Site icon Sanchika

కాశ్మీర్ యాత్ర -2

[box type=’note’ fontsize=’16’] హిమాలయాలకు నెలవు, ప్రకృతి అందాలకు కొలువు, భూతల స్వర్గమని కవులు అభివర్ణించిన కాశ్మీరులో తమ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరి. [/box]

పహల్‌గామ్

[dropcap]శ్రీ[/dropcap]నగర్‌లో పరిమహల్ చూసి లంచ్‌కి దాల్ లేక్ దగ్గర్లో ఉన్న హోటల్‌లో కాశ్మీరీ శాకాహార భోజనం చేసాము. లంచ్ తరువాత బయలుదేరి పహాల్‌గామ్‌కి బయలుదేరాము. దాదాపు 3 గంటల ప్రయాణం ఆహ్లాదకరంగా జరిగింది.

దారిపొడవునా ఆక్రూట్ చెట్లు. మహా వృక్షాలు. వాటిని చెస్ట్ వుడ్ పేరుతో ఫర్నిచర్ చేస్తారు. దృఢంగా ఉంటాయట. దారిలో నది పాయ వెంట ప్రయాణం. దారిలో ఒక ఊరంతా క్రికెట్ బ్యాట్స్ తయారీ అమ్మకం కనిపించింది. దరి ప్రక్కన అక్కడక్కడా భద్రతా దళాల పహారా కనిపించింది. నా కలవరం చూసిన డ్రైవర్ భయం లేదన్నాడు. అనంతనాగ్ టౌన్ మీదుగా టీ టైం కి హోటల్ చేరాము. శ్రీనగర్ నుండి 94 కిమీ.దూరం.

లిడ్డర్ నదికి ఆవలి ఒడ్డున ఉంది మా హోటల్. హోటల్ హీవాన్. అటు చేరటానికి పెద్ద వంతెన ఉంది. క్రింద ప్రవహిస్తున్న నది నీలి పచ్చ రంగుల మేళవించిన రంగులో కనిపించింది. వింతగా ఫీల్ అయ్యాము. హోటల్ స్టాఫ్ వచ్చి మా బాగ్స్ తీసుకుని మాకు దోవ చూపారు. కార్ ఈవలి ఒడ్డునే పార్క్ చేసారు. నది ఒడ్డునే ఉన్న ఒక అందమైన పెద్ద హోటల్. నదికి ఎదురుగా గదులు. నది ఒడ్డుకు దగ్గర్లో క్రింద సమ్మర్ రెస్టారెంట్. పైన ఇంకో రెస్టారెంట్.

పచ్చని పచ్చిక బయళ్ళు. పూలు. నచ్చేసింది మా చిన్ని ప్రకృతికి.

రూంలో బాగ్స్ పెట్టి త్వరగా ఫ్రెష్ అయ్యి రెస్టారెంట్‌కి వచ్చాము. స్నాక్స్, టీ తదితరాల సెర్వింగ్ టైం అయిపోతున్నందున. కావాల్సిన రెఫ్రెష్‌మెంట్స్ తిని, రిసెప్షన్ దగ్గరున్న అందమైన లాబీలో కూర్చున్నాము. ప్రకృతి అటు ఇటు పరుగిడి ఆడుకుంటోంది. బైటకి వెళ్దామంటే, అందరం వెళ్ళాము. పూల పరిమళాలు ఆకర్షించబడి వచ్చిన రంగురంగుల అనేక సీతాకోక చిలుకలు ఆనందింపచేశాయి. మా ప్రకృతి “మై బట్టర్‌ఫ్లయ్స్!” అని, “హాగ్ మీ!” అని వాటిని పిలిచి పరుగెత్తింది. బాల్యం ఎంత మధురం, అందరు నేస్తాలే! నో ఫియర్. వయసుతో పాటు కపటం పెరుగుతుంది. ఉఫ్!

