Site icon Sanchika

కశ్మీర రాజతరంగిణి-49

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

రాజాశ్రీ లలితాదిత్యః సార్వభౌమస్తతో భవత్।
ప్రాదేశికేశ్వర సృష్టుర్విధేర్బుద్భేర గోచరః॥
(కల్హణ రాజతరంగిణి IV, 126)

[dropcap]ల[/dropcap]లితాదిత్యుడి గొప్పతనాన్ని, ఆ కాలంలో ఆయన ప్రదర్శించిన దూరదృష్టిని, ద్రష్టత్వాన్ని అర్థం చేసుకుని, చరిత్రలో ఆయన ప్రాధాన్యాన్ని అంచనా వేయాలంటే కేవలం రాజతరంగిణిలో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటే సరిపోదు.  కల్హణుడికి తెలియని అనేక విషయాలు ఇప్పుడు మనకు తెలియటం వల్ల, ఆ అంశాలను విశ్లేషిస్తూ కల్హణుడి కాలం వైపు దృష్టి సారిస్తే, కాలప్రవాహంలో ఒక పర్వతం లాంటి వాడు లలితాదిత్యుడని స్పష్టం అవుతుంది. అతని వల్ల కాలగమనం ప్రభావితం అయింది, కశ్మీరు చరిత్ర కొక మెరుపు వచ్చిందని తెలుస్తుంది. భారతదేశ చరిత్రలో ఒక అత్యున్నత ఘట్టం లలితాదిత్యుడి పాలనా కాలం అని  బోధపడుతుంది. లలితాదిత్యుడి చరిత్ర అంటే ఆసియా ఖండం చరిత్ర. ఎందుకంటే ఏ ఇతర భారతీయ రాజు పాలించని విధంగా ఆసియాలో పలు భాగాలపై ఆయన అధికారం నెరపాడు. తనదైన ముద్ర వేశాడు. ఇతర దేశాలతో భారతదేశానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు, రాజకీయ, సాంఘిక సంబంధాలు లలితాదిత్యుడి పాలనా కాలంలో అధికమయ్యాయి. లలితాదిత్యుడు తన సైనిక శక్తితో ఆ కాలం నాటి సూపర్ పవర్ తిబ్బత్తును, శక్తివంతమైన చైనాను అదుపులో పెట్టడమే కాదు, దూసుకువస్తున్న ప్రవాహం లాంటి అరబ్బు సేనలకు అడ్డుకట్ట వేశాడు. కశ్మీరు సామ్రాజ్యాన్ని హిందూకుష్, పామిర్ పర్వత పంక్తులను దాటించాడు. నైతిక విలువలు పతనమయ్యేముందు, దీపం ఆరేముందు గుప్పుమని దేదీప్యమానంగా వెలిగేట్టు అత్యుత్తమ విలువలను ప్రదర్శిస్తూ ఉన్నత ప్రామాణికాలను నిలుపుతూ రాజ్యం  చేసినవాడు లలితాదిత్యుడు.

భారతదేశ చరిత్రలో లలితాదిత్యుడి ఉజ్జ్వల స్థానం గురించి అంచనా వేయాలంటే, లలితాదిత్యుడు రాజ్యానికి వచ్చినప్పటి పరిస్థితులు, కల్హణుడు చెప్పనివి తెలుసుకోవాల్సి ఉంటుంది.

దుర్లభవర్ధనుడు రాజ్యానికి రాగానే కశ్మీరు పరిసర రాజ్యాలపై ఆధిక్యం సాధించాడు. బహుశా దుర్లభవర్ధనుడు ఈ యుద్ధాలలో తలమునకలై ఉన్న సమయంలోనే అనంగలేఖ, మంత్రికి దగ్గరయి ఉంటుంది. దుర్లభవర్ధనుడు కశ్మీరు ఇరుగు పొరుగు రాజ్యాలపై ఆధిక్యం సాధించాడన్న విషయానికి ఆధారాలు – ఆ కాలంలో కశ్మీరు పర్యటించి, రెండేళ్ళు కశ్మీరులో రాచ అతిథిగా నివసించి పలు బౌద్ధ గ్రంథాలకు ప్రతులు తయారు చేసుకున్న ‘హుయాన్ చాంగ్’ రాతల ద్వారా లభిస్తాయి.

