కాశ్మీర్ యాత్ర -5

0
2

[box type=’note’ fontsize=’16’] హిమాలయాలకు నెలవు, ప్రకృతి అందాలకు కొలువు, భూతల స్వర్గమని కవులు అభివర్ణించిన కాశ్మీరులో తమ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరి. [/box]

సోనామర్గ్

శ్రీనగర్‌కి 87 కిమీ దూరంలో ఉన్న ప్రఖ్యాత పర్యాటక కేంద్రం సోనామర్గ్. సముద్రమట్టానికి 2800 మీ ఎత్తులో హిమాలయ మంచు శిఖరాలతో అలరాడే సుందరప్రదేశం ఇది. హిమాలయాల్లోని ముఖ్యమైన గ్లాసియర్స్ కోలహాయి, మహొయ్ జన్మస్థలం. 5000 మీటర్ల కంటే ఎత్తులో కొత్తోయి, మాచోయ్, సిర్బల్, అమర్నాథ్ పీక్స్ ఉన్నాయి. అంతేకాదు సోనామర్గ్ నల్లాహ్ సింధ్ ఒడ్డున ఉన్న ఊరు. జీలం నదికి ఉపనది.

సోనామర్గ్ భౌగోళిక, వాతావరణ పరిస్థితుల కారణంగా శాశ్వత నివాసాలు దాదాపుగా లేవు. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 673. వింటర్‌లో దాదాపుగా జనాభా శూన్యం. విపరీతమైన మంచు, మంచు తుఫానుల కారణంగా. కేవలం అతికొద్దిమంది అదీ భారత సైన్యం ఉంటారుట.

 

993 మిమి వర్షపాతంతో, 6.5 డిగ్రీల సామాన్య టెంపరేచర్ ఉంటుందిట. వింటర్‌లో శూన్య తాపం కంటే తక్కువ ఉంటుందిట. మేము అక్టోబర్ 20వ తేదీన ఉన్నప్పుడు కనీస టెంపరేచర్ -3, గరిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలు ఉంది. అదొక వింతైన అనుభూతి. మనకి హైదరాబాద్‌లో అనుభవంలేని టెంపరేచర్. చలి గిలిని ఆస్వాదించాము. చారిత్రికంగా శ్రీనగర్ టిబెట్‌ను కలిపే సిల్క్ రూట్‌లో ఉంది. జోజోలా కనుమ/పాస్ ప్రక్కనే ఉంది.

శ్రీనగర్ నుండి సోనామర్గ్ చేరేటప్పటికి లంచ్ టైం ఇయ్యింది. మేము ముందుగా బుక్ చేసుకున్న హోటల్ ఇంపీరియల్ రిసార్ట్స్‌లో సామాన్లు పడేసి ఫ్రెష్ అయ్యి, లంచ్‌కి హోటల్‌లో వసతి లేనందున (అందుకు కారణం మేము వెళ్ళింది మాన్సూన్ సీజన్ ముగింపులో. అందువల్ల పర్యాటకులు అతికొద్దిమందే వుంటారు) పక్కనే ఉన్న ఇంకో హోటల్‌కి వెళ్ళాం. అక్కడ చక్కని, సింపుల్ భోజనం దొరికింది. తిన్నతరువాత చీకటి పడేలోపుల మా అమ్మాయి అల్లుడు అక్కడికి దగ్గర్లో ఉన్న తజివాస్ గ్లాసియర్ చూడటానికి గుర్రాలు ఎక్కి కొండ మీదకు వెళ్లారు.

మా ప్రకృతి అలసి పోయినందున మేము వెళ్ళలేదు. పాపతో హోటల్ గదికి వచ్చి విశ్రమించాము. మంచు కరిగిన పర్వతాలు శూన్యంగా ఉన్నాయి. వెజిటేషన్ దాదాపుగా లేదు. కొద్దిదూరంలో ఉన్న సైనిక స్థావరాలు, నీటి ప్రవాహపు ఆనవాళ్లు కనిపించాయి. రాత్రి డిన్నర్‌కి బ్రెడ్ శాండ్విచ్‌కి కావలసినవి కొనుక్కున్నాము దగ్గర్లోని మార్కెట్‌లో. రాత్రికి వాటిని తిన్నాము. నెక్స్ట్ డే నుండి హోటల్ వంటిల్లు పనిచేయటం ప్రారంభించింది.

