కశ్మీర రాజతరంగిణి-7

4
1

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]ద్వా[/dropcap]పంచా శతమామ్నాభ్రం శాధ్యాన్నా స్మరన్నృపాణ।
తేభ్యో నీలమతాదృష్టం గోనందాది చతుష్టామ్॥

బద్ధా ద్వాదశభిగ్రంథా సహస్రైః పార్ధివాళి।
ప్రాజ్మహవ్రతినా యేన హేల రాజ ద్విజన్మనా॥

తన్మతం పూర్వమిహి దృష్ట్వా ష్కాది పూర్వగాన్।
అష్టౌలవా దీన్నృపతీన్వస్మిన్ గ్రంథేన్య దరశయాత్॥
(కల్హణ రాజతరంగిణి – 16, 17, 18)

కల్హణుడు తాను రాజతరంగిణి రచించటం కోసం సమాచారాన్ని సేకరించిన విధానం, పరిశీలించిన గ్రంథాలు, శాసనాలు, నాణేలు వంటి వాటన్నిటినీ రాజతరంగిణి ఆరంభంలోనే ప్రస్తావించాడు. ఆధునిక రీసెర్చ్ నివేదికలలో తమ మెథడాలజీని, పద్ధతులను వివరించినట్టు కల్హణుడు రాజతరంగిణిలో వివరించాడు. ఇది పాశ్చాత్యుల మెప్పు పొందింది. ఇతరులెవరూ ఇలాంటి సమాచారాన్ని పొందుపరచలేదని వారు వ్యాఖ్యానిస్తారు. కానీ కల్హణుడు చేసింది గతంలో ఎవరూ చేయనిది కాదు. కల్హణుడు సంప్రదాయాన్ని పాటించాడు. కానీ ఆ సంప్రదాయం విదేశీ విశ్లేషకులకు తెలియదు. విదేశీ విశ్లేషకుల ప్రతిభకు ముగ్ధులయిన భారతీయులూ పట్టించుకోలేదు.

శృత్వా చైత త్త్రిలోకజ్ఞో వాల్మీకే ర్నారదో వచః।
శ్రూయతామ్ ఇతి చామన్త్ర్య ప్రహృష్టో వాక్యమ్ అబ్రవీత్॥
(వాల్మీకి రామాయణం, 6)

వాల్మీకి అభ్యర్థన విన్న త్రిలోకజ్ఞుడయిన నారద మహర్షి ‘ చెప్తాను విను’ అన్నాడు సంతోషంగా.

అంటే, వాల్మీకి , రామాయణం ముల్లోకాల జ్ఞానం కల నారదుడి నుంచి విన్నాడు.

వాల్మీకి source నారదుడన్న మాట! తమ రచనకు reference లు, source లు చెప్పే సంప్రదాయం భారతీయ సాంప్రదాయం. వాల్మీకి నారదుడి నుంచి విన్నాడు. బ్రహ్మ ఆదేశానుసారం ప్రపంచానికి రామాయణ గాథ వినిపించాడు. గాథ వినిపించే ముందు బ్రహ్మ వాల్మీకికి భరోసా ఇచ్చాడు.

తచ్ఛాప్యావిదితం సర్వం విదితం తే భవిష్యతి।
న తే వాక్ అనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి॥
(వాల్మీకి రామాయణం, బాలకాండ, 34)

నారద మహర్షి చెప్పింది, విన్నట్టు చెప్పమంటూ “నీకు ఇప్పుడు తెలియనిది కూడా తెలుస్తుంది. నీ మాట అబద్ధం కాదు. ఈ కావ్యంలో నువ్వు రాసినదేదీ అనృతం కాదు. సర్వం నీకు విదితమవుతుంది” అంటాడు బ్రహ్మ.

