Site icon Sanchika

కశ్మీర రాజతరంగిణి-8

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]సో[/dropcap]మదేవుడు, గుణాఢ్యుడు పైశాచిక భాషలో రచించిన బృహత్కథను సంస్కృతంలో రచించాడు. సంస్కృత శ్లోకాలను ఉపయోగిస్తూ బృహత్కతను ‘కథాసరిత్సాగరం’గా అనువదించాడు. కథలను శ్లోకాల ద్వారా చెప్పినందుకు ఈ ప్రక్రియను ‘శ్లోకకథ’గా వర్గీకరించారు. సోమదేవుడు 11వ శతాబ్దికి చెందినవాడు. కశ్మీరరాజు అనంతుడి భార్య సూర్యమతికి సన్నిహితుడు. ఆమె జలంధర రాకుమారి. వివాహానంతరం కశ్మీరుకు వచ్చింది. ఆమె కోరికను అనుసరించి సోమదేవుడు ‘కథాసరిత్సాగరం’ రచించాడు. అయితే కథను శ్లోకాల ద్వారా చెప్పటం కశ్మీరులోని కవులకు అలవాటు. ‘బృహత్కథ’ కశ్మీరుకు చెందిన కావ్యం కాదు. భారతదేశానికి చెందిన కావ్యం. అది ప్రాకృత భాషలో ఉన్నది. దాన్ని సంస్కృతంలోకి అనువదించటం అనే కన్నా పునః రచించటం అనవచ్చు. ఎందుకంటే సోమదేవుడు కశ్మీరుకు ప్రత్యేకమైన వర్ణనలతో, పద్ధతులతో బృహత్కథను స్థానికగాథగా మలుస్తూనే దాన్లో మౌలికంగా ఉన్న సార్వజనీనతను ప్రదర్శించాడు. దీన్లో సోమదేవుడిపై తొమ్మిదవ శతాబ్దానికి చెందిన అభినందుడి ‘కాదంబరి కథాసార’ ప్రభావం కనిపిస్తుంది. ‘కథాసరిత్సాగరం’లో సోమదేవుడు ఉన్న కథని అలాగే ప్రదర్శిస్తూ, దానిలో తన స్వీయ సృజనాత్మకతను ప్రదర్శించాడు. ఎలాగయితే భారత గాథను నన్నయ్య, తిక్కన, ఎర్రనలు వ్యాస భారతానికి అనువాదంగా చెప్పుకున్నా, ఎవరికి వారు తమ సమకాలీన పద్ధతులు ప్రదర్శిస్తూ, తమ అభిప్రాయాలను, స్వీయవ్యక్తిత్వాన్ని రచనకు ఆపాదిస్తూ దాదాపుగా స్వతంత్ర రచనలా సృజించారో, సోమదేవుడు కూడా కథాసరిత్సాగరాన్ని అలాగే కశ్మీరు పరిస్థితులకు, కశ్మీరులో చలామణీ అయ్యే సంస్కృత కావ్యంగా సృజించాడు. అంటే సోమదేవుడి కథాసరిత్సాగరం కొన్ని వందల ఏళ్ళుగా కశ్మీరులో చలామణీలో ఉన్న సంస్కృత సాహిత్య ప్రభావాన్ని తనలో పొదుగుకున్నటు వంటి అపురూపమైన రచన అన్నమాట.

‘కథాసరిత్సాగరం’ గుణాఢ్యుడి మూలం ‘బృహత్కథ’ ఆధారంగా రచించినదయినా దాన్లో కశ్మీరు రాజ్య సభలలోని పరిస్థితులు, కుట్రలు వంటివన్నీ ప్రదర్శితమయ్యాయి. కథాసరిత్సాగరంలో 124 అధ్యాయాలున్నాయి. 20 వేల శ్లోకాలున్నాయి. కథాసరిత్సాగరం ప్రధానంగా విద్యాధరులు అనే గంధర్వులు, నరవాహనదత్తుకు సంబంధించిన గాథ అయినా బోలెడన్ని ఉపకథలుంటాయి. ఉపకథలు అంతర్లీనంగా నీతులు చెప్తాయి. ప్రపంచ రీతిని ప్రదర్శిస్తాయి. అంటే కథ చదవటం కేవలం వినోదాత్మకమే కాకుండా విజ్ఞానదాయకమూ, విద్యావిషయికమూగా కూడా ఉంటుందన్న మాట. ఈ విషయంలో ‘కథాసరిత్సాగరం’ అటు పంచతంత్ర ప్రభావం, ఇటు ‘హితోపదేశం’ ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. అంటే, కశ్మీరును భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో అంతగా సంబధం లేని ప్రాంతంగా చూపాలని ఎంతగా ప్రయత్నించినా భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో సృజించిన కావ్యాల ప్రభావం కశ్మీరు కలాలపై ఉండడంతో కశ్మీరం భారతదేశంలోని ఇతర ప్రాంతాల వంటిదేనని స్పష్టమవుతుంది. ముఖ్యంగా ‘కథాశ్లోక’ పద్ధతి కశ్మీరుకే ప్రధానం కాదని, దండి ‘కావ్యాదర్శం’లో కథకు ఇచ్చిన నిర్వచనం నిరూపిస్తుంది.