గ్లాసియర్ చూసివచ్చిన పిల్లలు ప్రయాణం, నేచర్, అద్భుతంగా ఉన్నాయని ఫోటోలు చూపించారు. ఆ ప్రదేశంలోనే హిందీ సినిమా భజరంగి భాయ్ జాన్ షూటింగ్ ఇండో పాక్ సీన్స్ జరిగిందిట.

మరునాడు అందరం లోకల్ జీపులో జోజిలా పాస్, వార్ మెమోరియల్ చూడటానికి వెళ్ళాము. సోనామర్గ్ నుండి దాదాపు 20కిమీ దూరం.దాదాపు ప్రయాణం. చాల ఎత్తులో ఇరుకు రోడ్ కావటంతో ప్రయాణ సమయం ఎక్కువ. వెళుతున్నప్పుడు ఎక్కవ ఎత్తులో జీప్ బ్రేక్ లైనింగ్స్ కాలుతున్న వాసన. లడఖ్, శ్రీనగర్‌ను కలిపే ముఖ మార్గం. దాదాపు 12000 అడుగుల ఎత్తులో సముద్రమట్టానికి ఉన్న ప్రదేశం. అత్యంత ప్రమాదకర మార్గాల్లో ఒకటిట.

ఎత్తైన ఇరుకైన రోడ్లు,ఒకప్రక్క అతి లోతైన లోయలు, ప్రవహిస్తున్న నది. అనేక మలుపులతో భయం పుట్టించే ప్రయాణం. ఒక్కోసారి ఎదురొస్తున్న వాహనానికి దరి ఇవ్వటానికి రోడ్డు చివరికి వచ్చిన జీప్. ఒళ్ళు భయంతో గగుర్పొడిచింది. ఏదైనా అయితే ఏమిటి? ఎలా? చాలావరకు కేవలం పెద్ద ట్రక్స్ మాత్రమే ఎదురొచ్చాయాయి. వెనక నుండి వచ్చాయి. టూరిస్ట్ జీప్స్ కొద్దిగా వచ్చాయి. అదొక సాహసపు ప్రయాణం నా మటుకు నాకు.

రోడ్లు కచ్చా రోడ్లు. ఎందుకలా? అని అడిగితే. మా డ్రైవర్ మంచు కురిసే కాలంలో రోడ్లమీద 10 అడుగులు పైగా మంచు పేరుకు పోతుంది పీక్ టైములో అన్నాడు. అంటే కాదు మంచు కొద్దిగా ఉంది, కరిగే సమయంలో టైర్స్ స్కిడ్ అవకుండా అన్నాడు. టార్ రోడ్స్ వేస్తే చలికి రోడ్ పగిలిపోతుందిట.

దోవలో జీరో పాయింట్ దగ్గర ఆగాము. ప్రవహిస్తున్న నది నీళ్లు భయంకరమైన చలి. వేళ్ళు గడ్డకట్టినట్లు అయ్యాయి. తరువాత మజిలీ వార్ మెమోరియల్. దాని ఎదురుగానే పెద్ద ఆర్మీ బేస్ క్యాంపు. లోపలి వెళ్తున్నసైనికులకు సెల్యూట్ చేసి వేవ్ చేసాము. గర్వంగా అనిపించింది. వాళ్ళు వేవ్ చేసారు. 1947-48 ఇండో పాక్ వార్ జరిగిన ప్రదేశం. మన యుద్ధ వీరుల సంస్మరణార్ధం ఒక మెమోరియల్ ఉంది. దాన్ని దర్శించాము. ఇంతటి దుర్లభమైన ప్రదేశం, వాతావరణంలో సైనికుల సరిహద్దుల్ని కాపలాగా ఉండటం ఎంత గ్రేట్ అనుకున్నాము. పక్కనే నీటి ప్రవాహం… బహుశా నది పాయ కాబోలు… ఉంది.

తిరుగు ప్రయాణంలో అలవాటులేని ఎత్తులు, చల్లని మంచు గాలులు అలసిపొయ్యేలా చేసాయి. రూంకి వచ్చి వేడివేడి టీ తాగుతూ హాట్ విద్యుత్ బ్లాంకెట్ ఆన్ చేసి కూర్చున్నాము. చాలా త్వరగా చీకటి పడింది. మరునాడు ఉదయాన్నే రెడీ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నాక తిరిగి శ్రీనగర్‌కి ప్రయాణం అయ్యాము. శ్రీనగర్‌లో మొఘల్ గార్డెన్స్, చూసి షాపింగ్ చేసి మర్నాడు సాయంత్రం ఫ్లైట్‌లో తిరిగి ఢిల్లీకి వెళ్ళాలి. ఇదీ మా ప్లాన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here