ఇంకేం… ముల్లోకాల జ్ఞానం కలిగిన నారదుడు ఒక source. సకల విశ్వసృష్టికర్త అయిన బ్రహ్మ ఇంకో source. ఇక శాసనాలు, నాణేలు, తాళపత్రాలు వంటి సాక్ష్యాలు అవసరం లేదు. వాటి గురించి రాయాల్సిన అవసరం లేదు. ‘మాట’ మీద నమ్మకం వున్న కాలం అది. ధృవీకరణ పత్రాలు కూడా అవిశ్వసనీయమైన కాలం ఇది. కాబట్టి ఇప్పటి దృష్టికోణాన్ని సవరించుకొని అప్పటి కావ్యాలను పరిశీలించాల్సి ఉంటుంది.

ఈ సంప్రదాయం మనకు పురాణాలలో, ప్రబంధాలలో, కావ్యాలలో కూడా కొనసాగుతూ కనిపిస్తుంది. తాను ఎందుకు రాశాడు? ప్రేరణ ఏమిటి? source ఏమిటి? వంటి విషయాలను కావ్యారంభంలో ‘ముందుమాట’ లాంటి పరిచయ పద్యాలలో ప్రతి ‘కవి’ ప్రకటించాడు. కల్హణుడూ అదే చేశాడు. కొందరు రాజాజ్ఞపై ఆధారపడి కావ్యాలు రాశారు. మరికొందరికి దైవం కలలో కనబడి రాయమన్నాడు, రాశారు. ఇంకొందరిని దైవమే రాయించాడు. వారు అలాగే తమ source ను చెప్పుకున్నారు. కల్హణుడు రాజాశ్రయంలో లేడు. కల్హణుడు తన రాజ్యంలో రాజుల చరిత్రను ప్రదర్శించాలని ఎంచుకున్నాడు. దానికి అతడు తన source ను చెప్పాడు.

కశ్మీరును పాలించిన రాజుల చరిత్రను శాసనాల నుంచి, వాళ్ళిచ్చిన దానాల వివరాల నుంచి పలు రకాలుగా సేకరించాడు. కానీ 52 మంది రాజుల వివరాలు దొరకలేదు. వాళ్ళు ఎలాంటి రాజులో, ఒక్క మందిరం కట్టించలేదు, ఒక్క దానం ఇవ్వలేదు, కనీసం వాళ్ళ గురించి ఒక్క కవి కూడా ఒక్క ముక్క కూడా రాయలేదు అని బాధపడతాడు కల్హణుడు. బహుశా, వారు సంప్రదాయ భ్రష్టులేమో అందుకని చరిత్రలోంచి వాళ్ళ పేర్లు తొలగిపోయాయి. కాబట్టి వారు విస్మృతిలో పడిపోయారు. అలా మొత్తం 52 మంది రాజుల వివరాలు దొరకలేదు.

నీలమత పురాణంలో గోనందుడితో సహా నలుగురి రాజుల వివరాలు దొరికాయి. పాశుపత మతాన్ని అవలంబించే హేలరాజు పన్నెండు వేల శ్లోకాలు గల ‘పార్ధావావళి’ రచించాడు. ఈ కావ్యాన్ని చదివిన పద్మమిహిరుడు తన రచనలో అశోకుడి కన్నా ముందున్న లవ మహారాజుతో సహా ఎనిమిది మంది రాజుల వివరాలు పొందుపరిచాడు. ఈ రకంగా తనకు తెలియని 52 మంది రాజులలో 12 మంది వివరాలు తెలుకున్నారు. అశోకుడి నుంచి అయిదుగురు రాజుల వివరాలు ‘ఛవిల్లాకరుడి’ గ్రంథం నుంచి గ్రహించాడు. ‘అశోకుడి నుంచి అభిమన్యుడి’ వరకు గల అయిదుగురు రాజుల వివరాలు ఈ గ్రంథం నుంచి సేకరించాడు. ఈ రకంగా విస్మృతిలో పడిన 52 మంది రాజులలో 17మంది వివరాలు కల్హణుడు సేకరించగలిగాడు, ప్రాచీన గ్రంథాల నుంచి.