‘కథ’ రచన భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో వర్దిల్లింది. సుబంధ రచన ‘వాసవదత్త’,  బాణుడి రచనలు ‘కాదంబరి’, ‘హర్షచరితము’, దండి రచన ‘దశకుమార చరిత’ వంటివి దేశమంతా ఎంతో ప్రాచుర్యం పొందిన రచనలు కశ్మీరులో కూడా విస్తృతమైన ప్రచారం పొందాయి. బాణుడి కాదంబరి కశ్మీరులో ‘కాదంబరి కథాసారం’గా శ్లోకకథగా రూపాంతరం చెందింది. ఏరియల్ స్టెయిన్ అనే ఆయన ‘రాజతరంగిణి’పై ‘హర్షచరిత’ ప్రభావాన్ని నిరూపించాడు. కల్హణుడి కన్నా ముందు శ్లోకంలో కథను చెప్పిన క్షేమేంద్రుడి ‘బృహత్కథామంజరి’, ‘భారతమంజరి’, ‘అవదాన కల్పలత’, జయద్రధుడి ‘హరచరిత చింతామణి’ వంటి రచనలు కశ్మీరులో చలామణీలో ఉన్నాయి.

కథాసరిత్సాగరం ఆరంభ అధ్యాయం పేరు ‘కథాపీఠం’! ఈ అధ్యాయంలో దేవుడి వదనం నుంచి బృహత్కథ సాహిత్యం ద్వారా మానవ ప్రపంచంలోకి రావటం గురించి ఉంటుంది. ఈ అధ్యాయంలోనే సోమదేవుడు ‘కథాసరిత్సాగరం’ రచన సంవిధానాన్ని, పరిధులను, చెప్పే విషయాలను, ఉద్దేశాలను సర్వం విశదీకరిస్తాడు. ‘కథ’ అన్నది మనకు పంథొమ్మిదవ శతాబ్దంలోనే వచ్చిందని తీర్మానించేవారు డండిని, సోమదేవుడిని చదవాల్సి ఉంటుంది. ఈ నడుమ క్షేమేంద్రుడు ఉంటాడు.

