[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
[dropcap]ఏ[/dropcap]డవ శతాబ్దంలో భారత్ పర్యటించిన చైనా యాత్రికుడు యువాన్జాంగ్ నగరహర (జలాలాబాద్) దగ్గర ఉన్న లాంఘామ్ చేరాడు. ఇది హిందూకుష్ పర్వతాలలో ఉన్న ‘ఖైబర్ పాస్’కు సమీపంలో ఉన్న ప్రాంతం. అక్కడ నుంచున్నప్పుడు ఆయనకు ‘ఇందు’ దేశ ద్వారం వద్ద నుంచున్న భావన కలిగిందని తన ప్రయాణ జ్ఞాపకాలలో రాసుకున్నాడు. ఈ ప్రాంతం గాంధారానికి, కశ్మీరానికి పశ్చిమాన ఉంటుంది. ‘లాంఘామ్’ వద్ద నుంచుని యువాన్జాంగ్ ఇందు దేశ (భారత దేశ) ద్వారం వద్ద నుంచున్నానని అనుకున్నాడంటే అర్థం ఆయన భారతదేశం అఖండ భారతదేశం గురించి మాట్లాడుతున్నాడని అర్థం. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు, దురూహలు, దుర్వ్యాఖ్యానాలు లేకుండా, ఆయన భారతదేశ విస్తీర్ణం 90,000 లై(దూరాన్ని కొలిచే చైనీయుల యూనిట్. ఒక లై, అర కిలోమీటర్ తో సమానం) అనీ, దీన్లో 70 విభిన్నమైన రాజ్యాలు ఉన్నాయనీ, ఈ దేశం ఉత్తరాన మంచు పర్వతాలు, మిగిలిన మూడు వైపులా సముద్రం ఉన్నాయనీ రాశాడు. అంటే ఈనాడు మనం స్వాతంత్ర్యం వచ్చేవరకు మనకు ఒకేదేశ భావన లేదనీ, కశ్మీరు భారత్‍తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉండేదనీ ఏవైతే తీర్మానాలు చేసి బల్లలు గుద్ది వాదిస్తున్నామో, అదంతా పొరపాటనీ, మన పూర్వీకుల దృష్టిలోనే కాదు, విదేశీయుల దృష్టిలో కూడా 70 విభిన్నమైన రాజ్యాలు కలిగి, ఉత్తరాన హిమాలయాలు, మిగిలిన మూడు వైపులా సముద్రం సరిహద్దుగా కల ప్రాంతం అంతా ఇందుదేశం (భారతదేశం) అనీ, మన చరిత్రకారులు చెప్తున్నట్టు ‘ఇండస్ నది’ మన సరిహద్దు కాదనీ స్పష్టమవుతుంది. ఆరంభం నుంచి గాంధారం (అఫ్ఘనిస్తాన్), కశ్మీరులు భారత్‍లో అంతర్భాగాలనీ స్పష్టం అవుతుంది. కశ్మీరు కేంద్రంగా భారతీయ విజ్ఞానం, సంస్కృతి, ఇతర ఆసియా దేశాలకు ముఖ్యంగా మధ్య ఆసియా దేశాలకు విస్తరించాయని తెలుస్తుంది. అందుకే భారతీయ సంస్కృతికి కశ్మీరును కేంద్రంగా భావిస్తారు. దేశంలో ఉద్భవించిన ఆలోచనలన్నీ కశ్మీరు కేంద్రంగా విస్తరించాయి. అయితే ఎన్ని రకాల అలోచనలు, మతాలు కశ్మీరులో వెల్లివిరిసినా, కశ్మీరు తన మౌలిక వ్యక్తిత్వాన్ని మరచిపోలేదు. ఎన్నెన్ని దాడులు జరిగినా, ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చినా అయిదు వేల ఏళ్ళ నుండీ తన భారతీయతను పదిలంగా పరిరక్షించుకుంటూ సజీవంగా నిలుపుకుంతోంది. అనేక ఇతర ఆలోచనలు, మతాలు కశ్మీరులో వేళ్ళూనుకున్నట్టే బౌద్ధం కూడా కశ్మీరంలో వేళ్ళూనుకుంది. కశ్మీరు చరిత్రను, సంస్కృతిని, సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. భౌద్ధానికి కశ్మీరంలో ఆదరణ తగ్గినా, బౌద్ధం ప్రభావం కశ్మీరు జీవనవిధానంగా విడదీయరాని భాగం అయిపోయింది. సుల్తానులు, మొఘలులు కశ్మీరును తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత కూడా బౌద్ధ భావనల ప్రభావం అనేక పర్షియన్ పండితులపై, వారి రచనలపై కనిపిస్తుంది. కశ్మీరులో బౌద్ధం అదృశ్యమై 450 ఏళ్ళ పైనే అయినా, ఈనాడు బౌద్ధం పేరును ఎవరూ స్మరించకపోయినా, కశ్మీరులో ప్రజలు నిత్యజీవితంలో పాటించే పద్ధతులలో, కర్మకాండలలో, మంత్రాలలో, పురాణ గాథలలో బౌద్ధం ప్రభావం కనిపిస్తుంది.