‘హుయాన్ చాంగ్’ కాబుల్ మార్గం గుండా భారత్ వచ్చాడు. తక్షశిల, సింహపుర, ఓర్చా (హజారా), పూంచ్, రాజపురి (రాజౌరి) వంటి రాజ్యాలన్నీ కశ్మీరు సామంత రాజ్యాలు ఆ కాలంలో అని అతని రాతల ద్వారా తెలుస్తుంది. హుయాన్ చాంగ్ తక్షశిల పర్యటించిన కాలంలో అది కశ్మీరు సామంత రాజ్యం. దీనికి దగ్గరలో ఉన్న ‘ఖైబర్ పఖ్తూన్ ఖ్వా’ ప్రాంతంలో అనాగరిక తెగల ఆధిక్యం ఉండేది. వీరు  మాటి మాటికి వ్యాపార మార్గాలలో ప్రయాణించేవారిపై దాడి చేసి చీకాకు పెడుతుండేవారు. ఇక్కడి అరాచకం ప్రభావం కశ్మీరుపై పడేది. దుర్లభవర్ధనుడి కన్నా ముందరి కశ్మీర రాజులు ఈ వైపు దృష్టి పెట్టలేదు. ఈ ప్రాంతాలలోని అనాగరిక తెగలను అదుపులో పెట్టి వ్యాపార మార్గంపై పట్టు సాధించిన తొలి కశ్మీర రాజు దుర్లభవర్ధనుడు. ఈ మార్గం గుండా ‘హుయాన్ చాంగ్’ కశ్మీరు చేరాడు. కశ్మీరు చేరుతూ ఓ వ్యాఖ్య చేస్తాడు హుయాన్ చాంగ్. తక్షశిల నుంచి కశ్మీరు చేరేవరకూ తాను ప్రయాణించిన ప్రాంతాలన్నీ కశ్మీరు సామంత రాజ్యాలనీ, పొరుగు రాజులు కశ్మీరుపై ఎన్ని దాడులు చేసినా కశ్మీరుపై విజయం సాధించలేకపోయారని రాస్తాడు.

దుర్లభవర్ధనుడు అధికారంలోకి వచ్చి  ఆరేళ్ళయిన తరువాత హుయాన్ చాంగ్ కశ్మీరులో అడుగుపెట్టాడు. అప్పటికి దుర్లభవర్ధనుడు ఇరుగుపొరుగు రాజ్యాలపై ఆధిక్యం సాధించాడు. ఆ కాలంలో కశ్మీరు గురించి రాస్తూ, అప్పుడు కశ్మీరులో 100 సంఘ ఆరామాలు, 5000 భిక్షువులు ఉండేవారంటాడు హుయాన్ చాంగ్. కశ్మీరు రాజధాని అధిష్టానపురం (శ్రీనగర్) అని చెప్తాడు. ప్రస్తుతం శ్రీనగర్ లోని ‘పంద్రేస్తాన్’ ప్రాంతంగా దీన్ని గుర్తించారు.

‘హుయాన్ చాంగ్’ కశ్మీరు సరిహద్దు చేరగానే రాజు ‘మామ’ అతడిని సగౌరవంగా కశ్మీరులోకి ఆహ్వానిస్తాడు. ఏనుగుపై అతడిని ఊరేగిస్తారు. ఈ ఉత్సవంలో రాజు తల్లి, సోదరుడు కూడా పాల్గొంటారు. ఆయన రాజధాని చేరేసరికి 1000 మంది సైనికులతో రాజు స్వయంగా అతడిని ఆహ్వానిస్తాడు. ఒక రాత్రి ‘హుష్క విహారం’లో గడిపిన తరువాత అతడికి రాజభవనంలో నివాసం కల్పిస్తారు. అతడి సేవకు అయిదుగురు సేవకులు, గ్రంథాలు రాసేందుకు రాతగాళ్ళు అతడికి ఇచ్చాడు రాజు. అలా కశ్మీరులో రెండేళ్ళున్నాడు హుయాన్ చాంగ్.