కల్హణుడు కూడా రాజతరంగిణి రచనలో ఇదే పద్ధతిని పాటించాడు. సోమదేవుడి రచనకూ, కల్హణుడి రచనకూ నడుమ దాదాపుగా 80 ఏళ్ళ తేడా ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఈ ఎనభై ఏళ్ళు కశ్మీరు చరిత్రలో అత్యంత ప్రాధాన్యం వహిస్తాయి. కశ్మీరు అల్లకల్లోలమయింది. కశ్మీరంలోకి తురుష్క ప్రభావం ప్రవేశించింది. లొహార వంశం అంతరించింది. రాజ్యం కోసం రక్తపాతం జరిగింది. కల్హణుడి తండ్రి హర్షుడి ఆస్థానంలో పని చేసేవాడు. చివరిదశలో ఆయన రాజ ఆస్థానం వదిలేశాడు. కల్హణుడు ఎలాంటి రాజాశ్రయం స్వీకరించలేదు. కానీ రాజ్యంలో జరిగే రాజకీయ కుట్రలను, మనస్తత్వాలను అతి దగ్గరగా చూశాడు. అర్థం చేసుకున్నాడు. ఇకపై గతంలోని కశ్మీరుకు, వర్తమానంలోని కశ్మీరుకూ, భవిష్యత్తులో ఎదిగే కశ్మీరుకు నడుమ ఊహించలేనంత అంతరం ఉంటుందని అర్థం చేసుకున్నాడు. తాను ఎరిగి ఉన్న సమాజాన్ని, జీవన విధానాన్ని భవిష్యత్తుకు సజీవంగా అందించాలనుకున్నాడు. ఎందుకంటే, అప్పటికే ప్రాచీన కశ్మీరు చరిత్ర మరుగున పడుతోంది. జీవన విధానం రూపాంతరం చెందుతోంది. విలువలు మారిపోతున్నాయి. ఒకప్పటి వ్యక్తిత్వాలు ఇప్పుడు చెప్పినా నమ్మలేనివిగా కనిపిస్తున్నాయి. దాంతో తాను తెలుసుకున్నది, చూస్తున్నది, అనుభవించినది, ఊహించినది, అర్థం చేసుకున్నది తన రచన ద్వారా భవిష్యత్తు తరాలకు అందించాలనుకున్నాడు. ఫలితంగా రాజతరంగిణి రచించాడు. కల్హణుడికి తాను ఏం చేస్తున్నాదో, తన లక్ష్యం ఏమిటో, దాని ఫలితం ఏమిటో స్పష్టంగా తెలుసు. ఇది ఉపోద్ఘాత శ్లోకాలు స్పష్టం చేస్తాయి.

ఇయం నృపాణాముల్లాసే హాసే వా దేశకాలయోః।
భైషజ్య భూతసంవాదికథా యుక్తోపయుజ్యతే॥
సంక్రాంతాప్రాక్తనానంత వ్యవహారః సుచేదసః।
కస్వేదృశో న సందర్భో యది వా హృదయంగమః॥
(కల్హణ రాజతరంగిణి 21, 22)

‘ఈ రాజతరంగిణి భవిష్యత్తులో పదవులు పొంది, కోల్పోయి జీవితాన్ని అనుభవిస్తున్న రాజులందరికీ దివ్య ఔషధంలా ఉపయోగిస్తుంది. అసంఖ్యాకులైన రాజుల చారిత్రక గాథలు కలిగిన ఇలాంటి కావ్యం సహృదయులయిన వారందరికీ ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది’ అంటాడు కల్హణుడు.

రాజతరంగిణి ద్వారా కల్హణుడు రాజులకు పాఠాలు నేర్పాలనుకుంటున్నాడు. రాజులకు క్షణభంగురము, అశాశ్వతమయిన జీవితంలో, అశాశ్వతమయిన అధికారాన్ని చూసి అహంకరించవద్దని స్పష్టం చేయాలనుకుంటున్నాడు. పదవి కోసం ఆరాటపడి కుట్రలు, కుతంత్రాలు చేసి, అల్లకల్లోలం చేసిన వాడికి రాజ్యాధికారం దక్కదు. ఏదీ వద్దనుకుని సర్వం త్యజించిన వాడిని రాజ్యలక్ష్మి వరిస్తుంది. అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ అదే శాశ్వతం అని అహకరించినవాడు, సర్వం కోల్పోయి రాజ్యంలో ప్రజల ఛీత్కారాలు అనుభవిస్తూ, దుర్భరమైన మరణం అనుభవించవచ్చు. ప్రజలకు మేలు చేసిన రాజు ప్రశాంత జీవనం అనుభవించవచ్చు. పాఠాలు రాజులకేనా? సామాన్యులకు కాదా? అని రంధ్రాణ్వేషణ చేసేవారు ఒక విషయం గ్రహించాలి. వందమంది సామాన్యులకు చెప్పేకన్నా ఒక రాజుకు నీతి బోధిస్తే సమస్తప్రజానీకానికి బోధించినట్టే . ఏదీ శాశ్వతం కాదని గ్రహించి ధర్మం నెరవేర్చాలని, ధర్మబద్ధంగా జీవించాలని రాజతరంగిణి చదివిన వారికి అర్థమవుతుంది.