ఈనాటికీ కశ్మీరీ పండితులు ప్రతి నెలా అష్టమి రోజు ఉపవాసం ఉంటారు. ఇందుకు మూలం ప్రతి అష్టమి రోజు బౌద్ధులు బుద్ధుడి, బోధిసత్వుడి సంస్మరణార్థం ఉపవాసం ఆచరించటంలో ఉంది. హోమం సమయంలో ప్రార్థించి స్మరించే దేవతల పేర్లలో త్రిరత్న, అవలోకితేశ్వర, తారా , వరాహి, మ్రిచి, లోచన, ప్రజన, రాగరాత్రి, వజ్రరాత్రి వంటి బౌద్ధ దేవతల పేర్లు కూడా ఉంటాయి. కశ్మీరులో బౌద్ధం ప్రభావంతో త్రికదర్శన, మాంత్రిక యోగుల సంస్కృతి ఆవిర్భవించింది. ఈ మాంత్రిక యోగుల ప్రభావంతో పలు ముసల్మాను ఋషులు శాకాహారులుగా వుంటారు ఈనాటికీ. వారు బ్రహ్మచారులుగా ఉండి గృహస్థాశ్రమం విసర్జిస్తారు. సంఘసేవలో జీవితం గడుపుతారు. బౌద్ధం ప్రభావంతో కశ్మీరు శైవం కూడా శాకాహారాన్ని స్వీకరించింది. ఈ రకంగా కశ్మీరు సాంఘిక జీవనంపై అమితమైన ప్రభావం చూపిన బౌద్ధం కశ్మీరు సాహిత్యాన్ని ప్రభావితం చేయటం, సృజనాత్మక కవుల ఆలోచనలలో ప్రతిఫలించటం స్వాభావికంగా జరిగింది.
కశ్మీరులో ‘సర్వాస్తివాదం’ అమిత ప్రచారం పొందింది. తథాగతుడి మహానిర్వాణం తర్వాత బౌద్ధం పలు విభిన్నమైన ఆలోచనల ఆధారంగా చీలిపోయింది. ‘వినయ’, ‘అభిధర్మ’లను అర్థం చేసుకోవటంలోని తేడాల వల్ల పలు శాఖలు ఏర్పడ్డాయి. వీటిలో అతి ప్రాచీనము, అతి పవిత్రము అయినది ‘సర్వాస్తివాదం’ అని బౌద్ధుల నమ్మకం. ‘రాహుల్ భద్ర’ అనే టిబెటన్ పండితుడు ఈ తత్త్వానికి ‘పిత’గా భావిస్తారు. కానీ మధురకు చెందిన ‘ఉపగుప్తుడు’ సర్వాస్తివాదాన్ని ఆరంభించాడని కొందరు నమ్ముతారు. అయితే అధికులు ‘సర్వాస్తివాదం’ కశ్మీరులో ఆరంభమయిందని, ‘మధ్యాంతికుడు’ ఈ శాఖను ఆరంభించాడని భావిస్తారు. ‘సర్వాస్తివాదం’ను విశ్లేషిస్తూ వెలువడిన సమగ్ర గ్రంథం ‘వైభాషిక’ కశ్మీరుకు చెందినది. అభిధర్మకు చెందిన మౌలిక రచన ‘సర్వాస్తివాది’ని ఆరు అధ్యాయాలలో రచించినది కాత్యాయని తనయుడు వసుబంధు. ఇది కశ్మీరులోనే రాసినది. క్రీ.శ. 383వ సంవత్సరంలో ఈ గ్రంథం చైనా భాషలోకి అనువాదమయింది. అయోధ్య నుంచి అశ్వఘోషుడిని వసుబంధుడు కశ్మీరుకు ఆహ్వానించాడు. అశ్వఘోషుడు కశ్మీరులో పన్నెండేళ్ళుండి ‘అభిధర్మ మహత్వ భాషాశాస్త్ర’ అనే గ్రంథాన్ని రాశాడు.