అయితే హుయాన్ చాంగ్ కశ్మీరులో రెండేళ్ళుండి సకల రాచమర్యాదలు పొందాడు కాని కశ్మీరు రాజు పేరును ఎక్కడా రాయలేదు. అయితే ఆ కాలంలోని చైనీయుల పత్రాల ద్వారా అప్పటి కశ్మీరు రాజు తు-లో-పా (దుర్లభవర్ధనుడు) క్రీ.శ. 627 – 649 నడుమ చైనా, నిపిన్ (కాబుల్) ల నడుమ రహదారిపై పట్టు సాధించాడనీ, అందువల్ల చైనా నుండి భారత్ ప్రయాణం సులభతరమయిందనీ తెలుస్తుంది. అంటే గిల్జిత్-బాల్టిస్తాన్ ప్రాంతాలపై కూడా కశ్మీరు ఆధిక్యం ఉండేదన్న మాట.

హుయాన్ చాంగ్ ఆసక్తికరమైన మరో విషయం కూడా రాశాడు. కన్యాకుబ్జ రాజు హర్షుడు కశ్మీరులో ఉన్న బుద్ధుడి ‘పన్ను’ కావాలని కోరితే, దుర్లభవర్ధనుడు దాన్ని అతడికి బహుమతిగా ఇచ్చాడు. ఆ ‘దంతం’ ఇచ్చేందుకు కశ్మీరులోని భిక్షువులు ఒప్పుకోలేదు. కానీ హర్షవర్ధనుడి ఉత్తమ వ్యక్తిత్వానికి ముగ్ధుడయి దుర్లభవర్ధనుడు అతనికి బుద్ధుడి దంతాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయం హర్షచరిత్రలో బాణభట్టు కూడా రాశాడు. అయితే మంచు కప్పిన పర్వత రాజ్యం నుంచి హర్షవర్ధనుడు బహుమతులు అందుకున్నాడని రాశాడు. ఈ ఉదంతం ఆధారంగా పలువురు చరిత్ర రచయితలు కశ్మీరు హర్షవర్ధనుడి పాలనలో వుండేదని తీర్మానించారు. కానీ అది పొరపాటు. హర్షుడు కశ్మీరు పై అధికారం సాధించినట్టు కల్హణుడు రాయలేదు. హుయాన్ చాంగ్ రాయలేదు. బాణుడూ రాయలేదు. కానీ, మన చరిత్ర రచయితలు ఊహించేశారు. అదే నిజమన్నారు.

హుయాన్ చాంగ్ రాతలు, చైనా పత్రాలు  ఆధారంగా – దుర్లభవర్ధనుడు, కశ్మీరు రాజ్యం సరిహద్దులను పెంచిన తొలి కశ్మీరు రాజు అని అర్థమవుతుంది. ఈయన రాజ్యవిస్తరణ చైనీయుల దృష్టికి వెళ్ళింది. అయితే కల్హణుడు దుర్లభవర్ధనుడి రాజ్య విస్తరణ గురించి కానీ, హుయాన్ చాంగ్ కశ్మీరు పర్యటనను కానీ ప్రస్తావించలేదు. ఇందుకు ప్రధాన కారణం కల్హణుడి దృష్టి నైతిక విలువలు, ధర్మపాలన, గత చరిత్ర ద్వారా భవిష్యత్తు నేర్వదగిన పాఠాల విశ్లేషణ వైపు ఉండడం మాత్రమే. పైగా ప్రపంచం నలుమూలల నుంచి బౌద్ధులు కశ్మీరు రావటం, ఆ బౌద్ధాన్ని అభ్యసించి వెళ్ళటం ఒక అపూర్వమైన సంఘటన కాదు ఆ కాలంలో. విదేశీయులంటే అద్భుతమైన వ్యక్తులు కాదు కల్హణుడి కాలంలో. విదేశీయులు విద్యార్జన నిమిత్తం వచ్చిన విద్యార్థులు మాత్రమే!