ఈ కల్హణుడు వెల్లడించిన sources నుంచి రెండు విషయాలు స్పష్టం అవుతాయి. రాజుల చరిత్రలు, రాజ్యాల చరిత్రలు రాయటం, కావ్యాలలో రాజుల పరంపరను, వంశావళిని ప్రస్థావించటం మన కావ్యరచన సంప్రదాయంలో బాగం. అయితే అవి పాశ్చాత్యులు తరువాత ఏర్పరిచిన ప్రామాణికాల పరిధిలో ఒదగవు. ఎందుకంటే అప్పటి కవులు, ప్రజలు సర్వస్వతంత్రులు. బానిసలు కారు. వారు తమదైన పద్ధతిని ఏర్పాటు చేసుకుని ఆ ప్రకారం జీవించారు. వారిని మన సంకుచిత పరిధిలో ఒదిగించాలని ప్రయత్నించకూడదు.

కల్హణుడిచ్చిన సమాచారం వల్ల తెలిసే రెండవ ప్రధాన విషయం ఏమిటంతే, పాశ్చాత్యులు ప్రకటించినట్టు రాజతరంగిణి ‘ప్రత్యేక రచన’ కాదు. ఇలాంటి రచనలు కశ్మీరంలోనే కాదు, భారతదేశం నలుమూలలా వెల్లివిరిశాయి. ఇందుకు ఉదాహరణ కల్హణుడు తనకు తెలియని రాజుల వివరాలను తనకు ముందు కావ్యాలను రచించిన హేలరాజు, పద్మమిహిరుడు, ఛవిల్లాకరుడి వంటి వారి గ్రంథాల నుంచి సేకరించటమే.

విశ్లేషించి చూస్తే ప్రాచీన భారతంలో ఇప్పటిలాగా కాల్పనిక రచనలు, కాల్పనికేతర రచనలు అన్న విభజన లేదు. చారిత్రక గ్రంథాలు, వైజ్ఞానిక గ్రంథాలు వంటి విభజనలు లేవు. ఒకే రచన కావ్యం కావచ్చు. దాన్లో వర్ణనలు ఉండవచ్చు, చరిత్ర ఉండవచ్చు, కల్పనలు ఉండవచ్చు. మన ప్రాచీనులు సాహిత్యాన్ని మథించి పలు రకాల సిధ్ధాంతాలు ఏర్పాటు చేశారు. పలు రకాల వర్గీకరణలు చేశారు. కావ్య లక్షణాలను నిర్ణయించారు. కావ్య ప్రయోజనాలను తీర్మానించారు. ఇతిహాసాలు, పురాణాలు వంటి విభజనలు చేశారు. ప్రతి విషయాన్నీ అత్యంత సూక్ష్మంగా దర్శించి, విశ్లేషించి, తీర్మానించి, భావితరాలకు మార్గదర్శనాలను ఏర్పరచారు. భామహుడు, ఉద్భటుడు, వామనుడు, ఆనందవర్దనుడు, భట్టనాయకుడు, కుంతకుడు, అభినవ గుప్తుడు, మహిమభట్టు, మమ్మటుడు వంటి వారు కావ్యాలలో శాస్త్రానికి (సౌందర్య శాస్త్రం) బాటలువేసి, వన్నెలు దిద్దినవారు. వీరంతా కశ్మీరానికి చెందిన వారవటం కల్హణుడికి ఎంత గొప్ప వారసత్వం ఉందో ప్రదర్శిస్తుంది.