కల్హణుడు కథాసరిత్సాగరం ప్రజలను విశేషంగా ఆకర్షించటం అర్థం చేసుకున్నాడు. రాజుల సాహస గాథలు, విజయాలు పరాజయాలు, గొప్పతనాల గాథలు ప్రపంచరీతిని అర్థం చేసుకోవడంలోనే కాదు, ఆసక్తికరంగానూ ఉంటాయని తెలుసుకున్నాడు. కథలు చెప్పే పద్ధతిని అనుసరిస్తూ రాజుల చరిత్రలను చెప్పాడు. గతంలోని కావ్యాలు ఒక రాజు గురించో, ఒక రాజ వంశం గురించో చెప్పేవి. వారి సాహసాలు, విజయాలు చెప్పేవి. ‘రఘువంశం’ రఘువంశ రాజుల గాథలు చెప్తుంది. కతాసరిత్సాగరం రాజుల సాహస గాథలు చెప్తుంది. ఇలా చెప్పటంలోని ప్రయోజనాన్ని, అది ప్రజలకు ఇవ్వగల సందేశాన్ని, వినోదాన్ని, తనకు అందించగల చిరంజీవత్వాన్ని కల్హణుడు అర్థం చేసుకున్నాడు. ఇతరులు ఒక రాజు, రాజ వంశం గురించి రాస్తే, వారి బాటను అనుసరిస్తూ తాను కశ్మీరుకు చెందిన రాజుల చరిత్రను రాశాడు. ఎలాగయితే ఆయా కావ్యాల ద్వారా ఆనాటి చరిత్ర, జీవనవిధానంతో పాటు ప్రజలకు వినోదం, విజ్ఞానం లభిస్తోందో, రాజతరంగిణి ద్వారా వినోదాన్ని విజ్ఞానాన్ని అందించాలనుకున్నాదు. అందుకే తన రాజతరంగిణి క్షణభంగురమైన జీవిత అశాశ్వత్వాన్ని భవిష్యత్తు రాజులకు బోధించి వారికి బాధ్యతను బోధిస్తుందని, ధర్మానువర్తులను చేస్తుందని ఆశించాడు. ఏమీ లేకపోయినా ఇలా రాజుల గాథలు ఒకటొకటిగా చదువుతూండటం మనోరంజకంగా ఉంటుందని భావించాడు. ఇది భారతీయ కావ్య రచనలో మౌలిక సిద్ధాంతం, లక్ష్యం.

కామార్థ గుణ సంయుక్తం ధర్మార్థ గుణ విస్తరం।
సముద్రం ఇవ రత్నాఢ్యం సర్వ శ్రుతి మనోహరం॥
(వాల్మీకి రామాయణం, బాలకాండ-III-8)

రామాయణం రాముడి గాథ చెప్తుంది. రాముడి కథ చెప్తూ, ధర్మార్థ కామ మోక్షాల గురించి విస్తారంగా చెప్తుంది. ఇలాంటి రత్నాలు సమృద్ధిగా వున్న సముద్రం లాంటి రామాయణం ప్రజల హృదయాలను ఆకర్షిస్తుంది.

ఇది రామాయణం రచించటంలో వాల్మీకి ఉద్దేశం. ఇక్కడ రాజుల కథ చెప్తున్నామా? పేదవాడి కథ చెప్తున్నామా? అన్నది ప్రధానం కాదు. మనం చెప్తున్న కథ ద్వారా ప్రజలకు జీవితం గురించి ఎంత వరకు అర్థమవుతున్నది, ధర్మం గురించి అవగాహన ఎంత వరకూ వస్తుంది, మంచి చెడులను గ్రహించే విచక్షణ ఎంతవరకూ వస్తుంది వంటి విషయాలు ప్రాధాన్యం. ఆ చెప్పేది ఆకర్షణీయంగా చెప్పటం వల్ల వినోదంతో పాటు విజ్ఞానం వస్తుంది. ఇదీ భారతీయ సృజన ప్రధాన లక్ష్యం. కల్హణుడు కూడా రాజతరంగిణి లక్ష్యం ఇదేనని చెప్తున్నాడు.

