Site icon Sanchika

కాశ్మీర్ యాత్ర -4

[box type=’note’ fontsize=’16’] హిమాలయాలకు నెలవు, ప్రకృతి అందాలకు కొలువు, భూతల స్వర్గమని కవులు అభివర్ణించిన కాశ్మీరులో తమ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరి. [/box]

అవంతీపుర శిథిలాల కథ

[dropcap]అ[/dropcap]వంతీపుర శిథిల నగరం శ్రీనగర్ నుండి 34కిమీ దూరంలో అనంతనాగ్ జాతీయ రహదారి 44/ 1ఎ పై ఉంది. అవంతి వర్మన్ రాజు పేరుతో ఏర్పడిన పురాతన నగరం. అనేక శిథిల ఆలయాల నిలయం. అవంతిస్వామి ఆలయం కలదు.

మహారాజు నిర్మితమైన ఆలయాల శిథిలాలు కూడా ఉన్నాయిట.

మా డ్రైవర్ కం టూరిస్ట్ గైడ్ పురాతన హిందూ ఆలయాలున్నాయని చెబితే ఆగాము. నిజానికి మనకు జమ్మూ కాశ్మీర్ గురించిన చారిత్రిక విషయాలు దాదాపు శూన్యం అనిపించింది. జాతీయ ముఖ్య రహదారి ప్రక్కన ఉన్న పురాతన ఆలయ సముదాయం అది. మేము హిందూ ఆలయాలంటే ఎలా ఉంటుందో అనుకున్నాము. పురాతన ఆలయాలు ముఖ్యంగా హిమాలయ ప్రాంతాలలో మన దక్షిణాది ఆలయాలతో పోలిస్తే చిన్నగా ఉంటాయి. సింపుల్‌గా ఉంటాయి. అసలు విషయానికి వస్తాను.

అవంతీపుర ఆలయం చిన్న మైదానంలో ఉంది. అవంతి వర్మన్ రాజు క్రీ.శ. 855-883 లో ఈ ప్రాంతాన్ని తన రాజధానిగా చేసుకున్నప్పుడు నిర్మించిన ఆలయాలట. ఇందులో ఝేలం నది ఒడ్డుకి దగ్గరలో నిర్మించిన అవంతీశ్వర ఆలయం ఈశ్వరునికి అంకితం. దానికి ఒక కిమీ దూరంలో నిర్మించిన అవంతిస్వామి ఆలయం విష్ణువుకి అంకితం. ఈ రెంటి నిర్మాణ శైలి ఒక్కటే.

కాయస్థ చక్రవర్తి లలితాదిత్య నిర్మిత ఆలయ శిథిలాలు దగ్గర్లో ఉన్నాయి. కాశ్మీర్ లోయకి ఆ పేరు మహర్షి కశ్యపుని వారసులు లోయలో నివాసం ఏర్పర్చుకోవటంతో వచ్చిందని ఒక వాదన.

కాశ్మీర్ ప్రాచీన పురాణం నీలమాత పురాణం ప్రకారం ఈ లోయలోని ప్రజలను వేధిస్తున్న జలోద్భవ రక్కసిని చంపటానికి అతని నివాసమైన పెద్ద నీటి ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉన్న కొండని ఉత్తర దిక్కున రెండుగా విడగొట్టాడుట. వేగంగా బైటకి ప్రవహించిన నీటిలో రక్కసి కొట్టుకుపోయి చనిపొయ్యాడుట. ప్రజలు ఆనందించారట. ఉన్నత ఋషిభూమిగా పేరు కూడా ఉంది. అది గతం.

అవంతి వర్మన్ శాంతికాముక రాజు. యుద్ధం కన్నా ప్రజల అభివృద్ధి, కళలు ముఖ్యమని భావించాడట.  కాలాన్ని ఎవ్వరు ఆపలేరు, వెనక్కి తిప్పలేము. ఎంతటి గొప్ప రాజులైనా, రాజ్యాలైన కాలగమనంలో శిథిల రూపంలోకి మారక తప్పదుకదా !

శిథిలాలు ఎన్నో కథలు సంగతులు చెబుతాయి వినేవారుంటే. మాకు ఈ సంగతులు అక్కడ ఉన్న ఒక లోకల్ గైడ్ చెప్పారు. యూరోప్, మధ్య ప్రాచ్యం నుండి సింధ్ లోకి దారిగా ఉన్న ప్రాంతం. అనేక యుద్ధాలు, రాజులూ, చరిత్రకు చిహ్నం ఈ ప్రాంతం. ఇక్కడ జరిపిన పురావస్తు తవ్వకాలలో అనేక వస్తువులు, నాణేలు, మట్టిపాత్రలు, దేవుని విగ్రహాలు, తాళపత్ర ప్రతులు అనేకం దొరికాయి. హిందూ రాజులే కాదు కాలక్రమేణా వచ్చిన ఇతర మత పాలకుల ఆనవాళ్లు దొరికాయిట.

ఆ చారిత్రిక శిథిలాల మధ్య తిరుగుతూ అప్పటి ప్రజల, రాజుల, ఆర్థిక స్థితిగతులు ఎలాఉండేవో అని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను. చరిత్ర విద్యార్థిగా, టీచర్‌గా చరిత్ర గర్భంలోని విషయాలు ఆసక్తిని కలగచేసేవి, భవితకు మార్గదర్శకం అని నా భావన.

ఆ ప్రదేశాలు చూసి శ్రీనగర్‌కి వెళ్ళాము.

Exit mobile version