క్రీ.శ. 7వ శతాబ్దంలో వసుమిత్రుడు ‘సూత్ర పిటక’, ‘వినయ పిటక’, ‘అభిధర్మ పిటక’ అనే గ్రంథాలు రచించాడు. వీటిని ‘ఉపదేశ శాస్త్ర’, ‘వినయ విభాష శాస్త్ర’, ‘అభిధర్మ విభాష శాస్త్ర’ అంటారు. కశ్మీరుకు పన్నెండు యోజనాల దూరంలో గాంధార రాజు మిళిందుడు (మినాండర్), నాగసేనుడితో జరిపిన సంభాషణ వల్ల మినాండర్ బౌద్ధాన్ని స్వీకరించి ‘అర్హత’ స్థాయిని పొందాడు. వీరి సంభాషణ ‘మిళిందపన్హా’గా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. కశ్మీరు రాజు సుదర్శనుడి ప్రభావంతో కనిష్కుడు బౌద్ధాన్ని స్వీకరించాడు. కనిష్కుడు నాలుగవ ప్రపంచ బౌద్ధ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సమావేశం ‘కుందల వన విహారం’ వద్ద జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతం పేరు ‘హర్వాన్’. ఇది కశ్మీరంలో ఉంది. ఈ సమావేశానికి అధ్యక్షుడు వసుమిత్రుడు. ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు! ఈ సమావేశానికి 500 అర్హతులు, 500 బోధిసత్త్వులు, 500 పండితులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సమయంలో రాసిన అనేక గ్రంథాలలో ‘మహా విభాష శాస్త్రం’ ఒక్కటే లభిస్తోంది. అదీ చైనా భాషలో! ఈ సమావేశం అయిన తరువాత కనిష్కుడు మొత్తం కశ్మీరాన్ని సంఘానికి అర్పించాడు. అపూర్వమైన సంఘటన ఇది. ఆ తరువాత కశ్మీరంలో పలు విహారాలు, స్తూపాలు నిర్మింప చేశాడు. ‘కనిష్కాపురం’ అని ఓ నగరం కట్టించాడు. ప్రస్తుతం ‘బారాముల్లా’లో ఉన్న ‘కనిసర్పార్’ ఆనాటి కనిష్కాపురం! నాగార్జునుడి ప్రభావంలో కశ్మీరులో ‘నాగపూజ’ దాదాపుగా అదృశ్యమయ్యే పరిస్థితి వచ్చింది.
ఈ సందర్భంలో ‘రాజతరంగిణి’లో కల్హణుడు రాసిన విషయాన్ని ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. నాలుగవ ప్రపంచ బౌద్ధ సమావేశాలు అయిన తరువాత కనిష్కుడు కశ్మీరాన్ని బౌద్ధ సంఘానికి ధారాదత్తం చేశాడు. దీన్ని కశ్మీరంలోని బ్రాహ్మణులు వ్యతిరేకించారు. ‘కశ్మీరం అందరిది, కేవలం బౌద్ధులదే కాద’ని వీరు రాజు చర్యను ఖండించారు. ఇది గమనించిన నాగార్జునుడు తమకు ఉన్న రాజు మద్దతుతో కశ్మీరం నలుమూలలా బౌద్ధాన్ని విస్తరింప చేశాడు. ఈ విస్తరణలో భాగంగా నాగులు, శైవులతో పలు శాస్త్ర చర్చలు జరిపి వారిని ఓడించి బౌద్ధం లోకి మార్చాడు. ఇది శైవులకు, బౌద్ధులకు నడుమ తీవ్రమైన ఘర్షణ రూపం ధరించింది. రాజ్యం బౌద్ధులది అవడంతో, శైవులపై, ఇతర మతానుయాయులపై రాజ్య హింస కొనసాగింది. ఈ ఘర్షణ సమయంలోనే నాగార్జునుడు దక్షిణానికి వచ్చాడని అంటారు. ఈ సంఘర్షణ కశ్మీరీ శైవాన్ని రూపాంతరం చెందించింది.