పొద్దు గుంకుతున్న సమయంలో చలి ఎక్కువ అవుతుంటే లోపలికి వచ్చి మా రూంలో మా ప్రకృతి సెకండ్ బర్త్ డే ఏర్పాట్లు మొదలు పెట్టాము. దానికి నచ్చే రంగుల బెలూన్స్, వెలిగే బెలూన్స్, కేక్, పూలు. కొత్త డ్రెస్‌తో మా గదిలోకి తొంగి చూస్తూ మసక వెలుతురుగా ఉండటంతో “అమ్మమ్మా! తాతా!” అని పిలిచి వచ్చింది. వెలుగుతున్న బెలూన్స్ చూసి “బెలూన్స్! లైట్స్!” అని క్లాప్స్ కొట్టి హ్యాపీగా ఫీల్ అయ్యింది. హ్యాపీ బర్త్ డే సాంగ్‌తో పార్టీ చేసుకున్నాము. కబుర్లు, భోజనం తరువాత నెక్స్ట్ డే స్థానిక పర్యాటక ప్రదేశాలు చూడాలని లిస్ట్ వేసుకుని, త్వరగా వెళదామని ప్లాన్ చేసాము.

మేము ఉదయం త్వరగా రెడీ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చెయ్యటానికి క్రిందకు వచ్చాము. వివిధ రకాల అల్పాహారం తయారుగా ఉంది. వెజ్, నాన్ వెజ్. మన పొట్ట పట్టినంత తినొచ్చు. కాశ్మీర్‌లో దొరికే లోకల్ ఆపిల్స్, ఇతర పండ్లు చాల పెట్టారు.

అల్పాహారం తరువాత కొద్దిసేపు హోటల్ లాన్స్‌లో మా ప్రకృతితో పరుగెత్తి ఆడుకున్నాము. హోటల్ క్రింది లెవెల్‌లో ఉన్న ఇంకో రెస్టారెంట్ వైపునుంచి దిగి లిడ్డర్ నది ఒడ్డుకు వెళ్ళాము. నీళ్లలో కాళ్ళు పెట్టి కొండ రాళ్లపై కూర్చున్నాము సూరీడి ప్రశాంత వదనం చూస్తూ. నిత్య జీవితంలో మనకి దొరకని, వీలవని అనుభూతులు, ప్రకృతి ఒడిలో హాయి ఇలాంటి యాత్రల్లో దొరుకుతాయి. అందులోను ‘నో చరవాణి’! అదేనండి. సెల్ ఫోన్! అందువల్ల మనకు లేదా మనము ఫోన్లు చేసి ఏమిచేస్తున్నామనే రిపోర్ట్ ఇవ్వక్కర్లేదు. అంతేకాదు నో ఇంటర్నెట్. సో తీరిగ్గా మనం చూస్తున్న, ఆస్వాదిస్తున్న దృశ్య కావ్యాలను మనస్సులో పదిలపరచుకోవచ్చు.

నా వరకు నాకు ప్రయాణంలో రెప్పకొడితే ఏ అందాన్ని మిస్ అవుతానో అని కలత చెందాను.

లిడ్డర్ నది వాటర్ కలర్ అద్భుతంగా ఉంది. బ్లూ గ్రీన్ మిళితం. వింతగా అనిపించింది. లిడ్డర్ నది కోలాహాయి గ్లేసియర్ సోనామార్గ్ నుండి పుట్టి 75 కిమీ ప్రయాణించి జీలం నదిని mirgund khanabal అనేచోట కలుస్తుంది. నది నీరు స్వచ్ఛమైన నీలి రంగులో ఉంటాయి. ఆ నది ఒడ్డున ఉన్న హోటల్‌లో నదిని చూస్తూ పరవళ్లు వింటూ ఉండటం అద్భుత అనుభవం.

ఉదయం త్వరగా బయలుదేరి పహల్‌గామ్ లోని దర్శనీయ ప్రదేశాలు చూడటానికి వెళ్ళాము. మొదటగా చందన్వారికి వెళ్ళాము. మా హోటల్ నుండి 40 నిమి ప్రయాణం. అందమైన పరిసరాలు. అరు లోయలో ప్రవహిస్తున్న లిడ్డర్ నది తో పాటుగా మా ప్రయాణం సాగింది. మలుపులు తిరిగే ఇరుకు రోడ్లు, లోతైన లోయ, ఎత్తైన దేవదారు వృక్షాలు అక్కడక్కడా దూరంగా కనిపించిన మంచు మధ్య మా ప్రయాణం ఆహ్లాదంగా సాగింది. డ్రైవర్ చెబుతున్న లోకల్ విషయాలు మౌనంగా వింటూ ప్రయాణం.

