Site icon Sanchika

కాశ్మీర్ యాత్ర -7

[box type=’note’ fontsize=’16’] హిమాలయాలకు నెలవు, ప్రకృతి అందాలకు కొలువు, భూతల స్వర్గమని కవులు అభివర్ణించిన కాశ్మీరులో తమ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరి. [/box]

మొఘల్ గార్డెన్స్:

[dropcap]శ్రీ[/dropcap]నగర్ సిటీలో అనేక గార్డెన్స్ మొఘల్ పాలనలో నిర్మితం. ముఖ్యంగా షాలిమార్ బాగ్, నిషత్ బాగ్ చూడదగినవి.

షాలిమార్ బాగ్:

దాల్ లేక్ నుండి ఒక కాలువ ద్వారా కలపబడిన మొఘల్ నిర్మిత పూదోట్ ఈ గార్డెన్. దీనికి దగ్గర్లోనే నిషత్ బాగ్ ఉంది. మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆయన రాణి నూర్జహాన్ కోసం 1619లో నిర్మించిన పూదోట. దీనిని మొఘల్ పాలనా కాలపు అత్యున్నత ఉద్యానవనాలకు ప్రతీకగా చెబుతారు. దీనితో ప్రేరేపితమై అనేక ఉద్యానవనాలు దేశమంతా నిర్మితం అయ్యాయని చెప్తారు.

అప్పుడు కేవలం చక్రవర్తి వంశీయులకే ప్రవేశం ఉండేది. సామాన్యులకు కేవలం ఊహా మాత్రమే, పుక్కిట పురాణంలా. కానీ నేడు శ్రీనగర్‌కి తలమానికంగా సామాన్యులకు కూడా ప్రవేశం నామమాత్ర రుసుముతో ఉంది. అదే కాల, ప్రజాస్వామ్య మహిమ మరి. దాదాపు 32 ఎకరాల సువిశాల విస్తీర్ణం కలిగి దాల్ లేక్ నుండి నార్త్ ఈస్ట్ కాలువ ద్వారా కలుపబడినది.

దీనికి ప్రక్కనే నిషాత్ బాగ్ ఉంది. దాదాపు కలిసే ఉన్నాయి.

పురాతన చారిత్రిక ఆధారాల ప్రకారం ఈ బాగ్ లేదా పూదోట నిర్మాణం 2వ శతాబ్దపు రెండవ ప్రవర్ సేన రాజు కాలానికి చెందినదిగా చెబుతారు. సంస్కృతంలో షాలిమార్ అంటే అబోడ్ అఫ్ లవ్. రాజు తన విడిదిగా నిర్మించినా కాలక్రమేణా కుటీరం శిధిలమైనదిట. తరువాత కాలంలో మొఘలులు పునర్నిర్మించి ఉండవచ్చు. మహారాజా రంజిత్ సింగ్ హయాంలో పాలరాతి కట్టడం యూరోప్ పాలకుల విడిదిగా ఉందిట. అలా కాలక్రమేణా అనేక మంది పాలకులతో పునరుజ్జీవం పొంది భూతాల స్వర్గంగా చెప్పబడింది. నాటి స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని షాలిమార్, నిషత్ బాగ్‌లను పరికిస్తే అవి పెద్దవిగా భావించాలి. నేటి కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పూదోటలు, గార్డెన్స్‌తో పోల్చరాదు.

ఇది పర్షియన్ గార్డెన్స్ నిర్మాణ శైలిని పోలియున్నది. మూడు టెర్రస్ గార్డెన్స్‌గా ఉంటుంది. దాదాపు శ్రీనగర్‌లో అన్ని బాగ్‌లు అలానే ఉంటాయి. మొదటిది, లోపలి ప్రవేశించగానే కనిపించేది సామాన్యుల కోసమట. మధ్యలో పెద్ద వేదిక ప్రజల దర్శనార్థం ఉన్నది. ఎటు చూసిన ఆకాశాన్ని తాకుతున్నట్లున్న ఎత్తైన దేవదారు వృక్షాలు, అనేక రకాల పూల మొక్కలు ఉన్నాయి.