దుర్లభవర్ధనుడి తరువాత దుర్లభకుడు, ప్రతాపాదిత్యుడి పేరుతో రాజ్యానికి వచ్చాడు. ప్రతాపాదిత్యుడి కాలంలో ‘రత్నచింత’ అనే బౌద్ధ భిక్షువు చైనా వెళ్ళాడు. చైనాలో నివసిస్తూ ఆయన పలు బౌద్ధ గ్రంథాలను చైనా భాషలోకి అనువదించాడు. ప్రతాపాదిత్యుడి కి చెందిన  ‘శ్రీప్రతాప్’ అన్న ముద్ర ఉన్న నాణేలు జలంధర్ వద్ద దొరకటంతో, ఈయన అధికారం పంజాబ్‍పై కూడా ఉండేదని భావిస్తున్నారు.

కన్యాకుబ్జ రాజు యశోవర్మ రాజ్యం కూడా జలంధర్ దాటి విస్తరించిందీ కాలంలో. బహుశా యశోవర్మకు, కశ్మీరు రాజులకు జలంధర్ వద్ద సరిహద్దు వివాదం ఈ కాలంలోనే ఆరంభమయి ఉంటుంది. ప్రతాపాదిత్యుడి కాలంలోనే ‘అరబిస్తాన్’లో ఇస్లాం జన్మించింది. అరబ్బుల సామ్రాజ్యం ‘తోఖరిస్తాన్’ నుంచి జాబుల్, కాబుల్, గాంధారం వరకూ విస్తరించింది. కల్హణుడు ఈ విషయం ప్రస్తావించకపోవటం, ఆ కాలంలో భారతీయ రాజులు, ప్రజలు  ఇస్లాం ఆవిర్భావం, రాజ్య విస్తరణ వంటి విషయాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని అనిపిస్తుంది.  బట్టర్‌ఫ్లయ్ ఎఫెక్ట్ రెక్కలు కదిపిన సీతాకోకచిలుకకు తెలియదు. అది రెక్కలు కదిపినట్టు గమనించిన వాడు దాని ప్రభావాన్ని తెలుసుకోలేడు. కొన్ని వేల ఏళ్ళ తరువాత చరిత్రను అధ్యయనం చేసేవారు అనేక సంఘటనలను కలిపి చూడటంవల్ల దేని వల్ల ఏమి జరిగిందో గ్రహించి, ఈ సంఘటనలన్నిటికీ సీతాకోకచిలుక రెక్కలు కదపటం కారణం అని తీర్మానిస్తారు. చరిత్ర రచన ఇలాగే సాగుతుంది. ఏదైనా ఒక సంఘటన ప్రాధాన్యం అది జరిగిన కాలంలో కన్నా, వందేళ్ళు, వెయ్యేళ్ళ తరువాత స్పష్టంగా తెలుస్తుంది. మానవ జీవితకాలం వందేళ్ళే. కాబట్టి గత చరిత్రను అధ్యయనం చేయటం వర్తమానాన్ని అర్థం చేసుకుని భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుంది. ఈ కాల లక్షణం భారతీయులు అర్థం చేసుకున్నంతగా ప్రపంచంలో ఏ నాగరికత అర్థం చేసుకోలేదు. అందుకే ఇతిహాసాలను రచించారు. తర తరాలు పఠించాలి అధ్యయనం చేయాలన్నారు. ఏ కాలం వారు ఆ కాలానికి తగ్గట్టుగా ఇతిహాసాలను, పురాణాలనూ రచించుకోవచ్చన్నారు. ఈ రకంగా, గతంలో జరిగిన ఏ సంఘటన వర్తమానాన్ని ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకోవచ్చు. దాని ఆధారంగా భవిష్యత్తును తీర్చిదిద్దచ్చు.