తన రచనకు ‘రాజతరంగిణి’ అని పేరు పెట్టటంలోనే కల్హణుడి ఉద్దేశం తెలుస్తోంది. సముద్రంలో అలలు రావటం సర్వసామాన్యం. నిరంతరం ఎగసిపడిన అల విరగటం తథ్యం. విరిగిన అల తరువాత ఎగిసి పడుతుంది. తరతరాలుగా ఇది జరుగుతూనే ఉంది. జరుగుతూనే ఉంటుంది. ఇది తెలుసుకోవటం ద్వారా జీవితంలోని క్షణభంగురత్వం అర్థం చేసుకుని దేనికీ ఆశపడక, పొంగక, క్రుంగక ‘శాంతం’గా ఉండాలని అర్థం చేసుకోవాలి. ఇది రాజతరంగిణి రచన ప్రధానోద్దేశం. కథాసరిత్సాగరం పేరును కాస్త మారిస్తే రాజతరంగిణి అవుతుంది.

అయితే భారతీయ కావ్య సృజన పద్ధతి, ఉద్దేశాల గురించి అవగాహన లేనివారు కల్హణుడికి లేనిపోని ఉద్దేశాలు అంటగట్టి రాజతరంగిణిని అనువదించారు. కల్హణుడు ‘ఎగసిపడే రాజులకు రాజతరంగిణి ఔషధంలా పనిచేస్తుంద’న్న వాక్యాన్ని ఆధారం చేసుకుని కల్హణుడు తనకు ఇష్టం వచ్చినట్టు రాజుల పాలనా కాలాన్ని పెంచాడని తీర్మానించారు. కల్హణుడు రాజతరంగిణిలో ప్రదర్శించిన తేదీలను నమ్మనవసరం లేదని అభిప్రాయపడ్డారు. రాజతరంగిణిలో చివరి రెండు భాగాలు మాత్రమే చరిత్ర అని, మిగతా అంతా నమ్మదగింది కాదని తీర్మానించారు. కానీ రాజతరంగిణిలో చరిత్ర చెప్పటం, తాను భవిష్యత్తు తరాలకు అందించాలనుకుంటున్నది అందించటానికి ఆయుధమే తప్ప, చరిత్ర చెప్పటమే తన లక్ష్యం కాదని కల్హణుడు స్పష్టంగా చెప్పాడు. కల్హణుడే కాదు భారతీయ సృజనాత్మక కళాకారులందరికీ తమ సృజన భగవదంకితం, అది వినోదాత్మకం, విజ్ఞానాత్మకం అంతే…

ఈ విషయం కల్హణుడి కాలంలోనే సమకాలీనులు గ్రహించారని ‘శ్రీకంఠ చరిత్ర’ చివరలో మంఖుడు కల్హణుడి గురించి చెప్పినది స్పష్టం చేస్తుంది.

శ్రీమాన్ అనలకదత్తోయమ్ అనల్పమ్ కావ్యశిల్పిసు।
స్వ పరిశ్రమ సర్వస్యన్యాస సభ్యమ్ అమాన్యతా॥
తథోప చస్కరే యేన నిజ వాఙ్మయ దర్పణః।
బిల్హణ ప్రౌఢి సంక్రాతౌ యథా యోగ్యత్వమ్ అగ్రహీత్॥
తత్తబ్దహు కథాకేళి పరిశ్రమ నిరంకుశమ్।
తమ్ ప్రశ్రాయ ప్రయత్నేన కళ్యాణమ్॥

అనలకదత్తుడు కల్హణుడిని కవులలో ఉత్తముడిగా భావించాడు. స్వయంకృషితో రచనలు చేసేవాడు కల్హణుడు. బిల్హణుడు సైతం కల్హణుడి గొప్పతనాన్ని ఒప్పుకున్నాడు అని మంఖుడు కల్హణుడి గురించి తన రచనలో ప్రస్తావించాడు. అంటే కల్హణుడు స్వతంత్రపు టాలోచనలు కలవాడు. ఎవరిపై ఆధారపడనివాడు. స్వయంకృషితో కావ్యరచన చేస్తున్నవాడు. కథారచనలో నిష్ణాతుడు. ఆ కాలంనాటి పెద్దలందరి ప్రశంసలు పొందినవాడు కల్హణుడని స్పష్టమవుతోంది. అలాంటి కల్హణుడు తన ఇష్టం వచ్చినట్టు రాజుల పాలానా కాలాన్ని పెంచుతాడని ఊహించటం కూడా కుదరదు. గతంలో కవులెవరూ ఇలా లేనిపోనివి సృష్టించి రాయలేదు. కల్హణుడు రాయడు.

(ఇంకా ఉంది)

Exit mobile version