రెండవ టెర్రస్ కొద్దిగా పెద్దది. ఇరువైపులా దివాన్ ఏ ఖాస్, హాల్ అఫ్ ప్రైవేట్ ఆడియన్స్, రాజవంశీయులకి మాత్రమే ప్రవేశం.

మూడవది కేవలం రాజులకే ప్రవేశం. పెద్ద వేదిక. వసంతకాలంలో ఈ బాగ్‌లు రంగులు మారుతున్న వృక్షాలతో పూలతో సుందరంగా ఉంటుందిట. మేము వెళ్ళింది అక్టోబర్ చివరి వారంలో. శీతాకాలం ప్రబావం మొదలయింది.

దాదాపుగా శ్రీనగర్లో ఉన్న ఇతర బాగ్ లన్ని ఒకేలా ఉన్నాయి. అక్కడ తోటమాలీలు రకరకాల పూలమొక్కల విత్తనాలు అమ్ముతారు. మన ప్రాంతంలో మొలవక పోవచ్చన్న అనుమానంతో నేను కొనలేదు.

  

ఆఖరిగా శ్రీనగర్‌లో ముస్లింల పవిత్ర స్థలం హజరత్ బల్ దర్గాని సందర్శించాము. అక్కడ మొహమ్మద్ ప్రవక్తకు చెందిన శిరోజం ఉందని నమ్మకం. మహమ్మద్ ప్రవక్త వారసులనుండి ఒక కాశ్మీర్ ధనిక వ్యాపారి దాన్ని కొన్నారట. అది తెలిసిన మొఘల్ పాలకుడు అతనిని కారాగారంలో పెట్టి రెలిక్‌ని స్వాధీనం చేసుకుని రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకి పంపారట. కొన్నాళ్ల తరువాత తప్పుతెలుసుకుని రెలిక్‌ని వ్యాపారికి అప్పగించామన్నారు. అప్పటికే కారాగారంలో మరణించిన వ్యాపారి దేహంతో పాటుగా రెలిక్ శ్రీనగర్‌లోని కుటుంబానికి కుమార్తెకు అప్పగించారట. ఆ రెలిక్‌ని దర్గా నిర్మించి అందులో ఉంచారట. నేటికీ ఆమె వంశానికి చెందిన వారే దర్గాని చూస్తారని మా గైడ్ చెప్పారు. ఆ ప్రాంతం మన ఓల్డ్ సిటీలా ఉంది.

వేల సంఖ్యలో పావురాలున్నాయి. వాటికీ గింజలు వేసాము. మా బాగ్‌ల పర్యటన తరువాత హోటల్ కి వెళ్ళేలోపున అక్కడికి దగ్గర్లో ఉన్న లోకల్ షాప్స్ తిరిగి చూసి కాశ్మీరీ డ్రెస్ మెటీరియల్, డ్రై ఫ్రూట్స్, మంచి కుంకుమ పువ్వు, కాశ్మీరీ ప్రత్యేక టీ పొడి కొన్నాము. అందులో తేయాకుతోపాటుగా సుగంధ ద్రవ్యాలు యాలకులు, దాల్చిని, కుంకుమపువ్వు, బాదాం ముక్కలు తదితరాలు కలిపి ఉంటాయి. చక్కని చిక్కని రుచితో ఉంటుంది టీ. అక్కడ పాలు కలపకుండా ఇస్తారు. అయినా మంచి రుచి. చిన్న ఎండు ద్రాక్ష అమ్మారు. కొన్నాము. అవి తింటే రక్తహీనత రాదుట. ఉన్నా తగ్గిపోతుంది. తామర తూళ్ల కూర తిన్నాము.

మర్నాడు ఎర్లీ లంచ్ చేసి ఎయిర్‍పోర్ట్‌కి త్వరగా బయలుదేరాము. కానీ ఎన్నడూ చూడనంత అంచెలంచల భద్రతా తనిఖీలు చేసారు సైనికులు. తరువాతే ఎయిర్‍పోర్ట్‌‌లోకి పంపారు. విమానం కిటికీ నుండి దూరమవుతున్న హిమాలయ పర్వత శ్రేణులను చూస్తూ పులకించి పోయి వీడుకొలుపు చేశాము.

(సమాప్తం)

Exit mobile version