మొదటగా glacier పాయింట్ వద్ద ఆగాము. ఎత్తైన కొండల మధ్య లోపలి ఉన్న మంచు ప్రదేశం. కొద్దిదూరం అందరం కలిసి ఎక్కాము. గడ్డకట్టిస్తున్న మంచు గాలులు, పారుతున్న నీటి పాయ. కొద్దిదూరం వెళ్ళాక మా

చిన్ని ప్రకృతి వణకటం ప్రారంభించింది చలికి. ఉన్ని డ్రెస్సులు ఉన్న చాలలేదు. పాపను తీసుకుని నేను, నాకు తోడుగా మా వారు క్రిందికి టీ స్టాల్ వద్దకి వచ్చి ఎండలో కూర్చుని టీ ఆర్డర్ చేసాము. మా అమ్మాయి, అల్లుడు పై దాకావెళ్లి వచ్చారు. కొండలు మంచుకరిగి పొయ్యి వెలవెలపోతున్నాయి. వాళ్ళు వచ్చి టీ తాగక అక్కడే ఉన్న లిడ్డర్ నది ఒడ్డుకు వెళ్ళాము. నీటి ఒడ్డున కూర్చుని ఐస్ వాటర్‌ని పట్టుకుంటే వణికిపోయాము. బట్ ఎంజాయ్ చేసాము.

నెక్స్ట్ పాయింట్ బేతాబ్ లోయ. దీనికి ఆ పేరు బేతాబ్ అనే హిందీ సినిమా షూటింగ్ అక్కడే జరగటంతో వచ్చి స్థిరపడిందిట. కొన్ని గేమ్స్, వాటర్, క్యాంపింగ్ ఏరియాస్ ఉన్నాయి. చందన్వారికి దగ్గర్లో ఒక శిఖరం ఎక్కితే ఆవలి వైపు అందమైన లోయ ఉందని చెప్పారు. దాన్ని చూడాలంటే గుర్రాలు ఎక్కాలని చెప్పారు. అందమైన స్విస్ దేశంలా ఉంటుందని ఊరించారు. ఎలాగూ అక్కడిదాకా వెళ్ళటం ఇప్పట్లో కుదరకపోవచ్చని ఇండియన్ స్విస్ సైడ్ చూద్దామని నిర్ణయించుకుని గుర్రాలు ఎక్కాము. మా వారు తప్ప.

మా చిన్ని ప్రకృతి భయం లేకుండా మా అల్లుడితో గుర్రం ఎక్కింది. నేను జీవితంలో ఎప్పుడూ గుర్రం ఎక్కలేదు. సో భయం. ఎక్కాలని కోరిక. చివరకి కోరిక జయించింది. గుర్రం వాళ్ళు వాటిని పట్టుకుని మన వెంటనే వస్తారు.

అవి సన్నని దారివెంట పైకి ఎక్కుతుంటే వణుకుపుట్టింది. మధ్యలో నీటికోసం ఆగాయి. ఒకచోట పడిపోతున్న ఫీలింగ్. చివరకు పైకి చేరాము. ఆశ్చర్యం అక్కడ మాకు మావారు స్వాగతం పలికారు. పైకి సులువుగా నడచి వచ్చారట. ఓహ్. మై గాడ్. లోకల్ బిజినెస్ ట్రిక్ అప్పుడు అర్థం అయ్యింది. ఎనీవే అదొక గొప్ప అనుభవం. ఆవలి వైపు పచ్చని పచ్చిక, పెద్ద చెట్లు, నీళ్లు ఉన్నాయి. ఫొటోస్ తీసుకుని కొద్దిసేపు గుర్రం మేడే తిరిగి క్రిందకు వచ్చాము. గుర్రానికి 300 రూ తీసుకున్నారు. చెప్పొద్దూ గుర్రం ఎక్కినప్పుడు భయం వేసిన కొద్దిసేపటికి పరిసరాల అందంలో భయం పారిపోయింది. అంతేకాదు నామటుకు నాకు పాత కౌబాయ్ సినిమాల్లోలా గొప్ప ఫీలింగ్ వచ్చింది. నవ్వుకున్నాను.