అప్రస్తుతమైనా ఈ సందర్భంలో ఒక ప్రసిద్ధమైన కథ చెప్పుకోవాల్సి ఉంటుంది. శ్రీహర్షుడు నైషధీయ చరిత రచనను మమ్మటుడికి చూపించి అభిప్రాయం అడిగాడట. ఆ కావ్యం చదివి మమ్మటుడు “అయ్యో! ఈ కావ్యం నాకు కాస్త ముందు చూపించి ఉంటే ఎంత బాగుండేది! నా కావ్య ప్రకాశికలో దోష ప్రకరణంలో పలు రకాల దోషాలకు ఉదాహరణలు చూపించేందుకు పలు విభిన్నమైన కావ్యాలు అనేకం పరిశీలించే బదులు, నీ కావ్యం ఒక్కటీ పరిశీలిస్తే సరిపోయేది. నాకు శ్రమ తప్పేది. నీ కావ్యంలో అన్ని దోషాలకు ఉదాహరణలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. అన్నీ ఒకే చోట లభించేవి” అని బాధపడ్డాడట. అంతటి నిక్కచ్చి విమర్శకులు ఆనాటి వారు. అందుకే తరువాత హర్షుడు సర్గాంతంలో ‘నా కావ్యాన్ని కశ్మీర పండితులంతా మెచ్చుకున్నారు’ అని గొప్పగా రాసుకున్నాడు. బహుశా మమ్మటుడి సూచనలను అనుసరించి దోషాలు సవరించుకుని కావ్యాన్ని పునః రచించి ఉంటాడు శ్రీహర్షుడు.

మన పూర్వీకులు ప్రతి విషయాన్ని తమదైన పద్ధతిలో విశ్లేషించి వర్గీకరించారు. వారికి ఆధునిక పద్ధతులు తెలియవు. అవసరం లేదు. అందుకే వారు కావ్యం, మహాకావ్యం, ఇతిహాసం, పురాణం ఇలా వర్గీకరించారు తప్ప ఆధునికుల ప్రామాణికాలను పట్టించుకోలేదు. కాబట్టి కల్హణుడు తన పూర్వీకులను, పూర్వ సంప్రదాయాన్ని అనుసరించి చరిత్రను వర్ణనలతో, ధార్మిక సూత్రాలు, సిద్ధాంతాలతో అక్కడక్కడా నీతి బోధనలతో మహాకావ్యాన్ని రచించాడు. కానీ చరిత్ర వేరు, వర్ణనలు వేరు అంటూ వేర్వేరుగా వర్గీకరించి, విభజించేవారికి ఇది అర్థం కాలేదు. అశ్వఘోషుడి ‘బుద్ధచరితము’, మగధను పాలించిన కళ్యాణవర్మ చరిత్ర ‘కౌముది మహోత్సవం’, కంచి జీవన విధానాన్ని వర్ణించిన పల్లవరాజు మహేంద్రవర్మ రచన, బాణ భట్టుడి రచన ‘హర్ష చరిత్రము’, వాక్పతి రాజు రచన ‘గౌడవాహో’ , పద్మరాజు రచన ధారా రాజు సింధురాజు చరిత్ర , బిల్హణుడు రచన ‘విక్రమాంక దేవచరిత్ర’ , ఇవన్నీ చరిత్రను పొందుపరుచుకున్న కావ్యాలే. ఇవన్నీ కల్హణుడి కన్నా ముందు రాసిన రచనలు. ప్రచారంలోకి వచ్చిన రచనలు. కాబట్టి కల్హణుడి రాజతరంగిణి ఒక్కటే భారతీయ వాఙ్మయంలో చరిత్రను ప్రదర్శించే రచన కాదు. దాన్ని అలా పరిగణించడం అన్యాయం.