కశ్మీరుపై ప్రతాపాదిత్యుడు ప్రశాంతంగా రాజ్యం చేస్తున్న కాలంలో దేశం వాయువ్య ప్రాంతం అరబ్బుల తాకిడితో అల్లకల్లోలమవుతోంది. అంతవరకూ సామరస్యంగా జీవిస్తున్న బౌద్ధులు, హిందువుల నడుమ పలురకాల భేదాభిప్రాయాలు పొడచూపాయి. అయితే దాడులు చేస్తున్న అరబ్బులకు హిందువులయినా, బౌద్ధులయినా కాఫిర్‌లే. వారిని మతం మార్చటమే లక్ష్యం. ఈ సమయంలో కశ్మీరులో రాజ్యం ప్రతాపాదిత్యుడి నుంచి చంద్రపీడుడికి సంక్రమించింది.

అరబ్బుల దాడుల వల్లన తోఖరిస్తాన్ – కాబుల్ – జాబుల్ వ్యాపారమార్గం ప్రమాదకరంగా మారింది. ఇది అటు చైనాకు, ఇటుకు కశ్మీరుకు ఇబ్బంది కలిగించే అంశం. మహమ్మది బిన్ ఖాసిమ్ సైన్యం ‘జాబుల్’ లోయకు చేరటంతో అతడిని అడ్డుకోవటం కశ్మీరు రాజుకు తప్పనిసరి అయింది. ఈ సమయంలో చంద్రపీడుడు దూరదృష్టిని ప్రదర్శించాడు. అరబ్బులను అడ్డుకునేందుకు ఇతర రాజులను కూడగట్టుకోవటమే కాదు చైనా రాజు ‘హుయాన్ చాంగ్’కు తమకు సహాయంగా రావలసిందిగా అభ్యర్థన పంపాడు. టాంగ్ వంశానికి చెందిన రాజు ఈయన. ఆ కాలం నాటి పత్రాల ద్వారా చైనా రాజుకు అభ్యర్థన పంపిన కశ్మీర రాజు పేరు ‘చెన్-తోలి-పి-లి’. ఇది చైనాలో చంద్రపీడుడిగా భావిస్తున్నారు. అయితే చంద్రపీడుడికి సహాయంగా వచ్చేలోగా చైనాలో అంతర్గతంగా సమస్యలు తలెత్తాయి. దాంతో సైనిక సహాయం చేయలేకపోయాడు చైనా రాజు.

ఈ సమయంలో ఖాసిమ్ నుంచి తప్పించుకుని వచ్చిన దాహిర్ రాజపుత్రుడు ‘జయసింహ’కు ఆశ్రయం ఇచ్చాడు చంద్రపీడుడు. తమ శత్రువుకు ఆశ్రయం ఇచ్చినందుకు కశ్మీరుపై అరబ్బులకు ఆగ్రహం వచ్చింది. కశ్మీరుపై దాడికి బయలుదేరాడు. కానీ జలంధర్ వద్ద చంద్రపీడుడి దెబ్బకు భయపడి హిమాచల్ ప్రదేశ్ లోని ‘కాంగ్డా’ వైపు మళ్ళాడు ఖాసిమ్. కశ్మీరులో ఆశ్రయం పొందేకన్నా ముందు జయసింహుడు కొన్ని రోజులు ‘కాంగ్డా’లో ఆశ్రయం పొందాడు. ‘కాంగ్డా’ ఖాసిమ్ వశమయింది. భవిష్యత్తులో అరబ్బు సేనలను సంయుక్తంగా ఎదుర్కునేందుకు కశ్మీరు రాజు లలితాదిత్యుడు, కనౌజ్ రాజు యశోవర్మలు చేతులు కలిపేందుకు బీజం ఇక్కడ పడింది. అయితే చంద్రపీడుడు కశ్మీరు సరిహద్దులను అరబ్బులనుంచి భద్రంగా ఉంచటం , కశ్మీరు  భారత్ లోని ఇతర ప్రాంతాలకు భిన్నంగా ఎదిగే వీలు కల్పించింది. భవిష్యత్తులో చరిత్ర రచయితలు కశ్మీరుకు భారత్ లోని ఇతర ప్రాంతాలతో పెద్దగా సంబంధాలు లేవని, కశ్మీరు భిన్నమని ఊహించే వీలును కల్పించింది. అయితే ఆ కాలంలో భద్రంగా ఉన్న కశ్మీరు ఈనాడు అల్లకల్లోలం అవటం, ఆ కాలంలో అల్లకల్లోలమయిన ఇతర ప్రాంతాలు ఈనాడు భద్రంగా ఉండటం విధి వైచిత్రి.