అక్కడనుండి కొద్దీ దూరంలో ఉన్న హిందువుల పరమ పవిత్ర యాత్ర అమర్‌నాథ్ యాత్రకి సంభందించిన తొలిమెట్ల దర్శనం చేసుకున్నాము. కొండలు తొలిచి ఏర్పరిచిన పురాతన మెట్లు. కొద్దీ దూరం ఎక్కాక అక్కడొక చిన్ని మందిరం ఉంది తొలిపూజలు అందుకుంటూ.

అక్కడనుండి రోడ్డు మార్గంలో ముందుకు వెళ్లిన తరువాత దూరంలో లోయలో భక్తుల విశ్రమించే క్యాంప్స్ చూపించారు. అలాగే మరింత దూరం వెళ్ళాక హెలిపోయింట్ చూపించారు. ఎంత భక్తి, శ్రమ కనిపించే యాత్ర.

మనస్సులో దేవదేవుని స్మరించుకున్నా. టీ తాగి ఇక్కడ ఒక ప్రత్యేకమైన టీ అమ్ముతారు. chaas అంటారు. టీ లో కుంకుమ పువ్వు రేకులు, తేనే, డ్రై ఫ్రూప్ట్స్ ముక్కలు వంటివి వేసి మరిగించి ఇస్తారు. రుచిగా ఉంటాయి.

మూడు గంటలకు హోటల్‌కి వచ్చి లంచ్ తిని విశ్రమించాము. సాయంత్రం హోటల్ పరిసర ప్రాంతాల్లో తిరిగి చూసాము.

మరునాడు మరిన్ని ప్రదేశాలు చూస్తూ వెనక్కి శ్రీనగర్ వెళ్లేలా ప్లాన్. మామలేశ్వర్ గుడి.

ఇదొక ముఖ్యమైన ప్రదేశం. మామలేశ్వర్ గుడి క్రీ.శ. 400 కాలానికి చెందిన అతి పురాతన గుడి. అందువల్ల కాబోలు చిన్నగా ఉంటుంది. ప్రధాన దేవత శివుడు. ఇతిహాసం ప్రకారం గజాసుర సంహారం తరువాత ఇంటికి

వచ్చిన శివుడిని, పార్వతిచే సృష్టించబడిన గణపతి కావలి కాస్తూ ఆపిన కథ గుర్తుంది కదా? అదేనండి వినాయక చవితి కథ. ఆ ప్రదేశం ఇదే అని నమ్మకమట. శివలింగం క్రిందనుండి నీటి ఊటలు ఉబికివస్తుంటాయి.

పచ్చని ప్రకృతి, తెల్లని మంచు పర్వతాల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది.

పహల్‌గామ్‌లో రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పర్యాటక కుటీరాలు, హోటల్స్ అనేకం. 1, 2, 3 బెడ్ రూంల వసతి ఉందిట. తిరుగు ప్రయాణంలో ఎక్కడ ఆగకుండా శ్రీనగర్ చేరుకొని హోటల్‌లో లంచ్ చేసి,ముందుగా బుక్ చేసుకున్న హౌస్ బోట్‌కి వెళ్ళటానికి దాల్ లేక్ చేరాము. అరగంట తరువాత మమ్మల్ని లేక్ లోపల నిలిపి ఉన్న ఇంటికి తీసుకు వెళ్ళటానికి శిఖర్ అని పిలువబడే చిన్ని పడవ వచ్చింది. పాత హిందీ సినిమాలలో చూసాము.

ముందుగా మేము ఎక్కాక మా పెట్టెలు సర్దిపెట్టి బయలుదేరింది పడవ. నీటిలో తేలియాడే మార్కెట్ ప్లేస్ దాటుకుంటూ, అనేక పెద్ద చిన్న బోట్ హౌస్‌లు చూస్తూ మా హౌస్ బోట్‌కి చేరాము.

Exit mobile version