ఇటీవలి కాలంలో వేల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్, సంజయ్ సుబ్రహ్మణ్యంలు ‘టెక్చర్స్ ఆఫ్ టైమ్’ అన్న పుస్తకంలో దక్షిణ భారతానికి చెందిన మధ్యయుగపు కావ్యాలలోని చరిత్రపై దృష్టిని సారించారు. మధ్యయుగంలో రచించిన కావ్యాల నుండి చరిత్రను గ్రహించవచ్చని సాధికారికంగా వాదించారు. అయితే అదే పుస్తకంలో వారు చరిత్ర రచనగా రాజతరంగిణిని కొట్టిపారేశారు. రాజతరంగిణిని చరిత్ర రచనగా అంగీకరించేందుకు ఇష్టపడలేదు. ఇది మన కావ్యాలను మనమే సరిగ్గా అర్థం చేసుకోవటం లేదనిపించేట్టు చేసే అంశం. ఏ కావ్యం లోనయినా ముందుగా ఉండేదే రాజవంశ వర్ణన, కవి కుల వర్ణన. ఇలాంటి అంశాల ద్వారా చరిత్రకు సంబంధించిన అంశాలను తెలుసుకోవచ్చని మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి వారు చేసిన ప్రయత్నాలను కాదన్నట్టు. ఒకటి గొప్పదని నిరూపించేందుకు మరో దాన్ని తక్కువచేయనవసరంలేదు. అదీగాక, దక్షిణాది కావ్యాలలో చరిత్ర ఉండి, ఇతర ప్రాంతాల కావ్యాలలో చరిత్ర లేదనడం అసంబద్ధం. తమ రచనలలో చరిత్రను పొందుపరచటం భారతీయ కావ్య సంప్రదాయం.

ఇటీవలి కాలంలో ‘Historical Fiction’ రచనల వర్గీకరణకు సంబంధించిన చర్చల్లో సమకాలీన సామాజిక, రాజకీయ పరిస్థితులను, సంఘటనలను ప్రదర్శించే నవలలను కూడా historical fiction రచనగా భావించవచ్చని నిర్ణయించారు. మామూలు సాంఘిక రచనల నుంచి కూడా సామాజిక పరిస్థితులను, చరిత్రను గ్రహించే ప్రయత్నాలు జరుగుతుంటే, ఎంతో సమాచారాన్నిచ్చే ప్రాచీన కావ్యాల నుంచి చారిత్రక అంశాలను గ్రహించే వీలు లేదని విస్మరించటం కూడని పని. కాబట్టి కల్హణుడి ‘రాజతరంగిణి’ ఒక్కటే మనకున్న ‘చారిత్రక కావ్యం’ అన్న తీర్మానం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే కల్హణుడు తనకు ముందున్న రచనల నుంచి కూడా రాజుల పేర్లను, వారికి సంబంధించిన అంశాలను సేకరించాడు, రాజతరంగిణిని నిర్మించాడు.

రాజతరంగిణి నిర్మాణంలో కల్హణుడు తన పూర్వీకులను అనుసరించాడని నిరూపించే మరో అంశం, రాజతరంగిణిలో రాజుల గాథలను చెప్పడంలో అతడు ఎంచుకున్న ‘శ్లోకకథ’ పద్ధతి. ‘శ్లోకకథ’ అన్న పదం ‘విట్నీ కాక్సన్’ అనే ఆయన ‘లిటరరీ రిజిస్టర్ అండ్ హిస్టారికల్ కాన్షియస్‌నెస్ ఇన్ కల్హణ’ అనే వ్యాసంలో వాడేడు. ఈ ‘శ్లోకకథ’ అంటే ఏమిటో తెలుసుకుంటూ, భారతీయ సాహిత్యంలోని శ్లోకకథల గురించి చర్చిస్తూ, కశ్మీరులో కల్హణుడికి మార్గదర్శకంగా నిలిచిన శ్లోకకథల గురించి తెలుసుకుని, కల్హణుడి రాజతరంగిణిపై శ్లోకకథ రచన ప్రభావాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. అప్పుడు రాజతరంగిణి భారతీయ వాఙ్మయ సాగరంలో ఎగసిపడిన ‘అల’ అని స్పష్టమవుతుంది. అనేక చారిత్రక కావ్య రచన పరంపరలో రాజతరంగిణి ఒకటని అర్థమవుతుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here