కశ్మీరీ శైవం గురువు నుంచి శిష్యుడికి మౌఖికంగా అందుతుండేది. కానీ బౌద్ధంతో జరుగుతున్న శాస్త్ర చర్యలలో శైవులు పరాజయం చెందటాన్ని గమనించిన శైవ పండితులు తమ సిద్ధాంతానికి విస్తృత ప్రచారం కల్పించి, ప్రజలకు చేరువ చేయడంలో భాగంగా శైవమత సిద్ధాంత గ్రంథాలను రచించటం ప్రారంభించారు. దీని ఆద్యుడు యోగి చంద్రదేవుడు. ఈయన కశ్మీరీయులకు మళ్ళీ ‘నీలమత పురాణం’ బోధించి నాగపూజను, శైవాన్ని నిలబెట్టాడు. ఈ సమయంలోనే ‘శివసూత్ర’, ‘ఆగమశాస్త్ర’, ‘స్పందశాస్త్ర’, ‘పృథ్విజ్ఞసూత్ర’ వంటి శైవ గ్రంథాలు రచించారు.
భారతదేశంలో బౌద్ధం, శంకరాచార్య ప్రభావంతో బలహీనమైన దశలో ఉండగా కశ్మీరంలో ‘లలితాదిత్య ముక్తాపీడుడు’ బౌద్ధాన్ని కాపాడాడు. రాజు శంకరవర్మ భార్య రాణి సుగంధా దేవి ‘నిష్కల్ప విహారం’లో పెరిగింది. కశ్మీరు నుంచి బౌద్ధం లదాఖ్, టిబెత్ వంటి దేశాలకు విస్తరించింది.
రాహుల్ సాంస్కృత్యాయన్ కశ్మీరులో బౌద్ధానికి సంబంధించి ఒక కథ చెప్తారు. ‘జ్ఞానప్రభ’ టిబెట్ రాజు ‘షియాన్ షుంగ్’ కొడుకు. ఈయన బౌద్ధుడే అయినా టిబెట్‍లో ప్రచారంలో ఉన్న ‘తాంత్రిక బౌద్ధం’పై తీవ్రమైన అసంతృప్తి కలిగినవాడు. అందుకని ఆయన 21మంది పండితులను ఎంచుకుని వారికి పదేళ్లపాటు బౌద్ధధర్మం నేర్పాడు. తరువాత వారిని ఇంకా బౌద్ధంలో పై చదువులు చదివేందుకు కశ్మీరం పంపాడు. కశ్మీరులోని చలి భరించలేక, వచ్చినవారిలో ఒక్క ‘రత్తక భద్ర సుప్రజ్ఞ’ తప్ప అందరూ మరణిస్తారు. ఈయనను ఈనాటికి టిబెట్‍కి చెందిన అత్యద్భుతమైన బౌద్ధ పండితుడిగా భావిస్తారు.
‘అభిధర్మ కోశ’ను రచించిన రసబంధు ఇప్పటి పెషావర్‍కి చెందినవాడు. కశ్మీరు చేరిన తరువాతనే ఈయన ఖ్యాతి దశదిశలా వ్యాపించింది. వసుభద్ర పండితుడు కశ్మీరులో అడుగుపెట్టినప్పుడు మానసిక సమతౌల్యం లేనివాడు. అతడిని పిచ్చివాడనుకునేవారు. కానీ కశ్మీరులో సర్వాస్తివాదానికి చెందిన ‘విభాష శాస్త్రాన్ని’ కంఠస్తం చేసిన తరువాత ఆయన తెలివిమంతుడయ్యాడు. అయోధ్య చేరి భారతీయ పండితులలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు.
