిత్యుడిగా ఈయన ప్రసిద్ధి పొందాడు. భారతదేశంలో రాజులందరిలోకీ అగ్రగణ్యుడిగా పరిగణించాల్సిన లలితాదిత్యుడి గురించి ఎవరికీ అంతగా తెలియక పోవటం ఒక దురదృష్టం. ఇలాంటి రాజు కనక ఇతర ఏ దేశంలోనో ఉండి ఉంటే ప్రపంచమంతా అతని గురించి పాఠాలు చదివేది. అతడిని ఆరాధ్యదైవం చేసుకునేది. ప్రాతఃస్మరణీయుడిగా భావించేది. అశోకుడు, చంద్రగుప్తుడు, అక్బరు, శ్రీకృష్ణదేవరాయలు వంటి రాజుల కన్నా ముందు పరిగణనకు గురవ్వాల్సిన లలితాదిత్యుడు ఎవరికీ తెలియకపోవటం, దాదాపుగా విస్మృతిలో పడటం భారతదేశ చరిత్రకు తీవ్రమైన అన్యాయం. కేవలం ‘మార్తండ మందిర’ నిర్మాతగా తెలిసే లలితాదిత్యుడి విశ్వరూపం తెలియాలంటే రాజతరంగిణిని మాత్రం పరిశీలిస్తే సరిపోదు. కశ్మీరుకు చెందిన ఇతర రచనలు, కవి వాక్పతి రాసిన ‘గౌడవాహో’తో సహా పలు రచనలు, అరబ్బులు, చైనీయులు, తిబ్బత్తు వారు రాసిన చరిత్ర రచనలన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే కానీ లలితాదిత్యుడి అసలు గొప్పదనం తెలియదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here