చంద్రపీడుడి తరువాత తారాపీడుడు రాజ్యానికి వచ్చాడు. కల్హణుడు తారాపీడుడిని దుష్టరాజు అన్నాడు. మోసంతో మంత్రతంత్రాలతో రాజ్యానికి వచ్చిన తారాపీడుడు ప్రజలను కష్టపెట్టాడని రాశాడు కల్హణుడు. అయితే కల్హణుడికి తెలియని సంఘటనలను గమనిస్తే, తారాపీడుడు దుష్టుడు, రాజ్యంపై ఆశపడ్డ ధూర్తుడు అయి ఉండవచ్చు కానీ, ఆయన కూడా దూరదృష్టి ఉన్న రాజు అని అర్థం అవుతుంది. తారాపీడుడు అక్రమంగా రాజ్యానికి ఆశపడడం, బ్రాహ్మణులను హింసించటం, ప్రజలను కష్టపెట్టటం వంటి విషయాలపైనే కల్హణుడి దృష్టి కేంద్రీకృతమవటంతో బహుశా, కశ్మీరు బయట జరుగుతున్న సంఘటనలు ఆయన దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. తెలిసినా, వాటి ప్రాధాన్యం ఆయన గ్రహించి ఉండకపోవచ్చు. కల్హణుడి దృష్టి ప్రధానంగా పతనవుతున్న నైతిక విలువలపై ఉండటంతో ఆయన వీటికి అంత ప్రాధాన్యాన్ని ఇచ్చి ఉండకపోవచ్చు.

తిబ్బత్తుతో చైనా సమస్యను పరిష్కరించేందుకు చైనాకు  సహాయం చేశాడు తారాపీడుడు. ఇందుకు ధన్యవాదాలు తెలుపుతూ చైనా రాజు కశ్మీరుకు దూతను పంపాడు. తారాపీడుడిని ‘గౌరవనీయుడైన స్నేహితుడిగా’ అభివర్ణించాడు. అంటే చైనాతో సత్సంబంధాలు నెరపే చంద్రపీడుడి విదేశీ విధానాన్ని తారాపీడుడు కొనసాగించాడన్న మాట. తిబ్బత్తుతో సంధి జరిగిన తరువాత చైనా రాజు కూతురు ‘జిన్ చెంగ్’, తిబ్బత్తు రాజు ‘త్రిదే చుక్త్‌సేన్’ను వివాహమాడింది. కొన్నాళ్ళ తరువాత ఆమె చైనా అధికారంలో ఉన్న జబులిస్తాన్ రాజు ‘తెగిన్ జబిల్’కు తనని తిబ్బత్తు నుంచి రక్షించమన్న సందేశం పంపింది. ఆ సందేశాన్ని జబిల్ రాజు,  చైనా రాజు ‘హుయాన్ చాంగ్’కు పంపించాడు. ‘జబిల్’కు సందేశం పంపిన సమయంలో ‘జిన్ చెంగ్’ కశ్మీర రాజు వద్దకు ఇద్దరు చైనా దూతలను రహస్యంగా పంపింది. తనకు కశ్మీరులో ఆశ్రయం ఇవ్వమని అభ్యర్థించింది. అప్పుడు తారాపీడుడు ఆమెను  కశ్మీరు రమ్మని  సగౌరవంగా ఆహ్వానించాడు. ఆమెకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని ధైర్యం చెప్పాడు. ఈ సమాచారాన్ని జబిలిస్తాన్ రాజుకూ చేరవేశాడు తారాపీడుడు. అంతే కాదు, ఒకవేళ తిబ్బత్తు సైన్యం ఆమెను వెంటాడితే, వారిని ఎదుర్కునేంత సైన్యం  ఆ వైపుకు తన వద్ద లేదని, సైన్యాన్ని సహాయంగా పంపమని కోరాడు. ఆ కాలంలో తిబ్బత్తు నుంచి కశ్మీరుకు ఏడు రోజుల ప్రయాణం. ఆ కాలంలో కశ్మీరుకు, చైనాకు   సన్నిహిత సంబంధాలు ఉండేవి, ఎంతగా అంటే చైనా రాకుమారి కశ్మీరులో ఆశ్రయం అభ్యర్థించేంతగా! అయితే ఆమె తిబ్బత్తు వదిలి కశ్మీరు వచ్చే లోగా తారాపీడుడు మరణించాడు. దాంతో ఆమె కశ్మీరులో ఆశ్రయం పొందాలన్న ఆలోచనను విరమించి ఉండవచ్చు. ఎందుకంటే, ఆమె కశ్మీరు వచ్చిన దాఖలాలు లేవు. తారాపీడుడు జబిలిస్తాన్ రాజును సైన్య సహాయానికి అభ్యర్థించటం వెనుక కశ్మీరు సైన్యం అరబ్బుల దాడుల నుంచి కశ్మీరు సరిహద్దులను కాపాడటంలో నిమగ్నమై ఉండటం ఒక కారణం అయి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తారు. కానీ ఈ సంఘటన ఆ కాలంలో కశ్మీరు శక్తివంతమైన రాజ్యం అనీ, ప్రశాంతమూ, సురక్షితమూ అయిన రాజ్యమని నిరూపిస్తాయి.