ఒక కథనం ప్రకారం శంకరాచార్యుల వారు కశ్మీరులో అడుగుపెట్టిన తరువాతనే బౌద్ధం తాత్త్వికశక్తిని అర్థం చేసుకున్నారు. ‘సంఘ వ్యవస్థ’ను, ‘మఠ వ్యవస్థ’ ప్రాధాన్యాన్ని గుర్తించారు. ‘మాయ’ వాదానికి బీజం కశ్మీరులోనే పడింది.
కశ్మీరు బౌద్ధం ప్రభావం కశ్మీరులోని ఇస్లామీయులపై కూడా పడింది. వ్యక్తుల జ్ఞాపికలను, అవశేషాలను పూజించని ఇస్లామీయులు ‘హజ్రత్‍బాల్ (హజ్రత్ అంటే మహమ్మద్ ప్రవక్త, బాల్ అంటే వెంట్రుక)’ మసీదులో ప్రవక్త మహమ్మద్‍కు చెందిన ఒక వెంట్రుకను ఉంచి పూజిస్తారు. ఇందుకు కారణం ఆ ప్రాంతంలో ముస్లింలుగా మతాంతీకరణ చెందినవారు, మసీదును నిర్మించిన వారిలో అధికులు గతంలో బౌద్ధానుయాయులు కావటమేనన్నది విశ్లేషకుల అభిప్రాయం.
కశ్మీరు నుంచి బౌద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరించటంలో ‘గుణవర్మ’ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈయన రాజవంశానికి చెందినవాడు. కానీ రాజ్యాన్ని పరిత్యజించి పరివ్రాజకుడయ్యాడు. బౌద్ధ మత ప్రచారం కోసం కశ్మీరు వదిలాడు. శ్రీలంక, జావా, చైనా వంటి దేశాలలో బౌద్ధమత ప్రచారం చేసింది ఈయనే. కుమారజీవుడు కశ్మీరుకు చెందినవాడు. ఈయన వల్లనే ఈనాడు చైనా, జపాన్‌లలో బౌద్ధం విస్తరించింది. బౌద్ధ గ్రంథాలకు ఈయన చేసిన చైనా భాష అనువాదాలే ఈనాటికి ప్రామాణికంగా నిలుస్తున్నాయి. రెండవ బుద్ధుడిగా పేరుపొంది ‘రింపోచే’గా ప్రఖ్యాతి పొందిన ‘గురు పద్మసంభవుడు’ కశ్మీరంలో కొన్నేళ్ళు గడిపి బౌద్ధాన్ని అభ్యసించాడు. అధ్యయనం చేశాడు. 11వ శతాబ్దారంభంలో కశ్మీరుకు చెందిన పండితురాలు లక్ష్మి టిబెట్ చేరి ‘అనువత్తరయోగ తంత్ర’ టిబెటన్లకు నేర్పింది. అయిదవ శతాబ్దంలో టిబెట్ వారు కశ్మీరు నుంచి వచ్చిన వారిని ‘భట్ట’ అనేవారు. ‘భట్ట’ అంటే పండితుడు అని అర్థం. ఈనాటికీ ఈ పదం చలామణీలో ఉంది. బయట ప్రపంచం కశ్మీరులోని వారిని కశ్మీరీ బ్రాహ్మణులు, పండితులు అంటుంది. కానీ కశ్మీరులో వీరిని ‘భట్ట’లనే అంటారు. సుల్తాన్ సికిందర్ కశ్మీరులో పండితులను వెతికి వెతికి ఏరి కత్తికి ఎర చేస్తున్నప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ఈ భట్టులు ‘నా భట్టాహం, నా భట్టాహం’ అని కేకలు పెట్టేవారు. ఇదంతా జోనరాజు రాజతరంగిణి వర్ణిస్తుంది.
కశ్మీరుకు చెందిన బౌద్ధ చరిత్రను తెలుసుకోవటం వల్ల రాజతరంగిణి రచనలో కల్హణుడిపై బౌద్ధం ప్రభావం ఊహించే వీలవుతుంది. అంతే కాదు, కశ్మీరుకు భారత్‍లోని ఇతరప్రాంతాలకు ఏమాత్రం ప్రత్యేకం కాదనీ తెలుస్తుంది.
(ఇంకా ఉంది)