కశ్మీరు రాజు అభ్యర్థన అందుకున్న జబిలిస్తాన్ రాజు కశ్మీరుకు సహాయంగా సైన్యాన్ని పంపేందుకు చైనా రాజు అనుమతి కూడా పొందాడు. తారాపీడుడి పాలన కల్హణుడు వర్ణించినంత దుష్టంగా ఉండి, కశ్మీరు అంతర్గతంగా అల్లకల్లోలంగా ఉంటే కశ్మీరును అంత సురక్షితమూ, శక్తివంతమైన రాజ్యంగా చైనీయులు కానీ, రాకుమారి కానీ భావించటం కుదరదు. అయితే, రాజు తారాపీడుడు బ్రాహ్మణులను శిక్షించటం బహుశా కల్హణుడికి నచ్చి ఉండదు. అది తారాపీడుడిపై అతని అభిప్రాయాన్ని ప్రభావితం చేసి ఉంటుందనుకోవాల్సి వస్తుంది. లలితాదిత్యుడు రాజ్యానికి వచ్చేసరికి ఇదీ పరిస్థితి!

~

ఈ భాగం రచనలో ఉపయుక్తమైన గ్రంథాలు:

  1. సి-యు-కి- బుద్ధిస్ట్ రికార్డ్స్ ఆఫ్ ది వెస్టర్న్ వరల్డ్ – శామ్యూల్ బీల్ – అనువాదం
  2. ది హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇట్స్ పీపుల్ – అహ్మద్ అబ్దుల్లా
  3. కల్చర్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ కశ్మీరు – వాల్యూమ్ I- పి.ఎన్.కె. బంజాయ్
  4. ది ఫస్ట్ స్ప్రింగ్: గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా – అబ్రహం ఈరలీ
  5. కశ్మీర్, టాంగ్ చైనా అండ్ ముక్తాపీడ లలితాదిత్యాస్ అసెన్‌డెన్సీ ఓవర్ ది సదర్న్ హిందూకుష్ రీజియన్ – తాన్‍సేన్ (వ్యాసం)
  6. ఎంపరర్ ఆఫ్ కశ్మీర్ ‘లలితాదిత్యా ది గ్రేట్’ – సంజయ్ సోనావానీ

(ఇంకా ఉంది)

Exit mobile version